Showing posts with label Rama. Show all posts
Showing posts with label Rama. Show all posts

Tuesday, April 5, 2022

శ్రీసీతారామ కల్యాణ వైభవం

 

 

 

శ్రీ సీతారామ కల్యాణ వైభవం

 

 శ్రీ సీతారాములు - ఆదర్శదంపతులకు అసలైన అర్థం. సీతారామ కల్యాణం - యావత్ప్రపంచానికి శాంతిసౌభాగ్యాలను అందించిన మహోన్నత ఘట్టం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కల్యాణం నేటికీ నిత్యనూతనంగా వెలుగులు విరజిమ్ముతూ, సనాతన భారతీయ దాంపత్య ధర్మ వైభవానికి కీర్తిపతాకంగా అఖండంగా, అనంతంగా విశ్వవిహారం చేస్తూనే ఉంది.

 ముప్ఫైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కల్యాణానికి దక్కని వైభవం, మహత్తు కేవలం సీతారామ కల్యాణానికే మాత్రమే దక్కాయి. ఒక్క సీతారాముల కల్యాణాన్ని మాత్రమే సీతారామ శాంతి కల్యాణం అని పిలుస్తారు. వైదిక క్రతువుల్లో కూడా 'శ్రీసీతారామ శాంతి కల్యాణ మ¬త్సవాంగత్వే...' అని సంకల్పం మొదలు మాంగల్యధారణ, ఆర్ద్రాక్షతారోపణ వరకు చెబుతారు. దీని ద్వారా సీతారామ కల్యాణం లోకకల్యాణ హేతువని అర్థమవుతోంది.

ఆలూమగలంటే సీతారాముల వలే ఒకరికొకరుగా ఉండాలనటం, నవదంపతుల్ని సీతారాముల్లాగా ఉండమని ఆశీర్వదించటం, ఉత్తమ సాధ్విని సీతమ్మ తల్లిగా పిలవటం, గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తిని మా మంచి రామయ్య అనటం, శ్రీరామనవమి రోజున సీతాకల్యాణం జరిగిన తర్వాతనే తమ బిడ్డల వివాహ సుముహూర్తాలు నిశ్చయించుకునే ఆచారం పాటించటం, సీతారామకల్యాణ అక్షతలను తమ బిడ్డల వివాహ తలంబ్రాలలో కలిపితే నవదంపతులు చల్లగా ఉంటారనే విశ్వాసం కలిగి ఉండటం, ఇంకా మరెన్నో సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలు - కేవలం సీతారామ కల్యాణానికి మాత్రమే చెందిన ప్రత్యేకతలు. యావత్ప్రపంచ వాజ్ఞ్మయంలో మరే ఇతర కల్యాణం సాధించని అరుదైన ఘనతకు ప్రతిరూపాలు.

సీతారామ కల్యాణానికే ఎందుకీ ఘనత? అంటే - సీతారాములిద్దరూ సాధారణ స్త్రీపురుషులు కాదు. వారిద్దరూ యజ్ఞఫలితంగా ఆవిర్భవించిన పుణ్యమూర్తులు. తమ వంశం తరించటానికి పుత్రసంతానం కోసం దశరథ మహారాజు చేసిన యాగఫలితంగా శ్రీరామచంద్రమూర్తి జన్మిస్తే, యజ్ఞ నిర్వహణలో భాగంగా యాగశాల కోసం భూమిని దున్నుతున్న జనక మహారాజుకు నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదం సీతాదేవి. 'యజ్ఞాః లోక కల్యాణ హేతవః' - యజ్ఞాలు లోక కల్యాణానికి కారకాలుగా నిలుస్తాయి. అటువంటి యజ్ఞ ఫలితంగా జన్మించిన సీతారాముల కల్యాణం లోకకల్యాణ యజ్ఞానికి హేతువుగా నిలిచింది.

 ఆత్మప్రబోధం... శివధనుర్భంగం

 విశ్వామిత్రుని యాగసంరక్షణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, యాగం పూర్తికాగానే విశ్వామిత్రుని వెంట మిథిలా నగరానికి వెళ్ళి, జనక మహారాజు ఆస్థానానికి చేరుకుంటారు. విశ్వామిత్రుడు చెప్పిన మీదట జనక మహారాజు శివధనుస్సును రామలక్ష్మణులు చూపించటానికి సిద్ధపడి, ఆ ధనస్సును తీసుకురావల్సిందిగా తన మంత్రులను ఆదేశిస్తాడు.

 నృణాం శతాని పంచాశత్‌ వ్యాయతానాం మహాత్మనామ్‌

మంజూషామ్‌ అష్టచక్రానాం తాం సమూహస్తే కథంచన ||

 బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన ఐదువేల మంది పురుషులు, ఎనిమిది చక్రాలున్న శకటం మీద అమర్చి ఉన్న శివధనుస్సును అతి కష్టంతో తోసుకుంటూ తీసుకువస్తారు. నాగ, కిన్నెర, కింపుర, యక్ష, రాక్షసులతో సహా సమస్త దేవతా గణాలకు ఈ ధనస్సును ఎక్కుపెట్టటం సాధ్యం కాలేదని జనకుడు విశ్వామిత్రునితో చెబుతాడు. వెంటనే విశ్వామిత్రుడు 'వత్స రామ ధను: పశ్య' - నాయనా రామా! ఈ ధనుస్సును చూడు అంటాడు. వ్యవహారభాషలో చెప్పాలంటే ఈ ధనుస్సు సంగతి చూడు అని అర్థం.

 మహర్షి వాక్యంలోని అంతరార్థం గ్రహించిన రాముడు 'లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః' - ఆ ధనుస్సు మధ్యభాగాన్ని చేతితో పట్టుకుని, ఎంతో అలవోకగా ఎక్కుపెడతాడు. కేవలం రాముని కరస్పర్శతోనే ధనుస్సు వంగుతుంది. ఎడమ చేతితో ధనుస్సును పట్టుకుని, కుడి చేతితో ఆ వింటి నారిని పైకొనకు బంధించి, ఆకర్ణాంతం ఆల్లెత్రాటిని లాగుతాడు. మరుక్షణంలో ఫెళఫెళమంటూ లోకభీకరమైన శబ్దం చేస్తూ, శివ ధనుస్సు రెండుగా విరుగుతుంది. సీతారామ కల్యాణానికి ఇదే శ్రీకారం.

 హోజ్జ్వలమైన ఈ ఘట్టాన్ని ఆధ్యాత్మికంగా పరికించి చూస్తే, సమున్నతమైన ఆత్మబోధ మనకు అందుతుంది. శాస్త్ర పరిభాషలో ధనుస్సు అంటే ఓంకారం లేక ప్రణవం అని అర్థం. 'ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్చతే' - అని ఉపనిషద్వాక్యం. ప్రణవం అంటే వంగేది అని అర్థం. ప్రణవం ఎవరికైతే వంగుతుందో, అటువంటి వ్యక్తికి మన ఆత్మను అర్పించాలి. ఇక్కడ ధనుస్సు రూపంలో ప్రణవం రామచంద్రునికి వంగింది. అంటే, మన ఆత్మను అర్పించటానికి తగిన దైవం రామచంద్రమూర్తి. శివధనుస్సును ఎక్కుపెట్టటానికి ఎందరో దేవతలు కూడా ప్రయత్నించారు. వారెవరికీ అది సాధ్యం కాలేదు. అంటే ప్రణవం ఎవరికీ వంగలేదు. రామునికి మాత్రమే వంగింది. అంటే, మన ఆత్మార్పణకు అసలైన మార్గం శ్రీరాముని చరణాలే అని స్పష్టమవుతోంది.

 ఓంకారం కారణదశలో అకారంగా మారుతుంది. 'అదితి భగవతో నారాయణస్య ప్రథమ విధానం' అనే వాక్యం ప్రకారం అకారం శ్రీమన్నారాయణుడి యొక్క మొదటి పేరు. 'ఏతస్మిన్‌ అంతరే విష్ణురుపయాత మహాద్యుతిః' - దశరథునికి పుత్రుడిగా జన్మించింది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. అంటే, ప్రణవ స్వరూపుడైన శ్రీమహావిష్ణువే దశరథుని కుమారుడైన శ్రీరామచంద్రునిగా మానవావతారంలో జన్మించాడు. అందుకనే జనకుడు లక్ష్మీస్వరూపిణి అయిన సీతమ్మను నారాయణ స్వరూపుడైన రామచంద్రునికి అర్పించాడు.

 మరొక అర్థంలో చూస్తే - శ్రీరామచంద్రుడు ఒక్కసారిగా శివధనుస్సును ఎక్కుపెట్టాడు. దాన్ని సంధించటానికి ఉన్న నారిని కట్టగానే, ఒక్కసారిగా ధనుస్సు రెండు ముక్కలెలంది. ధనస్సు యొక్క ఒక భాగం శ్రీరాముని చేతిలో ఉంది. రెండో భాగం నారి ద్వారా వేలాడుతోంది. ఇది శివధనుర్భంగ దృశ్యం. ', , ' అనే అక్షరాల కలయికే ఓం కారం. అక్షరానాం అకారోస్మి అనే వాక్యం ప్రకారం రామచంద్రమూర్తి అకార స్వరూపం. ఇది (నారాయణ స్వరూపం) నేను చెప్పటానికి రాముడు ధనుస్సు యొక్క ఒక భాగాన్ని తన చేతితో పట్టుకున్నాడు. రెండో భాగం ''తో కలిసి ఉండే '' అంటే మనిషి (జీవుడు). '' కి '' కి మధ్య ఉన్న ధనుస్సు యొక్క నారి '' కార స్వరూపం. ''కారాన్ని ''కారాన్ని ''కారం కలిపి ఉంచుతుంది. ఆంటే, జీవాత్మ, పరమాత్మల సంబంధం ఎప్పటికీ వేరు పడేది కాదు అనే సత్యం మనకు బోధ పడుతుంది.

 రెండుగా విడిపడిన ధనుస్సు యొక్క ఒక ఖండాన్ని చేతితో పట్టుకుని 'ఓంకార ప్రతిపాద్యమైన దైవాన్ని నేనే సుమా! జీవుడు నాకు సంబంధించిన వాడే కానీ స్వతంత్రుడు కాడు' అనే విషయాన్ని రామచంద్రమూర్తి స్పష్టంగా ప్రకటించాడు. ఇదీ శివధనుర్భంగ ఘట్టం ద్వారా మనకు అందే అద్వైత వేదాంత బోధ.

 పంచభూతాత్మక పరతత్త్వం

 రాముడు నీలమేఘ శ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశ తత్త్వానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా అయోనిజగా లభించింది. అంటే, సీతమ్మ పంచభూతాల్లో మొదటిదైన భూతత్త్వానికి ఆలంబన. పంచభూతాల్లో మొదటిదైన భూతత్త్వం సీతమ్మ కాగా, చివరిదైన ఆకాశ తత్త్వం రామయ్య. ఈ రెండిటి మధ్యలోనే మిగిలిన మూడు తత్త్వాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది. సస్యాన్ని అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి, శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడు రామయ్య సీతమ్మకు చేరుకుంటాడో (సీతారామ కల్యాణం జరుగుతుందో) అప్పుడే లోకానికి శక్తి (రావణాది రాక్షస బాధ నుంచి విముక్తి పొందే శక్తి) అందుతుంది. ఈవిధంగా సీతారామ కల్యాణం లోక కల్యాణ కారకంగా, శాంతి దాయకంగా నిలుస్తుంది.

 లౌకిక వ్యవహారంలో చూసినా, సీతారామ కల్యాణం సంవత్సరంలో మొదటి (వసంత) ఋతువు, మొదటి (చైత్రం) నెలలో జరుగుతుంది. అంటే, కొత్త సంవత్సరంలో జరిగే తొలి కల్యాణం సీతారాముల కల్యాణమే. శిశిరంలో ఆకులు రాలి మోడుగా తయారైన చెట్లు, వసంతం రాగానే చిగురించి, నూతన శోభను సంతరించుకుంటాయి. ఎప్పుడు సీతారామ కల్యాణం జరుగుతుందో అప్పుడు నవ వసంతం మొదలవుతుంది. ఎవరు సీతారామ కల్యాణం జరుపుతారో, వారి జీవితాల్లో నవ వసంతం నిత్యవసంతంగా మారుతుంది. ఇదీ సీతారామ కల్యాణవైభవం.

 కల్యాణగానం 

 రాములోరి పెళ్ళిగా జానపదులు సీతారామ కల్యాణ వైభవాన్ని జానపదాలుగా పాడుకుని, తనివితీరా రామభక్తి సామ్రాజ్యంలో మునిగి తేలుతుంటారు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య కూడా తన కీర్తనల్లో అనేక చోట్ల సీతారాముల కల్యాణోత్సవాన్ని, నవదంపతులుగా సీతారాములను మనసారా కీర్తించాడు. 'రామం ఇందీవర శ్యామం పరాత్పర ధామం - సుర సార్వభౌమం భజే - సీతా వనితా సమేతం'; 'అట్టె హరువిల్లు విరిచిన రాఘవా - సిరులతో జనకుని యింటను జానకి జెలగి పెండ్లాడిన రాఘవా', 'రాముడు రాఘవుడు రవికులుడితడు - భూమిజకు పతియైన పురుష నిధానము' వంటి కీర్తనలు ఇందుకు ఉదాహరణ. 'సీతమ్మ మాయమ్మ..' వంటి వాగ్గేయకార కృతులు, 'వామే భూమిసుతా పురశ్చ హనుమాన్‌...' వంటి ధ్యానశ్లోకాలు సీతారాముల అన్యోన్య దాంపత్యాన్ని నిరంతరం మననం చేస్తాయి. 

మొత్తంగా సీతారామ కల్యాణం లోక కల్యాణ కారకంగా, ఆత్మచైతన్య ప్రబోధకంగా, ధార్మిక జీవన మార్గదర్శకంగా నిలుస్తుంది. అన్నిటినీ మించి, యావత్ప్రపంచం శిరసు వంచి నమస్కరిస్తున్న సనాత హైందవ వైవాహిక జీవన ధర్మానికి ఆలంబనగా నిలుస్తుంది.

 --------------------------------------

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ,  

సెల్‌: 90320 44115

Saturday, May 16, 2020

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...