Showing posts with label భీష్ముడు. Show all posts
Showing posts with label భీష్ముడు. Show all posts

Thursday, February 3, 2022

భీష్మసందేశం (భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్తగిరి పత్రిక, ఫిబ్రవరి 2022 సంచికలో రాసిన వ్యాసం)

 

భీష్మసందేశం
(భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్తగిరి పత్రిక, ఫిబ్రవరి 2022 సంచికలో రాసిన వ్యాసం)





          భీష్ముడు - ఈ మాట వినగానే మహత్తరమైన ఆవేశం మనల్ని అవహిస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నరాలు బిగుసుకుంటాయి. శరీరం చైతన్యవంతమవుతుంది. అనంతమైన ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. భీషణమైన ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రతిజ్ఞ కోసం జీవిత సర్వస్వాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి ఆదర్శ జీవితం మనోఫలకంపై కదలాడుతుంది. ఒక్క మాటకే... అదీ ఒక్క పేరుకే ఇంతటి ఘనత ఉందా? అంటే ఉందని రొమ్మువిరుచుకుని సగర్వంగా చెప్పవచ్చు. శీలం, నీతి, నిష్ఠ, ధర్మం, ఆచారం... ఒకటేమిటి అనంతమైన సగుణ సంపదలో భీష్ముడికి సాటి భీష్ముడే. తర్రడి కోసం రాజ్యాన్ని, రాజ్యసుఖాన్ని మాత్రమే కాదు... చివరకు తనకంటూ సొంత జీవితాన్ని కూడా లేకుండా త్యాగం చేసిన త్యాగమూర్తి ఆయన. ఇరవైఒక్క సార్లు యావద్భూమండలం పర్యటించి క్షత్రియుడనే పేరు వినపడకుండా రాజలోకాన్ని జయించిన పరశురాముడిని నిలువరించిన ఘనత కూడా భీష్ముడికి మాత్రమే దక్కింది. ఇటువంటి పాత్ర మరొకటి భారతంలో కనిపించదు. కనీసం ఆ ఛాయల్లోకి కూడా మరొకరు రారు.

            తిక్కన సోమయాజి కూడా మహోగ్రశిఖర ఘన తాళ తరువగు సిడము వాడు’ ` అంటూ బృహన్నల (శాపం అనుభవిస్తున్న అర్జునుడిచేత ఉత్తర గోగ్రహణ సందర్భంలో) చేత భీష్ముని ఔన్యత్యాన్ని ప్రశంసింపజేస్తాడు. భీష్ముని రథ పతాకం మీద తాళ (తాటి) వృక్షం చిత్రించబడి ఉంటుంది. రథపతాకం రథి హృదయానికి ప్రతీక. నిటారుగా నిలబడి సర్వోన్నతంగా కనిపించే తాళవృక్షంలా వందలాది పాత్రలున్న మహాభారతంలో ఎవరికీ అందనంత సమున్నత గుణశ్రేణితో అందరిచేతా తాతా! అంటూ గౌరవాన్ని అందుకున్న ఒకే ఒక వ్యక్తి భీష్ముడు.

భీష్ముడు కాదు... భీష్మాచార్యుడు

            మహాభారతంలోనే యయాతి ఉపాఖ్యానంలో భీష్ముని మాదిరిగా తండ్రి కోసం వృద్ధాప్యాన్ని అనుభవించిన పూరుని ప్రస్తావన ఉంది. అయితే పూరుడు తండ్రి అడిగాడు కాబట్టే.... అదికూడా కొంతకాలమే వృద్ధాప్యాన్ని అనుభవించాడు. కానీ, భీష్ముడు అలాకాదు. తండ్రి అయిన శంతనమహారాజు అతడిని మాట మాత్రం కూడా అడగలేదు. కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అలాగని, భీష్ముడు వదిలిపెట్టలేదు. తండ్రి చింతకు కారణం ఏమిటో కనుక్కున్నాడు. దాసరాజు దగ్గరకు వెళ్ళాడు. అతడి సందేహాలన్నీ తీర్చాడు. తండ్రి కోసం రాజ్యాన్నే కాదు.. చివరకు తన సంసార సుఖాన్ని కూడా త్యాగం చేశాడు. తనకు వారసులు లేకుండా చేసుకున్నాడు. యావత్ప్రపంచంలో ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి, చేసిన ప్రతిజ్ఞను చివరి ఊపిరి వదిలే వరకు ఆచరించిన వ్యక్తి మరొకరు లేరు. తన తమ్ములు చనిపోయిన తర్వాత, తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయటానికి కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించినా ప్రతిజ్ఞాభంగం చెయ్యటానికి ఏమాత్రం అంగీకరించలేదు. అందుకనే దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. కాదు...కాదు... భీష్మాచార్యుడు (ఆచరించి చూపించే వారిని ఆచార్యులు అంటారు) అయ్యాడు.

            ఆచార సంప్రదాయాలు పాటించటంలో, ధర్మాచరణలో భీష్మునికి సాటి రాగల పాత్ర కూడా మరొకటి కనిపించదు. భీష్ముడు ధర్మాన్ని ఎంతటి కఠినమైన పరిస్థితుల్లో ఆచరించేవాడనటానికి ఉదాహరణ భారతయుద్ధ సందర్భంలో కనిపిస్తుంది. శాస్త్రవిహితమైన సంధ్యావందనం, సూర్యునికి అర్ఘ్యప్రదానం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేవాడు కాదు భీష్ముడు. యుద్ధం చేస్తున్నా కూడా సంధ్యాసమయంలో ఆగి, సూర్యోపాసన చేసి, నీరు దొరకకపోతే యుద్ధభూమిలోని ఇసుకతోనే అర్ఘ్యప్రదానం (ఇదేవిధంగా కృష్ణుడు కూడా యుద్ధరంగంలో ఇసుకతోనే అర్ఘ్యప్రదానం చేశాడు. కానీ, ఆయన పరమాత్మ. జీవాత్మలను ఉద్ధరించటానికే తప్ప ఆయనకు కర్మాచరణ చెయ్యాల్సిన అవసరం లేదు) చేసిన ఒకే ఒక వ్యక్తి భీష్ముడు. అదీ ధర్మం పట్ల, ధర్మాచరణ పట్ల  ఆయన ఆచరించిన చూపించిన అంకితభావం. అందుకే కేవలం భీష్ముడిగా మిగిలిపోలేదు. భీష్మాచార్యుడయ్యాడు.

అఖండమైన కృష్ణభక్తి

            భీష్ముడు అనగానే ఇతరులకు ఊహించటానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి, చాకచక్యం, ధర్మనిష్ఠ, రాజభక్తి గుర్తుకువస్తాయి. వీటన్నిటితో పాటు మరొక కోణం కూడా భీష్మునిలో ఉంది. అదే... అచంచలమైన కృష్ణభక్తి. కేవలం కారణమాత్రంగానే పరమాత్మ భౌతికరూపంలో కృష్ణుడుగా అవతరించాడని ఎరిగిన అతి కొద్దిమంది భక్తాగ్రేసరుల్లో భీష్ముడు ఒకడు. అయితే, ఇతరుల మాదిరిగా భీష్ముడు ఎక్కడా బాహాటంగా తన కృష్ణభక్తిని ప్రకటించలేదు. కేవలం ఒకే ఒక సందర్బంలో... అదీ యుద్ధభూమిలో ఉండగా, తాను నమ్మినదైవమైన పరమాత్మే స్వయంగా తనను చంపుతానని చక్రం చేపట్టినప్పుడు అంతకంటే తనకు కావలసింది ఏమున్నదంటూ పరమాత్మకు సాగిలపడతాడు.

సీ॥               కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి

                                                గగన భాగంబెల్ల గప్పికొనగ

                        నుఱికిన నోర్వక యుదరంబులోనున్న

                                                జగముల ప్రేగున జగతి కదల

                        జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున

                                                బైనున్న పచ్చని పటము జాఱ

                        నమ్మితి నాలావు నగుబాటు సేయక

                                                మన్నింపుమని క్రీడి మఱల దిగువ

తే॥                         గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి

                                    నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు

                                    విడుమర్జున యనుచు మద్విశిఖ వృష్టి

                                    దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు

            శ్రీకృష్ణుని విశ్వవ్యాపకునిగా, అణువణువులో నిండిన పరమాత్మగా దర్శించాడు భీష్ముడు. నన్ను చంపుతానని స్వయంగా చక్రం చేపట్టిన పరమాత్మే నాకు దిక్కు అంటూ మొక్కుతాడు. అదీ భీష్ముని కృష్ణభక్తి. భీష్ముని పాత్ర ద్వారా లోకానికి అందిన నీతి.

అంపశయ్యపై ధర్మబోధ

            భారతయుద్ధంలో మొదటి అంకం పూర్తయింది. భీష్ముడు అంపశయ్యపైకి చేరాడు. ఎంతటి ప్రజ్ఞ, ధర్మచింతన కలిగిన వాడైనా కొన్ని సందర్భాల్లో నోరు మెదపకుండా, ధర్మానికి గ్లాని జరుగుతున్నా చూసి ఊరుకున్న కారణంగా వచ్చిన దోషాన్ని పోగొట్టుకోవటానికే అంపశయ్యపై పడుకున్నాడు. నిజానికి స్వచ్ఛంద మరణశక్తి ఉన్నా పునరావృత్తి రహితమైన మోక్షాన్ని అందుకోవాలంటే చేసుకున్న పాపం పూర్తిగా నశించాలి. అందుకే అంపశయ్యపైకి చేరాడు. తన బాణాల ధాటికి కృష్ణుడు కూడా తట్టుకోలేకపోయాడని యుద్ధభూమిలోనే అన్న అహంకారం భీష్మునిలో ఉంది. అంపశయ్యపైకి చేరటం ద్వారా ఆ అహంకారం నశించింది. దైవబలం ముందు భుజబలం అణిగి ఉండాలని అర్థమైంది.

            ఇప్పుడతడు పూర్తిగా దైవచింతనలో, అహంకార మమకారాలకు, అరిషడ్వార్గాలకు, లౌకికబంధాలకు అతీతుడయ్యాడు. అందుకే కృష్ణపరమాత్మ నీ బిడ్డలకు ధర్మబోధ చెయ్యవయ్యా అని అంపశయ్య మీద ఉన్న భీష్మునికి చెప్పాడు. స్వామీ! నువ్వే చెప్పవచ్చు కదా! అంటాడు భీష్ముడు. ఆచరించిన అనుభవజ్ఞుడు చెబితేనే ధర్మానికి విలువ. అందుకే నీ చేత చెప్పిస్తున్నాను అన్నాడు పరమాత్మ. సరే!నన్నాడు భీష్ముడు.

            అదొక దివ్యముహూర్తం. తరతరాల పాపాలను క్షయం చేసే విష్ణుసహస్రనామ స్తోత్రం లోకానికి అందింది. వెయ్యి నామాల్లో అనంతుని అనంతశక్తిని వివరించాడు భీష్ముడు. ఎన్ని యుగాల నాటి మాట ఇది. కాలప్రమాణాలకు అందని చిరపురాతనమైనా అధునాతన ప్రపంచంలోనూ భీష్మకృతమైన విష్ణుసహస్ర నామ స్తోత్రానికి వెలుగు తగ్గలేదు. సకల పాపహారిణిగా ఇప్పటికీ మానవుల్ని తరింపజేస్తోంది. ఈవిధంగా విష్ణు సహస్రనామాలను అందించి, తాను తరించటం మాత్రమే కాదు... తనతోటి వారిని, తన సమాజాన్ని ... చివరకు తన లోకాన్నే పావనం చేయించిన అగణిత పుణ్యశీలి భీష్మపితామహుడు.

            కేవలం విష్ణు సహస్రనామ స్తోత్రం మాత్రమే కాదు... మహాభారతంలోని శాంతి, అనుశాసనిక పర్వాలు పూర్తిగా భీష్ముడు చేసిన బోధలతో నిండిఉంటాయి. జీవితపు చివరిక్షణంలో సమాజ ఉద్ధరణ గురించి ఆలోచించిన దార్శనికుడు భీష్మాచార్యుడు.

భీష్మాష్టమి

            మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకాలుగా ప్రసిద్ధిపొందాయి. భారతయుద్ధం సమయంలో క్షతగాత్రుడైన భీష్ముడు దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టపడడు. ఆయనకు స్వచ్ఛందమరణం పొందే వరం ఉంది. కాబట్టి ఉత్తరాయణం వచ్చే వరకూ అంపశయ్యపై పరుండి ఉండి మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజుల్లో రోజుకొక ప్రాణాన్ని విడిచిపెట్టాడు. కాలనిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, కాలమాధవీయం తదితర గ్రంథాలు కూడా మాఘ శుద్ధ అష్టమిని భీష్మ నిర్యాణదినంగా చెబుతున్నాయి.

            పద్మపురాణం హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడిరది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభం తెలుపుతున్నది. కృత్యసార సముచ్చయాధారంగా భీష్మాష్టమి శ్రాద్ధదినం. భీష్మ ద్వాదశి వ్రతం ప్రారంభించేది కూడా ఈ రోజే అని నిర్ణయ సింధువు స్పష్టపరుస్తున్నది. భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది. ‘’వైయాఘ్య్రసద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయవర్మణే వసూ రామావతారాయ శంతనోరాత్మజాయచ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రాహ్మచారిణే’’. అంటూ ఈ రోజున భీష్ములకు తర్పణం విడవాలని చెబుతారు. ఈ తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుంది.

జీవన సందేశం

            ఎప్పుడూ మారిపోతూ ఉండే మన ఆలోచనలు, ఇంద్రియాల అనుభవాలు అనే వాటి వెనుక మారకుండా ఉండే చైతన్యం తాలూకూ ఏకత్వమే అహంకారం. నేను ఆలోచిస్తున్నాను’, ‘నేను రాస్తున్నాను’, ‘నేను చూస్తున్నాను’, ‘నేను వింటున్నాను’, ‘నేను బాధపడుతున్నాను’, ‘నేను సుఖిస్తున్నానుఅనే రకరకాల మార్పుల వెనుక వాటన్నిటికి కర్తగా అహంకారం ఉంటుంది.

            ఈ ఆలోచనలన్నిటికీ యజమాని నేనుఅనే భావన. నేనువేరు, ఆలోచనలు వేరు. కళ్ళు చూడలేనప్పుడు కళ్ళను మాత్రమే గుడ్డి అనకుండా నేను గుడ్డివాడినిఅని గుడ్డి తనాన్ని తనకు ఆపాదించుకోవటం తప్పే కదా? కళ్ళు నాశనమైపోయినంత మాత్రాన మనం నాశనం కావాల్సిన అవసరం లేదు. కానీ, లౌకిక మాయ కారణంగా ప్రతి వ్యక్తీ అనుభవాన్ని, అనుభవించేవాడిని కలిపి ఒకటే భావనలో చూస్తుంటాడు. ఇదంతా అహంకారం వల్ల పుడుతుంది. ఈ అహంకారం నాశనమైపోవాలంటే కళ్ళు మూసుకుని, చూపుని లోపలికి తిప్పి, అక్కడ ఉన్న మహాచైతన్యాన్యం మీదే దృష్టి నిల్పి, తదేకంగా ధ్యానం చెయ్యాలి. అలా ధ్యానం చేస్తూ చేస్తూ చివరకు ఆ చైతన్యంలోనే లీనమవ్వాలి. భీష్ముడు చేసింది అదే. శ్రీకృష్ణపరమాత్మని ఎదురుగా చూస్తూ, ఆ మూర్తిని ధ్యానపథంలో ఉంచుకునే ప్రాణాలు వదిలిపెట్టాడు. అంటే ఆంతరిక చైతన్యంలో జీవచైతన్యాన్ని లయం చేశాడు. ఇలా జరగాలంటే అహంకారం నశించాలి. ఇందుకు ధ్యానం ఒక్కటే మార్గం. అంపశయ్యపై ఉండి కూడా నిరంతర ధ్యానంతో పరమాత్మలో లీనమైన భీష్మ నిర్యాణ ఘట్టం మానవాళికి అందించే సందేశం ఇదే. అందుకే తరాలు మారినా, యుగాలు గడిచినా భారతజాతి భీష్మపితామహునికి ఋణపడి ఉంటుంది. ఆయన్ను తమ జాతి నాయకుడిగా సగర్వంగా ప్రకటిస్తుంది.

---------------------------

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548

----------------------------------------







ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...