Sunday, January 31, 2021

శుచి శుభ్రత అంటే ఏమిటి? శుచిగా ఎందుకు ఉండాలి? మడి అంటే ఏమిటి?







శుచి - శుభ్రత 

పరమాత్మ పాదసన్నిధి చేరుకోవటానికి మంత్ర తంత్ర సాధనలు, అర్చనలతో పాటు శుచిత్వం కూడా ఎంతో అవసరం. శుచి శుభ్రత లేని చోట దేవుడు ఉండడు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం మాత్రమే శుచిత్వం కాదు. అదొక భాగం మాత్రమే. శరీరంతో పాటు మనస్సు కూడా ఎంతో శుచిగా ఉండాలి. అప్పుడు మాత్రమే పూర్తి శుచిత్యాన్ని సాధించినట్లవుతుంది. శుచిగా ఉండటం గొప్ప అలంకారం కాదు.  ఆడంబరం కాదు. ఆచారం అంతకన్నా కాదు. శుభ్రత మనిషి నడతను, నడవడికను తీర్చిదిద్దుతుంది.  అదొక సంస్కారం.
 అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా |
యస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంత శ్శుచిః ||
 రోజూ వారీ పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోకంతోనే ప్రారంభమవుతాయి. భగవంతుడిని ఆరాధించటానికి ముందు మనిషి పవిత్రుడు కావాలి. అంటే పూర్తి శుచిత్వాన్ని సాధించాలి. అలా శుచిగా ఉన్న వ్యక్తి చేసే ఆరాధనను మాత్రమే పరమాత్మ స్వీకరిస్తాడు. భౌతిక శరీరంతో పాటు మానసికంగా కూడా మనిషి శుచిగా ఉండి భగవంతుడి అనుగ్రహానికి సాధన ప్రారంభించాలి.

 భగవద్గీతలోనూ 'శుచి' ప్రస్తావన

 శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అనేక చోట్ల శుచిగా ఉండాల్సిన అవసరం గురించి చెబుతాడు. శుచిత్వం తనకు ఇష్టమైన భక్తుల్లో ఒకటని భగవానుడే స్వయంగా చెబుతాడు. శారీరక తపస్సే శుచిత్వం అవుతుందని మరొకచోట వివరిస్తాడు. మనిషి తాను చేసే పనులన్నిటిలో ధర్మమార్గాన్నిపాటించటం శుచిత్వం అవుతుందని ఇంకోచోట చెబుతాడు.

తేజః క్షమా ధృతిశ్శాచమ్ అద్రోహో నాతిమానితా

భవన్తి సంపదం దైవీమ్ అభిజాతస్యభారత ||

 దేవతల లక్షణాలు చెబుతూ శుచిత్వాన్ని కూడా ఆ లక్షణాల్లో ఒకటిగా చెప్పాడు కృష్ణపరమాత్మ. అలాగే, దైవాసుర సంపద్విభాగయోగంలో 

ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదురా సురాః |

న శౌచం నాపిచాచారో న సత్యం తేషు విద్యతే ||

 రాక్షస ప్రవృత్తి కలిగిన వారికి శుచిత్వం ఉండదని చెబుతాడు. అంటే, శుచిగా ఉండటం మనిషికి దైవత్వాన్ని కలిగిస్తుంది. శుచిగా ఉన్న శరీరం శుచిగా ఉండే (ఉత్తమమైన) ఆలోచనలు కలిగిస్తుంది ఎప్పుడైతే మనస్సు మంచి ఆలోచనలు చేస్తుందో, ఆప్పుడు ఆ మనసు ధర్మాన్ని విడిచి పెట్టదు. అంతిమంగా మనిషి భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాడు

 * ఆదిశంకరాచార్యులు భక్తి మార్గాన్ని బోధిస్తూనే భక్తికి, తపస్సుకు, ఆధ్యాత్మిక సాధనకు తప్పనిసరిగా శుచిగా ఉండాలని చెప్పారు.

 బాహ్యమాభ్యస్తరం చేతి ద్వివిధం శౌచముచ్యతే

మజ్జలాభ్యాంకృతం శౌచం బాహ్యం శారీరికం స్మృతమ్

అజ్ఞాన దూరీకరణం మానసం శౌచమాన్తరమ్

అన్తస్థితో భవేత్సమ్యక్ బాహ్యంనావశ్యకం నృజామ్ ||

 శుచిత్వం బాహ్యం, అంతరికం అని రెండు రకాలుగా ఉంటుంది. నిత్యం చేసే స్నానం బాహ్యశౌచాన్ని కలిగిస్తుంది. మనసులో ఉండే అజ్ఞానాన్ని సాధన ద్వారా దూరం చేసుకోవటం ఆంతరిక శౌచం అవుతుంది. బాహ్యశౌచం కన్నా ఆంతరిక శౌచం చాలా అవసరం. మనస్సు స్వచ్చంగా (శుచిగా) లేకపోతే, బాహ్యశౌచం ఏవిధమైన ఫలితాన్ని ఇవ్వదు.

 బలమాయుష్యమారోగ్యం సంతోషః స్వాస్థ్యమానసం |

శుచిత్వే లభతే తస్మాత్ శుచిత్వం ఆశ్రయేత్ నరః ||

 బలం, ఆయుష్షు, ఆరోగ్యం, సంతోషం, ఆరోగ్యవంతమైన మనస్సు... ఇవన్నీ శుచిత్వం వల్లనే లభిస్తాయని శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.

 ఐదురకాల శౌచాలు

 కొన్ని శాస్త్ర గ్రంథాలు శౌచం (శుచి) ఐదు రకాలుగా ఉంటుందని చెబుతున్నాయి. వీటి ప్రకారం... మనశ్శాచం : మనసులో రాగద్వేషాలకు తావు లేకుండా చెయ్యటం మనశ్శెచం అవుతుంది కర్మశాచం : కపటం లేకుండా, ధర్మాన్ని పాటిస్తూ నిత్యవిధులను నిష్కామంగా చేస్తూ జీవించటం కర్మశౌచం అవుతుంది

 కులశాచం : నీచమైన పనులకు దిగజారకుండా, సదాచారాన్ని పాటిస్తూ స్థిరంగా ఉండటం కులశాచం అవుతుంది

 శరీరశౌచం : స్నానం తదితర క్రియల ద్వారా శరీరాన్ని శుభ్రంగా ఉంచటం శరీరశౌచం అవుతుంది

 వాక్ శౌచం : అనుక్షణం సత్యాన్ని మాత్రమే పలకటం వాక్శౌచం అవుతుంది

 మడి కట్టుకోవటమంటే.. 

మడికట్టుకోవటం అంటే అదేదో ఘనకార్యం అనుకోవాల్సిన పనిలేదు. మడి అంటే పరిశుభ్రమైన వస్త్రాలు ధరించటం. పూజ చేయాలనుకున్నప్పుడు ముందుగానే అందుకు తగిన పరిశుభ్రమైన వస్త్రాలు ఏర్పాటుచేసుకోవాలి. వాటిని ధరించి మాత్రమే పూజ చెయ్యాలి. ఇదే మడి అంటే.పూజలు చేసే సందర్భంలో 'మడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మడివస్త్రాలు కట్టుకున్న తర్వాత ఎవరినీ ముట్టుకోకూడదు. పూజా సంబంధం కానీ ఏ వస్తువునీ తాకకూడదు అంటూ... ఇంకా ఎన్నో నియమాలు చెబుతారు పెద్దలు. ఇదంతా చాదస్తం అనిపిస్తుంది నేటి తరానికి, కానీ, 'మడి' ఆచారం వెనుక మహత్తరమైన సందేశం దాగి ఉంది. మనం ధరించే వస్త్రాల రంగు, తీరు మన మనస్సుపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తాయి. నిర్మలైన వర్ణాలు మనసుకు ఆహ్లాదాన్ని చేకూరుస్తాయి. ఈ కారణంగానే మడివస్త్రాలుగా కేవలం తెల్లని వస్త్రాలు లేదా అతి తేలిక వర్గాలు కలిగిన వస్త్రాలను వినియోగిస్తారు. ఆధ్యాత్మిక సాధనలో తొలి సోపానమైన బాహ్యశుచిత్వాన్ని పొందటానికి చేసే ప్రయత్నమే ఇదంతా. ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా, హాయిగా ఉందో. అప్పుడు మనస్సు పూర్తిగా భగవంతుడి మీద కేంద్రీకృతం అవుతుంది. మనసులోని కళ్ళతో మాధవుడిని చూసేందుకు చేసే ప్రయత్నమే మడి.

 పురాణాల్లోనూ ప్రాధాన్యత

శుచిత్వానికి ఇంతటి ప్రాధాన్యత రావటానికి వెనుక పురాణగాథ ఉంది. కశ్యప ప్రజాపతికి దితి అదితి ఇద్దరు భార్యలు, దితి కుమారులు దైత్యులు - అంటే రాక్షసులు. అదితి కుమారులు ఆదిత్యులు అంటే దేవతలు, వారిద్దరి వైరం గురించి తెలిసిందే. దేవతల చేతిలో రాక్షసులు హతం కావటాన్ని చూసి తట్టుకోలేని దితి, ఇంద్రుడి సంహరించే శక్తి కలిగిన కుమారుడు తనకు జన్మించాలని భర్త అయిన కశ్యపుడిని కోరుతుంది. ఆయన 'సరే' అని వరమిస్తాడు. కానీ, ప్రసవం అయ్యేవరకు శుబిత్వాన్ని అన్నివేళలా పాటించితీరాలని, లేకపోతే గర్భం భిన్నమవుతుందని నియమం పెడతాడు. దితి అంగీకరిస్తుంది. శుభముహూర్తంలో దితి గర్భం దాలుస్తుంది. విషయం తెలుసుకున్న ఇంద్రుడు పినతల్లి అయిన దితి దగ్గరకు మంచి మాటలు చెప్పి, ఆమెకు సేవ చేసే అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఆమె అంగీకరిస్తుంది. ఇంద్రుడు అన్నిరకాలుగా సపర్యలు చేస్తుంటాడు. ఒకరోజున సాయం సంధ్యా సమయంలో పొరపాటున దితి శౌచాన్ని మరిచి, కాళ్లు చేతులు కడుక్కోకుండానే పడకగదిలోకి వెళ్లి, అలసట కారణంగా నిద్రలోకి జారుకుంటుంది. దితికి నియమభంగం కాగానే ఇంద్రుడు అణురూపంలో దితి గర్భంలోకి ప్రవేశించి, శిశువును నరకటం ప్రారంభిస్తాడు. వెంటనే దితికి మెలకువ వస్తుంది. తన బిడ్డను వధించవద్దని, తన బిడ్డ దేవతలకు అనుకూలంగా ఉంటాడని ఇంద్రుడిని వేడుకుంటుంది. అతడు అంగీకరించి, బయటకు వచ్చి, తన వల్ల ముక్కలైన శిశువు మరణించకుండా, ఎన్ని ముక్కలైందో అందరు పుత్రులు పుడతారని చెబుతాడు. అలా ఏర్పడ్డ శిశువులే దేవతాగణాల్లో ఒకటైన 'మరుద్గణం'. ఈ వృత్తాంతం జరిగనప్పటి నుంచి సంధ్యాసమయంలో తప్పనిసరిగా శుచిగా ఉండాలని, నిద్రించకూడదనే' ఆచారం వాడుకలోకి వచ్చింది. శుచిత్వానికి ఉన్న ప్రాధాన్యత ఇంత గొప్పది.

 శుచిత్వానికి ఎంత శక్తి ఉందో తెలిపే కథ భారతంలో ఉంది. ఉదంకుడు పౌష్యదేవి కుండలాలు తీసుకురావటానికి నాగలోకానికి వెళ్తాడు. కొంత కథ నడచిన తర్వాత, ఉదంకుడికి పొష్యదేవి కనిపించదు, ఎంత ఆలోచించినా కారణం తెలియటం లేదు. అప్పుడు నాగరాజు

 భూవినుత నిన్ను త్రిభువన

పావను నశుచివని యెట్లు పలుకగ నగు న

ద్దేవి పవిత్ర పతివ్రత

గావున నశుచులకు గానగాదనవద్యా

 శుచిత్వం లేని వాళ్లకి (ఆశుచిగా ఉంటే) పౌష్యదేవి కనిపించదయ్యా అంటాడు. ఉదంకుడు విషయం తెలుసుకుంటాడు. శుచిగా మారుతాడు. తర్వాత కథ నడుస్తుంది. తపశ్శక్తి సంపన్నుడైనప్పటికీ శుచిత్వం లేని కారణంగా ఉదంకుడు పౌష్యదేవిని దర్శించలేకపోతాడు. శుచిత్వానికి ఉన్న శక్తి అంత గొప్పది. అందుకే దేవాలయాలకు వెళ్లేటప్పుడు శుచిగా, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలని, దేవుని సన్నిధిలో ఉండగా మనసులోకి ఇతర ఆలోచనలు రానివ్వకూడదని, వ్యర్ధప్రసంగాలు చెయ్యకూడదని పెద్దలు చెబుతారు.

 --------------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ. 

Cell: 90320 44115 / 8897 547 548

--------------------------

భక్తి పత్రిక ఫిబ్రవరి 2021 సంచికలో రాసిన వ్యాసం





Thursday, January 14, 2021

దీక్ష అంటే ఏమిటి? దీక్షలో రకాలెన్ని? దీక్ష ఎందుకు చెయ్యాలి? దీక్షలో పాటించాల్సిన నియమాలేమిటి?

దీక్ష అంటే ఏమిటి? దీక్షలో రకాలెన్ని?
దీక్ష  ఎందుకు చెయ్యాలి? దీక్షలో పాటించాల్సిన నియమాలేమిటి? 



సర్వకాల రక్ష... దీక్ష

పుట్టుకతోనే ఏ మనిషీ సర్వోన్నతుడు కాలేడు. సర్వోన్నతమైన స్థానాన్నీ అందుకోలేడు. ఇందుకోసం నిరంతర సాధన అవసరం. తనను తాను ఉద్ధరించుకోవాలన్న ఆలోచన ఏ క్షణమైతే మనిషికి కలుగుతుందో ఆ క్షణం నుంచే అతడిలో పరివర్తనకు శ్రీకారం చుట్టుకుంటుంది. లౌకిక జీవనంలో అనేక మాయల వలలో చిక్కుకున్న మనిషి క్రమంగా తెలివి తెచ్చుకుంటూ వాటి నుంచి క్రమంగా బయటపడి శాశ్వతమైన సత్యాన్ని అన్వేషించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాడు. వీటన్నిటిలో మనిషి అన్ని రకాల లౌకిక బంధాల నుంచి విడిపడేలా చేసి, దైవత్వానికి దగ్గర చేసేందుకు మేలైన మార్గం 'దీక్ష'. 

దీక్ష అంటే నియమాల సమాహారం. పట్టుదల అనే పేరు కూడా దీనికి ఉంది. ఒక ఆచారాన్ని లేదా  నియమాన్ని పాటించాలని సంకల్పించడం, దాన్ని పట్టుదలగా కొనసాగించడం దీక్ష అని చెప్పుకోవచ్చు. ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకొని, దైహికంగా, మానసికంగా మండలం పాటు నిష్ఠాపూరితమైన జీవనాన్ని నిరాడంబరంగా గడపడం దీక్షలోని ప్రధానమైన అంశం. దీనివల్ల భౌతికమైన క్రమశిక్షణతోపాటు మానసికమైన నిబద్ధత ఏర్పడుతుంది. అది ఆదర్శప్రాయమైన జీవనానికి మార్గదర్శకమవుతుంది.

దీక్ష అంటే...?

దీయతే జ్ఞానం విజ్ఞానం క్షీయంతే పాప నాశనం

తేన దీక్షా ఇతి ప్రోక్తా ప్రాప్తాచ్చేత్‌ సద్గురోర్ముఖః ||


దీ - అంటే జ్ఞానం, క్ష - అంటే పాపక్షయం అని అర్థం. జ్ఞానాన్ని ఇచ్చి పాపాన్ని పోగొట్టేది ఏదో అది దీక్ష అవుతుంది. దీక్షకు ఇదమిత్థంగా ఇదీ భౌతిక స్వరూపం అంటూ ఏదీ ఉండదు.  మనసులో దర్శించిన అనుభూతి, ఎంచుకున్న లక్ష్యం, కలిగిన ప్రేరణ బట్టి దీక్ష ఆచరించే విధానం మారుతుంది. బయటకు ఇదంతా విభిన్నమైన పద్ధతులు అనిపించినా అన్ని దీక్షలూ చేరే గమ్యం పరమాత్మ పాదాలు మాత్రమే.

దీక్ష అనే పదం - ద, ఇ, క, ష, అ అనే ఐదు అక్షరాల కలయికతో ఏర్పడింది. 'ద' అంటే ఇచ్చేది, 'ఇ'  అంటే  లక్ష్మి లేదా సంపద. 'క' అంటే బ్రహ్మానందం. 'ష' అంటే సమృద్ధి. 'అ' అంటే పరమాత్మ లేదా పరబ్రహ్మ. ఇలా బ్రహ్మానందం, సంపద, సమద్ధి, పరమాత్మని ఇచ్చేది దీక్ష అవుతుంది. దీక్షను ఆచరిస్తే పరమ జ్ఞానం కలుగుతుంది. పాప పరంపరలను పోగొట్టి సంసార పాశ బంధాలను ఛేదించి, తత్త్వ చింతనను కలిగిస్తుంది. దీక్ష అంటే నియమబద్ధ ప్రవత్తి. మనస్సు, శరీరం, వాక్కుతో సహా అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుని పరమాత్మ ఆరాధనకు అనుగుణంగా ప్రవర్తించటాన్ని దీక్ష అంటారు. దీక్షకు మించిన పవిత్రమైన వస్తువు, జ్ఞానం, తపస్సు ప్రపంచంలో మరెక్కడా లేవు.

మరోవిధంగా చెప్పాలంటే... నిశ్చలమైన మనస్సుతో సంకల్పించడాన్ని దీక్ష అంటారు. మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటిని త్రికరణాలు అంటారు. ఈ మూడింటిని సమన్వయం చేసి నిర్వహించే పనుల్నే 'మనోవాక్కాయకర్మలు' అంటారు. అహింస (హింస చెయ్యకుండా ఉండటం), సత్యం (దేవుని మీద నిజమైన భక్తి కలిగి ఉండటం), ఆస్తేయం (అవలంబించేందుకు తగిన విధానాన్ని ఎంచుకోవటం), బ్రహ్మచర్యం (శారీరక వ్యామోహాలు లేకపోవటం), అపరిగ్రహం (తన భోగాల కోసం ఇతరుల నుంచి ధనాన్ని స్వీకరించకపోవటం) అనే మహావ్రతాలను మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించటాన్ని కూడా దీక్ష అంటారు.

దీక్షలో రకాలు

దీక్షల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి....ఆణవీ, శాక్తేయీ, వైష్ణవి. మంత్రం, అర్చన, ఆసనం, ధ్యానం, స్థాపన, ఉపాసన అనే ఆరు అంగాలు కలిగిన దీక్ష అణవి అవుతుంది. శక్తిని ఆరాధించే దీక్ష శాక్తం లేదా శాక్తేయం అవుతుంది. చివరిది వైష్ణవీ దీక్ష. గురుశిష్యులిద్దరూ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రవర్తించటం వైష్ణవీ దీక్ష అవుతుంది. శిష్యుడిని మంచి దారిలో ప్రవర్తింపజేయటం, తత్త్వం, హితం, పరమార్థం మొదలైన విషయాల్ని బోధించటం మొదలైనవన్నీ ఇందులోకి వస్తాయి. గురువునే పరమాత్మగా ఆరాధించటం, ధన, మాన, ప్రాణాల్ని కూడా గురువుకే అర్పించటం ఈ దీక్షలో ప్రధానమైన అంశంగా ఉంటుంది. గురువు గారిని దర్శించటం, స్పశించటం, మాట్లాడటం వల్లనే తత్త్వ జ్ఞానము కలుగుతుంది. గురువు జ్ఞాన మార్గంతో శిష్యదేహంలో ప్రవేశించి శిష్యుడి జ్ఞాన నేత్రాన్ని తెరిపించి పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయటం వైష్ణవి దీక్ష అవుతుంది. దీన్నే జ్ఞానదీక్ష లేదా బ్రహ్మచర్య దీక్ష అని కూడా అంటారు

ప్రతి దీక్షలోను కలశ స్థాపన ప్రధానమైన అంశంగా ఉంటుంంది. 'క' అనగా పరబ్రహ్మ, 'ల' అంటే లక్ష్మీ, 'శ' అంటే శాంతి, శక్తి అని అర్థం. కలశం బ్రహ్మాండానికి, అందులో ఉన్న జలం సకల దేవతలకు, ఆకులు సకల ప్రాణులకు ప్రతీకలుగా ఉంటాయి. కొబ్బరికాయ మనం ఏర్పరచుకునే స్థిరమైన సంకల్పానికి, దానిపై వేసిన వస్త్త్రం మన శరీరానికి ప్రతిరూపాలుగా ఉంటాయి. ఈవిధంగా త్రికరణాలతో త్రిమూర్తుల్ని, త్రిలోకాలని, తత్త్వ త్రయాన్ని ఆరాధించటమే కలశస్థాపన అవుతుంది. మొత్తంగా దీక్షలో ప్రధానంగా స్థాపించే కలశం మనల్ని తత్త్వాతీలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పునాది వేస్తుందని అర్థం చేసుకోవాలి.  ఈ విధంగా కలశస్థాపనతో స్వీకరించే దీక్షను క్రియావతి అని, మంత్రములతో చేస్తే మాంత్రి అని అంటారు.

దీక్షలు క్రియావతి, కళావతి, వర్ణమయి, బోధమయి అని నాలుగురకాలుగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కలశ స్థాపన చేసే విధానం క్రియావతి అవుతుంది. కలశంలో దేవతాకళలను ఆవాహన చెయ్యటం కళావతి, మంత్రాలు చదువటం, ఉపదేశించటం వర్ణమయి, తత్త్వ జ్ఞానాన్ని బోధించటం బోధమయి అవుతాయి. ఈవిధమైన దీక్షానియమాలతో దేవతల్ని ఆరాధించాలని, వారికి సంబంధించిన దీక్షావిధానాల్ని పాటించాలని వివిధ శాస్త్రాలతో పాటు ఆచార సంప్రదాయాలు కూడా చెబుతున్నాయి



దీక్ష ఎందుకు?

    పేరేదైనా సరే... దీక్ష స్వీకరించగానే ఒక పవిత్ర స్పహ మనసులోకి ప్రవేశిస్తుంది. వికత పద్ధతులు, పాశవిక స్థితులు దూరమై, ఆధ్యాత్మిక అభ్యున్నతి వైపు అడుగులు కదుపుతాం. ఆత్మవికాసాన్ని పెంచుకోగలుగుతాం. భౌతికమైన ఎదుగుదలను కట్టడి చేసి, ఎదుటివారిని మన ఇష్టదైవంగా భావించి ఆ పేరుతోనే పలుకరిస్తాం. ఇంకా మరెన్నో పద్ధతుల ద్వారా మానసిక పరిణతిని పెంపొందించుకోవడానికి కృషి చేస్తాం. ఇదంతా జరగటానికి దీక్షకు సంబంధించిన నియమాలు దోహదపడతాయి. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ప్రతి క్షణం మనల్ని మనం నియంత్రించుకోవడానికి ప్రయత్నించుకోవటం ద్వారా దీక్ష తీసుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం సులభమవుతుంది.

దీక్ష అంటే కేవలం కొన్ని కఠినమైన నియమాల్ని పాటించటం మాత్రమే కాదు. అందుకు ఆంతరిక శుద్ధి తప్పనిసరి. దీక్ష ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి ఇద్దరూ పరిశుద్ధమైన మనస్సు కలిగిఉండాలి. లేదంటా దీక్ష అనే మాటకే అర్థం మారిపోతుంది.

పాలను ఏదైనా గిన్నెలో పొయ్యాలనకున్నప్పుడు ముందుగా ఆ గిన్నె శుభ్రంగా ఉందో లేదో చూస్తాం. శుభ్రంగా ఉంటే సరి. లేదంటే గిన్నెను శుభ్రపరిచిన తర్వాతనే పాలను అందులోకి పోస్తాం. దీక్ష కూడా పాలవంటిదే. ఇక్కడ శరీరం గిన్నె వంటిది. శుభ్రమైన శరీరం (బాహ్యంగాను, మానసికంగాను) లేకపోతే అందులోకి పోసే (స్వీకరించే) దీక్ష కూడా మలినమవుతుంది. కాబట్టి, ఏవిధమైన దీక్ష చెయ్యాలని నిశ్చయించుకున్నా ముందుగా మన శరీరాన్ని మానసికంగాను, శారీరకంగాను ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత సద్గురువును ఆశ్రయించి, ఆయన సూచనల ప్రకారం దీక్ష తీసుకోవాలి. అంతేకానీ ఏ వ్యక్తీ తనకు తానుగా దీక్ష తీసుకుంటున్నానని ప్రకటించకూడదు. ఆచరించకూడదు. ప్రత్యేకించి మంత్ర దీక్షల విషయంలో గురు అనుగ్రహం తప్పనిసరి.  

     కార్యసాధనకు దీక్ష తప్పనిసరి అనే అంశాన్ని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత ఆరో అధ్యాయంలో చెబుతాడు. 

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌ |

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గహ్యతే ||

అర్జునా! మనస్సును నిగ్రహించటం చాలా కష్టసాధ్యం. అయినప్పటికీ అభ్యాసం చేత, వైరాగ్యం చేత దాన్ని సాధించవచ్చంటాడు పరమాత్మ. ఇక్కడ అభ్యాసం అంటే దీక్ష. మనస్సును స్వాధీనం చేసుకోవాలంటే సాధారణ దీక్ష సరిపోదు. అకుంఠితమైన దీక్ష కావాలి.అకుంఠితం అంటే ఏ ఒక్కరోజూ కుంటుపడనిది అని అర్థం. దీక్ష తీసుకున్న తర్వాత మన నిర్ణయం మారకూడదు. మరో ఆలోచనకు తావు ఇవ్వకూడదు. అలాచేసినప్పుడే స్వీకరించిన దీక్ష కోరుకున్న ఫలితాన్ని ఇస్తుంది. 

'దేహో దేవాలయః ప్రోక్తో జీవోదేవస్సనాతనః'... దేహమే దేవాలయం. జీవుడే పరమేశ్వరుడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. తనలో ఉన్న పరమేశ్వరతత్త్వాన్ని మనిషి గుర్తించే దీక్ష తీసుకుంటాడు కాబట్టే ఆ క్షణం నుంచి జీవుడు దేవుడుగా మారుతాడు. దేవాలయాన్ని ఎలాగైతే అత్యంత శుచిగా ఉంచుతారో దేహాన్ని కూడా అలాగే ఉంచుకుంటారు. భూశయనం ఆత్మ నిగ్రహాన్ని, శీతలస్నానం శారీరక శక్తిని ఇస్తాయి. కఠిన నియమాలు దీక్షాధారులు పాటించడం వెనుక ఉన్న ఆధ్మాత్మిక సందేశం ఇది. 

పాటించాల్సిన నియమాలు

- సూర్యోదయ పూర్వ, సూర్యాస్తమయాలకు పూర్వమే చన్నీటి స్నానం ఆచరించాలి.

- పదేళ్లలోపు స్త్రీలు, రుతుక్రమం లేనివారు, 60 ఏళ్ళ వయస్సు వారు దీక్షను ఆచరించవచ్చు.

- నిర్మలమైన మనసుతో పూజను ఆచరించాలి. విభూతి, కుంకుమ, చందనం ధరించాలి.

- దీక్షను స్వీకరించిన వారు స్వయంగా దైవ భావన కలిగి నిరాడంబరులై దీక్షకు అధిష్ఠాన దేవత ఎవరో ఆ దేవతకు ప్రీతిపాత్రమైన రంగులో ఉండే వస్త్రాలను ధరించాలి.

- అరుణోదయ, తపనోదయ, సంగమ, మధ్యాహ్న, సాయం, అర్థనిశా సమయాల్లో పూజలు ఆచరించాలి.వీటినే షట్కాలార్చన అంటారు. (ఆరు కాలాల్లో అర్చన చేయలేని వారు కనీసం ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా అర్చన చెయ్యాలి)

- దీక్ష పూర్తయ్యేవరకు సాధ్యమైనంత సేపు మౌనం వహించాలి.

- మంత్రాలతో పూజలు చెయ్యటం కుదరివారు దేవతకు సంబంధించిన నామాలతో అర్చన చేయవచ్చు.

- ఒక్కపూట భోజనమే చేయాలి. నేలపై పడుకోవాలి.

దీక్షలో చేయకూడనవి

- క్షౌరం చేయించుకోకూడదు.

- గోళ్లు తీయకూడదు.

- ధూమపానం, మద్యపానం చేయకూడదు.

- మాంస భోజనం తినరాదు.

- కామక్రోధాలు, వినోద కార్యక్రమలకు దూరంగా ఉండాలి.

- అనవసరంగా మాట్లాడకూడడదు.

- దీక్ష పూర్తయ్యేంత వరకు పాదరక్షలు ధరించకూడదు.

అచ్చంగా అమ్మలా...

లోకాలనేలే చల్లనితల్లి దుర్గమ్మ ఆశీస్సులు కోరుతూ చేసే దీక్ష భవానీ దీక్ష. అచ్చం ఆ అమ్మను పోలి ఉండేలా దీక్షా ధారులు ఎర్రటి వస్త్రాలు ధరించి, కుంకుమ ధరిస్తారు. పాదాలకు పసుపు పూసుకుంటారు. భవానీ దీక్షాధారులను చూడగానే కనకదుర్గమ్మను చూస్తున్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది. మనసుతో పాటు శరీర ఆకృతిలోను అమ్మ భావనను ప్రకటిస్తూ ఆ తల్లి అనుగ్రహం ఈ దీక్ష చేస్తారు. 

భవానీపూజలో ప్రధానాంశం 'శరణు ఘోష'. అనేక విధాలైన స్తోత్రాలు, నామాలతో జగన్మాతను దీక్షాధారులు ఆరాధిస్తారు. మనిషిలో ఉండే యవ్వనం, అందం, అనుభవించే భోగభాగ్యాలు ఇవేవీ శాశ్వతం కావు. అమ్మ పాదాలను శరణు వేడటమే ముక్తికి మార్గం. భవబంధాలను విడిచి అమ్మ చరణాలను పట్టుకునేందుకు మనిషి మనస్సును సన్నద్ధం చేసే ఆధ్యాత్మిక సాధన శరణుఘోష ప్రధానాశయం. 

ఇంద్రకీలాద్రికి చేరుకుని, జగన్మాతను దర్శించిన తర్వాత ఇరుముడిలోని కొబ్బరికాయను హోమగుండంలో సమర్పిస్తారు. యజ్ఞం అంటే సమర్పణ భావం. తనను తాను దైవానికి సమర్పించుకోవటం మనిషి చేసే సాధనలో తుది అంకం. ఆ తర్వాత వ్యక్తి పూర్ణత్వాన్ని సంతరించుకుంటాడు. శాస్త్రాలు కూడా 'యజ్ఞోహి శ్రేష్ఠతం కర్మా' - మనిషి ఆచరించే కర్మలన్నిటిలో యజ్ఞాలు ఉత్తమమైనవని చెబుతున్నాయి. ఉత్తమ క్రియల ద్వారా పూర్ణతాన్ని సాధించటమే కొబ్బరికాయను అగ్నికి సమర్పించటంలో భావం. ఈవిధమైన ఆధ్యాత్మిక విజ్ఞాన రహస్యాలన్నీ తనలో ఇముడ్చుకున్న కారణంగా భవానీదీక్ష అమ్మను కృపను పొందేందుకు దివ్యమైన మార్గంగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.

------------

రచన: డాక్టర్‌ కె.రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు,  ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ-3. సెల్‌ : 90320 44115 / 88975 47548. email: krkrishna2011@gmail.com


(శ్రీ కనకదుర్గ ప్రభ పత్రిక జనవరి 2020 సంచికలో రాసిన వ్యాసం)










Friday, January 1, 2021

దేవుడు ఒక్కడుంటే చాలు కదా? ఇంతమంది దేవుళ్ళు ఎందుకు?

 



దేవుళ్ళు

"నందినీ ఇక్కడ నుంచి చూడు స్వామి చక్కగా కనిపిస్తున్నారు గాయత్రి పిలిచింది.

గొప్ప తేజస్సుతో కళ కళ లాడుతున్న క్షిప్రగణపతిని భక్తితో నమస్కరించారు ఇద్దరు. మెల్లిగా కూతురి చేయి పట్టుకొని శ్యామకమలలోచన దత్తాత్రేయుని గుడి దగ్గరకు నడిపించింది గాయత్రి.

అమ్మా నాకొక సందేహం పన్నెండేళ్ళ చిన్నారి నందిని అడిగింది.

ఇప్పుడు కాదు, ముందు అందరి దేవుళ్ళను దర్శించుకొని, తీరిగ్గా మాట్లాడుకుందాం  అంటూ నందిని చేయి పట్టుకుని దేవాలయం వైపు నడిచింది గాయత్రి.

అక్కడ్నుంచి వారు మరకత రాజేశ్వరి అమ్మవారిని, గంగాధరుడు, ఆంజనేయస్వామిని దర్శించుకుని ఒక చోట తీరికగా కూర్చున్నారు.

ఇప్పుడు చెప్పు? ఏమిటి నీ సందేహం?' తాపీగా అడిగింది గాయత్రి.

“అమ్మా ఇంతమంది దేవుళ్ళు మనకెందుకు? ఒక్కరుంటే సరిపోతుంది కదా? ఎవరిని  పూజించాలో అర్థంకాదు. ఎందుకింత గజిబిజి తికమక" కళ్ళు తిప్పుతూ అడిగింది నందిని.

బిడ్డకు ఎలా సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తున్న గాయత్రిని ఒక దృశ్యం ఆకర్షించింది. గుడి గేటుకు అవతల ఒక బొమ్మలవాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రకరకాల బొమ్మలు చేస్తున్నాడు. చాలామంది దేవుళ్ళ విగ్రహాలు పొందికతో అమర్చబడ్డాయి. వినాయకుడు, దుర్గమ్మ, వేంకటేశ్వరస్వామి, సాయిబాబా... చాలా దేవుళ్ళ బొమ్మలు కనిపిస్తున్నాయి.

భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కేవలం భారతీయత మాత్రమే కాదు హిందూ సాంప్రదాయ గొప్పతనం కూడా. ఏ దేవుడైనా, దేవతైన అంతా పరమాత్మ రూపాంతరమే అంతా శక్తి స్వరూపమే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాగా.

రకరకాల రూపాలతో మనల్ని తరిపింప చేయడానికి వచ్చిన పరమాత్మ సృష్టిలో ధర్మం నిలబెట్టడం కోసం ప్రతి యుగంలో ఒక్కొ దేవునిగా అవతారం ఎత్తి మనల్ని తరింపచేస్తున్నారు. బొమ్మలు వేరు వేరైనా అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినట్లు ఒక్కొ విగ్రహం ఒక్కొ మంత్ర స్వరూపంగా వెలుగొందుతుంది. మన కోసం పరమాత్మం ఎన్నో రూపాలతో ఆవిష్కరించబడ్డారు. మనం ఏ దేవుడిని పూజించినా అంతా ఆ పరమాత్మకే చెందుతుంది.

ఈ చుట్టూ ఎన్ని చెట్లు వున్నాయో చూడు అన్ని చెట్లకూ ఆకులన్నీ ఒకే రకంగా ఎందుకుండపు? ప్రకృతి, పరిసరాల కనుగుణంగా ఒక్కొరూపంలో పుంటాయి. కాని అన్నిటిలో జీవనాధార క్లోరోఫిల్ ఒక్కటే. 

పరమాత్మ అలాగే ఒక్కొ మంత్రశక్తి రూపంలో శక్తిని ఆవిష్కరించి మనలో ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రతిక్షణం సహాయపడుతుంటారు. ప్రతి గుడి ఒక శక్తి క్షేత్రమే - ప్రతి విగ్రహరూపం ఒక మంత్ర స్వరూపమే. ప్రతి దేవుడు పరమాత్మ ప్రతిరూపమే అర్థమయిందా అడిగింది గాయత్రి.

సంతృప్తిగా తలూపింది నందిని.

------------------------

రచన : డాక్టర్ రాజసులోచన, విజయవాడ.

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...