Friday, December 31, 2021

బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు నిద్ర లేవాలి? సుప్రభాతం అంటే ఏమిటి?


బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? 

బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు నిద్ర లేవాలి? 

సుప్రభాతం అంటే ఏమిటి?

రుషిపీఠం పత్రిక జనవరి 2022 సంచికలో ప్రచురితమైన వ్యాసం 






ఆత్మచైతన్య సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామా... పూర్వా సంధ్యా ప్రవర్తతే.... 

అది ఉషోదయానికి పూర్వ వేళ. బాలభానుడు తన తొలి కిరణాలను వికసింపజేయటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. జగన్మోహనాకారుడైన రామచంద్రమూర్తి సోదరుడైన లక్ష్మణస్వామితో కలిసి కఠిన నేల మీద ఆదమరచి పడుకున్నాడు. ‘పుంసాం మోహన రూపాయ’ అన్నట్లున్న స్వామి సౌందర్యాన్ని తనివి తీరా చూసుకున్నాడు మహర్షి. కానీ, అంతలోనే కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. ‘ఉత్తిష్ఠ నరశార్దూలా! కర్తవ్యం దైవమాహ్నికం’ ` రామచంద్రా! నీ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన సమయం సన్నద్ధమైంది. పడుకున్నది చాలు... ఇక నిద్రలేవాలంటూ విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నిద్ర నుంచి మేల్కొలిపాడు. 

ఇది రాముడికి మహర్షి పలికిన సుప్రభాతం మాత్రమే కాదు. రామచంద్రుడి పేరుతో యావజ్జాతిని ఉద్దేశించి మహర్షి పలికిన చైతన్యగీతం అది. సుప్రభాత గీతిక ఆలయాల్లో నిత్యం వినిపించే ఆధ్యాత్మిక గానలహరి అది. 

దేవాలయాల్లో వినిపించే సుప్రభాతం విని స్వామి నిద్రలేస్తాడని, భక్తుల కోర్కెలు సావధానంగా విని, వాటిని తీరుస్తాడని నమ్మకం. సుప్రభాతం కేవలం దైవానికేనా. మనిషి మాత్రం నిద్ర లేవాల్సిన పని లేదా అంటే నిజానికి నిద్ర, మెలకుల లేని దైవం మేల్కొనాల్సిన అవసరమే లేదు. దైవానికి నిద్ర ఉండదు. అదొక నిర్నిద్రమైన శక్తి. దైవానికి పాడే సుప్రభాతం పేరుతో మనలోని దైవత్వాన్ని మేల్కొలపటమే సుప్రభాతం వెనుక దాగిఉన్న ఆధ్యాత్మిక సందేశం. గుడిలోని దేవుడి పేరుతో గుండె గదుల్లో దాగున్న దైవీకమైన శక్తిని జాగృతం చేసే ప్రక్రియకు పలికే నాందీ వాచకమే సుప్రభాతం. 

సాధారణ పరిభాషలో రాత్రి వేళ నిద్రించి, ఆ నిద్ర ముగిసిన తర్వాత కళ్ళు తెరచి లోకాన్ని చూడటాన్ని నిద్రలేవటం అంటాం. నిజానికి ఇలా నిద్ర పోవటం, మేల్కోవటం అనేది ఒక క్రియ మాత్రమే. పుట్టుకతో ఈ లోకాన్ని చూడటానికి చేసే ప్రయత్నమే కన్ను తెరవటం. లోకాల వెనుక జ్యోతి స్వరూపంతో వెలిగే పరమాత్మను చేరుకోవటం చేసే ప్రయత్నమే కన్నుముయ్యటం. ఇలా కన్నుతెరచి కన్నుమూసే కాలవ్యవధిలో ఎప్పటికప్పుడు మనల్ని మనం జాగృతం చేసేందుకు చేసే స్వీయప్రబోధమే సుప్రభాతం. అదే నిద్రలేవటం. 

కర్తవ్యం దైవమాహ్నికం ` అంటే తెల్లవారిన తర్వాత నువ్వు చెయ్యాల్సిన పని అంతా నీది కాదు... దైవానిది, అటువంటి దైవ కార్యాన్ని నిర్వహించటానికి మేల్కొనాలని అర్థం. మానవత్వమనే పొర వెనుక ప్రతి ప్రాణీ దైవమే. ఆ దివ్యత్వాన్ని మేల్కొలపటమే సుప్రభాతం. 

మనకు ఇష్టమైన దైవానికి మేల్కొలుపు పాడుతున్నామంటే అర్థం ఆ దైవాన్ని త్రికరణశుద్ధిగా మనం నమ్ముతున్నామని, ఆ స్వామి బాటలో నడవటానికి అంగీకరించామని అర్థం. అలా మనం నమ్ముకున్న దైవం మేల్కొన్నాడంటే... మనలో ఆ దైవానికి సంబంధించిన ఉత్తమ భావనలు మేల్కొన్నాయని అర్థం. ఎప్పుడైతే మనలో దైవీకమైన భావనలు వృద్ధి చెందుతాయో అప్పుడు ధర్మమార్గాన్ని విడిచిపెట్టే సందర్భం ఎదురుకాదు. ఇలా ప్రతి వ్యక్తి... అంతిమంగా సమాజం ధర్మనిలయంగా మారేందుకు పలికే నాందీవాక్యమే సుప్రభాతం.

బ్రాహ్మీముహూర్తం

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియ ప్రస్తుత కాలమాన ప్రకారం 24 నిమిషాలకు సమానం. ఒక ముహూర్తం అంటే రెండు ఘడియల కాలం ` అంటే 48 నిమిషాల కాల వ్యవధి ఒక ముహూర్తం అవుతుంది. ఒక పగలు, ఒక రాత్రి కలిపిన కాలవ్యవధిని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంలో 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి. 

సూర్యోదయ సమయానికి కచ్చితంగా జరుగుతూ ఉండే ముహూర్త కాలాన్ని ఆసురీ ముహూర్తం అంటారు. ఈ ఆసురీ ముహూర్తానికి ముందు సమయం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. అంటే సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటి ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. దీని ప్రకారం రోజు మొత్తంలో వచ్చే 29వ ముహూర్తం బ్రాహ్మీముహూర్తం అవుతుంది. 

ఉదాహరణకు సూర్యోదయం ఉదయం గం. 5.28 అయితే అంతకుముందు జరిగే ముహూర్తం (48 నిమిషాల కాల వ్యవధి) గం.4.40 నుంచి గం.5.28 వరకు ఉండే సమయం ఆసురీ ముహూర్తం అవుతుంది. ఈ ఆసురీ ముహూర్తానికి ముందు అంటే గం.4.40కు ముందు ఉండే ముహూర్తం అంటే గం.3.58 నుంచి గం.4.40 వరకు ఉండే 48 నిమిషాల కాలం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. 

బ్రాహ్మీ అనే పదానికి సరస్వతీ అని అర్థం. మనలోని బుద్ధి ప్రచోదనం చెంది సరస్వతీదేవి అనుగ్రహం జ్ఞానరూపంలో కలిగే ఉత్తమ సమయం కాబట్టి ఈ సమయానికి బ్రాహ్మీ ముహూర్తం అని పేరు వచ్చింది. బ్రాహ్మీముహూర్తంలో బ్రహ్మ, సరస్వతి ఇద్దరూ హంస వాహనంపై ఆకాశ సంచారం చేస్తుంటారని, కాబట్టి ఆ సమయంలో సరస్వతీ ఉపాసన (విద్యార్థులు చదువుకోవటం కూడా ఉపాసనే) చేసేవారిని సరస్వతీ అనుగ్రహిస్తుందని పురాణ కథనం. విద్యార్థులు తెల్లవారు జామున లేచి చదువుకోవాలని పెద్దలు చెప్పటం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. 

మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. ఉషోదయ వేళ మనలో కార్టిసోల్‌ హార్మోన్‌ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్‌ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందని పెద్దలు చెబుతారు.

ఆధ్మాత్మిక సాధన పరంగా బ్రాహ్మీముహూర్తం చాలా విలువైన సమయం. ఈ సమయాన్ని వృథా చేసుకుంటే రోజులోనే కాదు... మొత్తం జీవితంలోనే అద్భుతమైన కాలాన్ని కోల్పోయినట్లవుతుంది. శుశ్రుత మహర్షి బ్రాహ్మీ ముహూర్తాన్ని అమృత ముహూర్తంగా పేర్కొన్నాడు. ఈ సమయంలో చేసే ఆధ్యాత్మిక సాధన ద్వారా మనలో సత్త్వగుణాలు పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణం (బద్ధకం, ఆలస్యం, అజాగ్రత్త) పెరుగుతుంది. అర్థరాత్రి దాటే వరకూ మెలకువగా ఉండడం వల్ల రజోగుణం (క్రోధం, దంభం, దర్పం, విపరీత ప్రతిస్పందన) పెరుగుతుంది. అందుకే తెల్లవారు జామున ఆలోచించు, పగలు కార్యోన్ముఖుడివై పని చెయ్యి. రాత్రి  సమయంలో నిద్రోన్ముఖుడివి కావాలని పెద్దలు చెబుతుంటారు. 

బ్రాహ్మీ ముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు ఈ సమయంలో ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసికా రంధ్రాల్లోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పనిచెయ్యటం మొదలవుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. తద్వారా ఆధ్యాత్మిక సాధన మరింత ఉన్నతస్థితికి చేరుకుని, అంతిమంగా మన అంతర్యామిగా ఉన్న ఆత్మ స్వరూపమైన పరమాత్మను చేరుకునే సిద్ధి కలుగుతుంది.

తెల్లవారు జామున అంతర్ముఖలమై మేథోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. తెల్లవారు జామున లేచే వారికి సూర్య చంద్రులు, నక్షత్రాల నుంచి కాంతి పూర్తిగా అంది, తద్వారా వారిలో నిద్రిస్తున్న జీవశక్తి చైతన్యవంతమవుతుంది. 

భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. కానీ దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును ప్రకృతిలో లీనం చేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం మనవెంటే ఉంటాయి. ఇందుకు బ్రాహ్మీ ముహూర్తం ఎంతో అనువుగా ఉంటుంది. ఆయుర్దాయాన్ని, ఆయుర్వ ృద్ధిని కోరుకునే వారు తప్పనిసరిగా బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేవాలని దేవీభాగవతం కూడా చెబుతోంది.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన వాయువు (కాలకృత్యాల నిర్వహణలో తోడ్పడే వాయువు) సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరాన్నుంచి వదిలించి వేస్తుంది. అలాగే తెల్లవారు జామున శరీరంలోకి ప్రాణవాయువు కూడా ఎక్కువ తీసుకోగలం. సాధారణంగా తెల్లవారు జామున మాత్రమే రెండు నాసికా రంధ్రాల నుంచీ వంద శాతం గాలి పీల్చగలం. మిగతా సమయాల్లో ఒకటి 50 శాతం, ఒకటి 100 శాతం పని చేస్తాయి.

ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే

మనిషి ఏ సమయంలో నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే ఏం చెయ్యాలి. శరీరానికి నిద్రమత్తును దూరం చేస్తూ, కళ్ళు తెరచి ఈ లోకాన్ని చూసేందుకు ముందుగా పాటించాల్సిన ఆచార క్రమం ఏమిటనే విషయాన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. వాటి ప్రకారం

బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితమ్‌ ।

స్మరణం వాసుదేవస్య కుర్యాత్‌ కలిమలాపహమ్‌ ॥

సూర్యుడు ఉదయించడానికి రెండు ముహూర్తాలు ముందుగా నిద్రలేవాలి. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో తప్పనిసరిగా నిద్ర నుంచి మేల్కొనాలి. నిద్ర లేచిన తర్వాత వాసుదేవుని అంటే తనకు ఇష్టం అయిన దేవుడిని తలచుకోవాలి.

హరే రామ హరే రామ రామ రామ హరే హరే । 

         హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ॥

విశ్వేశం కేశవం ధుంఢరి దండపాణిం చ భైరవం । 

        వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం ॥

ఇలా ఇష్టమైన దైవానికి సంబంధించిన ప్రార్థన చేసుకోవాలి . దైవస్మరణం తరువాత మెల్లగా కళ్ళు తెరిచి కుడి అరచేయిని కింది నుంచి పైకి చూస్తూ 

కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ । కరమూలే తు గౌరీ చ ప్రభాతే కరదర్శనమ్‌ ॥

అరచేయి కిందివైపు చివర లక్ష్మిని , మధ్యలో సరస్వతిని , మొదట్లో గౌరిని స్మరించాలి . తర్వాత శుభాశుభాలు ఏవి చూసినా ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత

సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే । 

       విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ॥ 

అంటూ భూదేవిక ప్రార్థనా పూర్వక నమస్కారం చేసి, ఆ తర్వాతనే కాలు నేలపై మోపాలి.

    తెల్లవారు జాము సమయం ఎంతో శక్తివంతమైంది. పవిత్రమైంది. ఈ సమయంలో లేచి పని చేసుకుంటూ ఉంటే అసలు చెడు తలంపులు వచ్చేవి కావు. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల తెల్లవారు జామున లేవలేకపోతే ఈ ప్రపంచం నన్ను వదిలేసి తన పనిని ప్రారంభించేసిందని నాలో నేనే సిగ్గుపడేవాడిని.  - ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్‌

--------------------------------------------------------------------

రచన
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
కొత్తూరు తాడేపల్లి, విజయవాడ రూరల్ మండలం
కృష్ణా జిల్లా - 5200012
సెల్ : 90320 44115 / 8897 547 548


 

Tuesday, December 14, 2021


 

అద్వైతామృత వర్షిణి
(మార్గశిర శుద్ధ ఏకాదశి గీతాజయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)


ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం రణరంగంగా మారింది. అపారమైన సేనావాహిని కనుచూపుమేరలో ఉన్న భూమినంతా ఆక్రమించింది. కోట్ల కొద్దీ సిద్ధంగా ఉన్న సైన్యం తమ నాయకుల ఆజ్ఞకోసం ఎదురుచూస్తోంది. యోధాగ్రేసరులు దివ్యమైన శంఖాలను పూరిస్తున్నారు. యుద్ధభేరీలు మోగుతున్నాయి. ఆ శబ్దాలకు దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రతి హృదయంలోనూ తీవ్రమైన యుద్ధకాంక్ష తేజరిల్లుతోంది.... ఒక్క అర్జునుడి హృదయంలో తప్ప.

అందరూ రక్తసంబంధీకులే కదా? ఎవరితో యుద్ధం చేయాలి? ఎందుకు చేయాలి? ఎవరిని చంపాలి? బంధువులందరినీ చంపుకుని నేను సాధించేదేమిటి? అల్పమైన రాజ్య సుఖాల కోసం నావాళ్ళందరినీ చంపుకోవాలా? బంధువులంతా చనిపోయాక, రాజ్యం సాధిస్తే, మిగిలేదేమిటి? అలలు అలలుగా సందేహాలు అర్జునుడి హృదయంలో ఎగసిపడుతున్నాయి. చేయి పట్టుతప్పుతోంది. ధనుర్బాణాలు జారిపోయాయి.

సారథిగా ఉన్న శ్రీకృష్ణుడు అంతా గమనిస్తున్నాడు. విషాదం నిండిన అర్జునుడి హృదయంలో చైతన్యజ్వాల రగిలించాల్సిన అవసరాన్ని గుర్తించాడు.

కానీ, సమయం చాలా స్వల్పంగా ఉంది. చెప్పాల్సిన విషయం అనంతంగా ఉంది. వెంటనే ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు భగవానుడు. ‘గీత’ బోధించాడు. అర్జునుడి నైరాశ్యాన్ని పోగొట్టాడు. జగద్గురువుగా అవతరించాడు. అర్జునుడి పేరుతో మానవాళికి ‘గీతామృతం’ లభించింది.

శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణ స్వరూపం. అర్జునుడు నరుడు. అంటే, సమస్త మానవాళికి ప్రతినిధి. అర్జునుడికి కలిగిన సందేహాలు నిత్యం మనుషులకు కలిగే సందేహాలే. అలజడులను తొలగించి, సందేహాలను నివృత్తి చేసి, ఆనందప్రాప్తిని కలుగజేసింది భగవద్గీత. అదొక అద్వైత తత్త్వగీతిక. భక్తి, యుక్తి, ముక్తి.... ఈ మూడిరటిని మానవాళికి ప్రసాదించిన సర్వోత్కృష్ట గ్రంథం ‘భగవద్గీత’.

గీత - ఆవిర్భావం

భగవద్గీత ఆవిర్భవించిన సన్నివేశమే చాలా విచిత్రంగా ఉంటుంది. ఖిన్న మనస్కుడైన అర్జునుడి విషాదాన్ని పోగొట్టటానికి భగవంతుడు చేసిన బోధ ఇది. అలా, అర్జునుడి విషాదాన్ని పోగొట్టటం కోసం ఆవిర్భవించిన ‘గీత’, మొత్తం విశ్వానికే చైతన్య ప్రబోధ గీతికగా మారింది. ఇక్కడ, అర్జునుడి విషాదం ఒక నెపం మాత్రమే. భగవంతుడు మానవాళికి బోధ చేయాలనుకున్నాడు. అందుకు తగిన వేదికను ఆయనే కల్పించాడు. అదే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం. సాక్షాత్తు ఆదిశంకరులే భగవద్గీతకు భాష్యం రాస్తూ...‘తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సారసంగ్రహ భూతం’ అన్నారు.

అర్జునుడు సామాన్య మానవుడు కాదు. విష్ణు అంశతో పుట్టినవాడు. అంతటి మహానుభావుడికి విషాదం కలుగుతుందా? అంటే అదొక మాయ. మహానుభావుల విషాదం లోక కల్యాణ కారకంగా ఉంటాయి. (క్రౌంచ పక్షి మరణం చూసిన వాల్మీకి కలిగిన విషాదం కూడా రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించింది కదా) 

సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః

పార్థో వత్స: సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతమ్మహత్‌ ॥

సకల ఉపనిషత్తులను గోవుగా చేసి, అర్జునుడిని దూడగా మలిచి, గోపాల నందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా గోపాలకుడిగా మారి, ఒక పక్క అర్జునుడికి పాలను (సకల ఉపనిషత్తుల సారాంశాన్ని) అందిస్తూనే, మరోపక్క లోకానికి అందించాడు. ఎంత అద్భుతమైన సన్నివేశం ఇది!

మానవాళికి గీతా సందేశం 

భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ‘యోగము’ అంటారు. ఒకటి నుంచి ఆరు వరకు ఉన్న అధ్యాయాల్ని ‘కర్మషట్కం’ అని, ఏడు నుంచి 12 వరకు ఉన్న అధ్యాయాల్ని ‘భక్తి షట్కం’ అని, 13 నుంచి 18 వరకు ఉన్న అధ్యాయాల్ని ‘జ్ఞాన షట్కం’ అని అంటారు. ‘కర్మ’ ‘జ్ఞానం’గా మారటమే భగవద్గీతా సారాంశం. 

- మృత్యువు కేవలం శరీరం నుంచి ఆత్మను వేరు చేస్తుంది. ఆత్మకు చావు లేదు. ఆత్మ నిత్య సత్యమైంది.

- తనను తాను తెలుసుకోవటం, తనలోని అంతరాత్మను తెలుసుకోవటమే జ్ఞానం.

- అభ్యాస, వైరాగ్యాల ద్వారా  వస్తు ప్రపంచాన్ని వదలిపెట్టి, సర్వోత్క ృష్టమైన పరబ్రహ్మాన్ని చేరుకోవటం యోగి అయిన వ్యక్తి లక్షణంగా ఉండాలి. 

- భగవంతుడిని చేరుకోవటానికి భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలు ఉన్నాయి. వీటిలో ఏ మార్గం అనుసరించాలనేది భక్తుడి ఇష్టం. అంతిమఫలితం ఒకటే. 

- మనిషి కర్మ చేయకుండా ఉండలేడు. ఉండకూడదు కూడా. కాబట్టి, కర్మఫలితాన్ని అనుభవించక తప్పదు. అలాగని, కర్మ చేయటాన్ని విడిచిపెట్టకూడదు. కర్తవ్యాన్ని నిర్వహించి, ఫలితాన్ని భగవంతుడికి వదలేయాలి.

- సృష్టిలోని సమస్త ప్రాణులూ భగవంతుని స్వరూపాలే. మనం చేసే అన్ని పూజలు, అర్చనలు, హామాల ఫలితాలు భగవంతుడికే చెందుతాయ. 

- ప్రపంచంలోని జీవులన్నీ సత్వ, రజ, స్తమో గుణాలతో బంధించబడి ఉంటాయి. భగవంతుని పాదాలను ఆశ్రయించినవారికి ఈ బంధాల నుంచి విముక్తి కలుగుతుంది.

- జయాపజయాలు, లాభనష్టాలు, సుఖదు:ఖాలు... అన్నీ భగవంతుడు ఇచ్చినవే. దేనికీ పొంగిపోకూడదు. విచారించకూడదు. 

- భక్తి, సాధన అనే పేర్లతో కాలక్షేపం పనికిరాదు. కర్తవ్యాన్ని విస్మరించటం ఏ మాత్రం తగదు. కర్మ చేయని వాడిని భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో అనుగ్రహించడు. 

మహాత్ముల దృష్టికోణంలో భగవద్గీత

స్వామి వివేకానంద : గీతలో పరమాత్మ చెప్పినవి కేవలం శ్లోకాలో, మాటలో కావు. అవి ఆధ్యాత్మిక జ్ఞాన కళికలు. ఉపనిషత్తులు అనే తోట నుంచి సత్యము అనే పుష్పాలను ఏర్చికూర్చి అల్లిన పుష్పమాలిక భగవద్గీత. మనిషి జీవితం మొత్తాన్ని ప్రతిబింబించే అద్భుత దర్శనం ఇది.

బాల గంగాధర తిలక్‌ : ప్రపంచ సాహిత్యాలన్నిటిలో భగవద్గీతకు సాటిరాగలిగిన పుస్తకం మరొకటి లేదు. వర్ణించటానికి అలవికానటువంటి ప్రకాశంతో వెలుగొందే మణి భగవద్గీత. సమ్నుతమైన బ్రహ్మానందాన్ని అనుభవింపజేయటానికి అదొక అత్యుత్తమ సాధనం. 

సద్గురు మలయాళస్వామి : సంసార సాగరాన్ని దాటటానికి భగవద్గీత కన్నా సులభమైన మార్గం మరొకటి లేదు. గీతలో చెప్పిన అంశాల్ని ఆచరణలోకి తీసుకువస్తే, అంతకుమించిన పరమార్థం మరెక్కడా లభించదు.

అరవింద యోగి : మనిషి తన మేథస్సంతా ధారపోసినా భగవద్గీత అందించే జ్ఞానంలోని ఒక అంశాన్ని మాత్రమే అవగాహన చేసుకుని, ఆచరణలోకి తీసుకురాగలుగుతాడు.

మదన మోహన మాలవ్య : నాకు తెలిసినంతవరకు విశ్వవాజ్ఞ్మయంలో భగవద్గీతను మించిన గ్రంథం మరొకటి లేదు. ఇది హిందువులకు సంబంధించింది మాత్రమే కాదు. సమస్త మానవకోటికి ధర్మభాండాగారంగా ఉంటుంది.

వినోబాభావే : నా శరీర వికాసానికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడ్డాయో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకన్నా ఎక్కువగా ఉపయోగపడిరది.

ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ : భారతదేశానికి చెందిన స్వర్నోతమైన ఈ గ్రంథం లేకపోవటం వల్ల ఆంగ్లసాహిత్యం ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉండిపోతుంది.

వారన్‌ హేస్టింగ్స్‌ : ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకునే మానవుడికి భగవద్గీతను మించిన సాధనం ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు.

బంకించంద్ర ఛటర్జీ : భగవద్గీతలో ఉన్నటువంటి అపూర్వమైన ధర్మ సమన్వయం, అద్భుతమైన వ్యాఖ్య, ప్రపంచంలోని ఏ దేశంలోను, ఏ కాలంలోనూ, ఏ వ్యక్తీ దర్శించి ఉండదు. కనీసం విని కూడా ఉండడు. 

అరుదైన ఘనత

ప్రపంచంలోని అన్ని భాషల సాహితీ గ్రంథాలకు దక్కని అరుదైన ఘనత కేవలం భగవద్గీతకు మాత్రమే దక్కింది. అదే గీతాజయంతి. అంటే భగవద్గీత పుట్టినరోజు. శంకరజయంతి, వ్యాసజయంతి, హనుమజ్జయంతి ... ఈవిధంగా దేవతలకు, మహాత్ములైన యోగీశ్వరులకు జయంతులు ఉండటం లోక సహజం. కానీ, వీటన్నిటికి భిన్నంగా ఒక గ్రంథానికి జయంతి నిర్వహించటం కేవలం భగవద్గీతకే చెల్లింది. మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత ఈ లోకంలో అవతరించిన రోజు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అర్జునుడి విషాదాన్ని తొలగించటానికి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రబోధాన్ని ‘గీత’గా వినిపించిన రోజు ఇది. అర్జునుడి పేరు మీద సకల మానవాళికి భగవంతుడు చేసిన బోధ ఇది. అర్జునుడి విషాదమే కాదు.. యావత్‌ మానవజాతి బాధల్ని పోగొట్టే శక్తి కేవలం భగవద్గీతకు మాత్రమే ఉంది. అందుకే భగవద్గీతకు మాత్రమే జయంతి చేయటం ఆచారంగా ఏర్పడిరది. భగవంతుడితో సమానంగా పూజను అందుకున్న పుస్తకరాజం భగవద్గీత.

గీతాపారాయణ ఫలితాలు

ప్రథమోధ్యాయం : పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. పాపము నశించి, ఉత్తమ జన్మ కలుగుతుంది.

ద్వితీయోధ్యాయం : ఆత్మజ్ఞానం కలుగుతుంది.

తృతీయోధ్యాయం : పాపనాశనం కలిగి, ప్రేతత్వ బాధ నుంచి విముక్తి కలుగుతుంది.

చతుర్థోధ్యాయం : చెడు ఆలోచనలు తొలగుతాయి. శాప విమోచనం కలుగుతుంది.

పంచమోధ్యాయం : వైకుంఠ నివాస యోగ్యత కలుగుతుంది. ఈ అధ్యాయాన్ని విన్నంతనే పశుపక్ష్యాదులకు సైతం జీవన్ముక్తి కలుగుతుంది.

షష్ఠాధ్యాయం : దివ్య తేజస్సు కలుగుతుంది.

సప్తమోధ్యాయం : నీచ జన్మల నుంచి విముక్తి కలుగుతుంది. సంసార సాగర విముక్తి కలుగుతుంది.

అష్టమ అధ్యాయం : సర్వవిధాలైన దుర్గతుల నుంచి విముక్తి కలుగుతుంది. 

నవమ అధ్యాయం : ప్రతి గ్రహణం చేయటం వల్ల వచ్చే పాపం నశిస్తుంది. 

దశమ అధ్యాయం : అనంతమైన దేవసహాయం అందుతుంది.

ఏకాదశ అధ్యాయం : రాక్షస పీడ తొలగిపోతుంది.

ద్వాదశ అధ్యాయం : దివ్యశక్తులు కలుగుతాయి.

త్రయోదశ అధ్యాయం : పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. సద్గతులు కలుగుతాయి.

చతుర్దశ అధ్యాయం : ఆత్మస్మ ృతి కలుగుతుంది. శత్రు జయం కలుగుతుంది. 

పంచదశ అధ్యాయం : ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి.

షోడశ అధ్యాయం : ధైర్యసాహసాలు కలుగుతాయి. జంతువశీకరణ సిద్ధి కలుగుతాయి.

సప్తదశ అధ్యాయం : సర్వ వ్యాధులు నశిస్తాయి.

అష్టాదశ అధ్యాయం : అనేకమైన పుణ్యఫలితాలు కలుగుతాయి. సిద్ధశక్తులు కలుగుతాయి. 

రథి - సారథి

సాధారణంగా భగవద్గీత అనగానే నాలుగు గుఱ్ఱాలు పూన్చిన ఒక రథం, దాని పక్కన గీత బోధిస్తున్న కృష్ణుడు, మోకాళ్ళ మీద కూర్చుని దోసిలి పట్టి కృష్ణుడిని ప్రార్థిస్తున్న అర్జునుడు  `  ఈ చిత్రం కనిపిస్తుంది. భారతయుద్ధం ప్రారంభ సమయంలోనే తన రథానికి సారథిగా ఉండమని శ్రీకృష్ణుడిని అర్థిస్తాడు పార్థుడు. సరే ` అంటాడు కృష్ణుడు. అంటే, భారతయుద్ధంలో రథి అర్జునుడు కాగా సారథి శ్రీకృష్ణుడు. ఇందులో విశేషమైన అర్థాలు గోచరిస్తాయి. 

రథాన్ని అధిరోహించిన అర్జునుడు - జీవుడు

రథం         - శరీరం

రథసారథి                 - కృష్ణుడు

కళ్ళెం         - మనస్సు

గుఱ్ఱాలు             - ఇంద్రియాలు

మార్గం             - ఇంద్రియ విషయాలు

ఆత్మ     - భక్తి


నేర్పరి అయిన సారథి ఉంటే రథి మరింత ఉత్సాహంగా, నేర్పుగా యుద్ధం చేయగలుగుతాడు. అంటే, సమర్థుడైన సారథే విజయానికి పునాదిగా ఉంటాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆధ్యాత్మికంగా సమన్వయం చేస్తే, అనంతమైన జీవనయానమనే రథాన్ని నడిపించే సారథి భగవంతుడు. కాగా, రథి ` మానవుడని తెలుస్తుంది. నేనే ఈ సంసారాన్ని నడిపిస్తున్నాను అనే మాయ నుంచి మనిషి విముక్తుడు కావాలి. తాను నిమిత్త మాత్రుడననే భావన కలగాలి. ఇందుకోసం మనిషికి బోధన చేసే గురువు సారథి అవుతాడు. గురూపదేశాన్ని ఆచరించే మనిషి ‘రథి’ అవుతాడు. ఇదే రథి ` సారథి చిత్రం అందించే సందేశం.

‘గీత’ అంటే భగవద్గీతేనా?

భారతంలోనే ‘హంస గీత’, ‘అనుగీత’ వంటి చాలా ‘గీత’లు ఉన్నాయి. భాగవతంలో కపిలగీత,  ఉద్ధవ గీత, రుద్రగీత వంటి ‘గీత’లు ఎన్నో ఉన్నాయి. వీటితోపాటు పురాణంల్లో దేవీగీత, శివగీత,  గణేశగీత వంటి అనేక ‘గీత’లు ఉన్నాయి. ఇవన్నీ ఆయా గీతలుగా పేరు పొందాయి. వీటన్నిటికన్నా భిన్నంగా ‘గీత’ అంటే భగవద్గీత అన్నంతగా ప్రసిద్ధి పొందింది కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన గీత. నిజానికి, ఇతర గీతలన్నీ ఆయా గీతల్లోని ప్రధాన వ్యక్తులు / సందర్భాల పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ కోణంలో చూస్తే మన ‘గీత’ కృష్ణగీత అవ్వాలి. కానీ, ‘భగవద్గీత’ అనే పేరు వచ్చింది.

ఇందుకు కారణం ఏమిటంటే... అప్పటిదాకా ఉన్న ‘గీత’ల సమన్వయం, సారాంశం అంతా కృష్ణుడు చెప్పిన ‘గీత’లో ఉంది. భారతయుద్ధం ద్వాపర యుగం చివరి రోజుల్లో, అంటే... కలియుగం ప్రారంభపు రోజుల్లో జరిగింది. యుద్ధప్రారంభంలో ‘గీత’ ఆవిర్భవించింది. రెండు యుగాల సంధికాలంలో ఆవిర్భవించంటం శ్రీకృష్ణుడు చెప్పిన గీత యొక్క విశేషం. అంతేకాదు, సకల ఉపనిషత్తు సారాంశం కృష్ణుడు చెప్పిన గీతలో ఉంది. బ్రహ్మవిద్యకు ఇది ఆలంబనగా ఉంది. అందుకనే,ఈ ‘గీత’ సకల విద్యలకు ఆలవాలంగా, పరిపూర్ణగ్రంథంగా యావత్ప్రపంచ అంగీకారాన్ని అందుకుంది. సాక్షాత్తు భగవంతుడే భక్తుడికి చెప్పిన గీత ఇది. అర్జునుడు అనే పాత్రను అడ్డంగా పెట్టుకుని, రాబోయే కలియుగంలో మానవుడు ఆచరించాల్సిన కర్తవ్యాన్ని బోధించాడు పరమాత్మ. అందుకనే, భారతయుద్ధంలో వెలసిన ‘గీత’ భగవద్గీత అయింది. ‘గీత’ అనే పదం ‘భగవద్గీత’కు సామాన్యవాచకంగా మారింది. భాషా, ప్రాంత పరిధులు దాటి విశ్వం మొత్తానికి గురుస్థానాన్ని ఆక్రమించింది. 


జయతు జయతు గీతా కృష్ణవక్త్ర ప్రభూతా
జయతు జయతు గీతా సర్వలోకైక మాతా
జయతు జయతు గీతా దైవసంపత్ప్రపూతా
జయతు జయతు గీతా విశ్వశాంతి ప్రసూతా

రచన: డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ



Saturday, November 6, 2021

దసరా ఆయుధ పూజ రహస్యాలు, అంతరార్థాలు


దసరా ఆయుధ పూజ రహస్యాలు, అంతరార్థాలు









---------------------------------------
దసరాల్లో చేసే ఆయుధ పూజ అంతరార్థాలు, రహస్యాల గురించి
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (సెల్ నంబరు : 90320 44115 / 8897 547 548) 
శ్రీశైలప్రభ మాసపత్రిక అక్టోబరు 2021 సంచికలో రాసిన వ్యాసం 

 

Thursday, November 4, 2021

రుద్రాభిషేక వైభవం (రుద్రాభిషేక నియమాలు, విధానాలు, ఫలితాలు)


 

శ్రీరామ

రుద్రాభిషేక వైభవం

            ఈశ్వరా! అని భక్తితో గొంతెత్తి పిలిచినంతలోనే భక్తులను కటాక్షించే పరమ కారుణ్యమూర్తి పరమేశ్వరుడు. కేవలం చెంబుడు గంగతో అభిషేకం చేసినంతనే అక్షయ పుణ్యాన్ని ప్రసాదించే బోళామూర్తి ఈశ్వరుడు. అనంతమైన కాలస్వరూపుడైనా చేరవచ్చిన అందరినీ ఆదరించే పరమ దయాళువు రుద్రుడు. ఇంతటి సర్వోన్నత దైవాన్ని పూజించి, తరించటానికి సకల శాస్త్రాలు, ఆగమాలు నిర్దేశిస్తున్న అర్చనావిధానం ‘రుద్రాభిషేకం’.
            శివునికి అభిషేకం చేయటానికి సర్వసాధారణంగా వినియోగించే మంత్రాలు నమక, చమకాలు. శ్రీకృష్ణ యజుర్వేదంలో అంతర్భాగంగా ఉండే నమక, చమకాలను కలిపి సాధారణ పరిభాషలో రుద్రాధ్యాయంఅనీ, ‘రుద్రంఅనీ వ్యవహరిస్తుంటారు. ఈ మంత్రాలతో శివునికి చేసే అభిషేకం అనంతమైన పుణ్యఫలితాన్ని అందిస్తుంది.
యం యం కామయతే మర్త్యో లింగార్చన పరాయణః ।
తం తమాప్నోతి విప్రేంద్ర మత్ప్రసాదాన్నసంశయః ॥
            లింగార్చన చేసే భక్తుడు తన మనసులో ఏయే కోరికలు తీరాలని భావిస్తున్నాడో, అవన్నీ నా అనుగ్రహం వల్ల తప్పక నెరవేరుతాయని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినట్లు శైవాగమాలు ప్రకటిస్తున్నాయి.
            లింగార్చన లేదా రుద్రాభిషేకం వల్ల కలిగే ఫలితం అనంతం అనీ, ఎప్పటికీ నశించదనీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. యజ్ఞ, యాగ, దాన, తపస్సుల వల్ల కలిగే ఫలితం కేవలం రుద్రాభిషేకం వల్ల కలుగుతుంది. అయితే, కోరికను అనుసరించి, కొన్ని ఆచారవిధానాలను శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. వీటితోపాటు రుద్రాభిషేకం ఏయే సమయాల్లో చేయాలి? ఎలా చేయాలి? ఎటువంటి లింగాన్ని అర్చించాలి? ఇందుకు అనుసరించాల్సిన విధానాలేమిటి? మొదలైన విషయాలను కూడా ఆగమాలు విస్పష్టంగా పేర్కొంటున్నాయి.

 

శివాభిషేక నియమాలు

          రుద్రాభిషేకాన్ని తప్పనిసరిగా శైవాగమాన్ని అనుసరించే చేయాలని సాక్షాత్తు ఆదిశంకరులు చెప్పారు. సిద్ధాంత సారావళికూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తోంది.

 

అష్టాదశాసు విద్యాసు మీమాంసాపి గరీయసి

తతోపి తర్కశాస్త్రాణి పురాణం తేభ్య ఏవ చ

తతోపి ధర్మశాస్త్రాణి తేభ్యో గుర్వీశ్రుతిర్ద్విజా

తతోప్యుషనిషచ్ఛ్రేష్ఠస్తత శ్శైవాగమోధికః ॥

 

            అష్టాదశ విద్యల్లో మీమాంస, మీమాంస కంటే తర్కం, తర్కం కంటే పురాణాలు, పురాణాల కంటే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రాల కంటే వేదాలు, వేదాల కంటే ఉపనిషత్తులూ, ఉపనిషత్తుల కంటే శైవాగమాలు గొప్పవి. వీటినే వేదాగమాలని కూడా అంటారు. ఈశ్వరప్రోక్తం కావటం వల్ల కారణాగమం, కామికాగమం వంటి శైవాగమాలు చాలా గొప్పవి. కాబట్టి, శైవాగమాలు చెప్పిన పద్ధతుల్లో రుద్రాభిషేకం చేయాలి.

 

·        తడివస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. భుజం మీద కూడా తడివ్రస్తం ధరించకూడదు.

·        అభిషేక సమయంలో పూర్తిగా మౌనాన్ని పాటించి, చిత్తాన్ని పరమేశ్వరుని మీదనే లగ్నం చేయాలి.

·        కాళ్ళు చాపుకుని కూర్చొనటం, ఇతరులతో సంభాషించటం, స్త్రీలతో సరస సంభాషణ, తర్కించటం, అసత్య సంభాషణ పనికిరాదు.

·        పరనింద, పరస్తుతి చేయకూడదు.

·        గట్టిగా మాట్లాడకూడదు. విచారవదనంతో ఉండకూడదు.

·        అభిషేక సమయంలో యజమాని దీర్ఘరోగుల్ని, కుక్కల వంటి జంతువులను చూడకూడదు. స్పృశించకూడదు. ప్రమాదవశాత్తు చూసినట్లయితే 108 సార్లు ఓంకారాన్ని జపించి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.

·        భస్మధారణ చేయకుండా అభిషేకం చేయకూడదు.

·        అభిషేకానికి ముహూర్త నిర్ణయం అవసరం లేదు. వర్జ్యదోషాలు ఉండవు.

·        శివలింగ పీఠం మీద పూజాద్రవ్యాలు, గంధపాత్రలు, బెల్లం ముక్క, కొబ్బరిచెక్క మొదలైన పదార్థాలు ఉంచకూడదు.

·        అభిషేక సమయంలో తుమ్మటం, దగ్గటం, ఉమ్మివేయటం, అసత్యం పలకటం చేయకూడదు. నియమభంగం జరిగితే  యజయాని ఆచమనం చేసి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.

·        సంకల్పం చేయటానికి ముందు, అభిషేక సమయంలో, ఆ ధూప, దీప, నీరాజన సమయాల్లో తప్పనిసరిగా గంట మోగించాలి. ఘంటానాదం చేయకుండా చేసే అభిషేకం ఫలితాన్ని ఇవ్వదు.

 

రుద్రాభిషేక విధి

             రుద్రాభిషేకం చేయటానికి మొత్తం ఎనిమిది విధానాలు, వాటివల్ల కలిగే ఫలితాలు రుద్రకల్పంలోని విష్ణ్వీశ్వర సంవాద విభాగంలో వర్ణితమై ఉన్నాయి. అవేమిటంటే...

 

1. వారం: నమకంలో మొత్తం 11 అనువాకాలు ఉంటాయి. ఒకసారి నమకంలోని 11 అనువాకాలు చెప్పి, చమకంలో ఒక అనువాకం (చమకంలో కూడా 11 అనువాకాలు ఉంటాయి) చొప్పున వరుసగా చెప్పాలి. ఈవిధంగా 11 సార్లు నమకం చెబితే, చమకంలోని 11 అనువాకాలు చెప్పటం పూర్తవుతుంది. ఇలా చేసిన అభిషేకానికి వారంఅని పేరు.

2. ఆవృత్తి: నమకం 121 సార్లు, చమకం 11 సార్లు. పృథివీ రూపధారి అయిన రుద్రప్రీతి కలుగుతుంది. సర్వపాపాలు తొలగుతాయి. జలరూపధారి అయిన శివప్రీతి కలుగుతుంది. ఫలితంగా సకల సుఖాలు లభిస్తాయి.

3. రుద్రం: నమకం 1,331 సార్లు, చమకం 121 సార్లు. తేజోరూపధారి అయిన శంకరుని ప్రీతి కలుగుతుంది. ఫలితంగా సర్వ సంపదలు కలుగుతాయి.

4. ఏకాదశ రుద్రం: నమకం 14,641 సార్లు, చమకం 1,331 సార్లు. వాయురూపధారి అయిన పరమేశ్వరునికి ప్రీతి కలిగి, తద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది.

5. శతరుద్రం: నమకం 1,61,051 సార్లు, చమకం 14,641 సార్లు. ఆకాశరూపధారి అయిన మహేశ్వరునికి ప్రీతి కలుగుతుంది. ఫలితంగా పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది.

6. లఘురుద్రం: నమకం 17,71,561 సార్లు, చమకం 1,61,051 సార్లు. సూర్యరూపధారి అయిన ఈశ్వరప్రీతి కలుగుతుంది. పునర్జన్మ నివృత్తి అవుతుంది.

7. మహారుద్రం: నమకం 194,87,171 సార్లు, చమకం 17,71,561 సార్లు. చంద్రరూపధారి అయిన రుద్రునికి ప్రీతి కలుగుతుంది. జ్ఞానవృద్ధి కలుగుతుంది.

8. అతిరుద్రం: నమకం 21,43,58,881 సార్లు, చమకం 194,87,171 సార్లు. సర్వరూపి అయిన పరమేశ్వరునికి ప్రీతి కలుగుతుంది. ఫలితంగా చెప్పటానికి అలవికాని మహాఫలితాన్ని యజమాని పరమేశ్వర వరప్రసాదంగా అందుకుంటాడు.

            శ్రావణ కార్తిక మాసాల్లో, విశేషంగా మాఘమాసంలో ఏదైనా పవిత్ర పుణ్యక్షేత్రంలో, నదీతీరంలోగాని, పర్వత ఉపరిభాగంలో కానీ, పశ్చిమాభిముఖ ద్వారం ఉన్న శివాలయంలోని గానీ యజమాని 11 మంది బ్రాహ్మణులను ఏర్పాటుచేసుకుని రుద్రాభిషేకం చేస్తే తప్పకుండా ముక్తి కలుగుతుంది.

            యజమాని తన అభీష్టాన్ని, శక్తిని అనుసరించి వీటిల్లో ఏదో ఒక విధానాన్ని ఎంచుకుని, రుద్రాభిషేకం చేయాలి.

 

శివాభిషేక ఫలితాలు

 

·        భస్మాన్ని ధరించి, భస్మశయ్యపై పడుకుని, నిశ్చలబుద్ధితో రుద్రాన్ని పారాయణ చేస్తే పంచమహాపాతకాలు కూడా పటాపంచలు అవుతాయని పరాశరస్మృతి చెబుతోంది.

·        సురాపానం, బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా రుద్రాభిషేకం వల్ల తొలగటంతో పాటు సంసారబంధాల నుంచి విముక్తి కలుగుతుంది.

·        రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయటం వల్ల రహస్యంగా చేసిన పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

·        ఎటువంటి మమకారం లేకుండా, ఫలాపేక్ష రహితంగా రుద్రాధ్యాయాన్ని పారాయణ చేస్తే సశరీరంగా కైలాసగమన సిద్ధి కలుగుతుందని వాయుపురాణం చెబుతోంది.

·        దుస్స్వప్నం వల్ల కలిగే దోషం, గ్రహదోషాల నివారణకు రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయాలని లింగపురాణంలో ఉంది.

·        రుద్రాభిషేకంతో పాటు రుద్రపారాయణ చేయటం వల్ల సంతానహీనులకు సత్సంతానం కలుగుతుందని ఆపస్తంబ సూత్రం చెబుతోంది.

·        శ్రేష్ఠమైన మృత్తిక (మట్టి), కస్తూరి రెండిటి మిశ్రమంతో నిర్మించిన లింగాన్ని అభిషేకించి, పూజించినట్లయితే సంపదలు కలుగుతాయి.

·        మృత్తికతో శ్రీగంధం కలిపి తయారుచేసిన లింగాన్ని సశాస్త్రీయంగా 20 రోజులు పూజించి, అభిషేకం చేస్తే తాపజ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది.

·        కస్తూరీ మిశ్రమంతో తయారుచేసిన మృణ్మయలింగాన్ని పదిరోజుల పాటు భక్తియుక్తంగా పూజించి, అభిషేకాదులు నిర్వహిస్తే ఆత్మదోష జనితమైన సర్వరోగాలు నశిస్తాయి.

·        చక్కెర కలిపి తయారుచేసిన మృణ్మయ లింగాన్ని మూడు నెలలపాటు సశాస్త్రీయంగా పూజిస్తే, సభల్లో నేర్పుగా మాట్లాడే శక్తి, కవిత్వసిద్ధి కలుగుతాయి.

·        మృత్తికలో బియ్యపుపిండి కలిపి తయారుచేసిన లింగాన్ని మూడు నెలల పాటు శాస్త్రవిధిగా అర్చించి, అభిషేకం చేస్తే పుత్రసంతానం కలుగుతుంది.

·        మృత్తికలో పసుపు కలిగి, 108 రోజుల పాటు శాస్త్రవిధిగా అభిషేకం చేస్తే సర్వజనాకర్షకమైన రూపం, ఐశ్వర్యం కలుగుతాయి.

·        మృత్తికలో ఆవునెయ్యి కలిపి, లింగాన్ని తయారుచేసి, 50 రోజుల పాటు అభిషేకం చేస్తే పైత్యరోగం నివారణ అవుతుంది.

·        ఎర్రని గంధం కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి 32 రోజులు అభిషేకం చేస్తే దగ్గు, దమ్ము రోగాలు నివారణ అవుతాయి.

·        ఇనుపచూర్ణం, మృత్తిక కలిపి లింగాన్ని తయారుచేసి, 22 రాత్రులు శాస్త్రవిధిగా అభిషేకార్చన చేస్తే, శత్రునాశనం కలుగుతుంది.

·        నువ్వులు కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి ఏడురోజుల పాటు నిర్మలభక్తితో అభిషేకం చేస్తే యమబాధలు నశిస్తాయి.

·        నిత్యం రుద్రాభిషేకం చేయటం వల్ల భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షస బాధలు నశిస్తాయి.

 

గృహేత్వేక గుణం ప్రోక్తం నదీతీరే సహస్రకం ।

దేవతాయతనేలక్షం శతలక్షం హరేర్గృహే ।

శివాలయే కోటి గుణం శివే స్వాయంభువే పునః ।

అనంతం పూజనం శంభోః ఋతం వచ్మిద్విజోత్తమ ॥

 

            రుద్రాభిషేకం చేసే స్థలాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఇంట్లో చేసే లింగార్చన వల్ల ఒకభాగం ఫలితం కలుగుతుంది. నదీతీరంలో చేస్తే అందుకు వేయి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. దేవతానివాసాల్లో చేసే అభిషేకానికి లక్ష రెట్లు ఎక్కువ ఫలితం, విష్ణ్వాలయంలో చేసే అభిషేకానికి నూరు లక్షల రెట్లు ఎక్కువ ఫలితం, శివాలయాల్లో చేసే అభిషేకానికి కోటిరెట్లు, పర్వతగుహల్లో చేసే అభిషేకానికి పదికోట్ల రెట్లు, ఆ గుహ ఋష్యాశ్రమం కూడా అయితే కోటికోట్ల రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. బ్రహ్మక్షేత్రంలో (కాశీక్షేత్రం) శివాభిషేకం చేస్తే అమితమైన ఫలితం లభిస్తుందని ఆగమాలు ప్రకటిస్తున్నాయి.

----------------------------

 రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 90320 44115 / 88975 47548


Monday, November 1, 2021

ఆ వెలుగులు... జీవితానికి జిలుగులు (దీపావళి దీపాల అంతరార్థం)


 ఆ వెలుగులు... జీవితానికి జిలుగులు


పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికీ, తైలం జలతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్ని తత్వానికీ ప్రతీకలు. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించడమంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే. దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషీ పుట్టుకతో జ్ఞాని కాలేడు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. లోలోపలి చీకట్లను వదిలించుకుంటాం. దీపానికి ఉండే మరో ప్రత్యేకత... అది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉండటం. దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్పవిషయాలవైపు మళ్లించకుండా ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండటమూ నేర్చుకోవాల్సిన పాఠమే.

సృష్టి, స్థితి, లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు.

‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే / ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్‌’’ అన్నారు ఋషులు. అంటే ‘ప్రబోధం’ అనే ప్రమిదలో, ‘వైరాగ్యం’ అనే తైలం పోసి, ‘భక్తి’ అనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు. 

ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. ‘పరమాత్మే పరంజ్యోతి’ అని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన ‘హృదయా’న్ని ప్రమిదగా భావించి, అందులో ‘భకి’్త అనే తైలం పోసి, ‘ప్రేమ’ అనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.

దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని ‘కఠోపనిషత్తు’ కథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని ‘పద్మపురాణం’ పేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది. 

దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుంద’ని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని ‘దీపాన్విక’గా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని ‘దీప దాన మహోత్సవం’ అని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం ‘శారదోత్సవం’గా, నాగానందం గ్రంథంలో ‘దీప ప్రతిపాదనోత్సవం’గా దీపావళిని పేర్కొన్నారు.

'దీపేన సాధ్యతే సర్వం' అని శాస్త్రవచనం. 'దీపంతో దేనినైనా సాధించవచ్చు' అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.

దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహతులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం. 'దీపమున్న చోట దేవతలుంటారు'- అనడం ఈ కారణం వల్లనే.

కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు. 

భారత పురాణ ఇతిహాసాల్లోనూ, వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకి పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం మనోవికాసానికీ, ఆనందానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం. చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తమస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే ‘దీపం పరబ్రహ్మ స్వరూపం’ అని భావిస్తూ ఆరాధిస్తారు. ‘వెలిగించడం’ సనాతన భారతీయ సంస్కృతి.

మంత్రశాస్త్ర ప్రకారం ‘సాక్షాత్ దీపం దర్శయామి’ అనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి, నీటిని చల్లి, ముగ్గులు పెట్టి ధూపం వెలిగించి దీపం పెట్టడంవల్ల సకల దుష్ట గ్రహ శక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుంది. అప్పుడే ఆ గృహం పూజార్హతకు అవకాశం కలుగుతుంది. దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకళ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి దీపవాసిని. దీపకాంతి నుంచే కళ పుడుతుంది. దీపం అమంగళాన్నీ, దారిద్య్రాన్నీ, అరిష్టాల్ని పారద్రోలే శక్తి స్వరూపం. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు. పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. కానీ నేటి పరిస్థితుల దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు. కానీ ఇంట్లో రోజూ ఉదయం, సాయంకాలం దీపారాధన చేయడం శుభప్రదం. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

==============

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ. సెల్: 9032044115 /8897547548

Sunday, October 31, 2021

దీపావళి విశేషాలతో భక్తి పత్రిక నవంబరు 2021 సంచికలో రాసిన వ్యాసం

 దీపావళి విశేషాలతో భక్తి పత్రిక నవంబరు 2021 సంచికలో రాసిన వ్యాసం



రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, కొత్తూరు తాడేపల్లి, విజయవాడ - 520012
సెల్ : 9032044115 / 8897547548


Wednesday, August 11, 2021

దేవుడిని చూద్దాం... రండి (ధారావాహిక ఐదవ భాగం)

దేవుడిని చూద్దాం... రండి (ధారావాహిక ఐదవ భాగం)

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ








 

Wednesday, July 7, 2021

దేవుడిని చూద్దాం... రండి (ధారావాహిక నాల్గవ భాగం)

 దేవుడిని చూద్దాం... రండి (ధారావాహిక నాల్గవ భాగం)

(శ్రీ కనకదుర్గ ప్రభ మాసపత్రిక జులై 2021 సంచికలో ప్రచురితమైంది)

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ













ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...