Showing posts with label Upavasam. Show all posts
Showing posts with label Upavasam. Show all posts

Saturday, May 16, 2020

Thursday, July 26, 2018

మహాశివరాత్రి ప్రత్యేకం.... ఉపవాసం, జాగరణ అంటే ఏమిటి? ఎందుకు చెయ్యాలి?

మహాశివరాత్రి ప్రత్యేకం... 

ఉపవాసం, జాగరణ అంటే ఏమిటి? ఎందుకు చెయ్యాలి? 

-----------------------------------------------------------------


                 పరమేశ్వరా! నీ సంకల్ప ఫలితంగా ఏర్పడ్డ ఈ తనువు, ప్రాణం అన్నీ నీకే అర్పిస్తున్నాను. నా విధాతవు నీవు. నాలోని అజ్ఞానాన్ని తొలగించి, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే దక్షిణామూర్తివి నీవు. తనువులోని ప్రతి అణువూ నీ దర్శనభాగ్యాన్ని కోరుకుంటోంది. నిన్ను చూడాలని, నిన్ను చూసిన ఆనందంలో నీలో లయం కావాలని మనసు ఆరాటపడుతోంది. స్వామీ! నీ దర్శనభాగ్యం కోసం తనువెల్లా కనులు చేసుకుని నిరీక్షిస్తున్నాను. పగలు, రాత్రి భేదం లేకుండా జాగరణ చేస్తున్నాను. శివా! ఒక్కసారి కనిపించవయ్యా... అంటూ పరమేశ్వరుడి దర్శనం కోసం పరితపిస్తూ, ఆస్వామి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ, సూర్యోదయ సూర్యాస్తమయాలను ఏకభావంతో అనుభవిస్తూ చేసే శివధ్యానమే శివరాత్రి జాగరణ.

                 ఏమిటీ జాగరణ? ఎందుకు చెయ్యాలి? రోజంతా పూజలు చేసి, ఉపవాసం చేసిన తర్వాత కూడా రాత్రంతా ఎందుకు మేల్కొని ఉండాలి? పగలంతా చేసిన పూజలతో స్వామి సంతసించడా? ఇంకా ఎన్నో సందేహాలు మన మనసుల్ని తొలిచివేస్తుంటాయి. ఇవన్నీ సహజమైవే.

                 లౌకిక దృష్టితో చూస్తే ఈ సందేహాలన్నీ సరైనవే అనిపిస్తుంది. కానీ, ప్రతి ఆచారం వెనుకా అద్భుతమైన అలౌకిక తత్త్వాన్ని నింపుకున్న భారతీయ ఆధ్యాత్మికత దృష్టికోణం వీటన్నిటికీ భిన్నంగా ఆలోచిస్తుంది. ఇహంతో పాటు పరాన్ని కూడా పరమేశ్వరానుగ్రహంతో సంపాదించటానికి మనిషిని సన్నద్ధుడిని చేస్తుంది. ఈ క్రమంలో మనిషి సాధనకు పదును పెట్టే పరమాద్భుత విధానమే శివరాత్రి జాగరణ.

                 'జన్మకో శివరాత్రి' అనే నానుడి పురాతనకాలం నుంచి వాడుకలో ఉంది. ఒక్క శివరాత్రి పూజించినా అనంతమైన ఫలితాలు వస్తాయి. శివుడి అనుగ్రహం కలుగుతుందనే భావనలో మన పూర్వికులు వాడుకలోకి తెచ్చిన నానుడి ఇది. అవును.. నిజమే. మనిషి జన్మ లభించిన తర్వాత జీవితకాలంలో ఒక్క శివరాత్రి అయినా, మనోవాక్కాయకర్మలను ఏకం చేసి, శివరాత్రి రోజున ఆరాధన చేస్తే, పరమేశ్వరానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది.

                 శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి, ఇతర పూజలకన్నా ఎక్కువగా శివుడికి అభిషేకం చేయటం వాడుకలో ఉంది. అందునా, మహాశివరాత్రి పర్వదినం కాబట్టి, మరింత ఎక్కువగా ఆ స్వామిని అభిషేకించటం కూడా జరుగుతుంది. వీటితోపాటు ప్రత్యేకంగా శివరాత్రి రోజున రెండు ఆచారాలను విధిగా పాటిస్తాం. అవి 1. ఉపవాసం. 2. జాగరణ.


ఉపవాసం ఇలా ఉండాలి

 'ఉపే సమీపే వాసం ఉపవాసం నతు కాయస్య శోషణం' - భగవంతుని తత్త్వానికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. అంతేకానీ, శరీరాన్ని శుష్కింపజేసుకోవటం ఉపవాసం ఎప్పటికీ కాదు. అనుక్షణం దైవనామస్మరణతో పరమేశ్వరుడికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఇలా నిరంతరం పరమేశ్వరుడికి దగ్గరగా ఉండాలంటే, భౌతికపరమైన ఆహారక్రియలకు దూరంగా ఉండాలి. తెల్లవారు లేచింది మొదలు వండుకోవటం, తినటం, వాటి ద్వారా వచ్చే విసర్జన క్రియలతో సమయాన్ని వృధా చేసుకోవటం, కేవలం శరీరధారణకు అవసమైన సాత్వికాహారాన్ని మాత్రమే తీసుకుంటూ, వీలైనంత ఎక్కువ సేపు పరమేశ్వరుడి సన్నిధిలో గడపటమే ఉపవాసం అనే పదానికి అర్థం.

   వీటన్నిటితోపాటు  శివరాత్రి రోజున జాగరణ చేయటం ఆనూచానంగా వస్తోంది.  ఏమిటీ జాగరణ? రాత్రి తెల్లవార్లూ నిద్రపోకుండా, మెలకువగా ఉండటమే జాగరణ. ఇది సాధారణ అర్థం. చాలావరకు ఆచరించేది కూడా ఇదే. కానీ, ఇందుకు భిన్నమైన అనేక అర్థాలు శివరాత్రి జాగరణకు ఉన్నాయి. కంటి మీద కునుకురాకుండా ఏవేవో వ్యాపకాల్ని కల్పించుకోవటం జాగరణ అనిపించుకోదు. పరమేశ్వర దర్శనం కోసం ఒడలు మరచి ఎదురుచూడటం జాగరణ అవుతుంది. ఇందుకోసం మనల్ని మనం జాగృతపరచుకోవటమే జాగరణ అవుతుంది. రాత్రి వేళ మేల్కొని ఉండటం (జాగరణ) ఎందుకనే ప్రశ్నకు తరచి చూస్తే అనేక అంతరార్థాలు కనిపిస్తాయి.

జాగరణ అంటే ఏమిటి?

 బుద్ధి జీవుడైన మానవుడు నిరంతరం చైతన్యంగా ఉండటమే జాగరణ అవుతుంది. లయకారకుడైన పరమేశ్వరుడు లింగోద్భవం చెందిన పరమపవిత్ర దినం మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసంతో పాటు జాగరణ చేయడం ముక్తి ప్రదాయకమని పురాణాలు పేర్కొంటున్నాయి. ఉపవాస దీక్షతో శివనామస్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేయడం ఎందుకంటే - మానవ జీవితంపై రాజస, తామస గుణాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. రాజసం అంటే భావోద్వేగం. తామసమంటే అంధకారం. పగటివేళ రాజసం, రాత్రి వేళ తామస గుణాలు కలుగుతాయి. వీటిపై నియంత్రణకు ప్రణవ నాదాన్ని పూరించిన మహాశివుని భక్తిలో నిమగ్నం కావాలి. తామస వేళ కామం, ఆగ్రహం, అసూయ తదితర విక త గుణాలు మనిషిలో ప్రవేశిస్తాయి. అయితే వీటిని అధిగమించేందుకు పరమేశ్వరుడు చూపిన మార్గదర్శనమే శివరాత్రి ఉపవాసం, జాగరణ. పగలు,రాత్రి భేదం లేకుండా అనుక్షణం మహేశ్వరుని ధ్యానంలో ఉంటే జీవితంపై నియంత్రణ కలిగివుంటామని దీని భావన.

                 సాధారణంగా మనం రాత్రి భోజనం చేసిన తర్వాత పగలు అల్పాహారం తీసుకునే వరకు దాదాపు 10 గంటల పాటు ఏవిధమైన ఆహారం తీసుకోకుండా ఉంటాము. అంటే ఉపవాసం చేస్తున్నాం. ఇది సాధారణంగా జరిగే విషయమే. అంటే, ప్రతి మనిషీ రాత్రి వేళ ఉపవాసం చేస్తాడు. ఇందుకు భిన్నంగా శివరాత్రి రోజున పగలు ఉపవాసం చేస్తాం. కాబట్టి, శివరాత్రి రోజున వచ్చే పగటి సమయం రాత్రితో సమానం. అలాగే, సాధారణంగా రోజూ ఉదయపు వేళ మేల్కొని ఉంటాం. ఇందుకు భిన్నంగా శివరాత్రి రోజున రాత్రి సమయంలో మేల్కొని ఉంటాం. అంటే, రాత్రి అయినా పగటితో సమానం అవుతుంది. ఈవిధంగా పగటి, రాత్రి వేళల అభేదాన్ని సాధించే ఆచారం శివరాత్రి ఆచరణలో కనిపిస్తుంది. 

                సాధారణంగా మనం చేసుకునే పండుగలన్నీ విందులతో, వినోదాలతో నిండి ఉంటాయి. కానీ, ఇందుకు భిన్నంగా శివరాత్రి జరుగుతుంది. ఈ పర్వదినాన్ని పూర్తిగా ఉపవాసంతో జరుపుకుంటాం. లౌకికమైన ఆహార, విషయవాంఛల నుంచి మనిషిని దూరంగా జరిపి, పరమేశ్వరుడికి చేరువ చేసే అంతరార్థం శివరాత్రి పర్వదినంలో కనిపిస్తుంది.

               లింగోద్భవం అర్ధరాత్రి వేళ జరిగింది. అంతా తానై, అన్నిటా తానై జగత్తును నడిపించే పరమేశ్వర లింగావిర్భావ పుణ్యసమయంలో శివధ్యానంతో మనసును నింపుకునేందుకు జాగరణ రూపంలో ఏర్పరచుకున్న నియమం అది. పరమేశ్వరుడి రాక కోసం ఒడలెల్లా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తూ, అనుక్షణం శివధ్యానంతో తపించేందుకు  పెద్దలు ఏర్పాటుచేసిన ఆధ్యాత్మికమార్గం అది.

                 మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రియాలు మన వశంలో ఉంటాయి. జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుడిని దర్శించటానికి భౌతిక నేత్రాలతో పాటు మనో నేత్రాలు కూడా అవసరం. అటువంటి మానసిక చైతన్యాన్ని ఎల్లప్పుడూ మనిషిలో నింపి ఉంచేందుకు ఏర్పాటుచేసిన విధానాల్లో జాగరణ ఒకటి.

                 పరమేశ్వరుడు రాత్రి వేళ లింగాకారంలో ఆవిర్భవించాడు. కాబట్టి, రాత్రి వేళ జాగరణ చెయ్యాలి. రాత్రి మెలకువగా ఉండాలంటే, ఆహారం మితంగా తీసుకోవాలి. అప్పుడే కంటి మీద కునుకు రాకుండా ఉంటుంది. కేవలం శరీరాన్ని నిలిపి ఉంచుకునేందుకు అవసరమైన సాత్విక ఆహారం తీసుకుంటూ, లింగోద్భవమూర్తిని దర్శించుకునేందుకు తనువును, మనసునూ మేల్కొలిపి ఉంచే విధానమే జాగరణ. 

    శివలింగం శివతత్త్వానికి ప్రతీక. కంటికి కనిపించే ఆకాశమే శివలింగ స్వరూపం. ఉపనిషత్తులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

సాధారణంగా మనుషులకు ఒక ప్రవృత్తి ఉంటుంది. కంటికి కనిపించేదే నిజమనే భ్రమ వారిలో ఉంటుంది. బంగారం నుంచి తయారైన ఆభరాణలకు ప్రాధాన్యత ఇస్తారు. వాటిని గుర్తిస్తారే కానీ ఆభరణాల తయారీకి మూలకారణమైన బంగారాన్ని ఎవరూ గుర్తించరు. అలాగే, ఈ ప్రపంచంలోని సకల ప్రాణి ఆవిర్భావానికి మూలకారణం ఆకాశం. ఈ ఆకాశాన్ని ఎవరూ గుర్తించరు. కంటికి కనిపిస్తూ, మనకు పైభాగంలో కనిపించేదే ఆకాశం అనుకుంటాం. కానీ, అనంతమైన ఆకాశతత్త్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యటం జరగదు. అందుకనే ఆకాశతత్త్వానికి ప్రతీక అయిన లింగం భౌతికరూపంలో మానవలోకంలో ఉద్భవించింది. ఈ లింగాన్ని దర్శించి, అర్చించటమంటే అనంతమైన ఆకాశతత్త్వాన్ని అర్థం చేసుకోవటమే అవుతుంది. ఎప్పుడైతే ఆకాశ తత్త్వం అవగాహనకు వస్తుందో అప్పుడు శాశ్వతమైన ఆత్మతత్త్వం బోధ పడుతుంది. ఇదంతా జరగటానికి ఇంద్రియాలతో కూడిన మనసు నిత్యచైతన్యంగా ఉండాలి.

జాగరణ పరమార్థం ఇదీ...

మనిషిలో ఉండే అజ్ఞానానికి సంకేతం రాత్రి. జ్ఞానానికి పగలు ప్రతిరూపం. పరమేశ్వర తత్త్వాన్ని తెలుసుకోలేకపోవటమే అజ్ఞానం. ఈ మూడింటిని సమన్వయం చేస్తే శివతత్త్వాన్ని తెలుసుకోలేకపోవటమనే అజ్ఞానం నుంచి మనిషిని దూరం చేసి, ఆత్మజ్ఞానం వైపు మనిషిని నడిపించేందుకు చేసే ప్రయత్నమే జాగరణ అవుతుంది.

 రాత్రి తర్వాత వచ్చే పగలు ఆనందాన్నిస్తుంది. అలాగే, అజ్ఞానం తొలగిన తర్వాత వచ్చే విజ్ఞానం మనిషికి శాశ్వత ఆనందాన్నిస్తుంది. జ్ఞానమనే పగటి కోసం చూసే ఎదురుచూపే జాగరణ.

మరొక కోణంలో ప్రాపంచికమైన ఆలోచనలకు రాత్రి అని అర్థం చెప్పుకోవచ్చు. ప్రాపంచికమైన ఆలోచనలకు దూరంగా జరిగి, అలౌకికమైన ఆనందాన్ని అందుకోవటమే జాగరణ. ప్రాపంచికమైన చీకట్లు విడిపోవాలంటే పరమేశ్వరానుగ్రహం కావాలి. ఇందుకోసం మనిషి తపించాలి. నిరంతరం మెలకువగా (జాగరణ) ఉండాలి. అప్పుడు జీవితమంతా శివరాత్రి జాగరణే అవుతుంది.

 రాత్రంతా ఎలా మేల్కొని ఉండాలి? శరీర అవయవాలను ఉగ్గబట్టి, బలవంతానా కళ్ళు తెరచి ఉండటం జాగరణ అనిపించుకోదు. మనసును, దృష్టిని ఒకటిగా చేసి, అనుక్షణం శివనామస్మరణ చేస్తూ మెలకువగా ఉండాలి.  అదే జాగరణకు అసలైన అర్థం. జాగరణ చేయాల్సిన విధానం కూడా.

  జాగరణ అనే పదానికి జాగృతం చేసుకోవటం అనే అర్థం కూడా ఉంది. ఎవరో మనల్ని ఉద్ధరిస్తారనే పరాన్నభుక్కులాగా మనిషి అచేతనుడుగా ఉండకూడదు. మనలోని అచేతనాన్ని, దైన్యాన్ని స్వీయజాగృతితో దూరం చేసుకోవాలి. నిరంతరం మెలవకుగా (చైతన్యంగా) ఉండాలి. జాగరణ అనే పదానికి మరొక అర్థం ఇది.

 మనస్సు ఇంద్రియాల పట్ల కాకుండా ఆత్మపట్ల మేల్కొని ఉండటమే జాగరణ. ఇంద్రియ వ్యామోహంలోకి జారిపోకుండా పరమాత్మ తత్త్వం పట్ల మేల్కొని ఉండటమే జాగరణ అవుతుంది. ఇందుకు ప్రతీకగా రాత్రి మేల్కొని ఉండటం జరుగుతుంది. శరీరం మెలకువగా ఉంటేనే మనస్సు తన చుట్టూ ఏం జరుగుతోందో గమనించగలదు. అందుని, మనసును మెలకువగా, చైతన్యంగా ఉంచేందుకు ఏర్పడిన విధానమే జాగరణ.

అజ్ఞానులకు రాత్రిగా కనిపించే తత్త్వాన్ని పోగొట్టటమే జాగరణ ఉద్దేశం. జ్ఞానులకు అంతా పగలే. వారికి రాత్రి ఉండదు. రాత్రి అంటే భౌతికమైన రాత్రి కాదు. అజ్ఞానమనే రాత్రి. అజ్ఞానమనే రాత్రిని పారద్రోలి విజ్ఞానమనే అఖండమైన వెలుగును పొందటం కోసం చేసే ఆధ్యాత్మిక సాధనే శివరాత్రి జాగరణ. జ్ఞానులకు నిత్యం శివరాత్రి జాగరణే అవుతుంది. ఎందుకంటే, వారు నిత్యం పరమేశ్వర తత్త్వాన్వేషణలో ఉంటారు కాబట్టి.  

 'యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం' అని శంకరాచార్యులు చెప్పినట్లు చేసే ప్రతి పనిలోనూ, వేసే ప్రతి అడుగులోనూ పరమేశ్వర తత్త్వాన్ని భావించి, ఆధ్యాత్మిక జాగరణ కలిగి ఉంటే, శివానుగ్రహం తప్పక సిద్ధిస్తుంది.

 

 రచన: డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు,  ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌,

గాంధీనగర్‌, విజయవాడ – 520003. సెల్‌ : 90320 44115 / 8897 547 548 

-----------------------

శ్రీశైలప్రభ పత్రికలో రాసిన వ్యాసం

------------------------







ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...