Thursday, December 6, 2018

గోదాదేవి మధురభక్తి, ఆమె రచించిన తిరుప్పావై పాశురాల్లోని ఆధ్యాత్మిక విశేషాలు వివరిస్తూ ఈనాడు దినపత్రికలో రాసిన వ్యాసం


గోదాదేవి మధురభక్తి, ఆమె రచించిన తిరుప్పావై పాశురాల్లోని 

ఆధ్యాత్మిక విశేషాలు వివరిస్తూ ఈనాడు దినపత్రికలో

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం


మధురభక్తి మూర్తి ... గోదాదేవి

--------------------

            శ్రీకృష్ణా! నాకు తల్లి, తండ్రి, స్నేహితులు, బంధువులు.. ఒకటేమిటి, అన్నీ నీవే. బంధుత్వాలన్నీ నీతోనే. ఈ ఒక్క జన్మలోనే కాదు... అన్ని జన్మల్లోనూ నీ చెలిమే కావాలి. నీ నామం గానం చేస్తూ, నీ మాటలే పలుకుతూ, నీ సుందరాకృతినే చూస్తూ, తనువు, మాట, మనసు... అన్నిట్లోనూ నీవే నిండిపోవాలి. అంతిమంగా నీలోనే ఐక్యం చెందాలి. ఇంతకన్నా నాకు మరే కోరికా లేదు స్వామీ! అంటూ పరిపూర్ణమైన ఆర్ద్రత నిండిన మనసుతో శ్రీకృష్ణపరమాత్మను అర్చించిన మధురభక్తి మూర్తి గోదాదేవి.

    శ్రీరంగనాథుడిని వలచి, ఆయన్ను చేరటానికి నవవిధ భక్తిమార్గాల్లో గానమార్గాన్ని ఎంచుకుని, తాను తరించటంతో పాటు మనల్నందరినీ తరింపజేస్తున్న చరితార్థురాలు ఆమె. 'మాసానాం మార్గశీర్షోహం' అని చెప్పిన కృష్ణ పరమాత్మ వాక్యాన్ని అనుసరించి, పవిత్ర మార్గశిరమాసంలో 'తిరుప్పావై' పాశురాలను రచించి, గానం చేసి శ్రీకైవల్యపదాన్ని చేరుకుంది.

            గోదాదేవి రాసిన పాశురాలు కేవలం గీతాలు కాదు. దైవచింతన కోసం, కర్తవ్య నిర్వహణ కోసం మనల్ని నిద్రలేపే చైతన్యదీపాలవి. ఒక్కో పాశురం ఒక్కో అమృత గుళిక. కణుపు కణుపుకీ చెఱకుగడ తీపి పెరిగుతుందన్నట్లు మొదటి పాశురం నుంచి ప్రారంభించి, ఒక్కో పాశురం చదువుతుంటే, మనకు తెలియకుండానే మనసు పరమాత్మ పాదాల మీద వాలుతుంది. అంతటి, మధురభక్తి పూరితాలుగా పాశురాలను తీర్చిదిద్దింది గోదాదేవి.

            ఆమె రాసిన పాశురాలు మొత్తం ముప్ఫై. కాగా, మొదటి ఐదు ఉపోద్ఘాతం లాంటివి. తిరుప్పావై ప్రాధాన్యతను ఇవి తెలియజేస్తాయి. భగవంతునికి చేసే అర్చన, నివేదనతో సహా అన్ని ఉపచారాల్లో ఆడంబరాలు అవసరం లేదని, చిత్త శుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాల్లో చెబుతుంది. భగవదారాధన వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు నిండుగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని ఈ పాశురాల్లో చెబుతుంది.

            తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలసి, శ్రీరంగనాథుడిని సేవించటానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాల వివరాలు వర్ణితమై ఉన్నాయి. పక్షుల కిలకిలారావాలు, అప్పుడే వికసిస్తున్న పూబాలలు, దేవాలయంలో వినిపించే చిరుగంటల ధ్వని, లేగదూడలు 'అంబా' అంటూ చేసే అరుపులు, వాటి మెడలోని గంటల సవ్వడి మొదలైన మనోహర ప్రకృతి దృశ్యాల వైభవం వీటిలో కనిపిస్తుంది.

            పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి, చెలులతో కలసి చేసిన దేవాలయన సందర్శన విశేషాలతో నిండి ఉంటాయి. కపట నిద్ర విడిచి, లోకాల్ని కాపాడటానికి మేలుకోవయ్యా అంటూ రంగనాథుడికి సుప్రభాతం వినిపిస్తుంది ఈ పాశురాల్లోనే. కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా వీటిలోనే ఉంటుంది.

            చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవద్విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ, ఎవరైతే ఈ పాశురాలు గానం  చేస్తారో, వారికి భగవత్కృప తప్పక కలుగుతుందని చెబుతుంది.

            కేవలం భక్తితోనే పాశురాలు నిండిపోలేదు. అసమాన సాహితీ పాండిత్యాన్ని కూడా గోదాదేవి తన పాశురాల్లో ప్రకటించింది. అంతకుముందు ఏ కవీ ఉపయోగించని అపురూప ఉపమానాలు ఆమె పాండిత్య ప్రౌఢిని ప్రకటిస్తాయి. సందర్భానికి తగిన శబ్దసౌందరం, అలంకార శోభ పాశురాల్ని కలకండ ముద్దల్లా అమృతమయం చేసాయి.

            'ఓంగి యులగళన్ద ఉత్తమన్‌ పేర్పాడి / నాంగళ్‌ నమ్బావైక్కుచ్చాట్రి నీరాడినాల్‌ ...' అనే పాశురంలో సాహిత్యం యొక్క పరమార్థాన్ని గోదాదేవి ప్రకటించింది. ఏడాదికి మూడు పంటలు పండాలి. గోవులు పాలను సమృద్ధిగా ఇవ్వాలి. సరిపడినంత వాన కురవాలి. అసలు ఎక్కడా, ఎందులోను 'లేదు' అనే పదం వినిపించకూడదు. స్వామీ! ఈ లోకాన్ని చల్లగా చూడు అంటూ ప్రార్థిస్తుంది ఈ పాశురంలో. 'సహితస్య భావం సాహిత్యం' - సమాజానికి హితాన్ని చేకూర్చేదే సాహిత్యం అని అలంకార శాస్త్రవేత్తలు చెప్పినట్లు, తన సాహిత్యం ద్వారా సమాజహితాన్ని కాంక్షించి, ఉత్తమ సాహితీమూర్తిగా గోదాదేవి సాక్షాత్కరిస్తుంది.

            ఒకసారి మత్స్యమూర్తిగా, మరొకసారి కూర్మరూపంలో, ఇంకోమారు ఆదివరాహమూర్తిగా, నరసింహుడిగా, చిరవగా పరిపూర్ణ మానవుడిగా అవతరించిన స్వామి అవతారాల పరమార్థం కూడా ఈ పాశురంలో కనిపిస్తుంది. భగవంతుడి సర్వవ్యాపకత్వం ఇందులో ద్యోతకమవుతుంది. సకల జంతుజాలమంతా పరమాత్మ అవతార విశేషమే అనే భావన గోదాదేవి ఈ పాశురంలో విస్పష్టంగా ప్రకటిస్తుంది.

            'నోట్రుచ్చువర్కమ్‌   పుహిగిన్రవమ్మనాయ్‌ / మాట్రముమ్‌ తారారో వాశల్‌ తిరవాదార్‌...' అనే పాశురంలో గోదాదేవి నీలాదేవిని నిద్రలేపుతుంది. కాదు.. కాదు.. నీలాదేవి పేరుతో అజ్ఞానమనే మాయకు లోబడిన మన మనసుల్ని నిద్రలేపుతుంది. 'నిద్ర పోవటంలో కుంభకర్ణుడు నీతో ఓడిపోయి, అందుకు ప్రతిగా తన సొత్తయైన నిద్రను నీకు శుల్కంగా ఇచ్చాడా ఏమి? ఇక నిద్రలేవమ్మా నీలాదేవీ!' అంటూ ఇంద్రియాలేవీ పనిచేయక, మనసు భగవదధీనమై, ఏకేంద్రియావస్థలో ఉన్న గోపికను నిద్రలేవమ్మా అంటూ పరాచికాలాడుతుంది. ఇది బాహ్యంగా కనిపించే అర్థం. కానీ, తరచిచూస్తే... మనసుల్ని కమ్మిన మాయను తొలగించుకుంటేనే కానీ, భగవంతుని చేరుకోలేమన్న అంతరార్థం బోధపడుతుంది.

            మనిషి మాయాబద్ధుడిని చేసి, మదమాత్సర్యాలని పెంచే శత్రువు 'సంపద'. మితిమీరిన సంపద మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి, ఎంత సంపద ఉన్నా భగవంతుడి సేవకు దూరం కాకూడదు. ఇందుకు స్వీయజాగృతే మార్గం అంటూ సంపన్నురాలైన ఓ గోపాలుడి సోదరిని నిద్రలేపుతున్న మిషతో మనందరికీ జ్ఞానబోధ చేస్తుంది గోదాదేవి. 'కనెత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి / నినైత్తుములై వళియే నిన్రుపాల్‌ శోర...' అనే పాశురం ఇందుకు నిదర్శనం. కంచెర్ల గోపన్న కూడా తన దాశరథీ శతకంలో 'సిరి గలనాడు మైమరచి, చిక్కిన నాడు తలంచి, పుణ్యముల్‌ పొరిపొరి చేయనైతినని పొక్కిన గల్గునే..' అంటూ సంపద మాయలో మునిగి, భగవదారాధన మర్చిపోవద్దని హెచ్చరిస్తాడు. గోదాదేవిలోనూ ఇదే దార్శనికత కనిపిస్తుంది.

            మొత్తంగా తన పాశురాల్లో గోదాదేవి ఎక్కడా మెట్టవేదాంతాన్ని వల్లించలేదు. ఏది మంచో? ఏది చెడో? వివేచన చేసుకోమని హెచ్చరించింది. మహర్షులైన వారి మార్గదర్శనం తీసుకోమని సూచించింది. 'కీళ్‌ వానమ్‌ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు / మేయ్‌ వాన్‌ పరన్దనకాణ్‌ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్‌... ' అనే పాశురంలో ఈ సందేశం కనిపిస్తుంది. భగవత్స్వేకు తొందరపడాలి. క్షణం వృథా చేసినా, మన సాధన తగ్గిపోతుంది. మనకు మనంగా భగవంతుని పాదాల మీద వాలితే, ఆయనే స్వయంగా మనల్ని ఆదరిస్తాడు. కరుణిస్తాడు. అంతిమంగా తనలో చేర్చుకుంటాడని ఈ పాశురం బోధిస్తుంది.

            'కీశు కీశున్రెజ్ఞుమానై చాత్తకలన్దు / పేశిన పేచ్చరవమ్‌ కేట్టిలైయో! పేయ్‌ ప్పెణ్ణే!...' అనే పాశురంలో ప్రకృతి శోభ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. భరద్వాజ పక్షులు చేసే కీచు శబ్దాలు, గొల్లభామ చేతి కంకణాల ధ్వనులు, మంగళసూత్రాల మంగళధ్వనులు, మంచు దుప్పుటి కప్పుకున్నట్లున్న పంటభూములు... అమోఘం. ఇలాంటి గ్రామంలో నివసించే గోపికను పరమాత్మ సేవకు మేల్కొలుపుతుంది గోదాదేవి ఈ పాశురంలో.

            పల్లెల్లో నివసించినా, పట్టు పరుపుల మీద పడుకున్నా... పరమాత్మ సేవలో తరిస్తేనే జన్మకు సార్థకత అంటూ 'మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే / చండాలుడుండేటి సరి భూమి యొకటే' అనే అన్నమయ్య తత్త్వాన్ని కూడా గోదాదేవి ఈ పాశురంలో ప్రకటిస్తుంది.

            మొత్తంగా తిరుప్పావై పాశురాలు ఆత్మను పరమాత్మ సన్నిధికి చేర్చే వాహకాలు. సగుణోపాసన ద్వారా నిర్గుణోపాసనకు మార్గం చూపే దారి దీపాలు. అంతిమంగా 'శ్రీకైవల్య పదానికి' చేరుకునే పరమపద సోపానాలు.
---------------------------




డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ,
ఆంధ్రోపన్యాసకులు
ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, 
గాంధీనగర్‌
విజయవాడ -520 003. 
సెల్‌: 90320 44115 / 8897 547 548

 

 

 

           

 

            


ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...