Thursday, January 17, 2019

త్యాగరాజస్వామి రచనా వైభవం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappaganthu Ramakrishna) ఈనాడు దినపత్రికలో రాసిన వ్యాసం



త్యాగరాజస్వామి రచనా వైభవం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
(Dr Kappaganthu Ramakrishna) ఈనాడు దినపత్రికలో రాసిన వ్యాసం 

Monday, January 7, 2019

త్యాగరాజస్వామి సంకీర్తనా వైభవం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ( Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం


శ్రీరామ
ఆంధ్రభాషాదీప్తి.. త్యాగరాజ కృతి
(పుష్య బహుళ పంచమి శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)


రచన: 
డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ - 3. సెల్‌: 90320 44115
------------------------------------------------------

నవ నాడుల్లోను నాదోపాసనే ప్రాణవాయువుగా నింపుకున్న వాగ్గేయకారుడు శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి. అచంచలమైన రామభక్తితో దైవప్రసాదంగా వచ్చిన అద్భుతమైన గాత్రం, కర్ణాటక సంగీత వైదుష్యం సహా తనువును, మనసునూ.. ఒకటేమిటి 'తన' అనుకున్న సమస్త ప్రపంచాన్ని శ్రీరాముని చరణారవిందాలకే అర్పణం చేసిన భక్తశిఖామణి ఆయన. సంగీతం కేవలం ప్రతిభా ప్రదర్శనకో, ధన సంపాదనకో కాదు.. సంగీతం కైవల్య సోపానమని త్రికరణ శుద్ధిగా నమ్మి, ఆచరించి చూపిన వాగ్గేయకారుడాయన. అందుకనే ఆయన గతించి వందల సంవత్సరాలు దాటుతున్నా నేటికీ మనకు ఆరాధ్యుడయ్యారు.

కర్ణాటక సంగీత ప్రపంచంలో ఎందరో వాగ్గేయకారులు ఉన్నారు. త్యాగరాజు కన్నా గొప్పగా సాహిత్య, సంగీత ప్రయోగాలు చేసిన వారూ ఉన్నారు. ఇతర సంగీత విద్వాంసుల తీరులోనే ఆయనా శిష్యులకు సంగీతం నేర్పించారు. కానీ, త్యాగరాజస్వామి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు మనం ఆయన్ను గుర్తుంచుకోవాలి? అని ప్రశ్నిస్తే...

- అపారమైన తన సంగీత సాహిత్య రచనా సర్వస్వాన్నీ మాతృభాష అయిన తెలుగులోనే రచించి, ఆంధ్ర సారస్వత రంగం నేటికీ వెలుగు తగ్గకుండా ఉండటానికి చిత్తశుద్ధితో కృషి చేసిన తొలి తెలుగు భాషోద్యమ కార్యకర్తగా త్యాగరాజు కనిపిస్తారు.

- 'సహితస్య భావం సాహిత్యం' (సమాజానికి హితం చేకూర్చేదే సాహిత్యం) అనే వైయాకరుణుల వాక్యాన్ని అక్షర సత్యం చేస్తూ తన కృతులన్నిటిలో సామాజిక ప్రయోజనాన్ని ఆకాంక్షించిన సమాజసేవకుడిగా త్యాగరాజు సాక్షాత్కరిస్తారు.

- భవత్ప్రసాదంగా వచ్చిన విద్యను, విజ్ఞానాన్ని తిరిగి భగవంతుడిని చేరుకోవటానికే వినియోగించిన కైవల్యపథగామిగా త్యాగరాజు దర్శనమిస్తారు.

- నిద్రాణమై, నిస్తేజంగా, మొక్కుబడి తీరులో సాగుతున్న కర్ణాటక సంగీత కచేరీలకు తన వినూత్న ప్రయోగాలు, ఆవిష్కరణలతో నూతన జవసత్త్వాలను కల్పించి, 'ఇదీ కర్ణాటక సంగీత వైభవం' అని ప్రపంచానికి తెలిసేలా చేసిన వాగ్గేయకారుడిగా త్యాగరాజస్వామి పురుషరూపం దాల్చిన సంగీత సరస్వతిగా సాక్షాత్కరిస్తారు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశీలత వల్లనే శతాబ్దాలు గడుస్తున్నా త్యాగరాజస్వామి నేటికీ మనకు ఆరాధ్యుడయ్యారు.

సమున్నత వ్యక్తిత్వం

సంగీత స్రష్టగా, రామభక్తుడిగా, వాగ్గేయకారుడిగా ప్రపంచానికి త్యాగయ్య సుపరిచితులే. అంతేకాదు.. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి శ్వాస వరకు అదే లక్ష్యసాధన కోసం జీవింవించారాయన. ఎన్ని కష్టాలు వచ్చినా రాముడే చూసుకుంటారని త్రికరణశుద్ధిగా నమ్మి, ఆ స్వామినే కీర్తించేవారు.

త్యాగరాజు సుమారు ఆరు అడుగుల ఎత్తులో, కాస్త సన్నగా ఉండేవారు. పెద్ద కళ్ళు, ఆకట్టుకునే ముఖవర్చస్సు, మెడలో తులసిమాల ఉండేవి. కేవలం తెల్లటి వస్త్రాలే ధరించేవారు. నుదుట విభూది తప్పకుండా ధరించేవారు. విభూది రేఖల మధ్యలో కొద్దిగా గంధం, దాని మీద కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టేవారు. గొంతు ఖంగుమని మోగేది.

తోటివారి పట్ల దయ, ప్రేమ కలిగి ఉండేవారు. సంగీత విద్య విషయంలో మాత్రం చండశాసనుడిగా వ్యవహరించేవారు. ఎంతో క్రమశిక్షణ పాటించేవారు. ఆరోగ్యసూత్రాలు పాటిస్తూ, తన గొంతును కాపాడుకునేవారు. వారానికోసారి నువ్వులనూనెతో తలస్నానం చేసేవారు. పొట్లకాయ కూర ఇష్టంగా తినేవారు. ఈ వివరాలన్నీ ఆయన జీవితచరిత్రకారుల రచనల్లో ఉన్నాయి.

వీటన్నిటినీ సమాజ సేవ, ఉద్ధరణ త్యాగరాజులో ఎక్కువగా కనిపిస్తాయి. బాహ్యప్రవర్తనలో నిరంతర రామచింతన తప్ప మరే చింతా లేనివాడిగా కనిపించిన త్యాగరాజు తన కృతుల్లో సమాజం ధర్మమార్గాన్ని వీడకుండా ఎలా స్వధర్మాచరణ చేయాలో స్పష్టంగా చెప్పారు.

త్యాగరాజ పంచరత్న కృతుల్లో ఒకచోట 'పరనారీ సోదరా!' అని రామచంద్రమూర్తిని సంబోధిస్తారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. త్యాగయ్య నిద్రాణమైన తన సమాజాన్ని ఎంత జాగృతం చేశారో తెలుస్తుంది. రాముడు పరనారీ సోదరుడట. అంటే తన భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ సోదరీ భావంతో చూసేవారు. రాముడిలోని ఈ ఒక్క లక్షణాన్నైనా సమాజ సభ్యులందరూ అలవర్చుకుంటే చాలని త్యాగయ్య కోరిక. అదే జరిగితే, సమాజ పౌరులందరూ పరస్త్రీలను సోదరీ భావంతో చూస్తే.. పేరు చెప్పుకోవటానికి ఇబ్బందిపడే వ్యాధులు రావు. అందుకోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరమూ ఉండదు. లక్షలాది కుటుంబాలు రోడ్డు పడే దుస్థితీ ఉండదు. ఇదీ త్యాగయ్య వైభవం. ఇదీ బాధ్యతాయుతమైన రచయితకు  ఉండాల్సిన లక్షణం.

ఈ రోజున ఎందుకు త్యాగరాజ కీర్తనలు పాడాలి? త్యాగరాజ కీర్తనల అవసరం సమాజానికి ఏముంది? అని  ప్రశ్నించే వారికి ఇదే సూటి సమాధానం. త్యాగరాజ కీర్తనలు మత మూఢత్వాన్ని పెంచే 'స్తోత్రాలు' కావు. కర్తవ్య నిష్టవైపు సమాజాన్ని ఉద్దీపనం చేసే చైతన్య దీపాలు. మనిషిని మనీషిగా తీర్చిదిద్దే ఉపనిషద్వాక్యాలు.

తరగని మాతృభాషాభిమానం


సంగీతానికి, సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉందని త్యాగరాజు ప్రగాఢంగా నమ్మేవారు. భావావేశంతో పాడితేనే ఏ కచేరీ అయినా రక్తి కడుతుంది. శ్రోతల మనసుల్ని తాకుతుంది. ఇది జరగాలంటే కళాకారుడికి తాను పాడుతున్న కృతి ఏ భాషలో ఉందో ఆ భాష తప్పనిసరిగా రావాలి. సాహిత్యం అర్థం కాకపోతే ఆత్మానందం కలుగదు. ఇది లేకపోతే కచేరీలో తాదాత్మ్యత రాదు. తాదాత్మ్యత లేని కచేరీ రాణించదు. అందుకే సాహిత్యం అర్థం కాని సంగీతానికి విలువలేదని త్యాగరాజు అంటుండేవారు. అందుకే తన వద్దకు సంగీతం నేర్చుకోవటానికి వచ్చిన ప్రతివారికీ ముందుగా భాష నేర్పించేవారు. ఈ విషయాన్ని త్యాగరాజ స్వామి ముఖ్యశిష్యుడైన తంజావూరు రామారావు స్వయంగా చెప్పారు.

త్యాగరాజ స్వామి వద్ద సంగీత శిష్యరికం చేసినవాళ్ళు సుమారు 200 మందికి పైనే ఉన్నారు. వీరందరిలో తంజావూరు రామారావు, మానాంబుచావడి వెంకట సుబ్బయ్యర్‌ - వీరిద్దరే తెలుగు వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ తమిళులే. ఇన్ని వందల మందికి స్వయంగా తెలుగు నేర్పించిన భాషోపాధ్యాయుడుగానూ త్యాగయ్య తనలోని మాతృభాషా పరిరక్షణ దీక్షను ప్రకటించారు.

సాధారణంగా సంగీత శిక్షణలో గీతమైనా, వర్ణమైనా.. మరేదైనా ముందుగా స్వరాలతో నేర్పిస్తారు. స్వరస్థానాలు చక్కగా వచ్చిన తర్వాత సాహిత్యంతో నేర్పిస్తారు. త్యాగరాజు ఇందుకు భిన్నంగా ఏ కృతినైనా ముందుగా సాహిత్యంతో నేర్పించేవారు. శిష్యుడు భావయుక్తంగా పాడుతున్నాడని అనిపిస్తే, అప్పుడు స్వరాలతో నేర్పించేవారు. ఇంతటి ప్రాధానత్య ఇచ్చారు కాబట్టే త్యాగరాజస్వామి పుణ్యమా అని నేటికీ కర్ణాటక సంగీతంలో భాషకు ప్రాధాన్యత దక్కుతోంది.

త్యాగరాజస్వామి కాలంలో తంజావూరు ప్రాంతంలో ఎన్నో భాషలు వాడుకలో ఉండేవి. తమిళ దేశం కావటం వల్ల ప్రధానంగా తమిళం వాడుకలో ఉండేది. పండిత భాషగా, రాజభాషగా సంస్కృతం ఉండేది. అక్కడక్కడా తెలుగు ఉండేది. వ్యావహారికంగా చాలాచోట్ల తెలుగు వాడుకలో ఉండేది. బ్రిటీషు పాలన కావటంతో ఆంగ్ల ప్రాబల్యమూ ఎక్కువగానే ఉండేది. మరోపక్క ముస్లిం పాలకుల దండయాత్రలు, దురాక్రమణల ఫలితంగా ఉర్దూ, పార్శీ భాషలూ తమ ఉనికిని చాటుకునేవి.

ఇన్ని భాషలు, సంస్కృతీ వైవిధ్యాల మధ్య తన మాతృభాష అయిన తెలుగును, తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని కాపాడుకోవటం కోసం త్యాగరాజు అజరామరమైన ప్రయత్నం చేశారు. వేల కొద్దీ కృతులను తెలుగులోనే రచించి, తన అపారమైన తపశ్శక్తిని వాటికి ధారాదత్తం చేసి, తెలుగు భాష నేటికీ వెలుగులీనటానికి మూలకారణంగా నిలిచారు.

పుట్టిందీ, పెరిగిందీ తమిళప్రాంతంలో అయినా, త్యాగరాజస్వామి ఒక్క కృతిని కూడా తమిళంలో రాయలేదు సరికదా కనీసం ఒక్క తమిళపదానికి కూడా తన కృతుల్లో చోటివ్వలేదు. ఈ ఒక్క నిరూణ చాలు.. తెలుగు భాషా పరిరక్షణకు త్యాగరాజు చేసిన కృషి ఏమిటో చెప్పటానికి.

మొత్తం త్యాగరాజ సారస్వతాన్ని పరిశీలిస్తే తెలుగుతో పాటు కొన్ని సంస్కృత రచనలూ కనిపిస్తాయి. తెలుగు, సంస్కృత మిశ్రమంలో కొన్ని రచనలు కనిపిస్తాయి. వీటన్నిటిలోనూ రెండు, మూడు ఉర్దూ పదాలు, ఒకే ఒక్క ఆంగ్ల పదాన్ని సాహితీ పరిశీలకులు కనుగొన్నారు. ఉపన్యాసాలు, నినాదాలతో కాకుండా వాస్తవ ఆచరణతో తన మాతృభాషను కాపాడుకోవటం కోసం కృషి చేసిన భాషోద్యమ కార్యకర్తగా తన కర్తవ్యాన్ని నిర్వహించారు త్యాగరాజస్వామి.

ప|| ఎదుట నిలిచితే నీదు సొమ్ము - లేమి బోవురా

అ|| నుదుటి వ్రాత గని మట్టు మీరను నా
తరము దెలిసి మోసపోదునా ||

చ|| సరాసరిగా జూతురా నా ఆవ - సరాల దెలియుము వరాలడుగుజా
లరా సకల దేవరాయ! మనవి వి - నరా ఘహర! సుందరా కార నా ||

----------------------------------------

----------------------------------------

తరాన దొరకని పరాకు నాయెడ - ను రామ చేసితె సురాసురులు మె
త్తురా ఇపుడు ఈ హరామి తనమే - లరా భక్త త్యాగరాజ నుత!

శంకరాభరణ రాగంలో స్వరపరచిన ఈ కృతిలోని చివరి చరణంలో 'హరామి' అనే ఉర్దూపదాన్ని త్యాగయ్య ఉపయోగించారు.

'కారు బారు సేయు వారలు గలరే - నీ వలె సాకేత నగరిని' అంటూ ముఖారి రాగంలో త్యాగయ్య స్వరపరచిన కృతిలో కారుబారు అనే పదం కూడా ఉర్దూ పదమే. కార్‌ - ఓ - బార్‌ అనే పదం వాడుకలో కారుబారుగా మారిందని భాషా పరిశోధకుల పరిశీలనలో తేలింది.

'దయలేని బ్రతుకేమి - దాశరథీ రామ...... ' అంటూ నాయకి రాగంలో స్వరపరచిన కృతి చివరి చరణం చివరి పాదంలో 'రాజి సేయని త్యాగ - రాజాది వినుత' అనే చోట రాజీ అనే ఉర్దూ పదం కనిపిస్తుంది. అంగీకరించుట లేదా ఒప్పుకొనుట అనే అర్థంలో ఈ ఉర్దూ పదం తెలుగులో వాడుకలోకి వచ్చింది. పంతువరాళిరాగంలో 'నిన్నే నెర నిమ్మనానురా' అనే కృతిలోను 'రాజి' పదాన్ని త్యాగరాజు ఉపయోగించారు.

అలాగే, మొత్తం తన కృతుల్లో ఒకే ఒక్క చోట ముస్లిం మతానికి చెందిన పదాన్ని త్యాగరాజు ఉపయోగించారు. 'సమయము తెలిసి పుణ్యములార్జించని' అంటూ అసావేరి రాగంలో సాగే ఈ కృతి చివరి చరణంలో 'తురక వీధిలో విప్రునికి పానక పూజ' అనే చోట మాత్రమే 'తురక' అనే పద ప్రయోగం కనిపిస్తుంది.

తోడి రాగంలో 'ఏమి జేసితే నేమి శ్రీరామ - స్వామి కరుణలేని వారిలలో' అనే కృతి రెండో చరణంలో 'మేడ గట్టితే ఏమి అందున లాంతర్‌ - జోడు గట్టితే ఏమీ' అన్న చోట లాంతర్‌ అనే ఒకే ఒక ఆంగ్ల పదం కనిపిస్తుంది. త్యాగరాజు ఆంగ్ల పదాన్ని ఎందుకు ఉపయోగించారని పరిశీలిస్తే - సరిగ్గా ఆ సమయంలో కిరసనాయిలుతో వెలిగే దీపాలు వాడుకలోకి వచ్చాయి. ఇంగ్లీషు వాళ్ళు ఈ దీపాన్ని 'లాంటెరన్‌' అనే వాళ్ళు. ఈ లాంటెరన్‌ పదం వాడుకలో 'లాంతరు'గా మారింది. ఈవిధంగా వాడుకలో ఉన్న భాషా రూపాన్నే త్యాగరాజ స్వామి తన కృతుల్లో ఉపయోగించారని స్పష్టమవుతోంది.

రూపక రాగంలో 'సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిను' అనే కృతిలో 'సొగసు' అనే పదం తమిళ పదం అని కొందరు భాషావేత్తలు చెబుతున్నా ఈ పదం తెలుగులోనూ వాడుకలో ఉంది.

భాషా ప్రయోగాల పరంగా చూస్తే త్యాగరాజుకు ఛందస్సు మీద సాధికారత ఉన్నట్లు ఆయన రచనలు పరిశీలిస్త స్పష్టమవుతుంది. యమకాలు, ప్రాసలు, శబ్దాలంకారాలు, వృత్తాలు... ఒకటేమిటి త్యాగయ్య ప్రయోగాలు అపూర్వం.. అనితరసాధ్యం.

విశేష సంగీత ప్రజ్ఞ


కర్ణాటక సంగీతంలో రాగలక్షణాలు, రాగ స్వరూపాల విషయంలో త్యాగరాజుకు ఎంతో పట్టు ఉంది. సుమారు 215 రాగాల్లో ఆయన రచనలు ఉన్నాయి. తన కృతుల ద్వారా మరుగున పడిన ఎన్నో రాగాలను వెలికి తీశారు. కొన్ని కొత్త రాగాలను సృష్టించారు. ఒకే రాగంలో అనేక కృతులు స్వరపరచినా, ఏ ఒక్కటీ మరో దానితో పోలి ఉండదు.

సంఖ్యాపరంగాను, సృజన పరంగాను త్యాగరాజ స్వామి స్వరపరచినన్ని రాగాలు ఏ వాగ్గేయకారుడూ ముట్టుకోలేదు. రాగ లక్షణాన్నీ, వైశాల్యాన్నీ త్యాగరాజుతో సమానంగా తన రచనల్లో ప్రకటించిన వాగ్గేయకారుడూ ఇంతవరకూ లేడు. త్యాగరాజ కృతుల్లో రాగ విస్తృతి విశాలంగా ఉంటుంది. గొంతుకలో శ్రావ్యత తక్కువగా ఉన్నవారు కూడా చక్కగా పాడుకునేలా త్యాగయ్య కీర్తనలు సాగుతాయి.

ఎంతో సరళంగా, సుందరంగా పదిమందికీ అర్థమయ్యేలా తన రచనల ద్వారా అందరికీ సంగీతాన్ని చేరువ చేశారు త్యాగయ్య. కర్ణాటక సంగీతానికి, కళాకారులకు... కాదు..కాదు... యావత్‌ తెలుగుజాతికి ఆయన చేసిన మ¬పకారాన్ని వర్ణించటానికి మాటలు లేవు. ఆయన భిక్ష వల్లే లక్షలాది కుటుంబాలు ఈనాటికీ లోటులేకుండా గడుస్తున్నాయి.

త్యాగయ్య కీర్తనలు పాడితే కళాకారులుగా మాత్రమే మిగులుతాం. కానీ, త్యాగయ్య తన కృతుల ద్వారా కోరుకున్న ఆశయాలు సిద్ధించాలంటే అందుకు ఆచరణాత్మక ప్రయత్నం కావాలి. ప్రతి హృదయం త్యాగరాజ హృదయం కావాలి. అప్పుడే త్యాగబ్రహ్మ కోరుకున్న 'రామభక్తి సామ్రాజ్యం' ఏర్పడుతుంది.




Thursday, January 3, 2019

బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి అష్టావధానంలో పృచ్ఛకుడిగా పాల్గొన్న డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna)

మచిలీపట్నం బచ్చుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 09.12.2018న జరిగిన బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి అష్టావధానంలో పృచ్ఛకుడిగా పాల్గొనే అవకాశం కలిగింది. సమస్య అంశాన్ని నేను నిర్వహించాను.



శ్రీ గన్నవరం లలిత్ ఆదిత్య అష్టావధానంలో పాల్గొన్న డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna)

ప్రవాస భారతీయుడు, నవ యువ సాహితీకిరణం శ్రీ గన్నవరం లలిత్ ఆదిత్య గారి అష్టావధానం ఆదివారం విజయవాడ శివరామకృష్ణ క్షేత్రంలో జరిగింది. దత్తపది అంశాన్ని నిర్వహించాను. ఆ తాలూకు చిత్రాలు ఇవి.






Wednesday, January 2, 2019

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రచించిన 'అమ్మ నాన్న బుజ్జాయి' పుస్తకావిష్కరణ వివరాలు

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) అసిస్టెంట్ రిజినల్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రసాద్ బాబు గారితో కలిసి నేను రాసిన 'అమ్మ నాన్న బుజ్జాయి' పుస్తక ఆవిష్కరణ సభ నిన్న (01.01.2019) విజయవాడలో జరిగింది. ఇగ్నో రిజినల్ డైరెక్టర్ డాక్టర్ డి.ఆర్.శర్మ గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇగ్నో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.సుమలత గారు, రాఘవేంద్ర పబ్లిషర్స్ పార్టనర్ శ్రీ రమేష్ గారు, ఎస్ ఆర్ ఎస్ వి బీఇడి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.శ్రీనివాస మూర్తి గారు సభలో పాల్గొన్నారు. రచయితలుగా మేమిద్దరమూ సభలో ఉన్నాము. ఆ తాలూకు చిత్రాలు, వార్తా పత్రికల కథనాలు ఇవిగో... 

















అష్టావధానంలో పృచ్ఛకులుగా డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna)

ప్రవాస భారతీయుడు, అమెరికాకు చెందిన శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గారి అష్టావధానం విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల లో నిన్న (బుధవారం, 02.01.2019) జరిగింది. ముఖ్య అతిధిగా రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు విచ్చేశారు. నేను అప్రస్తుత ప్రసంగం అంశాన్ని నిర్వహించాను. నాకు ఈ అవకాశం కల్పించిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రాలు అందించిన ఆత్మీయ మిత్రులు శ్రీ నోరి సాయిబాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.








ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...