Thursday, July 18, 2019

పంచసూక్తాల్లోని వైజ్ఞానిక, ఆధ్యాత్మిక విశేషాలు వివరించే వ్యాసం

పంచసూక్తాల్లోని వైజ్ఞానిక, ఆధ్యాత్మిక విశేషాలతో 
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ) 
ఈనాడు దినపత్రికలో రాసిన వ్యాసం 


పంచ సూక్తాత్మకం!

ఈ సకల విశ్వం పాంచభౌతికం...సర్వాన్నీ సృష్టించి, నిర్వహించే పరమాత్మను దర్శించడానికి రుషులు తపించారు. మహా పురుషుని అర్థం చేసుకుని ఆరాధించాలని ఆరాటపడ్డారు. ఆ విరాణ్మూర్తిపై వారి భక్తి ప్రపత్తులు, ప్రాకృతిక శక్తులపై వారి అవగాహనను క్రోడీకరిస్తే సూక్తాలయ్యాయి. మానవాళికి వేదాంత సూత్రాలయ్యాయి.
    సూక్తం అంటే మంచిమాట. ‘బాగా చెప్పింది’ అనే అర్థం కూడా ఈ పదానికి ఉంది. సమగ్రంగా నిరూపణ చేయడాన్ని కూడా సూక్తం అని అంటారు. ఈ అర్థాలన్నిటినీ సమన్వయం చేస్తే మనిషిని తీర్చిదిద్దే సమున్నతమైన మార్గదర్శకత్వ బోధన సూక్తం అని చెప్పొచ్చు. ప్రకృతి పరిణామక్రమం, దానిపై మనిషికి ఉండాల్సిన అవగాహన, చేయాల్సిన పనులు, చేయకూడని చర్యలు, సాధించాల్సిన అద్వైతభావన మొదలైన విషయాలన్నిటినీ వేదాల్లోని సూక్తాలు వివరిస్తాయి. భక్తుడి మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉండడానికి, పరమాత్మ మీద లగ్నం కావటానికి భారతీయ రుషులు ప్రతిపాదించిన ప్రాథమిక సూచన వేద సూక్త పఠనం. నిజానికి ఇవి వేదాల్లో ఒకే చోట, ఒకే మంత్రభాగంగా ఉండవు. విభిన్న భాగాల నుంచి గ్రహించిన మంత్రాలతో సూక్తం తయారవుతుంది. వేదంలో చెప్పిన కొన్ని పరమ ప్రామాణికమైన అంశాలు, మనిషికి అత్యవసరంగా అందాల్సిన సందేశాన్ని గ్రహించి మహర్షులు చేసిన క్రోడీకరణే సూక్తాలు. నాలుగు వేదాల్లో వందలాదిగా ఉన్న సూక్తాల్లో పురుషసూక్తం, శ్రీసూక్తం, నారాయణసూక్తం, భూ, నీలాసూక్తం... పంచసూక్తాలుగా ప్రసిద్ధిపొందాయి.

పురుష సూక్తం
‘పురుష’ అనే పదానికి భగవంతుడు అని అర్థం చేసుకోవాలి. విశ్వానికి మూలశక్తి అయిన విరాట్పురుషుడి స్వరూప, స్వభావ వర్ణన, విశ్లేషణ ఈ సూక్తంలో ప్రధానాంశాలుగా ఉంటాయి.  సాధారణభావనలో మనం ఊహించుకునే విష్ణుమూర్తి, పురుషసూక్తం ప్రకటించే నారాయణుడు ఇద్దరూ వేర్వేరు. ఈయన త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణువు కన్నా పూర్వమే ఉన్నాడు. విశ్వం ఆవిర్భావానికి ఇతనే మూలకారణశక్తి.
ఓం తచ్ఛంయో రావృణీమహే
గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే...
అనే ప్రసిద్ధ మంత్రంతో పురుషసూక్తం ప్రారంభమవుతుంది. ఇందులో సకల దేవతల స్వరూపంగా విరాజిల్లే విరాట్పురుషుడి వైభవాన్ని శ్లాఘిస్తారు. భగవంతుడి సంకల్పంతోనే సృష్టి జరుగుతుందని, ఈ సృష్టి కార్యమంతా ఓ యజమని చెబుతుంది.దానికి కారకులైన వారికి, ఈ యజ్ఞాన్ని నిర్వహించేవారికి, ఇందులో భాగం తీసుకున్న ప్రతి ఒక్కరికీ చివరకు పశు పక్ష్యాదులతో సహా ప్రతి ప్రాణికీ శుభం కలగాలని ఆశిస్తూ పురుష సూక్తం ఆరంభమవుతుంది.
సబ్రహ్మః, సశివః, సహరిః - అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే హరి అంటుంది పురుషసూక్తం. అమ్మవారి ఆలయమైనా, శివాలయమైనా, విష్ణ్వాలయమైనా పూజించే దేవుడు ఎవరైనా సరే అన్ని ఆలయాల్లోనూ మంత్రపుష్పంలో చెప్పే పురుషసూక్త భాగం ఇది. దైవశక్తి అంతటా నిండి ఉందనే అద్వైతభావాన్ని పురుషసూక్తం ప్రబోధిస్తోంది. విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ చైతన్యం ఒక్కటే. దాన్ని ఎవరు ఏ శక్తిగా భావించి పూజిస్తారో ఆ శక్తిరూపంలోనే ఆ చైతన్యం వ్యక్తమవుతుందనే విషయాన్ని పురుషసూక్తం విస్పష్టంగా ప్రకటిస్తుంది. అద్వైతభావనకు పురుషసూక్తం పునాదిగా నిలుస్తుంది.
ఎక్కడ ఉంది?
రుగ్వేదం పదోమండలంలో ఈ సూక్తం ఉంది. కృష్ణయజుర్వేదం అరణ్యకం, 3వ ప్రపాఠకంలో, 12వ అనువాకంలో కూడా పురుషసూక్తం కనిపిస్తుంది. యజుర్వేదంలో ‘నారాయణ ఉపస్థాన మంత్రం’, ‘ఉత్తర నారాయణ అనువాకం’ పేర్లతో ఈ సూక్తాన్ని పేర్కొన్నారు.

నారాయణ సూక్తం
పురుషసూక్తం విశ్వవ్యాప్తమైన విరాట్‌ స్వరూపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, నారాయణుడిగా ప్రకటించింది. నారాయణసూక్తం ఆ పరబ్రహ్మాన్ని నారాయణ స్వరూపంలోనే పూర్తిగా విశదీకరించింది. ఈ సూక్తంలో ప్రధానంగా రెండు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో భగవంతుడి మహిమ ప్రకటితమవుతుంది. రెండో భాగంలో ఆ భగవంతుడిని ఎలా, ఏవిధంగా, ఎక్కడ ధ్యానం చేయాలో, మనస్సును ఎలా లగ్నం చేయాలో వివరణత్మాకంగా ఉంటుంది.
నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః
విశ్వమంతా  జ్యోతిస్వరూపంగా నిండి ఉన్నవాడు నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ. నారాయణుని ధ్యానం చేసేవారిలో శ్రేష్ఠుడు నారాయణుడే అంటుందీ సూక్తం. సర్వోన్నతమైన ప్రతి అంశంలోనూ నారాయణ అంశను, నారాయణ తత్త్వాన్ని దర్శించడం ఇందులో ప్రధాన విషయం. ప్రపంచానికి లోపల, బయటా, కనిపించేదీ, వినిపించేదీ కూడా నారాయణుడే.
సముద్రేంతం విశ్వశంభువం... పద్మకోశ ప్రతీకాశగ్‌ం హృదయంచాప్యధోముఖం..’
సముద్రానికి అవతల భగవంతుడు ఉంటాడని ఈ మంత్రభాగానికి అర్థం. ఇక్కడ సముద్రమంటే సంసారసాగరం అని అర్థం చేసుకోవాలి. కోరికలు, భావోద్వేగాలనే అలలతో సంసార సాగరం ఎప్పుడూ కల్లోలంగా ఉంటుంది. సాధకుడు వీటిని అదుపులో ఉంచుకోవాలి. ఇది జరిగితే ధ్యానంలో మనస్సు లగ్నమవుతుంది. అంతిమంగా ఆ అనంతుడి సాక్షాత్కారాన్ని మనస్సు పొందుతుంది.
ఎక్కడుంది?
కృష్ణయజుర్వేదం అరణ్యకభాగం... నారాయణోపనిషత్తు, 13వ అనువాకంలో...

శ్రీసూక్తం
    శ్రీ అంటే సంపద, లక్ష్మి అనే అర్థాలు ఉన్నాయి. పరమాత్మ అనంతమైన శక్తుల్లో లక్ష్మీశక్తి ఒకటి. జగత్తును పోషించేందుకు ఈ శక్తి చాలా అవసరం.
    ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్‌ / చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.. శ్రీసూక్తంలో తొలి మంత్రమిది.
    ఇక్కడ లక్ష్మి అంటే మనం చూసే లౌకిక సంపద కాదు. ఎప్పటికీ తొలగిపోని, తరిగిపోని జ్ఞాన సంపదే అసలైన లక్ష్మి. యజ్ఞానికి ముఖ్యదేవత అగ్ని. ఇతని ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. అగ్ని జ్ఞానానికి సంకేతం. అగ్ని ద్వారా లక్ష్మిని ఆహ్వానించడం అంటే జ్ఞానసంపదను ఆరాధించడమే.  ఈ భావాన్ని కొనసాగిస్తూ శ్రీసూక్తంలోని రెండో మంత్రం ‘లక్ష్మీం అనపగామినీం’ అంటుంది. అంటే ఎప్పటికీ తొలగిపోని లక్ష్మి కావాలని కోరుకుంటాడు భక్తుడు. ఎప్పటికీ తొలగిపోని సంపద తత్త్వజ్ఞానం. తనను తాను తెలుసుకునే ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానాన్నివ్వాలని లక్ష్మీస్వరూపంలో ఉన్న ప్రకృతిస్వరూపిణికి భక్తుడు శ్రీసూక్తం ద్వారా విన్నవించుకుంటాడు.
    ‘అలక్ష్మీర్నాశయామ్యహం..’ అంటుంది శ్రీసూక్తంలోని మరో మంత్రం. నాలోని అలక్ష్మి నశించిపోవుగాక అని భక్తుడు కోరుకుంటాడు. అలక్ష్మి అంటే సాధారణ అర్ధంలో సంపద లేకపోవటం, దారిద్య్రాన్ని అనుభవించడం అవుతుంది. కానీ, ఇక్కడ వేరు. మనిషిలో ఉండే దుర్గుణాలన్నీ అలక్ష్మికి ప్రతిరూపాలే. అవన్నీ తొలగిపోవాలని కోరుకుంటాడు భక్తుడు. ఎప్పుడైతే దుర్గుణాలు తొలగిపోతాయో అప్పుడు మిగిలేది అనంతమైన జ్ఞానలక్ష్మి మాత్రమే. ఈ భావాన్ని కొనసాగిస్తూ శ్రీసూక్తంలో మరో చోట దారిద్య్రాన్ని ధ్వంసం చేయాలని భ¡గవతిని భక్తుడు వేడుకుంటాడు. భావదారిద్య్రాన్ని కలగకుండా ఉండేలా అనుగ్రహించమని భగవంతుణ్ణి కోరుకోవడం శ్రీసూక్తం ప్రకటిస్తున్న ప్రధానాంశం.
ఎక్కడుంది?
శ్రీ శక్తిని ఆరాధించే ఈ మంత్ర భాగం రుగ్వేదంలో కనిపిస్తుంది.

భూసూక్తం
మనిషి ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చాడు. ఇక్కడ అతడు నిలబడటానికి భూమి ఆధారంగా నిలిచింది.  ఎదగటానికి అవసరమైన అన్ని పదార్థాలను భూమాతే  ఇచ్చింది. చివరగా భౌతికమైన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దాన్ని కూడా తనలోనే కలిపేసుకుంటుంది.  అందుకే భూమిపై మనిషికి కృతజ్ఞత తప్పనిసరిగా ఉండి తీరాలి. భూమి చూపిస్తున్న ఉదారతకు, ఆమెను దైవంగా ఆరాధించాలనే భావనను కలిగించే వేద మంత్ర భాగమే భూసూక్తం.
    యత్‌ తే మధ్యం పృథివి యచ్చ నభ్యం యాస్త ఊర్జస్తన్వః సంబభూవుః తాసు నోధే హ్యభినః పవస్వ... మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః పర్జన్యః పితాన ఉనః పిపర్తు... ’ భూమిని తన తల్లిగా, తనను భూమి పుత్రుడిగా భావించాల్సిన కర్తవ్యాన్ని మనిషికి ఈ మంత్రం సదా గుర్తుచేస్తుంది. వైదిక సంప్రదాయంలో భూమిని కేవలం నివాసయోగ్యతను కలిగించిన జడరూపమైన పదార్థంగా భావించలేదు. భూమితో ఒకవిధమైన అనుబంధాన్ని వేదం మనిషికి కలిగించింది. ఈ భూమిపై ఉన్న  ప్రతి మట్టికణంలో దివ్యత్వాన్ని దర్శింపచేసుకోవాల్సిన అవసరాన్ని వేదం ప్రకటిస్తుంది.
ఎక్కడుంది?
అధర్వణ వేదంలో, యజుర్వేదంలో ఈ మంత్ర భాగాలు కనిపిస్తాయి.

నీలాసూక్తం
సామవేదంలో ప్రస్తావించిన ‘స్తోమత్రయస్త్రింశం’ అనే హోమానికి సంబంధించిన మంత్రాలు ఈ సూక్తంలో ప్రధానాంశాలు. ఈ సూక్తంలో ఆకాశానికి సంబంధించిన అంశాలుంటాయి. భూమికి ఊర్ధ్వదిశలో ఉండే నింగి ప్రాణికోటి అవసరాలు ఎన్నిటినో తీరుస్తుంది. భూమికి, ఆకాశానికి మధ్య సంబంధం, సూర్యగమనం, దిక్కులకు సంబంధించిన ప్రస్తావన ఇందులో ఉంది. మన వాతావరణంలో అనేక వాయువులు ఉంటాయి. వీటిలో ప్రత్యేకించి ‘మాతరిష్వ’ అనే వాయువు గురించి నీలాసూక్తం ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. దీనికి దక్షిణ దిక్కు నుంచి వీచేగాలికి మాతరిష్వ అని పేరు. ప్రాణులను సంరక్షించే వాయువనే అర్థం కూడా ఉంది.ఈ సర్వవ్యాపకమైన వాయువును గురించి వివరణ ఇక్కడ కనిపిస్తుంది.
నీలాసూక్తంలో భూమిని విష్ణుపత్నిగా సంబోధిస్తుంది వేదం. ఇక్కడ విష్ణుపత్ని అంటే విష్ణువును పరిపాలకుడిగా కలిగినది అనే అర్థం చేసుకోవాలి. ప్రకృతిని సంరక్షించుకోవాలనే సందేశం అంతర్లీనంగా ఉంది.
ఎక్కడుంది?
కృష్ణయజుర్వేదం ఒకటో కాండ 7వ పన్నం, 10వ అనువాకంలో కొంతభాగం, 4 కాండ, 4వ పన్నంలో కొంతభాగం కలిపి నీలాసూక్తంగా మహర్షులు పేర్కొన్నారు.

ఇందులో సైన్స్‌ ఉంది...
మనిషికి అంతుచిక్కని రహస్యాల్లో సృష్టి క్రమం ఒకటి. ఈ సృష్టికి ఏది మొదలు? ఇందుకు కారణం ఎవరు? అనే ప్రశ్నలు చాలాకాలంగా మనిషిని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వీటికి సమాధానాలు చెబుతూ, అందులోని వైజ్ఞానిక కోణాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తుంది పురుషసూక్తం. సనాతన భారతీయ వేదవ్యవస్థలోని సమున్నతమైన వైజ్ఞానికతకు, తార్కికతకు ఈ సూక్తం చక్కటి ఉదాహరణ.

సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్‌
సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠర్దశాంగులం
పురుషసూక్తంలో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రభాగం ఇది. విశ్వావిర్భావానికి ముందే ఉన్న విరాట్పురుషుడికి వెయ్యి తలలు, వెయ్యి కళ్లు అంటుంది పురుషసూక్తం. ఇక్కడ సహస్రం అంటే వెయ్యి అనే అర్థం ఉన్నా ‘అనంతం’ అనే అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. అనంతమైన వ్యాపక స్వభావం కలిగిన వాడు పరమాత్మ. నిశ్చలంగా ఉన్న నీటి మీదకు చిన్నరాయి విసిరేస్తే తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలకు మొదటి స్థానం బిందువు. రాయి నీటికి తగిలిన చోట బిందువు ఏర్పడి, వ్యాకోచం చెంది తరంగాలుగా మారి, అవి వ్యాపకత్వాన్ని పొంది ఎలాగైతే ఆ నది లేదా తటాకం అంతా విస్తరిస్తాయో అదే క్రమంలో ఈ విశ్వసృష్టి క్రమం ఓ మహాబిందువు కేంద్రంగా జరిగింది. గణితపరంగా చూస్తే వృత్తం మీద ఉండే ప్రతి బిందువూ శీర్షమే. అలాంటి ఎన్నో శీర్షాల కలయికే వృత్తం. అనంతమైన శీర్షాలు కలిగినవాడు పరమ పురుషుడు అనటంలో కూడా ఆ మహానుభావుడి అనంతమైన వ్యాపకత్వ లక్షణం కనిపిస్తుంది. ఇలా ఎన్నో గణిత భావనలు పురుషసూక్తంలో కనిపిస్తాయి.

సహస్రశీర్షా పురుషః..  భావాన్ని గణితశాస్త్రంలో అన్వయిస్తే శ్రీచక్రం ప్రాథమిక రూపం ఏర్పడుతుంది.
    శ్రీచక్రం శక్తి స్వరూపం. లలితాదేవికి ప్రతిరూపం. ఈ రెండు భావనల్ని సమన్వయం చేస్తే ఎవరు విరాట్పురుషుడిగా ఉన్న నారాయణుడో ఆయనే దేవీ స్వరూపంలో ఉన్న మహాశక్తి అని అర్థమవుతుంది.
- కప్పగంతు రామకృష్ణ 

 


Friday, July 12, 2019

కుమారస్వామి లీలా విశేషాలతో శ్రీశైలప్రభ మాసపత్రిక జులై 2019 సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం




సైకాలజీలో ఉన్న విద్య, ఉద్యోగ అవకాశాల గురింఛి ఈనాడు దినపత్రికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం

ఓదార్చి.. సేదతీర్చి మనోబలాన్నిచ్చి!
కెరియర్‌ గైడెన్స్‌ - సైకాలజీ
సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే.. మానవ సంబంధాలు రోజు రోజుకీ సంక్లిష్టమవుతున్నాయి. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం... ఇలా జీవితంలోని ప్రతి దశలోనూ ఒత్తిడి, ఆందోళన. నిర్ణయాలు తీసుకోలేకపోవడం,  ప్రవర్తనపై నియంత్రణ కోల్పోవడం, ఏది సరైందో.. ఏది కాదో తేల్చుకోలేక బాధలతో నలిగిపోతున్నారు. ఒక్కోసారి జీవితాన్ని ముగించడానికి సిద్ధమైపోతున్నారు. ఇలాంటి వారిని ఓదార్చి, సేద తీర్చి, మనోధైర్యాన్ని నింపి మళ్లీ జీవితంపై నమ్మకం పెంచేవాళ్లే  మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఈ ఉదాత్తమైన ఉద్యోగాన్ని చేయాలంటే కొన్ని కోర్సులు చేయాలి. ఆధునిక సమాజంలో సైకాలజీ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది.
ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ కలిగి ఉండాలి. దాన్ని అందించేందుకు మనిషి ప్రవర్తన, మనస్తత్వాలను అధ్యయనం చేసి, విశ్లేషించి అవసరమైన పరిష్కారాలను సూచించే శాస్త్రమే సైకాలజీ. ఈ నిపుణులకు ఆదరణ పెరగటంతో యువతరం సంబంధిత కోర్సుల్లో చేరటానికి ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఆత్మవిశ్వాసం, ఉత్తమ భావవ్యక్తీకరణ, ఇతరులకు ప్రేరణ కలిగిస్తూ మార్గదర్శకులుగా వ్యవహరించే నేర్పు, ఓర్పు ఉన్నవారికి తగిన చదువులివి.
పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో సైకాలజీని ప్రధాన అంశంగా చదివినవారిని మనస్తత్వశాస్త్ర నిపుణులు అంటారు. ఈ శాస్త్రాన్ని వృత్తిగా చేసుకోవాలంటే క్లినికల్‌ లేదా కౌన్సెలింగ్‌ సైకాలజీలో ఎం.ఫిల్‌ లేదా పీహెడ్‌డీ చేసి ఉండాలి. పునరావాసం లేదా క్లినికల్‌ సైకాలజీలో ఎం.ఫిల్‌. లేదా పీహెచ్‌డీ చేసిన వారిని భారత పునరావాస మండలి అధికారికంగా గుర్తించి వారు సొంతంగా వృత్తి నిర్వహించుకోడానికి అనుమతిస్తుంది. మనస్తత్వశాస్త్ర నిపుణులకు మందులను సూచించే అర్హత లేదు. వైద్యశాస్త్రంలో పట్టా పొందిన తర్వాత డీపీఎం లేదా ఎండీ (సైకియాట్రీ) చేసినవారిని మనోవిజ్ఞానశాస్త్ర నిపుణులు అంటారు. వీరు మానసిక రుగ్మతలకు మందుల ద్వారా చికిత్స అందిస్తారు.
విభిన్న కోర్సులు
చైల్డ్‌ సైకాలజీ, క్లినికల్‌, కౌన్సెలింగ్‌, ఎడ్యుకేషనల్‌, పారిశ్రామిక మనోవిజ్ఞానశాస్త్రం, ఆరోగ్య మనస్తత్వశాస్త్రం... ఇలా అనేక విభాగాలు ఉన్నాయి. వాటిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎంఏ లేదా ఎంఎస్సీ స్థాయిలో వాటిని ఐచ్ఛికంగా ఎంచుకున్నవారికి ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
డిగ్రీ: బీఏ లేదా బీఎస్సీ సైకాలజీని డిగ్రీస్థాయిలో చదువుకోవచ్చు. దీనికి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు కాలవ్యవధి మూడు సంవత్సరాలు. రెగ్యులర్‌తో పాటు దూరవిద్యావిధానంలోనూ ఈ కోర్సు అందుబాటులో ఉంది. ప్రస్తుతం అన్ని విశ్వవిద్యాలయాలూ సీబీసీఎస్‌  (ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం) విధానంలో ఆరు సెమిస్టర్లుగా డిగ్రీ కోర్సును అందిస్తున్నాయి. వీటిల్లోకి నేరుగా ప్రవేశం పొందవచ్చు.
పీజీ: పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి కొన్ని యూనివర్శిటీలు ఎంఏ సైకాలజీ, మరికొన్ని యూనివర్శిటీలు ఎంఎస్సీ సైకాలజీ డిగ్రీ అందిస్తున్నాయి. వీటికి అదనంగా ఇంకొన్ని యూనివర్శిటీలు ఎంఎస్సీలో హెల్త్‌ సైకాలజీ, మెడికల్‌ సైకాలజీ, క్లినికల్‌ సైకాలజీ, అప్లైడ్‌ సైకాలజీ పేరుతో కోర్సుల్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు లేదా డిగ్రీలో సైకాలజీని ఒక సబ్జెక్ట్టుగా అధ్యయనం చేసినవారు ఈ కోర్సులో చేరవచ్చు. కాల వ్యవధి రెండు సంవత్సరాలు. రెగ్యులర్‌గా చదవాలంటే యూనివర్శిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. దూరవిద్యావిధానంలో అయితే ఎటువంటి ప్రవేశపరీక్ష లేకుండా నేరుగానే ఆయా కోర్సుల్లో చేరవచ్చు.
పీజీ డిప్లొమా: ఒక సంవత్సరం కాలవ్యవధి ఉండే రెగ్యులర్‌ కోర్సులోకి  పరీక్ష ద్వారా ఎన్‌సీఈఆర్‌టీ ప్రవేశం కల్పిస్తోంది. ఎంఏ లేదా ఎంఎస్సీలో కనీసం 55 శాతం మార్కులు పొందినవారు ఈ పరీక్ష రాయటానికి అర్హులు. దూరవిద్యావిధానం ద్వారా అనేక యూనివర్శిటీలు నేరుగా ప్రవేశాలను ఇస్తున్నాయి. స్కూల్‌ కౌన్సెలర్లుగా చేరాలంటే ఈ కోర్సు తప్పనిసరిగా చేయాలి.
పరిశోధన స్థాయిలో: రెండేళ్ల కాల వ్యవధి ఉండే  ఎం.ఫిల్‌లో క్లినికల్‌ సైకాలజీ చదవాలంటే భారత పునరావాస మండలి (ఆర్‌సీఐ) నిబంధనల ప్రకారం ఎంఏ లేదా ఎంఎస్సీ సైకాలజీ కోర్సు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. యూనివర్శిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలో మెరిట్‌ సాధించాలి. కోర్సు పూర్తిచేసిన తర్వాత ఆర్‌సీఐలో అధికారికంగా పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకుని సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు.
సైకాలజీ లేదా క్లినికల్‌ సైకాలజీలో పీహెచ్‌డీ చేయడానికి పీజీలో కనీసం 55 శాతం మార్కులతో పాటు యూనివర్శిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత పొందటం తప్పనిసరి. యూజీసీ నిర్వహించే నెట్‌్, జేఆర్‌ఎఫ్‌ల్లో అర్హత సాధిస్తే పీ‡హెచ్‌డీ…లోకి నేరుగా ప్రవేశం పొందవచ్చు. పీహెచ్‌డీ క్లినికల్‌ సైకాలజీలోకి మాత్రం యూనివర్సిటీలు ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు ఇస్తున్నాయి.

ఉపాధి అవకాశాలు
కేంద్రీయ మాధ్యమిక విద్యాసంస్థ (సీబీఎస్‌ఈ) గుర్తింపు పొందిన ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా మనస్తత్వశాస్త్ర నిపుణుడిని నియమించాలి. వీరికి శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయుడి హోదా ఇవ్వాలి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ నియమాల ప్రకారం విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటిన ప్రతి కళాశాలలో ఒక మనస్తత్వశాస్త్ర నిపుణుడిని నియమించాలి.దీని ప్రకారం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సైకాలజిస్టుల, సైకియాట్రిస్టుల అవసరం వేల సంఖ్యలో ఉంది.
పాఠశాలలు, కళాశాలల్లో కౌన్సెలర్లు, మానసిక వికలాంగుల పాఠశాలలు, వికలాంగుల పునరావాసకేంద్రాలు, చైల్డ్‌ గైడెన్స్‌ క్లినిక్‌లు, రక్షణ పరిశోధన సంస్థలు, వ్యక్తిత్వ వికాసకేంద్రాలు, వివాహ మంత్రణ కేంద్రాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, మానసిక ఆరోగ్య కేంద్రాలు, హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాలు, మార్కెటింగ్‌ విభాగాలు, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రాలు, ఒకేషనల్‌ గైడెన్స్‌ కేంద్రాల్లో సైకాలజీ అధ్యయనం చేసినవారికి ఉద్యోగావకాశాలున్నాయి.
విద్య, పారిశ్రామిక రంగాల్లో సైకాలజిస్టులకు నెలకు రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు జీతం చెల్లిస్తున్నారు. సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకుంటే ఇంతకన్నా ఎక్కువ సంపాదించే వీలుంది. విదేశాల్లోనూ వీరికి మంచి డిమాండ్‌ ఉంది.

అందిస్తున్న సంస్థలు
ఆంధ్ర, ఆదికవి నన్నయ, ఉస్మానియా, కాకతీయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు రెగ్యులర్‌ విధానంతో పాటు దూరవిద్య ద్వారా కూడా పీజీ సైకాలజీ కోర్సు అందిస్తున్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతతో వీటిలో చేరవచ్చు. కోర్సు కాలపరిమితి రెండేళ్లు.
* కృష్ణ విశ్వవిద్యాలయం, విజయవాడలోని ఎస్‌.ఆర్‌.ఆర్‌. కళాశాల నుంచి రెగ్యులర్‌ విధానంలో ఎంఎస్సీ సైకాలజీ కోర్సు అందిస్తోంది.హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం రెగ్యులర్‌ విధానంలో ఎంఎస్‌సీ హెల్త్‌ సైకాలజీ కోర్సు అందిస్తోంది. యోగి వేమన యూనివర్శిటీ రెగ్యులర్‌ విధానంలో ఎంఎస్‌సీ సైకాలజీ కోర్సు అందిస్తోంది. *ఉస్మానియా యూనివర్శిటీ ఆర్‌సీఐ అనుమతితో ఎం.ఫిల్‌ క్లినికల్‌ సైకాలజీ కోర్సు నిర్వహిస్తోంది.

- డాక్టర్‌ కె. రామకృష్ణ, విజయవాడ

Thursday, July 4, 2019

విష్ణు సహస్రనామ వైభవం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో రాసిన వ్యాసం


విష్ణు సహస్రనామ వైభవం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) 
ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో రాసిన వ్యాసం 



ఆయన విరాట్‌ పురుషుడు...చెట్టు, పుట్ట పక్షులు, జంతువులు... పంచభూతాల్లో ఉన్నది ఆ చైతన్యమే...మరి ఆ మహా చైతన్యం పేరేమిటి?.యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే చూసే చూపు, నిలిపే మనస్సు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడు. ఏ పేరుతో పిలిస్తే ఆ పేరు ఆయనదే. నిజానికి భగవంతుడికి ఉన్న పేర్లన్నీ ఆయా సమయాల్లో భక్తుల అనుభూతులకు అక్షరాకృతులే. అలా కురు యోధుడైన భీష్ముడి భగవత్‌ దర్శనమే విష్ణు సహస్రనామాలు...
           కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు రాజ్యాన్ని స్వీకరించారు. ఒకరోజున శ్రీకృష్ణుడు, పాండవులు ఏదో విషయంలో మాట్లాడుతూ ఉండగా, ఉన్నట్లుండి కృష్ణపరమాత్మ ఒక్క క్షణం మౌనం వహించాడు. ఏం జరిగిందా? అని అందరూ ఆందోళన చెందారు. వెంటనే కృష్ణుడు పాండవుల్ని తన వెంటతీసుకుని అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరకు తీసుకెళ్లాడు. భీష్ముడిని మించిన ధర్మవేత్త లేడు. అన్ని శాస్త్రాల్నీ వాటి అంతరార్థాలతో సహా తెలుసుకున్న జ్ఞాని. మనిషి తరించటానికి అవసరమైన అన్ని ఆధ్యాత్మిక మార్గాలు తెలిసిన వాడు. ఆయనకు అంత్యకాలం సమీపించింది. ఆయన కన్నా మిన్నగా ధర్మం గురించి చెప్పగలిగినవాడు లేడు. ఆయన ద్వారా ధర్మవిషయాలు తెలుసుకోండంటూ పాండవులకు చెప్పాడు కృష్ణుడు. బాణాల వల్ల శరీరమంతా గాయాలై, విపరీతంగా రక్తం కారుతూ అనేక బాధల్ని అనుభవిస్తూ ఉన్న నాకు శక్తినిచ్చి మరీ ఇవన్నీ ఎందుకు చెప్పిస్తున్నావయ్యా? నీవే పాండవులకు ధర్మం బోధించవచ్చు కదా? అంటూ భీష్ముడు కృష్ణుడిని అడుగుతాడు.అప్పుడు కృష్ణుడు ‘భీష్మా! నేను తత్త్వాన్ని. నువ్వు తత్త్వాన్ని అనుభవించినవాడివి. నువ్వు చెబితే అది అనుభవపూర్వకంగా చెప్పినదవుతుంది. భగవంతుడు సముద్రం వంటి వాడు. చాలా నీరు ఉన్నా అది తాగడానికి ఉపయోగించదు. అదే నీటిని మేఘం వర్షిస్తే ఆ నీరు తాగడానికి ఉపయోగిస్తుంది.భక్తి తత్త్వం కూడా ఇంతే. భగవంతుడి తత్త్వాన్ని జ్ఞానమార్గంలో అనుభవించి, తత్త్వాన్ని దర్శించిన భక్తుడు చెబితేనే భగవంతుడంటే ఏమిటో అందరికీ తెలుస్తుంది. అందుకే జ్ఞానబోధ చెయ్యటానికి నీవే అర్హుడివి’ చెప్పాడు పరమాత్మ.
భీష్ముడు  పాండవ అగ్రజుడి వైపు తిరిగి అడిగాడు...చెప్పు ధర్మనందనా...
తాతా...
కిమేకం దైవతం లోకే... లోకంలో ఒక్కడే అయి ఉన్న దేవుడు ఎవరు?
కిం వాప్యేకం పరాయణం... జీవితానికి పరమపదమైన గమ్యం ఏది?
స్తువంతః కం ప్రాప్నుయుః మానవాః శుభం... ఏ దేవుడిని స్తుతిస్తే శుభాలు కలుగుతాయి?
కం అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభం... ఏ దేవుడిని అర్చించటం వల్ల శుభాలు కలుగుతాయి?
కోధర్మః సర్వ ధర్మాణాం భవతః పరమో మతః... అన్ని ధర్మాల కన్నా గొప్పదైన ధర్మం ఏది?
కిం జపన్‌ ముచ్చతే జంతుః జన్మ సంసార బంధనాత్‌... ఏ దేవుడి నామాన్ని జపించటం వల్ల సంసారబంధాల నుంచి విముక్తి కలుగుతుంది?
నాకెన్నాళ్లుగానో ఉన్న సందేహాలు నీ ముందు ఉంచుతున్నాను...
సందేహపడుతూనే సందేహాలన్నీ భీష్ముడి ముందుంచాడు ధర్మరాజు
పరమాత్మను స్మరించుకుంటూ గొంతు సవరించుకున్న భీష్ముడు చెప్పడం ప్రారంభించాడు..
అ మాటలే మంత్రాలయ్యాయి.
ఆ నామాలు మానవాళికి కల్పతరువులయ్యాయి...
అవే పరమాత్మ విరాట్‌ స్వరూప వర్ణన. అర్జనుడికి భగవానుడు విశ్వరూపం చూపితే... భీష్ముడు వాటిని అక్షరీకరించి సహస్ర నామార్చన చేశాడు.

ఆయనకూ ఆశ్చర్యమే..
విష్ణు సహస్రం కేవలం భగవంతుడి స్తోత్రం మాత్రమే కాదు. అద్భుతమైన శబ్ద విజ్ఞాన కదంబం. సనాతన భారతీయ వ్యాకరణ విజ్ఞానవేత్తలు శబ్దాన్ని బ్రహ్మగా భావించారు. అంతకు మించిన దైవం లేదని చెప్పారు. అటువంటి శబ్దబ్రహ్మను ఉపాసన చేసేందుకు ఉత్తమమైన మార్గం విష్ణుసహస్రనామ స్తోత్రం. ఆదిశంకరాచార్యులు స్వయంగా విష్ణుసహస్రనామ స్తోత్రానికి భాష్యం రాశారు. ఈ నామాల్లోని అక్షర ఔచిత్యానికి ఎంతగానో అబ్బురపడ్డారు.
భాషాలంకారం:
విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం ఓ అద్భుతమైన లయ, తూగుతో నడుస్తుంది. శ్రుతి పాడుకునేందుకు ప్రతిశ్లోకం ఎంతో వీలుగా ఉంటుంది. ఎన్నో అలంకారిక వైవిధ్యాలు వీటిలో ఉన్నాయి. ‘సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః’;  ‘సువ్రతః సుముఖ సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్‌’ తదితర శ్లోకపాదాల్లోని పదప్రయోగాలు ఆశ్చర్యపరుస్తాయి. ఒకే పదాన్ని విభిన్న అర్థాల్లో, విభిన్న పదాల్ని ఒకే అర్థంలో ఉపయోగించే పదప్రయోగ వైవిధ్యాలు ఈ స్తోత్రంలో ఉన్నాయి. సనాతనమైన సంస్కృత భాష ఔన్నత్యాన్ని ఇవన్నీ ప్రకటిస్తాయి.
గీతం... గేయం
భగవద్గీత, విష్ణుసహస్రనామం... ఈ రెండూ మహాభారతంలోనివే. ఒకటి యుద్ధానికి ముందు జరిగింది కాగా రెండవది యుద్ధం తర్వాత జరిగింది. రెండూ శ్రీకృష్ణుడి సమక్షంలో జరిగినవే కావటం విశేషం.  యుద్ధప్రారంభంలో విచారగ్రస్తుడై ఉన్న అర్జునుడిలో చైతన్యాన్ని నింపి అతడిని కర్తవ్యం వైపు సముఖుడిని చేసింది గీత. యుద్ధం పూర్తయిన తర్వాత జిజ్ఞాసతో వచ్చిన ధర్మరాజుకు మోక్షమార్గాన్ని చూపింది సహస్రనామం. మానవజీవితంలోని రెండు ప్రధాన సన్నివేశాలకు గీత, గేయం మార్గదర్శనం చేస్తాయి. విష్ణు సహస్రనామస్తోత్రంలో ఉన్న వెయ్యి నామాల్నీ విభజిస్తే మొత్తం పదిశతకాలు అవుతాయి. ఒక్కో శతకం ఒక్కో అంశాన్ని బోధిస్తుంది. ఇదే ఆ శతకాల సారాంశం.
సహస్రం అంటే సాధారణంగా వెయ్యి (1000) అనే అర్థం స్ఫురిస్తుంది.  కానీ శంకరాచార్యులు ‘సహస్రం అనే మాటకు ‘అనంతం’ అనే అర్థం ఉంది. ‘సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్‌...’ అని వేదం చెబుతోంది. ఈ ప్రకారం విష్ణు సహస్రనామం అంటే విష్ణువుకు ఉన్న అనంతమైన నామాలు అని అర్థం ఏర్పడుతుందం’టూ వివరణ ఇచ్చారు.
విష్ణు సహస్రనామ పారాయణఏ సమయంలో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా  చెయ్యవచ్చు. అయితే ఏకాదశి తిథిలో, నిత్యం సాయం సంధ్యాసమయంలో ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
శివం... కేశవం:
శివుడే దైవం అని శైవులు, విష్ణువే పరమదైవం అని వైష్ణువులు భావిస్తారు. కానీ శివకేవశవులకు అభేదం ఉందనీ, ఒకే పరమశక్తికి ఉన్న రెండు భావనాత్మకమైన భౌతికరూపాలే శివకేశవులనే భావనను విష్ణు సహస్రం వ్యక్తీకరిస్తుంది. ‘సర్వః శివః స్థాణుః...’; ‘స్వయంభూః శంభురాదిత్యః...’; ‘ఈశ్వరో విక్రమీ ధన్వీ..’ వంటి శ్లోకాలన్నీ శివకేశవ అభేదాన్ని, అద్వైతమార్గాన్ని స్పష్టంగా ప్రకటిస్తాయి. శివుడని పిలిచినా, విష్ణువని కొలిచినా భక్తుల్ని కాపాడే పరమదైవం ఒక్కడే అనే భావనకు ఇవన్నీ ప్రతీకలుగా నిలుస్తాయి.

1. వ శతకం : 1 నుంచి 104 నామం వరకు:ఎవరికి ఏ సమస్య వచ్చినా తీర్చగలిగినవాడు పరమాత్మ. అందుకే ఆయన్ని మోక్షప్రదుడు అంటారు. భక్తుడిని సమస్యల వలయం నుంచి తప్పించటానికి పరమాత్మ ఎన్నో లీలలు ప్రదర్శిస్తాడు. ఆయనే అన్ని జీవులకూ రక్షకుడు.
2. 105 నుంచి 210 నామం వరకు: భగవంతుడు భక్తుల్ని కాపాడటానికి ఏర్పాటుచేసుకున్న వ్యూహాల్ని ఇది చెబుతుంది. స్వామి ఆవిర్భవించిన అవతారాలే ఈ వ్యూహాలు.తన నామాన్ని తెలిసి పలికినా, తెలియక పలికినా పరమాత్మ పరమాత్మ భక్తుడిని అనుగ్రహిస్తాడని ఈ శతకం చెబుతుంది.
3. 211 నుంచి 300 నామం వరకు: మనిషికి జ్ఞానాన్ని బోధించటమే పరమాత్మ కర్తవ్యం. ఇందుకోసమే జ్ఞానానికి నిలయాలైన వేదాల్ని అందించాడు. అనుక్షణం తన నామాన్ని పలికే జిజ్ఞాసువులైన మహర్షుల్ని కాపాడి, వారి ద్వారా లోకానికి జ్ఞానబోధ చేయిస్తాడు.
4. 301 నుంచి 404 నామం వరకు : భక్తుడు ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలోనే భగవంతుడు దర్శనమిస్తాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలన్నీ ఇలా ఏర్పడినవే. దర్శించాల్సింది భక్తుడే. దర్శనం ఇవ్వటానికి భగవంతుడు ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటాడు.
5. 405 నుంచి 502 నామం వరకు: తనను శరణు కోరిన వారికి దోషాలన్నీ భగవంతుడు క్షమించేస్తాడు. మనస్ఫూర్తిగా భగవంతుడికి అర్పిస్తూ చేసే అతి చిన్న పనికి సైతం యజ్ఞం చేసినంత ఫలితాన్నిచ్చే ఉదారుడాయన.
6. 503 నుంచి 604 నామం వరకు: భక్తులకు జ్ఞానబోధ చెయ్యటానికి స్వామి స్వయంగా కపిలమహర్షిగా అవతరించాడు. వేదవ్యాసుడై అపారమైన జ్ఞానసంపదను అందించాడు. ఇలా భక్తుల కోసమే, లోకసముద్ధరణే లక్ష్యంగా పరమాత్మ అడుగడుగునా భక్తుల వెన్నంటి ఉంటాడు.
7. 605 నుంచి 707 నామం వరకు: పరమాత్మ ఎప్పుడూ లక్ష్మిని అంటిపెట్టుకుని ఉంటాడు. అమ్మ అంటే దయ. అది పుట్టేది హృదయంలోనే. స్వామి హృదయం దయకు నిలయం అనే భావాన్ని ఇది ప్రకటిస్తుంది.
8 708 నుంచి 799 నామం వరకు: భక్తుడి కోసం ఎలాంటి పని చెయ్యటానికైనా సిద్ధంగా ఉంటాడు. అర్జునుడికి సారథ్యం వహించాడు. రాయబారం చేశాడు. అన్నిరకాల ప్రయోజనాలు వారికి అందించాడు. భక్తుల దోషాల్ని ఎత్తిచూపించడు. అన్ని తప్పుల నుంచి తానే కాపాడతాడు. విగ్రహంగా భావిస్తే తానేమీ చెయ్యడు.
9. 800 నుంచి 905 నామం వరకు: పరస్పర విరుద్ధమైన నామాలు ఈ శతకంలో ఉన్నాయి. విభిన్నత, వైవిధ్యం స్వామి లక్షణాలని ఈ శతకం చెబుతుంది. పరమాణువు నుంచి అనంతమైన విశ్వస్వరూపం తానుగా ఉండగలిగిన సామర్థ్యం పరమాత్మకు ఉంది. గుణవంతుడు, గుణహీనుడూ; నిరాకారుడూ, సాకారుడూ.. ఇలా విభిన్నగుణాల సమాహారమే పరమాత్మ.
10. 906 నుంచి 1000 నామం వరకు :పరమాత్మ యజ్ఞపురుషుడు. అవసరమైతే తానే యజ్ఞ పరికరంగా మారతాడు. యజ్ఞ ఫలితాన్ని తానే స్వయంగా అందిస్తాడు. సృష్టి, స్థితి, లయకారుడు ఆయనే. మొత్తం ప్రకృతి తన ఆధీనంలో ఉన్నా తానే ప్రకృతికి అధీనుడిగా కనిపిస్తాడు. లీలామానుష విగ్రహుడుగా ఉంటూ శాశ్వతమైన సత్యాన్ని జీవుడికి బోధ చేస్తాడు.
- డాక్టర్ కప్పగంతు రామకృష్ణ



Tuesday, July 2, 2019

అందాల రాముడు

అందాల రాముడు అందువలన దేవుడు
అందాల రాముడు అందువలన దేవుడు
రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది?
మాయలు మంత్రాలు చూపించలేదు.
విశ్వరూపం ప్రకటించలేదు.
జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు...
చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు...
పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు...
తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు...
కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు...
అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస       వధ చేశాడు...
అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు.
లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు.
అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?
కారణం..
ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.
- కప్పగంతు రామకృష్ణ
శాస్త్రధర్మం  
తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.
స్నేహధర్మం
  మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పుతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.
యుద్ధధర్మం
వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.
రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన.
దయాధర్మం
సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా.. అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు. 
మనుష్యధర్మం  
రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు. ‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’ అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.
సోదరధర్మం
రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరôగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ.. పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...