Sunday, April 25, 2021

అన్నీ ఆమె... అంతటా ఆమె (సనాతన సాహిత్యంలో స్త్రీ ఔన్నత్యం)





తిరుమల తిరుపతి దేవస్థానం వారు 
ప్రచురించే సప్తగిరి మాస పత్రిక మార్చి 2021 సంచికలో 

ప్రచురితమైన వ్యాసం

అన్నీ ఆమె... అంతటా ఆమె

(సనాతన సాహిత్యంలో స్త్రీ ఔన్నత్యం)

ప్రపంచంలోని మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వని సమ్నుతస్థానాన్ని మనదేశమే ఇచ్చింది. భారతమాత అంటూ జన్మనిచ్చిన భూమికి నమస్కరించే సంస్కారం కేవలం మనదేశంలోనే ఉంది. స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా మాతృభూమి’, ‘వందేమాతరంవంటి నినాదాలు ప్రజల్లో స్వేచ్ఛాప్రియత్వాన్ని కలిగించి, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చాయి. కేవం మనదేశంలోనే మహిళను అమ్మాఅని పిలిచే సంస్కారం ఉంది. పరిచయం లేని మహిళ ఎదురైతే, ఆమెతో మాట్లాడాల్సిన సందర్భం వస్తే ఏమ్మాఅంటూ సంబోధించే ఉత్తమగుణం ఈ మట్టిలో పుట్టిన ప్రతి మనిషికీ సహజంగా వస్తుంది.


వేదాలకు అధిష్ఠానదేవతగా గాయత్రీమాతను ఎంచుకున్న ఘనత కూడా మనకే దక్కుతుంది. అదొక్కటే కాదు.. ఈ దేశంలోని ప్రతి అణువులో మహిళాశక్తి ప్రకటితమవుతుంది. గంగ, గోదావరి, నర్మద, సరస్వతి, యమున...ఇలా ప్రతి నదికీ స్త్రీ పేరు ఉంటుంది. కారణం... మనిషికి అత్యంత ప్రాణాధారమైన వాటిల్లో నీరు ఒకటి. నీరు లేకపోతే ప్రాణం నిలవదు. స్త్రీమూర్తి లేనిదే జీవితం లేదు. అందుకే నీటికి, స్త్రీకి సమాన ప్రాధాన్యత ఇచ్చారు మన పూర్వికులు. ఈ రెండూ లేనిదే మనిషి జీవనం సాగించలేడు. ఆ జీవితం పరిపూర్ణత్వాన్ని పొందలేదు. అందుకే, నదులన్నిటినీ స్త్రీమూర్తుల పేరుతో పిలవటం మనదేశంలో ఆచారంగా ఉంది.


గంగమ్మ తల్లి, కృష్ణమ్మ తల్లి అంటూ నదుల్ని తల్లిగా భావించి, నోరారా పిలిచే దృశ్యం కేవం మనదేశంలోనే కనిపిస్తుంది. చివరకు పశు సంతతికి చెందిన ఆవును కూడా ఆవు అని పిలవకుండా గోమాత అని గౌరవంగా పిలిచి, తల్లిగా పూజించటం, వేపచెట్టును గౌరీదేవిగా అర్చించటం కూడా మనదేశంలోనే ఉంది. నీరు, నిప్పు... అన్నిట్లోనూ అమ్మను దర్శించగలిగిన సమున్నతజాతి మన భారతజాతి మాత్రమే.

వేదాల్లో స్త్రీ ప్రశంస

                భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలుగా నిలుస్తున్న వేదాలు స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాయి. ఋగ్వేదం యజుర్వేదం, అధర్వణ వేదాల్లోని అనేక మంత్రాలు స్త్రీ ఔన్నత్యాన్ని విశేషంగా ప్రశంసించటంతో పాటు మహిళల్ని ఎంతో గౌరవంగా చూడాలనే బాధ్యతను పురుషులకు నిర్దేశించాయి. భర్తకు భార్యగా ఉంటూ, దాసి తరహాలో అతనికి సేవ చెయ్యటం  స్త్రీధర్మం అనే భావనను వేదాలు నిరసించాయి. ఇంటికి యజమానురాలిగా, బిడ్డకు తొలి గురువుగా, అవసరమైన సందర్భాల్లో పురుషులతో సమానంగా విద్య అందాని, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మాత్రమే వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాని అధర్వణవేదం చెబుతోంది. ఇందుకు ఆయా వేదాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి.

·          స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి  - యజుర్వేదం (10:23)

·          స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణ వేదం (14:1:20)

·          స్త్రీలు ఉత్తమ పాండిత్యం సంపాదించాలి - అధర్వణ వేదం (11:5:8)

·          స్త్రీలు అందరినీ జ్ఞానవంతుల్ని చెయ్యాలి - అధర్వణ వేదం (14:2:74)

·          స్త్రీలు ఎల్లప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం (7:4:72)

·          స్త్రీలు ఎల్లప్పుడూ జ్ఞానవంతులుగా, తెలివిగలవారుగా ఉండాలి - అధర్వణవేదం (7:47:1)

·          పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గొనాలి - అధర్వణవేదం (7:38:4)

·          దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు నాయకత్వం వహించి నడపాలి-  ఋగ్వేదం (10:85:46)

·          స్త్రీలు సభను ఉద్దేశించి ప్రసంగించాలి - ఋగ్వేదం (10:85:26)

·          పిత్రార్జితంలో కుమారుడితో పాటు కుమార్తెకు కూడా సమానహక్కు ఉంది -  ఋగ్వేదం (3:31:1)

·          స్త్రీ సమాజానికి, కుటుంబానికి రక్షకురాలిగా వ్యవహరించాలి. అధర్వణవేదం (14:1:20)

·          స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదిగా ఉండాలి- అధర్వణవేదం (11:1:17)

·          స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి- యజుర్వేదం (16:44)

·         పురుషులతో సమానంగా మేము మీకు మంత్రాలను ప్రసాదిస్తున్నాము. మంత్రాలను అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాము - ఋగ్వేదం (10:19:13) (మంత్రభాగంలో పేర్కొన్న అనేక మంత్రాలకు గార్గి, లోపాముద్ర వంటి స్త్రీమూర్తులే  ద్రష్టలుగా ఉన్నారు. అలాగే గాయత్రి, చండి, దుర్గ, కాళి, సరస్వతి వంటి స్త్రీమూర్తులకు సంబంధించిన మంత్రాలే అధికంగా ఉన్నాయి)

·         ఓ వధూ! నీకు అన్నివిధాలైన విజ్ఞానం కలుగుగాక. వేదజ్ఞానం పొందిన తర్వాత మాత్రమే నువ్వు జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తిని గడించి, నీ భర్తకు శుభాలు కలుగజెయ్యాలి. నీ విజ్ఞానంతో కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించు- అధర్వణవేదం (14:1:64) (ప్రతి స్త్రీ తప్పనిసరిగా విద్యాభ్యాసం చెయ్యాలని, ఆ తర్వాతనే వివాహం చేసుకోవాలని ఈ మంత్రం స్పష్టంగా చెబుతోంది.)

                యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా భార్యకు అగ్రస్థానాన్ని వేదాలు కల్పించాయి. ఏయాగం చెయ్యాలన్నా, అందుకు సంబంధించిన అగ్ని ప్రతిష్ఠాపన భార్య చేస్తుంది. ఆ తర్వాతనే భర్త హోమాన్ని కొనసాగిస్తాడు. పతుర్యో యజ్ఞసంయోగే- యజ్ఞయోగ్యతను కలిగించునది పత్ని అని పాణిని సూత్రం. అయజ్ఞోవా ఏష: యో అపత్నీక:- అపత్నీకుడు అంటే భార్య లేని వ్యక్తికి యాగాలు చేసే అధికారం లేదు. చివరకు సంకల్పం చేసే అధికారం లేదని వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి.

ఆమె ఒప్పుకుంటేనే వివాహం

 వివాహ మంత్రాల్లో కూడా వధువుకే అగ్రస్థానం ఉంది. గృహాన్గచ్ఛ గృహపత్నీ చథా సో వశినీత్వం విధథమాదాసి- వివాహంలో చేసే హోమా సందర్భంలో వరుడు వధువును నువ్వు మా ఇంటికి అధిపతిగా రావాలి. కేవలం రావటమే కాదు... మా ఇంటికి అధిపతిగా ఉండి, మమ్మల్ని నడిపించాలి. మా ఇంట్లో పుణ్యకార్యాలు జరిగేలా నువ్వు ప్రోత్సహించాలిఅని అభ్యర్థించి తీసుకువస్తాడు. కన్యాదానం చేసే సందర్భంలో కూడా తండ్రి తన కుమార్తెను లక్ష్మీస్వరూపంగా భావించి, కన్యాదానం చేస్తాడు. తన ఇంటి లక్ష్మి కనుకనే వధువును వివాహవేదిక వద్దకు నడిపించి తీసుకురాకుండా, ధాన్యం పోసిన వెదురుబుట్టలో కూర్చోపెట్టి తీసుకువస్తారు పుట్టినింటివారు.

 వివాహం పూర్తయిన తర్వాత కూడా లక్ష్మీ స్వరూపురాలైన భార్యను నడిపించకుండా ఉత్తరారధస్యోత్తంభనీ, వాహావుత్తరాభ్యాం యన్నక్తి:’, ‘ఆరోహయన్తీముత్తరాభిరభిమన్త్రయతే- రథం మొదలైన వాహనాల మీద కూర్చోబెట్టి వధువును వరుడి ఇంటికి తీసుకువెళ్ళాని మంత్రాలు చెబుతున్నాయి. మొత్తం వివాహ ప్రక్రియలో వరుడే వధువును తనకు భార్యగా ఉండాలని అభ్యర్థించి, తన ఇంటికి రావసిందిగా ఆహ్వానించి తీసుకువెళ్తాడే కానీ ఏ మంత్రంలోనూ పురుషాధిక్యత కనిపించదు.

తొలివరుసలో ఆమే...

                ప్రాచీనకాలం నుంచి మన ఆచార, సంప్రదాయాల్లో మహిళకే తొలిస్థానం కల్పించింది భారతీయ సంస్కృతి. భార్యాభర్త పేర్లు పిలవాల్సి వచ్చినప్పుడు ముందుగా భార్యపేరు పిలవటం ఆనవాయితీగా వస్తోంది. దేవతలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. లక్ష్మీనారాయణు, జానకీరాముడు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, గౌరీశంకరులు, ఛాయా ఉషా సమేత సూర్యనారాయణస్వామి, వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, అరుంధతి వశిష్ఠుడు... ఇలా భార్యపేరు వచ్చిన తర్వాతనే భర్తపేరు వస్తుంది.

 వేదాలతో సహా పురాణాలన్నీ స్త్రీని శక్తిస్వరూపంగా వర్ణించాయి. త్రిమూర్తుల కన్నా ఉత్తమస్థానంలో జగజ్జననిగా, పరాదేవతగా మహిళనే నిలిపాయి.

 వేదాలు కూడా యజ్ఞాల్లో స్త్రీకి అగ్రతాంబూలం ఇచ్చాయి. యజ్ఞాల్లో యజమాని భార్య మాత్రమే అగ్నిప్రతిష్ఠాపన చెయ్యాలి. ఆమె అగ్ని వెలిగించిన తర్వాతనే మిగిలిన కార్యక్రమం కొనసాగుతుంది. ఇతరులెవ్వరికీ ఆ అధికారం లేదు. అలాగే, పూర్ణాహుతిలో కూడా యజమానురాలు తప్పనిసరిగా ఉండాలి. భార్యావిహీనుడికి యజ్ఞయాగాది క్రతువులు చేసే అధికారాన్ని వేదాలు ఇవ్వలేదు.

                అలాగే, కొత్త ఏడాది వచ్చాక జరిగే తొలి కల్యాణం సీతారామ కల్యాణం. ఇక్కడ కూడా సీతారామ కల్యాణం అన్నారే కానీ రామ కల్యాణం అనలేదు. పార్వతీకల్యాణం, పద్మావతీ పరిణయోత్సవం... ఇలా అన్ని దేవతాకల్యాణాల్లోనూ ఆమెకే తొలిస్థానాన్ని కల్పించాయి వైదిక శాస్త్రనియమాలు. ఇప్పటికీ, దంపతులకు నూతన వస్త్రాలు ఇచ్చే సందర్భంలో ముందుగా భార్యకు పసుపు కుంకుమలు ఇచ్చిన తర్వాతనే భర్తకు వస్త్రాలు ఇస్తారు.

మనువు కూడా అర్ధస్య సంగ్రహేచైనాం వ్యయేచైవ నియోజనేత్‌’ ` అంటూ ధనాన్ని జాగ్రత్త చెయ్యటం, ఖర్చుచెయ్యటంలో ఇంటి యజమానురాలికే మొదటి అధికారం ఇచ్చాడు.

  పల్లెల్లో గ్రామదేవత ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పోలేరమ్మ, నాంచారామ్మ, తలుపులమ్మ, తిరుపతమ్మ, బతుకమ్మ...ఇలా వందలాదిగా గ్రామదేవతలు ఉన్నారు. వీరందరూ స్త్రీమూర్తులే. చాలా కుటుంబాల్లో ఏ శుభ కార్యం జరిగినా తొలిపూజ గ్రామదేవతకే చేస్తారు. వాన పడకపోయినా గ్రామదేవతకే మొక్కు చెల్లిస్తారు. అంటే, ఏ కష్టమొచ్చినా మనిషిని ఆదుకునేది మహిళలే అన్న విషయం స్పష్టమవుతోంది.

 

మనుస్మృతిలోనూ పెద్దపీట

                ఉపాధ్యాయాన్‌ దశాచార్య ఆచార్యానాం శతం పితా

                సహస్రం తు పితన్‌ మాతా గౌరవేణాతిరిచ్యతే ॥ (మను, 2:145)

  పదిమంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, వందమంది ఆచార్యుల కంటే తండ్రి, వెయ్యిమంది తండ్రుల కంటే తల్లి పూజనీయురాలని మనుధర్మశాస్త్రం చెబుతుంది. మహిళకు ఇంతకన్నా గొప్పస్థానాన్ని మరే సంస్కృతీ ఇవ్వలేదనేంతగా మనుస్మృతి స్త్రీ ప్రాధ్యాన్యాన్ని వివరించింది. మాతృదేవోభవఅంటూ తల్లికి తొలి నమస్కారం చేసిన తర్వాతనే పితృదేవోభవఅంటూ తండ్రికి తర్వాతి నమస్కారం చెయ్యాని ఉపనిషత్తులు చెప్పిన వాక్యాలు కూడా మనుధర్మశాస్త్రాన్ని సమర్థించాయి.

సమాజంలో అత్యున్నత స్థానం స్త్రీకి ఉంది. అది ఆమె హక్కు. పురుషుడు ఆమెను ప్రాథేయపడాలి. ఆమెను మహారాణిలా చూసుకోవాలి. దైవం కన్నా గొప్ప స్థానం ఇవ్వాలి. ఆమె సదా వందనీయురాలు. ఇంటా బయటా, చదువైనా, వివాహమైనా, ఆస్తిపంపకాలైనా, అధికారమైనా... అన్నింటా అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే అంటుంది మనుస్మృతి.

   ‘ఆమెపై అధికారం చెలాయించే హక్కు పురుషుడికి ఎప్పటికీ లేదని, ‘ఆమెతో పురుషుడు ఏవిషయంలోనూ సాటిరాలేడని మనువు స్పష్టంగా చెప్పాడు. మనిషికి అర్థం, పరమార్థం స్త్రీవల్లే కలుగుతాయి. భార్యను మించిన స్నేహితుడు భర్తకు మరొకరు లేరు. పురుషుడు స్త్రీ లేకుండా పరిపూర్ణత్వాన్ని పొందలేడు. అతడిని స్వీకరించటానికి సమ్మతించి స్త్రీ అతని ఇంటికి భార్యగా వచ్చినప్పుడే పురుషుడికి పూర్ణత్వం సిద్ధిస్తుందంటాడు మనువు.  శ్రీ’ (సంపద), ‘స్త్రీ’ (భార్య) లేని ఇల్లు కాంతిహీనంగా ఉంటుంది (9:26, 3:60). ఇది మనువు ఇచ్చిన సూచన రూపంలోని ఆదేశం. మార్గదర్శనం కూడా.

 మనుస్మృతిలో స్త్రీ గురించి చర్చ అంటే... న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ (9:3) అనే వాక్యాన్ని ప్రస్తావిస్తారు. ఆమెను మనుస్మృతి స్వాతంత్య్రానికి నోచుకోనివ్వలేదు అంటారు. నిజానికి ఆ శ్లోకంలోని అంతరార్థం తరచిచూస్తే

                పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే

                రక్షన్తిస్థావిరే పుత్రా నస్త్రీ స్వాతంత్య్రమర్హతి ॥ (9:3)

 తన రక్షణ కోసం మహిళ ఏనాడూ చింతించాల్సిన అవసరం లేకుండా మనువు చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇందులో కనిపిస్తాయి. బాలికగా ఉన్నప్పుడు తండ్రి, యువతిగా ఉన్నప్పుడు భర్త, వార్థక్యంలో ఉన్నప్పుడు కుమారుడు బాధ్యత తీసుకుని స్త్రీని సంరక్షించాలనే అర్థం బోధపడుతుంది.  మహిళ పూర్తి బాధ్యత పురుషుడికి అప్పగించాడు. ఇక్కడ మహిళపై బాధ్యతను పురుషుడు గుర్తించాలి తప్ప వారిపై ఉన్న అధికారాన్ని కాదు.

  స్త్రీలు ఏవిధంగానూ దుఃఖానికి గురికాకూడదని మనువు చెప్పాడు. స్త్రీలు దుఃఖిస్తే అందుకు ప్రతిఫలంగా దుఃఖానికి కారణమైన వారి వంశమంతా నశిస్తుంది. స్త్రీలు సంతోషంతో ఉంటే ఆ ఇల్లు, వారి వంశం ఎప్పుడూ కళకళలాడుతుంటుంది’ (3:57). ఇక్కడ స్త్రీపురుషులిద్దరిపై బాధ్యత పెట్టాడు మనువు. స్త్రీకి దుఃఖాన్ని కలగనివ్వకుండా చూడాల్సిన బాధ్యత పురుషుడిదైతే, తాను సంతోషంగా ఉంటూ తన వారందరినీ అలాగే ఉంచాల్సిన బాధ్యత ఆమెకుంది.

                స్వేభ్యోంశేభ్యస్తు కన్యాభ్యః ప్రదద్యుర్భ్రాతరః పృథక్‌

                స్వాత్స్వా దంశాచ్చతుర్భాగం పతితౌః స్యురదిత్సవః ॥

 అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటే ఒక్కొక్కరు తమ భాగాల్లోంచి నాలుగో వంతుని తోబుట్టువుకు ఇవ్వాలని మనువు నిర్దేశించాడు. మహిళకు ఆస్తిహక్కు  గురించి ఇవాళ మనం చేసుకుంటున్న చట్టాల్ని ఏనాడో వివరించి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు మనువు.

 స్త్రీలను అపహరించడం, హత్య చేయడం, అత్యాచారం చేయడం వంటి విషయాల్లో మనువు చాలా నిష్కర్షగా వ్యవహరించాడు. ఇటువంటి దుర్మార్గాలు చేసిన వ్యక్తుల్ని అత్యంత కఠినంగా శిక్షించాని నిర్దేశించాడు. ఇలాంటి నేరాల్లో దోషులకు దేశబహిష్కరణ శిక్ష (మను, 8:352) విధించాలని రాజుకు సూచించాడు. స్త్రీలను అపహరించేవారికి, వారి ఆస్తుల్ని దొంగిలించేవారికి మరణదండన (8:323) విధించాలన్నాడు.  వినటానికే ఎంతో కఠినంగా అనిపించే ఈ శిక్షల్ని ఎన్నో వేల సంవత్సరా క్రితమే మనువు మహిళ రక్షణ కోసం నిర్దేశించాడు.

ఇవన్నీ ఆమెకు వెన్నుదన్నుగా నిలిచేందుకు చేసిన సూచనలే. బలమైన రాజ్యాంగం, గొప్ప సాంకేతిక ప్రగతి ఉన్నా నేటికీ మహిళలపై అనేక అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠినమైన శిక్షలు విధిస్తే తప్ప తప్పు చెయ్యటానికి మనిషి భయపడే పరిస్థితి రాదంటూ మనువు తన స్మృతిరూపంలో స్త్రీకి అండగా నిబడ్డాడు.

 యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ (3:56) - ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు ఉంటారంటూ దేవత కన్నా స్త్రీకే ఎక్కువ గౌరవాన్నిచ్చాడు. స్త్రీ పక్షపాతిగా నిలిచాడు.

 

సాహిత్యాకాశంలో సగం

జనకమహారాజు కొలువులో గార్గి, మైత్రేయి వంటి మహిళలు ఆస్థానపండితులుగా ఎన్నో సత్కారాలు అందుకున్నారు. వీరు పురుషులతో సమానంగా వేద, శాస్త్ర చర్చల్లో పాల్గొనేవారు. తర్వాతికాలంలోనూ పురుషులతో సమానంగా... మరికొన్ని సందర్భాల్లో పురుషుల కన్నా మిన్నగా సాహితీసృష్టి చేసిన మహిళలెందరో ఉన్నారు. ఖడ్గ తిక్కన భార్య చానమ్మ, అతని తల్లి పోలమ్మ చాటువులు చెప్పారు. తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మోహనాంగి, తిరుమలాంబ, తుక్కాదేవి, నాచి, లీలావతి, శారద, త్రివేణి, కృష్ణాజమ్మ, రంగాజమ్మ, ముద్దుపళని, కుప్పమ్మ, బాల పాపాంబ, తరిగొండ వెంగమాంబ, అమ్మాజీ, బండారు అచ్చమాంబ, గోపిశెట్టి లక్ష్మీనరసమ్మ, మామిడన్న సుభద్రమ్మ, చిల్లరిగె రమణమ్మ... ఇంకా మరెందరో మాతృమూర్తులు తమ అసాధారణ రచనా విన్యాసాలతో తెలుగు సాహితీలోకాన్ని సుసంపన్నం చేశారు.

ఆడవాళ్ళను వంటింటి కుందేలుగా మార్చారని నేటి ఆధునికు విమర్శిస్తున్న కాలం, అంతకన్నా పూర్వకాలానికి చెందిన మహిళలే వీరంతా. అంటే, ఎన్నోవేల సంవత్సరాలకు పూర్వమే మన భారతజాతి మహిళలకు అగ్రస్థానం కల్పించిందన్న విషయాన్ని గమనించాలి.

  రఘునాథ నాయకుడి ఆస్థాన కవయిత్రి మధురవాణి ప్రాకృత, ఆంధ్ర భాషల్లో రచనలు చేసి రఘునాథ నాయకుడి చేత కనకాభిషేకం అందుకుంది. ఆమెతో పాటు రఘునాథుడి మన్నన అందుకున్న మరో కవయిత్రి రామభద్రాంబ. ఆశుకవిత్వంలో అసాధారణ ప్రజ్ఞ ఈమె సొంతం. విజయరాఘవ నాయకుడి ఆస్థానంలో చంద్రరేఖ, కృష్ణాజీ, రంగాజమ్మ అత్యంత ప్రసిద్ధి పొందారు. రంగాజమ్మ రాసిన మన్నారుదాస విలాసంప్రబంధాల్లో అత్యంత ప్రసిద్ధి పొందింది. దక్షిణాంధ్ర కవయిత్రుల్లో ముద్దు పళనిది ప్రత్యేకస్థానం. ఈమె రాసిన రాధికా సాంత్వనంరసావిష్కరణ విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికీ ఈమెకు సాటిరాగల శృంగార రచయిత్రి తెలుగుసాహిత్యంలో లేదని విమర్శకులు సైతం ప్రశంసించారు. తెలుగు సాహిత్యంలో ఇప్పటికి వందలాది రామాయణాలు వచ్చినా, ఆతుకూరి మొల్ల రాసిన రామాయణానికి ప్రత్యేకస్థానం ఉంది. ఈమె రామాయణంలోని అనేక ఘట్టాలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

 ఇంకా ఎందరో...ఎందరో స్త్రీమూర్తులు తమ ప్రతిభతో మనదేశానికి అఖండమైన కీర్తిప్రతిష్ఠలు తీసుకువచ్చారు. వేదాలతో సహా సనాతన భారతీయ సాహిత్యమంతా స్త్రీకి సమున్నతస్థానాన్ని ఇచ్చింది. అందుకే యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దవతాః- ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కూడా కొలువై ఉంటారని పెద్దలు చెబుతారు.

ఎన్నో యుగాల నాడే మహిళకు సర్వోన్నత గౌరవం ఇచ్చిన మన సంస్కృతిని మన వారసత్వ సంపదగా కాపాడుకుందాం.

---------








రచన
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
ఆంధ్రోపన్యాసకులు
ఎస్.ఆర్.ఎస్.వి.కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
గాంధీనగర్, విజయవాడ - 520003. 
సెల్ : 90320 44115 / 8897 547 548

 

Wednesday, April 21, 2021

తెలుగు అక్షరాల రూపంలో కమ్మని వంటలు

 తెలుగు అక్షరాల రూపంలో కమ్మని పిండివంటలు

సరదా సరదాగా అక్షరాలు నేర్పించే సరికొత్త వంటక విధానం


https://youtu.be/gpp048dsx9g

Tuesday, April 20, 2021

రామయ్యా...ఇదిగోనయ్యా సీతమ్మ! (సీతారామ కల్యాణ వైభవం)

 



సీతారామ కల్యాణ వైభవం

రామయ్యా...ఇదిగోనయ్యా సీతమ్మ!

 బంధం కలిస్తే బంధుత్వం...పెనవేసుకున్న అనుబంధం అంతులేని సంతోషానికి కారణమవుతుంది.మనుషుల మధ్య ఈ అనురాగ ముడులను వేసే ఓ ప్రక్రియ పెళ్లి...వివాహం ఇద్దరు మనుషులనే కాదు, రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది. అంతుకుమునుపు పరిచయం లేని మనుషుల మధ్య ఆత్మీయతకు కారణమవుతుంది. ఎప్పుడో త్రేతా యుగంలో జరిగినట్లు  భావించే సీతారామకల్యాణమూ అంతే... భార్యభర్తల బాధ్యతలు, అత్తమామల దీవెనలు, వియ్యంకుల మర్యాదలు..అప్పగింతలు, పలకరింపులు...ఇలా ఎన్నో ఆత్మీయానురాగాలు అందులో అందంగా ప్రతిబింబిస్తాయి...అందుకే ఆ కల్యాణం లోకానికి  ఓ సంప్రదాయమైంది...మార్గదర్శనమైంది..వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టాలు  ఎప్పటికీ అపురూపాలే...

 ఆ శుభ తరుణంలో...

పెళ్లి తర్వాత ప్రేమ...

 నిజానికి శివధనుస్సును రామయ్య కావాలనో, సీతమ్మను వివాహం చేసుకోవాలనో ఎక్కుపెట్టలేదు. తన గురువైన విశ్వామిత్రుని ఆదేశం మేరకే శివధనుస్సుని ఎక్కుపెట్టాడు. ఆ తర్వాత కూడా నేరుగా సీతమ్మను స్వీకరించలేదు. తన తండ్రి దశరథుడు వచ్చి, జనకమహారాజుతో మాట్లాడి, ఇద్దరూ అంగీకరించిన తర్వాతనే సీతమ్మను వివాహం చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. అలాగని, బలవంతపు వివాహం కూడా కాదు. సీతారాములిద్దరికీ ఒకరంటే ఒకరికి వర్ణించలేనంత ప్రేమ.

 ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి ।

గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిః భూయోభివర్థత ।। (వాల్మీకి రామాయణం)

 

పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా అని రామయ్య సీతమ్మను మరింతగా ఇష్టపడ్డాడట. సీతమ్మ కూడా తన గుణగణాలతో రామయ్యకు తనపై ప్రేమ కలిగేలా చేసుకుందట. తన వెంట నడచివచ్చిన మహిళను ప్రేమగా చూసుకోవాల్సిన సందేశాన్ని రామయ్య, భర్తను అనురాగంతో, ప్రేమతో మాత్రమే తనవాడిని చేసుకోవాలనే సందేశాన్ని సీతమ్మ తమ వివాహం ద్వారా అందించారు. అందుకనే, సీతారాములు ఆదర్శ దంపతులయ్యారు. 

మరి కల్యాణం ఆ రోజెందుకు?

నిజానికి సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ మహతాం జన్మనక్షత్రే వివాహంఅంటుంది ఆగమ శాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో భక్తులు కల్యాణం చేయాలని శాస్త్ర నియమం. చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు శ్రీరాముడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా ఘనంగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఊరూవాడా సీతారాముల కల్యాణం జరుపుతారు. ఇలాగే మహాశివరాత్రి సందర్భంగా కూడా శివపార్వతులకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు.

 మిథిలా నగరం...

 ఎప్పుడూ ధీరగంభీరంగా ఉండే జనకమహారాజు భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది...

శివధనుస్సును శ్రీరాముడు విరిచేశాడంట.

మన జనక మహారాజు గారాల పట్టి సీతను ఆయనే చేపట్టబోతున్నాడు...

మా జానకేమో చందనపు తునక... మరి రాముడో...

ఆయనేమీ తక్కువ కాదు... నీలమేఘశ్యాముడంట, దశరథ మహారాజు చాలా గారాబంగా పెంచాడంట... అందంలో చంద్రుడితో పోటీ అంట...

అందుకే ఆయనను రామచంద్రుడని పిలుస్తారంట...

అంతఃపురమంతా ఇదే ముచ్చట... ఎప్పుడెప్పుడు కన్నులకు పండువ అవుతుందా అని ఎదురుచూపులు...

 మహాత్మా! నేను దశరథనందనుడి యశస్సు, వీరత్వాన్ని కళ్లారా తిలకించాను. నాకుమార్తె సీత, దశరథా¯త్మజుడైన శ్రీరాముణ్ణి వివాహమాడి మా జనక వంశానికి కీర్తి తెస్తుంది. మీరు అనుమతిస్తే నా మంత్రులు రథాలపై వాయువేగంతో అయోధ్యానగరానికి వెళతారు. ఇక్కడ జరిగింది దశరథ మహారాజుకు వివరించి, వారిని సకుటుంబ సపరివార సమేతంగా మిథిలకు తీసుకొస్తారు. అని విశ్వామిత్రుడికి విన్నవించాడు జనకుడు. విశ్వామిత్రుడు అనుమతించాడు.

 అయోధ్యలో విషయం తెలుసుకున్న కౌసల్య, సుమిత్ర, కైకేయిల సంతోషానికి పట్టపగ్గాలు లేవు. నిన్నటి దాకా మన చేతుల్లో ఆడుతున్నట్లే ఉన్నాడు ముద్దుల రాముడు... మన మురిపాల కొండ... అప్పుడే పెళ్లికొడుకవుతున్నాడు. దశరథుడు తన పరివారంతో పాటు వశిస్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు వంటి మహనీయులతో, చతురంగ బలాలలో విదేహ దేశం చేరుకున్నాడు.

 వియ్యాలవారిని అల్లంతదూరంలోనే చూసిన జనకుడు వారికి ఎదుర్కోలు పలికి, ఇతర స్వాగత సత్కారాలు చేశాడు. జరిగిన విషయమంతా చెప్పి, తన కుమార్తెను కోడలిగా స్వీకరించమని దశరథుడిని కోరతాడు.

 ప్రతిగృహో దాతృవశః శ్రుతం ఏతత్‌ మయా పురా।

యథా వక్ష్యసి ధర్మజఞ తత్‌ కరిష్యామహే వయం ।।

 అందుకు దశరథుడు అయ్యయ్యో! జనకా.. అలా అంటావేంటి. అసలు ఇచ్చేవాడంటూ ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. నీ కుమార్తెను నా కోడలిగా చేస్తానంటున్నావు. నువ్వు దాతవు. నేను పుచ్చుకునేవాడిని... అంటూ ఎంతో ఆప్యాయంగా జనకుడి ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు. తన బంధుత్వం మరింతగా దృఢపడాలంటూ వారు ఎంతో ఆప్యాయంగా పరస్పర సంభాషణ చేసుకుంటారు.

అదిగదిగో... ఆ రోజు రానేవచ్చింది...

వైశాఖ శుద్ధ దశమి ఉత్తర ఫల్గుణి నక్షత్ర శుభముహూర్తాన్ని సీతారాముల కల్యాణానికి వేదమూర్తులు నిర్ణయించారు.

 కల్యాణవేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు. నానావిధ పరిమళ పత్ర పుష్పాలతో కల్యాణమంటపం ముస్తాబైంది. మిథిలా నగరమంతా మహా సందడిగా మారింది. శ్రీరాముడికి సీతతో పాటు లక్ష్మణుడికి సీత సోదరి ఊర్మిళను, భరతుడికి జనకుడి సోదరుడైన కుశధ్వజుని పెద్దకూతురు మాండవి, శతృఘ్నుడికి కుశధ్వజుని మరోకుమార్తె శ్రుతికీర్తిని ఇచ్చి వివాహం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

అటు జనకమహారాజు కన్యాదానం చెయ్యటానికి, ఇటు దశరథుడు కన్యాదానం తీసుకోవటానికి అవసరమైన అన్ని వైదిక కార్యక్రమాలు సశాస్త్రీయంగా నిర్వహించారు. దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోవటానికి బయల్దేరి జనకుడి సభ బయట ఉండి, తన రాక గురించి మహారాజుకు కబురుచేస్తాడు. అందుకు ప్రతిగా జనకుడు దశరథుడితో మహారాజా! ఇకపై జనకుడి ఇంటికి, దశరథుడి ఇంటికి తేడా లేదు. మిమ్మల్ని అక్కడ ఎవరైనా ద్వారపాలకులు ఆపుతున్నారా? మీరు నేరుగా భవనంలోకి రండి. ఇది మీ ఇల్లే అంటూ ఆప్యాయంగా స్వాగతం పలుకుతాడు. ఎంతో ప్రేమ, ఆప్యాయత నిండిన మనస్సుతో జనకుడు చేసిన ఆహ్వానం, పలికిన పలుకులతో దశరథుడు మరింతగా పొంగిపోయాడు.

 ఆకాశమంత పందిరి కింద, భూదేవి అంత వేదిక సిద్ధంచేశారు. మంగళవాయిద్యాలు మారుమోగుతున్నాయి. వేదమంత్రాలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. సుగంధద్రవ్యాలు గుభాళిస్తున్నాయి. పన్నీటి చిలకరింపులు హాయిగొలుపుతున్నాయి.. మగపెళ్లివాళ్లంతా ఠీవీగా కూర్చున్నారు. వారికి జనక మహారాజు పరివారం వారికి నమ్రతగా, వినయ విధేయతలతో సపర్యలు చేస్తున్నారు. నలుగురు పెళ్లికుమారులు, నలుగురు పెళ్లికుమార్తెలు సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో, సీతారాములు శోభిల్లుతున్నారు.

 బంగారుమంటపంలో సీతారాములు వధూవరులుగా కూర్చున్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షుల ఆధ్వర్యంలో పురోహితులు పెళ్లిమంత్రాలు చదువుతున్నారు. ముహూర్త ఘడియలు సమీపించగానే జనకమహారాజు వేదికపైకి వచ్చి, సీతమ్మ చేతిని తన చేతితో పట్టుకుని....

 ఇయం సీతా మమసుతా సహ ధర్మచరీ తవ ।

ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణి గృహ్ణీష్వ పాణినా ।

పతివ్రతా మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా ।।

 రామయ్యా! ఇదిగో... నా కుమార్తె అయిన సీత. నీకు సహధర్మచారిణిగా స్వీకరించు. నీకు శుభాలు కలుగుతాయి. ఈమె పతివ్రతగా ఉండి, నిత్యం నిన్ను నీడలా అనుసరిస్తుంది అంటూ సీతమ్మ చేతిని రామయ్య చేతికి అందిస్తాడు. అత్తవారింట ఎలా నడుచుకోవాలో అన్ని బోధనలూ ఒక్క శ్లోకంలో చెప్పేశాడు జనకమహారాజు.

 పుట్టింటి నుంచి ఓ తండ్రి కుమార్తెగా అత్తింట అడుగుపెట్టే స్త్రీ, తన భర్తకు సహధర్మచారిణిగా ఉండాలి. అత్తింటివారికి అన్ని శుభాలు కలిగేలా ప్రవర్తించాలి. పతివ్రతగా ఉండాలి. భర్తను నీడలా అనుసరించాలి. ఇలాంటి మహోన్నతమైన జాగ్రత్తలు, సూచనలు చెబుతూ బిడ్డను అత్తవారింటికి సాగనంపాడు.

 ఆయన ఆకాశం... ఆమె పుడమి!

 రాముడు నీలమేఘశ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా భూమి నుంచి జన్మించింది. భూమి పంచభూతాల్లో ఒకటి. ఇలా, పంచభూతాల్లో మొదటిదైన భూమికి సీతమ్మ, చివరిదైన ఆకాశానికి రామయ్య సంకేతాలుగా నిలుస్తున్నారు. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది. సస్యాన్ని (పంటను) అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి, వారికి శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడైతే రామయ్య సీతమ్మకు చేరుకుంటాడో అప్పుడు లోకానికి శక్తి  వస్తుంది. ఈవిధంగా సీతారామకల్యాణం లోకకల్యాణానికి కారకంగా, ప్రకృతి పులకరింతకు ప్రతీకగా నిలుస్తుంది.

 ఇద్దరి పుట్టుక ఒకేలా...

 సీతారాములిద్దరి జన్మవృత్తాంతం విచిత్రమైందే. వీరిలో ఏ ఒక్కరూ నేరుగా తల్లి కడుపునుంచి జన్మించలేదు. సంతానం కోసం దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్ఠి ఫలితంగా లభించిన యజ్ఞపాయస ప్రసాద ఫలితంగా రాముడు కౌసల్య గర్భాన జన్మించాడు. యజ్ఞం చెయ్యటం కోసం భూమిని దున్నే ప్రయత్నంలో నాగలి చాలుకు తగిలి, భూమిని నుంచి తనకు తానుగా అయోనిజగా ఆవిర్భవించింది సీతమ్మ. ఇద్దరూ యజ్ఞప్రసాదాలే. అందుకే వారిద్దరి కల్యాణం కూడా లోక కల్యాణయజ్ఞానికి పునాదిగా నిలిచింది.

 పెళ్లి బాజాలు అలా మోగాయి...

 సీతారామకల్యాణ ఘట్టాన్ని జానపదులు రాములోరి పెళ్లిగా పిలుచుకుంటారు. కేవలం పిలుపే కాదు... వారితో చుట్టరికం కలుపుకుంటారు. సీతమ్మ మాయమ్మ.. .శ్రీరాముడు మా తండ్రివంటి గీతాలు ఇందుకు ఉదాహరణ. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు కూడా తన సంకీర్తనల్లో అనేకసార్లు సీతారామ కల్యాణఘట్టాన్ని మనసారా కీర్తించారు. రామం ఇందీవర శ్యామం పరాత్పర ధామం... సుర సార్వభౌమం భజే’; ‘అట్టె హరువిల్లు విరిచిన రాఘవా.. సిరులతో జనకుని ఇంటను జానకి జెలగి పెండ్లాడిన రాఘవా’; ‘రాముడు రాఘవుడు రవికులుడితడు... భూమిజకు పతియైన పురుష నిధానమువంటి కీర్తనలెన్నో అన్నమయ్య కలం నుంచి జాలువారి సీతారామకల్యాణ వైభోగాన్ని నేటికీ మనకు వీనులవిందుగా అందిస్తున్నాయి.

-------------------------------------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్: 9032044115


ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...