Wednesday, September 26, 2018

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి చేసే అలంకారాలు ... వాటి విశేషాల గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం


దసరా అలంకారాలు 


విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో 

అమ్మవారికి చేసే అలంకారాలు ... వాటి విశేషాలు


 



1.గాయత్రీదేవి అలంకారం

ముక్తావిద్రుమ హేమనీల ధవఉరళచ్ఛాయై: ముఖైస్త్రీక్షణై:
యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవింద యుగళం హసైర్వహంతీం భజే ||

                        'నగాయత్య్రా: పరం మత్రం మాతు: పరదైవతమ్‌' - గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. 'యా గాయంతం త్రాయతే సా గాయత్రీ' - గానం చేసిన వారిని కాపాడుతుంది కనుక మంత్రానికి గాయత్రి అని పేరు. తల్లి వేదమాత. అన్ని మంత్రాలకు మూలశక్తి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే ఐదు ముఖాలతో; శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి ఉంటుంది. గాయత్రీ ఉపాసన ద్వారా బుద్ధి వికసిస్తుంది. ప్రాతస్సంధ్యలో గాయత్రిగా, మధ్యాహ్న సంధ్యలో సావిత్రి, సాయం సంధ్యలో సరస్వతిగా ఉపాసకులు ఈమెను ధ్యానిస్తారు తల్లి ఉపాసన ద్వారా అనంతమైన మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలూ తొలగుతాయి. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రీమంత్ర పారాయణ వేదపారాయణ చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చిన గాయత్రీ మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించి, అమ్మకు అల్లపు గారె నివేదన చేయాలి. గాయత్రీమాత స్వరూపంగా వేదపండితులను అర్చించాలి. బ్రాహ్మణ పూజ చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పఠించాలి.

---------------------------------------------------------------------------------------------

2.అన్నపూర్ణాదేవి అలంకారం

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నీల సమాన కుతంలధరీ నిత్యాన్న దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ ||


            'అన్నం పరబ్రహ్మేతి వ్యజానాత్‌' - అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఒక చేతిలో మధురసాలతో కూడి ఉన్న మాణిక్యపాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల గరిటె ధరించిన రూపంలో అమ్మ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. అవతారంలో అమ్మ ఎర్రని శరీరం, మెడలో తారహారాలు ధరించి, నిండు చంద్రుని వలే అందమైన ముఖంతో, విశాలమైన త్రినేత్రాలతో భాసిల్లుతుంది. షడ్రుచులతో కూడిన భక్ష్యభోజ్యాదులు తల్లి అనుగ్రహం ద్వారా మానవాళికి అందుతాయి.
            ఆహారం లేకుండా సృష్టిలో ప్రాణీ జీవించలేదు. అలాగే, తన బిడ్డ ఆకలి తీర్చటానికి ఆలోచించని తల్లీ సృష్టిలో ఉండదు. అందుకనే, అన్నపూర్ణాదేవి రూపంలో దుర్గాదేవి సకల ప్రాణికోటికీ అన్నాన్ని అందించి, జగన్మాతగా పూజలు అందుకుంటుంది. సకల జీవుల్లోని జీవాన్ని తల్లి ఉద్దీపింపజేస్తుంది. అందుకనే ఆదిశంకరులు కూడా 'భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ'! అంటూ జగదంబను అన్నపూర్ణేశ్వరిగా ధ్యానం చేసారు. తల్లిని ఉపాసన చేసినవారు పుత్రపౌత్రాభివృద్ధి, బ్రహ్మతేజస్సు పొందుతారు. బృహదారణ్యకోపనిషత్‌, యజుర్వేద తైత్తిరీయ సంహిత, ప్రశ్నోపనిషత్ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. ఈమెను ధ్యానించిన వారికి బ్రహ్మతేజస్సు, వాక్సిద్ధి, తుష్టి, పుష్టి కలుగుతాయి. అంతేకాదు... తనను కొలిచినవారి సకల కార్యభారాన్నీ తల్లే వహిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భుక్తి, ముక్తి ఆకాంక్షించేవారు - విధేహి దేవి కల్యాణం విధేహి పరమాం శ్రియంరూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో జహి || అనే శ్లోకాన్ని శక్తికొద్దీ పారాయణ చేసి, తల్లికి దధ్యన్నం, కట్టెపొంగలి నివేదన చేయాలి. లేత ఎర్రని లేదా తెల్లని పూలతో అమ్మను పూజించాలి. శక్తిసాధన కోరుకునే వారు - సృష్టి స్థితి వినాశానం శక్తి భూతే సనాతని / గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే || అనే శ్లోకాన్ని పారాయణ చేయాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవత్యన్నపూర్ణేశ్వరి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. భోజనశాలలో అన్నపూర్ణాదేవి చిత్రపటం ఉంచి, పూజలు చేయాలి. అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పారాయణ చేయాలి. శక్తికొద్దీ అన్నదానం చేయాలి.
---------------------------------------------------------------------------------------

3.మహాలక్ష్మీదేవి అలంకారం


సరసిజ నయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే
భగవతి హరి వల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్‌ ||

            సిరిసంపదలు, సంతానం, సౌభాగ్యం, ధైర్యసాహసాలు, విజయాలకు తల్లి అధిష్టాన దేవత శ్రీమన్మహాలక్ష్మి. సకల లోకాలకు ఈమె ఐశ్వర్య ప్రదాత. ఇరువైపులా గజరాజు సేవిస్తుండగా, రెండు చేతులతో కమలాలు ధరించి, అభయ, వరద ముద్రలతో, క్షీరాబ్ధి పుత్రికయైన తల్లి భక్తులకు దర్శనమిస్తుంది. డోలాసురుడు అనే రాక్షసుడిని ఈమె సంహారం చేసి, లోకాలకు శాంతి చేకూర్చింది. త్రిపురాత్రయంలో ఈమె మధ్యశక్తి. 'యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా' - సకల లోకాల్లో ఉండే సకల జీవుల్లో తల్లి లక్ష్మీరూపంలో తల్లి నివాసం ఉంటుందని చండీ సప్తశతి చెబుతోంది. ఋగ్వేదం పదో మండలంలోని శ్రీసూక్తం తల్లి వైభవాన్ని ఎంతగానో ప్రకటిస్తుంది. అగ్ని, మత్స్యపురాణాలు ఈమె ఆకృతి, శిల్ప నిర్మాణ నియమాలను వివరంగా చెబుతున్నాయి.
అష్టలక్ష్ములకు ఈమె అధిష్ఠాన దేవత. తల్లి ఉపాసన ద్వారా లౌకిక సంపాదనతో పాటు అలౌకికమైన మోక్షసంపద కూడా లభిస్తుంది. ఈమె శీఘ్రఫలదాయిని. శ్రీసూక్తవిధానంగా తల్లిని ఎర్రని పుష్పాలతో, లక్ష్మీ అష్టోత్తర నామాలతోఅర్చించి, పూర్ణాలు నివేదన చేయాలి. అమ్మకు ప్రీతిగా సువాసినీ పూజ చేయాలి. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై స్వాహా' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. పూజామందిరంలో లక్ష్మీదేవి రూపును ఉంచి, పూజలు చేయాలి.

-------------------------------------------------------------------------------------------

4.మహాసరస్వతీ దేవి అలంకారం


ఘంటాశూల హలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకం
హస్తాబ్జైర్దధతి ఘనాంశ విలసచ్ఛీతాంశు తుల్యప్రభాం
గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా
పూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైతార్దినీమ్‌ ||

                        దుర్గాదేవి అలంకారాలన్నిటిలో మూలానక్షత్రం నాటి సరస్వతీదేవి అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. నరుణ్ణి నరోత్తముడిగా చేసి, నారాయణ తత్త్వాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులు ఈమెను ఆరాధన చేస్తారు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు... అన్నిటికీ ఈమే అధిష్ఠాన దేవత. ఋగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సర్వసతీదేవి గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. కచ్ఛపి అనే వీణ; పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి, నెమలిని అధిరోహించిన రూపంలో తల్లి దర్శనమిస్తుంది. 'సరాంసి జలాని సంతి ఆస్వా: సా సరస్వతి' - అని మేదినీకోశం చెబుతోంది. అనంత స్వరూపిణి, సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకదాత్రిగా శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. సరస్వతీ ఉపాసనతో లౌకిక విద్యలతో పాటు అలౌకికమైన మోక్షవిద్య కూడా అవగతమవుతుంది. సకల చరాచరకోటిలో వాగ్రూపంలో ఉంటూ, వారిని చైతన్యవంతులుగా చేసే శక్తి ఈమెది. 
                        'వాజేభిర్వాజినీవతీ...' అని మంత్రం. - సరస్వతీదేవి మమ్ములను పవిత్రులుగా చేసి, మాకు అన్నపూర్ణగా అన్నం పెడుతుంది. జ్ఞానాన్ని అందించి, భవసాగరాన్ని దాటిస్తుంది. సకల బుద్ధులను ప్రకాశింపజేస్తుంది అని ఋగ్వేదం సరస్వతీదేవిని స్తోత్రం చేస్తోంది. '' నుంచి 'క్ష' వరకు ఉన్న అన్ని అక్షరాలతో ఏర్పడే సకల వాజ్ఞ్మయము, సంగీతాది సకల కళలూ తల్లి వరప్రసాదమే. అందుకనే సరస్వతీ ఉపాసన ద్వారా సకల విద్యలూ కరతలామలకం అవుతాయని పెద్దలు చెబుతారు. వ్యాసుడు, వాల్మీకి, యాజ్ఞవల్క్యుడు మొదలైన ఋషులందరికీ తల్లి అనుగ్రహం ద్వారానే లోకోత్తరచరితులయ్యారు. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలతో అమ్మను పూజించాలి. దద్ధోజనం, చక్కెర పొంగలి నివేదన చేయాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం మహా సరస్వత్యై నమ:' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. సరస్వతీదేవి ప్రీతిగా రోజున పుస్తకదానం చేయాలి. సరస్వతీ ద్వాదశ నామాలు, స్తోత్రాలు పారాయణ చేయాలి.
===========================================================

5.లలితా త్రిపురసుందరీ దేవి అలంకారం

ప్రాత: స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం
ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశం ||

            త్రిపురాత్రయంలో ఈమె రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో, సకల లోకాతీత కోమలత్వంతో ప్రకాశిస్తుంది. తల్లి మణిద్వీప నివాసిని. సకల సృష్టి, స్థితి, సంహార కారిణి. శ్రీవిద్యా స్వరూపిణి. ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత. 'చిదగ్నికుండ సంభూతా' అని లలితా సహస్రనామం చెబుతోంది. 'చిత్‌' అంటే చైతన్యం. చైతన్యం అనే అగ్నికుండం నుంచి అమ్మ ఆవిర్భవించింది. సకల విశ్వచైతన్య శక్తిస్వరూపం శ్రీచక్రం. శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత లలితా త్రిపురసుందరి. నిర్వాణతంత్రం ప్రకారం లలితాదేవి సత్యలోకంలో బీజకోశంలో చింతామణి గృహంలో రత్నసింహాసనంపై ఆశీనురాలై ఉంటుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపం. కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతిస్వరూపంతో, చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించి ఉంటుంది. ఈమెకు లక్ష్మీసరస్వతులు ఇరువైపులా వింజామరలతో వీస్తూ, సేవలు చేస్తుంటారు. దేవేంద్రాది దేవతలు తల్లికి మంచపుకోళ్ళుగా ఉంటారు. నిత్యం తన భక్తులను అనుగ్రహిస్తూ, సర్వ వ్యాపకమైన తోజోమూర్తిగా లలితామాత విరాజిల్లుతుంది. ఈమెను ఉపాసించటం ద్వారా సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. దారిద్య్ర దు:ఖం నశిస్తుంది.

నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ:
నమ: ప్రకృత్యై భద్రాయై నియతా: ప్రణతాస్మతాం ||
అనే శ్లోకాన్ని పునశ్చరణ చేయాలి. మోక్షసాధన కోరుకునేవారు 
త్వం వైష్ణవీ శక్తిరనంతవీర్యా విశ్వస్యబీజం పరమాసి మాయా
సమ్మోహితం దేవి సమస్తమేతత్త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతు || 
అనే శ్లోకాన్ని పునశ్చరణ చేసి, అమ్మకు పాయసం నివేదన చేయాలి.

=================================================

6.దుర్గాదేవి అలంకారం 

విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం
కన్యాభి: కరవాలఖేట విలసద్దస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్ర గదాసిఖేట విసిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ||
దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలిగే దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీదేవతా శక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం తల్లి స్వరూపంగా ఉంటుంది. ఈమె సకల శత్రు సంహారిణి. సర్వ దు:ఖాలను నశింపజేస్తుంది. ఉగ్రరూపంతో దుష్టులను ఏవిధంగా సంహరిస్తుందో, అదే సమయంలో పరమశాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. పంచ ప్రకృతి స్వరూపాల్లో తొలి మూర్తి ఈమే. 
                        దేవి, మార్కండేయ పురాణాలు, ఉపనిషత్తులు, ఋగ్వేదాల్లో దుర్గాదేవిని ఉపాసన చేయటానికి వీలైన ఎన్నో విధానాలు ఉన్నాయి. మరెన్నో అవతార విశేషాలు కూడా గ్రంథాల్లో ఉన్నాయి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి, మణులు పొదిగిన కిరీటం ధరించి, సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఇది సర్వశత్రు సంహారక రూపం తల్లిని ధ్యానించినట్లయితే సర్వరోగాలు నశిస్తాయి. చామంతి, పొగడ, సంపెంగ, మల్లెపూలు, దానిమ్మపండు, ఎర్రని అక్షతలు, పొంగలి, పులి¬, పులగము తల్లికి ఇష్టమైన ద్రవ్యాలు. సర్వ రోగాల నుంచి ఉపశమనం పొందటానికి

రోగానశేషానపహంసి తుష్టా / రుష్టాతు కామాన్సకలానభీష్టాన్
త్వామాశ్రితానాం విపన్నరాణాం / త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి

అనే శ్లోకాన్ని పఠిస్తే రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజున వేదపండితులను సత్కరిస్తే అమ్మకు ఎంతో ప్రీతి కలుగుతుంది. ఓం దుం దుర్గాయై నమ: అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. దుర్గాసూక్తం, లలితా అష్టోత్తరం, దుర్గాస్తోత్రాలు పారాయణ చేయాలి.
=====================================================

7. మహిషాసుర మర్దినీ దేవి అలంకారం


మహిష మస్తక నృత్త వినోదినీ
స్ఫుటరణ్మణినూపుర మేఖలా
జనన రక్షణ మోక్ష విధాయినీ
జయతి శుంభనిశుంభ నిషూదినీ ||
           
            లోకకంటకుడైన మషిషాసురిడిని సంహారం చేసిన ¬గ్రరూపం ఇది. సకల దేవీదేవతల శక్తులన్నీ ఈమెలో మూర్తీభవించి ఉంటాయి. మానవనేత్రంతో చూడటానికి సాధ్యంకాని దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలతో, సింహవాహినియై తల్లికి దర్శనభాగ్యం కలిగిస్తుంది. ఈమె అనుగ్రహ భాగ్యం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజునే 'మహర్నవమి'గా జరుపుకోవటం ఆచారంగా వస్తోంది. రోజున చండీ సప్తశతీ ¬మం చేసిన వారికి శత్రుభయం ఉండదు. అన్నిటా విజయం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా అనే మంత్రాన్ని జపించాలి. పానకం, వడపప్పు, గారెలు, పులి¬, పాయసాన్నం నివేదన చేయాలి. అమ్మవారి స్వరూపంగా సువానినులకు పూజ చేసి, మంగళద్రవ్యాలు, పసుపు కుంకుమలు, శక్తికొద్దీ నూతన వస్త్రాలు ఇవ్వాలి.
======================================================

8.శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం


కల్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం
పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదినీం
సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం
శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం ||

                        స్వప్రకాశ జ్యోతి స్వరూపంతో, పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుని, సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్యదేవతగా పూజలందుకునే అమ్మ అవతారం శ్రీరాజరాజేశ్వరీదేవి. మహాత్రిపురసుందరిగా ఈమె శ్రీచక్ర నివాసినియై ఉంటుంది. నిశ్చల చిత్తంతో తనను ఆరాధించిన వారికి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను వరంగా అనుగ్రహిస్తుంది. మాయా మోహితమైన మానవ మనోచైతన్యం తల్లి ఉపాసన ద్వారా ఉద్దీపితమవుతుందిఅపరాజితాదేవిగా కూడా తల్లి పూజలందుకుంటుంది. ఈమె యోగమూర్తి. పసుపుపచ్చని వస్త్రాలు ధరించి, 'ఓం ఐం ఈల హ్రీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం' అనే మంత్రాన్ని జపించాలి. పసుపు పచ్చని పూలతో అమ్మను పూజించాలి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి. శ్రీచక్రార్చన, కుంకుమార్చన, సప్తశతీ పారాయణ, చండీ¬మం చేసిన వారికి ఇష్టకామ్యాలను అనుగ్రహిస్తుంది. సువాసినీ పూజ చేసి, భక్ష్య, భోజ్యాలతో మహానివేదన, ప్రత్యేకంగా లడ్డూలు నివేదన చేయాలి.

================================================

9.స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి


నమస్తే శరణ్యే శివేసానుకమ్పే / నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే
నమస్తే జగద్వంద్య పాదారవిందే / నమస్తే జగత్తారిణి త్రాహిదుర్గే

నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణకవచంతో అలంకరిస్తారు. ఇంద్రకీలాద్రిపై అమ్మ స్వర్ణకవచంతో అవతరించటం వల్ల, దసరా ఉత్సవాల తొలిరోజున అమ్మను స్వర్ణకవచంతో అలంకరించటం ఆచారంగా వస్తోంది. రూపంలో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కంటే అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి, పసిడి ఛాయ కలిగిన మోముతో దర్శనమిస్తుంది. సింహవాహనాన్ని అధిష్ఠించిన ఈమె శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది. సకల శత్రుబాధలు నివారిస్తుంది. ఆకర్షణశక్తి, ఆరోగ్య ప్రదాన లక్షణం కలిగిన స్వర్ణ కవచాన్ని ధరించిన అమ్మను ఆరాధిస్తే సకల విజయాలు లభిస్తాయి. స్వర్ణకవచం మంత్ర బీజాక్షర సమన్వితంగా ఉంటుంది. కారణం వల్ల స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని ఆరాధిస్తే మంత్రశక్తి లభిస్తుంది. రోజున అమ్మవారిని పసుపు అక్షతలు, పసుపు పూలతో పూజించాలి. దుర్గా అష్టోత్తరం, దుర్గాకవచం పారాయణ చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం దుర దుర్గాయైనమ: అనే మంత్రాన్ని ఉపాసించాలి. అమ్మవారికి పులి¬ నివేదన చేయాలి.
======================================================

10. బాలాత్రిపుర సుందరీ దేవి అవతారం

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశమంకుశ ధరాం సగ్భ్రూషితముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం ||



                        త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని రెండోరోజున బాలాత్రిపురసుందరీ దేవిగా అలంకరణ చేస్తారు. మనస్సు, బుద్ధి, అహంకారం తల్లి అధీనంలో ఉంటాయి. తల్లి అభయహస్తం, వరదముద్ర ప్రదర్శిస్తూ అక్షమాల ధరించి ఉంటుంది. ఈమెను ఆరాధించటం వల్ల నిత్య సంతోషం కలుగుతుంది. శ్రీచక్ర సంప్రదాయంలో షోడశీవిద్యకు ఈమె అధిదేవత. రెండు నుంచి పదేళ్ళ వయసులోపు బాలికలను బాలాత్రిపురసుందరీ దేవి స్వరూపంగా అర్చించి, సకల సుమంగళ ద్రవ్యాలు,నూతన వస్త్రాలు ఇవ్వాలి. ఇందువల్ల తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఈమె అనుగ్రహం వల్ల సత్సంతానం కలుగుతుంది. 'ఓం ఐం హ్రీం శ్రీం బాలాత్రిపురసుందర్యై నమ:' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. పాయసం నివేదన చేయాలి. లలితా త్రిశతీ స్తోత్రం పారాయణ చేయాలి.
=========================================

రచన

డాక్టర్కె.రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులుఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్ఆఫ్ఎడ్యుకేషన్‌, 

గాంధీనగర్‌, విజయవాడ-3. సెల్‌ : 90320 44115 / 88975 47548







ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...