Thursday, July 30, 2020

వరలక్ష్మీవ్రత విశేషాలతో ఈనాడు దినపత్రిక మకరందం పేజీ (30.07.2020)లో నేను రాసిన వ్యాసం




శ్రీమంతులవ్వండి. ...

ఆమె ఐశ్వర్యానికి ప్రతీక.


లక్ష్మి అంటే మనం రోజువారీ వ్యవహారంలో ఉపయోగించే డబ్బు మాత్రమే కాదు. ఆనందం, ఆత్మసంతృప్తి, చక్కటి సంతానం, సంస్కారం,  చదువు... ఇవన్నీ లక్ష్మీరూపాలే. ఆ తల్లి అనుక్షణం కొలువుండే ప్రాంతాలే. మనిషి జీవితం సాఫీగా గడవాలన్నా, జీవించామన్న సంతృప్తి కలగాలన్నా, తలపెట్టిన పని విజయవంతం కావాలన్నా అందుకు లక్ష్మీ అనుగ్రహం తప్పనిసరి. అందుకే చెట్టు పుట్టా, రాయి రప్పా అన్నిటిలోనూ లక్ష్మీదేవిని చూశారు మన పూర్వికులు. అపారమైన ప్రకృతి అంతా లక్ష్మీ స్వరూపమే. 
కేవలం డబ్బు మాత్రమే అన్ని సుఖాలు ఇవ్వలేదు. అన్ని పనులూ సాధించలేదు. ధనం లేకపోయినా నిండు నూరేళ్లు తృప్తిగా జీవించే వ్యక్తులు ఎందరో ఉన్నారు. నిజమైన ఆనంద లక్ష్మి వారి దగ్గర ఉంది. కోట్లు గడించిన బిక్కు బిక్కుమంటూ ప్రతి క్షణాన్ని భయంభయంగా గడిపేవారూ ఉన్నారు. ధైర్యలక్ష్మి వారి దగ్గర లేదు. అందుకే లక్ష్మిని ఆరాధించాలి. ఆ తల్లి అనుగ్రహం కోసం తపించాలి. ఆమెను ఆహ్వానించాలి. 
తనను కావాలని కోరుకునే వ్యక్తుల దగ్గర, శుచి శుభ్రత ఉన్నచోట మాత్రమే తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి చెప్పినట్లు శాస్త్రాలు ప్రకటిస్తున్నాయి. మర్యాద, మన్నన, ఆచారం, సంప్రదాయం... ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే మనవైన ఆచార సంప్రదాయాల్ని, శాస్త్రం చెప్పిన ధర్మాల్ని తప్పక పాటించాలి. అటువంటి చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. 
మన ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి. అవేమిటంటే... 
సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల నిత్యం గడపలను పసుపు, కుంకుమతో అలంకరించాలి.
ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారు జామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి.
ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం తగవులాడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు. 
అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి దేవి ఉండదు.
ఉదయం, సాయంత్రం సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లోని దేవతామందిరంలో, ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యదీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది.
అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మిదేవి ఉండదు. 
చిల్లర పైసలు, అన్నం, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు.
శంఖధ్వని వినిపించని చోట,  తులసిని పూజించని చోట,  దేవతలను అర్చించని చోట,  బ్రహ్మవేత్తలు , అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు.  
భక్తులను హింసించేవారు, నిందించేవారు ఉన్నచోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు. 

లక్ష్మీ నివాస స్థానాలు


మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి... పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ఆభరణాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కళశాలు, ఆవు పేడ, ఆవు పృష్ట స్థానం, ఆవు కొమ్ముల మధ్యన, పూజా మందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, మునులు, ఋషులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు .

శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. వీటిలోని 16వ మంత్రం... ‘యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్‌...’ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలని ఈ మంత్రానికి  భావం. ఎక్కడ శుచిత్వం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా ధనమే. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు.   

విశ్వమంతా లక్ష్మీ స్వరూపం

ప్రతి స్త్రీలోనూ లక్ష్మీకళ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే స్త్రీలను లక్ష్మీస్వరూపంగా ఆరాధించటం, అర్చించటం మన సంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నతస్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతరులతో పనులు చేయిస్తుంది. తాను స్వయంగా చేస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. అందుకే స్త్రీ రూపంలో లక్ష్మికి మన సంస్కృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది. అనంతవిశ్వాన్ని 'లక్షించేది' లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. 'లక్షించటం' అంటే చూడటమని అర్థం అందరినీ తన కరుణామృతపూర్ణమైన చల్లని చూపులతో 'కనిపెట్టుకుని', గమనించి, పాలించే శక్తిని లక్ష్మిగా చెప్పుకోవచ్చు. సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్ని, 'లక్ష్యం'గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే 'లక్ష్మి’.  

కోర్కెలు తీర్చే వరలక్ష్మి

ప్రతి వ్యక్తికీ అనేక కోరికలు ఉంటాయి. ఇవన్నీ తీరాలన్నా లేదా కనీసం ఒక్క కోరిక తీరాలన్నా దైవానుగ్రహం తప్పనిసరి. అయితే కోరిక ఏదైనప్పటికీ, ఇచ్చే దైవం ఎవరైనప్పటికీ అంతిమంగా ఆ కోరికల్లో ఉండేది లేదా ఆ కోరికల ద్వారా అందుకునేది ఆనందం, తృప్తి మాత్రమే. ఈ విధమైన సంతృప్తి పొందిన వ్యక్తి మాత్రమే నిజమైన భాగ్యవంతుడు. అటువంటి భాగ్యాన్ని (లక్ష్మిని) అందించేది వరలక్ష్మీదేవి. వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత 'వరలక్ష్మీదేవి. 'వర' అంటే 'కోరుకున్నది’, ‘శ్రేష్టమైన' అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని సమంత్రకంగా, భక్తి భావనతో కొలిచే వ్రతమే 'వరలక్ష్మీవ్రతం

స్కాంద పురాణంలో వరలక్ష్మీ వ్రతం గురించిన వివరణ ఉంది. స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెబుతాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా పరమేశ్వరుడు పార్వతికి వివరిస్తాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలతో కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వరలక్ష్మీ వ్రత ప్రసాదంగా అందుకుంటుంది. 

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి, ఈ వ్రతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతాన్ని శ్రావణమాసంలో ఆచరిస్తారు. శ్రావణమాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది. శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం. పూర్ణిమ రోజున అమ్మవారు షోడశకళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. వీటన్నిటినీ సమన్వయం చేస్తే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహం పొందటానికి తొలిసోపానంగా చెప్పుకోవచ్చు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా తాము జీవితకాలం ఉండాలని కోరుకుంటా దేశవ్యాప్తంగా మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు దేశ, కాల, ప్రాంత, ఆచారభేదాలు ఉన్నప్పటికీ అందరి అంతరంగంలో కొలువై ఉన్న మాత ఒక్కరే. ఆమె అందరినీ అనుగ్రహించే తీరు ఒక్కటే.

పంచభూతాలకు ప్రతీక


వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి. కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టిపాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహపాత్రలను కలశం కోసం ఉపయోగించవవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం అందులో పోసే నీరు జల తత్త్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్ని తత్త్వానికి సంకేతం. ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్త్వం, శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.








Thursday, July 23, 2020

నాగుల గురించిన విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో (23.07.2020) రాసిన వ్యాసం



భజేహం... భుజంగం 

శ్రీమహావిష్ణువును శేషశయనుడిని చేసింది సర్పాలే. 
గరళకంఠుడిగా శివయ్యకు పేరుతెచ్చిందీ సర్పాలే. 
సూర్యభగవానుడి రథానికి సర్పాలే పగ్గాలు.
బొజ్జ గణపయ్యకు యజ్ఞోపవీతంగా మారిన ఘనత సర్పాలదే. 
కుజగ్రహానికి సర్పాలే కుదురులు. 
శనిదేవుడికి సర్పమే ఆయుధం. 
క్షీరసాగర మథనంలో మందరపర్వతాన్ని చిలికే తాడుగా మారి అమృతావిర్భావానికి కారణమైందీ సర్పాలే. 
మొత్తంగా సర్పాలు భారతీయ సంస్కృతిలో ఒక భాగం. చాలా కుటుంబాల్లో సర్పాలను కులదేవతలుగా ఆరాధించే ఆచారం ఉంటుంది. పురాణాలు, ఇతిహాసాల్లో కూడా నాగుల వైశిష్ట్యం విస్తారంగా వర్ణితమై ఉంది. భారత, భాగవతాలు సర్పాలకు సంబంధించిన విషయాలతోనే ప్రారంభమవుతాయి. ఎన్నో పండుగలు, మరెన్నో ఆచారాలు, సంప్రదాయాలు కూడా సర్పాలకు సంబంధించిన విషయాలతోనే ఏర్పడ్డాయి.
    వేదసంహితల్లో అనేకచోట్ల నాగులకు సంబంధించిన ప్రస్తావన ఉంది. 'నమో అస్తు సర్పేభ్య: యేకేచ పృథివీ మను | యే అంతరిక్షే యే దివితేభ్యః సర్పేభ్యః నమ:' (కృష్ణయజుర్వేదం, 42) - భూమి నుంచి ఆకాశం వరకు గల అన్ని లోకాల్లో వ్యాపించి ఉన్న నాగులన్నిటికీ నమస్కారం అంటుంది వేదం. మనం సాధారణంగా భూమి మీద పాకే పాముల్ని మాత్రమే చూస్తాం. కానీ ఆకాశంలో, గాలిలో సంచరించే సర్పాలు కూడా ఉన్నాయంటూ, వాటి గురించి వేదాలు ప్రస్తావన చేస్తాయి. ప్రత్యేకించి, యజుర్వేదంలో అనేక మంత్రాలు, 'సర్పసూక్తం' పేరుతో ప్రత్యేకంగా నాగులకు సంబంధించిన మంత్రాలు కూడా ఉన్నాయి. వేదాలతో పాటు పురాణ ఇతిహాసాల్లో నాగులకు సంబంధించిన కథలు విస్తారంగా ఉన్నాయి. వీటిలో కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కద్రువలకు సంబంధించిన కథ బాగా ప్రసిద్ధి పొందింది.

మహాభారత గాథ

    పాములకు ప్రాణదానం చేసిన ఆస్తికుడి కథ భారతంలో ప్రసిద్ధి పొందిన ఉపాఖ్యానాల్లో ఒకటి. ఇతడు జరత్కారి అనే నాగజాతి స్త్రీకి జన్మించాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు. శాపం కారణంగా పరీక్షిన్మహారాజు పాముకాటుతో మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజేయుడు సర్పజాతి మొత్తం నాశనం కావాలనే సంకల్పంతో సర్పయాగం ప్రారంభిస్తాడు. మంత్రబలం వల్ల ఎక్కడెక్కడో ఉన్న పాములన్నీ యాగాగ్నిలో పడి దగ్ధం అవుతుంటాయి. తన ప్రాణాలు కాపాడమంటూ సర్పరాజైన తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయిస్తాడు. విషయాన్ని గ్రహించిన జనమేజయుడు 'స మహేంద్ర తక్షకాయ స్వాహా' అంటూ మంత్రం పఠించే సరికి దేవేంద్రుడి పీఠమే కదలి యాగస్థలికి వస్తుంది. దీంతో దేవేంద్రుడు కూడా భీతి చెందుతాడు. మరోపక్క నాగజాతి నాశనం కావటాన్ని తట్టుకోలేని మిగిలిన నాగజాతి ప్రముఖులు జనమేజయుడు యాగాన్ని ఆపించటానికి ఆస్తికుడు మాత్రమే సమర్థుడని, అతడిని పంపించవలసిందిగా తండ్రి జరత్కారుడిని కోరతారు. తండ్రి అజ్ఞ ప్రకారం ఆస్తీకుడు జనమేజేయుడి యాగస్థలికి వెళ్లి, తన నేర్పరితనం, విద్యతో జనమేజయుడు మెప్పించి, యాగాన్ని నిలుపుదల చేయిస్తాడు. ఆస్తీకుడు వైదుష్యానికి మెచ్చిన జనమేజేయుడు అతడిని సత్కరించటానికి సిద్ధపడతాడు. 'సర్పహింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం' అంటాడు ఆస్తీకుడు. జనమేజేయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు.

    శ్రావణమాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకోవటం ఆనవాయితీ.  నాగపంచమి పూజావిధానంలో పంచమికి ముందురోజు నుంచే అంటే చవితి నుంచే పంచమి పూజకు సంబంధించిన  పూజా విధానాలు ప్రారంభించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. స్కంద పురాణంలో ఇందుకు సంబంధించిన విషయాలు విస్తారంగా ఉన్నాయి. పార్వతీదేవికి సాక్షాత్తు పరమేశ్వరుడు నాగపంచమి వైశిష్ట్యాన్ని వివరించినట్లు ఇందులో ఉంది. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతడిని ఏదైనా వరం కోరుకొమ్మని అడిగితే, తాము (సర్పజాతి) ఆవిర్భవించిన రోజున సృష్టిలోని మానవులంతా తమకు పూజ చేసేలా అనుగ్రహించమని అడిగాడు. విష్ణుమూర్తి అనుగ్రహించాడు. ఈ వరం కారణంగా శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకునే ఆచారం వ్యాప్తిలోకి వచ్చింది.
    వర్షాకాలంలో పాములు పుట్టల్లోంచి బయటకు వచ్చి, సంచరిస్తాయి. ఈ సమయంలో పాములు పంటల్ని నాశనం చేసే క్రిమికీటకాల్ని తింటూ రైతుకు పంటనష్టం కలగకుండా పరోక్షంగా సహాయం చేస్తాయి. పుట్టవల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. ఏదైనా కారణం వల్ల క్రమంగా పాముల మనుగడ కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. ఈవిధంగా పంటలకు మూలం పాములు కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తారు. పంటలు బాగా పండే శ్రావణమాసంలో నాగులను పూజించే ఆచారం ఏర్పడటానికి ఇదొక కారణం కావచ్చు.
నాగపంచమి రోజున గరుడ పంచమి జరుపుకునే ఆచారం కూడా వ్యాప్తిలో ఉంది. తన తల్లిని (వినత) దాస్యం నుంచి విముక్తిరాలిని చెయ్యటం కోసం గరుత్మంతుడు స్వర్గంలో ఉన్న అమృతాన్ని తెచ్చి పినతల్లి కద్రువ కుమారులైన సర్పాలకు ఇస్తాడు. అమృతాన్ని సాధించటం కోసం గరుత్మంతుడు చేసిన భీకరమైన పోరాటానికి, అతని మాతృభక్తికి చిహ్నంగా అతడు అమృతాన్ని తెచ్చిన శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమి జరుపుకునే ఆచారం ఏర్పడింది

నాగులకు పాలెందుకు?

పాలు స్వచ్ఛతకు ప్రతీక. పాలను వేడిచేసి, చల్లబరిచి, దానికి కొద్దిగా మజ్జిగ చేరిస్తే పెరుగు అవుతుంది. పెరుగును చిలకగా వచ్చిన మజ్జిగ నుంచి వచ్చే వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది. ఇలా వచ్చిన నేతిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అదేవిధంగా, మన బతుకనే పాలను, జ్ఞానం అనే వేడితో కాచి, వివేకం అనే మజ్జిగ కలిపితే, సుఖం అనే పెరుగు తయారవుతుంది. ఈ పెరును ఔదార్యం అనే కవ్వంతో చిలికితే శాంతి అనే మజ్జిగ లభిస్తుంది ఈ మజ్జిగను సత్యం, శివం, సుందరం - అనే మూడు వేళ్లతో కాస్త మంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగం, యోగం, భోగం అనే మూడు రకాల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాల సారం. సకల జీవన సారమైన పాలను జీవనానికి ప్రతీక అయిన నాగులకు అర్పించటంలోని అంతరార్థం.

యోగశాస్త్రంలో సర్పారాధన

యోగశాస్త్రంలో మనిషి శరీరాన్ని పాముపుట్టతో పోలుస్తారు. ఈ పుట్టకు తొమ్మిది కలుగులు (రంధ్రాలు) ఉంటాయి. వీటినే నవరధ్రాలు అంటారు. ఈ నవరంధ్రాల శరీరం అనే పుట్టలో కామ, క్రోధ, లోభ, మోహ మద, మాత్సర్యాలనే సర్పాలు బుసలు కొడుతూ ఉంటాయి. అరిషడ్వర్గాలనే ఈ సర్పాల కారణంగా మనిషిలో విపరీత ప్రవర్తనలు ఏర్పడతాయి. వీటిని అణచటానికి యోగ సాధన చెయ్యాలి. ఈ సాధన మనిషిలో ఉండే షట్చక్రాల్లో మొదటిదైన మూలాధార చక్రం నుంచి ప్రారంభమవుతుంది. మూలాధార చక్రం వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది. ఈ చక్రం వద్ద కుండలినీ శక్తి సర్పాకారంలో ఉంటుంది. అందువల్లనే వెన్నుపూసను వెన్నుపాము అంటారు. యోగపరిభాషలో వెన్నుపూసను సుషుమ్న నాడి అంటారు. ఈ నాడిని అనుసరించి ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి. మూలాధారం నుంచి భ్రూమధ్యం వరకు ఇవి వ్యాపించి ఉంటాయి. మూలాధారం వద్ద సుషుమ్న నాడి మూడు చుట్టలు చుట్టుకుని, పైన పడగ కప్పుకుని ఉన్న పాము వలే ఉంటుంది. ఇదే కుండలినీ శక్తికి స్థానం. యోగసాధన ద్వారా కుండలినీశక్తిని జాగృతం చెయ్యటం ద్వారా ఉపాసన ప్రారంభమవుతుంది. కుండలినీశక్తి చైతన్యవంతం అయితే మిగిలిన చక్రాలు కూడా ఉత్తేజితమయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. తద్వారా మనిషి యోగసాధనలో పూర్ణత్వాన్ని సాధించటం సాధ్యమవుతుంది. ఇదంతా జరగాలంటే యోగసాధన ద్వారా సర్పరూపంలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చెయ్యాలి. నాగపంచమి ద్వారా సర్పారాధన చెయ్యడం ఈ శక్తిని జాగృతం చెయ్యటం కోసమే.
    ఆశ్లేష, అర్ద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాఢ నక్షత్రాలను సర్పనక్షత్రాలు అంటారు. సర్పం అనగా కదిలేది, పాకేది అనే అర్థాలు ఉన్నాయి. నాగము - 'న', 'ఆగ’ - అంటే ఎప్పుడూ కదులుతూ ఉండేది అని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్లేదాన్ని నాగము అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్లేది కాలం కాబట్టి నాగమునకు మరో అర్థం కాలం. అందుకే కాలాన్ని నాగులతో పోలుస్తూ కాలనాగము లేదా కాలనాగు అంటారు.
    సర్పం హృదయభాగంతో పాకుతుంది. ఈ భాగాన్ని ఉర అంటారు. 'ఉరతో ఎప్పుడూ కదులుతుంది కాబట్టి సర్పానికి ఉరగము అనే పేరు ఏర్పడింది. మనిషి కూడా ఎప్పుడూ చలిస్తూ ఉంటాడు. మానవ జీవితరం నిరంతర ప్రక్రియ. కాబట్టి, మనిషి కూడా 'నాగము' అవుతాడు. అలాగే  మనిషి నడవడికకు నడకకు హృదయస్థానం ప్రధానం. తన మనస్సు చెప్పినట్లే మనిషి నడుస్తాడు. అంటే, మనిషి కూడా ఉరము (హృదయం)తో సంచరించే సర్పంతో సమానం. 

నాగులు, సర్పాలు వేర్వేరు

భగవద్గీతలో (10వ అధ్యాయం, విభూతి యోగం) శ్రీకృష్ణపరమాత్మ ‘నేను ఆయుధాల్లో వజ్రాన్ని, గోవుల్లో కామధేనువుని, సర్పాల్లో వాసుకిని, నాగుల్లో అనంతుడిని అంటాడు. దీనిప్రకారం సర్పాలు, నాగులు వేర్వేరని తెలుసుకోవాలి. 
    వాసుకి శివుడిని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా ఉంటుంది. ఈ వాసుకినే తాడు గా చేసుకుని సాగర మధనం చేశారు దేవదానవులు. అనంతుడు అంటే ఆదిశేషుడు. కద్రువకు పెద్ద కొడుకు. బ్రహ్మ అనంతుడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. వాసుకి, అనంతుడు ఇద్దరూ కశ్యప ప్రజాపతి భార్య అయిన కద్రువ కుమారులు. పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెండింటికీ చాలా తేడా ఉంది. నాగులకు కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించి బతికే శక్తి ఉంది. వీటికి కామరూపశక్తి ఉంది. ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్ని ధరించగలవు. వీటినే దేవతా సర్పాలు అంటారు. నాగుల్లో అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖపాలుడు, కులికుడు అనే జాతులు ఉన్నాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుంది. కానీ ఇవి మనుషులు తిరిగే ప్రాంతాల్లో సంచరించవు. మానవజాడలకు దూరంగా ఉంటాయి. సర్పాలు నాగులకు భిన్నంగా ఉంటాయి. ఇవి భూమ్మీదే తిరుగుతాయి. కప్పలు మొదలైన జీవాల్ని ఆహారంగా స్వీకరిస్తాయి. వీటిలో తొమ్మిది ఉపజాతులు ఉన్నాయి.

అష్టనాగులు

కశ్యప ప్రజాపతి భార్య అయిన కద్రువకు జన్మించిన వారే నాగులు. వీరు మొత్తం వెయ్యిమంది కాగా అందులో గొప్పవీరులైన ఎనిమిది మంది అష్టనాగులుగా ప్రసిద్ధి పొందారు. వారు... వాసుకి, అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు, కుశికుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు . 
నాగ వీరులు
వాసుకి: నాగలోకానికి రాజు. ఇతని శిరస్సు మీద నాగమణి ప్రకాశిస్తుంటుంది. బెంగాలీయులు పూజించే మానసాదేవి ఇతని సోదరి. పరమశివుడికి కంఠానికి అలంకారంగా ప్రకాశిస్తుంటాడు.  నాగులలో తాను వాసుకిని అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు. చైత్రమాసంలో ఈ రథంలో వాసుకి ఉంటాడు. 

కాళియుడు: ద్వాపర యుగంలో బృందావనంలోని యమునా నదిలో నివసించిన విష నాగరాజు ఇతడు. అతని చుట్టూ ఉన్న యమునా నది నీరు వేడిగా, విషంతో బుడగలుగా ఉండేది. ఏ పక్షిగాని, జంతువుగాని దాని దగ్గరకు వెళ్ళలేకపోయేది. నది ఒడ్డున ఒకే ఒక కదంబ చెట్టు మాత్రమే పెరిగింది. గరుత్మంతుడికి భయపడిన కాళియుడు యమునా నదిలో తలదాచుకుంటాడు. విష్ణమూర్తి కృష్ణావతారంలో ఇతడి శిరస్సు మీద ఎక్కి నాట్యం చేసి అతడి గర్వాన్ని అణచివేస్తాడు. 

తక్షకుడు: ఇతడు అష్టనాగుల్లో ఒకడిగా ప్రసిద్ధి పొందాడు. పైలుడనే మహర్షి శిష్యుడు ఉదంకుడు. అతడు గురుపత్ని కోరిక మీదట మహిమాన్విత కుండలాలు తీసుకొని వెళుతుండగా వాటిని తక్షకుడు అపహరించాడు. దీంతో ఉదంకుడు తక్షకుడితో సహా మొత్తం నాగజాతి మీద పగ పెంచుకుంటాడు.  జనమేజయుని వద్దకు వెళ్ళి సర్పయాగం చేయమని ప్రోత్సహిస్తాడు. జనమేజయుని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తు చేస్తాడు. . జరిగిన వృత్తాంతం సాక్ష్యాలతో సహా తెలుసుకొన్న జనమేజయుడు సర్పయాగం ప్రారంభిస్తాడు. ప్రాణభయంతో తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయిస్తాడు. వేదపండితుల మంత్రశక్తికి ఇంద్రుడు సింహాసనంతో సహా కదలివస్తాడు. చివరకు అస్తీకుడి జోక్యంతో సర్పయాగాన్ని విరమిస్తాడు జనమేజేయుడు. దీంతో తక్షకుడు ప్రాణాలతో బయటపడతాడు.

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...