Showing posts with label కంచి. Show all posts
Showing posts with label కంచి. Show all posts

Thursday, May 2, 2024

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

 


ధర్మమూర్తి... సమదర్శి


ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన్ని ప్రసరిస్తుంటుంది. సనాతన ధర్మానికి, భారతీయ ఆధ్మాత్మిక చింతనకు ఆ మహనీయుడు ప్రతిరూపం. అధునాతన దేశంలో భౌతికరూపంలో నడయాడిన దైవం. ధర్మం అంటే ఇదీ... అని నూరుశాతం ఆచరించి చూపించిన ధర్మమూర్తి. కుల, మత, ప్రాంత, లింగ, భాషా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకున్న దర్శి. ఆయనే... జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి.


కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతిగా సుమారు 83 సంవత్సరాల పాటు పీఠాధిపత్యం వహించి, కోట్లాది ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపిన మహనీయు మూర్తి ఆయన. ఎంతమంది పీఠాధిపతులు ఉన్నా ‘మహాస్వామి’ మాత్రం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మాత్రమే.

చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి కర్ణాటకలోని హోయసల బ్రాహ్మణ వంశానికి చెందినవారు. క్రీ.శ.13వ శతాబ్దిలో చోళ రాజులకు సహాయార్థం హోయసల రాజులు తమిళ దేశానికి వలస వచ్చారు. వీరితో బాటు వచ్చిన హోయసల బ్రాహ్మణ కుటుంబాలు అనంతర కాలంలో తమిళ దేశంలోనే స్థిరపడ్డాయి.

 విజయనగర రాజులచే సామంతునిగా ప్రతిష్ఠింపబడిన చెవ్వప్ప నాయకుని కాలంలో (క్రీ.శ.1535 ప్రాంతంలో) హోయసల కర్ణాటక కుటుంబాలు తమిళ దేశానికి రెండవసారి వలస వచ్చాయి.
 ఈవిధంగా వలస వచ్చిన హోయసల కన్నడ బ్రాహ్మణ వంశీకుడైన గణపతి శాస్త్రి కంచి కామకోటి పీఠానికి చెందిన 64వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి – 5 కాలంలో ముఖ్య పరిపాలనాధికారిగా ఉండేవారు.

గణపతి శాస్త్రి పెద్ద కుమారుడైన సుబ్రహ్మణ్య శాస్త్రి కుంభకోణం ప్రాంతంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండే వారు. చెవ్వప్ప నాయకుని వద్ద మంత్రిగా ఉన్న గోవింద దీక్షితుల వంశీకుడైన నాగేశ్వర శాస్త్రి కుమార్తె మహాలక్ష్మితో సుబ్రహ్మణ్య శాస్త్రికి వివాహం జరిగింది. ఈ పుణ్యదంపతుల రెండవ కుమారుడే పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి.


 సుబ్రహ్మణ్య శాస్త్రి విల్లుపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా 1894సంవత్సరం మే 20వ తేదీన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి జన్మించారు. వీరి పూర్వాశ్రమ నామధేయం స్వామినాథన్. చిన్నతనం నుండే స్వామినాథన్ అనన్య ప్రతిభా సామర్థ్యాలను చూపుతుండేవారు. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారునికి అయిదు సంవత్సరాల వరకు తనవద్దనే చదువు చెప్పారు కానీ స్కూలుకి పంపలేదు.


తన ఎనిమిదవ ఏట స్వామినాథన్ ప్రాథమిక పాఠశాలలో చేరారు. సుబ్రహ్మణ్య శాస్త్రి దిండివనంలో పనిచేస్తుండగా అక్కడ ఉన్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ స్కూలులో 7వ తరగతిలో చేర్పించారు. 1905వ సంవత్సరంలో స్వామినాథన్ కు తండ్రి ఉపనయన సంస్కారం చేశారు. స్వామినాథన్ పాఠశాలలో ప్రథముడిగా నిలుస్తూ అందరి మన్ననలు పొందుతుండేవాడు.


 ఈ సమయంలోనే కామకోటి పీఠ 66వ ఆచార్యులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి తమిళనాడులో దక్షిణ ఆర్కాటు జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారుని వెంటబెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళారు. చిన్నవాడైన స్వామినాథన్ యొక్క అపార ప్రజ్ఞాపాటవాలను చూసిన ఆచార్యుల వారు ఈ బాలుడు అనంతర కాలంలో కామకోటి పీఠాన్ని అధిష్ఠించి అభివృద్ధి చేయగలడని భావించి ఆయనను ఎంపిక చేయాలని మనస్సులో సంకల్పించుకున్నారు.


 తర్వాతి పరిణామల నేపథ్యంలో స్వామినాథన్ కంచికి తీసుకొని వచ్చి, సన్యాసాశ్రమ దీక్షనిచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతిగా తీర్చిదిద్దారు. తన 13వ ఏట స్వామినాథన్ చంద్రశేఖరేంద్ర సరస్వతిగా కామకోటి పీఠాన్ని అధిష్ఠించారు.

సన్యాసాశ్రమం స్వీకరించేనాటికి స్వామివారు వేదాధ్యయనం చెయ్యలేదు కాబట్టి, అందుకోసం  మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ కృష్ణశాస్త్రి గారిని మఠం అధికారులు స్వామి వారికి వేదం బోధించడం కోసం నియమించారు. కొంతకాలం తర్వాత కృష్ణశాస్త్రి గారు స్వామితో ఇలా అన్నారు. "స్వామీ! నిమిత్త మాత్రంగా మేము మిమ్ము శిష్యులుగా పాటించినా, యదార్ధంగా మీరే మా గురువులు, మేము మీకు శిష్యులం". ఇదీ మహాస్వామి ప్రతిభ. దైవీకమైన శక్తి.


1907లో స్వామి పీఠాధిపత్యం వహించిన పిమ్మట కావేరీనది ఉత్తర తీరాన మహేంద్రమంగళంలో ప్రత్యేకంగా ఒక పర్ణశాల నిర్మించుకుని. 1911 మొదలు 1914 వరకు నాలుగు సంవత్సరాలు తదేక దీక్షతో విద్యాభ్యాసం చేశారు. ఆయా శాస్త్రాలలో నిష్ణాతులైన పండితుల వద్ద తర్క, వ్యాకరణ, మీమాంస, వేదాంతాలను నేర్చుకున్నారు.


బాల్యంలో ఆంగ్ల పాఠశాలలో చదివిన ఇంగ్లీషుతో పాటు ఫ్రెంచికూడా అభ్యాసం చేశారు. మరాఠీ చదివారు. తమిళ వ్యాకరణం, తేవారం, తిరువాచికం, పెరియ పురాణం, తిరుక్కురళ్ మొదలైన గ్రంధాలు పఠించారు. తమిళ భాషలోని కావ్య ప్రబంధాలను పరిశోధనాత్మకంగా అధ్యయంన చేసారు.

గానకళకు సంబంధించిన శాస్త్రాకోశాలను తెలుసుకున్నారు. ఛాయాగ్రహణ (ఫొటోగ్రఫి) రహస్యాలను గ్రహించారు. గణితం, జ్యోతిషం, ఖగోళశాస్త్రాదుల మర్మాలను అవగాహన చేసుకున్నారు. ప్రాచీనశాసన పరిశోధనలో, స్థల పురాణ సమస్యల పరిష్కరణలో ప్రావీణ్యం గడించారు.
"చరిత్రకు సంబంధించిన శాసన పరిశోధనలో మా కేవైనా సందేహాలు కలిగిప్పుడు కామకోటి స్వామి వారి సహాయంతో మేము మా సందేహ నివారణ చేసుకుంటాము” అని అప్పటి ఆర్కియలాజికల్ డిపార్టుమెంటు ఉన్నతాధికారి టి.యన్. రామచంద్రన్ ఒక సభలో ప్రకటించారు.


అమేయమూ, విశ్వతోముఖమూ ఆయన ఈ విజ్ఞానభాండారమంతా ఒక్క వ్యక్తిలో ఇలా కేంద్రీకృతం కావడం అనితర సాధ్యం. అలౌకికమైన వర ప్రసాదమే తప్ప, ఎంతటి వారికైనా కేవలం స్వయంకృషితో ఇటువంటి అసాధారణ ప్రతిభ సాధ్యం కాదు.


సనాతన ధర్మాన్ని రక్షించడానికి మహాస్వామి వారు తమ నూరేండ్ల జీవితాన్ని ధారపోశారు. శతాబ్దిలో వారు ఉండటం కాదు, ఒక శతాబ్దమే వారిలో ఉన్నది. నీతి, నిజాయతీ, నిర్వహణకు ఆయన పెట్టింది పేరు. ఆడంబరం లేని మహనీయుడు. ఆయన సమదర్శి, వాత్సల్య మూర్తి.

వారికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. ఒక సంఘటన జరిగి దశాబ్దాలు జరిగినా దానిని గుర్తుపెట్టుకునేవారు. ఒకసారి కలిసిన వ్యక్తి మళ్ళీ ఎప్పుడు కలిసినా గుర్తించేవారు. స్వామి కార్యంలో భారీ సేవ చేసినవారినీ, ఉడతాభక్తిగా సేవించిన వారినీ అందరినీ ఒకేతీరున గుర్తుపెట్టుకునేవారు. అందుకే ఆయన సమదర్శి అనిపించుకున్నారు.
సాధారణ భక్తులు వచ్చి వారికొచ్చే చిన్నచిన్న సందేహాలు అడిగినా, పండితులు తర్కమీమాంస శాస్ర్తాలకు సంబంధించిన ప్రశ్నలు వేసినా... అన్నిటికీ సావకాశంగా బదులిచ్చి, సందేహ నివృత్తి చేసేవారు. ఆయన ఆచారం ప్రధానంగా పెట్టుకున్నారే కానీ, ప్రచారం గురించి ఎన్నడూ ఆలోచించలేదు. ఆయన కారుణ్యమూర్తి. వారి వ్యక్తిత్వం దోష రహితం, దైవ సహితం. ఆయన చూపుల్లో దివ్య తేజస్సుతోపాటు అంతులేని వాత్సల్యం ప్రతిఫలించేది.


చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు వేద రక్షకుడు. సద్గురువు. శాస్త్ర పరిశోధకుడు. దేశకాల పరిస్థితులను బట్టి, ఆధ్యాత్మిక సంపదను రక్షించిన రాజనీతిజ్ఞుడు. అంతకుమించి బహుభాషా కోవిదుడు.

ధర్మాచరణకు శ్రద్ధ అవసరమని, సంకల్ప బలం, విశ్వాసం ఉండా లని, మనసును నియంత్రిస్తేనే కార్య సిద్ధి కలుగుతుందని చెప్పేవారు.
దేశమంతటా వేద పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఎన్నో ఆలయాలకు మంటపాలు నిర్మించారు.

ధర్మ సంవర్ధనమే లక్ష్యంగా ఇరవై సంవత్సరాలు పాదచారం చేస్తూ యావద్భారతం పర్యటించారు. హిందూమత సంరక్షణకు, వివిధ శాఖలకు చెందిన హిందూ మతావలంబుల సమైక్యతకు అద్వితీయమైన కృషిచేశారు. వందల సంఖ్యలో ధర్మ సంస్థలు స్థాపితమయ్యేలా ప్రోత్సహించి, ధర్మప్రచారానికి బలమైన పునాదులు వేసారు.


భక్తులపై స్వామికిగల వాత్సల్యం అంతా ఇంతా కాదు. భక్తులను సంతృప్తి పరచడానికి, వారిని సంతోషపెట్టడానికి స్వామి వహించే శ్రద్ధ ఇంత అని మాటల్లో చెప్పటానికి సాధ్యం కాదు.
ఆధ్యాత్మిక విషయాలను చర్చించే వారి సంగతి అలా ఉంచి, అనేకమంది భక్తులు జీవితంలో తమ కష్టసుఖాలను గురించి, సంసారంలోని చిక్కులను గురించి స్వామితో తమ సమస్యలు చెప్పబోయే సరికి-భక్తి చేతనో, భయం చేతనో, మాటలు తడబడతాయి. ఒకటి చెప్పబోయి వేరొకటి చెబుతారు. అసలు తాము చెప్పదలచింది మరిచిపోతారు. సగం చెప్పి ఊరుకుంటారు. అలాంటి సందర్భాల్లో స్వామి అసహనం చూపేవారు కాదు. తమ సమయాన్నంతా వృధా చేస్తున్నారని ఏమాత్రం అనుకునేవారు కాదు. వారి బాధ ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించేవారు. వారి మనస్సులోని మాట రాబట్టడానికి తామే అనేక ప్రశ్నలడిగి, తగిన ఉపాయాలను సూచించి వారి బాధలను ఉపశమింప జేసేవారు.


చూడ వచ్చినవారి పెద్దలను గురించీ, వారి బంధువర్గాన్ని గురించీ పేరు పేరునా అడిగి, వాళ్ల యోగక్షేమా లన్నిటినీ తెలుసుకునేవారు. తమ దూరపు బంధువులను, ఒకవేళ భక్తులెవరైనా మరిచిపోతారేమో కాని, స్వామికి మాత్రం జ్ఞాపకం ఉండేది. ఎన్ని సంవత్సరాలు దాటినా ఒక్కొక్క భక్తుని వంశచరిత్ర స్వామి జ్ఞాపకశక్తి అనే బీరువా అరలో ఎలా భద్రపరిచి ఉండేదో ఊహకు అందని విషయంగా ఇప్పటికీ మిగిలిపోయింది.


"శంభోర్మూర్తిః చరతి భువనే శంకరాచార్య రూపా” - సాక్షాత్తు పరమశివుని అవతారమైన ఆదిశంకరులు అనేక శతాబ్దుల కిందట కంచికామకోటి పీఠాన్ని స్వయంగా అధిష్టించి సర్వజ్ఞపీఠంగా కంచి పీఠాన్ని తీర్చిదిద్దారు. ఆ తర్వాత శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి ఆదిశంకరుల అవతారంగా తిరిగి సర్వజ్ఞ పీఠాన్ని అధిష్టించి, ఆదిశంకరుల పరంపరా వైభవాన్ని మరోసారి ప్రకటించారు.


చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం పీఠాధిపతి మాత్రమే కాదు. ఆయనలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, శాస్త్రపరిశోధకుడు, జ్యోతిశ్శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త... ఇంకా ఎందరో దాగున్నారు. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జీవితం అద్భుతం, అనితర సాధ్యం. నిండు నూరేళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి, పాదచారియై దేశమంతా సంచరిస్తూ ధర్మప్రభోదం చేసిన మహాపురుషులు స్వామి.

రెండువేల సంవత్సరాల కిందట దక్షిణ భారతంలో జన్మించి, అవైదిక మతాలను ఖండించి, అనేక దివ్యశక్తులను ప్రదర్శించిన ఆదిశంకరులే తిరిగి నేడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులుగా అవతరించారు. ఇది అతిశయోక్తి కాదు.

                                 ------xxxxx------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, కె.బి.ఎన్. కళాశాల (అటానమస్), కొత్తపేట, విజయవాడ-1.
సెల్: 90320 44115 / 8897 547 548

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...