Monday, February 15, 2021

వసంత పంచమి ప్రత్యేకం ...సరస్వతీ దేవి అందించే సందేశం ఇదే...

వసంత పంచమి ప్రత్యేకం
సరస్వతీ దేవి అందించే సందేశం ఇదే...




 

వీణాపాణి వేద వాణి!
మాఘ శుద్ధ పంచమి  వసంత పంచమి

 

ఆమె అక్షరం... ఆమె అక్షయం... ఆమె గీర్వాణి... ఆమె సకల శాస్త్రాలకూ రారాణి

ఆమె జ్ఞానం.. ఆమె సర్వవిద్యలకూ మూలం...

వాల్మీకి నోట ఆది కావ్యాన్ని పలికించిన తల్లి ఆమె.

వ్యాసభగవానుడి చేత ఆపార సాహిత్యాన్ని రాయించిందీ ఆ తల్లే.

యాజ్ఞవల్క్యుడు, ఆదిశంకరులు, ఆదిశేషువు, బృహస్పతి అందరూ ఆమె అనుగ్రహంతోనే అనంతమైన జ్ఞానాన్ని వరప్రసాదంగా అందుకున్నారు.

ఆ తల్లి సరస్వతి... మనలోని విజ్ఞానానికి మాతృమూర్తి. ఆమె ఆవిర్భవించిన రోజు వసంతపంచమి.

 

మాఘమాసం ప్రకృతి వికాసానికి, సరస్వతి మనోవికాసానికి సంకేతం. ఈ రెండింటి కలయిక పరిపూర్ణ వికాసానికి నిదర్శనం. దీనికి ప్రతీకగా వసంత పంచమి వ్యాప్తిలోకి వచ్చింది. మనిషిలో ఉండే అవిద్య లేదా అజ్ఞానం తొలగిపోయి ఎప్పుడు జ్ఞానం అనే వెలుగురేఖ ప్రసారమవుతుందో ఆ రోజు మనిషి వికాసానికి ప్రారంభసూచిక అవుతుంది. అజ్ఞానం అనే మంచుతో గడ్డకట్టిన మనిషి హృదయాన్ని చదువు అనే వేడితో కరిగించి జ్ఞానం అనే వెలుగును ప్రసరింపజేయటమే వసంత పంచమి అంత‌రార్థం. మాఘమాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమిని వసంత పంచమిగా చేసుకుంటాం. ఈ రోజుకే శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి.

 * చైత్ర, వైశాఖమాసాల్లో వచ్చే వసంత రుతువుకు స్వాగతోపచారాలు మాఘమాసంలోనే మొదలవుతాయి. కాలగమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మకర సంక్రమణం (సంక్రాంతి) తర్వాత వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మాఘమాసం ప్రారంభం కావడంతోనే చెట్లు చిగురించడం, పూలు పూయడం మొదలవుతుంది. చలి, ఎండల మిశ్రమ వాతావరణం ప్రజలకు ఎంతో హాయి కలిగిస్తుంది. పంటలు నిండుగా చేతికి వచ్చి ఉంటాయి. పాడి పశువులకు పుష్కలంగా గ్రాసం లభిస్తుంది. దీంతో అవి సమృద్ధిగా పాలనిస్తాయి. గ్రహగమనాలన్నీ శుభస్థానాల్లో జరుగుతాయి. వివాహాది శుభకార్యాల సందడి మొదలవుతుంది. మొత్తంగా మానవజీవితానికి అత్యంత ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే కాలం ప్రారంభమవుతుంది. ఇదంతా రాబోయే వసంతమాసానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉండి వసంత సందడి ముందుగానే వచ్చిన అనుభూతి కలిగిస్తుంది.

 * పురాణ, ఇతిహాసపరంగా కూడా వసంత పంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బ్రహ్మవైవర్త పురాణం, కృత్యసార సముచ్చయం, హేమాద్రి గ్రంథాల్లో ఇందుకు సంబంధించిన అనేక విషయాలు వివరణాత్మకంగా ఉన్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రాచీన రోమన్లు వసంతపంచమి ఉత్సవాన్ని జరిపేవారని తెలుస్తోంది. గ్రీకులు జ్ఞానదేవతగా భావించి ఈ రోజున సరస్వతీదేవికి పూజలు చేసేవారు.

 * ఈ రోజును రతికామ దమనోత్సవంగా జరుపుకునే ఆచారం కొన్నిచోట్ల ఉంది. పంచమినాడు రతీదేవి కామదేవ పూజచేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. రుతువుల రాజు అయిన వసంతుడికి, కామదేవుడికి మధ్య ఎంతో సఖ్యత ఉంది. వసంతుడు సస్యదేవత. కాముడు ప్రేమదేవత. రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురి కలయిక... అంటే, ప్రకృతి ద్వారా లభించే అమితమైన జీవనోపాధి మనుషుల మధ్య ప్రేమానురాగాల్ని కలిగిస్తుంది. ఏ ప్రాంతమైతే పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుందో అక్కడి మనుషులు ప్రేమానురాగాలతో సుఖంగా ఉంటారనేది ఇందులో అంతరార్థం.

 * ఈరోజును బెంగాల్‌లో శ్రీపంచమిగా మూడురోజుల పాటు ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్తరభారతంలో ఈ రోజున ఉదయం నుంచే సరస్వతీదేవిని పూజించి, సాయంకాలం ఆ ప్రతిమకు ఊరేగింపు జరిపి, నిమజ్జనం చేసే ఆచారం కొనసాగుతోంది. వసంతరుతువుకు స్వాగతం పలికే రోజు వసంత పంచమి అని, ఇది రుతువులకు సంబంధించిన పండుగ అని శాస్త్రాలు చెబుతున్నాయి. పంజాబ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో ఈ రోజున పతంగుల పండుగ చేసుకుంటారు. వేదవ్యాస మహర్షి గోదావరీ నదీతీరంలో ఇసుకతో సరస్వతీదేవిని ప్రతిష్ఠించి, అర్చన చేశాడు. వ్యాసుడి కారణంగా ఏర్పడిన ఆ క్షేత్రమే వ్యాసరలేదా వ్యాసపురికాలక్రమంలో బాసరగా ప్రసిద్ధి పొందింది.

  శ్వేతరూపం... జ్ఞానదీపం

 * సరః అంటే కాంతి. కాంతి అంటే జ్ఞానం. మన జీవితాన్ని జ్ఞానంతో నింపే మాతృశక్తి సరస్వతి. శుద్ధ జ్ఞానానికి ఆమె ప్రతీక. వికాసం, విజ్ఞానాలకు ఆమె ఆకృతి. అక్షర అక్షయ సంపదలకు మూలమైన ప్రణవ స్వరూపిణి ఆమె. వేదజ్ఞానానికి మాతృకగా, గాయత్రిగా, సావిత్రిగా, లౌకిక, అలౌకిక విద్యల ప్రదాతగా ఆమె పూజలందుకుంటోంది.

* సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం అంటే నిరంతరం సాగిపోయే చైతన్యం. సాధారణంగా జలం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. జలం జీవశక్తికి సంకేతం. దాన్నుంచే అన్ని జీవులకూ  శక్తి అందుతోంది. తద్వారా ప్రకృతిలో ఉత్పాదకత జరుగుతోంది. ఈ ఉత్పాదకతకు ప్రతిఫలమే సరస్వతి (జ్ఞానం). సృష్టి కార్యాన్ని నిర్వహించే  బ్రహ్మదేవుడికి కూడా అందుకు తగిన జ్ఞానాన్ని సరస్వతి అందిస్తుంది.

 * సరస్వతీ అవతారం అహింసకు కూడా తార్కాణంగా కనిపిస్తుంది. తెల్లటి వస్త్రాలు, తెల్లటి పువ్వులు, తెల్లటి ముత్యాల సరం, గంధపు పూత ఇవన్నీ గీర్వాణికి ఇష్టమైనవి. ఇవన్నీ శాంతికి, స్వచ్ఛతకు చిహ్నాలు. ఏవిధమైన ఆయుధాలూ ఆమె చేతిలో ఉండవు. మనలో ఉన్న అజ్ఞానమనే రాక్షసుడిని సంహరించే విజ్ఞానమనే ఆయుధాన్ని అందించే పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట హింసకుఅశాంతికి తావుండదు కదా. ఇంకో ఉపమానంలో తెలుపు శుభ్రతకు, నిర్మలత్వానికి, స్వచ్ఛతకు ప్రతీక. ఈ ప్రకారం సరస్వతి స్వచ్ఛతకు ఆలంబనగా నిలుస్తుంది. అన్నిరకాలైన విద్యలు సరస్వతీదేవి అనుగ్రహంతో లభిస్తాయి. అంటే, విద్య ద్వారా మనిషి స్వచ్ఛంగా తయారై, నిర్మలహృదయంతో ప్రకాశిస్తాడని అర్థం చేసుకోవచ్చు.

 * నదుల పరంగా చూస్తే గంగ, యమునలతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది.  ఈ కోణంలో చూస్తే జ్ఞానం మనిషిలో అంతర్లీనంగా ప్రవహించాలే కానీ బాహ్యప్రదర్శనల కోసం విజ్ఞానాన్ని ప్రకటించకూడదనే సందేశాన్ని సరస్వతీ నది ద్వారా మనకు అందుతుంది.

 బౌద్ధమతం వ్యాప్తిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో సరస్వతీదేవిని మంజుశ్రీ, మహాసరస్వతి, వజ్రసరస్వతి, ఆర్య వజ్రసరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్రశారద వంటి పేర్లతో ఆరాధిస్తారు. జైనులు కూడా శృతదేవత, షోడశవిద్యాదేవతగా పూజలు చేస్తారు. 

 రుగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త, పద్మపురాణాల్లో సరస్వతీదేవి వర్ణన విస్తారంగా ఉంది. వీటిప్రకారం సరస్వతీదేవి తెల్లటి వస్త్రాలు ధరించి, హంసవాహనాన్ని అధిరోహించి ఉంటుంది. చేతుల్లో వీణ, రుద్రాక్షమాల, పుస్తకం ధరించి ఉంటుంది.

 * సరస్వతీదేవి చేతిలో ఉన్న పుస్తకం జ్ఞానానికి సంకేతం. పుస్తకం ద్వారా జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం మనిషిలో తీర్చిదిద్దిన సంపూర్ణ వ్యక్తిత్వానికి, హృదయ నిర్మలత్వానికి ప్రతీక. సంహరించాల్సింది వ్యక్తిని కాదు... అతడిలోని రాక్షస గుణాన్ని మాత్రమే అనే సంకేతాన్ని సరస్వతి చేతిలోని పుస్తకం ద్వారా అందుతుంది.

 * అమ్మ చేతిలో వీణ సంగీతానికి ప్రతిరూపం. ఈ వీణ పేరు కచ్ఛపి’. చదువంటే కేవలం పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు.  కళలన్నీ చదువులో భాగమే. కళాకారుడు అత్యుత్తమ సంస్కారం, ఆత్మీయత కలిగి ఉంటాడు. మనుషులందరూ ఇలాంటివారు కావాలని సరస్వతి చేతిలోని వీణ చెబుతుంది. అందులో ఏడుతంత్రులు ఉంటాయి. వీటిద్వారా నాదం ఉత్పత్తి అవుతుంది. మనం చూసే ప్రపంచమంతా నాదమయం. పరమేశ్వరుడు నాదస్వరూపుడు. కాబట్టి, పరమేశ్వరుడిని చేరుకోవాలంటే నాదోపాసన చెయ్యాలన్న సందేశం కూడా సరస్వతీదేవి చేతిలోని వీణ చెబుతుంది.

 * ఆమె వాహనం హంస. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే స్వీకరించే గుణం హంసకు ఉంది. సమాజంలో మంచి, చెడూ పాలూనీళ్లలా కలిసే ఉంటాయి. ఉత్తమ జ్ఞానం కలిగిన వ్యక్తి హంసలాగా చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలని చెప్పటం హంసవాహనం ఇచ్చే సందేశం.

 * కమలం వికాసానికి, పవిత్రతకూ చిహ్నం. కమలం పుట్టుక బురదలోనే. కానీ, బురద వాసన, అపవిత్రత దానికి సోకవు. అందుకే అమ్మకు కమలం ఆసనమైంది. అలాగే మనిషి కూడా అనేక అపవిత్రాలు  ఉండే సమాజంలో ఉంటూనే తన పవిత్రతను కాపాడుకోవాలి. మనోవికాసాన్ని సాధించాలనే సందేశాన్ని కమలం అందిస్తుంది. మన శరీరంలో ఉండే కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు అందుకు ప్రతీకగా కూడా కమలాన్ని యోగసాధకులు చెబుతారు.

 * సరస్వతీదేవి ధరించే ధవళవస్త్రాలు స్వచ్ఛతకు చిహ్నం. మనిషి కూడా స్వచ్ఛంగా ఉండాలని ఇవి సూచిస్తాయి. తెలుపు వస్త్రం ఏ చిన్న రంగు పడినా అది సహజత్వాన్ని కోల్పోతుంది. చూడటానికి ఇంపుగా ఉండదు. మనిషి కూడా అంతే. ఏ చిన్న అపవాదు వచ్చినా, తప్పు చేసినా ఆ ఫలితం అతడి జీవితాంతం వెన్నంటి ఉంటుంది. అందుకే, ఏ తప్పూ చెయ్యకుండా స్వచ్ఛంగా, తెల్లటి వస్త్రంలా ఉండాలని ధవళ వస్త్రాలు సూచిస్తాయి.

 * ఆమె చేతిలోని రుద్రాక్షమాల ఆత్మచైతన్యాన్ని సూచిస్తుంది. కేవలం భౌతికం, లౌకికమైన విద్య మాత్రమే మనిషిని భగవంతుడి వద్దకు చేర్చలేదు. అతడు ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం. ఆత్మసాక్షాత్కారం పొందటానికి రుద్రాక్ష మార్గం చూపుతుంది. రుద్రాక్షను రుషులు భూమికి, స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు.

 

రచన - డా. కప్పగంతు రామకృష్ణ, సెల్ : 90320 44115 / 8897 547 548

 

 


Friday, February 12, 2021

సూర్యుడిని ఎలా ఉపాసించాలి? వేదాల్లో సూర్యుడి గురించి ఏం చెప్పారు? సూర్యోపాసనకు పాటించాల్సిన నియమాలేమిటి?

సూర్యుడిని ఎలా ఉపాసించాలి? 

వేదాల్లో సూర్యుడి గురించి ఏం చెప్పారు? 

సూర్యోపాసనకు పాటించాల్సిన నియమాలేమిటి?  





శ్రీ సూర్యనారాయణ వైభవం

 

  సకల చరాచర జగత్తుకు వెలుగును, తేజస్సును ప్రసాదించేవాడు సూర్యభగవానుడు. ఈయన భూమి మీద తొలిగా తన వెలుగును ప్రసాదించిన రోజు సప్తమి. అందుకనే మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిగా, రథ సప్తమిగా  లోకప్రసిద్ధి పొందింది.

  సూర్యునికి వివస్వంతుడనే పేరు ఉంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. ఇతని మన్వంతరం ప్రారంభమైంది కూడా సప్తమి రోజునే. సూర్యుడు తన రథాన్ని అధిరోహించింది కూడా మాఘ శుద్ధ సప్తమి రోజునే. అందుకనే మాఘ శుద్ధ సప్తమి రథసప్తమిగా ప్రసిద్ధి పొందింది. మత్స్యపురాణంలో ఈ వివరాలు ఉన్నాయి.

మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వీరందరిలో మన చర్మచక్షువులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు. అందుకనే ఆయన కర్మసాక్షి అయ్యాడు. సకల వేద, పురాణ, ఇతిహాస, కావ్య వాజ్ఞ్మయమంతా సూర్యోపాసన వైశిష్ట్యాన్ని ప్రకటిస్తుంది.

కంటికి కనిపించే సకల ప్రపంచాన్ని తన తేజస్సు ద్వారా నడిపించే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు. అదిత్యుడని, భానుడని, మిత్రుడని... ఎన్నో పేర్లతో పూజలందుకుంటూ, మనలోని అజ్ఞాన తిమిరాల్ని తన కిరణాల ద్వారా దహింపజేస్తూ, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసే దైవం సూర్యనారాయణమూర్తి. తరు, పశు, పక్ష్యాదులతో సహా ఏ జీవి చైతన్యంగా ఉండాలన్నా అందుకు ఆదిత్యుని అనుగ్రహం తప్పనిసరి.

 సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు. అనంతమైన శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నిటికీ వెలుగును, తేజస్సును ప్రసాదించే జ్యోతి స్వరూపుడు. అన్ని ఐశ్వర్యాలకన్నా పరమోన్నతమైన ఆరోగ్యభాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించే కరుణామూర్తి. అందుకనే, ఆదిత్యోపాసన సర్వోన్నతమైందిగా, సకల పాపాలను పోగొట్టే తారకమంత్రంగా శాస్త్ర, పురాణ, ఇతిహాస గ్రంథాలు చెబుతున్నాయి.

సూర్యోపాసన చేసి, సూర్యశతకాన్ని రచించిన పుణ్యం చేత మయూరుడనే కవి కుష్ఠువ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. అగస్త్య మహర్షి చేత ఆదిత్యహృదయాన్ని ఉపదేశం పొంది, దాన్ని పారాయణ చేసిన ఫలితంగా శ్రీరామచంద్రమూర్తి రావణాసురిడిని సంహరించాడు. ఇంకా మరెందరో పుణ్యమూర్తులు సూర్యోపాసన చేసి, రథసప్తమీ వ్రతాన్ని ఆచరించిన పుణ్యప్రభావం చేత ఎందరో భక్తులు ఎన్నో బాధల నుంచి విముక్తులైన గాథలు ఉన్నాయి. మొత్తంగా సూర్యోపాసన అనంతమైన ఫలితాలను ఇస్తుంది.

సూర్యగ్రహ గమనాన్ని బట్టే ఋతువులు, ఉత్తర, దక్షిణాయనాలు ఏర్పడతాయి. ఈవిధంగా సూర్యగమనంలో మార్పుల వల్ల ఏర్పడ్డ ఉత్తరాయణమే మకర సంక్రమణంగా, సంక్రాంతి పండుగగా లోకంలో వ్యాప్తి చెందింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా సూర్యుడి నుంచి వచ్చే వేడి వల్ల సముద్రాలు, నదుల్లోని నీరు ఆవిరవుతుందని,  ఆ ఆవిరి మేఘాలుగా మారి, వర్షించటం వల్ల సకల ప్రాణికోటి తాగటానికి మంచి నీరు, పంటలు పండటానికి తగిన నీరు లభిస్తోందని చెబుతోంది. ఈవిధంగా చూసినా అఖండ భూమండలం మీద సకల ప్రాణులకు జీవనాధారుడు సూర్యుడే అని స్పష్టమవుతోంది.

సూర్యారాధన వల్ల విజ్ఞానం, ఉత్తమ గుణాలు, వర్చస్సు, ఆయుష్షు, ధనం, సంతానభాగ్యం కలుగుతాయి. వాత, పిత్త, క్షయ, కుష్ఠు వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మొత్తంగా ఆరోగ్య సంపద ఆదిత్యుని ఉపాసన ద్వారా వరంగా లభిస్తుంది.

జ్యోతిషశాస్త్రం ప్రకారం శారీరక రోగాలు ఉన్నవారు సూర్యారాధన చేస్తే, మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి నేత్రదోషాలు, చర్మవ్యాధుల నుంచి సూర్యోపాసన ద్వారా వేగంగా ఉపశమనం లభిస్తుంది.  మొత్తంగా సూర్యోపాసన సకల వ్యాధులను దూరం చేసేదిగా, సకల పాపాలను పోగొట్టే ఉత్తమ వ్రతంగా లోకవ్యాప్తిలో ఉందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మానవ జీవితం ప్రకృతి అధీనమని, ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదనే జాగృతిని సూర్యోపాసన  తెలియజేస్తుంది. భారతీయ ఆచార సంప్రదాయాలు, పండుగలు మూఢనమ్మకాలు కావని, అనంతమైన వైజ్ఞానికత వాటిలో దాగిఉందని సూర్యోపాసన చాటుతుంది.

ఇతిహాసాల్లో సూర్యవైభవం            

 ఇతిహాస, పురాణాల్లోనూ సూర్య మహిమ అనేక చోట్ల కనిపిస్తుంది. యాజ్ఞవల్క్య మహర్షి సూర్యోపాసన ద్వారా వాజసనేయ సంహిత (శుక్ల యజుర్వేదం) పొందాడు. వాయుదేవుని కుమారుడైన ఆంజనేయుడు కూడా సూర్యుని గురువుగా స్వీకరించి, ఆయన నుంచి సకల విద్యలు వరంగా అందుకున్నాడు. కుంతీదేవి సూర్య మంత్రాన్ని ఉపాసించటం ద్వారా సంతానం (కర్ణుడు) పొందింది. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించటం వల్లనే శమంతకమణి సాధించాడు. అరణ్యవాస కాలంలో ధర్మరాజు సూర్యోపాసన చేసి, అక్షయ పాత్రను పొంది, తన ఆశ్రమానికి వచ్చిన వేలాది మందికి అన్నదానం చేశాడు.

 ప్రస్కణ్వుడనే మహర్షి సూర్యమంత్రాలను ఉపాసన చేయటం ద్వారా తన చర్మరోగం నుంచి విముక్తి పొందాడు. భద్రేశ్వరుడనే రాజు కూడా ఆదిత్యోపాసన ద్వారా శ్వేత కుష్ఠురోగం నుంచి ఉపశమనం పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యగాయత్రి, అరుణం, మహాసౌరం, ఆదిత్యహృదయం, మయూర శతకం మొదలైన వాటిని పారాయణ చేయటం ద్వారా అనేక శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తిపొందిన భక్తుల కథలు ఎన్నో ఉన్నాయి. 

 ప్రత్యేకించి, రథసప్తమి రోజున చేసే స్నానం, సూర్యారాధన అనేక విశేష ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున జిల్లేడు ఆకులను శిరసు, భుజాల మీద ఉంచుకుని స్నానం చేయాలి.  గోధుమనూకతో చేసిన పొంగలిని సూర్యునికి నివేదన చేయాలి. ఇందువల్ల ఏడుజన్మల్లో చేసిన పాపం నశిస్తుందని నారద పురాణం చెబుతోంది.

 సూర్యగమనం ఆధారంగానే ఋతువులు, అయనాలు (ఉత్తరాయణం, దక్షిణాయనం) ఏర్పడతాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సందర్భం మకర సంక్రమణం. ఆ తర్వాత మాఘ శుద్ధ సప్తమి నుంచి సూర్యగమనం దక్షిణదిశకు మారుతుంది. ఈవిధంగా, రథసప్తమి ఖగోళ విజ్ఞానానికి సంకేతంగా నిలుస్తుంది.

సూర్యోపాసన నియమాలు

 సూర్యోపాసన చేసేవారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించి తీరాలి. అవేమిటంటే..

  • మద్యపానం, స్త్రీ సంపర్కం, తైల సంస్కారం విడిచిపెట్టాలి. అసత్యం పలుకకూడదు. కోపం పనికిరాదు. హారాలు ధరించకూడదు. మంచం మీద శయనించకూడదు. బ్రాహ్మణ, గో, మనుష్య, దేవతానింద చెయ్యకూడదు. పరుల ఇంటికి వెళ్ళకూడదు.
  • సూర్యోపాసన చేసే రోజున, ప్రత్యేకించి ఆదివారం నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, ప్రవాహములు, చెరువులు లేదా కోనేరుల్లో స్నానం చెయ్యాలి. అనంతరం పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, తిలకం ధరించాలి. సదాచారం పాటించాలి. పూజ, జపం, అర్ఘ్యం, ప్రదక్షిణ, నమస్కారం, స్తోత్రపారాయణ - ఈ ఆరు విధాలుగా సూర్యదేవుని అర్చించాలి.
  • పూజ మధ్యలో లేచి వెళ్ళకూడదు. పూజ ప్రారంభం నుంచి చివరి వరకు ఇతరులతో మాట్లాడకూడదు. అన్యమనస్కులై ఉండకూడదు. పూజ మధ్యలో ఆవులింత, తుమ్ము, అపానవాయువు వస్తే, ఆచమనం చేసి, మూడుసార్లు గోవింద నామస్మరణ చెయ్యాలి.

 త్రికాలాల్లో సూర్యారాధన

 బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వర: |

 సాయంధ్యాయేస్సదా విష్ణుం త్రయీమూర్తిర్దివాకర: ||

సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. జీవుల పుట్టుక, పెరుగుదల, క్షయం అన్నీ సూర్యతేజస్సు వల్లే జరుగుతున్నాయి. ఈవిధంగా సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడయ్యాడు.

 ప్రాత:కాలం :

 బ్రహ్మముహూర్తంలో సూర్యదండకాన్ని స్మరిస్తూ నిద్రలేచి, కాలోచిత కృత్యాలు పూర్తిచేసుకోవాలి. స్నానం, సంధ్యావందనం, నిత్యార్చన పూర్తిచేసుకున్న తర్వాత సూర్యమంత్రాన్ని ఉపాసన చెయ్యాలి. సూర్యతర్పణం అనంతరం తులసికోటలో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి.

 మధ్యాహ్నకాలం :

 మాధ్యాహ్నిక అర్చన తర్వాత సూర్యనారాయణస్వామి రూపును లేదా సూర్య సాలగ్రామాన్ని పూజించాలి. మహానివేదన సమర్పించి, ఆదిత్యహృదయం పారాయణ చెయ్యాలి. తీర్థప్రసాదాలు స్వీకరించాలి.

 సాయంకాలం :

 నీరెండగా ఉన్న సమయంలో సంధ్యావందనం పూర్తి చేసుకుని, సూర్యభగవానుడికి షోడశ ఉపచారాలతో పూజ చెయ్యాలి. నివేదన చేసి, హారతి సమర్పించాలి. సూర్యాష్టకం, దండకం పారాయణ చెయ్యాలి.


సౌరార్చన విశేషాలు

  • ఆదివారం నాడు తెల్లజిల్లేడు సమిధలు ఉపయోగించి మహాసౌమంత్రంతో ¬మం చేసినవారికి అభీష్టసిద్ధి కలుగుతుంది.

 

  • ఆదివారం రోజున తెలుపు, ఎరుపు, పసుపుపచ్చని మృత్తికలను ఒంటికి పూసుకుని, మృత్తాకాస్నానం చేసిన వారికి కోరికలు సిద్ధిస్తాయి.

 

  • వివిధ రంగుల పూలతో ప్రతి ఆదివారం విడువకుండా ఆదిత్యుని పూజించి, ఆ రోజు ఉపవాసం ఉన్నట్లయితే కోరికలు అతిశీఘ్రంగా నెరవేరుతాయి.


  • ప్రతి ఆదివారం ఆవునెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసి, ఆ దీపాన్ని సూర్యస్వరూపంగా భావించి పూజించినట్లయితే నేత్రవ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.

 

  • రాగిపాత్రలో నువ్వులనూనెతో దీపారాధన చేసి, ఆ దీపాన్ని బ్రాహ్మణుని దానం చేసినవారికి జ్ఞానప్రాప్తి కలిగి, అంతిమంగా ముక్తి లభిస్తుంది.

 

  • చతుష్పథం (నాలుగు రోడ్లు కలిసే కూడలి)లో ప్రయత్నపూర్వకంగా ద్వాదశాదిత్యులను ఉద్దేశించి 12 దీపాలు దానం చేసిన వారు భాగ్యవంతులు అవుతారు. మరుసటి జన్మలో రూపవంతులు, భాగ్యవంతులు అవుతారు.

 

  • పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, రక్తచందనం, ఎర్రని పుష్పాలు, అక్షతలు, తిలలు, గరిక ఇగుళ్ళు కలిపిన జలంతో నిత్యం ద్వాదశాదిత్యులకు 12 అర్ఘ్యాలు ఇచ్చి, ఆ ద్రవ్యాలతో ఆదిత్యుని అర్చించి, ఒక సంవత్సరం పాటు అష్టాక్షరీ మహామంత్రాన్ని దీక్షగా జపించిన వారికి సంవత్సరాంతంలో ఇష్టసిద్ధి తప్పకుండా కలుగుతుంది.

 

  • సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యునుకి అభిముఖంగా నిలబడి, సౌరమంత్రం జపించినా, సూర్యస్తోత్రాలు పారాయణ చేసినా జన్మ ప్రారంభం నుంచి అప్పటివరకు చేసిన పాపాలు నశిస్తాయి.

 

  • గుగ్గులు కర్ర, మారేడు చెక్క లేదా దేవదారు చెక్కతో నలుపలుకలుగా ఉండే ఆసనం తయారుచేసి, దాని మీద ప్రభాకరుని ఆవాహన చేసి, కర్పూరం, అగరు మొదలైన ద్రవ్యాలతో అర్చించిన వారికి స్వర్గలోక ప్రాప్తి స్థిరంగా కలుగుతుంది.

 

  •  'విషువ' అనే పుణ్యకాలంలో సూర్యార్చన చేసిన వారికి సమస్త పాపాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

 

  • పులగం, పాయసం, అప్పాలు, పండ్లు, దుంపలు, నెయ్యి తదితర ద్రవ్యాలతో సూర్యబలి ఇచ్చిన వారికి కోరికలన్నీ తీరుతాయి.

 

  • మూలమంత్రాన్ని పారాయణ చేస్తూ, ఆవు నేతితో తప్పరణ చేసిన వారికి సర్వసిద్ధులు కలుగుతాయి. ఆవుపాలతో తర్పణ చేస్తే మనస్తాపాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆవుపెరుగుతో తర్పణ చేస్తే కార్యసిద్ధి లుగుతుంది.

 

  • పవిత్ర తీర్థజలాలతో అరుణ, మహాసౌర మంత్రాలతో సూర్యునికి అభిషేకం చేస్తే పరమపదం లభిస్తుంది.

 

  • భక్తిశ్రద్ధలతో ఆదిత్యుడిని ఒక్కరోజు పూజించిన ఫలితం వంద యాగాలు చేసిన ఫలితాన్నిస్తాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.


వేదాల్లో సూర్యవైభవం

కృష్ణయజుర్వేదంలో సూర్యవైభవం ఎన్నో చోట్ల కనిపిస్తుంది. 'తరణిర్విశ్వదర్‌శతో జ్యోతిష్కృదశి సూర్య...'  (కృష్ణ యజుర్వేదం, సంహిత, 1 - 4)లో అనే మంత్రం చీకటితో నిండి ఉన్న సకల జగత్తు అంతా సూర్యుని కాంతి వల్లనే దృగ్గోచరమవుతుందని చెబుతోంది.

 నారాయణోపనిషత్తు 'ఘృణిస్సూర్య ఆదిత్యోం న ప్రభావాత్యక్షరం మధుక్షరన్తి తద్రసం...' అంటుంది. సముద్రాల్లోని ఉప్పు నీటిని తన కిరణాల ద్వారా గ్రహించి, తన ప్రభావం చేత ఆ ఉప్పు నీటిని తాగటానికి యోగ్యమైన నీరుగా, ఓషధీగుణాలు కలిగినదిగా మార్చి, మేఘాల ద్వారా వర్షింపజేస్తాడు సూర్యభగవానుడు. ఈవిధంగా సూర్యభగవానుడి అనుగ్రహ ఫలితంగా అందిన వాన నీటి ద్వారానే పంటలు పండుతాయి. పంటల వల్ల మానవాళికి అన్న సమృద్ధి కలుగుతుంది. అంటే, సకల మానవాళి మనుగడకు సూర్యుడే జీవాధారం అని వేదం స్పష్టం చేస్తోంది.

నారాయణోపనిషత్తులో 'ఆదిత్యోవా ఏష ఏతన్మండలం తపతి తత్రతా ఋచ:...' అని ఉంటుంది. అంటే సూర్యుని ఆవరించి ఉండే తేజస్సు ఋగ్వేద స్వరూపం. ఆయన నుంచి లోకాలకు అందే వెలుగు సామవేదం. సాక్షాత్తు సూర్యభగవానుడే యజుర్వేద స్వరూపం అని అర్థం.

  'సూర్యస్యచక్షూ రజసైత్యావృతం తస్మినార్పిత భువనాని విశ్వా...' (ఋగ్వేదం, 1-164-14) సూర్యుని పైనే సమస్త ప్రాణికోటి ఆధారపడి ఉంది. సూర్యుడు పరమాత్మ స్వరూపుడు.

 శ్రౌత కర్మల్లో నిర్వహించే యజ్ఞయాగాది క్రతువుల్లో సూర్యునికే అగ్రస్థానం. చంద్రుని వెన్నెల కూడా సూర్యుని వెలుగు ద్వారా ఏర్పడిందే. ఓషధుల్లో ఉండే ఔషధ గుణం సూర్యుని వెలుగు ద్వారా ఏర్పడిందే. ఇంకా మరెన్నో సూర్యవైభవాలను ప్రకటించే విశేషాలను వేదాలు విస్తారంగా చెబుతున్నాయి.

-----------------------

శ్రీశైల ప్రభ పత్రికలో రాసిన వ్యాసం

-------------------------

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ :  90320 44115 / 8897 547 548


సూర్యుడికి ప్రీతిగా చెయ్యాల్సిన నోములు... రథసప్తమితో పాటు మరెన్నో సూర్యవ్రతాలు

 



సూర్యుడికి ప్రీతిగా చెయ్యాల్సిన నోములు... 

రథసప్తమితో పాటు మరెన్నో సూర్యవ్రతాలు


ఆరోగ్యసోపానాలు... ఆదిత్య వ్రతాలు 

               

నీ మండలం రుగ్వేదం. నీ దేహం యజుర్వేదం.నీ కిరణాలు సామవేదం అంటూ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడిని వేదస్వరూపుడిగా వర్ణిస్తుంది మంత్ర మహార్ణవం. 

                ప్రభాతంలో బ్రహ్మ స్వరూపానివి. నడిమింటి వేళ మహేశ్వర తత్త్వానివి. సంధ్యాసమయంలో విష్ణుమూర్తివి అంటూ ఆదినారాయణ స్వరూపుడైన ఆదిత్యుడిని త్రిమూర్తి స్వరూపుడిగా పురాణాలన్నీ వివరిస్తున్నాయి. 

                మొత్తంగా పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు... మొత్తం వాఙ్మయమంతా భాస్కరుడి ప్రస్తావన లేకుండా ముందుకుసాగదు. ఇది అక్షర సత్యం. కేవలం సాహిత్యమనే కాదు సమాజ జీవనం కూడా ఆదిత్యుడి అండ లేనిదే ముందుకు సాగదు. 

                ఎందుకంటే బాలభానుడు వస్తే గానీ లేత మొగ్గ విచ్చుకుని పువ్వుగా మారదు. గూళ్ళల నుంచి గువ్వపిల్లలు రెక్కలు విదిల్చి గాల్లోకి ఎగరవు. చీకటి బూచికి భయపడ్డ చిన్నారి అమ్మ ఒడి విడిచి ధైర్యంగా బయటకు రాడు. సమయం దాటిపోతోందంటూ పిల్లలూ, శ్రామికులూ, కర్షకులూ, ఉద్యోగులూ... ఒకరేమిటి... సమాజంలోని ప్రతి ఒక్కరూ సూర్యనారాయణుడి రాకతో చకచకగా తయారయిపోతుంటారు. 

                అలా అందరినీ అదిలించి కదిలించిన సూర్యుడు తీసుకువచ్చింది కేవలం వెలుతురిని మాత్రమే కాదు. అనంతమైన శక్తిని, ఉత్తేజాన్ని కూడా. ఆ కిరణాలు అమృతానికి ప్రతిరూపాలు. ప్రాణశక్తికి మరోరూపాలు. అందుకనే ప్రభాకరుడిని వేదాలు కొలిచాయి. ఉపనిషత్తులు ఉపాసించాయి. పురాణాలు ప్రస్తుతించాయి. ఆచార వ్యవహారాలు తమలో ఒకడిగా మార్చేసుకున్నాయి.

                 ఇంతగా సమాజ జీవనంతో ఒదిగిపోయిన సూర్యదేవుడిని ఆరాధిస్తూ చేసే వ్రతాలను పురాణాలు చెబుతున్నాయి. ఆయా వ్రతాల ఆరాధనలో ఆరోగ్య పరిరక్షణ బాహ్యంగా కనిపించినా మోక్షసాధన అంతర్లీనంగా సాగుతుంది. ఈ వ్రతాల్లో ముఖ్యమైన కొన్ని....

 శాకసప్తమీ వ్రతం 

కార్తిక శుద్ధ సప్తమి రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించి మాఘ శుక్ల సప్తమి వరకు కొనసాగించాలి. కార్తిక, మార్గశిర, పుష్య, మాఘ మాసాల్లో శుద్ధ షష్ఠిరోజున సంకల్పం చెప్పుకుని, ఒంటిపూట భోజనం చెయ్యాలి. సప్తమి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి, ఆదిత్యుడిని వివిధ రకాల ఉపచారాలతో పూజించాలి. శాక సహితంగా పాయసం నివేదన చేసి, ఆ పాయసాన్ని శాక సహితంగా ఏడుగురు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ తర్వాత పాయసాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. మర్నాడు అంటే అష్టమి రోజున పారాణ చెయ్యాలి. 

కార్తికమాసంలో పాయస ప్రాశనం, మార్గశిరంలో గోమయ ప్రాశనం, పుష్యమాసంలో గౌర - సర్షప - కల్కప్రాశనం, మాఘమాసంలో క్షీరప్రాశనం చెయ్యాలి. వ్రతం పూర్తయ్యే మాఘమాసంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టి, పండిత సత్కారం చెయ్యాలి. యథాశక్తిగా దానధర్మాలు చెయ్యాలి. ఈ నాలుగు నెలల కాలంలో ఏదో ఒక రోజున సూర్యునికి ప్రీతి కలిగించేలా నూతన వస్త్రాలు, రాగి పళ్ళెం, చెంబు, నీరు తాగే పాత్ర, నెయ్యితో నింపిన పాత్ర వీటిని దక్షిణతో సహా యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. ఈ వ్రతం ఆచరించినవారు సకల సంపదలు పొందుతారు. ధర్మార్థకామ సిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం, ఆయుష్షు కలిగి, సుఖజీవనం సాగిస్తారు. 

రథసప్తమీ వ్రతం 

రథసప్తమికే సూర్యజయంతి అనే పేరు కూడా ఉంది. సూర్యునికి సంబంధించి అనేక సప్తమీ వ్రతాలు ఉన్నాయి. కల్యాణ సప్తమి, మహాసప్తమి, కమల సప్తమి, రథాంక సప్తమి, జయా సప్తమి, మార్తాండ సప్తమి, అర్క సంపుట సప్తమి మొదలైనవి. వీటన్నిటిలో మాఘ శుద్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉంది.  ఈ రోజున చేసే స్నాన, ధ్యాన, నమస్కారాది క్రియలు శారీరక అనారోగ్యాలను దూరం చేయటంతో పాటు మానసిక ప్రవృత్తులను కూడా సక్రమమార్గంలోకి మళ్ళిస్తాయి. ఆనందం, ఆరోగ్యం, తేజస్సు, విజయం రథసప్తమీ ఫలితాలుగా భక్తులకు అందుతాయి.

          రథసప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రేగు కాయలను తల, భుజాలు తదితర ప్రదేశాల్లో  ఉంచుకుని, జననీత్వంహి లోకానం సప్తమీ సప్త సప్తికే | సప్తమ్యా హ్యదిత్ర దేవి నమస్తే సూర్యమాతృకే || అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేయాలి. దీంతో పాటు ఈ కింది శ్లోకాన్ని చదివి శాస్త్రవిధిగా స్నానం చెయ్యాలి.

 

యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు 

తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ

ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పున: 

ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే

 సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హర ||

ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నర:

కేశవాదిత్య మాలోక్య క్షణాన్నిష్కల్మషో భవేత్‌ ||

    ఈవిధిగా శాస్త్రప్రమాణాలను అనుసరించి స్నానం చేసిన తర్వాత, సూర్యునికి ఎదురుగా శుచిగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని, శుద్ధి చేసి, అక్కడ బియ్యపు పిండితో సూర్యయంత్రం నిర్మించాలి. ఆ యంత్రానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి, షోడశ ఉపచారాలతో అర్చించాలి.

    పసుపు కుంకుమలతో అలంకరించిన ముగ్గుల మీద గొబ్బి పిడకలను కుంపటిగా అమర్చి, దాని మీద పసుపుతో అలంకరించిన కొత్త గిన్నె పెట్టి, అందులో ఆవుపాలతో పొంగలి వండాలి. ఈ క్రమంలో పాలను మూడుసార్లు పొంగనివ్వాలి. పొంగలి వండిన తర్వాత, చీపుర పుల్లల సహాయంతో చిక్కుడు గింజలను రథాకారంలో గుచ్చి, తులసి కోట ముందు వేసిన ముగ్గుపై ఆ రథాన్ని ఉంచి, ఆ రథం మీదకు సూర్యదేవుని ఆవాహన చేసి, రథం ముందు పదిహేను చిక్కుడు ఆకులు పరచి, వాటిలో ఇంతకుముందు వండిన పొంగలి పెట్టి, వీటిలో ఐదు ఆకులు అగ్నిదేవునికి, ఐదు ఆకులు తులసీమాతకు, ఐదు ఆకులు సూర్యభగవానునికి నివేదన పెట్టాలి.

    సూర్యమంత్రాలతో ఆ పాయసంతోనే ఆగ్నిలో ఆహుతులు ఇవ్వాలి. ఈ రోజంతా అరుణ పారాయణ, అష్టాక్షరీ జపం, ధ్యానం, సూర్యస్తోత్ర పారాయణ చెయ్యాలి. అష్టమి రోజున తిరిగి పూజచేసి, సూర్యస్తోత్రాలు పారాయణ చెయ్యాలి. అనంతరం శక్తిలోపం లేకుండా బ్రాహ్మణులకు భోజనం పెట్టి, నూతన వస్త్రాలు, తాంబూలాదులతో సత్కరించాలి. ఈవిధంగా ఏడు సంవత్సరాలు విడువకుండా చెయ్యాలి. చివరి ఏడాది వెండితో సూర్యరథం చేయించి (ఒంటి చక్రం మాత్రమే ఉండాలి), అందులో సూర్యుని స్వర్ణ ప్రతిమ ఉంచి, శాస్త్రోక్తంగా పూజలు చేసి, యోగ్యుడైన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఇదే వ్రతోద్యాపన. ఈవిధంగా రథసప్తమీ వ్రతం చేసినట్లయితే సకల రోగాలు నివారణ అవుతాయి. దుష్కరమైన వ్యాధులు నశిస్తాయి. వైద్యశాస్త్రానికి అంతుబట్టని వ్యాధులు కూడా సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల నయమవుతాయి. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. వంశవృద్ధి కలుగుతుంది. అంతిమంగా సూర్యలోక నివాసయోగ్యత కలుగుతుంది.

    ఈ పూజల్లో అనేక ప్రాంత, ఆచార భేదాలు కనిపిస్తాయి. కొందరు ఏడు, తొమ్మిది ఆకుల్లో నివేదన పెడతారు. కొన్ని ప్రాంతాల్లో వేకువజామునే నిద్రలేచి, దగ్గరలో ఉన్న నది లేదా చెరువుకు వెళ్ళి, చెరకుగడతో అందులోని నీటిని కదిపి, ఆ తర్వాత శాస్త్రోక్తంగా స్నానం చేస్తారు. మరికొన్ని ఆచారాల్లో, ఇంటి వద్దనే స్నానం చేసి, దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని శక్తిని అనుసరించి వెండి, బంగారం లేదా రాగి పాత్రలో ఉంచి, ఆ పాత్రను శిరసున పెట్టుకుని నదికి వెళ్తారు. నదీమాతను ధ్యానించి, నమస్తే రుద్ర రూపాయ హరిదశ్వ నమోస్తుతే | ఆరుణార్క నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే || అనే శ్లోకం చదివి, దీపాన్ని నీటిలో వదులుతారు. 

                వ్రతరత్నాకరం, ధర్మసింధువు, నిర్ణయామృతం మొదలైన గ్రంథాల్లో రథసప్తమికి సంబంధించి అనేక అర్చనలు, వ్రత విధానాలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. 

                ధర్మసింధువు ప్రకారం రథసప్తమికి ముందు రోజు అంటే షష్ఠి రోజున ఉపవాసం ఉండి, మర్నాడు శాస్త్రోక్తరీతిలో స్నానం చేసి, సప్తమీ వ్రతం చేస్తే ఏడు జన్మల పాపం నశిస్తుంది. రథసప్తమీ వ్రతాన్ని చేయటం వల్ల శారీరక రోగాలతో పాటు, ప్రస్తుత జన్మలోను, గత జన్మల్లోను చేసిన పాపాలు నశిస్తాయని వ్రత చూడామణి చెబుతోంది. మనుస్మృతి ప్రకారం సూర్యారాధన వల్ల శారీరక రోగాలన్నీ నశించి, ఉత్తమమైన ఆరోగ్యం కలుగుతుంది.

           జాతకం  ప్రకారం సూర్యగ్రహదోషం ఉన్నవారు, ఉదర, నేత్ర, దంత, ఉష్ణ దోషాలు ఉన్నవారు కెంపు, మాణిక్యం వంటి ఎర్రని రత్నాలు, ఎర్రని పుష్పాలతో (కమలాలు) సూర్యదేవుని పూజించి, యథాశక్తిగా సూర్యదేవుని బంగారు / వెండి ప్రతిమను దానం చేయాలి. ఫలితంగా సకల దోష నివారణ జరుగుతుంది.

    రథసప్తమీ వ్రత ఫలితంగా శారీరక, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతుంది. శమ, దమాది సద్భావాలు పెంపొందుతాయి. మహాభారతంలో, భవిష్యోత్తర పురాణంలో రథసప్తమీ వ్రతాన్ని ఆచరించిన రాజుల కథలు ఉన్నాయి. రథసప్తమి, ఆదివారం కలసి వస్తే, అది మరింత విశేష ఫలితాలను కలిగిస్తుందని, ఆ రోజు చేసే అర్చన ఫలితంగా అపమృత్యు భయం తొలగుతుందని స్కాంద పురాణం చెబుతోంది. 

                జిల్లేడు ఆకులు, బదరీ ఫలాలు, గరికపోచలు, చందనంతో కలసిన అక్షతలు తీసుకుని, సమంత్రకంగా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలని, ఆ తర్వాత నువ్వులపిండితో చేసిన అప్పాలు నివేదన చేయాలని, అనంతరం శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలని  నిర్ణయసింధువు చెబుతోంది.

 సిద్ధార్థ సప్తమీ వ్రతం :

   సిద్ధార్థ అంటే తెల్ల ఆవగింజ అని అర్థం. తెల్ల ఆవగింజలతో చేసే వ్రతం కాబట్టి ఈ వ్రతానికి సిద్ధార్థ వ్రతం అనే పేరు వచ్చింది. ఏడు మాసాలు వరుసగా శుక్ల పక్ష సప్తమి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. సప్తమి రోజున నియమం ప్రకారం స్నాన, సంధ్యాదులు నిర్వహించుకుని, సూర్యారాధన చెయ్యాలి. ఆ తర్వాత సూర్యునికి ఎదురుగా పద్మాసనంలో స్థిరచిత్తంతో కూర్చుని, కుడి చేతి దోసిటితో నీరు తీసుకోవాలి. అందులో ఒక సిద్థార్థం (తెల్ల ఆవగింజ) తీసుకుని, మనసులో కోరిక తలచుకుని, సౌరమంత్రాన్ని ఉచ్చరిస్తూ, దంతాలకు తగలకుండా ఆ జలాన్ని తాగాలి. ఇది మొదటి సప్తమి రోజున చెయ్యాల్సిన విధి. ఇదేవిధానంలో రెండో సప్తమి రోజున రెండు సిద్ధార్థాలు, మూడో సప్తమి రోజున మూడు సిద్ధార్థాలు, ఇలా వరుసగా ఏడో సప్తమి రోజున ఏడు సిద్ధార్థాలు తీసుకోవాలి. మొదటి నెలలో నీరు, రెండో నెలలో నెయ్యి, మూడో నెలలో తేనె, నాలుగో నెలలో పెరుగు, ఐదో నెలలో పాయసాన్నం, ఆరో నెలలో గోమయం, ఏడో నెలలో పంచగవ్యాలతో పైన చెప్పిన విధంగా సిద్ధార్థాలు తీసుకోవాలి.

 సిద్ధార్థక స్తంహి లోకే సర్వత్ర శ్రూయతే యథా |

 తథా మామపి సిద్ధార్థం అర్థత: కురుతాం రవి: ||

ఈ మంత్రాన్ని చెబుతూ సిద్ధార్థాలు తీసుకోవాలి. ప్రతి మాసంలోను పైన చెప్పిన విధంగా జలాన్ని తీసుకున్న తర్వాత హవిస్సుతో మహాసౌరమంత్రాల ¬మం చెయ్యాలి. వ్రతం పూర్తయ్యాక బ్రాహ్మణ సంతర్పణ చెయ్యాలి. కోరిక కోర్కెలు ఈ వ్రతం వల్ల సిద్ధిస్తాయి.

 ఈ వ్రతాలతో పాటు సూర్యభగవానుడి అనుగ్రహం కోసం మరెన్నో వ్రతాలు మన పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి భవిష్యపురాణ అంతర్గతమైన బ్రహ్మపర్వంలో ఈ వ్రతాల వివరాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి - త్రివర్గ సప్తమీ వ్రతం, ఉభయ సప్తమీ వ్రతం, అరుణ శాంతి వ్రతం, పక్ష సప్తమీ వ్రతం, రథ చాలన వ్రతం, అర్క సంపుటికా వ్రతం, ఇక్షుభా వ్రతం, ఇక్షుభార్క వ్రతం, సూర్య షష్ఠీ వ్రతం, పాప నాశినీ వ్రతం, కామదా సప్తమీ వ్రతం, సూర్యవ్రతం మొ||నవి.

 ఈవ్రతాలన్నీ వేటికవే పేర్లలో భిన్నంగా కనిపించినా అన్నీ ఆదిత్యుడి అనుగ్రహం కోరుతూ చేసేవే. జగమంతా నిండిన ఆదిత్యుడిని మనసంతా నింపుకుని మనమూ ఈ వ్రతాలను ఆచరించి కర్మసాక్షి అనుగ్రహ అశీస్సులు అందుకుందాం.
--------------------------
శ్రీశైలప్రభ పత్రికలో రాసిన వ్యాసం
----------------------------

 

 

 రచన 

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణఆంధ్రోపన్యాసకులు,  ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌,

గాంధీనగర్‌, విజయవాడ-3. సెల్‌ : 9032044115 / 8897 547 548








 

 

 

               

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...