Sunday, May 31, 2020

వేదాల్లో వ్యవసాయ విజ్ఞానం


వేదాల్లో


వేదాల్లో వ్యవసాయం

           

            కన్నతల్లి గోరుముద్ద అందించే అమృత మధురిమల వెనక కర్షకుడు పడే కష్టం ఎంతో ఉంటుంది. రక్తాన్ని చెమటగా మార్చి అతడు పడే కష్టమే మనకు పట్టెడన్నాన్ని ఇస్తుంది. జానెడు పొట్టకి గుప్పెడు మెతుకులు దొరక్కపోతే...ఆ దృశ్యాన్ని కనీసం ఊహించటం కూడా కష్టమే. కానీ ఆ గుప్పెడు మెతుకులు పండిరచటం కోసం రైతు ఎంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకోగలిగితే ప్రతి మెతుకులోనూ పరమాత్మ సాక్షాత్కరిస్తాడు.

            అనంతమైన పోషకాల్ని తనలో నింపుకున్న భూమి నుంచి మనకు కావలసిన విధంగా వివిధ రకాలైన ధాన్యాల్ని పండిరచి అందించే రైతు చేసేది కేవలం వ్యవసాయం మాత్రమే కాదు. అదొక యజ్ఞం. ఇతర యజ్ఞాలకన్నా రైతు చేసే వ్యవసాయ యజ్ఞం ఎన్నో రెట్లు గొప్పది. అందుకే వేదాలు సైతం వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాయి. వందలాది మంత్రాలతో వ్యవసాయ యజ్ఞ విధానాన్ని అందించాయి. తమ అవతారాల సమయంలో దేవతలు సైతం హలాలు పట్టి పొలాలు దున్నారు. రైతన్న కష్టం ఏమిటో తామూ అనుభవించారు. అందుకే రాజు చేతిలో ఉండే దండం కన్నా రైతు చేతిలో ఉండే నాగలే గొప్పదంటాడు ఓ కవి.

            పంచభూతాల్లో మొదటిది భూమి. మానవ జీవితానికి అవసరమైన వస్తువులన్నీ భూమి నుంచే అందుతాయి. అందుకే భూమిని తల్లిగా భావించి భూమాతగా అర్చించే సంప్రదాయం మనకు ఉంది. వ్యవసాయం ప్రారంభించటానికి ముందుగా భూమి పూజ తప్పనిసరిగా చేసే ఆచారం కూడా వ్యాప్తిలో ఉంది. ఇలా పొలాల్లో దుక్కిదున్ని వ్యవసాయ యజ్ఞాన్ని ప్రారంభించే పర్వదినమే ఏరువాక పూర్ణిమ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సస్యానికి (పంటలు) అధిపతి చంద్రుడు. ఇతడు జ్యేష్ట నక్షత్రానికి చేరువలో ఉన్న సమయంలో పొలం పనులు ప్రారంభిస్తే మంచి దిగుబడులు వస్తాయి. ఈవిధంగా జ్యేష్ఠ పూర్ణిమ రోజున వ్యవసాయ పనులు ప్రారంభించి ఏరువాక పూర్ణిమ జరుపుకోవటం వ్యాప్తిలోకి వచ్చింది.

 ·        వేదాల్లో అతి ప్రాచీనమైన ఋగ్వేదంలోని అక్షసూక్తం (10.34) లో ప్రత్యేకంగా వ్యవసాయ స్తుతి ఉంది. అదే వేదంలోని కృషిసూక్తంలో సునాసీర’ (సునా = సంతోషం, సీర = నాగలి) అనే పదం ద్వారా ఋగ్వేదకాలానికే నాగలి వాడుకలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మంచి పంటల కోసం భూమిని ఒకటికి పదిసార్లు దున్నాలని కూడా ఋగ్వేదం (1.23.15) చెబుతోంది. తాళ్ళతో నాగలిని, ఎద్దుల మూపుల మీద కాడిని ఎంతో నేర్పుగా కట్టాలనే ప్రస్తావన (4.57.4) కూడా ఇందులో ఉంది. ఋగ్వేదం పదోమండలంలో (101.3) కోతలకు ఉపయోగించే కొడవలి గురించిన వివరాలు ఉన్నాయి. పొలంలోని కళ్ళెంలో నిల్వచేసిన ధాన్యాన్ని తూర్పారపట్టడం, ఆ ధాన్యాన్ని ఎడ్లబండి మీద ఇంటికి చేరవెయ్యటం కూడా ఈ వేదంలో ఉంది. పంట పొలాలను కొలిచే పద్ధతులు కూడా (1.10.5) కూడా ఇందులో ఉన్నాయి. 

·        యజర్వేదం మరికొంత వివరణ ఇస్తూ పంటల్ని వ్యవసాయాధార పంటలు, వర్షాధార పంటలుగా విభజించింది. తైత్తిరీయ సంహిత చమకాధ్యాయం (4.7.5)లోని ఓషధయశ్చ మే కృష్ణపచ్యం చ మే అకృష్ణపచ్చం చ మే...’ `నాకు దున్నిన పొలాల పండిన ఓషధులు, దున్నకపోయినా వర్షాధారంగా పండిన ఓషధులు లభించుగాక` మంత్రం ద్వారా వ్యవసాయ పంటల విభాగం వేదకాలం నాటికే ఉన్నట్లు స్పష్టమవుతోంది. వివిధరకాల పంటలు, ధాన్యాల పేర్లు కూడా చమకాధ్యాయంలో ఉన్నాయి. వ్రీహయశ్చ మే యవాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే మసురాశ్చ మే ప్రియంగవశ్చ మే...అంటూ సాగే మంత్రం వరి, యవలు, మినుములు, నువ్వులు, పెసలు, గోధుమలు, శెనగలు మొదలైన ధాన్యాల గురించిన ప్రస్తావన చేస్తుంది. 

·        ఇదే రుద్రాధ్యాయంలోని నమస్తక్షభ్యో రథకారేభ్య:...’ ` అనే మంత్రంలో వడ్రంగులు, రథాలు, బళ్ళు తయారుచేసే కార్మికులకు నమస్కారం అంటూ వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులు చేసే కార్మికుల ప్రస్తావన కనిపిస్తుంది. కేవలం ఆయా వృత్తిదారుల ప్రస్తావన మాత్రమే కాకుండా వారికి నమస్కరిస్తూ కార్మికులను సమున్నతంగా గౌరవించే సంప్రదాయాన్ని కూడా వేదం వ్యాప్తిలోకి తీసుకువచ్చింది. 

·        యజుర్వేదంలోని మైత్రాయణీ సంహితలో నెయ్యి, తేనెలను నాగేటిచాలు (నాగలి మొదలు)లో కుమ్మరించే ప్రక్రియ వివరంగా ఉంది. నాగలి కట్టాల్సిన ఎద్దుల సంఖ్య, వాటి నిర్వహణ కూడా ఇందులో ఉంది. తైత్తిరీయ సంహితలో పరశు’ (గంపలాటి వస్తువు) అనే కొలపాత్ర ప్రస్తావన ఉంది. 

·        ఆపస్తంబ శ్రౌతసూత్రం, స్వాధ్యాయ బ్రాహ్మణం, తైత్తిరీయ సంహితల్లో వ్యవసాయానికి సంబంధించి భూమిని ఎన్నుకోవటం మొదలు, భూమిని ఎలా దున్నాలి (దర్శపూర్ణమాస ప్రకరణం), దున్నేందుకు ఎన్ని జతల ఎడ్లు ఉపయోగించాలి, ఎంత లోతు దున్నాలి మొదలైన విషయాలు అత్యంత వివరంగా వర్ణితమై ఉన్నాయి. 

·        శుక్ల యజుర్వేదంలో ఎత్తు పల్లాలు లేకుండా భూమిని చదును చెయ్యటం (12:69), బంజరు భూములను సాగులోకి తీసుకురావటం (16:33) మొదలైన విషయాల వివరణ ఉంది. 

·        అధర్వణవేదంలో (3.4.3) నాగలి కర్ర, చెర్నాకోల వంటి వ్యవసాయ పనిముట్ల తయారీ, వాటి నిర్వహణ విధానం కూడా వివరంగా ఉంది. ఇదే వేదంలోని 12.1.1 సూక్తాల్లో సుమారు 63 మంత్రాలు ఉన్నాయి. వివిధ రంగుల నేలలు, దున్నిన నేలలు, నివాసయోగ్యమైన నేలలు మొదలైన వ్యవసాయ అనుబంధ విషయాల ప్రస్తావ ఉంది. ఈ మంత్రాలు భూమిని ఓషధులకు తల్లిగా, ఆహారాన్నిచ్చేదిగా, ప్రాణులందరికీ శక్తినిచ్చేదిగా వర్ణించాయి. 

·        అధర్వణవేదంలో నేలదున్నటం, విత్తనాలు నాటడం, పంటలు కోయటం తదితర వ్యవసాయ సంబంధిత పనుల గురించిన ప్రస్తావన విస్తారంగా ఉంది. యునక్త సీరా వియుగా తనోతకృతే / యోనౌ వపతేహ బీజం విరాజః సృష్టిః సభరా / ఆసన్నో నేదీయ ఇత్‌ స్మణ్యః పక్వయా యవన్‌...’ (అధర్వసంహిత, 3.17.2) ` నాగళ్ళు కట్టండి. విత్తనాలు వెదజల్లండి. కంకులు బరువెక్కుగాక. కొడవళ్ళు పండిన యవలను కోసి మా సమీపానికి తీసుకువచ్చు గాక అంటూ నాగలి కట్టే సమయం నుంచి పంటను ఇంటి తీసుకువచ్చే వరకు జరిగే మొత్తం వ్యవసాయ ప్రక్రియను ఈ మంత్రం వర్ణిస్తుంది. 

·        ఆధునిక వృక్షశాస్త్రం విజ్ఞానం వృక్షాలను రెండు రకాలుగా వర్గీకరిస్తే ప్రాచీనకాలం నాటి సుశ్రుత సంహిత వేల సంవత్సరాల క్రితమే మరింత లోతైన అధ్యయనం చేసి వృక్షాలను వనస్పతి, వృక్షం, వీరుంధం, ఓషధి అనే నాలుగు రకాలుగా వర్గీకరించింది. పూలు పూయకుండా ఫలాలు ఇచ్చేది వనస్పతి. పూలతో పాటు ఫలాలను ఇచ్చేది వృక్షం. గుబురుగా అల్లుకుంటూ పెరిగేది వీరుంధం. పళ్ళు పండగానే ఎండిపోయేది వృక్షం. 

·        మహాభారతం శాంతిపర్వంలోని భృగు, భరద్వాజ సంవాదం పూర్తిగా వృక్షాలకు సంబంధించిన వివరణలతోనే సాగుతుంది. వృక్షాలకు ప్రాణం ఉందని, వాటిలో కూడా పంచేంద్రియాలు పనిచేస్తాయని ఇందులో ఉంది. ఈ సంవాదంలోని ప్రతి శ్లోకంలో వృక్షవిజ్ఞానానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందులోని ప్రధానాంశాలు... ఆకులు, బెరళ్ళు, పూలు, పళ్ళు కూడా వేడికి వాడిపోతున్నాయి. క్రమంగా రాలిపోతున్నాయి. కనుక చెట్లకు స్పర్శజ్ఞానం ఉంది. గాలి, నిప్పు, పిడుగు మొదలైనవాటి ధ్వనివల్ల పళ్లు, పూలు రాలిపోతున్నాయి. శబ్దాన్ని చెవి మాత్రమే గ్రహించగలదు. కనుక చెట్లకు వినే శక్తి ఉంది. తీగ చెట్టును పెనవేసుకుంటుంది. అన్ని వైపులకూ పాకుతుంది. చూపులేని వారికి గమనం ఎలా కుదురుతుంది. కనుక చెట్లకు చూసేశక్తి ఉంది. మంచి సువాసనలు మంచి ధూపాలూ ఉంటే చెట్లు రోగాలు లేకుండా ఏపుగా పూత పూస్తున్నాయి. దుర్వాసనలు, చెడు ధూపాలూ వుంటే అవి రోగగ్రస్తాలై పూత తగ్గుతుంది. కనుక చెట్లకు వాసన చూసే శక్తి ఉంది. చెట్లు వేళ్ళతో నీళ్ళు తాగటం కనిపిస్తోంది. వాటికి తెగుళ్ళు రావడం, మందులు వేస్తే తగ్గిపోవడం కనిపిస్తోంది. కనుక చెట్లకు రుచి చూసే శక్తి ఉంది. చెట్లలో సుఖమూ దుఃఖమూ కనిపిస్తున్నాయి. విరిచేస్తే మళ్ళీ మొలుస్తున్నాయి. కనుక చెట్లలో జీవాన్ని నేను చూస్తున్నాను. వాటికి చైతన్యం లేదనే మాటే లేదు. అందుకనే ఆ చెట్లు పీల్చిన జలాన్ని అగ్నివాయువులు జీర్ణింపచేస్తున్నారు. ఆహార పరిణామం వుంది గనుక చెట్లలో స్నేహ గుణమూ (చమురు గుణమూ) అభివృద్ధి కలుగుతున్నాయి. తామరతూడు వంటి గొట్టంతో మనం నీటిని పైకి ఎలా పీలుస్తామో అలాగే చెట్టు కూడా వాయు సహాయంతో తన వేళ్ళతో నీటిని పైకి పీలుస్తుంది. ఇలా భారత రచనాకాలం నాటికే వృక్షాలకు ప్రాణం ఉంటుందనీ, అన్ని జీవుల్లాగానే అవి కూడా స్పర్శ జ్ఞానం, శబ్ద జ్ఞానం,వాసన, రుచి వంటి అనుభవాలను గ్రహించగలవని తెలుస్తోంది. 

·        వేదాలకు అనుబంధంగా సాగే జ్యోతిషశాస్త్రంలో కూడా వ్యవసాయానికి సంబంధించిన వందలాది ప్రస్తావనలు కనిపిస్తాయి. కొత్త నాగలి కట్టడానికి, కోడెను కాడి కలపటానికి, బావి తవ్వటానికి, విత్తనాలు చల్లటానికి, పైరు కొయ్యటానికి... ఇలా వ్యవసాయ సంబంధమైన ప్రతి పనికీ నక్షత్ర, తిథి, వార, సమయాలను నిర్దేశిస్తుంది జ్యోతిష్యం. అలాగే, ఏడాది కాలంలో వర్షం ఎంత కురుస్తుంది, వాతావరణం ఏయే పంటలకు అనుగుణంగా ఉంటుంది, ఏయే ధాన్యాలకు ధరలు ఎలా పలికే అవకాశం ఉందనే విషయాల్ని పంచాంగం వివరిస్తుంది. 

·        కౌటిల్యుడి అర్ధశాస్త్రం’,  వరాహమిహిరుడి బృహత్సంహిత’, శతపథ బ్రాహ్మణం (1.6.1.3), కాశ్యపీయ కృషిసూక్తి, సురపాలుడు రాసిన వృక్షాయుర్వేదం’, చక్రపాణి రచించిన విశ్వవల్లభంగ్రంథాల్లోనూ వ్యవసాయానికి సంబంధించిన వందలాది ప్రస్తావనలు ఉన్నాయి. కేవలం వ్యవసాయం మాత్రమే కాకుండా అందుకు అనుబంధమైన వివిధ వృత్తులు, ఆ వృత్తుల ద్వారా వ్యవసాయాన్ని నేర్పుగా ఎలా నిర్వహించాలో కూడా ఈ గ్రంథాల్లో ఉంది. 

            ఇవన్నీ ఒక ఎత్తయితే పరాశర మహర్షి రాసిన కృషి పరాశరంఒక్కటీ ఒక ఎత్తు. వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఇదే తొలి పూర్తిస్థాయి గ్రంథమని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. క్రీ.పూ.4వ శతాబ్దం నాటి ఈ గ్రంథంలో చెప్పని వ్యవసాయ విధానం లేదు. ప్రత్యేకంగా గంగ, కావేరీ నదుల మధ్య ప్రాంతంలోని భూముల స్వభావాన్ని బట్టి ఎలా సాగు చెయ్యాలో ఈ గ్రంథం వివరించినంతగా మరెక్కడా లేదు. ఈ గ్రంథం వెలుగు చూడటం వెనుక ఆసక్తి కరమైన కథనం ఉంది.

            ఓసారి విశ్వామిత్ర మహర్షి తన శిష్యులు, ఇతర మందీమార్బలంతో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. ముందస్తు సమాచారం లేకపోయినా అందరికీ క్షణకాలంలోనే కమ్మటి పిండివంటలతో భోజనం ఏర్పాటుచేస్తాడు వశిష్ఠుడు. ఇదెలా సాధ్యమైందంటూ విస్తుపోతాడు విశ్వామిత్రుడు. కామధేనువు వల్లే ఈ శక్తి వశిష్ఠుడికి వచ్చిందని తెలుసుకుని ఆ ధేనువును తనకు ఇవ్వాలని వశిష్ఠుడిని అడుగుతాడు. అతడు ఒప్పుకోడు. కొంతకాలం తర్వాత వశిష్ఠుడు ఇంట్లో లేని సమయం కనిపెట్టి అతని ఆశ్రమం మీద దాడి చేసి, వశిష్ఠుడి 100 మంది పుత్రుల్ని చంపేస్తాడు విశ్వామిత్రుడు. ఆ సమయంలో వశిష్ఠుడి కుమారుల్లో ఒకరి భార్య అయిన శక్తి గర్భవతిగా ఉంటుంది. కొంతకాలానికి ఆమెకు పరాశరుడు జన్మిస్తాడు. తన వంశాంకురమైన పరాశరుడికి వశిష్ఠుడు సకల విద్యలతో పాటు వ్యవసాయ విజ్ఞానాన్ని కూడా బోధిస్తాడు. ఈ విజ్ఞానాన్ని అందరికీ చేరువ చెయ్యాలనే సంకల్పంతో పరాశరుడు దీన్ని గ్రంథస్తం చేస్తాడు. ఇదే కృషి పరాశర గ్రంథంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. 

·        సీతాదేవి ఆవిర్భావం కూడా వ్యవసాయంతో ముడిపడి ఉంది. యజ్ఞం కోసం అవసరమైన భూమిని తవ్వుతున్న సమయంలో నాగేటి చాలుకు తగిలిన పేటికలో సీతాదేవి జనక మహారాజుకు లభించింది. ఆవిధంగా సీతాదేవి అయోనిజ, భూమిజ అయ్యింది. 

·        బలరాముడి ఆయుధం నాగలి. తన భుజాల మీద ఎప్పుడూ నాగలి మోసేవాడు. కేవలం వ్యవసాయ పరికరంగా కాకుండా దైవీకమైన వస్తువుగా నాగలి ఔచిత్యాన్ని బలరాముడు గుర్తించాడు.

కృషి పరాశరంలో చెప్పిన వ్యవసాయ సూత్రాలు / విధానాలు

·        పొలం దున్నటానికి నలుపు, ఎరుపు రంగులో ఉండే ఎడ్లు శ్రేష్ఠమైనవి. కొమ్ము విరిగిన ఎడ్లను వ్యవసాయానికి వినియోగించకూడదు.

·        పొలం దున్నే సమయంలో కాడికి ఆరు నుంచి ఎనిమిది ఎడ్లు వినియోగించాలి. పొలం విస్తీర్ణం పెరిగే కొద్దీ ఎడ్ల జతల సంఖ్యను పెంచాలి.

·        నాగలి కర్రకు తేనె, నెయ్యి పూయాలి. కాడి కట్టే సమయంలో ఎడ్ల మెడభాగంలో నెయ్యి పూయాలి.

·        మొదట భూమిని పాము ఆకారంలో దున్నాలి. భూమి యజమాని మొదట దున్నిన తర్వాతనే ఇతరులు దున్నాలి.

·        సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో దున్నితే పంట మంచి దిగుబడి ఇస్తుంది. నెలలో 2, 3, 5, 7, 10, 11, 13 రోజులు పొలం దున్నటానికి మంచి రోజులు. ఎనిమిదో రోజు దున్నితే ఎడ్లకు ప్రమాదం. తొమ్మిదో రోజు దున్నితే పంటకు నష్టం. నాలుగో రోజు దున్నితే పురుగుపడుతుంది. 14వ రోజు దున్నితే యజమానికి ప్రమాదం.

·        దున్నే సమయంలో ఎడ్లు మూత్రం విసర్జించినా, పేడ వేసినా చాలా మంచిది.

·        వర్షం కురిసే సమయాన్ని అంచనా వేసుకుంటూ అందుకు తగినవిధంగా ఏయే పంటలు వెయ్యాలో నిర్ణయించుకోవాలి.

·        చెట్లు బాగా పెరగానికి పాలు పొయ్యాలి’. మనుషుల తీరులోనే మొక్కలకు కూడా వాత, పిత్త, కఫాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

·        విత్తనాలు చల్లటం మొదలు పంటను ఇంటికి తీసుకువెళ్లే వరకు ముహూర్తాల ఆధారంగా మంచి రోజులు చూసుకుని పనులు ప్రారంభించాలి.

·        సమాన ఆకారంలో ఉన్న విత్తనాలు మంచి దిగుబడిని ఇస్తాయి. కాబట్టి, ఈ తరహా విత్తనాలను ఎప్పుడూ నిల్వచేసుకోవాలి.

·        విత్తనాల సంచులను పుట్టలు, చీమల బొరియల మీద ఉంచకూడదు.

·        మాఘ ఫాల్గుణ మాసాల్లో విత్తనాలు ఎండబెట్టాలి. విత్తనాలను ఎండబెట్టేటప్పుడు నేరుగా నేలమీద ఉంచకూడదు. ఏదైనా వస్త్రం మీద విత్తనాలు వేసి ఎండబెట్టాలి.

·        పొలంలో నిత్యం ఉదయం గం.9 లోపుగా మఋత్యుంజయ హోమం నిర్వహించాలి.

·        కార్తికమాసం తొలి రోజున ఎడ్లను అలంకరించి, వాటిని ఊరంతా తిప్పాలి. దీనివల్ల వాటిలో ఉండే విపరీత శక్తి పోతుంది.

·        విత్తనములు వృక్షరూపములో పెద్దవైన తరువాత వాటిని తీసివేయరాదు. ఫలితాన్ని ఇవ్వవు.

·        శ్రావణములో హస్త ప్రమాణ దూరంలో భాద్రపదంలో హస్తానికి ప్రమాణానికి సగం దూరంలో , కన్యలో నాలుగంగుళాల దూరంలో పంటలను నాటవలెను.

·        భాద్రపదమాసం వచ్చేసరికి పొలంలోని నీటిని బయటకు వదలాలి. కేవలం వరి మొక్క మొదలులో మాత్రమే నీరు ఉండేట్టు చెయ్యాలి.

·        మార్గశిర మాసంలో ఏదైనా శుభ ముహూర్తం చూసుకుని పంట కొయ్యటం ప్రారంభించాలి. మొదటగా కోసిన పంటకు దేవతా స్వరూపంగా అర్చనలు చెయ్యాలి. ఆ తర్వాత ఈశాన్య భాగం నుంచి పంట కొయ్యటం ప్రారంభించాలి.

·        కోసిన ధాన్యపు కట్టను శిరస్సుపైన ఉంచి దారిలో ఎవరిని ముట్టుకోకుండా రైతు మౌనంగా ఇంటికి రావాలి. ఇంట్లో ఉన్న గదిలో ఏడడుగులు నడిచి తూర్పుదిశలో ధాన్యపు కట్టను ఉంచాలి.

·        ధాన్యాన్ని కొలిచే అడకను మామిడి లేదా పున్నాగ కర్రతో తయారుచెయ్యాలి. ధాన్యము కొలిచే ఆడకము ఆకారములో పన్నెండు అంగుళములు ఉండవలెను . ఆడకముతో ధాన్యపు రాశిని ఎడమవైపు నుండి కొలవవలెను. దక్షిణము నుండి ధాన్యమును కొలిచిన వ్యయకారకం అగును. ఎడమవైపు నుండి కొలిచిన ధాన్యము వృద్ధిని పొందును.

·        హస్త, శ్రవణ, ధనిష్ట, మృగశిర, శతబిషం , పుష్యమి, రేవతి , రోహిణి , భరణి, మూల, ఉత్తరాత్రయం , మఘ , పునర్వసు నక్షత్రములలో గురు, శుక్ర, సోమవారాలలో సూర్యుడు మీనలగ్నములలో ఉన్నప్పుడు ధాన్యస్థాపనం చెయ్యాలి. నిధన సమయములు అనగా ఆది, మంగళ, శని, బుధవారములలో ధాన్యస్థాపనం చేయకూడదు. ధాన్యస్థాపనం అనగా పండిన ధాన్యాన్ని నిలువచేయడం .

===========================================

రచన : 

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, 

ఇంటి నంబరు 4 – 89,  కొత్తూరు తాడేపల్లి పోస్ట్, 
వయా మిల్క్ ఫ్యాక్టరీ, విజయవాడ రూరల్ మండలం.  పిన్ కోడ్ : 520012.
 సెల్ : 90320 44115 / 8897 547 548

Friday, May 22, 2020

బ్రాహ్మీ ముహూర్థంలో ఎందుకు నిద్ర లేవాలి?


జీవచైతన్య సుప్రభాతం

 

కౌసల్యా సుప్రజా రామా... పూర్వా సంధ్యా ప్రవర్తతే....

అది ఉషోదయానికి పూర్వవేళ. బాలభానుడు తన తొలి కిరణాలను వికసింపజేయటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. జగన్మోహనాకారుడైన రామచంద్రమూర్తి, సోదరుడైన లక్ష్మణస్వామితో కలిసి కటిక నేల మీద ఆదమరచి పడుకున్నాడు. 

'పుంసాం మోహన రూపాయ’ అన్నట్లున్న స్వామి సౌందర్యాన్ని తనివి తీరా చూసుకున్నాడు మహర్షి. కానీ, అంతలోనే కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. 'ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం' - రామచంద్రా! నీ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన సమయం సన్నద్ధమైంది. పడుకున్నది చాలు... ఇక నిద్రలేవాలంటూ విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నిద్ర నుంచి మేల్కొలిపాడు.

ఇది రాముడికి మహర్షి పలికిన సుప్రభాతం మాత్రమే కాదు. రామచంద్రుడి పేరుతో యావజ్జాతిని ఉద్దేశించి మహర్షి పలికిన చైతన్యగీతం అది. సుప్రభాత గీతికగా ఆలయాల్లో నిత్యం వినిపించే ఆధ్యాత్మిక గానలహరి అది.

దేవాలయాల్లో వినిపించే సుప్రభాతం విని స్వామి నిద్రలేస్తాడని, భక్తుల కోర్కెలు సావధానంగా విని, వాటిని తీరుస్తాడని నమ్మకం. సుప్రభాతం కేవలం దైవానికి మాత్రమే, మనిషి మాత్రం నిద్ర లేవాల్సిన పని లేదు అంటే నిజానికి నిద్ర, మెలకుల లేని దైవం మేల్కొనాల్సిన అవసరం లేదు. దైవానికి నిద్ర ఉండదు. అదొక నిర్నిద్రమైన శక్తి. దైవానికి పాడే సుప్రభాతం పేరుతో మనలోని దైవత్వాన్ని మేల్కొలపటమే సుప్రభాతం వెనుక దాగున్న ఆధ్యాత్మిక సందేశం. గుడిలోని దేవుడి పేరుతో గుండె గదుల్లో దాగున్న దైవీకమైన శక్తిని జాగృతం చేసే ప్రక్రియకు పలికే నాందీ వాచకమే సుప్రభాతం.

సాధారణ పరిభాషలో రాత్రి వేళ నిద్రించి, ఆ నిద్ర ముగిసిన తర్వాత కళ్ళు తెరచి లోకాన్ని చూడటాన్ని నిద్రలేవటం అంటాం. నిజానికి ఇలా నిద్ర పోవటం, మేల్కోవటం అనేది ఒక క్రియ మాత్రమే. పుట్టుకతో ఈ లోకాన్ని చూడటానికి చేసే ప్రయత్నమే కన్ను తెరవటం. లోకాల వెనుక జ్యోతి స్వరూపంతో వెలిగే పరమాత్మ చేరుకోవటం చేసే ప్రయత్నమే కన్నుముయ్యటం. ఇలా కన్ను తెరచి కన్నుమూసే కాలవ్యవధిలో ఎప్పటికప్పుడు మనల్ని మనం జాగృతం చేసేందుకు చేసే స్వీయ ప్రబోధం సుప్రభాతం. అదే నిద్రలేవడం.

కర్తవ్యం దైవమాహ్నికం - అంటే తెల్లవారిన తర్వాత నువ్వు చెయ్యాల్సిన పని అంతా నీది కాదు... దైవానిది. అటువంటి దైవకార్యాన్ని నిర్వహించటానికి మేల్కొనాలని అర్థం. మానవత్వమనే పొర వెనుక ప్రతి ప్రాణీ దైవమే. ఆ దివ్యత్వాన్ని మేల్కొలపటమే సుప్రభాతం.

మనకు ఇష్టమైన దైవానికి మేల్కొలుపు పాడుతున్నామంటే అర్థం ఆ దైవాన్ని త్రికరణ శుద్ధిగా మనం నమ్ముతున్నామని అర్థం. ఆ స్వామి బాటలో నడవటానికి అంగీకరించామని అర్థం. ఇలా మనం నమ్ముకున్న దైవం మేల్కొన్నాడంటే... మనలో ఆ దైవానికి సంబంధించిన ఉత్తమ భావనలు మేల్కొన్నాయని అర్థం. ఎప్పుడైతే మనలో దైవికమైన భావనలు వృద్ధి చెందుతాయో అప్పుడు ధర్మమార్గాన్ని విడిచిపెట్టే సందర్భం ఎదురుకాదు. ఇలా ప్రతి వ్యక్తీ, అంతిమంగా సమాజం ధర్మనిలయంగా మారేందుకు పలికే నాందీవాక్యమే సుప్రభాతం.

 

బ్రాహ్మీముహూర్తం 

పూర్వం కాలాన్ని ఘడియల్లో లెక్కించేవారు. ఒక ఘడియ ప్రస్తుత కాలమానం ప్రకారం 24 నిమిషాలకు సమానం. ఒక ముహూర్తం అంటే రెండు ఘడియల కాలం - అంటే 48 నిమిషాల కాలవ్యవధి ఒక ముహూర్తం అవుతుంది. ఒక పగలు, ఒక రాత్రి కలిపిన కాలవ్యవధిని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంలో 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి.

సూర్యోదయ సమయానికి కచ్చితంగా జరుగుతూ ఉండే ముహూర్త కాలాన్ని ఆసురీ ముహూర్తం అంటారు. ఈ ఆసురీ ముహూర్తానికి ముందు సమయం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. అంటే సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటి ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. దీని ప్రకారం రోజు మొత్తంలో వచ్చే 29వ ముహూర్తం బ్రాహ్మీముహూర్తం అవుతుంది.

ఉదాహరణకు సూర్యోదయం ఉదయం గం. 5.28 అయితే అంతకుముందు జరిగే ముహూర్తం (48 నిమిషాల కాల వ్యవధి) గం. 4.40 నుంచి గం. 5.28 వరకు ఉండే సమయం ఆసురీ ముహూర్తం అవుతుంది. ఈ ఆసురీ ముహూర్తానికి ముందు అంటే గం. 4.40కు ముందు ఉండే ముహూర్తం అంటే గం. 3.58 నుంచి గం. 4.40 వరకు ఉండే 48 నిమిషాల కాలం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది.

బ్రాహ్మీ అనే పదానికి సరస్వతీ అని అర్థం. మనలోని బుద్ధి ప్రచోదనం చెంది సరస్వతీదేవి అనుగ్రహం జ్ఞానరూపంలో కలిగే ఉత్తమ సమయం కాబట్టి ఈ సమయానికి బ్రాహ్మీ ముహూర్తం అని పేరు వచ్చింది. బ్రాహ్మీముహూర్తంలో బ్రహ్మ, సరస్వతి ఇద్దరూ హంస వాహనంపై ఆకాశ సంచారం చేస్తుంటారని, కాబట్టి ఆ సమయంలో సరస్వతీ ఉపాసన (విద్యార్థులు చదువుకోవటం కూడా ఉపాసనే) చేసేవారిని సరస్వతీదేవి అనుగ్రహిస్తుందని పురాణ కథనం. విద్యార్థులు తెల్లవారు జామున లేచి చదువుకోవాలని పెద్దలు చెప్పటం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే.

మన శరీరంలో జీవగడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలు జరుగుతాయి. ఉషోదయ వేళ మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి పై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందని పెద్దలు చెబుతారు.

సాధనకు మేలిమికాలం

ఆధ్యాత్మిక సాధన పరంగా బ్రాహ్మీముహూర్తం చాలా విలువైన సమయం. ఈ సమయాన్ని వృథా చేసుకుంటే రోజులు కాదు... మొత్తం జీవితంలోనే అద్భుతమైన కాలాన్ని కోల్పోయినట్లవుతుంది. శుశ్రుత మహర్షి బ్రాహ్మీ ముహూర్తాన్ని అమృత ముహూర్తంగా పేర్కొన్నాడు. ఈ సమయంలో చేసే ఆధ్యాత్మిక సాధన ద్వారా మనలో సత్త్వగుణాలు పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణం (బద్దకం, ఆలస్యం, అజాగ్రత్త) పెరుగుతుంది. అర్ధరాత్రి దాటే వరకూ మెలకువగా ఉండడం వల్ల రజోగుణం (క్రోధం, దంభం, దర్శనం, విపరీత ప్రతిస్పందన) పెరుగుతుంది. అందుకే తెల్లవారు జామున ఆలోచించు, పగలు కార్యోన్ముఖుడివై పని చెయ్యి. రాత్రి సమయంలో నిద్రోన్ముఖుడివి కావాలని పెద్దలు చెబుతుంటారు.

బ్రాహ్మీ ముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు ఈ సమయంలో ఓంకారం జపిస్తారు. ఎప్పుడైతే మన నాసికా రంధ్రాల్లోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పనిచెయ్యటం మొదలవుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. తద్వారా ఆధ్యాత్మిక సాధన మరింత ఉన్నత స్థితికి చేరుకుని, అంతిమంగా మన అంతర్యామిగా ఉన్న ఆత్మ స్వరూపమైన పరమాత్మ చేరుకునే సిద్ధి కలుగుతుంది. తెల్లవారు జామున అంతర్ముఖలమై మేధోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. తెల్లవారు జామున లేచే వారికి సూర్య చంద్రులు, నక్షత్రాలు నుంచి కాంతి పూర్తిగా అంది, తద్వారా వారిలో నిద్రిస్తున్న జీవశక్తి చైతన్యవంతమవుతుంది.

భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. కానీ దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును లీనం చేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం మనవెంటే ఉంటాయి. ప్రకృతిలో ఇందుకు బ్రాహ్మీ ముహూర్తం ఎంతో అనువుగా ఉంటుంది. ఆయుర్దాయాన్ని, ఆయుర్వృద్ధిని కోరుకునే వారు తప్పనిసరిగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి దేవీ భాగవతం కూడా చెబుతోంది.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన వాయువు (కాలకృత్యాల నిర్వహణలో తోడ్పడే వాయువు) సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరాన్నుంచి వదిలించి వేస్తుంది. అలాగే తెల్లవారు జామున శరీరంలోకి ప్రాణవాయువు కూడా ఎక్కువ తీసుకోగలం. సాధారణంగా తెల్లవారు జామున మాత్రమే రెండు నాసికా రంధ్రాల నుంచీ వంద శాతం గాలి పీల్చగలం. మిగతా సమయాల్లో ఒకటి 50 శాతం, ఒకటి 100 శాతం పని చేస్తాయి.

ధర్మశాస్త్రం ఏం చెబుతోందంటే...

మనిషి ఏ సమయంలో నిద్రలేవాలి, నిద్రలేచిన వెంటనే ఏం చెయ్యాలనే విషయాన్ని శాస్త్రం ఎంతో స్పష్టంగా చెప్పింది. శరీరానికి నిద్రమత్తును దూరం చేస్తూ, కళ్ళు తెరచి ఈ లోకాన్ని చూసేందుకు ముందుగా పాటించాల్సిన ఆచార క్రమం ఏమిటనే విషయాన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. వాటి ప్రకారం

 

బ్రాహ్మీ ముహూర్తం ఉత్థాయ చింతయే దాత్మ హితం |

స్మరణం వాసుదేవస్య కుర్యాత్ కలిమలాపహమ్ ||

 

సూర్యుడు ఉదయించడానికి రెండు ముహూర్తాలు ముందుగా నిద్రలేవాలి. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో తప్పనిసరిగా నిద్ర నుంచి మేల్కొనాలి. నిద్ర లేచిన తర్వాత వాసుదేవుడిని లేదా తనకు ఇష్టమైన దేవుడిని తలచుకోవాలి.

 హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

విశ్వేశం కేశవం డుండి దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికా ||

 ఇలా ఇష్టమైన దైవానికి సంబంధించిన ప్రార్థన చేసుకోవాలి . దైవస్మరణం తరువాత మెల్లగా కళ్ళు తెరిచి కుడి అరచేయిని కింది నుంచి పైకి చూస్తూ

కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే తు గౌరీ చ ప్రభాతే కరదర్శనమ్ ||

 అరచేయి కిందివైపు చివర లక్ష్మిని, మధ్యలో సరస్వతిని, మొదట్లో గౌరిని స్మరించాలి. తర్వాత శుభాశుభాలు ఏవి చూసినా ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ||

అంటూ భూదేవి ప్రార్ధన పూర్వక నమస్కారం చేసి, ఆ తర్వాతనే కాలు నేలపై మోపాలి.

==================

 రచన : 

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ,

 ఇంటి నంబరు 4 – 89, కొత్తూరు తాడేపల్లి పోస్ట్,
వయా మిల్క్ ఫ్యాక్టరీ, విజయవాడ రూరల్ మండలం. 
పిన్ కోడ్ : 520012. సెల్ : 90320 44115 / 8897 547 548

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...