Thursday, June 25, 2020

వారాహీ దేవి ఎవరు? వారాహీ నవరాత్రులు ఎప్పుడు చెయ్యాలి? వారాహీ దేవి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వారాహీదేవి అందించే సందేశం ఏమిటి?

వారాహీ దేవి ఎవరు? వారాహీ నవరాత్రులు ఎప్పుడు చెయ్యాలి? 

వారాహీ దేవి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వారాహీదేవి అందించే సందేశం ఏమిటి?

వారాహీ దేవి

 పర్వపంచక విభ్రాజత్కిరిచక్ర రథస్థితాం
లలితా వామపార్శ్వస్థాం వారాహీం దణ్ణనాయికామ్
హలాయుధ ధరాం దేవీం కోలాస్యాం శత్రుమర్దినీం
నమామి దేవీం వార్తాళీం భక్తరక్షణ తత్పరామ్  

    చరాచర సృష్టి అంతా శక్తి ప్రధానంగా సాగుతుంది. కోటానుకోట్ల జీవరాశుల్లో ఉండే జీవరూప శక్తి చైతన్యమే  సృష్టి నిరాటంకంగా సాగటానికి ఆధారంగా నిలుస్తోంది. అనంత తేజోవ్యాపకమైన  శక్తి యొక్క భౌతికరూపాన్ని ఆదిపరాశక్తిగా ప్రాచీన రుషులు దర్శించారు.  ఈ పరాశక్తే దుర్గ, కాళి, భవాని... ఇలా అనేక రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. త్రిమూర్తులను కూడా చైతన్యవంతులను చేసేందుకు  ఈ పరాశక్తి వారిని ఆవహించి ఉంటుంది.  విష్ణువు శక్తి వైష్ణవిగా, బ్రహ్మ శక్తి బ్రహ్మాణిగా, శివ శక్తి శివానిగా వ్యక్తమవుతుంటుంది. ఈక్రమంలో వరాహరూపంలో శ్రీమహావిష్ణువు అవతరించినప్పుడు  ఆ స్వామి నుంచి వ్యక్తమైన లేదా  ఆవహించి ఉన్న శక్తి రూపమే వారాహీ దేవి.

      సృష్టిలోని అన్ని శక్తుల సమష్టి స్వరూపం పరాశక్తి. ఈ పరాశక్తి లోని సౌమ్య తత్త్వం శ్యామలాదేవి అయితే, ఉగ్రస్వరూపం వారాహి దేవి. దేవీ కవచంలో 'ఆయూ రక్షతు వారాహి' అన్నట్టు వారాహీ దేవి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞాచక్రం ఆమె నివాసం. ఆమె లలితా పరాభట్టారిక యొక్క ముఖ్య సేనాని. లలితాదేవి యొక్క రథ, గజ, తురగ, సైన్య బలాలన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆమెను దండనాథ అంటారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్టాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది.

పురాణ గాథలు

          హిరణ్యాక్షుడనే రాక్షసుడుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన మహావిష్ణు అవతారం వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం తదితర పురాణాల్లో ఈ తల్లి లీలావైభవ వర్ణన విస్తారంగా ఉంది. ఆయా పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.

          మార్కండేయ పురాణంలోని దేవీమాహాత్మ్యంలో శుంభనిశుంభ వధ కథ ప్రకారం వివిధ దేవతల శరీరాల నుండి వారి స్త్రీరూప భక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి.... ఈ క్రమంలో వరాహస్వామి నుండి వారాహిదేవి ఉద్భవిస్తుంది. తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుల సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శవాన్ని వాహనంగా చేసుకుని, వరాహరూపంలో తన దంతాలతో రాక్షసులను సంహారం చేస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడిని సంహరిస్తుంది. ఈ పురాణం ప్రకారం వారాహిదేవిని వరాలనిచ్చే తల్లిగా కొలుస్తారు. దిక్కులను కాపాడే మాతృకలను (దైవీశక్తి) ప్రసన్నం చేసుకునే స్తోత్రం పురాణంలో ఉంది. దీని ప్రకారం వారాహీదేవి ఉత్తరదిక్కును కాపాడుతుంది. ఈమె వాహనం గేదె.

          వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండీ నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ క్రమంలో వారాహిదేవి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. ఈ పురాణం ప్రకారం వారాహి దేవి అసూయ అనే వికారానికి అధిదేవత. మత్స్యపురాణం ప్రకారం వారాహిదేవి అంధకాసురుడనే రాక్షసుడు సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది.

 లలితా సహస్రనామాలు...

          వారాహీదేవి లలితా త్రిపురసుందరీదేవి సర్వ సైన్యాధ్యక్షురాలు. లలితా సహస్రనామంలోని మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా | విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |' అనే నామాల ప్రకారం వారాహీదేవికి ప్రత్యేక రథం ఉంది. దాని పేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభిని దేవి. ఈ రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి, దేవ వైద్యులు అశ్విని దేవతలు ఈ రథంలో ఉంటారు. విశుక్రుడనే రాక్షసుడిని ఈ తల్లి సంహరించింది

రూప వర్ణన

          వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయ నల్లని మేఘవర్ణం తీరులో ఉంటుంది. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖం, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయ, వరద హస్తాలు, శంఖం, పాశం, హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు తదితర వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.

          అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖం, అష్ట భుజాలు, శంఖం, చక్రం, హలం (నాగలి), ముసలం, అంకుశం, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. ఇది మహావారాహి స్వరూపం. ఇంకా లఘు వారాహి, స్వప్న వారాహి, ధూమ్ర వారాహి, కిరాత వారాహి రూపాల్లోనూ అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

          వారాహిదేవిని భూదేవి, ధాన్యలక్ష్మి స్వరూపంగా భావన చెయ్యాలి. ఈ తల్లి తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. రోకలిని ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి ఉపయోగిస్తారు. పూర్వజన్మల్లో చేసిన కర్మలు, వాటి ఫలితాల నుంచి వారాహీ దేవి తన భక్తులను వేరుచేసి, వారికి కర్మక్షయం కలిగిస్తుందని భావం. భూమిలో విత్తనం వెయ్యటానికి వీలుగా భూమిని తగినవిధంగా సిద్ధం చెయ్యటానికి నాగలిని ఉపయోగిస్తారు. అలాగే, భూమి వంటి మన బుద్ధిని నిష్కామకర్మ బీజాలు నాటటానికి సిద్ధంగా తయారుచేస్తుంది వారాహీ దేవి.

          అమ్మవారిని చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, హలం (నాగలి), ముస్లిం (రోకలి) ఆయుధాలను ధరించిప అమ్మరూపం కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లిగా వారాహీదేవిని భావన చెయ్యాలి. ఈ రహస్యం కారణంగానే వారాహీ అమ్మవారిని ఆషాఢమాసంలో పూజించాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. రైతులు గోఆధారితం వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. వారాహీ దేవి సాక్షాత్తు భూదేవి స్వరూపం (అంశ) కాబట్టి రైతులు చేసేదంతా వారాహీ ఉపాస చేసిన ఫలితాన్నిస్తుంది.

          వారాహీ అమ్మవారి రూపాన్ని చూసిన కొంతమంది ఈమెను ఉగ్రదేవతగా భ్రమపడతారు. కానీ వారాహీదేవి చాలా శాంతస్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది. ఈ తల్లి కరుణారసమూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది. అంటే వ్యక్తి ఉన్న అంత శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతశ్శత్రువులను జయించిన వ్యక్తికి బయట శత్రువులు ఉండరు లేదా శత్రువులు కనిపించంత విశాలమైన దృష్టి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత

వారాహీ నవరాత్రులు

     వారాహీ నవరాత్రి ఉత్సవాల నిర్వహించే విధానాన్ని వివరిస్తూ ప్రత్యేకంగా వారాహీ నవరాత్రికల్పం అనే గ్రంథం కూడా ఉంది. ఇందులో నవరాత్రి ఉత్సవ నిర్వహణతో పాటు వారాహీదేవికి సంబంధించిన అనేక స్తోత్రాలు కూడా ఉన్నాయి. వీటిని అందరూ పఠించవచ్చు. మూలమంత్రాలను మాత్రం గురూపదేశం లేకుండా సాధన చెయ్యవద్దని శాస్ర్తాలు కఠిన నియమాన్ని విధించాయి.     

    శ్రీవిద్యా సంప్రదాయంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని వారాహీ నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అంటారు. వారాహీ పూజ సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత చేయాలి. శాస్త్రాల ప్రకారం దేవి పూజకు రాత్రి సమయం ప్రశస్తమైనది. ఇది సాంప్రదాయికంగా శ్రీవిద్యాదీక్షాపరులు మాత్రమే చేయదగిన విధానం. అమ్మవారు సంప్రదాయిని. సంప్రదాయేశ్వరి. సదాచార ప్రవర్తిక. అందువల్ల నిర్మలమైన మనస్సుతో ధ్యానం చెయ్యటం, సదాచారాలను పాటించటం ద్వారా వారాహీ దేవి అనుగ్రహాన్ని వెంటనే పొందవచ్చు.

          తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రివేళ తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిషా), వారణాసి, మైలాపూర్ (చెన్నై)లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.

          వారాహి అమ్మవారు వారణాసి గ్రామదేవత. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. ఈ ఆలయం ఓ భూగృహంలో ఉంటుంది. ఉదయం తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆలయం తెరిచిన యంలో వెళ్లిన తర్వాత నేల పై రెండు రంధ్రాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది . ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టే ఇలా రంధ్రాల నుంచి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణకాలం నుంచి ఏర్పాటు చేశారని అక్కడివారు చెబుతారు. అర్చకులు కూడా 4.30 గంటలకు భూగృహంలోకి వెళ్లి పదినిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ కు వెళ్లడానికి ముందు ఎడమవైపు వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. పడవలో వెళ్లేవారు మన్ మందిర్ ఘాట్ వద్ద దిగి మెట్లమార్గం ద్వారి పైకి వెళ్తే కుడివైపునకు అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఈమెను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. కుండలినీ శక్తి జాగృతమవుతుంది.

హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షి చెప్పిన వారాహి నామాలు

 -  పంచమి

- దండనాథుడు

- సంకేతా

-  సమయేశ్వరి

- సమయ సంకేతా

- వారాహి

- పోత్రిణి

- వార్తాలి

- శివా

- ఆజ్ఞా చక్రేశ్వరి

- అరిఘ్ని           

వారాహి మంత్రాలు

 లఘు వారాహీ మంత్రం : లూం వారాహి లూం  ఉన్మత్త భైరవీ పాదుకాభ్యాం నమ:

స్వప్న వారాహీ మంత్రం : ఓం హ్రీం నమో వారాహి ఘోరే ప్వప్నం ఠ: ఠ: స్వాహా

ధూమ్ర వారాహీ మంత్రం: ఓం ధూం ధూం మృత్యుధూమే ధూం ధూం కాలధూమే ధూం ధూం ధూం వారాహీ హుం ఫట్ స్వాహా

కిరాత వారాహి మంత్రం : ఓం ఖేం ఖేం ఖం ఘ్రసీం అఘోర మృత్యురూపే ఖేం ఖేం ఖం ఘ్రసూమ్ కాల మృత్యురూపే ఖేం ఖేం ఖం  ఘ్రసౌ: రం రం కిరాత వారాహీ హుం ఫట్ స్వాహా

 
శ్రీ వారాహ్యనుగ్రహాష్టకం

ఈశ్వర ఉవాచ:

మాతర్జగద్రచన నాటకసూత్రధార-స్త్వద్రూపమాకలయితుం పరమార్థ తోఽయం

ఈశోఽప్యమీశ్వరపదం సముపైతి తాదృక్- కోఽన్యః స్తవం కిమివ తావకమాదధాతు !!

నామాని కింతు గృణతస్తవ లోకతుండే నాడంబరం స్పృశతి దండధరస్య దండః !

యల్లేశలంబితభవాంబునిధిర్యతో యత్- త్వన్నామసంసృతిరియం నను నః స్తుతిస్తే !!

త్వచ్చింతనాదరసముల్లసదప్రమేయా- ఽఽనందోదయాత్సముదితః స్ఫుటరోమహర్షః !

మాతర్నమామి సుదినాని సదేత్యముం త్వా- మభ్యర్థయేఽర్థమితి పూరయతాద్దయాలో !!

ఇంద్రేందుమౌలివిధికేశవమౌలిరత్న- రోచిశ్చయోజ్జ్వలితపాదసరోజయుగ్మే !

చేతో మతౌ మమ సదా ప్రతిబింబితా త్వం భూయా భవాని విదధాతు సదోరుహారే !!

లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తే- ర్వారాహమూర్తిరఖిలార్థకరీ త్వమేవ !

ప్రాలేయరశ్మిసుకలోల్లసితావతంసా త్వం దేవి వామతనుభాగహరా రహస్య !!

త్వామంబ తప్తకనకోజ్జ్వలకాంతిమంత- ర్యే చింతయంతి యువతీతనుమాగలాంతాం!

చక్రాయుధత్రినయనాంబరపోతృవక్త్రాం తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః !!

త్వత్సేవనస్ఖలిత పాపచయస్య మాత- ర్మోక్షోఽపి యత్ర న సతాం గణనాముపైతి !

దేవాసురోరగనృపాలనమస్య పాద- స్తత్ర శ్రియః పటుగిరః కియదేవమస్తు !!

కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానవదర్చితాయాం !

కిం దుష్కరం త్వయి సకృత్స్మృతిమాగతాయాం కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుంసాం !!

 

 

వారాహి అమ్మవారి వైభవ విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
ఈనాడు దినపత్రిక మకరందం పేజీ (25.06.2020)లో రాసిన వ్యాసం 



Friday, June 12, 2020

అద్భుత ఆధ్యాత్మిక నగరం శంబల



అద్భుత ఆధ్యాత్మిక నగరం శంబల గురించి

ఈనాడు దినపత్రిక మకరందం పేజీ (11.06.2020)లో రాసిన వ్యాసం

    అదొక యోగ భూమి. వేలాది సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధనతో మునిగితేలిన మహోన్నత యోగులు మాత్రమే చేరుకోగలిగిన పుణ్యభూమి. అనంతమైన పుణ్యం చేసుకుంటే కానీ ఆ ఛాయలకు సైతం చేరుకోలేని దివ్యభూమి. అక్కడ దుఃఖానికి తావు లేదు. కష్టనష్టాలు, కన్నీళ్ల ఆనవాలు ఏమాత్రం కనిపించదు. అంతా బ్రహ్మానందం. హిమాలయ సానువుల్లో వేలాది మైళ్ళ దూరంలో భూలోక స్వర్గంగా పేరు పొందిన ఆ నగరం...శంబల.

    శంబల... ఈ పేరు తలుచుకుంటేనే ఓ పులకింత కలుగుతుంది. బాహ్యప్రపంచానికి కచ్చితంగా ఇలా ఉంటుందని తెలియని నగరం ఇది. ఎందుకంటే ఇది అన్ని ఇతర ప్రాంతాల తీరులో సాధారణమైన నగరం కాదు. ఇక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. దేవతలు సంచారం చేసే దైవభూమి ఇది. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే శారీరక, మానసిక ధైర్యం పాటు యోగం కూడా ఉండాలని హిందూ, బౌద్ధ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. సత్యం, అహింస, ధర్మం పాటించే పుణ్యమూర్తులకు మాత్రమే ఇందులోకి ప్రవేశం ఉంటుంది. యోగ సాధన ద్వారా సుషుమ్న నాడిని వశపరుచుకున్న సాధకులకు మాత్రమే ఇందులోకి ప్రవేశం ఉంటుంది. ఈ గ్రంథాలు చెప్పినట్లుగానే ఇప్పటికీ ఈ నగర రూపురేఖలు ఆధునిక మానవుల ఊహలకు సైతం చిక్కలేదు. ఇంతవరకూ ఈ నగరాన్ని స్పష్టంగా చూసిన వారు లేరు. చూడటానికి ప్రయాణం ప్రారంభించి తిరిగి వెనక్కి వచ్చినవారు కూడా లేరు. మొత్తంగా ఇది బాహ్య ప్రపంచానికి తెలియని లోకం. 

పురాణాల ప్రకారం శంబల ప్రాంతమంతా అద్భుతమైన ప్రాకృతిక సంపద పరుచుకుని ఉంటుంది. ఇక్కడి వృక్షాలు నిరంతరం సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఇక్కడి ప్రజల ఆయువు సాధారణ ప్రజల ఆయువు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ నగరం వయస్సు 60 లక్షల సంవత్సరాలు. ఇక్కడి ప్రజల పొడవు నగటున 12 అడుగులు. యోగ సాధన ద్వారా శంబలలో ఉండే ప్రజలు లోకంలో ఎక్కడ ఉండే వారితో అయినా సంభాషించే సామర్థ్యం కలిగి ఉంటారు. ప్రపచంలో ఎక్కడ జరిగే అభివృద్ధి అయినా, విధ్వంసమైనా ఇక్కడి వారికి క్షణాల్లో తెలిసిపోతుంది. లోకంలో అధర్మం పెచ్చుమీరి, కలి ప్రభావం కట్టడిచెయ్యలేనంతగా పెరిగినప్పుడు శంబలలో ఉండే పుణ్యపురుషులు, యోగులు లోక పరిపాలన తమ చేతుల్లోకి తీసుకుంటారని కొన్ని గ్రంథంలో ఉంది

కల్కి అవతారం ఇక్కడే

వేదమార్గాన్ని విడిచిన ప్రజలు ధర్మానికి దూరమవుతున్న తరుణంలో కలియుగం అంతరించే దశకు చేరుకుంటుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు శంబల నగరంలో విష్ణు శయనుడు పండితుడి ఇంట కల్కి రూపంలో అవతరిస్తాడని విష్ణు పురాణం (4-24) చెబుతోంది. తెల్లటి గుర్రాన్ని ఎక్కి, ఖడ్గాన్ని ధరించి తన పరాక్రమంతో దుష్టుల్ని సంహరించి లోకంలో తిరిగి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడని, అప్పటి నుంచి సత్యయుగం ప్రారంభమవుతుందని ఇందులో ఉంది. అగ్ని పురాణం, పద్మపురాణాలతో పాటు భాగవతంలో కూడా కల్కి అవతార ప్రస్తావన ఉంది. వీటన్నిటి ప్రకారం కల్కి అవతరించే ప్రాంతమే శంబల. బౌద్ధ కాలచక్ర గాథా సంప్రదాయంలో 'శంబల' రాజ్యాన్ని పాలించినట్లు చెప్పే 25 మంది పురాణపురుషులకు కల్కి కులిక, కల్కి రాజు వంటి సంబోధనలు ఉన్నాయి.

అంతుచిక్కని అద్భుత నిర్మాణం

శంబల నిర్మాణం అత్యద్భుతంగా ఉంటుంది. బౌద్ధ, హిందూ పురాణాల్లో ఈ నగర నిర్మాణానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. వీటి ప్రకారం శంబల నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలం ఆకారంలో పర్వతాలు గొలుసుకట్టుగా ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్ర ఆకృతిలో ఉన్న భవనం మధ్యలో భూగ్రహాన్ని పోలిన నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులకి వెళ్ళేందుకు సొరంగాలు ఉంటాయి. కోటి సూర్యుల కాంతితో వెలిగే చింతామణి అనే దివ్యమైన మణి అక్కడ ఉంటుంది. పాదరసం గడ్డకట్టినట్లు పసనకాయంత పరిమాణంలో ఇది ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణికి అర్ధచంద్రాకారంలో ముఖం ఉంటుంది. పెదవులు తెరచినట్లుండే ఒక ద్వారం ఉంటుంది. సిద్ధులైన యోగులు నిత్యం ఈ మణికి పూజలు చేస్తుంటారు. ఈ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. కల్కి అవతారంలో వచ్చినప్పుడు విష్ణుమూర్తి ఈ మణిని ధరిస్తాడని చెబుతారు. సృష్టి ఆరంభం నుంచి మహర్షులు రాసిన గ్రంథాలన్నీ ఇక్కడ ఉంటాయి. మొత్తం 18 సంపుటాలుగా వీటిని విభజించి ఉంచారు. బౌద్ధ సన్యాసులు కూడా ఈ నగరాన్ని గురించి చెబుతారు. వారి సంప్రదాయం ప్రకారం చింతామణి మంత్రాన్ని ఉపాసన చేస్తారు. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా భేదించలేకపోయారు. ఈ నగర నిర్మాణం గురించిన రహస్యాన్ని ఇప్పటికీ శంబల ప్రాంతంలో ఉండే కాల ప్రమాణాలు సాధారణ కాల ప్రమాణానికి భిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో 12 గంటలు గడిపితే బయటి ప్రపంచంలో రెండు వారాలు గడిపితే పెరిగినంత ప్రమాణంలో గోళ్ళు, వెంట్రుకలు పెరిగాయి. ఈ నగరం కోసం ప్రయత్నించిన ఓ బృందం మరీ విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ బృంద సభ్యులకు ఆకస్మాత్తుగా వయస్సు పెరగటం ప్రారంభమైంది.కొన్ని దశాబ్దాల వయస్సు పెరగటంతో పాటు వెనక్కి వచ్చిన తర్వాత కూడా 100 సంవత్సరాల వృద్ధులకు వచ్చే వ్యాధులకు గురై వారంతా మరణించారు.

పాశ్చాత్యులు శంబలని 'ఫర్ బిడెన్ ల్యాండ్', 'హిడెన్ సిటీ', 'ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్' తదితర పేర్లతో పిలుస్తారు. అలెగ్జాండ్రా డేవిడ్ నీల్, హెన్రిచ్ హిమ్లర్ వంటి ఎంతోమంది పాశ్చాత్యులు ఈ నగరాన్ని చేరుకోవాలని, ఇక్కడి విశేషాలు తెలుసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు కానీ సాధ్యపడలేదు.

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ. సెల్ : 9032044115 / 8897547548





Thursday, June 4, 2020

పంచభూత విశేషాలు, వేదాల్లో పర్యావరణ పరిరక్షణ అంశాలతో ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో (04.06.2020) డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) రాసిన వ్యాసం.



పంచభూత విశేషాలు, వేదాల్లో పర్యావరణ పరిరక్షణ అంశాలతో ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో (04.06.2020) డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) రాసిన వ్యాసం.

Tuesday, June 2, 2020

వారాహిదేవి వైభవ విశేషాలతో శ్రీ కనకదుర్గప్రభ మాసపత్రిక జూన్ 2020 సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం

The article written by me (Dr Kappagantu Ramakrishna) published in the June 2020 issue of Sri Kanakadurprabha Monthly magazine with Varahidevi's glory




వారాహిదేవి వైభవ విశేషాలతో శ్రీ కనకదుర్గప్రభ మాసపత్రిక జూన్ 2020 సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం 

నరసింహస్వామి అవతార వైభవాన్ని వివరిస్తూ సప్తగిరి మాస పత్రిక జూన్ 2020 సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం

నరసింహస్వామి అవతార వైభవాన్ని వివరిస్తూ సప్తగిరి మాస పత్రిక జూన్ 2020 సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం
An article written by Dr Kappagantu Ramakrishna published in the June 2020 issue of Saptagiri Monthly magazine explaining the glory of Narasimhaswam







y

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...