Thursday, May 2, 2024

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

 


ధర్మమూర్తి... సమదర్శి


ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన్ని ప్రసరిస్తుంటుంది. సనాతన ధర్మానికి, భారతీయ ఆధ్మాత్మిక చింతనకు ఆ మహనీయుడు ప్రతిరూపం. అధునాతన దేశంలో భౌతికరూపంలో నడయాడిన దైవం. ధర్మం అంటే ఇదీ... అని నూరుశాతం ఆచరించి చూపించిన ధర్మమూర్తి. కుల, మత, ప్రాంత, లింగ, భాషా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకున్న దర్శి. ఆయనే... జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి.


కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతిగా సుమారు 83 సంవత్సరాల పాటు పీఠాధిపత్యం వహించి, కోట్లాది ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపిన మహనీయు మూర్తి ఆయన. ఎంతమంది పీఠాధిపతులు ఉన్నా ‘మహాస్వామి’ మాత్రం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మాత్రమే.

చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి కర్ణాటకలోని హోయసల బ్రాహ్మణ వంశానికి చెందినవారు. క్రీ.శ.13వ శతాబ్దిలో చోళ రాజులకు సహాయార్థం హోయసల రాజులు తమిళ దేశానికి వలస వచ్చారు. వీరితో బాటు వచ్చిన హోయసల బ్రాహ్మణ కుటుంబాలు అనంతర కాలంలో తమిళ దేశంలోనే స్థిరపడ్డాయి.

 విజయనగర రాజులచే సామంతునిగా ప్రతిష్ఠింపబడిన చెవ్వప్ప నాయకుని కాలంలో (క్రీ.శ.1535 ప్రాంతంలో) హోయసల కర్ణాటక కుటుంబాలు తమిళ దేశానికి రెండవసారి వలస వచ్చాయి.
 ఈవిధంగా వలస వచ్చిన హోయసల కన్నడ బ్రాహ్మణ వంశీకుడైన గణపతి శాస్త్రి కంచి కామకోటి పీఠానికి చెందిన 64వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి – 5 కాలంలో ముఖ్య పరిపాలనాధికారిగా ఉండేవారు.

గణపతి శాస్త్రి పెద్ద కుమారుడైన సుబ్రహ్మణ్య శాస్త్రి కుంభకోణం ప్రాంతంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండే వారు. చెవ్వప్ప నాయకుని వద్ద మంత్రిగా ఉన్న గోవింద దీక్షితుల వంశీకుడైన నాగేశ్వర శాస్త్రి కుమార్తె మహాలక్ష్మితో సుబ్రహ్మణ్య శాస్త్రికి వివాహం జరిగింది. ఈ పుణ్యదంపతుల రెండవ కుమారుడే పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి.


 సుబ్రహ్మణ్య శాస్త్రి విల్లుపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా 1894సంవత్సరం మే 20వ తేదీన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి జన్మించారు. వీరి పూర్వాశ్రమ నామధేయం స్వామినాథన్. చిన్నతనం నుండే స్వామినాథన్ అనన్య ప్రతిభా సామర్థ్యాలను చూపుతుండేవారు. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారునికి అయిదు సంవత్సరాల వరకు తనవద్దనే చదువు చెప్పారు కానీ స్కూలుకి పంపలేదు.


తన ఎనిమిదవ ఏట స్వామినాథన్ ప్రాథమిక పాఠశాలలో చేరారు. సుబ్రహ్మణ్య శాస్త్రి దిండివనంలో పనిచేస్తుండగా అక్కడ ఉన్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ స్కూలులో 7వ తరగతిలో చేర్పించారు. 1905వ సంవత్సరంలో స్వామినాథన్ కు తండ్రి ఉపనయన సంస్కారం చేశారు. స్వామినాథన్ పాఠశాలలో ప్రథముడిగా నిలుస్తూ అందరి మన్ననలు పొందుతుండేవాడు.


 ఈ సమయంలోనే కామకోటి పీఠ 66వ ఆచార్యులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి తమిళనాడులో దక్షిణ ఆర్కాటు జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారుని వెంటబెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళారు. చిన్నవాడైన స్వామినాథన్ యొక్క అపార ప్రజ్ఞాపాటవాలను చూసిన ఆచార్యుల వారు ఈ బాలుడు అనంతర కాలంలో కామకోటి పీఠాన్ని అధిష్ఠించి అభివృద్ధి చేయగలడని భావించి ఆయనను ఎంపిక చేయాలని మనస్సులో సంకల్పించుకున్నారు.


 తర్వాతి పరిణామల నేపథ్యంలో స్వామినాథన్ కంచికి తీసుకొని వచ్చి, సన్యాసాశ్రమ దీక్షనిచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతిగా తీర్చిదిద్దారు. తన 13వ ఏట స్వామినాథన్ చంద్రశేఖరేంద్ర సరస్వతిగా కామకోటి పీఠాన్ని అధిష్ఠించారు.

సన్యాసాశ్రమం స్వీకరించేనాటికి స్వామివారు వేదాధ్యయనం చెయ్యలేదు కాబట్టి, అందుకోసం  మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ కృష్ణశాస్త్రి గారిని మఠం అధికారులు స్వామి వారికి వేదం బోధించడం కోసం నియమించారు. కొంతకాలం తర్వాత కృష్ణశాస్త్రి గారు స్వామితో ఇలా అన్నారు. "స్వామీ! నిమిత్త మాత్రంగా మేము మిమ్ము శిష్యులుగా పాటించినా, యదార్ధంగా మీరే మా గురువులు, మేము మీకు శిష్యులం". ఇదీ మహాస్వామి ప్రతిభ. దైవీకమైన శక్తి.


1907లో స్వామి పీఠాధిపత్యం వహించిన పిమ్మట కావేరీనది ఉత్తర తీరాన మహేంద్రమంగళంలో ప్రత్యేకంగా ఒక పర్ణశాల నిర్మించుకుని. 1911 మొదలు 1914 వరకు నాలుగు సంవత్సరాలు తదేక దీక్షతో విద్యాభ్యాసం చేశారు. ఆయా శాస్త్రాలలో నిష్ణాతులైన పండితుల వద్ద తర్క, వ్యాకరణ, మీమాంస, వేదాంతాలను నేర్చుకున్నారు.


బాల్యంలో ఆంగ్ల పాఠశాలలో చదివిన ఇంగ్లీషుతో పాటు ఫ్రెంచికూడా అభ్యాసం చేశారు. మరాఠీ చదివారు. తమిళ వ్యాకరణం, తేవారం, తిరువాచికం, పెరియ పురాణం, తిరుక్కురళ్ మొదలైన గ్రంధాలు పఠించారు. తమిళ భాషలోని కావ్య ప్రబంధాలను పరిశోధనాత్మకంగా అధ్యయంన చేసారు.

గానకళకు సంబంధించిన శాస్త్రాకోశాలను తెలుసుకున్నారు. ఛాయాగ్రహణ (ఫొటోగ్రఫి) రహస్యాలను గ్రహించారు. గణితం, జ్యోతిషం, ఖగోళశాస్త్రాదుల మర్మాలను అవగాహన చేసుకున్నారు. ప్రాచీనశాసన పరిశోధనలో, స్థల పురాణ సమస్యల పరిష్కరణలో ప్రావీణ్యం గడించారు.
"చరిత్రకు సంబంధించిన శాసన పరిశోధనలో మా కేవైనా సందేహాలు కలిగిప్పుడు కామకోటి స్వామి వారి సహాయంతో మేము మా సందేహ నివారణ చేసుకుంటాము” అని అప్పటి ఆర్కియలాజికల్ డిపార్టుమెంటు ఉన్నతాధికారి టి.యన్. రామచంద్రన్ ఒక సభలో ప్రకటించారు.


అమేయమూ, విశ్వతోముఖమూ ఆయన ఈ విజ్ఞానభాండారమంతా ఒక్క వ్యక్తిలో ఇలా కేంద్రీకృతం కావడం అనితర సాధ్యం. అలౌకికమైన వర ప్రసాదమే తప్ప, ఎంతటి వారికైనా కేవలం స్వయంకృషితో ఇటువంటి అసాధారణ ప్రతిభ సాధ్యం కాదు.


సనాతన ధర్మాన్ని రక్షించడానికి మహాస్వామి వారు తమ నూరేండ్ల జీవితాన్ని ధారపోశారు. శతాబ్దిలో వారు ఉండటం కాదు, ఒక శతాబ్దమే వారిలో ఉన్నది. నీతి, నిజాయతీ, నిర్వహణకు ఆయన పెట్టింది పేరు. ఆడంబరం లేని మహనీయుడు. ఆయన సమదర్శి, వాత్సల్య మూర్తి.

వారికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. ఒక సంఘటన జరిగి దశాబ్దాలు జరిగినా దానిని గుర్తుపెట్టుకునేవారు. ఒకసారి కలిసిన వ్యక్తి మళ్ళీ ఎప్పుడు కలిసినా గుర్తించేవారు. స్వామి కార్యంలో భారీ సేవ చేసినవారినీ, ఉడతాభక్తిగా సేవించిన వారినీ అందరినీ ఒకేతీరున గుర్తుపెట్టుకునేవారు. అందుకే ఆయన సమదర్శి అనిపించుకున్నారు.
సాధారణ భక్తులు వచ్చి వారికొచ్చే చిన్నచిన్న సందేహాలు అడిగినా, పండితులు తర్కమీమాంస శాస్ర్తాలకు సంబంధించిన ప్రశ్నలు వేసినా... అన్నిటికీ సావకాశంగా బదులిచ్చి, సందేహ నివృత్తి చేసేవారు. ఆయన ఆచారం ప్రధానంగా పెట్టుకున్నారే కానీ, ప్రచారం గురించి ఎన్నడూ ఆలోచించలేదు. ఆయన కారుణ్యమూర్తి. వారి వ్యక్తిత్వం దోష రహితం, దైవ సహితం. ఆయన చూపుల్లో దివ్య తేజస్సుతోపాటు అంతులేని వాత్సల్యం ప్రతిఫలించేది.


చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు వేద రక్షకుడు. సద్గురువు. శాస్త్ర పరిశోధకుడు. దేశకాల పరిస్థితులను బట్టి, ఆధ్యాత్మిక సంపదను రక్షించిన రాజనీతిజ్ఞుడు. అంతకుమించి బహుభాషా కోవిదుడు.

ధర్మాచరణకు శ్రద్ధ అవసరమని, సంకల్ప బలం, విశ్వాసం ఉండా లని, మనసును నియంత్రిస్తేనే కార్య సిద్ధి కలుగుతుందని చెప్పేవారు.
దేశమంతటా వేద పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఎన్నో ఆలయాలకు మంటపాలు నిర్మించారు.

ధర్మ సంవర్ధనమే లక్ష్యంగా ఇరవై సంవత్సరాలు పాదచారం చేస్తూ యావద్భారతం పర్యటించారు. హిందూమత సంరక్షణకు, వివిధ శాఖలకు చెందిన హిందూ మతావలంబుల సమైక్యతకు అద్వితీయమైన కృషిచేశారు. వందల సంఖ్యలో ధర్మ సంస్థలు స్థాపితమయ్యేలా ప్రోత్సహించి, ధర్మప్రచారానికి బలమైన పునాదులు వేసారు.


భక్తులపై స్వామికిగల వాత్సల్యం అంతా ఇంతా కాదు. భక్తులను సంతృప్తి పరచడానికి, వారిని సంతోషపెట్టడానికి స్వామి వహించే శ్రద్ధ ఇంత అని మాటల్లో చెప్పటానికి సాధ్యం కాదు.
ఆధ్యాత్మిక విషయాలను చర్చించే వారి సంగతి అలా ఉంచి, అనేకమంది భక్తులు జీవితంలో తమ కష్టసుఖాలను గురించి, సంసారంలోని చిక్కులను గురించి స్వామితో తమ సమస్యలు చెప్పబోయే సరికి-భక్తి చేతనో, భయం చేతనో, మాటలు తడబడతాయి. ఒకటి చెప్పబోయి వేరొకటి చెబుతారు. అసలు తాము చెప్పదలచింది మరిచిపోతారు. సగం చెప్పి ఊరుకుంటారు. అలాంటి సందర్భాల్లో స్వామి అసహనం చూపేవారు కాదు. తమ సమయాన్నంతా వృధా చేస్తున్నారని ఏమాత్రం అనుకునేవారు కాదు. వారి బాధ ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించేవారు. వారి మనస్సులోని మాట రాబట్టడానికి తామే అనేక ప్రశ్నలడిగి, తగిన ఉపాయాలను సూచించి వారి బాధలను ఉపశమింప జేసేవారు.


చూడ వచ్చినవారి పెద్దలను గురించీ, వారి బంధువర్గాన్ని గురించీ పేరు పేరునా అడిగి, వాళ్ల యోగక్షేమా లన్నిటినీ తెలుసుకునేవారు. తమ దూరపు బంధువులను, ఒకవేళ భక్తులెవరైనా మరిచిపోతారేమో కాని, స్వామికి మాత్రం జ్ఞాపకం ఉండేది. ఎన్ని సంవత్సరాలు దాటినా ఒక్కొక్క భక్తుని వంశచరిత్ర స్వామి జ్ఞాపకశక్తి అనే బీరువా అరలో ఎలా భద్రపరిచి ఉండేదో ఊహకు అందని విషయంగా ఇప్పటికీ మిగిలిపోయింది.


"శంభోర్మూర్తిః చరతి భువనే శంకరాచార్య రూపా” - సాక్షాత్తు పరమశివుని అవతారమైన ఆదిశంకరులు అనేక శతాబ్దుల కిందట కంచికామకోటి పీఠాన్ని స్వయంగా అధిష్టించి సర్వజ్ఞపీఠంగా కంచి పీఠాన్ని తీర్చిదిద్దారు. ఆ తర్వాత శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి ఆదిశంకరుల అవతారంగా తిరిగి సర్వజ్ఞ పీఠాన్ని అధిష్టించి, ఆదిశంకరుల పరంపరా వైభవాన్ని మరోసారి ప్రకటించారు.


చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం పీఠాధిపతి మాత్రమే కాదు. ఆయనలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, శాస్త్రపరిశోధకుడు, జ్యోతిశ్శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త... ఇంకా ఎందరో దాగున్నారు. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జీవితం అద్భుతం, అనితర సాధ్యం. నిండు నూరేళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి, పాదచారియై దేశమంతా సంచరిస్తూ ధర్మప్రభోదం చేసిన మహాపురుషులు స్వామి.

రెండువేల సంవత్సరాల కిందట దక్షిణ భారతంలో జన్మించి, అవైదిక మతాలను ఖండించి, అనేక దివ్యశక్తులను ప్రదర్శించిన ఆదిశంకరులే తిరిగి నేడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులుగా అవతరించారు. ఇది అతిశయోక్తి కాదు.

                                 ------xxxxx------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, కె.బి.ఎన్. కళాశాల (అటానమస్), కొత్తపేట, విజయవాడ-1.
సెల్: 90320 44115 / 8897 547 548

Wednesday, May 1, 2024

వాక్యకోవిదుడు హనుమంతుడు


 

వాక్యకోవిదుడు, వ్యాకరణ పండితుడు

 

 

మాట మనిషిని మహనీయుడిని చేస్తుంది. అదే మాట మనిషి పతనావస్థకు దారితీస్తుంది. వాక్కుకు అంతటి అమోఘమైన శక్తి ఉంది. అవతలి వ్యక్తితో స్నేహం చెయ్యాలన్నా, మిత్రుడు శత్రువుగా మారాలన్నా ఒక్క మాట సరిపోతుంది. అందుకే శాస్త్రాలు వాక్కును దైవంగా ప్రకటిస్తాయి. మంత్రభాగంలో కూడా వాక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మాట్లాడే మాటలో ఒక శబ్దం ఎక్కువ లేదా తక్కువ అయినా అందుకు విపరీత ఫలితాలు ఏర్పడతాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలి. వాక్కుకు ఇంతటి ప్రభావాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు, ఎవరితో ఎప్పుడు ఎంతవరకు ఎలా మాట్లాడాలో ఆ పరిధికి లోబడి మాట్లాడి ‘వాక్య కోవిదుడు’గా, ‘నవ వ్యాకరణ పండితుడు’గా జేజేలు అందుకుంటున్నవాడు రామదూత హనుమ మాత్రమే.

 

హనుమ నవ వ్యాకరణ పండితుడు. సూర్యుడి దగ్గర శిష్యరికం చేసినవాడు.  తపస్వి. సుగ్రీవుడి మంత్రి. భక్తుడు. సేవకుడు. రాయబారి. కార్యసాధకుడు. యోధుడు. పరాక్రమశాలి. అన్నిటికీ మించి వినయ సంపన్నుడు. గొప్ప వాక్కు అలంకారంగా కలిగినవాడు – ’వాగ్విదాం వరం‘ – అని వాల్మీకి పొంగిపోయి చెప్పాడు.

 

హనుమంతుడు అనగానే సాధారణంగా అందరికీ ఆ స్వామి భుజ బలం మాత్రమే గుర్తుకువస్తుంది. నిజానికి హనుమ గొప్ప బుద్ధి బలశాలి కూడా. అందుకే ‘బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా / అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్’ -  హనుమను ధ్యానిస్తే బుద్ధిబలం వస్తుంది అని చెబుతున్నాయి ఇతిహాస, పురాణ గ్రంథాలు.

 

సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.

 

రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!

 

మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమగాలు సంచరించే ఇలాంటి చోటుకురారు అని రామలక్ష్మణులను ప్రశ్నిస్తాడు హనుమ.

 

మాట అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు. హనుమంతుడి మాటల ఔచిత్యానికి ముచ్చటపడతాడు రాముడు.

 

నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ: ! నా సామవేద విదుష: శక్యమేవ విభాషితుం !!

 

రుక్‌, యజు, సామవేదాల్లో పండితుడైనవాడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేరంటూ లక్ష్మణుడితో హనుమంతుడి మాటలతీరులోని గొప్పతనాన్ని వివరిస్తాడు రాముడు. ఒక్క మాట ఎక్కువ తక్కువ కాకుండా కొత్తవారితో కూడా ఎంతో నేర్పుగా మాట్లాడటమే కాకుండా రామసుగ్రీవుల మైత్రికి బీజం వేసింది హనుమ వాక్చాతుర్యం. హనుమలోని వ్యాకరణ పాండితీ వైభవానికి, ఔచిత్యవంతమైన సంభాషణ చేసే నేర్పుకీ ప్రతీక ఈ ఘట్టం.

 

నవ వ్యాకరణాలు ఎలా చదివాడంటే...

 

‘హనుమంతుడు మాటతీరు తెలిసినవాడు’అని శ్రీరామచంద్రుడు అంతటివాడు ప్రశంసించాడు. నవ వ్యాకరణ పండితుడు కావటమే హనుమంతుడి ఉత్తమమైన మాటతీరుకు కారణం.

హనుమ సూర్యభగవానుడి దగ్గరకు వెళ్లి తనకు వ్యాకరణాన్ని నేర్పమన్నాడు. చిన్నప్పుడు తనను తిన దగిన ఫలమని భావించి ఎగిరి వచ్చిన హనుమను చూస్తే ముచ్చటేసింది సూర్యుడికి. ‘నేర్పుతాను. కానీ, నేను ఒకచోట స్థిరంగా ఉండటానికి కుదరదు కదా! గగన మార్గంలో నా వెంట ఎలా తిరుగ గలవు?’ అనడిగాడు భానుడు.

 

‘ఓ.. దానిదేముంది!’ అంటూ తన కాయాన్ని పెంచిన ఆంజనేయుడు ఉదయాద్రిన ఒక కాలు, అస్తాద్రిన ఒక కాలు మోపి, సూర్యగమనానికి అనువుగా నడుమును వంచుతూ, చెవి ఒగ్గి ఆదిత్యుడి దగ్గర వ్యాకరణ శాస్ర్తాన్ని కూలంకషంగా అధ్యయనం చేశాడు.

 

మనకు మొత్తం తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉన్నాయి. అవి... 1.శాక్త వ్యాకరణము 2. శంభు వ్యాకరణము 3. కుమార వ్యాకరణము 4. ఇంద్ర వ్యాకరణము 5. సూర్య వ్యాకరణము 6. చంద్ర వ్యాకరణము 7. స్మర వ్యాకరణము 8. వాత్స్యాయన వ్యాకరణము 9. అగస్త్య వ్యాకరణము. – ఈ తొమ్మిది రకాల వ్యాకరణాలను హనుమంతుడు సూర్యుడి వద్ద అధ్యయనం చేసాడు.  అందుకే హనుమకు ‘నవ వ్యాకరణ పండితుడు’ అనే పేరు ఏర్పడింది.

 

హనుమ మాట్లాడిన తీరుకు ముచ్చటపడిన రామచంద్రమూర్తి స్వయంగా... నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధా శ్రుతమ్ బహు వ్యాహరతానేన న కిఞ్చిదపశబ్దితమ్’ – ఆంజనేయుడు మాట్లాడిన మాటల్లో ఒక్క అపశబద్దం కానీ, ఒక్క మాట ఎక్కువ కానీ, తక్కువ కానీ లేదు. వ్యాకరణం మీద తిరుగులేని పట్టు ఉన్న వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అంటాడు. రామయ్యను హనుమ మెప్పించింది తన భుజబలం చూపించో, మరొక శక్తి ప్రదర్శించో కాదు... కేవలం తన భాషా పాండిత్యంతో మెప్పించాడు. అదీ హనుమ వ్యాకరణ పాండిత్యానికి ఉన్న ఔన్నత్యం.

 

దృష్టా సీతా...

 

వానర రాజు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం భూమి నాలుగు చెరగుల నుంచి కపి సైన్యం వచ్చి చేరింది. ఓక్కొక్కరిని ఒక్కొక భాగానికి నాయకుడిని చేసి వారు ఏదిక్కుగా వెళ్ళాలో, ఎక్కడెక్కడ వెతకాలో వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు సుగ్రీవుడు. చివరగా, అంగదుడిని నాయకునిగా చేసి , హనుమదాదిగా వీరులను దక్షణ దిక్కుకు వెళ్ళి వెతకమని చెబుతాడు. ఎక్కడి దాకా వెళ్ళి వెతకాలో చెబుతాడు. అందరికీ, ఎక్కడెక్కడ వెతకాలో కూడా చెబుతాడు.. సమయం ఒక నెల అని చాలా వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు. అతిక్రమించిన వారికి శిరః ఛేదం శిక్ష అని ప్రకటించాడు. అందుకే దానిని సుగ్రీవాజ్ఞ అన్నారు.

 

అప్పుడు రాముడు హనుమకు అంగుళీయం తన గుర్తుగా ఇస్తాడు, సీతకు ఇవ్వడానికి. ఎవ్వరికీ ఇవ్వని ఈ గుర్తు హనుమకే ఇవ్వడం లో విశేషం, హనుమ మాత్రమే ఈ పని పూర్తి చేయగలడన్న నమ్మకం.  సీతమ్మను వెదకడానికి అందరూ అన్ని దిక్కులకూ బయలుదేరుతారు. దక్షణ దిక్కుగా వెళ్ళినవారు చాలా చిక్కులు పడి సముద్ర తీరం చేరుతారు.

 

అప్పటికే ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. అందరూ ప్రాణభయంతో ఉన్నారు సుగ్రీవాజ్ఞ మూలంగా. ఆ సమయంలో లంకకి వెళ్ళగలవారెవరనే ప్రశ్న ఏర్పడింది. చివరికి హనుమకి శక్తి గుర్తు చేసి ఆయనను పంపుతారు. హనుమ లంకకు చేరుకుని, సీతను చూసి ఆమెతో మాటాడి ఆమెను ఆత్మహత్య నుంచి కాపాడి, అంగుళీయమిచ్చి, సీతమ్మ ఇచ్చిన చూడామణి ని తీసుకుని, అశోకవనం నాశనం చేసి, రావణుని పరివారం కొంత, అతని సుతుని పరిమార్చి, రావణుని చూచి, లంక కాల్చి, విజయంతో తిరిగి బయల్దేరతాడు.

 

ఇక్కడ సముద్రపు ఒడ్డున ఉన్న వారు ఉత్కంఠ తో ఉన్నారు. ఏమైందో తెలియదు. హనుమ సీతను చూసి వస్తే అందరి ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే, సుగ్రీవాజ్ఞ ప్రకారం శిరచ్ఛేదం తప్పదు. ఇటువంటి సమయంలో హనుమ తిరిగివస్తూ సముద్రపు ఒడ్డున ఉన్న తన వారికి విజయ సందేశం క్లుప్తంగా తెలియజేయడానికి సింహనాదం చేస్తాడు. ఆ సింహనాదం విని, అక్కడ వున్న జాంబవంతుడు మొదలైన వారు హనుమ కార్య సాధనతో తిరిగి వస్తున్నాడని భాష్యం చెబుతారు.

 

ఆయినా ఉత్కంఠం పోదు. హనుమ నేల మీద కాలుమోపుతూ... “దృష్టా సీతా” అన్నాడు. సాధారణంగా క్రియాపదంతో వాక్య నిర్మాణం ఉండదు. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం కూడ తోడు కలవడం, వ్యాకరణ పండితుడవటం వల్ల, అక్కడ ఉన్నవారి ఉత్కంఠను వెంటనే చల్లార్చే ఉద్దేశంతో హనుమ ‘దృష్టా సీతా’ అన్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఎందుకు, ఏం మాట్లాడాలో తెలిసినవాడు కావటం వల్లనే ఒక్కమాటతో వేలాది ప్రాణాలు నిలబెట్టాడు హనుమ. అదీ ఆ స్వామిలోని వాక్యకోవిదత్వం.

 

సీతమ్మ ప్రాణం కాచిన మాట

 

పదినెలల అశోకవనవాసం సీతమ్మను ఎంత కుంగదీసిందంటే – హనుమ రావడం రెండు నిముషాలు ఆలస్యమయితే ఆత్మహత్య చేసుకునేది.  అలాంటి సంక్షుభిత ఉద్విగ్న సమయాల్లో హనుమ మాట్లాడిన తీరు అనన్యసామాన్యం. బహుశా అలా మాట్లాడాలంటే దేవుడే దిగి రావాలి.

 

అంతకుముందు... తెల్లవారక ముందే రావణుడు వచ్చి నానా మాటలు అని వెళ్ళాడు. నరమాంస భక్షకులైన ఆడ రాక్షసుల గుండెలు గుచ్చుకునే మాటలు మరో వైపు. ఇక ఇన్ని కష్టాలు తట్టుకునే ఓపిక నశించింది సీతమ్మకు. తన కేశాలతో పాశం తయారుచేసుకుని, ఉరి వేసుకుని, ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుని, అందుకు సన్నద్ధమవుతోంది. ఇదంతా గమనిస్తున్నాడు పక్కనే చెట్టుమీద ఉన్న మారుతి.

 

సీతమ్మతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం. కానీ, ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడాలి...? ఆలోచించాడు హనుమ.

 

ఇంతదాకా సంస్కృతంలో రావణుడు అఘోరించి వెళ్ళాడు – కాబట్టి సంస్కృతంలో మాట్లాడితే మళ్ళీ రావణుడి మాయలే అనుకుంటుంది. అనేక భాషలు తెలిసినవాడే భాష ఎంపిక గురించి ఆలోచించగలడు. సీతమ్మ సొంత ఊరు మిథిలా నగరం. అయోధ్యలో మాట్లాడేది ప్రాకృత అవధి భాష.  కాబట్టి, అయోధ్యలో మాట్లాడే యాసతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు హనుమ. అంటే సీతమ్మ మెట్టినింటి భాష అన్నమాట. పూర్తిగా మన ఊరివారెవరో మాట్లాడుతున్నారని మొదటి మాటకే ఆమె ఉపశమనం పొందాలి. ఆ తరువాత....? ఏం చెబితే ఆమె ఇంకా నమ్ముతుంది? శాంతిస్తుంది? ఆలోచించాడు... రామకథనే ఎంచుకున్నాడు . అంతే మైథిలీ ప్రాకృత భాషలో రామగానం ప్రారంభించాడు. తన మాండలికంలో రామకథను వినగానే సీతమ్మకు పోయిన ప్రాణం తిరిగివచ్చినంత పనైంది.

 

క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమం అడగమన్నాడు – అన్నాడు హనుమ. అంటే ఆమె అడగకుండానే రాముడు క్షేమంగా ఉన్నాడని, ఆయనే తనను పంపాడని విన్నవించాడు. నువ్వెక్కడున్నావో తెలిసింది ఇక వెంటనే రాముడు వస్తాడు – అని అభయమిచ్చాడు.

 

మాటల్లో చెప్పలేనంత ఆపదలో ఉండి, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ మనిషిని ఎలా కాపాడాలో హనుమకు తెలిసినంత ఇంకెవ్వరీ తెలియదు అని ఘంటాపథంగా చెప్పడానికి ఈ ఘట్టమే ఉదాహరణ. నవ వ్యాకరణ పండితుడు, అనేక భాషలు తెలిసినవాడు కాబట్టే, సీతమ్మకు భాష ద్వారా దగ్గరయ్యాడు, రామదూతను అనే నమ్మకం కలిగించగలిగాడు.

 

హనుమ అంటే శబ్దబ్రహ్మ. ఆ స్వామి మాటకు మహోన్నతమైన శక్తి ఉంది. హనుమను మించిన పండితుడు లేడు. భుజబలంతో పాటు బుద్ధిబలమూ ఆ స్వామి అనుగ్రహం వల్ల లభిస్తుంది.

 

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548

 

Thursday, April 18, 2024

తెలుగింటి రాముడు


 
 
 శ్రీరామ

తెలుగింటి రాముడు

రామనామం ఓ తారకమంత్రం. రాముడి వంటి కుమారుడు, సోదరుడు, భర్త, నాయకుడు, మిత్రుడు, పరిపాలకుడు, ధర్మమూర్తి... మరొకరు లేరు అనేది నిర్వివాదం. ప్రతి మనిషికీ రాముడితో ఓదో ఒక అనుబంధం ఉంటుంది. ఆ పేరు చెబితేనే ఆత్మీయత ప్రకటితమవుతుంది.  ప్రత్యేకించి తెలుగు ప్రజలకు రాముడు దేముడు మాత్రమే కాదు. తెలుగు జీవితాల్లో రాముడొక భాగం. రాములోరి పెళ్ళి, లక్ష్మణదేవర నవ్వు, సీతాదేవి నిద్ర అంటూ తెలుగు జానపదులు కూడా రాముడితో చుట్టరికం కలుపుకున్నారు. అదీ రామయ్య ఘనత. రామకథ మహిమ. 


తెలుగులో వచ్చిన తొలి రామాయణం గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. ద్విపద ఛందస్సులో వచ్చిన ఈ రామాయణాన్ని పాటలుగా పాడుకుని మురిసిపోయిన తెలుగు లోగిళ్ళు లక్షల్లో ఉన్నాయి. సీతారాముల దాంపత్యంలోని ఔన్నత్యాన్ని తేలికైన మాటలతో చెబుతూనే బరువైన భావాన్ని పలికించాడు బుద్ధారెడ్డి.


రాముడి ధనుర్విద్యాకౌశలం ఎంత గొప్పదంటే “నల్లవో  రఘురామ! నయనాభిరామ! విలువిద్య గురువ  వీరావతార --------- బాపురే రామా భూపాల! లోకముల నే పాటి విలుకాడు నేర్చునే కలుగ” అంటూ పగవాడైన రావణాసురుడు కూడా రామయ్య కోదండకళకు అబ్బురపడి భళీ అని ప్రశంసించాడు.


రావణుడు అపహరించిన విషయం తెలియక రాముడు సీతమ్మ గురించి వెతుకుతూ... ‘‘ఇది మహారణ్యమై యిప్పుడు తోచె / ఇది పర్ణశాలయై యిప్పుడు తోచె / ఇది నాకు దపమని యిప్పుడు తోచె / చల్లని ముఖదీప్తి చంద్రునికిచ్చి / తెల్లని నగవు చంద్రికలకు నిచ్చి / చెలువంపు పలుకులు చిలుకల కిచ్చి / నిన్ను దైవము మ్రింగెనే నేడు సీత’’ - చంద్రుడిలోనూ, వెన్నెలలోనూ, చిలుకల పలుకుల్లోనూ రాముడికి సీత కనిపిస్తోంది. అందుకే సీతమ్మ ఏ అడవి జంతువు వల్ల మృత్యువాత పడిందో అనుకుంటూ ఆవేదన చెందుతాడు.  


ప్రతి అడుగులోనూ, ప్రతి అణువులోనూ భార్యాభర్తలు ఒకరికొకరు కనిపించాలి. అప్పుడే ఆ దాంపత్యానికి సార్థకత ఏర్పడుతుందని రంగనాథ రామాయణం ప్రకటించింది. ఇలా ఎన్నో భావాలు ప్రకటిస్తూ, సీతను తెలుగు జానపదుల ఆడపడుచుగా, రాముడిని జానపదుల దేవుడిగా తీర్చిదిద్ది, వారి హృదయాల్లో శాశ్వతస్థానం కల్పించాడు బుద్ధారెడ్డి. తెలుగు పల్లెల్లో పేటపేటకూ కనిపించే రామాలయాలు, ఇంటింటా వినిపించే సీతారాముల పేర్లూ  ఈ రామాయణ ప్రభావమే.


కవయిత్రి ఆతుకూరి మొల్ల ‘చెప్పుమని రామచంద్రుఁడు / సెప్పించిన పలుకుమీదఁ జెప్పెద’ అంటూ రామాయాణం రచించింది. రాముడికే కాదు రామపాద ధూళికి కూడా ఎంతో మహత్తు ఉందంటూ మొల్ల రామ వనవాస సందర్భంలో చెబుతుంది. అరణ్య వాసానికి బయల్దేరిన రాముడు సీతాలక్ష్మణ సమేతంగా గంగానది దాటాలని ఓడ నడిపే గుహుడిని కోరతాడు. దానికి గుహుడు రాముని పాదధూళి సోకి రాయి కాంతగా మారింది కదా, తన ఓడ కూడా ఏమౌతుందోనని భయం వేస్తోంది. అందుకే నీ పాదాలు కడుగుతాను అంటూ రాముని పాదాలు కడుగుతాడు. 

చ. సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు వి
య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో” యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము పెంపునన్‌. 


వాల్మీకి రామాయణంలో లేని ఈ మొల్ల వర్ణన తరువాత ఎందరో తెలుగు కవుల భావనల్లో ప్రతిధ్వనించింది.

అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న సీతారామ లక్ష్మణులను అక్కడి చెంచు స్త్రీలు చూసారు. రతీ మన్మథులను మించిన అందంతో ప్రకాశిస్తున్న సీతారాముల్ని చూస్తూ, తమలో తాము...

చ. ఇతనికిఁ బాదచారితన మేటికి వచ్చెనో? పట్టభద్రుఁ డీ
సతి నవ రూప రేఖలను జక్కని దయ్యును నిట్టి దుర్దశల్‌
ప్రతివసియించు టెట్లో? రతిరాజ సమానుల వీరి నేల యీ
గతిఁ బడఁద్రోచె బ్రహ్మ?” యని కాంతురు చెంచెత లమ్మహాత్ములన్‌. 

ఇంతటి అందగాళ్ళను బ్రహ్మ ఈ అడవుల్లో ఎలా పడేయగలిగాడో అంటూ బ్రహ్మను కూడా నిందించారు. రామయ్య సౌందర్యం అంత గొప్పది. అది కేవలం భౌతిక అందం కాదు. మాటలకందని పారమార్థిక భావనాత్మక సౌందర్యం.


లంకను నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడు రాముడిని చూస్తూనే...

“కంటిన్ జానకి బూర్ణచంద్ర వదనన్ గల్యాణి నా లంకలో
గంటిన్ మీ పదపంకజంబులను నే గౌతూహలం బొప్పగా
గంటిన్ మీ కరుణావలోకనము విఖ్యాతంబుగా గీర్తులం
గంటిన్ మా కపి వీర బృందములలో గాంభీర్యవారాన్నిధీ”

- చూసితి సీతను అంటూ రాముడి మనసుకు గొప్ప సాంత్వన కలిగిస్తాడు. అంతేకాదు, సీతలో రామయ్య ఎలా కనిపిస్తున్నాడో కూడా చెబుతాడు. సీత, రాముడు – ఇద్దరు కాదు ఒక్కరే అనే భావాన్ని మొల్ల ఎంతో రమ్యంగా చెప్పింది.

రామకథను ప్రబంధంగా తీర్చిదిద్దిన కవి అయ్యలరాజు రామభద్రుడు. శివధనస్సును రాముడు ఎక్కుపెట్టగానే అది ఫెళ్ళుమని పెద్దశబ్దం చేస్తూ విరిగిపోతుంది.

‘ఆ రమణీయ ధనుష్ఠం / కారము సీతాకుమారికా కల్యాణ / ప్రారంభవాద్య నిరవ / ద్వారమై యొసగె సకల హర్ష ప్రదమై’’  - సీతారాముల కల్యాణ వేడుక కోసం మొదటిగా మోగిన మంగళవాద్యం శివధనుర్భంగం సందర్భంగా వచ్చిన శబ్దమే అంటూ కవి చమత్కరించాడు. అంతేకాదు...

ఆ కరియాన వేనలి అనంత విలాసము మాధవోదయం
బా కమలాయతాక్షి మధురాధర సీమ, హరి ప్రకారమా
కోకిల వాణి మధ్యమున కూడిన దింతియ కాదు, తాను రా
మాకృతి దాల్చె ఈ చెలువమంతయు ఆ యమయందు జొప్పుడున్

సీత పూర్తిగా రాముడిగా మారిపోయిందంటాడు కవి. సీతమ్మను చూస్తే రామయ్యే కనిపిస్తున్నాడట. అంటే, సీతారాములకు అభేదం. శివపార్వతులే కాదు సీతారాములూ అర్ధనారీశ్వరులే. దాంపత్యానికి అర్థం, పరమార్థం ఇదే అంటూ గొప్పగా ప్రకటించింది రామాభ్యుదయ ప్రబంధం.

వానర సేనతో సహా సముద్రాన్ని దాటిన రాముడు, యుద్ధ ప్రారంభానికి ముందు అక్కడి సువేల పర్వతాన్ని ఎక్కి లంకను తేరిపార చూస్తాడు.

తనదు ప్రాణేశ్వరి, మహీతనయ కేడ
యావహిల్లునొ దురవస్థ యనుచు గాక
చుఱుకు జూపుల రఘుపతి జూచినపుడ
లంక యాహుతి గొనదె నిశ్శంక మహిమ

లంకలో ఉన్న తన ప్రాణేశ్వరికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అని ఊరకున్నాడు కానీ, మూడోకన్ను తెరచిన శివుడి  మాదిరిగా తన చూపులతోనే లంకను రాముడు కాల్చివేసేవాడట. రాముడు సాక్షాత్తు శివ స్వరూపమే అని చెప్పటంతో పాటు, శివ కేశవ అభేదం కూడా ఈ పద్యంలో ప్రకటించాడు రామభద్ర కవి.

యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయిన సందర్బంలో రాముడికి వచ్చిన కోపం ఎంతటి ఉత్కృష్టమైనదో వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు.

అభ్రంకష రధ కపి చి / త్ర భ్రమణంబుల వెలింగె ప్రళయాంతక ఫా / ల భ్రాజిష్టు భ్రుకుటీ / విభ్రమ ధౌరేయమైన విల్లుందానున్ - మూర్ఛపోయిన తమ్ముడి వంక మాటిమాటికీ చూస్తూ, రాముడు తన కోదండాన్ని పట్టుకున్న విధానాన్ని చూస్తేనే, ఇక రావణుడికి మృత్యుఘడియ దగ్గరపడిందనే సందేశం ఆ సన్నివేశం చూస్తున్నవారికి అందిందట.


అసలు రాయడం అంటూ జరిగితే రామాయణమే రాయాలి. తనలోని జీవుడి వేదన తీరాలన్నా, తన తండ్రి ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలన్నా రామాయణమే రాయాలి. ఇంకే కథ రాసినా అది కట్టుకథే అవుతుందంటూ నిర్మొహమాటంగా చెప్పిన ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ. తన రామాయణ కల్పవృక్షంలో రాముడి వైభవాన్ని ప్రపంచం పట్టలేనంతగా విస్తరించి రాసారు. 


జనకుడి సభలో రాముడు ఎక్కుపెట్టిన శివధనుస్సు విరిగిన శబ్దం 

నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహా ఘోరబం
హిష్ఠ స్ఫూర్జధుషండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘ్రిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్.

ఉరుముల గుంపు నుండి వచ్చే ధ్వనిలాగా శివధనుస్సు విరిచినప్పుడు శబ్దం వచ్చిందట. అక్కడితో ఆగలేదు విశ్వనాథ కవితావేశం. భూమి నుంచి వరుసగా ఐదు ఊర్ధ్వ లోకాల్లో ఆ శబ్దం ఎలా వినబడిందో వివరిస్తూ వరుసగా ఐదు పద్యాలు రాసారు. అదీ రామయ్య బాహు విక్రమం. 

ఇరువదినాలు గేండ్లుగ నిదెప్పు డిదెప్పు డటంచుఁ గన్నులం
దెఱచి ప్రతీక్ష చేయుదుగదే, జగదేకధనుష్కలానిధీ !
విఱచిన వెండికొండదొర వింటిని వింటినిగాని చూడలే
దఱుత వహింప ధాత్రిఁ గనులారగఁ జూతునురా కుమారకా !


శివధనుస్సును విరిచి, సీతమ్మను వివాహం చేసుకున్న సందర్భంలో కౌసల్య మనోభావం ఇది. ఇరవై నాలుగేళ్ళుగా ఈ కల్యాణ ఘడియ కోసమే నిరీక్షిస్తున్నాను కుమారా... అంటూ ఆ తల్లి రాల్చిన ఆనందాశ్రువులు సీతారాముల కల్యాణానికి అక్షతలుగా మారాయి.

అశోకవనంలో రాక్షస స్త్రీల సమూహం మధ్య కూర్చున్న తేజోవతి అయిన ఓ స్త్రీని హనుమంతుడు చూసాడు. ఆమె ఎవరో తెలియదు. కానీ, ఆమెను చూస్తుంటే...

*ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చా*
*పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే*
*హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ*
*ర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై* *

అప్పటివరకూ తాను చూసిన రామచంద్రమూర్తి విరహమంతా మనిషి రూపం ధరిస్తే ఎలా ఉంటుందో ఆ స్త్రీ మూర్తి అలా కనిపించింది. రాముడి కోదండాన్ని ఆమె కనుబొమల్లో స్పష్టంగా చూడవచ్చు. ఆమె కళ్ళల్లో రాముడి దయాగుణం, కేశాల్లో రాముని మేనిఛాయ, ఆమె శరీరంలోని అణువణులో రఘువంశ ధర్మం బొమ్మకట్టినట్లు కనిపిస్తోంది. అంతేకాదు... తన ధర్మపత్నిని అపహరించిన వాడిని సంహరిస్తానని రాముడు చేసిన ప్రతిజ్ఞ ఆకారం ధరించిందా అన్నట్లు ఆమె కూర్చున్నదట. 

విశ్వనాథ కల్పవృక్షంలోనూ సీతారాములు ఇద్దరు మనుషులు కారు. రెండు భౌతిక రూపాల్లో ప్రకటితమయ్యే  ఒకే ఆత్మ.

ఇంకా... రఘునాథ రాయలు (రఘునాథ రామాయణం), ఘనగిరి రామకవి (యథావాల్మీకి రామాయణం), చెన్న కృష్ణయ్య (సాంఖ్య రామాయణం), గంగయ్య (తారకబ్రహ్మ రామాయణం).... ఇలా తెలుగులో సుమారు 130 వరకు రామాయణాలు వచ్చాయి. 
 
అన్నిటా ఒకటే సందేశం... రాముడు భారతజాతి ఆత్మ.
--------------------------------------------------------------
భక్తి పత్రిక ఏప్రిల్, 2024 సంచికలో ప్రచురితమైన వ్యాసం
----------------------------------------------------------------
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, కెబిఎన్ కళాశాల (అటానమస్), విజయవాడ-1
 


 

Thursday, March 23, 2023

భజే రుద్రరూపం... భజే బ్రహ్మతేజం (హనుమజ్జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)



భజే రుద్రరూపం... భజే బ్రహ్మతేజం

 

          హనుమంతుడంటేనే ఓ శక్తి. ఆ పేరు పలికితేనే కొండంత ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. హనుమలో ఎంతటి గంభీరమైన ఉగ్రతేజం కనిపిస్తుందో, అంతేస్థాయిలో మృదుమధురమైన వాక్‌, చిత్త సంస్కారం కూడా కనిపిస్తుంది. ఎంతటి అనుపమానమైన దేహదారుఢ్యం కనిపిస్తుందో, అంతటి సమున్నతమైన బుద్ధిబలం కూడా వ్యక్తమవుతుంది. ఎంతటి అపారమైన శాస్త్రపాండిత్యం ప్రకటితమవుతుందో, అంతే తీక్షణమైన బహ్మ్రచర్య తేజం భాసిస్తుంది. ఎంతటి ప్రతాపరౌద్రం కనిపిస్తుందో, అంతటి పరమశాంత చిత్తం కూడా దర్శనమిస్తుంది. వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రియసఖుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు... ఇలా అనేక శక్తుల మేలుకలయికగా హనుమ రామాయణంలో అనేకచోట్ల దర్శనమిస్తాడు.

 

దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి సాక్షాత్తు పరమశివుడే రామకార్యాన్ని సాధించాలనే సంకల్పంతో హనుమంతుడిగా అవతరించాడని పరాశర సంహిత చెబుతోంది.

 

దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాయ చ । రామకార్యార్థ సిద్ధ్యర్థం జాతః శ్రీహనుమాన్‌ శివః ॥ - వైశాఖమాసం, కృష్ణ పక్ష దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి, మధ్యాహ్నవేళలో, కర్కాటకలగ్నంలో ఆంజనేయుడు జన్మించినట్లు అందులో ఉంది. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయుదేవుని అనుగ్రహం ద్వారా కేసరి అనే వానరవీరుని భార్య అంజనాదేవికి రుద్రతేజంతో హనుమ జన్మించాడు.

 

ఓంకార హనుమ

    హనుమాన్‌ అనే శబ్దానికి ‘జ్ఞానవాన్‌’ అనే అర్థం ఉంది. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అనే అర్థం ఉంది. ‘హనువు’ అంటే ‘దవడలు’ అనే అర్థం కూడా వాడుకలో ఉంది. శబ్దార్థపరంగా చూస్తే, ‘హనుమ’ అనే పదంలోని అచ్చులు ‘అ, , మ’ - ఈ మూడు కలిస్తే ‘ఓం’కారం ఆవిర్భవిస్తుంది. దీని ద్వారా హనుమంతుడు ఓంకార స్వరూపుడనే విషయం అత్యంత స్పష్టంగా తెలుస్తుంది.

 

విద్యాహనుమ

 హనుమంతుడు అనగానే అద్భుతమైన బలపరాక్రమాలు గుర్తుకువస్తాయి. అపరిమితమైన భుజశక్తికి తోడు హనుమంతుడు గొప్ప విద్యావేత్త కూడా. కర్మసాక్షి, ప్రత్యక్షదైవం అయిన సూర్యభగవానుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఉపనయనం పూర్తయ్యాక ఓ రోజు హనుమ సూర్యుడి దగ్గరకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించమని అభ్యర్థిస్తాడు. నేను క్షణం కూడా స్థిరంగా ఉండననే విషయం లోకమంతా తెలిసిందే కదా. అలాంటి నేను నీకెలా విద్య నేర్పించగలను. మరెవ్వరైనా గురువును చూసుకోమంటాడు సూర్యుడు. తన శరీరాన్ని అమాంతంగా పెంచి, తూర్పు పశ్చిమ పర్వతాల మీద చెరొక కాలు పెట్టాడు. సూర్య గమనానికి అభిముఖంగా తన ముఖాన్ని తిప్పుతూ సూర్యుడిని విద్య నేర్పించమని ప్రార్థించాడు. తన శిష్యుడి శక్తి సామర్థ్యాలకు, బలపరాక్రమాలకు సూర్యుడు ముచ్చటపడి, హనుమను శిష్యుడిగా స్వీకరించాడు. వేదాలు, వేదాంగాలు, వ్యాకరణంతో సహా అన్ని శాస్త్రాలు నేర్చుకుని గొప్ప పండితుడవుతాడు హనుమ. అంతటి పండితుడు కాబట్టే హనుమ మంత్రిగా ఉంటే ముల్లోకాల్లోనూ సాధించలేదని ఏదీ ఉండదంటాడు రాముడు. ఎవరో నిరాశ పరిచారనో, ఏవో అడ్డంకులు వచ్చాయనో ఎంపిక చేసుకున్న విద్య నేర్చుకోవటాన్ని మానుకునే నేటితరం విద్యార్థులకు హనుమ ఓ చక్కటి ఆదర్శంగా నిలుస్తాడు. విద్య నేర్పించాల్సిన గురువే వద్దని వారించినా హనుమ నిరుత్సాహ పడలేదు. గురువును మెప్పించి విద్య నేర్చుకున్నాడు. నేటితరానికి హనుమ ఓ పాఠం. 

 

సుందర హనుమ

 

హనుమకు తల్లి అంజనాదేవి పెట్టిన పేరు సుందరుడు. అద్భుతమైన సౌందర్యమూర్తి హనుమంతుడు. సూర్యుడిని మింగాలని ఆకాశానికి ఎగిరిన బాలాంజనేయుడిని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అది దవడల మీద బలంగా తాకటంతో చెక్కుకున్నట్లు అవుతాయి. అలా చెక్కబడిన దవడలు కలిగిన వాడు కావటంతో సుందరుడు హనుమంతుడిగా ప్రసిద్ధి పొందాడు.  మరొక విశేషం ఏమిటంటే...రామాయణంలోని అన్ని సర్గలకు అందులోని కథాంశాన్ని బట్టి పేరు పెట్టాడు వాల్మీకి. కానీ సీతాన్వేషణ జరిగిన సర్గకు మాత్రం సుందరకాండ అని పేరు పెట్టాడు. నిజానికి హనుమత్కాండ అని పేరు పెట్టాలని అందరూ అంటారు. కానీ హనుమ అసలు పేరు సుందరుడు కదా. అందుకని వాల్మీకి ఈ సర్గకు సుందరకాండ అని పేరు పెట్టారని ప్రతీతి.

 

హనుమంతుడి మంత్రాల్లో ‘సుందర హనుమన్ మహామంత్రం’ ఒకటి. వాల్మీకి తన శ్లోకాల్లో అంతర్గతంగా ఈ సుందర మంత్రాన్ని నిక్షిప్తం చేశాడు కాబట్టి సుందరకాండ అయిందని మరొక వివరణ. నిజానికి భౌతిక సౌందర్యాన్ని మించినది హృదయ సౌందర్యం. మొత్తం రామాయణంలో ఎక్కడా తన గురించి చెప్పుకోలేదు. రాముడు విడిచిన బాణాన్ని అంటూ తన ఘనత అంతా రాముడికే కట్టబెట్టాడు. సీతమ్మను రామయ్య చెంత చేర్చటం తప్ప మరోధ్యాస లేదు హనుమకు. అందుకే ఆ హృదయాన్ని మించిన సుందర హృదయం మరొకటి లేదు. కాబట్టే ఈ కాండ సుందరకాండ అయింది. 

 

రాజు పూజలందుకున్న బంటు

హనుమంతుడు రాముడు బంటు. అందరికీ తెలిసిన విషయమే. కానీ రామయ్యే స్వయంగా హనుమంతుడిని పూజించిన వివరణ పరాశర సంహితలో ఉంది. దీనిప్రకారం సూర్యుడిని మింగటానికి ఆకాశానికి ఎగిరిన హనుమంతుడి మీద వజ్రాయుధం ప్రయోగిస్తాడు ఇంద్రుడు. హనుమ ఓ పర్వతం మీద పడి, మూర్ఛపోతాడు. బిడ్డకు కలిగిన కష్టం చూసి వాయుదేవుడు కోపంతో అన్నిలోకాల్లో ఉన్న వాయువుని స్తంభింపజేస్తాడు. దీంతో లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయి.

 

విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంట పెట్టుకుని హనుమంతుడున్న చోటుకి వస్తాడు. అతడిని పునర్జీవితుడిని చేసి అనేక వరాలిస్తాడు. మిగిలిన దేవతలందరూ కూడా తమ శక్తిని హనుమంతుడికి ఇచ్చి, తమకు సంబంధించిన అస్త్ర, శస్త్రాలేవీ అతడి మీద పనిచెయ్యవంటూ వరాలిస్తారు. హనుమంతుడి పేరుతో హనుమద్ర్వతం వ్యాప్తిలోకి వస్తుందని, ఈ వ్రతం చేసిన వారి పనులన్నీ హనుమ చేసిపెడతాడని బ్రహ్మదేవుడు ఈ సందర్భంలో చెబుతాడు. ఈ కథంతా రాముడికి హనుమే స్వయంగా చెబుతాడు.

 

సీతాన్వేషణలో ఉన్న రాముడు పంపానదీ తీరంలో హనుమంతుడు వేదిక మీద కూర్చోపెట్టి

లక్ష్మణుడితో సహా ఈ వ్రతం చేస్తాడు. వ్రతం ఫలితంగా సీతాన్వేషణ మొదలు సీతారామ పట్టాభిషేకం

వరకు మొత్తం కార్యాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తాడు హనుమ. తన యజమాని చేత

పూజలందుకున్న ఏకైక బంటు హనుమ మాత్రమే. 

 

వేద హనుమ

 

హనుమ అనే పదానికి ఉపనిషత్తులు చెబుతున్నఅర్థం ‘వేదం’. రాముడు శ్రీ మహావిష్ణువు అవతారం. వేదాలు ఘోషిస్తున్నది విష్ణు స్వరూపాన్నే. అటువంటి వేదస్వరూపుడైన విష్ణువు రామావతారంలో సీతను అన్వేషిస్తూ కొండలు, కోనలు తిరుగుతాడు. అలాంటి రాముడు ఓ సందర్భంలో హనుమంతుడి భుజాల్ని అధిరోహిస్తాడు. నిజానికి రాముడు నడవలేక కాదు. వేదం మాత్రమే వేదస్వరూపుడిని భరించగలదు. ఇతరులకు అది సాధ్యం కాదు. భగవంతుడి తత్త్వం మాత్రమే భగవంతుడిని ప్రకటించగలదు. భరించగలదు. కాబట్టి హనుమ రామయ్యను భుజాల మీద కూర్చోపెట్టుకున్నాడంటే హనుమ వేదస్వరూపుడని చెప్పకనే చెప్పినట్లయింది. 

 

శ్రీరాముడు తన పట్టాభిషేక సమయంలో అందరికీ కానుకలతో కృతజ్ఞతను తెలియజేస్తూ, హనుమను కూడా ఏంకావాలో కోరుకోమన్నాడు. అప్పుడు హనుమ ‘నాకు నీయందు సదా పరమమైన ప్రేమను ప్రసాదించ’మన్నాడు. ఆ మాటకు రాముని హృదయం పరవశించి, సింహాసనం నుంచి దిగి హనుమను బిగియారా కౌగలించుకుని ఆశీర్వదించాడు. అంతేకాదు నీవు చేసిన ఒక్కొక్క ఉపకారానికి నా ప్రాణాలు ఇస్తాను. కాని ఉపకారాలు మిగిలిపోతాయి. ఆ విషయంగా నేను ఋణగ్రస్తుణ్ణి. నీ ఉపకారాలు నా దేహంలో జీర్ణమై పోనీ.  నీవల్ల నా కష్టాలు  తొలిగాయి. నీకు ఉపకారం చేయాలంటే నాకు వచ్చిన కష్టాలు నీకు రావాలి. నీకు కష్టం కలిగిందన్న ఊహ వచ్చినా నా మనస్సు బాధపడుతుంది. అది చెడు భావన. అటువంటి భావన రాకుండా నీ ఉపకారాలన్నీ నాలో జీర్ణమైపోవుగాక’ అని కోరుకుంటాను అంటాడు. ఇది హనుమపై శ్రీరాముని భావన మాత్రమే కాదు. తరచి చూసేత ఆత్మ-పరమాత్మల కలయికకు ప్రతీక.

 

         

కర్తృత్వ, భోక్తృత్వ జ్ఞాతృత్వాల పట్ల అహంకార, మమకారాలు లేని వాడు హనుమ. తాను భగవంతుని ప్రేరణతోనే బయలుదేరానని, రామబాణం వలే (యథా రాఘవ నిర్ముక్త శ్శరస్వశన విక్రమః -  వాల్మీకి రామాయణం) లంకలో ప్రవేశించగలనని చెప్పాడే కాని తన శక్తి సామర్థ్యాలను ప్రకటించలేదు. ఇది హనుమ స్వరూపాన్ని చక్కగా చిత్రించే సంఘటన. రామరావణ యుద్ధంలో మూర్ఛితుడైన లక్ష్మణుని

పునరుజ్జీవింపజేయటానికి సంజీవని పర్వతాన్ని తెచ్చినప్పుడు, నన్ను నా వంశాన్ని నిలిపావంటూ హనుమను చిరంజీవిగా ఆశీర్వదించాడు రాముడు. హనుమంతుని ప్రజ్ఞాపాటవాలను కిష్కింధాకాండ నుంచి చూసి ప్రశంసించకుండా ఉండలేం. మంత్రిగా, సేనానాయకునిగా, సలహాదారునిగా విభీషణ శరణాగతి సందర్భంలో దౌత్యవేత్తగా, కార్య కుశలుడుగా, సత్యశీలిగా, కర్తవ్యనిష్టునిగా, మహాబలవంతునిగా ఇలా ఎన్నో రూపాల్లో చూస్తాం. అందుకే హనుమ రామాయణం అనే మణిహారంలో రత్నమై వెలిగొందాడు. 

 

మనుస్మృతిలో చెప్పినట్లు ప్రభువు పట్ల అనురాగం, కపటమెరుగని స్థితి, సమర్థత, జ్ఞానం దేశకాలతత్త్వం తెలిసి ఉండటం, మంచి దేహదారుఢ్యం, భయమన్నది లేకపోవడం, వాక్పటుత్వం దూతకు ఉండాలి. ఈ లక్షణాన్నీ హనుమలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే శ్రీరాముని ప్రేమకు పాత్రుడయ్యాడు. అటువంటి హనుమను మనసారా స్మరిస్తే బుద్ధి, కీర్తి, బలం, ధైర్యం, నిర్భయత్వం, రోగాలు లేకుండా ఉండడం, వాక్పటుత్వం మొదలైన మంచి లక్షణాన్నీ  ప్రాప్తిస్తాయి.

--------------------------------------

రచన

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, లెక్చరర్, కె.బి.ఎన్.కాలేజీ, కొత్తపేట, విజయవాడ-1

సెల్: 9032044115

 


Tuesday, March 7, 2023

దీపారాధన ఎందుకు చెయ్యాలి? దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి?

 

దీపారాధన


దీపారాధన ఎందుకు చెయ్యాలి? 


దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? 


దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి?


           పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికీ, తైలం జలతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్ని తత్వానికీ ప్రతీకలు. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించడమంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే. దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషీ పుట్టుకతో జ్ఞాని కాలేడు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. లోలోపలి చీకట్లను వదిలించుకుంటాం. దీపానికి ఉండే మరో ప్రత్యేకత... అది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉండటం. దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్పవిషయాలవైపు మళ్లించకుండా ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండటమూ నేర్చుకోవాల్సిన పాఠమే.

          సృష్టి, స్థితి, లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు.

          ‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే / ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్‌’’ అన్నారు ఋషులు. అంటే ప్రబోధంఅనే ప్రమిదలో, ‘వైరాగ్యంఅనే తైలం పోసి, ‘భక్తిఅనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు.

          ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. పరమాత్మే పరంజ్యోతిఅని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన హృదయాన్ని ప్రమిదగా భావించి, అందులో భకి్త అనే తైలం పోసి, ‘ప్రేమఅనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.

          దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని కఠోపనిషత్తుకథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని పద్మపురాణంపేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది.

 

          దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుందని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని దీపాన్వికగా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని దీప దాన మహోత్సవంఅని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం శారదోత్సవంగా, నాగానందం గ్రంథంలో దీప ప్రతిపాదనోత్సవంగా దీపావళిని పేర్కొన్నారు.

          'దీపేన సాధ్యతే సర్వం' అని శాస్త్రవచనం. 'దీపంతో దేనినైనా సాధించవచ్చు' అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.

 

          దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహతులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం. 'దీపమున్న చోట దేవతలుంటారు'- అనడం ఈ కారణం వల్లనే.

 

          కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు.


          భారత పురాణ ఇతిహాసాల్లోనూ, వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకి పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం మనోవికాసానికీ, ఆనందానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం. చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తమస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపంఅని భావిస్తూ ఆరాధిస్తారు. వెలిగించడంసనాతన భారతీయ సంస్కృతి.

          మంత్రశాస్త్ర ప్రకారం సాక్షాత్ దీపం దర్శయామిఅనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి, నీటిని చల్లి, ముగ్గులు పెట్టి ధూపం వెలిగించి దీపం పెట్టడంవల్ల సకల దుష్ట గ్రహ శక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుంది. అప్పుడే ఆ గృహం పూజార్హతకు అవకాశం కలుగుతుంది. దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకళ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి దీపవాసిని. దీపకాంతి నుంచే కళ పుడుతుంది. దీపం అమంగళాన్నీ, దారిద్య్రాన్నీ, అరిష్టాల్ని పారద్రోలే శక్తి స్వరూపం. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు. పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. కానీ నేటి పరిస్థితుల దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు. కానీ ఇంట్లో రోజూ ఉదయం, సాయంకాలం దీపారాధన చేయడం శుభప్రదం. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

==============

 డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

సెల్: 90320 44 115 / 8897 547 548

 

 


ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...