Showing posts with label Ramayana. Show all posts
Showing posts with label Ramayana. Show all posts

Saturday, August 3, 2024

తులసీదాసు

 

 


 

 

పరిపూర్ణ భక్తిమూర్తి

 

- డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

 

అసోసియేట్ ప్రొఫెసర్, కె.బి.ఎన్ కళాశాల


కొత్తపేట, విజయవాడ-1

 

అనుక్షణం రామనామ గానంతో తనువును, మనసునూ కూడా పవిత్రం చేసుకున్న పుణ్యమూర్తి సంత్ తులసీదాసు. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రామనామంగా జీవించిన మహనీయుడాయన. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా సమస్త మానవాళినీ తన భక్తితత్త్వం ద్వారా ప్రభావితం చేసిన పరిపూర్ణ భక్తిమూర్తి తులసీదాసు. ఆయన కేవలం భక్తుడు మాత్రమే కాదు... గొప్ప కవి, భావుకుడు, యోగి కూడా.

 

యమునా తీరంలోని రాజాపూర్ అనే గ్రామంలో జన్మించిన తులసీదాసు జీవితపు తొలి రోజుల్లో అందరిలాంటి జీవితం గడిపాడు. యుక్తవయస్సులో రత్నావళితో వివాహం అయ్యాక ఆయన జీవితంలో ఓ అద్భుత ఘట్టం జరిగింది. పుట్టింట్లో ఉన్న భార్యను ఎట్టి పరిస్థితుల్లో చూడాలనే పట్టుదలతో విపరీతమైన తుఫాను అని కూడా చూడకుండా, అత్తగారి ఇంటికి వెళ్ళాడు తులసీదాసు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన కోసం వచ్చిన భర్తను చూసి ఆ ఇల్లాలు ఎంతో ఆనందపడింది. అదే సమయంలో, భర్త తన కోసం చూపించిన ఈ పట్టుదల భగవంతుడి మీద కేంద్రీకరిస్తే మంచిది కదా అనిపించింది. భర్తతో ఆ మాటే అన్నది.

 

అంతే... తులసీదాసు మనసులో ఓ గాఢమైన భావన కలిగింది. తన జీవనలక్ష్యం ఏమిటో తోచింది. చిన్ననాటి నుంచి తాను చేస్తున్న రామనామమే ఇప్పుడు తనకు మార్గం అని నిశ్చయించుకున్నాడు. ఇక, చివరి శ్వాస వరకు రామోపాసన తప్ప మరొక ఆలోచనకు కూడా తన మనసులో చోటివ్వనని నిశ్చయించుకున్నాడు. మరుక్షణమే, భార్యను విడిచి తీర్థయాత్రకు బయల్దేరాడు.

 

ఎంత వరకు ఐహిక విషయ లాలస ఉంటుందో అంత వరకూ మనిషి భగవంతుడికి దూరంగానే ఉంటాడు. భగవంతుడి వైపు జీవనమార్గం మారాలంటే ఓ తెగింపు ఉండాలి. ఆ తెగింపు తులసీదాసులో వచ్చింది. అవిశ్రాంతంగా 14 సంవత్సరాల పాటు తీర్థయాత్రలు చేసాడు. అనేక క్షేత్రాలు సందర్శించాడు. పరిపూర్ణ సాధువుగా మారాడు.

 

తీర్థయాత్రలు చేస్తూ దేవభూములు, తపోభూముల్లో సంచరించడం వల్ల చేసిన పాపాలు నశిస్తాయి. మనసు నిర్మలంగా ఉంటుంది. ఆయా క్షేత్రాల్లోని మహనీయుల అనుగ్రహం కలుగుతుంది. ఫలితంగా చిత్తం దేవుడికి చేరువ అవుతుంది. ఇటువంటి భక్తుడినే భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడు. అవసరమైతే తానే స్వయంగా అటువంటి భక్తుడిని వెతుక్కుంటూ వస్తాడు.

 

తులసీదాసు జీవితంలోనూ సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. తీర్థయాత్రల్లో ఉండగా, నరహరగిరి ఆనందుడనే యోగిని తులసీదాసు దర్శించుకున్నాడు. ఆ మహనీయుడి సందర్శనతో తులసీదాసులో గొప్ప మార్పు వచ్చింది. ఆయన కూడా తులసీదాసును చూడగానే ఇన్నాళ్ళ తన నిరీక్షణ ఫలించినందుకు ఆనందపడ్డాడు. తులసీదాసును శిష్యుడిగా స్వీకరించి, రామతారక మంత్రాన్ని ఉపదేశించాడు.

 

మనసంతా రామమయం

 

సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎటువంటి అవాంతరానికీ తులసీదాసు చలించడం లేదు. రాగద్వేషాలకు దూరమయ్యాడు. అకుంఠితమైన తపస్సు కారణంగా ఆయన ముఖం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తోంది. కళ్ళు మూసినా, తెరచినా; ఆహారం తీసుకుంటున్నా, నిద్రపోతున్నా... అంతటా రామభావన తప్ప మరొక ఆలోచనకు కూడా ఆయన మస్తిష్కంలో స్థానం లేకుండా పోయింది. లోకమంతా భక్తుడంటే తులసీదాసు మాత్రమే అన్నంతగా ఆ మహనీయుడు రామదాసుడిగా మారిపోయాడు.

 

తులసీదాసు తపస్సు ఫలించింది. రామభక్త శిఖామణి ఆంజనేయస్వామి దర్శనమైంది. హనుమ ఆశీర్వాద ఫలితంగా రామచంద్రమూర్తి దర్శనమూ పొందాడు. చర్మచక్షువులతో చిదానంద స్వరూపుడిని దర్శించిన పుణ్యశీలిగా చరిత్రలో నిలిచిపోయాడు తులసీదాసు. జీవితపు చివరి క్షణం వరకూ రామనామస్మరణలో, రామనామగానంలో మునిగి, బ్రహ్మానందం పొందేవాడు.

 

ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేకమంది, తులసీదాస్‌ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకుని, నిరంతరం శ్రీరాముని స్మరిస్తూ ఆనందంలో ఓలలాడేవారు. హిందువులతో పాటు ఇతర మతాలవారు కూడా తులసీదాస్‌ వద్ద రామనామ దీక్ష తీసుకుని,  రామ భజన చేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఇదొక సంచలనంగా మారింది.

 

ప్రాణం పోసిన రామభక్తి

 

ఒకరికొకరుగా జీవించే చిలకాగోరింకల్లాంటి జంట ఒకటి ఉంది. ఒక రోజున భరంత హఠాత్తుగా కన్నుమూశాడు. అతని భార్య దుఃఖం వర్ణనాతీతంగా ఉంది. శోకమూర్తిలా ఉన్న ఆమెను చూసి అందరికీ మనసు అర్ద్రమైంది. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు. పోయిన ప్రాణం తెప్పించే శక్తి ఎవరికి ఉంది.

 

అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. భర్తశవాన్ని తీసుకుపోనీయకుండా అడ్డుకుంటున్న ఆ అమ్మాయిని బంధుమిత్రులు కలిసి బలవంతంగా ఆపగా, శవయాత్ర ముందుకు నడిచింది. కానీ, కొద్దిసేపటికే ఆ అమ్మాయి పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగుపరుగున శవయాత్రసాగే ప్రదేశానికి చేరుకుంది. అప్పటికి ఆ శవయాత్ర తులసీదాస్‌ ఆశ్రమం ముందునుంచి వెళుతోంది. ఆ ఆశ్రమం చూడగానే, ఆమెకు ఏమనిపించిందో! తన భర్తని బ్రతికించగల మహానుభావుడు అక్కడ ఉన్నాడనుకుంది. హఠాత్తుగా ఆ ఆశ్రమములోనికి వెళ్ళి, తులసీదాస్‌ పాదాలమీద వాలి శోకించింది.

 

నుదుటబొట్టు, చేతులకు గాజులు మొదలైన సౌభాగ్య చిహ్నాలతో ఉన్న ఆమెను చూసిన తులసిదాస్‌, దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. ఆ దీవెనకి ఆమె మరింతగా శోకించింది. "సౌభాగ్యవతీ! ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. కారణం చెప్పమ్మా!" అని అనునయంగా పలికాడు తులసిదాస్‌‌. "నాబోటి నిర్భాగ్యురాలిని - దీర్ఘసుమంగళీభవ అని దీవించారు స్వామీ! మీబోటి మహానుభావుల దీవెన నిష్పలమైంది కదా!" అంటూ కుమిలి పోయింది ఆ ఇల్లాలు. "శ్రీరామచంద్రుడు నానోట అసత్యం పలికించడమ్మా! ఏం జరిగిందో చెప్పు" అని అడిగాడు తులసీదాస్‌.

 

"మా ఆయన చనిపోయారు. ఆ వెళుతున్న శవయాత్ర ఆయనదే. ఇక నా సౌభాగ్యమునకు అర్థమేముంది" అంటూ భోరుమంది ఆ అమ్మాయి. తులసిదాసు హృదయం జాలితో నిండిపోయింది. ఆయన వెంటనే ఆ శవయాత్ర దగ్గరకు వెళ్ళి, శవవాహకులను ఆగమన్నాడు. ఆ శవం కట్లు విప్పి, రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని శవం మీద జల్లాడు. అంతే! అద్భుతం జరిగింది. శవంలో జీవం వచ్చింది. అటూ ఇటూ కదిలి కళ్ళు తెరిచాడు ఆ యువకుడు. పునర్జీవితుడైన భర్తను చూసిన భార్య ఆనందబాష్పాలు రాలుస్తూ, తులసీదాసు పాదాలపై వాలిపోయింది. బంధుమిత్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

 

దిల్లీ పాదుషా గర్వభంగం

 

ఈ సంఘటన తర్వాత రామనామదీక్ష తీసుకునేవారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది. దీంతో ఇతర మతగురువులు ఢిల్లీ పాదుషా దగ్గరికి వెళ్ళి, తులసీదాసు మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నాడని అభియోగం మోపారు. విచారించడానికై తులసీదాసుని పిలిపించాడు పాదుషా.

 

మరణించినవారిని బ్రతికించగలదా మీ రామనామం అని అడిగాడు పాదుషా. తప్పకుండా అని జవాబిచ్చాడు తులసీదాసు. మేము ఇప్పుడే ఒక శవాన్ని తెప్పిస్తాము. మీ రామనామ మహిమతో బ్రతికించగలరా అని సవాలు చేశాడు పాదుషా. రామనామం చాలా మహిమ కలది. చనిపోయిన వ్యక్తిని బతికించగలదు. కానీ జననమరణాలు వ్యక్తి కర్మలమీద, దైవనిర్ణయం మీద ఆధారపడి ఉంటాయు. వాటి విషయం మానవమాత్రులమైన మనం కలిగించుకోవడం తప్పు కదా అన్నాడు తులసీదాసు. ఇన్ని మాటలు వద్దు. రామనామానికి మహిమ లేదని చెప్పు. లేదా శవాన్ని బతికించు...అని కఠినంగా ఆజ్ఞాపించాడు పాదుషా.

 

రామచంద్రా! ఇదేమి పరీక్ష. రాజు కన్నెర్ర చేస్తున్నాడు. అంత మాత్రాన ఇతను చెప్పిన పని చేయలేను కదా. రామా! ఈ విపత్తు నుండి నీవే నన్ను రక్షించాలి...  అని మనసులోనే వేడుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడైయ్యాడు తులసీదాసు. అతడిని బంధించమని ఆజ్ఞాపించాడు పాదుషా.

 

తులసీదాసు వైపు సైనికులు కదిలారు. మనసా, వాచా, కర్మణా - త్రికరణశుద్ధిగా తననే నమ్మే ఆ భక్తునికి, ప్రతిక్షణం రామనామస్మరణ చేసే తన సేవకునికి, ప్రాణపాయసమయంలో కూడా తన మీదే భారం వేసిన ఆ మహానుభావునికి అపాయం చుట్టుముడుతుంటే రామభద్రుడు ఊరుకుంటాడా. తక్షణమే తన సైన్యాన్ని పంపించాడు.

 

ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ, వందలు, వేలుగా కోతులు అక్కడికి వచ్చాయి. సైనికులమీద పడి, వారి దగ్గర ఆయుధాలను లాక్కుని వారి మీదకే గురిపెట్టాయి. సైనికులు, పాదుషాతో సహా ఎవ్వరూ అంగుళం కూడా కదల్లేదు. ఏ కోతి మీదపడి కరుస్తుందో అనే భయంతో అక్కడివారంతా భయాందోళనలకు గురయ్యారు. సభలో కలకలం రేగింది. ఆ సవ్వడికి కనులు తెరచిన తులసీదాసుకి సైనికులకి ఆయుధాలు గురిపెట్టిన వానరాలు కనిపించాయి.

 

అవి కోతులు కాదు, రామదండు. తులసీదాసు ఆశ్చర్యంతో, ఆనందంతో చుట్టూ పరికించాడు. ఎదురుగా సింహద్వారం మీద కూర్చని అభయహస్తాన్ని చూపుతున్న ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. తులసీదాసు భక్తిభావంతో తన్మయత్వంతో, స్వామికి చేతులు జోడించి స్తుతించాడు. ఆయన నోటినుండి అప్రయత్నంగా, ఆశువుగా జయహనుమాన జ్ఞానగుణసాగర.. అంటూ హనుమాన్‌ స్తుతి ప్రవహించింది. అదే హనుమాన్‌ చాలీసా.

 

తులసీదాసు స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడయి, ఆ భక్తుని అనుగ్రహించాడు. "నాయనా! నీస్తుతితో మరింత ప్రసన్నం చేసుకున్నావు. బిడ్డా! ఈ మూకని సంహరించాలా? తరిమికొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తా''ను అని అన్నాడు స్వామి. చేతులు జోడించి భక్తిగా తలవాల్చాడు తులసీదాసు. "స్వామీ! ఇప్పటికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న వీరిగురించి నేనేమీ అడగను. ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది. కానీ, ఒక్క ప్రార్థన. ప్రభూ! ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా వారికి ప్రసన్నుడవవు కావాలి. స్వామీ! నాకు ఈ వరాన్ని అనుగ్రహించు'' అని వేడుకున్నాడు. ఆ మాటలకు స్వామి మరింత ప్రసన్నుడయ్యాడు. తథాస్తు అని అనుగ్రహించాడు. నాటి నుంచి హనుమాన్‌ చాలీసా చదివిన వారికి స్వామి ప్రసన్నుడయి అనుగ్రహిస్తున్నాడు.

 

భక్తులుగా మారిన దొంగలు

 

రామభక్తుడైన తులసీదాసు ఓ రాత్రివేళ వాహ్యాళిగా నడచివెళ్తున్నాడు. కొందరు దొంగలు ఆయనను అడ్డగించి 'ఎవరు నువ్వు'' అనడిగారు. ప్రజలంతా ఆ రాముని వారే అన్న మానసిక భావనతో ‘నేను మీ వాడినే' అని జవాబిచ్చాడు తులసీదాసు. అది విన్న ఆ చోరులు అతనూ తమ లాగే దొంగే అని భ్రమపడ్డారు. దొంగతనంలో సాయపడతాడని తమతో పాటు తీసుకువెళ్లారు.

 

ఒక ఇంట్లో దొంగతనం చేయటానికి లోపలికి వెళ్తూ తులసీదాసుతో 'నువ్వు బయట నిలబడు! ఎవరైనా వస్తే వెంటనే శంఖం ఊదు. మేము బయటకు వచ్చేస్తాం' అని ఆయన చేతికి ఓ శంఖం ఇచ్చారు. దొంగలు లోపలికి వెళ్లిన కొన్ని క్షణాలకే తులసీదాసు శంఖం పూరించాడు. ఎవరో వస్తున్నారు కాబోలు అనుకుని ఆదుర్దాతో దొంగలు బయటకు పరుగెత్తుకొచ్చారు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు.

 

దొంగలు తులసీదాసును దూషిస్తూ 'ఇక్కడ ఎవరూ లేరు కదా! ఎందుకు శంఖం ఊదావు? అని గద్దించారు. అప్పుడు తులసీదాసు 'అయ్యా' ఇక్కడ, అక్కడ అని లేదు. అంతటా నా ప్రభువు శ్రీరామచంద్రుడే కనిపిస్తున్నాడు. ఆయన దురాగతాలు చేసేవారిని ఎంతమాత్రం ఇష్టపడడు. దొంగతనం చెడ్డపని. మీరెవరూ ఆయన ఆగ్రహానికి గురికాకూడదనే నేను శంఖం ఊదాను' అన్నాడు. ఆ మాటలు విన్న దొంగల్లో పశ్చాత్తాపం కలిగింది. తర్వాతెన్నడూ చౌర్యం చేయకపోవడమే కాదు వారి ప్రవర్తనలో గొప్ప మార్పు వచ్చింది.

 

ఇంకా మరెన్నో సంఘటనలు తులసీదాసు జీవితంలో ముడిపడి ఉన్నాయి. వాటన్నిటి సారాశం ఒక్కటే. భవ సాగరాన్ని దాటించే నావ రామనామం మాత్రమే. పునరావృత్తి రహితమైన కైవల్యసాధనకు రామనామాన్ని మించిన మార్గం లేదు.

 










 

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the Ind...