Monday, February 7, 2022

రథపస్తమితో పాటు మరెన్నో సూర్యవ్రతాలు



ఆరోగ్యసోపానాలు... ఆదిత్య వ్రతాలు

                      నీ మండలం రుగ్వేదం. నీ దేహం యజుర్వేదం.నీ కిరణాలు సామవేదం అంటూ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడిని వేదస్వరూపుడిగా వర్ణిస్తుంది మంత్ర మహార్ణవం.

            ప్రభాతంలో బ్రహ్మ స్వరూపానివి. నడిమింటి వేళ మహేశ్వర తత్త్వానివి. సంధ్యాసమయంలో విష్ణుమూర్తివి అంటూ ఆదినారాయణ స్వరూపుడైన ఆదిత్యుడిని త్రిమూర్తి స్వరూపుడిగా పురాణాలన్నీ   వివరిస్తున్నాయి.

            మొత్తంగా పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు... మొత్తం వాఙ్మయమంతా భాస్కరుడి ప్రస్తావన లేకుండా ముందుకుసాగదు. ఇది అక్షర సత్యం. కేవలం సాహిత్యమనే కాదు సమాజ జీవనం కూడా ఆదిత్యుడి అండ లేనిదే ముందుకు సాగదు.

            ఎందుకంటే బాలభానుడు వస్తే గానీ లేత మొగ్గ విచ్చుకుని పువ్వుగా మారదు. గూళ్ళల నుంచి గువ్వపిల్లలు రెక్కలు విదిల్చి గాల్లోకి ఎగరవు. చీకటి బూచికి భయపడ్డ చిన్నారి అమ్మ ఒడి విడిచి ధైర్యంగా బయటకు రాడు. సమయం దాటిపోతోందంటూ పిల్లలూ, శ్రామికులూ, కర్షకులూ, ఉద్యోగులూ... ఒకరేమిటి... సమాజంలోని ప్రతి ఒక్కరూ సూర్యనారాయణుడి రాకతో చకచకగా తయారయిపోతుంటారు.

            అలా అందరినీ అదిలించి కదిలించిన సూర్యుడు తీసుకువచ్చింది కేవలం వెలుతురిని మాత్రమే కాదు. అనంతమైన శక్తిని, ఉత్తేజాన్ని కూడా. ఆ కిరణాలు అమృతానికి ప్రతిరూపాలు. ప్రాణశక్తికి మరోరూపాలు. అందుకనే ప్రభాకరుడిని వేదాలు కొలిచాయి. ఉపనిషత్తులు ఉపాసించాయి. పురాణాలు ప్రస్తుతించాయి. ఆచార వ్యవహారాలు తమలో ఒకడిగా మార్చేసుకున్నాయి.

            ఇంతగా సమాజ జీవనంతో ఒదిగిపోయిన సూర్యదేవుడిని ఆరాధిస్తూ చేసే వ్రతాలను పురాణాలు చెబుతున్నాయి. ఆయా వ్రతాల ఆరాధనలో ఆరోగ్య పరిరక్షణ బాహ్యంగా కనిపించినా మోక్షసాధన అంతర్లీనంగా సాగుతుంది. ఈ వ్రతాల్లో ముఖ్యమైన కొన్ని....

శాకసప్తమీ వ్రతం

            కార్తిక శుద్ధ సప్తమి రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించి మాఘ శుక్ల సప్తమి వరకు కొనసాగించాలి. కార్తిక, మార్గశిర, పుష్య, మాఘ మాసాల్లో శుద్ధ షష్ఠిరోజున సంకల్పం చెప్పుకుని, ఒంటిపూట భోజనం చెయ్యాలి. సప్తమి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి, ఆదిత్యుడిని వివిధ రకాల ఉపచారాలతో పూజించాలి. శాక సహితంగా పాయసం నివేదన చేసి, ఆ పాయసాన్ని శాక సహితంగా ఏడుగురు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ తర్వాత పాయసాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. మర్నాడు అంటే అష్టమి రోజున పారాణ చెయ్యాలి.

                        కార్తికమాసంలో పాయస ప్రాశనం, మార్గశిరంలో గోమయ ప్రాశనం, పుష్యమాసంలో గౌర ` సర్షప ` కల్కప్రాశనం, మాఘమాసంలో క్షీరప్రాశనం చెయ్యాలి. వ్రతం పూర్తయ్యే మాఘమాసంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టి, పండిత సత్కారం చెయ్యాలి. యథాశక్తిగా దానధర్మాలు చెయ్యాలి. ఈ నాలుగు నెలల కాలంలో ఏదో ఒక రోజున సూర్యునికి ప్రీతి కలిగించేలా నూతన వస్త్రాలు, రాగి పళ్ళెం, చెంబు, నీరు తాగే పాత్ర, నెయ్యితో నింపిన పాత్ర వీటిని దక్షిణతో సహా యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. ఈ వ్రతం ఆచరించినవారు సకల సంపదలు పొందుతారు. ధర్మార్థకామ సిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం, ఆయుష్షు కలిగి, సుఖజీవనం సాగిస్తారు.

రథసప్తమీ వ్రతం

            రథసప్తమికే సూర్యజయంతి అనే పేరు కూడా ఉంది. సూర్యునికి సంబంధించి అనేక సప్తమీ వ్రతాలు ఉన్నాయి. కల్యాణ సప్తమి, మహాసప్తమి, కమల సప్తమి, రథాంక సప్తమి, జయా సప్తమి, మార్తాండ సప్తమి, అర్క సంపుట సప్తమి మొదలైనవి. వీటన్నిటిలో మాఘ శుద్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చేసే స్నాన, ధ్యాన, నమస్కారాది క్రియలు శారీరక అనారోగ్యాలను దూరం చేయటంతో పాటు మానసిక ప్రవృత్తులను కూడా సక్రమమార్గంలోకి మళ్ళిస్తాయి. ఆనందం, ఆరోగ్యం, తేజస్సు, విజయం రథసప్తమీ ఫలితాలుగా భక్తులకు అందుతాయి.

            రథసప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రేగు కాయలను తల, భుజాలు తదితర ప్రదేశాల్లో ఉంచుకుని, జననీత్వంహి లోకానం సప్తమీ సప్త సప్తికే । సప్తమ్యా హ్యదిత్ర దేవి నమస్తే సూర్యమాతృకే ॥ అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేయాలి. దీంతో పాటు ఈ కింది శ్లోకాన్ని చదివి శాస్త్రవిధిగా స్నానం చెయ్యాలి.

యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు

తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ

            ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః

ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే

            సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హర ॥

ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నరః

            కేశవాదిత్య మాలోక్య క్షణాన్నిష్కల్మషో భవేత్‌ ॥

            ఈవిధిగా శాస్త్రప్రమాణాలను అనుసరించి స్నానం చేసిన తర్వాత, సూర్యునికి ఎదురుగా శుచిగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని, శుద్ధి చేసి, అక్కడ బియ్యపు పిండితో సూర్యయంత్రం నిర్మించాలి. ఆ యంత్రానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి, షోడశ ఉపచారాలతో అర్చించాలి.

             పసుపు కుంకుమలతో అలంకరించిన ముగ్గుల మీద గొబ్బి పిడకలను కుంపటిగా అమర్చి, దాని మీద పసుపుతో అలంకరించిన కొత్త గిన్నె పెట్టి, అందులో ఆవుపాలతో పొంగలి వండాలి. ఈ క్రమంలో పాలను మూడుసార్లు పొంగనివ్వాలి. పొంగలి వండిన తర్వాత, చీపుర పుల్లల సహాయంతో చిక్కుడు గింజలను రథాకారంలో గుచ్చి, తులసి కోట ముందు వేసిన ముగ్గుపై ఆ రథాన్ని ఉంచి, ఆ రథం మీదకు సూర్యదేవుని ఆవాహన చేసి, రథం ముందు పదిహేను చిక్కుడు ఆకులు పరచి, వాటిలో ఇంతకుముందు వండిన పొంగలి పెట్టి, వీటిలో ఐదు ఆకులు అగ్నిదేవునికి, ఐదు ఆకులు తులసీమాతకు, ఐదు ఆకులు సూర్యభగవానునికి నివేదన పెట్టాలి.

            సూర్యమంత్రాలతో ఆ పాయసంతోనే ఆగ్నిలో ఆహుతులు ఇవ్వాలి. ఈ రోజంతా అరుణ పారాయణ, అష్టాక్షరీ జపం, ధ్యానం, సూర్యస్తోత్ర పారాయణ చెయ్యాలి. అష్టమి రోజున తిరిగి పూజచేసి, సూర్యస్తోత్రాలు పారాయణ చెయ్యాలి. అనంతరం శక్తిలోపం లేకుండా బ్రాహ్మణులకు భోజనం పెట్టి, నూతన వస్త్రాలు, తాంబూలాదులతో సత్కరించాలి. ఈవిధంగా ఏడు సంవత్సరాలు విడువకుండా చెయ్యాలి. చివరి ఏడాది వెండితో సూర్యరథం చేయించి (ఒంటి చక్రం మాత్రమే ఉండాలి), అందులో సూర్యుని స్వర్ణ ప్రతిమ ఉంచి, శాస్త్రోక్తంగా పూజలు చేసి, యోగ్యుడైన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఇదే వ్రతోద్యాపన. ఈవిధంగా రథసప్తమీ వ్రతం చేసినట్లయితే సకల రోగాలు నివారణ అవుతాయి. దుష్కరమైన వ్యాధులు నశిస్తాయి. వైద్యశాస్త్రానికి అంతుబట్టని వ్యాధులు కూడా సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల నయమవుతాయి. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. వంశవృద్ధి కలుగుతుంది. అంతిమంగా సూర్యలోక నివాసయోగ్యత కలుగుతుంది.

            ఈ పూజల్లో అనేక ప్రాంత, ఆచార భేదాలు కనిపిస్తాయి. కొందరు ఏడు, తొమ్మిది ఆకుల్లో నివేదన పెడతారు. కొన్ని ప్రాంతాల్లో వేకువజామునే నిద్రలేచి, దగ్గరలో ఉన్న నది లేదా చెరువుకు వెళ్ళి, చెరకుగడతో అందులోని నీటిని కదిపి, ఆ తర్వాత శాస్త్రోక్తంగా స్నానం చేస్తారు. మరికొన్ని ఆచారాల్లో, ఇంటి వద్దనే స్నానం చేసి, దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని శక్తిని అనుసరించి వెండి, బంగారం లేదా రాగి పాత్రలో ఉంచి, ఆ పాత్రను శిరసున పెట్టుకుని నదికి వెళ్తారు. నదీమాతను ధ్యానించి, నమస్తే రుద్ర రూపాయ హరిదశ్వ నమోస్తుతే । ఆరుణార్క నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే ॥ అనే శ్లోకం చదివి, దీపాన్ని నీటిలో వదులుతారు.

            వ్రతరత్నాకరం, ధర్మసింధువు, నిర్ణయామృతం మొదలైన గ్రంథాల్లో రథసప్తమికి సంబంధించి అనేక అర్చనలు, వ్రత విధానాలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి.

            ధర్మసింధువు ప్రకారం రథసప్తమికి ముందు రోజు అంటే షష్ఠి రోజున ఉపవాసం ఉండి, మర్నాడు శాస్త్రోక్తరీతిలో స్నానం చేసి, సప్తమీ వ్రతం చేస్తే ఏడు జన్మల పాపం నశిస్తుంది. రథసప్తమీ వ్రతాన్ని చేయటం వల్ల శారీరక రోగాలతో పాటు, ప్రస్తుత జన్మలోను, గత జన్మల్లోను చేసిన పాపాలు నశిస్తాయని వ్రత చూడామణి చెబుతోంది. మనుస్మృతి ప్రకారం సూర్యారాధన వల్ల శారీరక రోగాలన్నీ నశించి, ఉత్తమమైన ఆరోగ్యం కలుగుతుంది.

            జాతకం  ప్రకారం సూర్యగ్రహదోషం ఉన్నవారు, ఉదర, నేత్ర, దంత, ఉష్ణ దోషాలు ఉన్నవారు కెంపు, మాణిక్యం వంటి ఎర్రని రత్నాలు, ఎర్రని పుష్పాలతో (కమలాలు) సూర్యదేవుని పూజించి, యథాశక్తిగా సూర్యదేవుని బంగారు / వెండి ప్రతిమను దానం చేయాలి. ఫలితంగా సకల దోష నివారణ జరుగుతుంది.

            రథసప్తమీ వ్రత ఫలితంగా శారీరక, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతుంది. శమ, దమాది సద్భావాలు పెంపొందుతాయి. మహాభారతంలో, భవిష్యోత్తర పురాణంలో రథసప్తమీ వ్రతాన్ని ఆచరించిన రాజుల కథలు ఉన్నాయి. రథసప్తమి, ఆదివారం కలసి వస్తే, అది మరింత విశేష ఫలితాలను కలిగిస్తుందని, ఆ రోజు చేసే అర్చన ఫలితంగా అపమృత్యు భయం తొలగుతుందని స్కాంద పురాణం చెబుతోంది.

            జిల్లేడు ఆకులు, బదరీ ఫలాలు, గరికపోచలు, చందనంతో కలసిన అక్షతలు తీసుకుని, సమంత్రకంగా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలని, ఆ తర్వాత నువ్వులపిండితో చేసిన అప్పాలు నివేదన చేయాలని, అనంతరం శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలని  నిర్ణయసింధువు చెబుతోంది.

సిద్ధార్థ సప్తమీ వ్రతం :

                        సిద్ధార్థ అంటే తెల్ల ఆవగింజ అని అర్థం. తెల్ల ఆవగింజలతో చేసే వ్రతం కాబట్టి ఈ వ్రతానికి సిద్ధార్థ వ్రతం అనే పేరు వచ్చింది. ఏడు మాసాలు వరుసగా శుక్ల పక్ష సప్తమి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. సప్తమి రోజున నియమం ప్రకారం స్నాన, సంధ్యాదులు నిర్వహించుకుని, సూర్యారాధన చెయ్యాలి. ఆ తర్వాత సూర్యునికి ఎదురుగా పద్మాసనంలో స్థిరచిత్తంతో కూర్చుని, కుడి చేతి దోసిటితో నీరు తీసుకోవాలి. అందులో ఒక సిద్థార్థం (తెల్ల ఆవగింజ) తీసుకుని, మనసులో కోరిక తలచుకుని, సౌరమంత్రాన్ని ఉచ్చరిస్తూ, దంతాలకు తగలకుండా ఆ జలాన్ని తాగాలి. ఇది మొదటి సప్తమి రోజున చెయ్యాల్సిన విధి. ఇదేవిధానంలో రెండో సప్తమి రోజున రెండు సిద్ధార్థాలు, మూడో సప్తమి రోజున మూడు సిద్ధార్థాలు, ఇలా వరుసగా ఏడో సప్తమి రోజున ఏడు సిద్ధార్థాలు తీసుకోవాలి. మొదటి నెలలో నీరు, రెండో నెలలో నెయ్యి, మూడో నెలలో తేనె, నాలుగో నెలలో పెరుగు, ఐదో నెలలో పాయసాన్నం, ఆరో నెలలో గోమయం, ఏడో నెలలో పంచగవ్యాలతో పైన చెప్పిన విధంగా సిద్ధార్థాలు తీసుకోవాలి.

సిద్ధార్థక స్తంహి లోకే సర్వత్ర శ్రూయతే యథా ।

తథా మామపి సిద్ధార్థం అర్థత: కురుతాం రవి: ॥

                        ఈ మంత్రాన్ని చెబుతూ సిద్ధార్థాలు తీసుకోవాలి. ప్రతి మాసంలోను పైన చెప్పిన విధంగా జలాన్ని తీసుకున్న తర్వాత హవిస్సుతో మహాసౌరమంత్రాల హోమం చెయ్యాలి. వ్రతం పూర్తయ్యాక బ్రాహ్మణ సంతర్పణ చెయ్యాలి. కోరిక కోర్కెలు ఈ వ్రతం వల్ల సిద్ధిస్తాయి.

                        ఈ వ్రతాలతో పాటు సూర్యభగవానుడి అనుగ్రహం కోసం మరెన్నో వ్రతాలు మన పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి భవిష్యపురాణ అంతర్గతమైన బ్రహ్మపర్వంలో ఈ వ్రతాల వివరాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ` త్రివర్గ సప్తమీ వ్రతం, ఉభయ సప్తమీ వ్రతం, అరుణ శాంతి వ్రతం, పక్ష సప్తమీ వ్రతం, రథ చాలన వ్రతం, అర్క సంపుటికా వ్రతం, ఇక్షుభా వ్రతం, ఇక్షుభార్క వ్రతం, సూర్య షష్ఠీ వ్రతం, పాప నాశినీ వ్రతం, కామదా సప్తమీ వ్రతం, సూర్యవ్రతం మొ॥నవి.

                        ఈవ్రతాలన్నీ వేటికవే పేర్లలో భిన్నంగా కనిపించినా అన్నీ ఆదిత్యుడి అనుగ్రహం కోరుతూ చేసేవే. జగమంతా నిండిన ఆదిత్యుడిని మనసంతా నింపుకుని మనమూ ఈ వ్రతాలను ఆచరించి కర్మసాక్షి అనుగ్రహ అశీస్సులు అందుకుందాం.

 

రచనడాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, సెల్‌ : 9032044115 / 8897 547 548

 

           


Thursday, February 3, 2022

భీష్మసందేశం (భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్తగిరి పత్రిక, ఫిబ్రవరి 2022 సంచికలో రాసిన వ్యాసం)

 

భీష్మసందేశం
(భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్తగిరి పత్రిక, ఫిబ్రవరి 2022 సంచికలో రాసిన వ్యాసం)





          భీష్ముడు - ఈ మాట వినగానే మహత్తరమైన ఆవేశం మనల్ని అవహిస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నరాలు బిగుసుకుంటాయి. శరీరం చైతన్యవంతమవుతుంది. అనంతమైన ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. భీషణమైన ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రతిజ్ఞ కోసం జీవిత సర్వస్వాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి ఆదర్శ జీవితం మనోఫలకంపై కదలాడుతుంది. ఒక్క మాటకే... అదీ ఒక్క పేరుకే ఇంతటి ఘనత ఉందా? అంటే ఉందని రొమ్మువిరుచుకుని సగర్వంగా చెప్పవచ్చు. శీలం, నీతి, నిష్ఠ, ధర్మం, ఆచారం... ఒకటేమిటి అనంతమైన సగుణ సంపదలో భీష్ముడికి సాటి భీష్ముడే. తర్రడి కోసం రాజ్యాన్ని, రాజ్యసుఖాన్ని మాత్రమే కాదు... చివరకు తనకంటూ సొంత జీవితాన్ని కూడా లేకుండా త్యాగం చేసిన త్యాగమూర్తి ఆయన. ఇరవైఒక్క సార్లు యావద్భూమండలం పర్యటించి క్షత్రియుడనే పేరు వినపడకుండా రాజలోకాన్ని జయించిన పరశురాముడిని నిలువరించిన ఘనత కూడా భీష్ముడికి మాత్రమే దక్కింది. ఇటువంటి పాత్ర మరొకటి భారతంలో కనిపించదు. కనీసం ఆ ఛాయల్లోకి కూడా మరొకరు రారు.

            తిక్కన సోమయాజి కూడా మహోగ్రశిఖర ఘన తాళ తరువగు సిడము వాడు’ ` అంటూ బృహన్నల (శాపం అనుభవిస్తున్న అర్జునుడిచేత ఉత్తర గోగ్రహణ సందర్భంలో) చేత భీష్ముని ఔన్యత్యాన్ని ప్రశంసింపజేస్తాడు. భీష్ముని రథ పతాకం మీద తాళ (తాటి) వృక్షం చిత్రించబడి ఉంటుంది. రథపతాకం రథి హృదయానికి ప్రతీక. నిటారుగా నిలబడి సర్వోన్నతంగా కనిపించే తాళవృక్షంలా వందలాది పాత్రలున్న మహాభారతంలో ఎవరికీ అందనంత సమున్నత గుణశ్రేణితో అందరిచేతా తాతా! అంటూ గౌరవాన్ని అందుకున్న ఒకే ఒక వ్యక్తి భీష్ముడు.

భీష్ముడు కాదు... భీష్మాచార్యుడు

            మహాభారతంలోనే యయాతి ఉపాఖ్యానంలో భీష్ముని మాదిరిగా తండ్రి కోసం వృద్ధాప్యాన్ని అనుభవించిన పూరుని ప్రస్తావన ఉంది. అయితే పూరుడు తండ్రి అడిగాడు కాబట్టే.... అదికూడా కొంతకాలమే వృద్ధాప్యాన్ని అనుభవించాడు. కానీ, భీష్ముడు అలాకాదు. తండ్రి అయిన శంతనమహారాజు అతడిని మాట మాత్రం కూడా అడగలేదు. కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అలాగని, భీష్ముడు వదిలిపెట్టలేదు. తండ్రి చింతకు కారణం ఏమిటో కనుక్కున్నాడు. దాసరాజు దగ్గరకు వెళ్ళాడు. అతడి సందేహాలన్నీ తీర్చాడు. తండ్రి కోసం రాజ్యాన్నే కాదు.. చివరకు తన సంసార సుఖాన్ని కూడా త్యాగం చేశాడు. తనకు వారసులు లేకుండా చేసుకున్నాడు. యావత్ప్రపంచంలో ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి, చేసిన ప్రతిజ్ఞను చివరి ఊపిరి వదిలే వరకు ఆచరించిన వ్యక్తి మరొకరు లేరు. తన తమ్ములు చనిపోయిన తర్వాత, తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయటానికి కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించినా ప్రతిజ్ఞాభంగం చెయ్యటానికి ఏమాత్రం అంగీకరించలేదు. అందుకనే దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. కాదు...కాదు... భీష్మాచార్యుడు (ఆచరించి చూపించే వారిని ఆచార్యులు అంటారు) అయ్యాడు.

            ఆచార సంప్రదాయాలు పాటించటంలో, ధర్మాచరణలో భీష్మునికి సాటి రాగల పాత్ర కూడా మరొకటి కనిపించదు. భీష్ముడు ధర్మాన్ని ఎంతటి కఠినమైన పరిస్థితుల్లో ఆచరించేవాడనటానికి ఉదాహరణ భారతయుద్ధ సందర్భంలో కనిపిస్తుంది. శాస్త్రవిహితమైన సంధ్యావందనం, సూర్యునికి అర్ఘ్యప్రదానం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేవాడు కాదు భీష్ముడు. యుద్ధం చేస్తున్నా కూడా సంధ్యాసమయంలో ఆగి, సూర్యోపాసన చేసి, నీరు దొరకకపోతే యుద్ధభూమిలోని ఇసుకతోనే అర్ఘ్యప్రదానం (ఇదేవిధంగా కృష్ణుడు కూడా యుద్ధరంగంలో ఇసుకతోనే అర్ఘ్యప్రదానం చేశాడు. కానీ, ఆయన పరమాత్మ. జీవాత్మలను ఉద్ధరించటానికే తప్ప ఆయనకు కర్మాచరణ చెయ్యాల్సిన అవసరం లేదు) చేసిన ఒకే ఒక వ్యక్తి భీష్ముడు. అదీ ధర్మం పట్ల, ధర్మాచరణ పట్ల  ఆయన ఆచరించిన చూపించిన అంకితభావం. అందుకే కేవలం భీష్ముడిగా మిగిలిపోలేదు. భీష్మాచార్యుడయ్యాడు.

అఖండమైన కృష్ణభక్తి

            భీష్ముడు అనగానే ఇతరులకు ఊహించటానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి, చాకచక్యం, ధర్మనిష్ఠ, రాజభక్తి గుర్తుకువస్తాయి. వీటన్నిటితో పాటు మరొక కోణం కూడా భీష్మునిలో ఉంది. అదే... అచంచలమైన కృష్ణభక్తి. కేవలం కారణమాత్రంగానే పరమాత్మ భౌతికరూపంలో కృష్ణుడుగా అవతరించాడని ఎరిగిన అతి కొద్దిమంది భక్తాగ్రేసరుల్లో భీష్ముడు ఒకడు. అయితే, ఇతరుల మాదిరిగా భీష్ముడు ఎక్కడా బాహాటంగా తన కృష్ణభక్తిని ప్రకటించలేదు. కేవలం ఒకే ఒక సందర్బంలో... అదీ యుద్ధభూమిలో ఉండగా, తాను నమ్మినదైవమైన పరమాత్మే స్వయంగా తనను చంపుతానని చక్రం చేపట్టినప్పుడు అంతకంటే తనకు కావలసింది ఏమున్నదంటూ పరమాత్మకు సాగిలపడతాడు.

సీ॥               కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి

                                                గగన భాగంబెల్ల గప్పికొనగ

                        నుఱికిన నోర్వక యుదరంబులోనున్న

                                                జగముల ప్రేగున జగతి కదల

                        జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున

                                                బైనున్న పచ్చని పటము జాఱ

                        నమ్మితి నాలావు నగుబాటు సేయక

                                                మన్నింపుమని క్రీడి మఱల దిగువ

తే॥                         గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి

                                    నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు

                                    విడుమర్జున యనుచు మద్విశిఖ వృష్టి

                                    దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు

            శ్రీకృష్ణుని విశ్వవ్యాపకునిగా, అణువణువులో నిండిన పరమాత్మగా దర్శించాడు భీష్ముడు. నన్ను చంపుతానని స్వయంగా చక్రం చేపట్టిన పరమాత్మే నాకు దిక్కు అంటూ మొక్కుతాడు. అదీ భీష్ముని కృష్ణభక్తి. భీష్ముని పాత్ర ద్వారా లోకానికి అందిన నీతి.

అంపశయ్యపై ధర్మబోధ

            భారతయుద్ధంలో మొదటి అంకం పూర్తయింది. భీష్ముడు అంపశయ్యపైకి చేరాడు. ఎంతటి ప్రజ్ఞ, ధర్మచింతన కలిగిన వాడైనా కొన్ని సందర్భాల్లో నోరు మెదపకుండా, ధర్మానికి గ్లాని జరుగుతున్నా చూసి ఊరుకున్న కారణంగా వచ్చిన దోషాన్ని పోగొట్టుకోవటానికే అంపశయ్యపై పడుకున్నాడు. నిజానికి స్వచ్ఛంద మరణశక్తి ఉన్నా పునరావృత్తి రహితమైన మోక్షాన్ని అందుకోవాలంటే చేసుకున్న పాపం పూర్తిగా నశించాలి. అందుకే అంపశయ్యపైకి చేరాడు. తన బాణాల ధాటికి కృష్ణుడు కూడా తట్టుకోలేకపోయాడని యుద్ధభూమిలోనే అన్న అహంకారం భీష్మునిలో ఉంది. అంపశయ్యపైకి చేరటం ద్వారా ఆ అహంకారం నశించింది. దైవబలం ముందు భుజబలం అణిగి ఉండాలని అర్థమైంది.

            ఇప్పుడతడు పూర్తిగా దైవచింతనలో, అహంకార మమకారాలకు, అరిషడ్వార్గాలకు, లౌకికబంధాలకు అతీతుడయ్యాడు. అందుకే కృష్ణపరమాత్మ నీ బిడ్డలకు ధర్మబోధ చెయ్యవయ్యా అని అంపశయ్య మీద ఉన్న భీష్మునికి చెప్పాడు. స్వామీ! నువ్వే చెప్పవచ్చు కదా! అంటాడు భీష్ముడు. ఆచరించిన అనుభవజ్ఞుడు చెబితేనే ధర్మానికి విలువ. అందుకే నీ చేత చెప్పిస్తున్నాను అన్నాడు పరమాత్మ. సరే!నన్నాడు భీష్ముడు.

            అదొక దివ్యముహూర్తం. తరతరాల పాపాలను క్షయం చేసే విష్ణుసహస్రనామ స్తోత్రం లోకానికి అందింది. వెయ్యి నామాల్లో అనంతుని అనంతశక్తిని వివరించాడు భీష్ముడు. ఎన్ని యుగాల నాటి మాట ఇది. కాలప్రమాణాలకు అందని చిరపురాతనమైనా అధునాతన ప్రపంచంలోనూ భీష్మకృతమైన విష్ణుసహస్ర నామ స్తోత్రానికి వెలుగు తగ్గలేదు. సకల పాపహారిణిగా ఇప్పటికీ మానవుల్ని తరింపజేస్తోంది. ఈవిధంగా విష్ణు సహస్రనామాలను అందించి, తాను తరించటం మాత్రమే కాదు... తనతోటి వారిని, తన సమాజాన్ని ... చివరకు తన లోకాన్నే పావనం చేయించిన అగణిత పుణ్యశీలి భీష్మపితామహుడు.

            కేవలం విష్ణు సహస్రనామ స్తోత్రం మాత్రమే కాదు... మహాభారతంలోని శాంతి, అనుశాసనిక పర్వాలు పూర్తిగా భీష్ముడు చేసిన బోధలతో నిండిఉంటాయి. జీవితపు చివరిక్షణంలో సమాజ ఉద్ధరణ గురించి ఆలోచించిన దార్శనికుడు భీష్మాచార్యుడు.

భీష్మాష్టమి

            మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకాలుగా ప్రసిద్ధిపొందాయి. భారతయుద్ధం సమయంలో క్షతగాత్రుడైన భీష్ముడు దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టపడడు. ఆయనకు స్వచ్ఛందమరణం పొందే వరం ఉంది. కాబట్టి ఉత్తరాయణం వచ్చే వరకూ అంపశయ్యపై పరుండి ఉండి మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజుల్లో రోజుకొక ప్రాణాన్ని విడిచిపెట్టాడు. కాలనిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, కాలమాధవీయం తదితర గ్రంథాలు కూడా మాఘ శుద్ధ అష్టమిని భీష్మ నిర్యాణదినంగా చెబుతున్నాయి.

            పద్మపురాణం హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడిరది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభం తెలుపుతున్నది. కృత్యసార సముచ్చయాధారంగా భీష్మాష్టమి శ్రాద్ధదినం. భీష్మ ద్వాదశి వ్రతం ప్రారంభించేది కూడా ఈ రోజే అని నిర్ణయ సింధువు స్పష్టపరుస్తున్నది. భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది. ‘’వైయాఘ్య్రసద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయవర్మణే వసూ రామావతారాయ శంతనోరాత్మజాయచ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రాహ్మచారిణే’’. అంటూ ఈ రోజున భీష్ములకు తర్పణం విడవాలని చెబుతారు. ఈ తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుంది.

జీవన సందేశం

            ఎప్పుడూ మారిపోతూ ఉండే మన ఆలోచనలు, ఇంద్రియాల అనుభవాలు అనే వాటి వెనుక మారకుండా ఉండే చైతన్యం తాలూకూ ఏకత్వమే అహంకారం. నేను ఆలోచిస్తున్నాను’, ‘నేను రాస్తున్నాను’, ‘నేను చూస్తున్నాను’, ‘నేను వింటున్నాను’, ‘నేను బాధపడుతున్నాను’, ‘నేను సుఖిస్తున్నానుఅనే రకరకాల మార్పుల వెనుక వాటన్నిటికి కర్తగా అహంకారం ఉంటుంది.

            ఈ ఆలోచనలన్నిటికీ యజమాని నేనుఅనే భావన. నేనువేరు, ఆలోచనలు వేరు. కళ్ళు చూడలేనప్పుడు కళ్ళను మాత్రమే గుడ్డి అనకుండా నేను గుడ్డివాడినిఅని గుడ్డి తనాన్ని తనకు ఆపాదించుకోవటం తప్పే కదా? కళ్ళు నాశనమైపోయినంత మాత్రాన మనం నాశనం కావాల్సిన అవసరం లేదు. కానీ, లౌకిక మాయ కారణంగా ప్రతి వ్యక్తీ అనుభవాన్ని, అనుభవించేవాడిని కలిపి ఒకటే భావనలో చూస్తుంటాడు. ఇదంతా అహంకారం వల్ల పుడుతుంది. ఈ అహంకారం నాశనమైపోవాలంటే కళ్ళు మూసుకుని, చూపుని లోపలికి తిప్పి, అక్కడ ఉన్న మహాచైతన్యాన్యం మీదే దృష్టి నిల్పి, తదేకంగా ధ్యానం చెయ్యాలి. అలా ధ్యానం చేస్తూ చేస్తూ చివరకు ఆ చైతన్యంలోనే లీనమవ్వాలి. భీష్ముడు చేసింది అదే. శ్రీకృష్ణపరమాత్మని ఎదురుగా చూస్తూ, ఆ మూర్తిని ధ్యానపథంలో ఉంచుకునే ప్రాణాలు వదిలిపెట్టాడు. అంటే ఆంతరిక చైతన్యంలో జీవచైతన్యాన్ని లయం చేశాడు. ఇలా జరగాలంటే అహంకారం నశించాలి. ఇందుకు ధ్యానం ఒక్కటే మార్గం. అంపశయ్యపై ఉండి కూడా నిరంతర ధ్యానంతో పరమాత్మలో లీనమైన భీష్మ నిర్యాణ ఘట్టం మానవాళికి అందించే సందేశం ఇదే. అందుకే తరాలు మారినా, యుగాలు గడిచినా భారతజాతి భీష్మపితామహునికి ఋణపడి ఉంటుంది. ఆయన్ను తమ జాతి నాయకుడిగా సగర్వంగా ప్రకటిస్తుంది.

---------------------------

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548

----------------------------------------







ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...