Thursday, August 29, 2019

గణనాధుడి తత్వ విశేషాలు వివరిస్తూ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రికలో రాసిన వ్యాసం


ఘన యోగపతి
మహా గణపతి ఆయన వదనం ఓంకారం...ఆయన మాట శ్రీకారం...ఆయన పూర్ణసృష్టికి సంకేతం. అతి గొప్ప ఆధ్యాత్మికతత్త్వం ఆయనదేనంటూ శాస్త్రాలు, ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. యోగ గణపతిగా ఆయన ప్రాధాన్యాన్ని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది.
‘త్వం మూలాధారే స్థితోస్మి నిత్యమ్‌...
త్వం యోగినో ధ్యాయంతి నిత్యమ్‌’.
మానవ శరీరంలోని మూలాధార స్థానంలో ఉండే దైవానివి నీవే... యోగులందరూ ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారని గణపతి అధర్వశీర్షం చెబుతోంది. యోగశాస్త్రంలో వినాయకుడిని మూలాధారచక్రానికి అధిష్ఠాన దేవతగా భావిస్తారు. మూలాధారం వద్ద సుషుమ్న నాడి మూడు చుట్టలు చుట్టుకుని, పైన పడగ కప్పుకొని ఉన్న పాములా ఉంటుందని పతంజలి వెల్లడించారు. యోగి తన సాధన ద్వారా సుషుమ్నను మేల్కొలుపుతాడు. దీంతో మిగిలిన అయిదు చక్రాలూ ఉత్తేజితం అవుతాయి. ఈ క్రియవల్ల హంసలా మనిషిలో సంచరించే ప్రాణవాయువు సహస్రార కమలాన్ని చేరుకుంటుంది. అప్పుడు ఆత్మ పరమాత్మ ఏకమవుతాయి. ఈ యోగప్రక్రియ మొత్తానికి సూత్రం మూలాధారం. ఆ చక్రానికి అధిష్ఠానదేవత గణపతి.
గజవదనం ఓంకారాన్ని సూచిస్తుంది. ‘అ’కారం నుంచి ‘క్ష’కారం వరకు ఉన్న అక్షరాలను కంఠం మొదలు చరణాల వరకు వివిధ అంగాలుగా భావించిన మన మహర్షులు ‘అక్షర గణపతి’ని ఆవిష్కరించారు. అక్షర స్వరూపమైన గణపతిని ఆరాధించడం అంటే అక్షరాల్ని ఉపాసించటమే అవుతుంది. అక్షరం అంటే నాశనం కానిది అని అర్థం. నాశనం లేనిది జ్ఞానం ఒక్కటే. గణపతి ఉపాసన అంటే జ్ఞానాన్ని ఉపాసించటమే అవుతుంది.
మన శరీరంలో సుషుమ్నతో పాటు ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి. వీటిలో ‘ఇడ’ బుద్ధికి, ‘పింగళ’ సిద్ధికి సంకేతాలు. సుషుమ్న ఎప్పుడూ ఇడ, పింగళతో కలిసే ఉంటుంది. అంటే, మూలాధార అధిపతి అయిన గణపతి సిద్ధి, బుద్ధితో కలిసి ఉంటాడన్నమాట. గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలు అనడంలో అంతరార్థకూడా ఇదే. మనలో ఉన్న దురాలోచనలు తొలగితే మంచి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మంచి బుద్ధి కలుగుతుందో అప్పుడు మనసు శాశ్వతమైన ముక్తిస్థానాన్ని కోరుకుంటుంది. గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి వస్తుంది. మోక్షం వైపు మనిషి సాధన జరుగుతుంది. గణపతి ఉపాసనలోని అంతరార్థం, ఆయన తత్త్వం ఇదే.  యోగశాస్త్రం ప్రకారం మానవశరీరంలోని మూలాధారంలో త్రికోణ యంత్రం ఉంటుంది. దానికి అధిపతి గణపతి కాబట్టి యంత్ర శాస్త్రంలోనూ ఆయనదే తొలిస్థానం
వ్యాసమహర్షి మహాభారతాన్ని రాసే నేర్పు గణపతికే ఉందని భావించాడు. గణపతి కూడా సరేనన్నాడు. అయితే, వ్యాసుడు ‘నేను చెప్పే ప్రతి శ్లోకాన్నీ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే రాయా’లంటూ నియమం పెట్టాడు.  వ్యాసుడు చెబుతూనే ఉన్నాడు. గణపతి రాస్తూనే ఉన్నాడు.. ప్రతి శ్లోకాన్నీ పూర్తిగా అర్థం చేసుకుంటూ. అలా పంచమ వేదమైన మహాభారతం ఆవిర్భవించింది. అద్భుతాలు జరగాలంటే ఏమరుపాటు పనికిరాదు. గొప్ప సన్నద్ధత, దృఢదీక్ష కావాలి. పనులు ప్రారంభించాక వచ్చే ఆటంకాలు చూసి బెదరిపోకూడదు. చివరదాకా పట్టుదలగా నిలవాలి. అప్పుడే విజయం వరిస్తుంది. విద్యార్థులకు ఉండాల్సిన ఈ లక్షణాలన్నిటినీ గణపతి ఆచరణాత్మకంగా అందించాడు.

మట్టితో ప్రాణ ప్రతిష్ఠ
ఆకాశం నుంచి వాయువు, అందులో నుంచి అగ్ని, దాని నుంచి నీరు, నీటి నుంచి భూమి ఏర్పడ్డాయి. జడ పదార్థమైన భూమి, చైతన్యం కలిగిన నీటితో కలిసి ప్రాణశక్తిని పొందుతుంది. ఆహార పదార్థాలు, ఓషధులు అందిస్తుంది. ఇలా ప్రాణ, జడశక్తుల కలయికతో సృష్టి సాగుతుందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేస్తారు. మట్టి గణపతిని పూజించడం, ఆ తర్వాత నిమజ్జనం చేయడం ఉత్తమ ఆచారంగా చెబుతారు.
ఒక్కడే... ఒక్కడే...
గణపతిని త్రిగుణాలకు అతీతుడుగా, త్రికాలాలకు (భూత, భవిష్యత్‌, వర్తమాన) అందనివాడుగా పంచభూతాలకు ఆత్మగా, సకల దేవతాస్వరూపుడిగా అధర్వణ వేదంలోని గణపతి అధర్వశీర్షం ప్రకటిస్తుంది. త్రిమూర్తులతో సహా పంచభూతాలూ ఆయన స్వరూపమే అంటోందీ స్తోత్రం. ‘ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ వరదమూర్తయే నమః’ ... గణపతి అధర్వ శీర్షంలో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రపాఠం ఇది.  స్తోత్రరూపంగా సాగే ఈ అధర్వశీర్ష పారాయణ వేగంగా ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.

ఆ గణపతి వేరయా...
‘ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన సృణ్వన్నూతిభిస్సీదసాదనం’ గణపతిని పూజించే మంత్రాల్లో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రం ఇది. రుగ్వేదం రెండో మండలంలో ఇది ఉంది. గణపతిని రాజుల్లో పెద్దవాడుగా, దేవతల్లో పూజలందుకునే మొదటివాడుగా, 33 కోట్ల దేవతాగణాలకు అధినాయకుడిగా వర్ణిస్తుంది రుగ్వేదం. గణాలకు నాయకుడిగా గణపతిని చెబుతోందే కానీ గజముఖ స్వరూపం గురించి ఈ వేదంలో కనిపించదు. మొత్తంగా గణపతి సర్వస్వతంత్ర, సర్వవ్యాపక, సర్వశక్తి సమన్వితుడైన దేవుడని సమస్త సాహిత్యం విస్పష్టంగా ప్రకటిస్తోంది. అశ్వమేధయాగంలో ఉపయోగించే ఒక మంత్రం ఉంది.
గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే / ప్రియానాం త్వా ప్రియపతిగ్‌ం హవామహే / నిధినాం త్వా నిధిపతిం హవామహే వసో మమ / అహమజానీ గర్భధమా త్వమజాసి గర్భధం..’ అంటూ సాగే ఈ మంత్రం హిరణ్యగర్భుడిగా ఉన్న ప్రజాపతిని ఉద్దేశించింది. ఇందులో ఎక్కడా గజముఖుడైన గణపతి ప్రస్తావన లేదు. మైత్రాయణీ సంహితలో ‘తత్‌ కరటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్‌’ అనే మంత్రం ఉంది. ఈ ఒక్కచోటే గజముఖుడి గురించి వేదాల్లో కనిపిస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు.

రాజాధిరాజా...నీకే తొలిపూజ!
సోమవారం వినాయక చవితి గణనాథుడు ఎక్కడున్నాడు? రంగురంగుల బొమ్మల్లోనా..? వ్రత కథా పుస్తకాలపైనా..? కాదు ఆయన మనలోనే ఉన్నాడు. మన అంతఃచేతనలో ఉన్నాడు. బుద్ధిలో ఉన్నాడు.మనకు కలిగే సిద్ధిలో ఉన్నాడు...మంచి హృదయంతో ఉండడమే సిసలైన ఆరాధన అని ఉద్బోధిస్తున్నాడు...

స్వరూపం ఇచ్చే సందేశం

ఏనుగు తల
జ్ఞ్థానానికి, యోగానికి సంకేతం
చేతిలోఉన్న పరశువు
అజ్ఞానాన్ని ఖండించే లక్షణంవిరిగిన దంతం
త్యాగానికి చిహ్నం
మనిషి శరీరం మాయకు, ప్రకృతికి చిహ్నం
పెద్ద చెవులు
ఎక్కువగా వినటం
చేతిలో ఉన్న పాశం
విఘ్న నివారణకు ప్రతీక
తొండం
ఓంకారం
నాగబంధం
శక్తికి, కుండలినికి సంకేతం
ఎలుక వాహనం
అన్ని జీవులపై సమభావనకు చిహ్నం

రచన : - Dr కప్పగంతు రామకృష్ణ, 9032044115

Saturday, August 3, 2019

స్నేహితుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడులో రాసిన వ్యాసం

నేస్తామంటే .. సమస్తం!
ఇవాళ ఫ్రెండ్‌షిప్‌ డే కదా... మన నేస్తాల్ని కలిసి శుభాకాంక్షలు చెప్పేస్తాం... ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టేస్తాం... రోజంతా సరదాగా గడిపేస్తాం... ఇది సరే... అసలు ఫ్రెండంటే ఎలా ఉండాలి? నిజమైన స్నేహితుడు ఎవరు? స్నేహం గొప్పదనం ఏంటి? ఆ మంచి మైత్రిని చూపిన కొన్ని స్నేహాలు మన పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్నాయ్‌...  మరి వాటి గురించి తెలుసుకుందామా!
అంతస్తుల తేడాల్లేవ్‌!
నిజమైన స్నేహితుల మధ్య ధనవంతుడు, పేదవాడు అన్న తేడా ఉండదు. చదువు పూర్తయి జీవితంలో ఉన్నతస్థానాలకు చేరుకున్నా చిన్ననాటి మిత్రుల్ని జ్ఞాపకం పెట్టుకుని, వారిని ఆదరించాలి.
శ్రీకృష్ణుడు, కుచేలుడు స్నేహితులని తెలుసుగా. వీరిద్దరూ సాందీప మహర్షి దగ్గర చదువుకుంటున్నప్పుడు ఓ రోజు హోమం చెయ్యటానికి అవసరమైన సమిధలు తేెవడానికి అడవికి వెళ్లారు. ఉన్నట్టుండి పెద్ద గాలీవానా. ఇద్దరూ అడవిలో చిక్కుకుపోయారు. అక్కడే ఉన్న ఓ చెట్టు కొమ్మల మీద ఇద్దరూ కూర్చున్నారు. కుచేలుడు తన కండువాలో మూట కట్టుకువచ్చిన అటుకులు తింటాడు. ‘కుచేలా! ఏం తింటున్నావు’ అంటూ కృష్ణుడు అడుగుతాడు. ‘ఏమీ లేదు చలికి నా దవడలు వణుకుతున్నాయి’ అని అబద్ధం చెబుతాడు కుచేలుడు. అంతలోనే తప్పు తెలుసుకుని తన దగ్గర ఉన్న కొన్ని అటుకుల్ని కృష్ణుడికి ఇస్తాడు. పేదవాడైన కుచేలుడు ఇచ్చిన అటుకుల్ని యువరాజైన కృష్ణుడు ఆప్యాయంగా తీసుకుంటాడు. గాలీవానా తగ్గాక మర్నాడు గురుకులానికి చేరుకుంటారు. తర్వాతికాలంలో కృష్ణుడు ద్వారకా నగరానికి రాజు అవుతాడు. చాలా సంవత్సరాల తర్వాత పేదరికంతో ఇబ్బందిపడుతూ తనను చూడటానికి వచ్చిన బాల్యస్నేహితుడు కుచేలుడిని ప్రేమగా పలకరించి, ఎన్నో మర్యాదలు చేస్తాడు. కుచేలుడికి సంపదలిచ్చి సాయపడతాడు. స్నేహానికి పేద, గొప్ప తేడాలేమీ ఉండవని నిరూపిస్తాడు.
త్యాగానికి చిరునామా!
స్నేహం ఒక రోజుతోనో, కొన్ని సంవత్సరాలతోనో తీరిపోయేది కాదు. మన నేస్తంతోపాటు అతడి కుటుంబానికి సైతం మిత్రులుగా ఉండాలి. అదే అసలైన స్నేహం అవుతుంది. మిత్రుడిని ఎంతగా ప్రేమిస్తామో అతడి కుటుంబ సభ్యులనూ అంతే ప్రేమగా ఆదరించాలి.
శ్రీరాముడి తండ్రి అయిన దశరథమహారాజు, జటాయువు ప్రాణ స్నేహితులు. యుద్ధాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. దశరథుడు మరణించిన తర్వాత అతడి కుమారుడైన రాముడినీ జటాయువు స్నేహితుడిగానే చూశాడు. వనవాసానికి వచ్చిన వెంటనే రాముడికి తనను తాను పరిచయం చేసుకున్నాడు జటాయువు. నా మిత్రుడిలాగే నిన్నూ కాపాడతానని మాట ఇచ్చాడు. రావణుడు సీతమ్మను అపహరిస్తున్నప్పుడు అతడితో ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. రెక్కలు తెగిపడిపోయినా రాముడు వచ్చేవరకు ప్రాణాలు బిగపట్టి నిలుపుకొన్నాడు. సీతమ్మ వివరాలు చెప్పి కన్నుమూశాడు. స్నేహమంటే త్యాగం. స్నేహమంటే ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మిత్రుడిని ఆదుకోవటం అనటానికి జటాయువు ఉదాహరణగా నిలిచాడు.
సాహస గుణం!
నేస్తానికిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ప్రాణత్యాగం చెయ్యటానికైనా సిద్ధపడటం స్వచ్ఛమైన స్నేహం.
రామాయణం వినే ఉంటారుగా. అందులో రావణాసురుడు అపహరించిన సీతమ్మ జాడ తెలుసుకునేందుకు తన వానర సైన్యాన్ని పంపిస్తానని రాముడికి మాట ఇస్తాడు సుగ్రీవుడు. అప్పటిదాకా తన రాజ్యంలోనే ఉండమంటాడు. కొంతకాలానికి సీతమ్మ లంకలో ఉన్నట్లు సమాచారం వస్తుంది. ఒకరోజున రాముడికి చెప్పకుండా సుగ్రీవుడు ఆకాశమార్గాన లంకకు చేరి రావణుడితో కయ్యానికి సిద్ధపడతాడు. రావణుడి పరాక్రమానికి తట్టుకోలేక తిరిగి కిష్కింధకు చేరుకుంటాడు. విషయం తెలుసుకున్న రాముడు మిత్రుడైన సుగ్రీవుడు చేసిన సాహసానికి ఎంతో ముచ్చటపడతాడు. అయితే, ప్రాణాల మీదకు తెచ్చుకునే ఇలాంటి దుస్సాహసం ఇకమీదట ఎప్పుడూ చెయ్యవద్దంటాడు. అవసరమైతే అయోధ్యను వదులుకుంటానని, స్నేహితుడి కన్నా తనకు లోకంలో మరెవ్వరూ ఎక్కువ కాదంటాడు. ఇకమీదట ఇలాంటి పనులు చెయ్యనని సుగ్రీవుడి దగ్గర మాట తీసుకుంటాడు.
తోడూనీడా!
స్నేహం అంటే కలిసి తిరగటం, కబుర్లు చెప్పుకోవటం  కాదు. మిత్రుడికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగా భావించి, దాన్నుంచి బయటపడటానికి సాయం చెయ్యాలి. నిరాశలో కూరుకుపోతే ధైర్యం చెప్పాలి. కర్తవ్యం వైపు ప్రోత్సహించాలి.
మహాభారతంలో కౌరవ పాండవుల మధ్య యుద్ధానికి అంతా సిద్ధంగా ఉంది. రెండు వైపులా వీరులంతా యుద్ధరంగానికి చేరుకున్నారు. అర్జునుడి సారథిగా ఉన్న అతడి ప్రాణమిత్రుడు కృష్ణుడు రథాన్ని నేరుగా యుద్ధరంగంలోకి తీసుకువస్తాడు. యుద్ధరంగంలో కౌరవుల పక్షంలో ఉన్న తన బంధువులు, మిత్రుల్ని చూసి అర్జునుడు కలత చెందుతాడు. యుద్ధం చెయ్యలేనంటూ రథం దిగిపోతాడు. గొప్ప పరాక్రమవంతుడైన తన మిత్రుడు అర్జునుడు పిరికివాడిలాగా యుద్ధరంగం నుంచి పారిపోవటం కృష్ణుడికి ఏమాత్రం నచ్చదు. యుద్ధం ఎందుకు చెయ్యాలో, చెయ్యకపోవటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో అన్నీ చక్కగా వివరిస్తాడు. నిరాశ వదిలిపెట్టాలని, సరైన సమయంలో ధైర్యం కోల్పోతే లక్ష్యాన్ని సాధించలేమంటూ బోధిస్తాడు. అర్జునుడిలో ఉన్న విచారం, నిరాశ అన్నీ కృష్ణుడి మాటలతో తొలగిపోతాయి. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తాడు.
- కప్పగంతు రామకృష్ణ
04.09.2019


Thursday, August 1, 2019

గరుత్మంతుడి విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రికలో రాసిన వ్యాసం

వేద వీధుల్లో విహంఘనుడు!
ఈనెల 5 గరుడ పంచమి
మహోన్నతమైన శక్తికి...
అంతులేని భక్తికి ప్రతీక గరుడుడు.
ప్రహ్లాదశ్చామి దైత్యానాం
కాలః కలయతామహం ।
మృగాణాంచ మృగేంద్రోహం
వైనతేయశ్చ పక్షిణాం ।।
‘పక్షుల్లో గరుత్మంతుడు నేనే’ - శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్పిన మాట ఇది.
ఇంతకుమించి గరుత్మంతుడి ఘనత చెప్పడానికి మరొక ఉదాహరణ అవసరం లేదు.
మరెవ్వరితో పోల్చలేనంత బలం గరుత్మంతుడి సొంతం. కేవలం తన రెక్కలు విసిరి రాక్షసుల ప్రాణాలు సంహరించే మహత్తరశక్తి అతనికి ఉంది. గరుడవేగం అందుకోవడం మరే ఇతర ప్రాణికీ సాధ్యం కాలేదని పురాణవచనం. శ్రీహరి వాహనంగా, దాసుడిగా మాత్రమే కాదు... తల్లిని దాస్యం నుంచి విడిపించిన గొప్ప పుత్రుడిగా గరుత్మంతుడు నేటితరానికి మార్గదర్శకుడు. శ్రావణ శుద్ధ పంచమి గరుత్మంతుడు పుట్టిన రోజు. ఆ రోజును గరుడ పంచమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయనను అర్చించిన వారికి సర్పబాధల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
గరుత్మంతుడి పేరుతో అధర్వణవేదంలో ప్రత్యేకంగా ‘గరుడోపనిషత్తు’ ఉంది. ఇందులో గరుత్మంతుడిని ‘విషదహారి’ అనే పేరుతో ప్రత్యేకంగా వివరించారు. గœరుత్మంతుడి విగ్రహ స్వరూపం కూడా ఇందులో ఉంది. దీని ప్రకారం... గరుత్మంతుడు తన కుడిపాదాన్ని స్వస్తికంగా, ఎడమపాదాన్ని కుంచితంగా ఉంచి విష్ణువుకు నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు. ఆభరణాలుగా శ్రేష్ఠమైన జాతికి చెందిన నాగుల్ని ధరిస్తాడు. వాసుకి అనే సర్పాన్ని యజ్ఞోపవీతంగా, తక్షకుడిని నడుముకు సూత్రంగా, కర్కోటకుడిని మెడలో హారంగా ధరిస్తాడు. కుడిచెవికి పద్ముడిని, ఎడమచెవికి మహాపద్ముడిని కుండలాలుగా పెట్టుకుంటాడు. శిరస్సుపై శంఖుడు, భుజాల మధ్య గుళికుడు అలంకారాలుగా ఉంటారు. ఇతర ఆభరణాలు కూడా సర్పాలే. అతడికి పొడవైన బాహువులు, పెద్ద మూపు, వంద చంద్రుల కాంతివంతమైన ముఖం ఉంటాయి. గరుత్మంతుడిని ధ్యానించడం, అర్చించటం వల్ల కలిగే ఫలితాలు ఈ ఉపనిషత్తులో ఉన్నాయి.
పక్షిజాతిలో మరెవ్వరికీ దక్కనిది, గరుత్మంతుడికి మాత్రమే దక్కిన ఘనత అతని పేరుతోనే ఒక పురాణం ఏర్పడటం. వ్యాసమహర్షి రాసిన 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి ఉపదేశించిన ధర్మ రహస్యాలన్నీ ఇందులో ఉంటాయి. ఇలా ఒక సేవకుడు, పక్షిజాతికి చెందిన వ్యక్తిపేరుతో ఉన్న ఒకే ఒక పురాణం ఇది.
గరుత్మంతుడి పరాక్రమానికి, శక్తికి ప్రతీకగా నిలిచే ఘట్టం రామాయణంలో ఉంది. ఇంద్రజిత్తు నాగాస్త్ర ప్రయోగంతో రామలక్ష్మణులిద్దరూ మూర్ఛపోతారు. నాగపాశాల నుంచి వారిని విడిపించటం ఎవరివల్లా కాలేదు. ఇంతలో గరుత్మంతుడు మహాప్రభంజనంగా దేవలోకం నుంచి వస్తాడు. అతడు వస్తున్నప్పుడు వీచిన గాలికి సముద్రం అల్లకల్లోలమవుతుంది. అతడు రామలక్ష్మణులను సమీపించటంతోనే వారిని బంధించిన నాగపాశాలన్నీ విడిపోతాయి. గరుడుడి స్పర్శతో క్షణకాలంలో గాయాలు మాని, వారిద్దరికీ దివ్యతేజస్సు కలుగుతుంది. గరుత్మంతుడే ఆదుకోకపోతే రామాయణం ఏ మలుపు తిరిగేదో?
తిరుమల కొండపై శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో అగ్రతాంబూలం గరుత్మంతుడిదే. శ్రీవారి ఉత్సవాల ప్రారంభసూచకంగా గరుడ చిత్రం ఉన్న పతాకాన్ని అర్చకస్వాములు ఎగురవేస్తారు. ఉత్సవాలకు రావాల్సిందిగా ముక్కోటి దేవతల్ని ఆయనే ఆహ్వానిస్తాడు. అలాగే, బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహనసేవల్లో గరుడ వాహనసేవ ఎంతో ప్రత్యేకమైంది. దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా... ఇలా తన జీవిత సర్వస్వాన్నీ శ్రీహరి సేవకు అంకితం చేసిన దాసోత్తముడైన ఆయనను వైష్ణవ సంప్రదాయంలో గరుడాళ్వార్‌ పేరుతో కొలుస్తారు.
అన్నమాచార్యులు  తన సంకీర్తనల్లో అనేక చోట్ల ఈ పక్షీశ్వరుని స్తుతిస్తాడు. ‘గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పురుషులదివో వచ్చి పై పై సేవించెను’ అంటూ నల్లనిస్వామి వివాహ వేడుకల వైభవానికి ఆయన కూడా ఓ కారణమంటాడు అన్నమయ్య.
ప్రతి వ్యక్తీ రాత్రి నిద్రపోయే ముందు
రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం ।
శయనే యఃపఠేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి ।।
శ్లోకాన్ని చదువుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. రాముడు, సుబ్రహ్మణ్యస్వామి, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు - వీరిని తలుచుకుంటే దుస్వప్నాలు కలగవని దీని భావం. మనిషికి కలిగే బాధను తీర్చే శక్తి పక్షికి ఉండటం గమనించదగిన విశేషం.
థాయ్‌లాండ్‌ దేశంలో శతాబ్దాల కాలంగా గరుత్మంతుడి ఆరాధన వ్యాప్తిలో ఉంది. ఇప్పటికీ అక్కడి అనేక చిత్రాల్లో గరుత్మంతుడి ఆకారం ప్రతిబింబిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి అక్కడి ప్రభుత్వం తమ జాతీయచిహ్నంగా గరుత్మంతుడి చిత్రాన్ని ఎంపిక చేసుకుంది. థాయ్‌లాండ్‌ విమానయాన సంస్థలు తమ విమానాలకు ‘గరుడ’ అనే పేరు పెట్టుకున్నాయి.
- కప్పగంతు రామకృష్ణ
ఆదికావ్యం రామాయణం శ్రీకారం చుట్టుకోవటానికి కారణం క్రౌంచపక్షి.
సీతమ్మ జాడను రామయ్యకు, వానరులకు చెప్పిన జటాయువు, సంపాతి పక్షి జాతికి చెందినవారే.
కృష్ణపరమాత్మ అందానికే అందం తెచ్చిన పింఛం నెమలిది.
తన కూతతో లోకాన్ని మేల్కొలిపేది, కార్యోన్ముఖులను చేసేది కోడి.
ఇలా ఎన్నో సందర్భాల్లో పక్షులు మనిషికి అండగా, ఆదర్శంగా ఉంటూ తమదైన అస్తిత్వాన్ని, ప్రత్యేకతను ప్రకటిస్తాయి.
ఖాండవవనంలో మమకారాలు...
కృష్ణార్జునుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తుంటాడు. అప్పుడే పుట్టి, ఇంకా రెక్కలు రాని తన బిడ్డలతో అదే వనంలోని ఓ చెట్టుమీద ‘లావుక’ పక్షి జాతికి చెందిన జరిత నివాసం ఉంటుంది. భర్త మందపాలుడు అదే సమయంలో బయటకు వెళతాడు. అగ్నిదేవుడి తీవ్రరూపం చూసి, తనకు తన బిడ్డలకు మరణం తప్పదని భయపడుతుంది జరిత. తన ప్రాణం పోయినా బిడ్డల్ని కాపాడుకోవాలనుకుంటుంది. అక్కడే ఉన్న ఓ బిలంలోకి బిడ్డల్ని వెళ్లమంటుంది. అందుకామె పెద్ద కుమారుడు జరితారి ‘అమ్మా! మా ప్రాణాలు పోయినా ఫ£ర్వాలేదు. నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపో. నువ్వు జీవించి ఉంటే సంతానాన్ని మళ్లీ పొందడం ద్వారా మన జాతి నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ భగవంతుడి దయ వల్ల మేం బతికితే తిరిగి ఇక్కడకు వద్దువుగాని’ అంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మందపాలుడు అగ్నిదేవుడిని ప్రార్థించడంతో వారు నివసిస్తున్న చెట్టును దహించకుండా వదిలేస్తాడు. దీంతో ఆ పక్షి కుటుంబం మొత్తం క్షేమంగా ఉంటుంది. ఈ తల్లీబిడ్డల అనురాగాలు, ఆప్యాయతలు, కుటుంబ సంబంధాలను మనుషులు ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూ నన్నయ తన మహాభారతం ఆదిపర్వంలో ఈ కథను రాశారు.
రామయ్యా... నేనున్నానయ్యా!
ఎంత వెతికినా సీతమ్మ జాడ తెలియకపోవటంతో నిరాశకు గురైన హనుమంతుడి బృందం ప్రాయోపవేశం చెయ్యాలని నిశ్చయించుకుంటుంది. వారి మాటల మధ్యలో జటాయువు ప్రస్తావన వస్తుంది. ఇదంతా గమనిస్తూ ఆ పక్కనే ఉన్న సంపాతి తన తమ్ముడు జటాయువు మరణవార్త విని ఒక్కసారిగా భోరున విలపిస్తాడు. రెక్కలు తెగిన కారణంగా ఎగరలేని స్థితిలో ఉన్న సంపాతి వానరులను తన వద్దకు పిలిపించుకుని జరిగిన విషయమంతా తెలుసుకుంటాడు. ఉత్తమశ్రేణి పక్షిజాతికి చెందిన తాను చాలా దూరం చూడగలనని చెబుతూ, లంకలో సీతమ్మ తనకు కనిపిస్తోందని, అక్కడకు చేరుకుని సీతమ్మకు ధైర్యం చెప్పాలని అనేక సూచనలు చేస్తాడు.. దీంతో వానరులకు ఉత్సాహం కలుగుతుంది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి నుంచి కార్యసాధనకు మార్గం దొరుకుతుంది. రామకార్యంలో భాగం పంచుకున్న పుణ్యానికి సంపాతికి రెక్కలు వస్తాయి. మానవుడు చెయ్యలేని మహత్తరమైన పనిలో పక్షిజాతి భాగం పంచుకుంది.
చిలుక చెప్పిన వేదం
వేదవ్యాస మహర్షి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతడికి గొప్ప జ్ఞాన సంపన్నుడైన పుత్రుడు జన్మిస్తాడని వరమిస్తాడు. ఒకసారి వ్యాసుడు అరణిని మధిస్తున్న సమయంలో అటుగా వచ్చిన ఘృతాచి అనే అప్సరసను చూసి ఆమెను తీవ్రంగా కోరుకుంటాడు. మహర్షి తనని శపిస్తాడేమోనని భయపడిన ఘృతాచి చిలుక రూపం ధరించి ఎగిరిపోతుంది. ఆ సమయంలో స్కలించిన వేదవ్యాసుడి వీర్యం నుంచి చిలుక ముఖంతో శుకమహర్షి జన్మిస్తాడు. పుట్టుకతోనే వేదాంతిగా ఉన్న శుకుడు తర్వాతి కాలంలో భాగవతాన్ని ఏడురోజుల్లో పరీక్షిత్తుకు ఉపదేశించి అతడు మోక్షాన్ని పొందేలా చేస్తాడు. మానవజాతి తరించే సులభమార్గాన్ని ఉపదేశించటానికి కారణమైంది పక్షిజాతికి చెందిన చిలుక.
త్రిగయల్లో కుక్కుట ధ్వజం!
గయాసురుడిని సంహరించడం కోసం బ్రహ్మదేవుడు అతడి శరీరాన్నే వేదికగా చేసుకుని గొప్ప యజ్ఞం ప్రారంభిస్తాడు. ముందుగా చేసుకున్న నియమం ప్రకారం యజ్ఞం పూర్తికాకుండా కదిలితే ఆ రాక్షసుడిని త్రిమూర్తులు సంహరిస్తారు. యజ్ఞం పూర్తికావస్తున్నా రాక్షసుడు ఏమాత్రం కదలకుండా నిశ్చలంగా ఉంటాడు. ఇది గమనించిన పరమేశ్వరుడు కుక్కుట (కోడి) రూపంలో కూత కూస్తాడు. దీంతో సమయం ముగిసిందని భావించిన గయాసురుడు కదులుతాడు. నియమభంగం కావడంతో త్రిమూర్తులు అతడిని పాతాళానికి తొక్కేస్తారు. గయాసురుడి శిరస్సు, నాభి, పాద ప్రాంతాలు మహాపుణ్యక్షేత్రాలుగా ఏర్పడతాయి. పరమేశ్వరుడు కుక్కుటేశ్వరుడిగా అవతరిస్తాడు. ఈ ప్రాంతమే పాదగయగా (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం)గా ప్రసిద్ధి పొందింది. రాక్షసుడి సంహారానికి, గొప్ప క్షేత్రం ఆవిర్భవించటానికి పక్షిజాతికి చెందిన కోడి సహాయం అవసరమైంది.

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...