Thursday, November 14, 2019

అయోధ్యా నగర విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) రాసిన వ్యాసం



రామయ్య నడయాడిన నేల







అయోధ్య..

కేవలం నగరం మాత్రమే కాదు. తరగని ఆధ్యాత్మిక చింతనకు ఆయువుపట్టు. యుగయుగాల చరిత్రకు నిలువెత్తు దర్పణం. ఊహకందని ప్రాకృతిక సౌందర్యానికి ఆలవాలం. రాజనీతికి, ధర్మవర్తనకు, ప్రజారంజకమైన పాలనకు మారుపేరు. సనాతన భారతీయ సాంస్కృతిక హర్మ్యానికి హృదయ పీఠి.

 

ఇతర నగరాల మాదిరిగా అయోధ్య కేవలం భౌగోళిక ప్రాంతంగా మిగిలిపోలేదు. యుగాలు మారినా, తరాలు గడిచినా ఇప్పటికీ తనకుమాత్రమే సొంతమైన ప్రాభవంతో కోట్లాది హృదయాల్లో ప్రత్యేకస్థానంతో అలరారుతోంది. అయోధ్య అనే పేరు చెబితేనే వర్ణించటానికి మాటలు చాలని ఓ అనుభూతి మనసు తలుపులు తడుతుంది. మనందరి దైవం నదయాడింది ఈ నేల మీదే అనే భావన మనసుల్ని పులకింపజేస్తుంది. ఒక్కసారి ఈ మట్టిని ముట్టుకుంటే చాలు జీవితం ధన్యమవుతుందని కోట్లాది హృదయాలు ఆరాటపడతాయి. కేవలం ఈ నగరానికి మాత్రమే ఎందుకీ ప్రత్యేకత? ఈ మట్టి కోసమే ఇంత ఆరాటమా? అంటే యుగాలనాటి చరిత్రను తరచి చూడాల్సిందే.

 

ఆదికవి వాల్మీకి రామాయణానికి పునాది అయోధ్య. మహర్షి తపస్సు చేసి మరీ వెతికిన సుగుణాల రాశి రామయ్య పుట్టిన నేల అయోధ్య. అందుకే వాల్మీకికి అయోధ్య అంటే వల్లమాలిన ప్రేమ. తన రామాయణం బాలకాండలోని ఐదు, ఆరు సర్గల్ని పూర్తిగా అయోధ్యానగర వర్ణనకే కేటాయించాడు వాల్మీకి.

 

అయోధ్య నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా

మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితాస్వయమ్ (బాలకాండ, 5-6)

 

కోసలదేశంలో ఉన్న అయోధ్య నగరాన్ని మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మించాడు. అందువల్ల ఆ నగరం మరింతగా లోకప్రసిద్ధి పొందింది... అంటూ బాలకాండలో అయోధ్యా నగర వర్ణన ప్రారంభమవుతుంది.

 

అయోధ్య పొడవు 12 యోజనాలు. వెడల్పు మూడు యోజనాలు. ఇప్పటి లెక్కలో ఇది సుమారుగా 168 కి.మీ  పొడవు, 42 కి.మీ వెడల్పునకు సమానం. దీనిప్రకారం అయోధ్య నగరం వైశాల్యం 7.056 చ.కిమీ.

 

 అయోధ్య ఏదో అనుకోకుండా ఏర్పడిన నగరం కాదు. ఎంతో ప్రతిభ కలిగిన శిల్పులు, వాస్తు నిపుణులు ఈ నగరాన్ని శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. నగరం మధ్యభాగంలో అంగడులు ఉండేవి. అక్కడ వివిధ యంత్రాలు, ఆయుధాలు ఉండేవి. ఎత్తైన కోట బురుజులు, ధ్వజాలు, వందలకొద్దీ శతఘ్నులు ఉండేవి. కోటకు రక్షణగా వందల కొద్దీ మేలుజాతి గుర్రాలు, వేగంగా నడిచే ఏనుగులు, ఎద్దులు, ఒంటెలు లు ఉండేవి. మొత్తంగా శత్రుదుర్భేద్యంగా అయోధ్యను తీర్చిదిద్దారు నిపుణులు. అయోధ్యలోని ప్రాకారాలు, కోటను కాపాడటానికి వేలాదిమంది సుశిక్షితులైన యోధులు కోట బురుజుల మీద, కోట లోపల నిరంతరం కాపలాగా ఉండేవారు. వీరందరూ శస్త్రాస్త్రవిద్యల్లో నిపుణులు. ప్రత్యేకించి శబ్దభేది విద్య (కంటితో చూడకుండా కేవలం శబ్దం విని లక్ష్యాన్ని చేదిస్తూ బాణాలు వేసే విద్య)లో అరితేరినవారు.

 

చిత్రామ్ అష్టాపదాకారాం వరనారీగజైర్యుతామ్

సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్ (బాలకాండ, 5:16)

 

చదరంగంలో ఉండే పలకల వంటి నిర్మాణాలు కలిగిన భవనాలు ఇక్కడ ఉండేవని వాల్మీకి ఎంతో స్పష్టంగా చెప్పాడు. అందంతో పాటు శత్రువుల ఊహకు అందనివిధంగా ప్రజల్ని కాపాడేందుకు అప్పటి నగరశిల్పులు తీసుకున్న శ్రద్ధ ఇందులో కనిపిస్తుంది.

 

'యోద్ధుం ఆశక్యా ఇతి అయోధ్య' - జయించటానికి వీలుకానిది అయోధ్య అని అర్థం. కేవలం పేరులోనే కాదు... వాస్తవంలోనూ ఆచరణాత్మకమైన శత్రురక్షణ వ్యవస్థ కలిగిన నగరంగా అయోధ్య చరిత్రలో నిలిచిపోయింది ఎన్ని యుగాలు గడిచినా ఈ నగరం పరరాజుల వశం కాలేదు. ఆయోధ్య చరిత్రకు ఇదొక కీర్తిపతాకం.

 

రాజ్యానికి ఆయువుపట్లైన వాణిజ్యంలో అయోధ్యకు సాటిరాగల నగరం అప్పట్లో లేదు. క్రయవిక్రయాల కోసం వచ్చే వ్యక్తులతో ప్రధానవీధులన్నీ కిక్కిరిసి ఉండేవి. కప్పం చెల్లించటానికి వచ్చే సామంతరాజులు బారులు తీరేవారంటే అతిశయోక్తికాదు. సంగీత, సాహిత్య, నృత్య, నాటక, గీతాది కళారంగాల్లో ప్రముఖులకు అయోధ్యవేదికగా ఉండేవారు.

 

ఇటువంటి ఆయోధ్యను రాముడు పరిపాలించిన కాలంలో సంపన్నుడు కాని వ్యక్తి ఆ నగరంలో లేడు. గో, ధన. ధాన్య, వాహన సమృద్ధి లేని ఇల్లు ఉండేది కాదు. ఈ సందపనంతా యజమానులు కేవలం ధర్మబద్ధంగా సంపాదించి. ధర్మబద్ధంగానే ఖర్చు చేసేవారు. ఈ నగర ప్రజలంతా మహర్షులతో సమానమైన ఇంద్రియ నిగ్రహం, తేజస్సు కలిగిఉండేవారు. అయోధ్యలో ఆకలితో అలమటించే వ్యక్తి ఒక్కడూ లేడు. దానం కోసం అర్రులు చాచే వ్యక్తి లేడు. నుదుట తిలకం ధరించని మనిషి కనిపించడు. దీనుడు కాని, దానం చెయ్యనివాడు కాని, రోగపీడితుడు కాని, సౌందర్యవిహీనులు కానీ కనిపించేవారు కాదు.

 

కాంభోజ, బాహ్లిక, వనాయు, సింధు దేశాలకు చెందిన ఉత్తము గుర్రాలు ఇక్కడ ఉండేవి. వింధ్య పర్వతాల్లో సంచరించే మదపుటేనుగుల్ని ప్రత్యేకంగా ఈ నగరానికి తెప్పించారు.  ఇలాంటి ఉత్తమ జాతి పశుగణం అయోధ్యలో ఉండేది. అంతేకాదు... రెండు, మూడేసి జాతుల సాంకర్యంతో పశుగణాల్ని ఉత్పత్తిచేసే విధానం ఇక్కడ ఉండేది. భద్రమంద్ర, భద్రమృగ, మృగకు చెందిన ఏనుగులు ఇలా పుట్టినవే. (బాల, 6:25). మొత్తంగా బలిష్టమైన రాజ్యవ్యవస్థ అయోధ్యలో ఉండేది. అందుకే అయోధ్య అంటే అక్కడి ప్రజలకు మాత్రమే కాదు విదేశీయులకూ ఎంతో ప్రీతిగా ఉండేది.

 

 స్కాందపురాణం దేశంలోని ఏడు మోక్షపురాల్లో ఒకటిగా అయోధ్యను పేర్కొంది. ఈ నగరం చేప ఆకారంలో ఉంటుందని కూడా ఈ పురాణం చెబుతుంది. అగ్ని, బ్రహ్మపురాణాలు అయోధ్యను పాపాలను నాశనం చేసే నగరంగా కీర్తించాయి. యోగినీతంత్రంలో కూడా అయోధ్య ప్రస్తావన ఉంది. అధర్వణ వేదం అయోధ్యను దేవనిర్మిత నగరంగా ప్రకటించింది. తులసీదాసు కూడా తన రామచరితమానస్ లో అయోధ్య వైభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. భాగవతంలో కూడా శుకమహర్షి రఘవంశాన్ని ప్రస్తావించిన సందర్భంలో ప్రత్యేకంగా అయోధ్య గురించి వివరిస్తాడు.

 

కవయిత్రి మొల్ల కూడా తన రామాయణంలో అయోధ్య వైభవాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తుంది.

'భానుకులదీప రాజన్యపట్టభద్ర

భాసి నవరత్న ఖచిత సింహాసనమ్ము

నాగనుతికెక్కు మహిమ ననారతమ్ము

ధర్మ నిలయమ్ము, మహినయోధ్యాపురమ్ము'

 

అయోధ్య అంటే కేవలం రాజ్యం మాత్రమే కాదు. ధర్మానికి అది నిలయం అంటుంది మొల్లమాంబ.

 

భారతయుద్ధం తర్వాత అయోధ్యానగరం కనుమరుగవుతుంది.  విక్రమాదిత్యుడు ఓ యోగి సూచన మేరకు ఒక ఆవును, దూడను వదలిపెట్టి, అవి ధారగా పాలు విడుస్తున్న ప్రాంతాన్ని అయోధ్యగా గుర్తించి, ఆ నగరాన్ని పునరుద్ధరించాడని ఓ కథనం వ్యాప్తిలో ఉంది. ఇదే ఇప్పటి అయోధ్య అని భక్తుల విశ్వాసం. ఉజ్జయినీ పరిపాలకుడైన విక్రమాదిత్యుడు అయోధ్యలోని సుమారు 300 దేవాలయాల్ని పునర్నిర్మించిన చారిత్రకగాథ ఈ వాదనను బలపరుస్తోంది.

 

శ్రీరామచంద్రుడు, అతని తండ్రి దశరథుడికి పూర్వమే అయోధ్య పరిపాలించిన రాజులెందరో ఉన్నారు. ఇక్ష్వాకు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరధుడు, రఘు మహారాజు, అజ మహారాజు మొదలైన చక్రవర్తులెందరో ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని ధర్మబద్ధమైన పాలన చేసి చరిత్రలో చిరయశస్సు పొందారు. వీరందరి కీర్తికి కారణమైన అంశాల్లో అయోధ్య కూడా ఒకటి.

 

అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికా

పురీ ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా

 

దేశంలోని ఏడు ప్రధాన పుణ్యక్షేత్రాలను సప్తమోక్షపురాలుగా పురాణాలు పేర్కొంటున్నాయి. వీటిలో మొదటిది అయోధ్య. యోగశాస్త్ర ప్రకారం అయోధ్యను మానవశరీరంలో ఉండే సహస్రారచక్రంతో పోలుస్తారు. సహస్రార చక్రం శిరస్సు మధ్యభాగంలో ఉంటుంది. ఇది పరిపూర్ణమైన జ్ఞానానికి ప్రతీక. ఈ చక్రంలో విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా ప్రకాశిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమయోగులకు మాత్రమే సహస్రార చక్రం గురించిన అనుభూతి పూర్వక జ్ఞానం లభిస్తుంది. ఈ స్థానాన్ని తెలుసుకున్నవారికి పునర్జన్మ ఉండదని యోగశాస్త్రం చెబుతోంది. దీనిప్రకారం అయోధ్యను చేరుకోవటమంటే సహస్రారకమలాన్ని చేరుకోవటం, అంతిమంగా మోక్షాన్ని సాదించటమే అవుతుంది.

 

అందరూ అనుకుంటున్నట్లు అయోధ్య కేవలం నగరం మాత్రమే కాదని, మానవ జీవచైతన్యానికి ఇదొక ప్రతీక అని అధర్వణవేదం చెబుతోంది. 'అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాం హిరణ్మయః స్వర్గలోకో జ్యోతిషావృత్త:...' ఎనిమిది చక్రాలు, తొమ్మిది ద్వారాలు ఉండే మానవ శరీరం అయోధ్యకు ప్రతీక. జనన, మరణ చక్రంలో శరీరం తిరుగుతూ ఉంటుంది. వీటితో మోక్షం కోసం యుద్ధం చెయ్యటం సాధ్యం కాదు. ఫలితం ఉండదు. శరీరం అనే పట్టణంలోని జ్యోతిర్మయకోశానికి స్వర్గం అనే పేరుంది. అది జీవచైతన్యస్వరూపమైన తేజస్సుతో నిండి ఉంటుంది. ఈ పట్టణాన్ని ఏ వ్యక్తి బ్రహ్మసంబంధమైనదిగా తెలుసుకుంటాడో అతడికి బ్రహ్మదేవుడు ఆయువు, కీర్తి మొదలైన వాటిని అనుగ్రహిస్తాడని అధర్వణ వేదమంత్రాలు చెబుతున్నాయి.

 

వాక్యపరంగా అయోధ్య పదానికి ఉన్న అర్థాన్ని శరీరానికి అన్వయిస్తే జయించటానికి సాధ్యం కాని లక్షణం ఉన్న శరీరమే అయోధ్యకు లౌకిక ప్రతీకగా నిలుస్తుంది. మొత్తంగా మనలో ఉన్న ఆత్మచైతన్యాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకతను అయోధ్య నిరంతరం గుర్తుచేస్తుందని అర్ధం చేసుకోవాలి.

 







ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...