Thursday, October 22, 2020

Thursday, October 1, 2020

గంధర్వులంటే ఎవరు? వారెలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? వారి ప్రత్యేకత ఏమిటి?


గంధర్వులంటే ఎవరు? వారెలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? వారి ప్రత్యేకత ఏమిటి... తదితర విశేషాలతో 

ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో రాసిన వ్యాసం

=======================

అందమైన పర్వం... గాంధర్వం

 మనోహరమైన గానానికి గంధర్వులు ప్రతీకలు. అందచందాలు, రూపలావణ్యాల్లోనూ వారికి వారే సాటి. మంత్ర తంత్ర శాస్త్ర విషయాల్లో వారి వైదుష్యాన్ని మాటల్లో వర్ణించలేం. పురాణ, ఇతిహాసాలు మొదలు ప్రబంధాలు, కావ్యాల వరకు గంధర్వుల ప్రస్తావన లేని రచన లేదు. ముఖ్యమైన పురాణ ఘట్టాలన్నీ గంధర్వుల ఇతివృత్తాలతో ముడివేసుకున్నవే కావటం విశేషం. ఎన్నో పుణ్యక్షేత్రాలు అవతరణకు కూడా వీరే ప్రధాన భూమిక పోషించారు.

 ఎవరైనా బాగా పాడుతుంటే గంధర్వగానం అనటం పరిపాటి. గానంతో అంతగా గంధర్వుల పేరు పెనవేసుకుపోయింది. తమ ఉచ్వ్ఛాస నిశ్వాసాలుగా సంగీతాన్ని స్వీకరించి, అహర్నిశం సంగీతంతోనే తమ దైనందిన క్రియలను అన్వయించుకుని, సంగీతంతో తాదాత్మ్యత పొందిన ఘనత గంధర్వులకే దక్కుతుంది సంగీతాన్ని కేవలం ప్రక్రియగా కాకుండా, మోక్షాన్ని పొందటానికి సర్వోన్నతమైన మార్గంగా గుర్తించి, నాదసాధన చేశారు. అందుకే దేవతల్లో ప్రత్యేకంగా శ్రేణిగా గుర్తింపు పొందారు. తుంబురుడు వంటి గంధర్వులు దేవగాయకులుగా శాశ్వత కీర్తి పొందారు

 ·  పురాణాల ప్రకారం గంధర్వులు సప్తగణాల్లో ఒకరు. ఆ సప్తగణాలు 1.ఋషులు. 2.గంధర్వులు. 3.నాగులు అప్సరసలు. 5.యక్షులు. 6.రాక్షసులు. 7.దేవతలు

 ·  బ్రహ్మపురాణం ప్రకారం శ్రీమన్నారాయణుడి వరంతో దక్షప్రజాపతికి 60 మంది కుమార్తెలు జన్మిస్తారు. దక్షుడు వారిలో 10 మందిని యమధర్మరాజుకు, 13 మందిని కశ్యప మునికి, 27 మందిని చంద్రునికి, ఇద్దరిద్దరు చొప్పున భూతుడికి, అంగిరసుడికి, కృశాశ్వుడికి, మిగిలిన నలుగురిని తార్ష్యునికి ఇచ్చి వివాహం చేస్తాడు. కశ్యపుని భార్యలు అరిష్ట గంధర్వులు జన్మిస్తారు. ఈ విధంగా గంధర్వులు దేవతలకు సోదరులు అవుతారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం గంధర్వులు, అప్సరసలు 'ముని' అనే మహానుభావుడి సంతానం. వీరిలో ఉగ్రసేనుడు, సుపర్ణుడు, వరుణుడు, గోమంతుడు, అర్కపర్ణుడు. ప్రియతముడు, చైత్రరథుడు మొదలైన 16 మంది దేవగంధర్వులని, వీరికి 24 మంది సోదరీమణులు ఉన్నారని ఇందులో ఉంది. అలాగే, గంధర్వులు దేవతల కన్నా మూడుస్థాయిలు తక్కువ వారని కూడా ఈ పురాణంలో ఉంది

 · భాగవతం ద్వితీయ స్కంధంలో గంధర్వుల జననానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. శ్రీమన్నారాయణుడి నుంచి సృష్టి ఎలా ఏర్పడిందనే విషయాన్ని చెబుతూ గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైన వారు కూడా జన్మించారని నారదుడు బ్రహ్మకి చెబుతాడు. ఈ విధంగా గంధర్వులు నారాయణాంశతో జన్మించారని తెలుస్తోంది అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్నీణాం చ నారదఃగంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో ముని||' - గంధర్వుల్లో చిత్రరథుడను నేనే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. గంధర్వులు నారాయణాంశ సంభూతులు అనటానికి ఇదొక నిదర్శనం

 

·  పాల్కురికి సోమన రాసిన 'పండితారాధ్య చరిత్రలో గంధర్వుల ప్రస్తావన కనిపిస్తుంది. 'ఆది గంధర్వ యక్ష విద్యాధరులై పాడెడునాడెడువాడు' అంటూ రేఖామాత్రంగా గంధర్వుల గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో 'కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు, గాంధర్వమున యక్షగాన సరణి' అంటూ గంధర్వగానాన్ని ప్రస్తావిస్తాడు. ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గంధర్వుల ప్రస్తావన చెయ్యని పురాణ ఇతిహాస, ప్రబంధ, కావ్యం ఏదీ తెలుగు సాహిత్య చరిత్రలో లేదు.

·   రామాయణంలో కబంధుడు రాక్షసుడిని రాముడు సంహరించిన కథ అందరికీ తెలిసిందే. ఆ కాలం నుంచే కబంధహస్తాలనే నానుడి కూడా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ కబంధుడు పూర్వజన్మలో దనువు ఆనే గంధర్వుడు. శాపం వల్ల కబంధుడు జన్మిస్తాడు. రాముడి చేతిలో మరణించి తిరిగి గంధర్వజన్మ పొందుతాడు.

·   కాగల కార్యం గంధర్వులు తీరుస్తారనేది చాలా ప్రసిద్ధి పొందిన సామెత. మనం చెయ్యాలనుకున్న పని అనుకోకుండా ఇతరుల ద్వారా జరిగినప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు. ఈ సామెత పుట్టటానికి కారణమైన ఇతివృత్తం మహాభారతంలో ఉంది. జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం చేస్తూ ద్వైతవనంలో నివసిస్తుంటారు. పాండవుల ముందు తన ఐశ్వర్య వైభవాన్ని ప్రదర్శించి వారిని అవమానించాలన్న ఆలోచన ధుర్యోధనుడు తన పరివారాన్ని తీసుకుని ద్వైతవనానికి చేరుకుంటాడు. అక్కడి ఓ సరస్సు ఒడ్డున శిబిరాలు వేస్తారు. ఆ సరస్సు చిత్రసేనుడనే గంధర్వరాజుది. అనుమతి లేకుండా శిబిరాలు వేయవద్దంటూ గంధర్వరాజు సైనికులు కౌరవ సైనికులను అడ్డుకుంటారు. వాదులాట పెరిగి యుద్ధానికి దారితీస్తుంది. అప్రతిహతమైన బలం కలిగిన గంధర్వరాజు కౌరవులను ఓడించి దుర్యోధనుడితో సహా అందరినీ బందీలుగా పట్టుకుంటాడు. తమ రాజుకు కలిగిన కష్టాన్ని కౌరవ సైనికులు అక్కడికి సమీపంలో ఉన్న ధర్మరాజుకు విన్నవిస్తారు. ఆ మాటలు విన్న భీమసేనుడు పకపకనవ్వుతూ 'చాలా మంచిపని జరిగింది. అహంకారికి తగిన ప్రాయశ్చిత్తం చేశాడు చిత్రసేనుడు. కాగల కార్యం గంధర్వులు తీర్చారు. అనుకోకుండా మన కోరిక తీరింది' అంటాడు. తర్వాత ధర్మరాజు నచ్చజెప్పటంతో భీమార్జునులు వెళ్ళి చిత్రసేనుడి చెర నుంచి కౌరవులు విడిపిస్తాడు. అలా భీమసేనుడి ద్వారా కాగల కార్యం గంధర్వులు తీర్చారనే నానుడి వ్యాప్తిలోకి వచ్చింది. ఇప్పటికాలంలోనూ మనం వాడుతున్న సామెతలకు గంధర్వులే మూలపురుషులు కావటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

·    తెలుగులో అత్యంత ప్రసిద్ధి పొందిన కావ్యం అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర. దీనికే స్వారోచిష మనుసంభవం అనే పేరు కూడా ఉంది. ఈ కావ్యంలోనూ గంధర్వులదే కీలకపాత్ర. తన కోరికను ప్రవరుడు తిరస్కరించటంతో విరహవేదనకు గురవుతుంది వరూధిని. అవకాశం దొరికిందని సంతోషించిన ఓ గంధర్వుడు మాయాప్రవరుడి రూపంలో వరూధిని కోరిక తీరుస్తాడు. వారిద్దరికీ స్వరోచి జన్మిస్తాడు. స్వరోచి కుమారుడే స్వారోచిషుడనే పేరు కలిగిన మనువు. ఇలా ఎన్నో కావ్య, ప్రబంధాలు ప్రధాన ఘట్టాల్లో గంధర్వుల పాత్ర ప్రబలంగా కనిపిస్తుంది.

·  స్నేహం అనగానే గుర్తుకు వచ్చే పేర్లు కృష్ణార్జునుల పేర్లు కూడా ముందువరుసలో ఉంటాయి. అంతటి ప్రాణస్నేహితులకు సైతం మనస్పర్థలు కలిగించి, యుద్ధానికి దారితీసిన ఘటనకు మూలకారణం కూడా గంధర్వులే. గయుడు గంధర్వరాజు ఆకాశంలో విహరిస్తూ, దాసీజనంతో విలాసాల్లో మునిగితేలుతుంటాడు. అప్పటిదాకా నమిలిన తాంబూలపు పిప్పిని ఆకాశం నుంచి జారవిడుస్తాడు. ప్రమాదవశాత్తు అది సంధ్యావందనం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్న కృష్ణుడి చేతిలో పడుతుంది. తీవ్రకోపానికి గురైన కృష్ణుడు ఈ పాపానికి కారణమైన గయుడిని సంహరిస్తానని శపథం చేస్తాడు. గయుడు కృష్ణుడి పేరు చెప్పకుండా అర్జునుడిని శరణు కోరుతాడు. జరిగిన సంగతి తెలియని అర్జునుడు గయుడికి అభయం ఇస్తాడు. గయుడిని విడిచిపెట్టమని కృష్ణుడు, వదలనని అర్జునుడు మొండిపట్టుపడతారు. చివరకు యుద్ధం జరుగుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు దిగివచ్చి నచ్చజెప్పటంతో సమస్య పరిష్కారమై, కృష్ణార్జునుల స్నేహం ఎప్పటిలాగే కొనసాగుతుంది.

·    స్త్రీలకు సహజంగా ఉండే అందచందాలు, లావణ్యం, కమ్మని కంఠం... ఇవన్నీ గంధర్వుల ద్వారానే వచ్చాయని చెబుతుంది మంత్రశాస్త్రం. వివాహంలో వరుడు చదివేమంత్రాల్లో ఈ వివరం కనిపిస్తుంది. సోమః ప్రథమో వివిధే, గంథర్వో వివిధ ఉత్తరః తృతీయాగ్నిష్టీ పతిః తురీయ మనుష్య చౌ" - అని వివాహ సమయంలో వరుడు వధువుతో అంటాడు. నిన్ను మొదట చంద్రుడు, ఆ తర్వాత వరుసగా గంధర్వుడు, అగ్ని సంరక్షించారు. ఇప్పుడు నేను నిన్ను స్వీకరిస్తానని ఈ మంత్రానికి అర్థం. ఆడపిల్ల పుట్టగానే చంద్రుడు ఆమెకు తోడుగా నిలిచి పసిపాప ఆకర్షణీయంగా ఎదిగేలా తన కళల్ని ఆమెకు అందిస్తాడట. అమ్మాయి వయసుకు వచ్చేసరికి చంద్రుడి సాక్షిగా గంధర్వుడు బాధ్యత తీసుకుంటాడు. "లావణ్యవాన్ గంధర్వః" - గంధర్వులు లావణ్యంగా ఉంటారని ప్రతీతి. తనలోని లావణ్యాన్నంతా యువతికి అందిస్తాడు గంధర్వుడు. అలాగే, తమ జాతి ప్రత్యేకత అయిన కమ్మని కంఠాన్ని, సంగీతాన్ని కూడా యువతికి ఇస్తాడు. అలా ఎదిగిన కన్యను గంధర్వుడి సాక్షిగా అగ్నిదేవుడు స్వీకరించి, తేజస్సు కలిగించి వివాహయోగ్యత కలిగిస్తాడు. ఈ క్రమంలో అగ్నిసాక్షిగా వివాహం చేసుకోవటమనే ఆచారం ఏర్పడింది. మొత్తంగా మహిళల్లోని లావణ్యానికి గంధర్వులే ఆలంబన అంటోంది మంత్ర శాస్త్రం.

·   మహాభారతంలో ప్రసిద్ధి పొందిన కీచకవధ ఘట్టం కూడా గంధర్వుల ఇతివృత్తంతో ముడిపడి ఉంది. పాండవులు అజ్ఞాతవాసాన్ని విరాటరాజు కొలువులో గడుపుతున్న సమయమది. సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని చూసి మోహిస్తాడు కీచకుడు. 'గంధర్వాణామహం భార్య పంచాస్యాం మహిషీ ప్రియ | తే త్వాం విహన్యుః: కుపితాః శూరాః సాహస కారిణః ||' - మహాపరాక్రమవంతులైన ఐదుగురు గంధర్వులకు ఇల్లాలిని నేను. శూరులు, సాహసవంతులైన ఆ గంధర్వులు కోపిస్తే నిన్ను సంహరించకమానరు అంటుంది ద్రౌపది. గంధ్వరులంటే కేవలం గానానికి పరిమితం కాలేదని, వారు మహాపరాక్రమవంతులని కూడా ఈ ఘట్టం ద్వారా వెల్లడవుతుంది. కీచకవధ తర్వాత కూడా భీముడు గంధర్వుడి వేషంలో ఉపకీచకులను సంహరిస్తాడు.

· గంధర్వుల నివాసం గురించిన ప్రస్తావన మహాభారతం భీష్మపర్వంలో కనిపిస్తుంది. స్వర్గలోకవాసుల్లో గంధర్వులు అతిసుందరులు. రూపవంతులు. గుహ్యకలోకానికి పైభాగంలో, విద్యాధర లోకానికి కింది భాగంలో గంధర్వలోకం ఉంటుంది' అంటూ గంధర్వుల్లో ఉండే జాతులు, తెగల వివరాలు ఇక్కడ వివరంగా చెప్పబడ్డాయి.

· మహాభారతం ఆదిపర్వంలోని కథలో... అర్జునుడికి అంగారపర్ణుడు గంధర్వుడికి యుద్ధం జరుగుతుంది అర్జునుడి చేతిలో ఓడిపోయిన గంధర్వుడు అర్జునుడి పరాక్రమానికి మెచ్చి దివ్యమైన శక్తి కలిగిన గుర్రాలను బహూకరిస్తాడు.

·    గంధర్వులు కారణజన్ములు. ప్రతి కథలోనూ వారు చేసిన పని లోకోపకారానికి ఉపయోగించింది. వారు అనుభవించిన శాపాలు సమాజానికి వరాలయ్యాయి. ప్రతి ఘటనలోనూ వారు చేసిన మేలు మర్చిపోలేనిది. తమ కళను, విద్యను, ప్రతిభను లోకావసరాలకు, క్షేమానికి అందించాలని, ఎంత ప్రతిభ ఉన్నా పరిధి దాటితే ప్రమాదాలు కొనితెచ్చుకోక తప్పదనే సందేశం గంధర్వుల ద్వారా మనకు అందుతుంది.

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

 


 

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...