Thursday, December 17, 2020

స్కంద షష్ఠి సందర్భంగా కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం


స్కంద షష్ఠి సందర్భంగా 

కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం



జ్ఞానస్వరూపుడు... స్కందుడు


నమస్తే నమస్తే మహాశక్తి పాణే నమస్తే నమస్తే లసద్వజ్రపాణే |

నమస్తే నమస్తే కటిన్యస్త పాణే నమస్తే నమస్తే సదాభీష్టపాణే ||

స్కందుడు రాశీభూతమైన జ్ఞానస్వరూపుడు. ఆయన చేతిలోని 'శక్తి' ఆయుధం సునిశితమైన మేథస్సుకు ప్రతీక. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులనే మూడు శక్తుల సంయోగ స్వరూపంగా నిలిచి, అజ్ఞానం అనే తారకాసురుడిని సంహరించి, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి ఆయన. బౌద్ధికజ్ఞానంతో పాటు అపారమైన భుజశక్తికి కూడా స్కందుడు ప్రతీకగా నిలుస్తాడు. రాక్షస సంహార విషయంలో దేవతలకే సేనా నాయకుడిగా నిలిచి, వారిని ఆదుకున్న ధీశాలి సుబ్రహ్మణ్యడు. 

స్కందుడన్న పేరు సుబ్రహ్మణ్యస్వామికి ప్రసిద్ధమైంది. స్కన్నమైన (జారిన) వాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతి నుండి ఆవిర్భవించిన ఆరుజ్యోతుల స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. ఆయనే స్కందుడు. శరవణభవుడు, కార్తికేయుడు. కుమారస్వామి.... ఇలా సుబ్రహ్మణ్యస్వామికి ఎన్నో పేర్లు వ్యాప్తిలో ఉన్నాయి. శివపార్వతుల తనయుడిగా స్కందుడు ఆవిర్భవించిన తిథి 'షష్ఠి'. శక్తి కారకుడిగా పేరున్న ఆ స్వామి తారకాసుర సంహార సందర్భంలో దేవతలకు సేనాధిపత్యం వహించి, రాక్షస సంహారం చేసిన రోజు మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ కారణాల వల్ల మార్గశిర శుద్ధ షష్ఠి 'స్కంద షష్ఠి'గా వ్యాప్తిలోకి వచ్చింది. 

సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం

సుబ్రహ్మణ్యస్వామి జన్మవృత్తాంతానికి సంబంధించి అనేక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. అనేక పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాల్లో సుబ్రహ్మణ్యుడి జనన వృత్తాంతానికి సంబంధించిన కథనాలు వర్ణితమై ఉన్నాయి. ఈ కథల్లో కొద్దిపాటి భేదాలు ఉన్నప్పటికీ స్థూలంగా కుమారస్వామి శివపార్వతుల తనయుడనే విషయంలో ఎటువంటి అభిప్రాయభేదం వీటిల్లో లేదు. 

పూర్వం తారకుడు అనే రాక్షసుడు మదగర్వంతో ముల్లోకాలపై దండెత్తి దేవ, మానవ, రాక్షసులను ముప్పుతిప్పలు పెట్టసాగాడు. అతడి ఆగడాలు భరించలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించి, ఎలాగైనా తారకాసురుడి బారినుంచి ముల్లోకాలను రక్షించమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు దివ్యదష్టితో పరీక్షించి, తారకాసురుడు శివుడి అంశతో పుట్టిన శక్తిమంతుడైన వీరుడికి తప్ప మరెవరికీ లొంగడని దేవతలతో చెప్పాడు. అప్పటికే శివుడు తన అర్ధాంగి అయిన సతీదేవిని దక్షయజ్ఞ సమయంలో కోల్పోయి బాధతో హిమాలయాల్లో తపస్సు చేసుకొంటున్నాడు.

పరమశివుడు మరొక కన్యను వివాహం చేసుకుంటే తప్ప శివాంశతో వీరుడు పుట్టడం అసంభవం. అప్పుడు ఇంద్రుడు దేవతలతో సమావేశమై కర్తవ్యాన్ని గురించి ఆలోచించాడు. ఇంతలో ఇంద్రుడికి మన్మథుడి రూపంలో సమస్యకు పరిష్కారం కనిపించింది. వెంటనే మన్మథుణ్ని తన సభకు రప్పించి, ముల్లోకాలను రక్షించటం కోసం శివుడి మనసులో వివాహేచ్ఛకు మూలమైన ప్రేమను అంకురింపజేయమని కోరాడు. మన్మథుడు లోకరక్షణార్థం ఆ పని చేయడానికి అంగీకరించి, తన బాణాలకు పదునుపెట్టాడు. నిత్యం శివుణ్ని ఆరాధించడానికి హిమవంతుడి కుమార్తె పార్వతి హిమాలయాలకు రావడం గమనించాడు. 

ఒకనాడు పార్వతి శివుడిని అర్చిస్తుండగా, శివుడి మనసులో కోరికలు రేపే విధంగా తన పూలబాణాలను ప్రయోగించబోయాడు. తపోధ్యానంలో ఉన్న శివుడి మనసులో వికారం కలిగింది. జితేంద్రియుడైన శివుడు వెంటనే అది గ్రహించి, కోపంతో తన నొసటిపైనున్న అగ్నినేత్రాన్ని తెరిచి, మన్మథుణ్ని చూశాడు. శివుడి ఆగ్రహం ప్రళయాగ్నిగా మారి క్షణంలో మన్మథుడిని భస్మం చేసింది. ఆ సంఘటనతో కలత చెందిన పార్వతి తన ఇంటికి వెళ్ళిపోయింది. శివుడూ తన తపస్సుకు భంగం కలిగించిన ఆ చోటును వదిలి మరోచోటుకు వెళ్ళిపోయాడు. ఇంద్రాది దేవతల ఆశ నెరవేరలేదు. ఆ తరవాత సప్తర్షులు పూనుకొని పరమేశ్వరుణ్ని ఆశ్రయించి, హిమవంతుణ్ని ప్రేరేపించి పార్వతీపరమేశ్వరుల వివాహం జరిపించారు. 

వివాహానంతరం నవదంపతులు ఏకాంతంలో అన్యోన్యానురాగంతో ఉండగా, అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి వస్తాడు. అది చూసిన శివుడు తన తేజస్సును అగ్నికి ఇస్తాడు. అగ్ని దాన్ని భరించలేక గంగానదిలో జారవిడుస్తాడు. అదే సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృత్తికాదేవతల గర్భంలోకి శివతేజస్సు చేరుతుంది. వారూ ఆ తేజస్సును భరించలేక తీరంలో ఉన్న రెల్లు పొదల్లో వదిలేస్తారు. కొంతకాలానికి ఆ పొదల్లోనే ఆరు ముఖాలతో బాలుడు జన్మిస్తాడు. అతడే షణ్ముఖుడైన కుమారస్వామి. 

రాక్షస సంహారం కోసమే ఆవిర్భవించిన కుమారస్వామి దేవకార్యాన్ని నెరవేర్చటానికి సన్నద్ధమయ్యాడు. తల్లి ఇచ్చిన 'శక్తి' ఆయుధాన్ని ధరించాడు. దేవతల సర్వసైన్యానికి నాయకుడిగా బాధ్యతలు స్వీకరించి, అమేయమైన పరాక్రమంతో తారకాసురుడితో పాటు అతడి సోదరులను కూడా సంహరించాడు. 

కావడి మొక్కులంటే ఇష్టం

పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి క తజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద 'బ్రహ్మదండం' అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.

సుబ్రహ్మణ్య వైభవం

సుబ్రహ్మణ్యుడు రూపంలో అందగాడు. శౌర్యంలో సాటిలేని వాడు. అందుకే దేవసేనాధిపతి అయ్యాడు. ఈయన వాహనం నెమలి. ఆయుధం శూలం. దీనిని విజయ శూలమనీ, జ్ఞాన శూలమనీ అంటారు. సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు అన్న పేరుంది. అంటే ఆరు ముఖాలు కలవాడని అర్థం. ఈ ఆరుముఖాలు జ్ఞానం, వైరాగ్యం, శక్తి, యశస్సు, ఐశ్వర్యం, దైవత్వానికి ప్రతిరూపాలు. వల్లీ, దేవసేన స్వామివారి ఉభయ దేవేరులు. 

కార్తికేయుడు మేధోమూర్తి. వేదాలు ఇతణ్ని యజ్ఞాగ్నిగా అభివర్ణించాయి. ఉపనిషత్తులు సనత్కుమారుడిగా కీర్తించాయి. శివుడికి ప్రణవనాదమైన 'ఓం'కార అర్థాన్ని వివరించిన చెప్పిన ఘనత కూడా సుబ్రహ్మణ్యుడికే దక్కుతుంది. ఈవిధంగా ఆదిదేవుడికే గురుదేవుడు అయ్యాడు కుమారస్వామి. శ్రీకష్ణుడు భగవద్గీతలో 'సేనాధిపతులలో స్కందుడిని నేను' అని ప్రకటించటం స్కందుడి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది.

వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇదీ సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలనువెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి. ఈవిధంగా అనంతం, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులకు సుబ్రహ్మణ్య ఉపాస కేంద్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఉపాసన ద్వారా మోక్షాన్ని అందుకున్న మహనీయులు ఎందరో ఉన్నారు. 

యోగస్వరూపుడు

'సార్ధ త్రి వలయకారిణీ సుప్త భుజంగాకార రూపా...' - మానవదేహంలో మూలాధార స్థానంలో కుండలినీ శక్తి మూడు చుట్లు చుట్టుకుని నిద్రిస్తున్న పాములా ఉంటుందని చెబుతారు. సాధకుడిలో ఆ శక్తి జాగృతమై సహస్రారం వరకు ప్రయాణిస్తుందని యోగశాస్త్రం చెబుతోంది. సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు. యోగ స్వరూపుడు. సాధనలో మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఆరుస్థానాలు క్రమంగా వికాసం పొందితే ఆ పైన ఉన్న సహస్రారంలో పరమచైతన్యం అనుభవానికి వస్తుంది. పరమాత్మ సుబ్రహ్మణ్యరూపంలో అవతరించే క్రమంలో ఆరుముఖాలతో దర్శనమిస్తాడు. ఇవి ఆరుచక్రాలకు సంకేతం. కుండలినీ శక్తి సర్పాకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఈ యోగానికి అధిపతి కుమారస్వామి. ఈ విషయాన్ని సంకేతరూపంలో చెప్పటమే సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో ఉంటాడని వర్ణించటానికి కారణం. 

షణ్ముఖుడు జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానమిచ్చేవాడు. జ్ఞానాన్ని సంస్కతంలో సుబ్రహ్మ అంటారు. అందువలన ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడని ప్రసిద్ధి చెందాడు. ఈయన జన్మరాశి వశ్చికం నుండి జన్మలగ్నమైన మేషం వరకు ఆరు రాశులు ఉన్నాయి. ఈ ఆరురాశులు మనశరీరంలోని షట్‌ చక్రాలు. వశ్చికరాశిని తోకగా పరిగణిస్తే మేషరాశి పాము శిరస్సు అవుతుంది. ఈ పద్ధతిలో స్వామి కుండలినీ ప్రభువు అయ్యాడు. ఇవన్నీ జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించిన విషయాలు. సర్పం వీటికి సంబంధించినది. అందువల్లనే సర్పాలను సదాశివుడు ధరించి పన్నగభూషణుడని ప్రసిద్ధి చెందాడు. ఈ పన్నాగాలు సుషుమ్నా నాడీరూపంలో ఉన్న షణ్ముఖుని విభూతి రూపాలు. ఆ కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరుని సర్పరూపంలో పూజిస్తారు.

ఆరక్షరాల దైవం

షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందు (నడుముభాగం) హస్తాన్ని ఉంచి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి సుబ్రహ్మణ్యుడు. పరిపూర్ణమైన జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణన్నవారిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజం పథ్వి, అగ్ని, జలం, షట్‌ కత్తికల శక్తిని (నక్షత్రశక్తి) ధరించి, చివరకు బ్రహ్మతపోనిర్మితమైన అలౌకిక మహాగ్ని శరవణంలో (అగ్నితో కూడిన రెల్లుతుప్పు)  బాలుడిగా రూపుదిద్దుకుంది. అందుకే స్వామి శరణభవుడు. శరవణభవ అనే పదంలో ఒక్కో అక్షరానికి ఒక్కో ప్రత్యేకమైన అర్థం ఉంది. శ - శమింపజేయువాడు, ర - రతిపుష్టిని ఇచ్చువాడు, వ - వంధ్యత్వం రూపుమాపువాడు, ణ - రణమున జయాన్నిచ్చేవాడు, భ - భవసాగరాన్ని దాటించేవాడు, వ - వందనీయుడు అని ఈ పదాలకు అర్థం. 

బీజాక్షర పరంగా చూస్తే, శ - లక్ష్మీబీజం. దీనికి అధిదేవత శంకరుడు. ర - అగ్నిబీజం. దీనికి అధిదేవత అగ్ని. వ - అమతబీజం. దీనికి అధిదేవత బలభద్రుడు. ణ - యక్షబీజం. దీనికి అధిదేవత బలభ్రద్రుడు. భ - అరుణ బీజం. దీనికి అధిదేవత భద్రకాళీదేవి. వ - అమతబీజం. దీనికి అధిదేవత చంద్రుడు. 

-----------------------------------------------------------------------

కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం

-----------------------------------------------------------------------














Saturday, December 5, 2020

ముక్కోటి ఏకాదశి విశేషాలు, నియమాలు, ఆచరించాల్సిన విధానాలు వివరిస్తూ ఆరాధన మాసపత్రిక డిసెంబరు 2020 సంచికలో రాసిన వ్యాసం

ముక్కోటి ఏకాదశి విశేషాలు, నియమాలు, ఆచరించాల్సిన విధానాలు వివరిస్తూ ఆరాధన మాసపత్రిక డిసెంబరు 2020 సంచికలో రాసిన వ్యాసం











ముక్తిదాయకం... ముక్కోటి ఏకాదశి
ప్రతి తిథీ ప్రత్యేకమే అయినప్పటికీ ఏకాదశికి మరింత ఎక్కువ ప్రత్యేకత కనిపిస్తుంది. ఏకాదశి అనే పేరు తలచుకోగానే ఓ పుణ్యభావన మన మనస్సుల్ని ఆవహిస్తుంది. ఏకాదశి రోజున పని ప్రారంభిస్తే విజయం తథ్యమనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆ రోజున చేసే అర్చనలకు శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందుతారని పురాణాలు, ఆచారాలు కూడా విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా ఏకాదశి రోజున సాధ్యమైనంత మేరలో విష్ణుమూర్తిని అర్చించి తరించాలని ప్రతి ఒక్కరూ తపిస్తుంటారు. ఇలా సంవత్సరానికి వచ్చే అన్ని ఏకాదశుల్లో మార్గశిర, పుష్యమాసాల్లో వచ్చే ముక్కోటి ఏకాదశి మరింత పుణ్యప్రదమైనదిగా ప్రసిద్ధి పొందింది.
ప్రతి నెలలో రెండు ఏకాదశులు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం ఉంటే మరో రెండు ఏకాదశులు అదనం. ప్రతి ఏకాదశికి నిర్దుష్టమైన నామధేయాలున్నాయి. ఆర్ష సంప్రదాయంలో ఏకాదశి తిథి పరమపవిత్రమైంది. శ్రావణ, కార్తిక, మార్గశిర మాసాల్లోని ఏకాదశులకు మరిన్ని ప్రత్యేకతలు  ఉన్నాయి. వీటిలో ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి విశేషమైనది. దీన్నే ముక్కోటి ఏకాదశి పర్వదినంగా జరుపుకోవటం ఆనవాయితీగా ఏర్పడింది. 

ఏకాదశి...విశేషాల రాశి

విష్ణువు 'మురుడు' అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి, సింహవతి అనే గుహలో సేదతీరుతున్నాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తిక శుక్ల ఏకాదశి వరకు ఆ గుహలోనే యోగనిద్రలో ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన మూరాసురుడు మాయోపాయంతో విష్ణువుపైకి దాడికి సిద్ధమయ్యాడు. అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయ శక్తి రూపంలో వెలువడింది. ఆ మహాశక్తి మురాసురుడ్ని సంహరించింది. విష్ణుమాయా విలాసం నుంచి ఉత్పన్నమైన ఆ శక్తి స్వరూపానికి శ్రీహరి వరాన్ని అనుగ్రహించాడు. విష్ణువుకు ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట ఆ శక్తి రూపం పూజలందుకుంటుందని పేర్కొన్నాడు. ఆనాటి నుంచి ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తున్నారని ఏకాదశి తిథి ఆవిర్భావ వత్తాంతాన్ని భవిష్యోత్తర పురాణం వివరించింది.

    సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, విష్ణువు అనుగ్రహం వల్ల సంతాన సిద్ధి పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యవంశ రాజైన రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక, తన రాజ్యంలో అందరిచేత నిర్వహింపజేసి, శ్రీహరికి ప్రియ భక్తుడయ్యాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వైఖానసుడు అనే రాజు పితృదేవతలకు ఉత్తమగతుల్ని అందించడానికి ముక్కోటి ఏకాదశి వ్రతం చేసినట్లు విష్ణుపురాణం వివరిస్తుంది.

ఓ సందర్భంలో బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలన్నీ కలిసి అసురశక్తులపై విజయాన్ని సాధించటానికి శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. వైకుంఠ ఉత్తరద్వారం నుంచి వైకుంఠంలోకి ముక్కోటి దేవతాసమూహం ప్రవేశించారు. శ్రీహరి దర్శనాన్ని పొంది విష్ణు కరుణకు పాత్రులయ్యారు. సమస్త దేవతలు వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ముక్కోటి ఏకాదశి. 

ఏకాదశి తిథికి 'హరివాసరం' అని పేరు. వైకుంఠ ఏకాదశిని హరి ఏకాదశి, మోక్ష ఏకాదశి, సౌఖ్య ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమన్నారాయణునికి సూర్యుడు కుడికన్ను కాగా చంద్రుడు ఎడమకన్నుగా ప్రకాశిస్తారు. నేత్రాలు వేరైనా దృష్టి ఒక్కటే. సూర్యచంద్రులు వేర్వేరుగా గోచరమవుతున్నా సమగ్రంలో కాంతి శక్తి ఒక్కటే. విరాట్‌ స్వరూపుడైన విష్ణువు ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతున్నా భగవత్‌ చైతన్యం, ఈశ్వర తత్త్వం ఒక్కటే. అసురశక్తుల బారిన పడకుండా ప్రతికూల శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కొని, సానుకూల శక్తుల్ని పెంపొందింప జేసుకోవడానికే ముక్కోటి దేవతలు విష్ణువును ఆశ్రయించారు. విష్ణుకృపను సాధించి మనోభీష్టాల్ని నెరవేర్చుకున్నారు. అందుకే ఈ ఏకాదశిని భగవదవలోక దినోత్సవం అని, మోక్షోత్సవమని కూడా పేర్కొంటారు. 

సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన తర్వాత మకరసంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి (జనవరి 14 నుండి జూలై 16 వరకు) ముందు ముక్కోటి దేవతలతో సమ్మిళితమై ఉన్న విష్ణువును ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా ఆలయాల్లో దర్శిస్తే సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం.

ఏకాదశి నియమావళి

ముక్కోటి ఏకాదశి పర్వదినం వైష్ణవ ఆగమ శాస్త్రప్రకారం ఎంతో విశేషమైనది. తిరుమల శ్రీవారి సన్నిధితో పాటు ప్రముఖ వైష్ణవక్షేత్రాలైన శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం, గురువాయురు, భద్రాచల దివ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనం కోసం ఉత్సవమూర్తుల్ని సర్వాలంకార యుక్తంగా ఉత్తరద్వారంలో కొలువుదీరుస్తారు. ముక్కోటి పర్వదిన సందర్భంగా ప్రతి వైష్ణవ సన్నిధానం వైకుంఠమై విలసిల్లుతుంది. వేద, వేదాంగ, పద, క్రమ, ఉపనిషత్తుల్ని గానం చేస్తారు. షోడశోపచారాలతో స్వామికి కైంకర్యాలు కొనసాగుతాయి. అలంకార ప్రియుడైన విష్ణుభగవానుడి అవతార స్వరూపాలైన శ్రీరామ, శ్రీకష్ణ, శ్రీవేంకటేశ్వర నసింహ ఆలయాలన్నీ నేత్రానందకరంగా భాసిల్లుతాయి. దశమి నాడు ఏక భుక్తం, ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు అన్నదానం అనేది సంప్రదాయరీత్యా పాటించాల్సిన నియమాలు. 

బ్రహ్మాది దేవతలు స్తుతులు చేస్తుండగా, మంగళధ్వనులు మారుమ్రోగుతుండగా, వేద పండితులు సస్వరంగా మంత్రాలు పఠిస్తుండగా పాలకడలిలో శేషతల్పంపై పవళించిన శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మి సేవ చేస్తూ ఉంటుంది. విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన పద్మంలో బ్రహ్మ కొలువై ఉండగా స్వామి అనంత పద్మనాభుడిగా తేజరిల్లుతాడు. ఈ వైకుంఠ దివ్య దర్శనాన్ని ప్రతి భక్తుడు సదా తమ హృదయ పీఠంపై నిలుపుకోవాలి, విష్ణుకృపకు పాత్రులు కావాలి. చీకటి నుంచి వెలుగువైపునకు నిత్య చైతన్యంతో పయనించాలి. 

వైష్ణవక్షేత్రాల్లో సందడి

ముక్కోటి రోజున వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఆ రోజున ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజామునుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తరద్వార దర్శనం వేచి ఉంటారు. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందు వల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూట విషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఈ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగుసార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది. ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లు ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరిరోజున, వైకుంఠ ఏకాదశి మరునాటి తిథి ద్వాదశి ఉన్న రోజు, రథసప్తమి రోజు స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈ రోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.

మనసే విష్ణు నివాసం

విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించాలి. అంటే, ఉపవాసం ద్వారా ఏకాదశ ఇంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్ళు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్ళు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు. ముక్కోటి ఏకాదశి అందించే సందేశం ఇది.

--------------------
రచనః డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ -3, సెల్‌: 90320 44115 / 8897 547 548


ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...