దీపావళి ఆచారాలు, సంప్రదాయాలు, పురాణగాధలు తదితర విశేషాలతో
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం...
నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితం (20.10.2025)
దీపావళి ఆచారాలు, సంప్రదాయాలు, పురాణగాధలు తదితర విశేషాలతో
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం...
నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితం (20.10.2025)
వెండి వెలుగుల పందిరి మాఘపౌర్ణమి. చిమ్మ చీకటికి చంద్రుడు వెన్నెల వెలుతురుల తోరణాలు కడతాడు. అందుకే పౌర్ణమి నాటి రేయి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మన మనసులను ఆనందపరవశులను చేస్తుంది. మాఘమాసంలో వచ్చే పున్నమినాడు చంద్రుడు పదహారు కళలతో వెలుగులీనుతాడు. మాఘమాసంలో వచ్చే పౌర్ణమినే మహామాఘం అనే పేరుతో పండుగలా పాటిస్తారు.
చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే
మాసం మాఘం. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని
శ్రేష్ఠమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక
ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది.
న సమం భవితా కించిత్తేజః
సౌరేణ తేజసా ।
తద్వత్ స్నానేన మాఘస్య నా
సమాః క్రతుజాః క్రియాః ॥
సూర్యుని తేజస్సుకు సాటి వచ్చే కాంతి మరొకటి లేనట్టే, మాఘ స్నానానికి సాటి వచ్చే క్రతువు గాని, క్రియ గాని మరొకటి లేదు.
పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. ‘మఘం’ అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.మాఘమాసంలో ప్రత్యూషకాలంలో చేసే స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మాండ, నారదాది పురాణాలు మాఘస్నాన విశేషాలను వివరిస్తున్నాయి. మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుర్దాయంతో పాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మపురాణంలో ఉంది. మృకండు, మనస్విల మాఘస్నాన ఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువుని తొలగించిందని పురాణ కథనం.
ఏదైనా కారణం వల్ల మాఘస్నానం చేయలేకపోతే కనీసం స్నానం చేసిన వారిని దర్శించి, వారిని దక్షిణతాంబూలాదులు ఇచ్చి సత్కరించి, నమస్కరించినా పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సమత్రకంగా, సంకల్పం చెప్పుకుని చేసేదే మాఘస్నానం. నిత్యవిధిగా చేసే స్నానం మాఘస్నానం కాదు. సంకల్పం చెప్పుకుని శాస్త్రవిధానం పాటిస్తూ చేసే స్నానమే మాఘస్నానం అవుతుంది.
మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం సంకల్ప ప్రకారం చేసే నదీ స్నానం అనంతకోటి ఫలితాన్నిస్తుంది. కనీసం గృహస్నానం చేసినా ఆరు సంవత్సరాలు అఘమర్షణస్నానం చేసిన ఫలితం వస్తుంది. బావినీటి స్నానం 12 సంవత్సరాల ఫలాన్ని, తటాకస్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్రగుణం, త్రివేణీ సంగమస్నానం నదీశతగుణ ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
దు:ఖ దారిద్య్ర నాశాయ శ్రీ
విష్ణోస్తోషణాయచ
ప్రాత: స్నానం కరోమ్యద్య
మాఘే పాపవినాశనం
మకరస్థే రవౌ మాఘ
గోవిందాచ్యుత మాధవ
స్నాననేనానే నమోదేవ యధోక్త ఫలదోభవ ॥
అనే శ్లోకం పఠిస్తూ, ప్రయాగను స్మరించుకుంటూ మాఘస్నానం చేయాలి. అనంతరం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఏదైనా ఆలయానికి వెళ్ళి, దీపారాధన చేయాలి. ఈమాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపారాధన చేస్తే ఎంతో మంచిది.
నీటికి ఉన్న శక్తి అమేయమైంది. స్నాన, ఆచమన మార్గాల్లో జలశక్తి మానవునికి అందుతుందని వేదవాక్కు. స్నానం దేహాన్ని శుద్ధి చేయడంతో పాటు మనలోని ప్రకోపాలను తగ్గించి, స్థిరత్వాన్ని కలిగిస్తుంది. అందుకే స్నానాన్ని నిత్యవిధిగా పెద్దలు ప్రకటించారు. స్నానం ` ‘నిత్య స్నానం, నైమిత్తిక స్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంజనస్నానం, క్రియాస్నానం’ అని ఆరువిధాలు. వీటిల్లో వైశాఖ, కార్తిక, మాఘ మాసాల్లో చేసే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలు కామ్యస్నానాలు.
సూర్యుడు చరించే రాశిని బట్టి ప్రత్యూషకాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే లోహిత, అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక వైజ్ఞానికులు కూడా జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం శ్రేష్ఠమైనదని, ఎంతో ఆరోగ్యకరమైందని చెబుతున్నారు. ఈ కోణంలో చూసినా మాఘస్నానం ఎంతో ఆరోగ్యకారకం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు.
‘‘నదీనాం సాగరో గతి:’’ - సకల నదీ నదాలు తమ ప్రవాహం పూర్తి చేసుకుని చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక, సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్ర పరిమాణం తగ్గదు. అలాగే, ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. అలాగే, ఎన్ని ఆటుపోటులు ఎదురైనప్పటికీ మనిషి స్థిరత్వాన్ని కోల్పోకూడదు. సాగర స్నానం అందించే సందేశం ఇదే.
సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా ‘‘ఆషాఢ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ’’లలో చేయాలని, ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి, కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి.
నీటిలో విద్యుచ్ఛక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ, ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ / సాగర స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు. సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్ఛక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔషధీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుతశక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు.
మరి ‘‘నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి’’ అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర, నదీజలాలలో నిక్షిప్తమైన సౌరశక్తి, సోమశక్తులు, ఈ నాబి óనుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా, ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో ‘‘మాఘ పూర్ణిమ’’ స్నానం ముఖ్యమైనది.
మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. సముద్రం, నదులు అందుబాటులో లేని పరిస్థితిలో బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ ‘‘గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి’’ నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి, కర్రలా తేలినా ఫలితం శూన్యం.
మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానం చేసినా ఆరు సంవత్సరాల పాటు అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని శాస్త్ర వచనం. బావినీటి స్నానం పన్నెండేళ్ళ పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయి. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుంది.
స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. వైష్ణవ, శివాలయానికి గానీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. దీని వల్ల జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశిస్తాయి.
మహామాఘి పర్వం సందర్భంగా శ్రీకాకుళంజిల్లా నుంచి నెల్లూరుజిల్లా వరకు ఉన్న సముద్రతీరాలన్నింటా మాఘస్నానాలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నదీస్నానాలు అనేక పుణ్యక్షేత్రాలలో జరుగుతాయి. మీదు మిక్కిలి దేవాలయాలు, తీర్థాలుగా పేర్గాంచిన సముద్రతీరాలలో మరింత వైభవంగా ఉంటుంది. విశాఖ, గుంటూరు జిల్లా బాపట్ల, సూర్యలంక, నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం బీచ్‌లలో పెద్దసంఖ్యలో ప్రజలు మాఘస్నానాలు ఆచరిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గోదావరినదీపాయ సముద్రంలో సంగమించే స్థలం. కృష్ణాజిల్లా హంసలదీవి వద్ద కృష్ణానదీ సాగర సంగమస్థలి. ఇటువంటి నదీసాగర సంగమ స్థలిలో చేసే మాఘస్నానాలను సింధూస్నానాలని కూడా అంటారు. తెలంగాణ పవిత్ర నదీ తీర ఆలయాలలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో, గోదావరీ నదీతీర బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో మాఘస్నానాలు విశేషంగా జరుగుతాయి.
-----------------------------------------------
రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ,అసోసియేట్ ప్రొఫెసర్, కె.బి.ఎన్ కళాశాల,కొత్తపేట, విజయవాడ-1

దీపారాధన
సృష్టి, స్థితి, లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం
ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు
పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు,
ఎర్ర రంగు సృష్టికర్త
బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు.
‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే / ప్రబోధ పూర్ణపాత్రేతు
జ్ఞానదీపం విలోక్యత్’’ అన్నారు ఋషులు.
అంటే ‘ప్రబోధం’ అనే ప్రమిదలో, ‘వైరాగ్యం’ అనే తైలం పోసి, ‘భక్తి’ అనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని
ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు.
ముక్తిని
ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. ‘పరమాత్మే పరంజ్యోతి’ అని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు.
యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే!
దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి
ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం
దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత
ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన ‘హృదయా’న్ని ప్రమిదగా
భావించి, అందులో ‘భకి’్త అనే తైలం పోసి, ‘ప్రేమ’ అనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.
దీపావళి
పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో
రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం
సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట.
కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో
హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం
చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని ‘కఠోపనిషత్తు’ కథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన
శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని ‘పద్మపురాణం’ పేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన
మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం
చెబుతోంది.
'దీపేన సాధ్యతే
సర్వం' అని శాస్త్రవచనం. 'దీపంతో దేనినైనా
సాధించవచ్చు' అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం.
ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు
బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని
వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం
పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా
దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.
కేవలం
దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను
ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా
అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు.
భారత
పురాణ ఇతిహాసాల్లోనూ, వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం
ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని
దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకి పంచుతుంది. తన నుండి
మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం మనోవికాసానికీ, ఆనందానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
వెలుగు సంతోషకారకం. చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన
వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తమస్సును నశింపచేసి జీవులకు
వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే ‘దీపం పరబ్రహ్మ
స్వరూపం’ అని భావిస్తూ ఆరాధిస్తారు. ‘వెలిగించడం’ సనాతన భారతీయ సంస్కృతి.
మంత్రశాస్త్ర
ప్రకారం ‘సాక్షాత్ దీపం
దర్శయామి’ అనే మంత్రం
చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి, నీటిని చల్లి,
ముగ్గులు పెట్టి ధూపం
వెలిగించి దీపం పెట్టడంవల్ల సకల దుష్ట గ్రహ శక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం
అవుతుంది. అప్పుడే ఆ గృహం పూజార్హతకు అవకాశం కలుగుతుంది. దీపం వెలిగించగానే ఇంటికి
లక్ష్మీకళ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి దీపవాసిని. దీపకాంతి నుంచే కళ పుడుతుంది.
దీపం అమంగళాన్నీ, దారిద్య్రాన్నీ,
అరిష్టాల్ని పారద్రోలే
శక్తి స్వరూపం. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు.
పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. కానీ నేటి పరిస్థితుల
దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు. కానీ ఇంట్లో రోజూ ఉదయం,
సాయంకాలం దీపారాధన చేయడం
శుభప్రదం. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలని
శాస్త్రాలు చెబుతున్నాయి.
==============
సుప్రభాతం అంటే ఏమిటో వివరిస్తూ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ నమస్తే తెలంగాణ పత్రికలో రాసిన వ్యాసం