Showing posts with label హనుమంతుడు. Show all posts
Showing posts with label హనుమంతుడు. Show all posts

Wednesday, May 1, 2024

వాక్యకోవిదుడు హనుమంతుడు


 

వాక్యకోవిదుడు, వ్యాకరణ పండితుడు

 

 

మాట మనిషిని మహనీయుడిని చేస్తుంది. అదే మాట మనిషి పతనావస్థకు దారితీస్తుంది. వాక్కుకు అంతటి అమోఘమైన శక్తి ఉంది. అవతలి వ్యక్తితో స్నేహం చెయ్యాలన్నా, మిత్రుడు శత్రువుగా మారాలన్నా ఒక్క మాట సరిపోతుంది. అందుకే శాస్త్రాలు వాక్కును దైవంగా ప్రకటిస్తాయి. మంత్రభాగంలో కూడా వాక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మాట్లాడే మాటలో ఒక శబ్దం ఎక్కువ లేదా తక్కువ అయినా అందుకు విపరీత ఫలితాలు ఏర్పడతాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలి. వాక్కుకు ఇంతటి ప్రభావాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు, ఎవరితో ఎప్పుడు ఎంతవరకు ఎలా మాట్లాడాలో ఆ పరిధికి లోబడి మాట్లాడి ‘వాక్య కోవిదుడు’గా, ‘నవ వ్యాకరణ పండితుడు’గా జేజేలు అందుకుంటున్నవాడు రామదూత హనుమ మాత్రమే.

 

హనుమ నవ వ్యాకరణ పండితుడు. సూర్యుడి దగ్గర శిష్యరికం చేసినవాడు.  తపస్వి. సుగ్రీవుడి మంత్రి. భక్తుడు. సేవకుడు. రాయబారి. కార్యసాధకుడు. యోధుడు. పరాక్రమశాలి. అన్నిటికీ మించి వినయ సంపన్నుడు. గొప్ప వాక్కు అలంకారంగా కలిగినవాడు – ’వాగ్విదాం వరం‘ – అని వాల్మీకి పొంగిపోయి చెప్పాడు.

 

హనుమంతుడు అనగానే సాధారణంగా అందరికీ ఆ స్వామి భుజ బలం మాత్రమే గుర్తుకువస్తుంది. నిజానికి హనుమ గొప్ప బుద్ధి బలశాలి కూడా. అందుకే ‘బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా / అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్’ -  హనుమను ధ్యానిస్తే బుద్ధిబలం వస్తుంది అని చెబుతున్నాయి ఇతిహాస, పురాణ గ్రంథాలు.

 

సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.

 

రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!

 

మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమగాలు సంచరించే ఇలాంటి చోటుకురారు అని రామలక్ష్మణులను ప్రశ్నిస్తాడు హనుమ.

 

మాట అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు. హనుమంతుడి మాటల ఔచిత్యానికి ముచ్చటపడతాడు రాముడు.

 

నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ: ! నా సామవేద విదుష: శక్యమేవ విభాషితుం !!

 

రుక్‌, యజు, సామవేదాల్లో పండితుడైనవాడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేరంటూ లక్ష్మణుడితో హనుమంతుడి మాటలతీరులోని గొప్పతనాన్ని వివరిస్తాడు రాముడు. ఒక్క మాట ఎక్కువ తక్కువ కాకుండా కొత్తవారితో కూడా ఎంతో నేర్పుగా మాట్లాడటమే కాకుండా రామసుగ్రీవుల మైత్రికి బీజం వేసింది హనుమ వాక్చాతుర్యం. హనుమలోని వ్యాకరణ పాండితీ వైభవానికి, ఔచిత్యవంతమైన సంభాషణ చేసే నేర్పుకీ ప్రతీక ఈ ఘట్టం.

 

నవ వ్యాకరణాలు ఎలా చదివాడంటే...

 

‘హనుమంతుడు మాటతీరు తెలిసినవాడు’అని శ్రీరామచంద్రుడు అంతటివాడు ప్రశంసించాడు. నవ వ్యాకరణ పండితుడు కావటమే హనుమంతుడి ఉత్తమమైన మాటతీరుకు కారణం.

హనుమ సూర్యభగవానుడి దగ్గరకు వెళ్లి తనకు వ్యాకరణాన్ని నేర్పమన్నాడు. చిన్నప్పుడు తనను తిన దగిన ఫలమని భావించి ఎగిరి వచ్చిన హనుమను చూస్తే ముచ్చటేసింది సూర్యుడికి. ‘నేర్పుతాను. కానీ, నేను ఒకచోట స్థిరంగా ఉండటానికి కుదరదు కదా! గగన మార్గంలో నా వెంట ఎలా తిరుగ గలవు?’ అనడిగాడు భానుడు.

 

‘ఓ.. దానిదేముంది!’ అంటూ తన కాయాన్ని పెంచిన ఆంజనేయుడు ఉదయాద్రిన ఒక కాలు, అస్తాద్రిన ఒక కాలు మోపి, సూర్యగమనానికి అనువుగా నడుమును వంచుతూ, చెవి ఒగ్గి ఆదిత్యుడి దగ్గర వ్యాకరణ శాస్ర్తాన్ని కూలంకషంగా అధ్యయనం చేశాడు.

 

మనకు మొత్తం తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉన్నాయి. అవి... 1.శాక్త వ్యాకరణము 2. శంభు వ్యాకరణము 3. కుమార వ్యాకరణము 4. ఇంద్ర వ్యాకరణము 5. సూర్య వ్యాకరణము 6. చంద్ర వ్యాకరణము 7. స్మర వ్యాకరణము 8. వాత్స్యాయన వ్యాకరణము 9. అగస్త్య వ్యాకరణము. – ఈ తొమ్మిది రకాల వ్యాకరణాలను హనుమంతుడు సూర్యుడి వద్ద అధ్యయనం చేసాడు.  అందుకే హనుమకు ‘నవ వ్యాకరణ పండితుడు’ అనే పేరు ఏర్పడింది.

 

హనుమ మాట్లాడిన తీరుకు ముచ్చటపడిన రామచంద్రమూర్తి స్వయంగా... నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధా శ్రుతమ్ బహు వ్యాహరతానేన న కిఞ్చిదపశబ్దితమ్’ – ఆంజనేయుడు మాట్లాడిన మాటల్లో ఒక్క అపశబద్దం కానీ, ఒక్క మాట ఎక్కువ కానీ, తక్కువ కానీ లేదు. వ్యాకరణం మీద తిరుగులేని పట్టు ఉన్న వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అంటాడు. రామయ్యను హనుమ మెప్పించింది తన భుజబలం చూపించో, మరొక శక్తి ప్రదర్శించో కాదు... కేవలం తన భాషా పాండిత్యంతో మెప్పించాడు. అదీ హనుమ వ్యాకరణ పాండిత్యానికి ఉన్న ఔన్నత్యం.

 

దృష్టా సీతా...

 

వానర రాజు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం భూమి నాలుగు చెరగుల నుంచి కపి సైన్యం వచ్చి చేరింది. ఓక్కొక్కరిని ఒక్కొక భాగానికి నాయకుడిని చేసి వారు ఏదిక్కుగా వెళ్ళాలో, ఎక్కడెక్కడ వెతకాలో వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు సుగ్రీవుడు. చివరగా, అంగదుడిని నాయకునిగా చేసి , హనుమదాదిగా వీరులను దక్షణ దిక్కుకు వెళ్ళి వెతకమని చెబుతాడు. ఎక్కడి దాకా వెళ్ళి వెతకాలో చెబుతాడు. అందరికీ, ఎక్కడెక్కడ వెతకాలో కూడా చెబుతాడు.. సమయం ఒక నెల అని చాలా వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు. అతిక్రమించిన వారికి శిరః ఛేదం శిక్ష అని ప్రకటించాడు. అందుకే దానిని సుగ్రీవాజ్ఞ అన్నారు.

 

అప్పుడు రాముడు హనుమకు అంగుళీయం తన గుర్తుగా ఇస్తాడు, సీతకు ఇవ్వడానికి. ఎవ్వరికీ ఇవ్వని ఈ గుర్తు హనుమకే ఇవ్వడం లో విశేషం, హనుమ మాత్రమే ఈ పని పూర్తి చేయగలడన్న నమ్మకం.  సీతమ్మను వెదకడానికి అందరూ అన్ని దిక్కులకూ బయలుదేరుతారు. దక్షణ దిక్కుగా వెళ్ళినవారు చాలా చిక్కులు పడి సముద్ర తీరం చేరుతారు.

 

అప్పటికే ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. అందరూ ప్రాణభయంతో ఉన్నారు సుగ్రీవాజ్ఞ మూలంగా. ఆ సమయంలో లంకకి వెళ్ళగలవారెవరనే ప్రశ్న ఏర్పడింది. చివరికి హనుమకి శక్తి గుర్తు చేసి ఆయనను పంపుతారు. హనుమ లంకకు చేరుకుని, సీతను చూసి ఆమెతో మాటాడి ఆమెను ఆత్మహత్య నుంచి కాపాడి, అంగుళీయమిచ్చి, సీతమ్మ ఇచ్చిన చూడామణి ని తీసుకుని, అశోకవనం నాశనం చేసి, రావణుని పరివారం కొంత, అతని సుతుని పరిమార్చి, రావణుని చూచి, లంక కాల్చి, విజయంతో తిరిగి బయల్దేరతాడు.

 

ఇక్కడ సముద్రపు ఒడ్డున ఉన్న వారు ఉత్కంఠ తో ఉన్నారు. ఏమైందో తెలియదు. హనుమ సీతను చూసి వస్తే అందరి ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే, సుగ్రీవాజ్ఞ ప్రకారం శిరచ్ఛేదం తప్పదు. ఇటువంటి సమయంలో హనుమ తిరిగివస్తూ సముద్రపు ఒడ్డున ఉన్న తన వారికి విజయ సందేశం క్లుప్తంగా తెలియజేయడానికి సింహనాదం చేస్తాడు. ఆ సింహనాదం విని, అక్కడ వున్న జాంబవంతుడు మొదలైన వారు హనుమ కార్య సాధనతో తిరిగి వస్తున్నాడని భాష్యం చెబుతారు.

 

ఆయినా ఉత్కంఠం పోదు. హనుమ నేల మీద కాలుమోపుతూ... “దృష్టా సీతా” అన్నాడు. సాధారణంగా క్రియాపదంతో వాక్య నిర్మాణం ఉండదు. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం కూడ తోడు కలవడం, వ్యాకరణ పండితుడవటం వల్ల, అక్కడ ఉన్నవారి ఉత్కంఠను వెంటనే చల్లార్చే ఉద్దేశంతో హనుమ ‘దృష్టా సీతా’ అన్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఎందుకు, ఏం మాట్లాడాలో తెలిసినవాడు కావటం వల్లనే ఒక్కమాటతో వేలాది ప్రాణాలు నిలబెట్టాడు హనుమ. అదీ ఆ స్వామిలోని వాక్యకోవిదత్వం.

 

సీతమ్మ ప్రాణం కాచిన మాట

 

పదినెలల అశోకవనవాసం సీతమ్మను ఎంత కుంగదీసిందంటే – హనుమ రావడం రెండు నిముషాలు ఆలస్యమయితే ఆత్మహత్య చేసుకునేది.  అలాంటి సంక్షుభిత ఉద్విగ్న సమయాల్లో హనుమ మాట్లాడిన తీరు అనన్యసామాన్యం. బహుశా అలా మాట్లాడాలంటే దేవుడే దిగి రావాలి.

 

అంతకుముందు... తెల్లవారక ముందే రావణుడు వచ్చి నానా మాటలు అని వెళ్ళాడు. నరమాంస భక్షకులైన ఆడ రాక్షసుల గుండెలు గుచ్చుకునే మాటలు మరో వైపు. ఇక ఇన్ని కష్టాలు తట్టుకునే ఓపిక నశించింది సీతమ్మకు. తన కేశాలతో పాశం తయారుచేసుకుని, ఉరి వేసుకుని, ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుని, అందుకు సన్నద్ధమవుతోంది. ఇదంతా గమనిస్తున్నాడు పక్కనే చెట్టుమీద ఉన్న మారుతి.

 

సీతమ్మతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం. కానీ, ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడాలి...? ఆలోచించాడు హనుమ.

 

ఇంతదాకా సంస్కృతంలో రావణుడు అఘోరించి వెళ్ళాడు – కాబట్టి సంస్కృతంలో మాట్లాడితే మళ్ళీ రావణుడి మాయలే అనుకుంటుంది. అనేక భాషలు తెలిసినవాడే భాష ఎంపిక గురించి ఆలోచించగలడు. సీతమ్మ సొంత ఊరు మిథిలా నగరం. అయోధ్యలో మాట్లాడేది ప్రాకృత అవధి భాష.  కాబట్టి, అయోధ్యలో మాట్లాడే యాసతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు హనుమ. అంటే సీతమ్మ మెట్టినింటి భాష అన్నమాట. పూర్తిగా మన ఊరివారెవరో మాట్లాడుతున్నారని మొదటి మాటకే ఆమె ఉపశమనం పొందాలి. ఆ తరువాత....? ఏం చెబితే ఆమె ఇంకా నమ్ముతుంది? శాంతిస్తుంది? ఆలోచించాడు... రామకథనే ఎంచుకున్నాడు . అంతే మైథిలీ ప్రాకృత భాషలో రామగానం ప్రారంభించాడు. తన మాండలికంలో రామకథను వినగానే సీతమ్మకు పోయిన ప్రాణం తిరిగివచ్చినంత పనైంది.

 

క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమం అడగమన్నాడు – అన్నాడు హనుమ. అంటే ఆమె అడగకుండానే రాముడు క్షేమంగా ఉన్నాడని, ఆయనే తనను పంపాడని విన్నవించాడు. నువ్వెక్కడున్నావో తెలిసింది ఇక వెంటనే రాముడు వస్తాడు – అని అభయమిచ్చాడు.

 

మాటల్లో చెప్పలేనంత ఆపదలో ఉండి, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ మనిషిని ఎలా కాపాడాలో హనుమకు తెలిసినంత ఇంకెవ్వరీ తెలియదు అని ఘంటాపథంగా చెప్పడానికి ఈ ఘట్టమే ఉదాహరణ. నవ వ్యాకరణ పండితుడు, అనేక భాషలు తెలిసినవాడు కాబట్టే, సీతమ్మకు భాష ద్వారా దగ్గరయ్యాడు, రామదూతను అనే నమ్మకం కలిగించగలిగాడు.

 

హనుమ అంటే శబ్దబ్రహ్మ. ఆ స్వామి మాటకు మహోన్నతమైన శక్తి ఉంది. హనుమను మించిన పండితుడు లేడు. భుజబలంతో పాటు బుద్ధిబలమూ ఆ స్వామి అనుగ్రహం వల్ల లభిస్తుంది.

 

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548

 

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the Ind...