Wednesday, January 29, 2020

రథసప్తమి విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappganu Ramakristhna) ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో రాసిన వ్యాసం

రథసప్తమి విశేషాలతో
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappganu Ramakristhna)
ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో రాసిన వ్యాసం


Monday, January 27, 2020

సంకల్పం అంటే ఏమిటి? ఆలోచనకు సంకల్పానికి తేడా ఏమిటి? ఆలోచన సంకల్పంగా ఎప్పుడు మారుతుంది? సంకల్పానికి ఉన్న శక్తి ఎంతగొప్పది?

సంకల్పం అంటే ఏమిటి?
 ఆలోచనకు సంకల్పానికి తేడా ఏమిటి? 
ఆలోచన సంకల్పంగా ఎప్పుడు మారుతుంది?

సంకల్పానికి ఉన్న శక్తి ఎంతగొప్పది? 






తిరుగులేని సంకల్పం

           విద్యనేర్చుకోవాలన్న సంకల్పం

... అనామకుడైన ఏకలవ్యుడిని ధనుర్విద్యా విశారదుడిని చేసింది.

          మనిషికి ప్రాణం పోయాలన్న సంకల్పం

... వానరవీరుడు సంజీవని పర్వతాన్నే పెకలించేలా చేసింది.

          తండ్రి ప్రేమను పొందాలన్న సంకల్పం

... ధ్రువమండలాన్నే సృష్టించింది.

          వంశాన్ని నిలుపుకోవాలన్న సంకల్పం

... భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే అద్భుత వరాన్నిచ్చింది.

 

          సంకల్పమంటే... పట్టుదల. ఓ గట్టి నిర్ణయం. మొక్కవోని దీక్ష.

          సంకల్పమంటే... మనసులో కలిగే ఓ ఆలోచన.... ఓ భావన.

 

          మనస్సులో కలిగే ఆలోచన మనకు ఆనందాన్ని లేదా లాభాన్ని కలిగించేదైనా అవుతుంది. కాదంటే... బాధను, నష్టాన్ని కలిగించేదైనా అవుతుంది. ఈ రెండూ కాని ఆలోచన ఏదీ ఉండదు. ఏ ఆలోచనైతే మనకు ఆనందాన్ని కలిగిస్తుందో ఆ ఆలోచనని సొంతం చేసుకోవాలని, ఆ ఫలితాన్ని త్వరగా అందుకోవాలని, అందుకోసం ఏదైనా సరే చెయ్యాలని మనసు కోరుకుంటుంది. భౌతికంగా మన ప్రయత్నమూ ఆ దిశగానే సాగుతుంది. ఇలా మనలో పట్టుదలని కలిగించే ఆ ఆలోచనే సంకల్పం అవుతుంది. 

సృష్టికి మూలం సంకల్పమే

          మహాప్రళయం తర్వాత సృష్టిని తిరిగి ప్రారంభించాలని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. ఆ సమయానికి ఆయన చేతిలో ఏవిధమైన పరికరం లేదు. ఉన్నదంతా మనసు నిండా ఆలోచన మాత్రమే. ఎలాగైనా సరే సృష్టి జరగాలని భావించాడు. ఆ ఆలోచన బలపడింది. సంకల్పంగా మారింది. బ్రహ్మ సంకల్పానికి తిరుగులేదు. మనస్సులో జన్మించిన మహోన్నతమైన సంకల్పం సృష్టికి మూలకారణంగా నిలిచింది. బ్రహ్మ ముఖం నుంచి రుద్రుడు ఆవిర్భవించాడు. అక్కడ నుంచి మిగిలిన సృష్టి అంతా ఆవిర్భవించింది. మొత్తంగా మనం చూస్తున్న ఈ చరాచర జగత్తు మొత్తం బ్రహ్మ సంకల్పం ద్వారా ఆవిర్భవించింది. సంకల్పానికి ఉన్న సర్వోన్నతమైనశక్తికి ఇది నిదర్శనం.

ఏది ఆలోచన? ఏది సంకల్పం?

          మనం అనుకున్న ప్రతి మాట, చేసిన ప్రతి ఆలోచన సంకల్పం కాదు. ఆలోచన వేరు. సంకల్పం వేరు. మనసులో కలిగే ఓ చిన్నపాటి భావన ఆలోచన అవుతుంది. నిరంతరంగా ఆలోచించటం మనస్సుకు సహజ లక్షణం. ఒక్క క్షణంలో వందలాది ఆలోచనలు మన మనసులో పుడతాయి. ఈ ఆలోచనలన్నీ సంకల్పాలు కావు. మనకు కలిగే ఆలోచనలన్నీ దాదాపు క్షణికాలే. వేలాది ఆలోచనల్లో ఏవో కొన్ని ఆలోచనలు మాత్రమే ఆచరణలోకి వస్తాయి. ఏ ఆలోచనైతే మళ్ళీ మళ్ళీ మన మనస్సులో మెదులుతుంటుందో, ఏ ఆలోచన గురించి మనస్సు, బుద్ధి తీవ్రంగా పరితపిస్తూ ఉంటాయో, ఏ ఆలోచన కోసం సాధించటం కోసం మన హృదయం అనుక్షణం పరితపిస్తుంటుందో ఆ ఆలోచనే 'సంకల్పం' అవుతుంది. బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గంలో 'సమ్యక్‌ నిర్ణయం' లేదా 'సమ్యక్‌ సంకల్పం' ఒక అంశం. సమ్యక్‌ సంకల్పం అంటే సదాశయాలను కలిగి ఉండటం, సదాలోచనలు చేయడం.
          మనం సాధించే విజయానికి మూలకారణం మనలో కలిగే సంకల్పం మాత్రమే. మనం పాటిస్తున్న కార్యాచరణకు మనం చేసిన సంకల్పం పరిధులు నిర్ణయిస్తుంది. సంకల్పం ఆలోచన రూపాన్ని దాటి ఆచరణలోకి రావటం అంత సులభమైన పనేమీ కాదు. అందుకు ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి. ఇలా సంకల్పానికి వ్యతిరేకంగా జరిగే ఆలోచనను 'వికల్పం' అంటారు. సంకల్ప, వికల్పాల మధ్య మన మనస్సు ఎప్పుడూ కొట్టుమిట్టాడుతుంటుంది. ఈ సంఘర్షణలో విజయం సాధించటంలోనే మన నేర్పు ఆధారపడి ఉంటుంది.
          వికల్పాన్ని మనస్సు నుంచి దూరం చేస్తే సంకల్పం కార్యరూపం దాల్చి, అంతిమంగా సంకల్పసిద్ధి కలుగుతుంది. మూఢులకు అన్నీ వికల్పాలే ఉంటాయి. సంకల్ప, వికల్పాల మిశ్రమంగా మిగిలిపోతాడు 'సగటు మానవుడు'. వికల్పాల్ని క్షీణింపజేసుకుంటూ సంకల్పాల్ని వృద్ధిచేసుకునే మానవుడు ఉత్తముడిగా అందరి ప్రశంసలు అందుకుంటాడు.

 వేదం చెప్పిన సంకల్పం

          మనిషికి ఎలాంటి సంకల్పం ఉండాలన్న విషయాన్ని వేదాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. యుజుర్వేదంలో అంతర్భాగంగా ఉన్న మహన్యాసం (శివాభిషేకంలో అత్యంత ప్రధానమైన మంత్రభాగం)లో శివసంకల్ప సూక్తం చాలా స్పష్టంగా ఈవిషయాన్ని ప్రకటిస్తుంది. 'యే వేదం భూతం భువనం భవిష్యతి...' అంటూ సాగే 39 మంత్రాలు ఇందులో ఉంటాయి. ప్రతి మంత్రంలోనూ 'తన్మే మనశ్శివసంకల్పమస్తు' అనే వాక్యం కనిపిస్తుంది. 'నా మనస్సులో ఎప్పుడూ మంగళకరమైన, పవిత్రమైన సంకల్పాలు కలుగుగాక' అని దీని అర్థం. మన మనస్సు ఎప్పుడూ శుభాన్ని కోరుకోవాలి. అటువంటి సంకల్పాలు మాత్రమే చెయ్యాలి. అప్పుడు మనకే కాదు... మన చుట్టూ ఉన్న సమాజానికి, అంతిమంగా లోకానికి క్షేమం కలుగుతుంది. వేదం ఆశించిన లోకక్షేమ సంకల్పం ఇది.

          ఋగ్వేదంలోని 'ఓం వాజ్ఞ్మే మనసి ప్రతిష్ఠితా! మనోవాచి ప్రతిష్ఠితా. మాలిరావీర్మ ఏధి! శ్రుతం మే మా ప్రహసీర సేనాధితే నా హోరాత్రాన్‌ సందధామృతం వదిష్యామి! సత్యం వదిష్యామి! తన్మామవతు! తద్వక్తార మవతు! మావమవతు వక్తారమవతు వక్తారమ్‌!' -  'నా వాక్కు మనస్సులో ప్రతిష్ఠిం అగు గాక. మనన్సులో ప్రతిష్ఠిం అగుగాక. నేను నేర్చుకున్నదీ, విన్నదీ నన్ను వీడకుండుగాక. నేర్చుకున్న మంచిని సదా మననం చేస్తాను గాక. నేను సత్యాన్ని పలుకుతానుగాక. నేను పారమార్థిక సత్యాన్ని పలుకుతానుగాక' అంటూ సాగే మంత్రం పవిత్రమైన సంకల్పం మనలో కలగటానికి మనస్సు ఎప్పుడూ మంగళకరమైన భావాలతో నిండిఉండాలని చెబుతుంది.

 సంక్పలన సాధన

          'సమ్యక్‌' అంటే పరిశుద్ధత, 'కల్పన' అంటే ఆలోచనల సమూహం. సమ్యక్‌ కల్పనే సంకల్పం. పరిశుద్ధమైన ఆలోచనల సమాహారమే సంకల్పంగా మారుతుంది. సంకల్పం మనసుకు సంబంధించిందే అయినా దాన్ని ఆవలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి. ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా ఓ పథకం ప్రకారం ముందుకు సాగితే గెలుపు అనివార్యం. అంటే... లక్ష్యం సాధించడం ఒక్కటే కాదు... ఎలా సాధించాలి అనే విషయాన్ని కూడా బాగా ఆకళింపు చేసుకోవాలి.
          మహారాజు విశ్వామిత్రుడు చాలా గర్విష్టి. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడిని అనేకరకాలుగా ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏ ఒక్క ప్రయత్నమూ ఫలించదు. వశిష్ఠుడికి ఉన్న బ్రహ్మర్షిత్వం తనకూ కావాలనుకున్నాడు. తపస్సు ప్రారంభించాడు. కొద్దికాలానికే మేనక మోహంలో పడి తపస్సు విడిచిపెట్డాడు. అప్పటిదాకా పొందిన శక్తి వ్యర్థమైపోయింది. తప్పు తెలుసుకుని తిరిగి తపస్సు ప్రారంభించాడు. బ్రహ్మర్షి కావటానికి కోపం, ద్వేషం, అసూయ, గర్వం, ఈర్ష్య, భ్రమ... అన్నిటినీ వదులుకున్నాడు. త్రిశంకువు వంటి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా సరే దృఢసంకల్పంతో ప్రతి అపజయాన్ని విజయానికి సోపానంగా మలుచుకున్నాడు. ఓటమి ఎదురైనప్పుడు మనో నిబ్బరాన్ని కోల్పోలేదు. ఆ సమయంలోనే తన సంకల్పాన్ని మరింతగా గుర్తుచేసుకున్నాడు. అమోఘమైన తన సంకల్పశక్తితో విజయం సాధించాడు. వశిష్ఠుడి చేత 'బ్రహ్మర్షీ!' అని పిలిపించుకున్నాడు. సంకల్పన సాధన అంటే ఇలా ఉండాలి.

 మహా సంకల్పం

          వివాహ సమయంలో కన్యాదానం చెయ్యటానికి ముందుగా కన్యాదాత చేత ఋత్విక్కులు మహా సంకల్పాన్ని చెప్పిస్తారు. వధూవరుల మధ్య తెరను అడ్డంగా పెట్టి, మంగళాక్షతలు నిండిన పళ్ళెంలో తాంబూల సహితంగా పూర్ణఫలాన్ని పట్టుకుని కన్యాదాత మహాసంకల్పం చెబుతాడు. ఇదొక అద్భుతమైన ఘట్టం.

          'ఓం అస్యశ్రీమదాది నారాయణస్య...' అంంటూ సాగే మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళస్థితిని చక్కగా వివరిస్తుంది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్తద్వీపాలు, నవ వర్షాలు, నవఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భరత వర్షం-భరత ఖండం, దానిలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యా దాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్థం గడవగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పాల్లోని శ్వేత వరాహ కల్పంలో, పధ్నాలుగు మన్వంతరాల్లో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో, శాలివాహన శకంలో, ఇరవై ఎనిమిదవ మహాయుగంలో అంతర్గతమైన కలియుగంలో, ఫలానా సంవత్సరం, ఫలానా మాసంలో, ఫలానా తిది రోజున, ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్రీతి కోసం సర్వాలంకార భూషితైన ఈ కన్యను దానం చేస్తున్నాను అని కన్యా దాత చెప్పే సంకల్పం ఇది. ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని,స్తోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక, తనకు తర్వాత పదితరాల వాళ్ళు బ్రహ్మలోకంలో నివసించాలని కన్యాదాత సంకల్పం చేస్తాడు.

 సంకల్పశక్తి

          ప్రతి మనిషిలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే మూడుశక్తులు సహజంగా ఉంటాయి. ఇవి పుట్టుతోనే వస్తాయి. అయితే, ఈ శక్తులు తనలో ఉన్నాయన్న ఎరు కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. ఈ మూడుశక్తుల్లో మొదటిదైన ఇచ్చాశక్తే సంకల్పశక్తి. మనలో ఉండే అతి గొప్పశక్తి ఇచ్ఛాశక్తి. ఇది దైవీకమైంది. మన ద్వారా జరిగే ప్రతి పనికీ మనలో కలిగే సంకల్పమే కారణమవుతుంది. జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ మహత్‌ సంకల్పం మనలో పుట్టాలంటే జ్ఞానం మాత్రమే సరిపోదు. దైవిక సహాయం లేదా ప్రకృతి సంకల్పం ఇందుకు తోడుకావాలి. 

          సంకల్పానికి, మామూలు ఇచ్ఛాశక్తికి కొద్దిపాటు తేడా ఉంటుంది. ఈ సూక్ష్మభేదాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. సంకల్పం అంటే దృఢ నిశ్చయం. ఏదైనా ఒక పని జరిగితీరాల్సిందే అని మనం అనుకుంటే అది కేవలం 'ఇచ్ఛ' (కోరిక)గానే మిగిలిపోతుంది. ఈ ఇచ్ఛ వెనక దృఢమైన నిశ్చయం ఉంటే అది సంకల్పంగా మారుతుంది. సంకల్పాల ద్వారా మనం శక్తిని పొందటం లేదా పోగొట్టుకోవటం జరుగుతుంది. పవిత్రమైన సంకల్పాలతో శక్తి ఉత్పన్నమవుతుంది. అపవిత్రమైన సంకల్పాలతో శక్తి నాశనమవుతుంది. మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేవే పవిత్ర ఆలోచనలు. మిగతావన్నీ అపవిత్ర ఆలోచనలు. వాటికి మనలోని సత్యతతో ఎటువంటి సంబంధం లేదు. సంకల్పం అనే వాహనం మనల్ని అజ్ఞానం నుండి సత్యత వైపునకు తీసుకువెళ్తుంది.

          టిట్టిభం అనేది చాలా చిన్నపక్షిజాతి. సాధారణభాషలో దీన్నే లకుముకి పిట్ట అంటాం. టిట్టిభ జాతికి చెందిన ఓ ఆడపక్షి ఓ సారి సముద్రతీరంలో గుడ్లు పెట్టి, అవి బిడ్డలుగా మారేందుకు ఎదురుచూస్తుంటుంది. ఓ రోజున ఆహారం కోసం బయటకు వెళ్తుంది. అనుకోకుండా ఉద్ధృతంగా వచ్చిన సముద్రపు అలల తాకిడికి ఆ గుడ్లు సముద్రంలోకి జారిపోతాయి. తిరిగివచ్చిన టిట్టిభ పక్షికి తన గుడ్లు కనిపించకపోయేసరికి తీవ్రమైన మనోవేదన కలుగుతుంది. లోకం వెలుగు చూడకుండానే కన్నుమూసిన తన బిడ్డల్ని తలుచుకుని ఎంతో దు:ఖించింది. ఎలాగైనే సరే సముద్రం నుంచి తన గుడ్లు బయటకు తీసుకురావాలనుకుంది. తన ముక్కుతో సముద్రపు నీటిని పీల్చి ఒడ్డున వదిలిపెట్టింది. ఇలా సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తోడేస్తే తన గుడ్లు బయటకు వస్తాయని ఆ పిట్ట ఆలోచన. ఓ బుల్లి పిట్టకు సముద్రపు నీరంతా తోడటం సాధ్యమయ్యే పనేనా? పిట్టకు మాత్రం ఈ ఆలోచన రాలేదు. నీరు తోడుతూనే ఉంది. సాటి పక్షులు ఇదంతా చూశాయి. కొన్ని పక్షులు నిరాశపరిచాయి. మరికొన్ని తోటి పిట్టకు సాయం చెయ్యాలని తామూ నీరు తోడటం ప్రారంభించాయి. క్రమంగా వందలాది పక్షిజాతుల నుంచి వేలాది పక్షులు ఈ పనికి జతకూడాయి.క్రమంగా ఈ విషయం పక్షిరాజు గరుత్మంతుడి వరకూ వెళ్ళింది. రాజాజ్ఞతో లక్షలాది పక్షులు సముద్రపు నీరు తోడటం ప్రారంభించాయి. తన తీరంలో జరుగుతున్న ఈ అల్లకల్లోలాన్ని సముద్రుడు గుర్తించాడు. విషయం తెలుసుకుని, తన గర్భంలో ఉన్న గుడ్లను తీసుకువచ్చి లకుముకి పిట్టకు అందించాడు. పిట్ట చిన్నదే. సంకల్పం గొప్పది. అందుకే లకుముకి పిట్ట సంకల్పం ముందు సముద్రుడే తలవంచాడు. సంకల్పశక్తికున్న ఘనత ఇది. ఆధ్యాత్మిక సాధకులకు టిట్టిభపక్షి వంటి సంకల్పం ఉండాలని శాస్త్రాలు చెప్పే కథ ఇది.

 సత్సంకల్పం... సత్ఫలితం

          మనిషికి ఉండే బలం రెండు రకాలుగా ఉంటుంది.ఒకటి పశుబలం. రెండోది సంకల్పబలం. మనం తీసుకునే భోజనం భౌతికశక్తిగా మారటం ద్వారా వచ్చేది పశుబలం. జ్ఞానశుద్ధి వల్ల కలిగేది సంకల్పబలం. దీని ముందు పశుబలం ఎప్పుడూ ఓడిపోతుంది.

          సత్సంకల్పం వల్ల ఎల్లప్పుడూ సత్ఫలితాలే కలుగుతాయి. తన పూర్వీకులైన సగరులకు శాపవిమోచనం కలిగించాలనే సంల్పంతో భగీరథుడు చేసిన తీవ్రమైన ప్రయత్నం వల్ల దేవలోకం నుంచి గంగాదేవి భూమ్మీదకు వచ్చింది. దీంతో సగరులే కాదు... నేటికీ కోట్లాది ప్రజలు గంగాస్నాన ఫలితంగా తమ జన్మలు తరింపజేసుకుంటున్నారు. ఉత్తముడైన వ్యక్తి చేసిన సంకల్పానికున్న శక్తి అది.

 ----IIIII----

 రచన: 

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ,  ఆంధ్రోపన్యాసకులు,  ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌,

గాంధీనగర్‌, విజయవాడ-3. సెల్‌ : 90320 44115 / 8897 547 548





సంకల్పబలం గురించి ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ  (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం 

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...