Showing posts with label Ugadi. Show all posts
Showing posts with label Ugadi. Show all posts

Thursday, March 31, 2022

కాలదైవం ఉగాది

 

కాలదైవం ఉగాది

            వసుధపై వసంతం వికసించిన తొలిరోజు ఉగాది. మిగిలిన పండుగల కన్నా ఉగాది ఎంతో ప్రత్యేకమైంది. సాధారణంగా పండుగలన్నీ ఏదో ఒక దేవత / దేవుడికి సంబంధించి ఉంటాయి. ఉగాది ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఏ దేవుడి పేరూ ఈ రోజు వినిపించదు.


            ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనందవేళ ఉగాది. కాలాన్ని గుణిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్ని ఉగాది అందిస్తుంది. సహనానికి, వ్యక్తిత్వ వికాసానికి, మనోవికాసానికి ఆలవాలంగా నిలుస్తుంది.


            కంటికి కనిపించని బలమైన శక్తి కాలం. కాలాన్ని కాదని ఎవ్వరూ ఏ పనీ చెయ్యలేరు. కాలానికి అనుగుణంగానే ప్రతి వ్యక్తీ తన దినచర్యను తీర్చిదిద్దుకుంటాడు. కాలాన్ని కంటితో దర్శించి ఇదీ కాలం యొక్క పూర్తి స్వరూపంఅని నిర్ధారించిన వాళ్లూ లేరు. కాలం తనకు తానుగా సాగిపోతుంది. కాలాన్ని అనుసరించి నడుచుకోవటమే మనిషి చేసే పని. తనంతట తానుగా ఆవిర్భవించి తనతో పాటు మనిషిని నడిపిస్తున్న శక్తి కాలం. ఇంతవరకూ కాలాన్ని జయించిన వ్యక్తి ఎవ్వరూ లేరు.


            కాలం అనంతమైంది. ఎప్పుడు పుట్టిందో, ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అదొక స్వయంభూమూర్తి. గ్రహగతుల ఆధారంగా ఖగోళంలో ఏర్పడుతున్న మార్పుతున్న మార్పులను గమనించి మనం కాలాన్ని విభజన చేస్తున్నాం. అంతేకానీ, కాలానికి ఇదీ నిర్దుష్టమైన విభజనఅంటూ ఏదీ లేదు.


వేదాల్లో కాలమానం


            అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో కాలం, కాలవిభజన గురించిన ప్రస్తావనలు చాలా చోట్ల ఉన్నాయి. ఆయా కాలాల్లో నిర్వహించాల్సిన యజ్ఞ, యాగాది క్రతువులను వివరించే సందర్భాల్లో కాల ప్రస్తావన కనిపిస్తుంది. ఋగ్వేదం ఏడో మండలం 103వ సూక్తంలో ఋతువుల ప్రస్తావన ఉంది. సోమ, అతిరాత్ర యజ్ఞాల గురించి వివరిస్తూ ఋత్విక్కులు ఆయా ఋతువుల్లో ఈ యాగాలు చెయ్యాలని అందులో ఉంది.


            యజుర్వేదంలో కూడా అహోరాత్రం, అర్ధమాసం, మాసం, ఋతువులు, సంవత్సరాల వివరాలు తెలిపే మంత్రాలు ఉన్నాయి. అర్ధమాసాస్తే కల్పంతాం.. మాసాస్తే కల్పంతాం । ఋతవస్తే కల్పతాం సంవత్సరస్తే కల్పతాం’ (యజుర్వేదం, 27:45) మంత్రాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. యజుర్వేదం నాలుగు, ఏడు కాండల్లో ఋతువుల ప్రస్తావన వస్తుంది. శతపథ బ్రాహ్మణంలో కూడా ఋతువుల ప్రస్తావన ఉంది. అయితే, ఇందులో ఏడు ఋతువుల్ని ప్రస్తావించారు.


            కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పంచవత్సరో యుగమితి‘ ` ఐదు సంవత్సరాలు ఒక యుగం అంటూ యుగం అనే భావనకు నిర్వచనం ఇచ్చాడు. జ్యోతిశ్శాస్త్రం కూడా ఇదే భావనను సమర్థించింది.


  యుగాలు, యుగవిభజన ప్రస్తావన మొదటిసారిగా మహాభారతంలో కనిపిస్తుంది. కృత, త్రేత, ద్వార, కలియుగాలతో పాటు కల్ప,మహాకల్ప విభజన కూడా వ్యాసమహర్షి ఇందులో ప్రస్తావించారు. మహాభారతంలో అంతర్భాగమైన భగవద్గీతలో కల్పక్షయే పునస్తాని....’ ‘కాలః కలయతామహంమొదలైన శ్లోకాల ద్వారా మహాభారత కాలంలో అనుసరించిన స్పష్టమైన కాలవిభజన గమనించవచ్చు.


 కాలవిభజన

            మనం ఉపయోగించే కాలవిభజనలో అత్యంత సూక్ష్మమైన విభాగం నిమేషం’. దీన్నే వాడుకలో నిమిషంఅంటున్నాం. నిమేషము అంటే రెప్పపాటు కాలం. ఋగ్వేదంలో నిమేషం అనే పదాన్ని కాలానికి సంకేతంగా కాకుండా రెప్పపాటు లేనివారు’ (దేవతలు) అనే అర్థంలో ఉపయోగించారు. ఉపనిషత్తుల కాలానికి వచ్చేసరికి కాలాన్ని స్పష్టంగా విభజించిన ఉదాహరణలు కనిపిస్తాయి. కలా ముహూర్తా: కాష్ఠాశ్చ అహోరాత్రాశ్చ సర్వశ: । అర్ధమాసా మాసా రుతవస్సవంత్సరశ్చ కల్పంతాం॥అంటూ మాండ్యూక్యోపనిషత్తు కాలవిభజన గురించి వివరిస్తుంది.

 ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కాలవిభజనకు దాదాపుగా సమానంగా ఉండే కాలవిభజన మహాభారతం శాంతిపర్వంలోని కాష్ఠా నిమేషా దశ పంచ చైవ...అనే శ్లోకంలో కనిపిస్తుంది. దీని ప్రకారం

1 నిమేషం - రెప్పపాటు కాలం

15 నిమేషాలు - 1 కాష్ఠం

30 కాష్ఠాలు - 1 కళ

30 కళలు - 1 ముహూర్తం

30 ముహూర్తాలు - 1 దివారాత్రి (ఒక రోజు)

30 దివారాత్రులు - 1 మాసం

12 మాసాలు -  1 సంవత్సరం


మనుధర్మశాస్త్రం, అర్థశాస్త్రంలో కూడా ఇదే రకమైన విభజన ఉంది. భాగవత, విష్ణుపురాణాల్లోనూ కాలవిభజన గురించిన శ్లోకాలు ఉన్నాయి.


           కాలవిభజన గురించిన గ్రంథాల్లో సూర్యసిద్ధాంతం చాలా ప్రాచుర్యం పొందింది. మూర్త’, ‘అమూర్తఅనే రెండు రకాల కాలమానాలు  ఇందులో ఉన్నాయి. మూర్తకాలమానంలో ప్రాణఅతిచిన్నదైన కాలప్రమాణం. దీన్ని అనుసరించి ఇతర విభజన జరిగాయి. అవి

6 ప్రాణ కాలాలు - 1 విఘడియ

60 విఘడియలు - 1 ఘడియ

60 ఘడియలు - 1 అహోరాత్రం (ఒక రోజు)


            అమూర్తకాలంలో త్రుటిఅనేది అతిచిన్న కాలప్రమాణం. సూర్యసిద్ధాంతంలో త్రుటిగురించి ఇంతకన్నా ఎక్కువ వివరాల్లేవు. అయితే, 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ఖగోళశాస్త్రవేత్త భాస్కరాచార్యుడు తాను రాసిన సిద్ధాంత శిరోమణిగ్రంథంలో అమూర్తకాలానికి అనేక వివరణలు ఇస్తూ కాలవిభజన చేశాడు. దీనిప్రకారం రోజులో 2916000000 వంతు త్రుటి అవుతుంది. ఆధునిక లెక్కల ప్రకారం సెకనులో 33750 వంతు త్రుటి అవుతుంది. రెండు విలువలూ దాదాపు సమానం. ఎన్నో వందల సంవత్సరాల క్రితమే భారతీయ ఖగోళశాస్త్రవేత్తలు ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండానే చేసిన కాలవిభజన ఇప్పటికీ ప్రామాణికంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.


ఋతువులు, కార్తెలు, మాసాల విభజన


            వసంత, గ్రీష్మ, వర్ష, శరత్‌, హేమంత, శిశిర ఋతువులు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఒక్కో ఋతువు రెండు నెలలు ఉంటుంది. దీనిప్రకారం సంవత్సరానికకి ఉండే 12 నెలల్లో ఆరు ఋతువులు వస్తాయి. వాస్తవానికి భారతీయ వేదవాజ్ఞ్మయంలో అత్యంత ప్రాచీనమైనదైన ఋగ్వేదంలో వసంతం, గ్రీష్మం, శరత్‌ అనే మూడు ఋతువుల ప్రస్తావన మాత్రమే ఉంది. వర్షాన్ని ప్రత్యేక ఋతువుగా కాకుండా ప్రత్యేక కాలంగా పరిగణిస్తున్నట్లు (ఋగ్వేదం ఏడో మండలం) ఉంది. కృష్ణయజుర్వేదంలో ఐదు ఋతువుల ప్రస్తావన ఉంది. ఆ తర్వాత తైత్తిరీయ సంహితలో మొదటిసారిగా ఆరు ఋతువుల ప్రస్తావన కనిపిస్తుంది. అయితే, ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం... అనే 12 పేర్లు కాకుండా మధు, మాధవ, శుక్ర, శుచి, నభ, నభస్య, ఇష, ఊర్జ, సహ, సహస్య, తప, తపస్య అనే పేర్లను ఇందులో ఉపయోగించారు.


            ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న చైత్ర, వైశాఖాలనే మాసాల పేర్లు చంద్రగ్రహ సంచారం ఆధారంగా ఏర్పడ్డాయి. నక్షత్రాల ఆధారంగా చంద్రుడి గమనాన్ని పరిశీలిస్తే చంద్రుడు ఒక నక్షత్ర కూటమి నుంచి బయల్దేరి మళ్ళీ అదే నక్షత్రకూటమికి చేరుకోవటానికి దాదాపు 27 రోజులు పడుతుంది. దీన్నే నక్షత్రమాసం అంటాం. ఈ 27 రోజుల్లో చంద్రుడు దాటే ఒక్కో నక్షత్రం ఆధారంగా అశ్వని, భరణి, కృత్తిక మొదలైన 27 నక్షత్రాల పేర్లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ప్రతి నెలలో నిండు పూర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు మీద ఆ నెలకు పేరు ఏర్పాటుచేశారు. దీనిప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజున చిత్త నక్షత్రంలో ఉంటే చైత్రమాసం అవుతుంది. ఇదేతీరులో విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వచ్చే నెల వైశాఖమాసం... ఇలా అన్ని నెలల పేర్లు ఏర్పడ్డాయి.


            చంద్రగమనం మాదిరిగానే సూర్యుడికి సంబంధించిన సంవత్సర కాలాన్ని 27 భాగాలుగా చేసి వాటికి కార్తెఅనే పేరు నిర్ణయించారు. ఒక్కో నక్షత్ర కూటమిలో సూర్యుడు దాదాపు రెండు వారాల పాటు ఉంటాడు. దీనిప్రకారం ఒక్కో కార్తె సుమారుగా 13 లేదా 14 రోజులు ఉంటుంది. అశ్వని నుంచి రేవతి వరకు ఇలా నక్షత్రాల పేర్ల మీద కార్తెలు ఏర్పడ్డాయి.


            ఆదివారం నుంచి శనివారం వరకు మనం ఉపయోగించే వార విభజన గ్రహకక్ష్యలను ఆధారంగా చేసుకుని నిర్ణయించారు. ఈ వివరాలు సూర్యసిద్ధాంత గ్రంథంలో ఉన్నాయి. దీనిప్రకారం గ్రహకక్ష్యల్లో నాల్గవది సూర్యకక్ష్య. దీనిప్రకారం మొదటివారం ఆదివారంగా ఏర్పడిరది. సూర్యుడి నుంచి నాలుగో కక్ష్యలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆదివారం తర్వాత సోమవారం’ (సోముడంటే చంద్రుడు) ఏర్పడిరది. చంద్రుడి నుంచి నాలుగో కక్ష్యలో బుధుడు ఉంటాడు కాబట్టి బుధవారం... ఇలా మిగిలిన వారాలన్నీ ఏర్పడ్డాయి.


సంవత్సరాల పేర్ల కథ


  ఆజన్మ బ్రహ్మచారి అయిన నారదమహర్షికి ఒక రోజు విచిత్రమైన కోరిక కలిగింది. సంసారం మాయ అంటారు. దాన్నే సంసార బంధం అంటారు. ఇదంతా ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. వెంటనే తన కోరికను విష్ణుమూర్తికి విన్నవించాడు. భూలోకంలోని ఓ కొలను చూపించి అందులో స్నానం చేసి రమ్మంటాడు విష్ణుమూర్తి. సరేనంటూ స్నానానికి వెళ్తాడు నారదుడు. స్నానం పూర్తిచేసి సరస్సు నుంచి బయటకు వచ్చేసరికి నారదుడు స్త్రీగా మారిపోతాడు. పూర్వజ్ఞానం కూడా కోల్పోతాడు. ఇంతలో అటుగా వచ్చిన ఆ దేశపు రాజు స్త్రీరూపంలో ఉన్న నారదుడిని చూసి మోహించి ఆమెను వివాహం చేసుకుంటాడు. వీరికి 60 మంది సంతానం కలుగుతారు. కొన్నేళ్ళ తర్వాత శత్రువులతో జరిగిన యుద్ధంలో రాజు తన 60 మంది సంతానంతో సహా మరణిస్తాడు. స్త్రీరూపంలో ఉన్న నారదుడికి అంతులేని దు:ఖం కలుగుతుంది. మరణించిన వారందరి ఉత్తరక్రియలు పూర్తయిన తర్వాత తాను పూర్వం స్నానం చేసిన కొలనులోనే స్నానం చేస్తాడు. వెంటనే పూర్వపు నారదుడి రూపు పొందుతాడు. అయినప్పటికీ తన పుత్రుల మరణదు:ఖం నుంచి తేరుకోలేకపోతాడు. అనేకవిధాలుగా విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై నారదుడు అడిగిన సందేహాన్ని తీర్చేక్రమంలో తానే ఈ మాయా నాటకాన్ని నడిపించానని చెబుతాడు. నారదుడి సంతానం పేర్లు శాశ్వతంగా ఉండటం కోసం వారి పేర్లనే సంత్సరాల పేర్లుగా మార్చి, కాలంతో పాటు వారి పేర్లు శాశ్వతంగా ఉండేలా వరమిస్తాడు. అలా నారదుడి సంతానమైన ప్రభవ, విభవ, శుక్ల... తదితర 60 పేర్లు ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న సంవత్సరాల పేర్లుగా చెలామణిలోకి వచ్చాయి.


పంచాంగాలు, సిద్ధాంతాలు


            ఉగాది అనగానే గుర్తుకువచ్చే అంశాల్లో ఉగాది పచ్చడి తర్వాతిస్థానం పంచాంగానిదే. రాబోయే సంవత్సరకాలంలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ రచనకు సూర్య, దృక్‌ అనే రెండు సిద్ధాంతాలు మనదేశంలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిల్లో సూర్యసిద్ధాంతం అత్యంత ప్రాచీనమైనమైంది. సుమారుగా 1800 సంవత్సరాలుగా ఇది ప్రాచుర్యంలో ఉంది. భట్టోత్పల, దివాకర, కేశవ, విజయనంది, చిత్రభాను, శ్రీరంగనాథ, మకరంద, నరసింహ, భాస్కరాచార్య, ఆర్యభట్ట, వరాహమిహిర తదితర ఖగోళ గణిత (ఆస్ట్రోమ్యాథమెటిక్స్‌) శాస్త్రవేత్తలు ఖగోళ పరిజ్ఞానం ఆధారంగా కాలవిభజన చేసి, స్పష్టమైన వివరణ ఇచ్చారు. వీరిలో క్రీ.శ.1178 కాలానికి చెందిన మల్లికార్జున సూరి రాసిన సూర్య సిద్ధాంత భాష్యంతెలుగు, సంస్కృత భాషల్లో ముద్రితమై ఇప్పటికీ వాడుకలో ఉంది. పంచాంగ రచనలకు ఇదే అత్యంత ప్రామాణికమైన గ్రంథం. సూర్యసిద్ధాంతం, ఆర్యభట్టీయం, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ` ఈ మూడు గ్రంథాల ఆధారంగా ప్రపంచంలోని అనేకదేశాలు ఇప్పటికీ తమ కాలమానిని (క్యాలెండర్‌) తయారుచేసుకుంటున్నాయి. దృక్‌సిద్ధాంతాన్ని కేరళ రాష్ట్రానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు పరమేశ్వర’ (క్రీ.శ.1431) వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. సూర్య, దృక్‌ సిద్ధాంతాల ఆధారంగానే ఇప్పటికీ పంచాంగాలు తయారవుతున్నాయి.

==============

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

సెల్ : 9032044115 / 8897547548

 


Saturday, May 16, 2020

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...