Showing posts with label రాముడు. Show all posts
Showing posts with label రాముడు. Show all posts

Wednesday, May 1, 2024

వాక్యకోవిదుడు హనుమంతుడు


 

వాక్యకోవిదుడు, వ్యాకరణ పండితుడు

 

 

మాట మనిషిని మహనీయుడిని చేస్తుంది. అదే మాట మనిషి పతనావస్థకు దారితీస్తుంది. వాక్కుకు అంతటి అమోఘమైన శక్తి ఉంది. అవతలి వ్యక్తితో స్నేహం చెయ్యాలన్నా, మిత్రుడు శత్రువుగా మారాలన్నా ఒక్క మాట సరిపోతుంది. అందుకే శాస్త్రాలు వాక్కును దైవంగా ప్రకటిస్తాయి. మంత్రభాగంలో కూడా వాక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మాట్లాడే మాటలో ఒక శబ్దం ఎక్కువ లేదా తక్కువ అయినా అందుకు విపరీత ఫలితాలు ఏర్పడతాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలి. వాక్కుకు ఇంతటి ప్రభావాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు, ఎవరితో ఎప్పుడు ఎంతవరకు ఎలా మాట్లాడాలో ఆ పరిధికి లోబడి మాట్లాడి ‘వాక్య కోవిదుడు’గా, ‘నవ వ్యాకరణ పండితుడు’గా జేజేలు అందుకుంటున్నవాడు రామదూత హనుమ మాత్రమే.

 

హనుమ నవ వ్యాకరణ పండితుడు. సూర్యుడి దగ్గర శిష్యరికం చేసినవాడు.  తపస్వి. సుగ్రీవుడి మంత్రి. భక్తుడు. సేవకుడు. రాయబారి. కార్యసాధకుడు. యోధుడు. పరాక్రమశాలి. అన్నిటికీ మించి వినయ సంపన్నుడు. గొప్ప వాక్కు అలంకారంగా కలిగినవాడు – ’వాగ్విదాం వరం‘ – అని వాల్మీకి పొంగిపోయి చెప్పాడు.

 

హనుమంతుడు అనగానే సాధారణంగా అందరికీ ఆ స్వామి భుజ బలం మాత్రమే గుర్తుకువస్తుంది. నిజానికి హనుమ గొప్ప బుద్ధి బలశాలి కూడా. అందుకే ‘బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా / అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్’ -  హనుమను ధ్యానిస్తే బుద్ధిబలం వస్తుంది అని చెబుతున్నాయి ఇతిహాస, పురాణ గ్రంథాలు.

 

సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.

 

రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!

 

మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమగాలు సంచరించే ఇలాంటి చోటుకురారు అని రామలక్ష్మణులను ప్రశ్నిస్తాడు హనుమ.

 

మాట అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు. హనుమంతుడి మాటల ఔచిత్యానికి ముచ్చటపడతాడు రాముడు.

 

నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ: ! నా సామవేద విదుష: శక్యమేవ విభాషితుం !!

 

రుక్‌, యజు, సామవేదాల్లో పండితుడైనవాడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేరంటూ లక్ష్మణుడితో హనుమంతుడి మాటలతీరులోని గొప్పతనాన్ని వివరిస్తాడు రాముడు. ఒక్క మాట ఎక్కువ తక్కువ కాకుండా కొత్తవారితో కూడా ఎంతో నేర్పుగా మాట్లాడటమే కాకుండా రామసుగ్రీవుల మైత్రికి బీజం వేసింది హనుమ వాక్చాతుర్యం. హనుమలోని వ్యాకరణ పాండితీ వైభవానికి, ఔచిత్యవంతమైన సంభాషణ చేసే నేర్పుకీ ప్రతీక ఈ ఘట్టం.

 

నవ వ్యాకరణాలు ఎలా చదివాడంటే...

 

‘హనుమంతుడు మాటతీరు తెలిసినవాడు’అని శ్రీరామచంద్రుడు అంతటివాడు ప్రశంసించాడు. నవ వ్యాకరణ పండితుడు కావటమే హనుమంతుడి ఉత్తమమైన మాటతీరుకు కారణం.

హనుమ సూర్యభగవానుడి దగ్గరకు వెళ్లి తనకు వ్యాకరణాన్ని నేర్పమన్నాడు. చిన్నప్పుడు తనను తిన దగిన ఫలమని భావించి ఎగిరి వచ్చిన హనుమను చూస్తే ముచ్చటేసింది సూర్యుడికి. ‘నేర్పుతాను. కానీ, నేను ఒకచోట స్థిరంగా ఉండటానికి కుదరదు కదా! గగన మార్గంలో నా వెంట ఎలా తిరుగ గలవు?’ అనడిగాడు భానుడు.

 

‘ఓ.. దానిదేముంది!’ అంటూ తన కాయాన్ని పెంచిన ఆంజనేయుడు ఉదయాద్రిన ఒక కాలు, అస్తాద్రిన ఒక కాలు మోపి, సూర్యగమనానికి అనువుగా నడుమును వంచుతూ, చెవి ఒగ్గి ఆదిత్యుడి దగ్గర వ్యాకరణ శాస్ర్తాన్ని కూలంకషంగా అధ్యయనం చేశాడు.

 

మనకు మొత్తం తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉన్నాయి. అవి... 1.శాక్త వ్యాకరణము 2. శంభు వ్యాకరణము 3. కుమార వ్యాకరణము 4. ఇంద్ర వ్యాకరణము 5. సూర్య వ్యాకరణము 6. చంద్ర వ్యాకరణము 7. స్మర వ్యాకరణము 8. వాత్స్యాయన వ్యాకరణము 9. అగస్త్య వ్యాకరణము. – ఈ తొమ్మిది రకాల వ్యాకరణాలను హనుమంతుడు సూర్యుడి వద్ద అధ్యయనం చేసాడు.  అందుకే హనుమకు ‘నవ వ్యాకరణ పండితుడు’ అనే పేరు ఏర్పడింది.

 

హనుమ మాట్లాడిన తీరుకు ముచ్చటపడిన రామచంద్రమూర్తి స్వయంగా... నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధా శ్రుతమ్ బహు వ్యాహరతానేన న కిఞ్చిదపశబ్దితమ్’ – ఆంజనేయుడు మాట్లాడిన మాటల్లో ఒక్క అపశబద్దం కానీ, ఒక్క మాట ఎక్కువ కానీ, తక్కువ కానీ లేదు. వ్యాకరణం మీద తిరుగులేని పట్టు ఉన్న వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అంటాడు. రామయ్యను హనుమ మెప్పించింది తన భుజబలం చూపించో, మరొక శక్తి ప్రదర్శించో కాదు... కేవలం తన భాషా పాండిత్యంతో మెప్పించాడు. అదీ హనుమ వ్యాకరణ పాండిత్యానికి ఉన్న ఔన్నత్యం.

 

దృష్టా సీతా...

 

వానర రాజు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం భూమి నాలుగు చెరగుల నుంచి కపి సైన్యం వచ్చి చేరింది. ఓక్కొక్కరిని ఒక్కొక భాగానికి నాయకుడిని చేసి వారు ఏదిక్కుగా వెళ్ళాలో, ఎక్కడెక్కడ వెతకాలో వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు సుగ్రీవుడు. చివరగా, అంగదుడిని నాయకునిగా చేసి , హనుమదాదిగా వీరులను దక్షణ దిక్కుకు వెళ్ళి వెతకమని చెబుతాడు. ఎక్కడి దాకా వెళ్ళి వెతకాలో చెబుతాడు. అందరికీ, ఎక్కడెక్కడ వెతకాలో కూడా చెబుతాడు.. సమయం ఒక నెల అని చాలా వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు. అతిక్రమించిన వారికి శిరః ఛేదం శిక్ష అని ప్రకటించాడు. అందుకే దానిని సుగ్రీవాజ్ఞ అన్నారు.

 

అప్పుడు రాముడు హనుమకు అంగుళీయం తన గుర్తుగా ఇస్తాడు, సీతకు ఇవ్వడానికి. ఎవ్వరికీ ఇవ్వని ఈ గుర్తు హనుమకే ఇవ్వడం లో విశేషం, హనుమ మాత్రమే ఈ పని పూర్తి చేయగలడన్న నమ్మకం.  సీతమ్మను వెదకడానికి అందరూ అన్ని దిక్కులకూ బయలుదేరుతారు. దక్షణ దిక్కుగా వెళ్ళినవారు చాలా చిక్కులు పడి సముద్ర తీరం చేరుతారు.

 

అప్పటికే ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. అందరూ ప్రాణభయంతో ఉన్నారు సుగ్రీవాజ్ఞ మూలంగా. ఆ సమయంలో లంకకి వెళ్ళగలవారెవరనే ప్రశ్న ఏర్పడింది. చివరికి హనుమకి శక్తి గుర్తు చేసి ఆయనను పంపుతారు. హనుమ లంకకు చేరుకుని, సీతను చూసి ఆమెతో మాటాడి ఆమెను ఆత్మహత్య నుంచి కాపాడి, అంగుళీయమిచ్చి, సీతమ్మ ఇచ్చిన చూడామణి ని తీసుకుని, అశోకవనం నాశనం చేసి, రావణుని పరివారం కొంత, అతని సుతుని పరిమార్చి, రావణుని చూచి, లంక కాల్చి, విజయంతో తిరిగి బయల్దేరతాడు.

 

ఇక్కడ సముద్రపు ఒడ్డున ఉన్న వారు ఉత్కంఠ తో ఉన్నారు. ఏమైందో తెలియదు. హనుమ సీతను చూసి వస్తే అందరి ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే, సుగ్రీవాజ్ఞ ప్రకారం శిరచ్ఛేదం తప్పదు. ఇటువంటి సమయంలో హనుమ తిరిగివస్తూ సముద్రపు ఒడ్డున ఉన్న తన వారికి విజయ సందేశం క్లుప్తంగా తెలియజేయడానికి సింహనాదం చేస్తాడు. ఆ సింహనాదం విని, అక్కడ వున్న జాంబవంతుడు మొదలైన వారు హనుమ కార్య సాధనతో తిరిగి వస్తున్నాడని భాష్యం చెబుతారు.

 

ఆయినా ఉత్కంఠం పోదు. హనుమ నేల మీద కాలుమోపుతూ... “దృష్టా సీతా” అన్నాడు. సాధారణంగా క్రియాపదంతో వాక్య నిర్మాణం ఉండదు. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం కూడ తోడు కలవడం, వ్యాకరణ పండితుడవటం వల్ల, అక్కడ ఉన్నవారి ఉత్కంఠను వెంటనే చల్లార్చే ఉద్దేశంతో హనుమ ‘దృష్టా సీతా’ అన్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఎందుకు, ఏం మాట్లాడాలో తెలిసినవాడు కావటం వల్లనే ఒక్కమాటతో వేలాది ప్రాణాలు నిలబెట్టాడు హనుమ. అదీ ఆ స్వామిలోని వాక్యకోవిదత్వం.

 

సీతమ్మ ప్రాణం కాచిన మాట

 

పదినెలల అశోకవనవాసం సీతమ్మను ఎంత కుంగదీసిందంటే – హనుమ రావడం రెండు నిముషాలు ఆలస్యమయితే ఆత్మహత్య చేసుకునేది.  అలాంటి సంక్షుభిత ఉద్విగ్న సమయాల్లో హనుమ మాట్లాడిన తీరు అనన్యసామాన్యం. బహుశా అలా మాట్లాడాలంటే దేవుడే దిగి రావాలి.

 

అంతకుముందు... తెల్లవారక ముందే రావణుడు వచ్చి నానా మాటలు అని వెళ్ళాడు. నరమాంస భక్షకులైన ఆడ రాక్షసుల గుండెలు గుచ్చుకునే మాటలు మరో వైపు. ఇక ఇన్ని కష్టాలు తట్టుకునే ఓపిక నశించింది సీతమ్మకు. తన కేశాలతో పాశం తయారుచేసుకుని, ఉరి వేసుకుని, ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుని, అందుకు సన్నద్ధమవుతోంది. ఇదంతా గమనిస్తున్నాడు పక్కనే చెట్టుమీద ఉన్న మారుతి.

 

సీతమ్మతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం. కానీ, ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడాలి...? ఆలోచించాడు హనుమ.

 

ఇంతదాకా సంస్కృతంలో రావణుడు అఘోరించి వెళ్ళాడు – కాబట్టి సంస్కృతంలో మాట్లాడితే మళ్ళీ రావణుడి మాయలే అనుకుంటుంది. అనేక భాషలు తెలిసినవాడే భాష ఎంపిక గురించి ఆలోచించగలడు. సీతమ్మ సొంత ఊరు మిథిలా నగరం. అయోధ్యలో మాట్లాడేది ప్రాకృత అవధి భాష.  కాబట్టి, అయోధ్యలో మాట్లాడే యాసతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు హనుమ. అంటే సీతమ్మ మెట్టినింటి భాష అన్నమాట. పూర్తిగా మన ఊరివారెవరో మాట్లాడుతున్నారని మొదటి మాటకే ఆమె ఉపశమనం పొందాలి. ఆ తరువాత....? ఏం చెబితే ఆమె ఇంకా నమ్ముతుంది? శాంతిస్తుంది? ఆలోచించాడు... రామకథనే ఎంచుకున్నాడు . అంతే మైథిలీ ప్రాకృత భాషలో రామగానం ప్రారంభించాడు. తన మాండలికంలో రామకథను వినగానే సీతమ్మకు పోయిన ప్రాణం తిరిగివచ్చినంత పనైంది.

 

క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమం అడగమన్నాడు – అన్నాడు హనుమ. అంటే ఆమె అడగకుండానే రాముడు క్షేమంగా ఉన్నాడని, ఆయనే తనను పంపాడని విన్నవించాడు. నువ్వెక్కడున్నావో తెలిసింది ఇక వెంటనే రాముడు వస్తాడు – అని అభయమిచ్చాడు.

 

మాటల్లో చెప్పలేనంత ఆపదలో ఉండి, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ మనిషిని ఎలా కాపాడాలో హనుమకు తెలిసినంత ఇంకెవ్వరీ తెలియదు అని ఘంటాపథంగా చెప్పడానికి ఈ ఘట్టమే ఉదాహరణ. నవ వ్యాకరణ పండితుడు, అనేక భాషలు తెలిసినవాడు కాబట్టే, సీతమ్మకు భాష ద్వారా దగ్గరయ్యాడు, రామదూతను అనే నమ్మకం కలిగించగలిగాడు.

 

హనుమ అంటే శబ్దబ్రహ్మ. ఆ స్వామి మాటకు మహోన్నతమైన శక్తి ఉంది. హనుమను మించిన పండితుడు లేడు. భుజబలంతో పాటు బుద్ధిబలమూ ఆ స్వామి అనుగ్రహం వల్ల లభిస్తుంది.

 

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548

 

Thursday, April 18, 2024

తెలుగింటి రాముడు


 
 
 శ్రీరామ

తెలుగింటి రాముడు

రామనామం ఓ తారకమంత్రం. రాముడి వంటి కుమారుడు, సోదరుడు, భర్త, నాయకుడు, మిత్రుడు, పరిపాలకుడు, ధర్మమూర్తి... మరొకరు లేరు అనేది నిర్వివాదం. ప్రతి మనిషికీ రాముడితో ఓదో ఒక అనుబంధం ఉంటుంది. ఆ పేరు చెబితేనే ఆత్మీయత ప్రకటితమవుతుంది.  ప్రత్యేకించి తెలుగు ప్రజలకు రాముడు దేముడు మాత్రమే కాదు. తెలుగు జీవితాల్లో రాముడొక భాగం. రాములోరి పెళ్ళి, లక్ష్మణదేవర నవ్వు, సీతాదేవి నిద్ర అంటూ తెలుగు జానపదులు కూడా రాముడితో చుట్టరికం కలుపుకున్నారు. అదీ రామయ్య ఘనత. రామకథ మహిమ. 


తెలుగులో వచ్చిన తొలి రామాయణం గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. ద్విపద ఛందస్సులో వచ్చిన ఈ రామాయణాన్ని పాటలుగా పాడుకుని మురిసిపోయిన తెలుగు లోగిళ్ళు లక్షల్లో ఉన్నాయి. సీతారాముల దాంపత్యంలోని ఔన్నత్యాన్ని తేలికైన మాటలతో చెబుతూనే బరువైన భావాన్ని పలికించాడు బుద్ధారెడ్డి.


రాముడి ధనుర్విద్యాకౌశలం ఎంత గొప్పదంటే “నల్లవో  రఘురామ! నయనాభిరామ! విలువిద్య గురువ  వీరావతార --------- బాపురే రామా భూపాల! లోకముల నే పాటి విలుకాడు నేర్చునే కలుగ” అంటూ పగవాడైన రావణాసురుడు కూడా రామయ్య కోదండకళకు అబ్బురపడి భళీ అని ప్రశంసించాడు.


రావణుడు అపహరించిన విషయం తెలియక రాముడు సీతమ్మ గురించి వెతుకుతూ... ‘‘ఇది మహారణ్యమై యిప్పుడు తోచె / ఇది పర్ణశాలయై యిప్పుడు తోచె / ఇది నాకు దపమని యిప్పుడు తోచె / చల్లని ముఖదీప్తి చంద్రునికిచ్చి / తెల్లని నగవు చంద్రికలకు నిచ్చి / చెలువంపు పలుకులు చిలుకల కిచ్చి / నిన్ను దైవము మ్రింగెనే నేడు సీత’’ - చంద్రుడిలోనూ, వెన్నెలలోనూ, చిలుకల పలుకుల్లోనూ రాముడికి సీత కనిపిస్తోంది. అందుకే సీతమ్మ ఏ అడవి జంతువు వల్ల మృత్యువాత పడిందో అనుకుంటూ ఆవేదన చెందుతాడు.  


ప్రతి అడుగులోనూ, ప్రతి అణువులోనూ భార్యాభర్తలు ఒకరికొకరు కనిపించాలి. అప్పుడే ఆ దాంపత్యానికి సార్థకత ఏర్పడుతుందని రంగనాథ రామాయణం ప్రకటించింది. ఇలా ఎన్నో భావాలు ప్రకటిస్తూ, సీతను తెలుగు జానపదుల ఆడపడుచుగా, రాముడిని జానపదుల దేవుడిగా తీర్చిదిద్ది, వారి హృదయాల్లో శాశ్వతస్థానం కల్పించాడు బుద్ధారెడ్డి. తెలుగు పల్లెల్లో పేటపేటకూ కనిపించే రామాలయాలు, ఇంటింటా వినిపించే సీతారాముల పేర్లూ  ఈ రామాయణ ప్రభావమే.


కవయిత్రి ఆతుకూరి మొల్ల ‘చెప్పుమని రామచంద్రుఁడు / సెప్పించిన పలుకుమీదఁ జెప్పెద’ అంటూ రామాయాణం రచించింది. రాముడికే కాదు రామపాద ధూళికి కూడా ఎంతో మహత్తు ఉందంటూ మొల్ల రామ వనవాస సందర్భంలో చెబుతుంది. అరణ్య వాసానికి బయల్దేరిన రాముడు సీతాలక్ష్మణ సమేతంగా గంగానది దాటాలని ఓడ నడిపే గుహుడిని కోరతాడు. దానికి గుహుడు రాముని పాదధూళి సోకి రాయి కాంతగా మారింది కదా, తన ఓడ కూడా ఏమౌతుందోనని భయం వేస్తోంది. అందుకే నీ పాదాలు కడుగుతాను అంటూ రాముని పాదాలు కడుగుతాడు. 

చ. సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు వి
య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో” యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము పెంపునన్‌. 


వాల్మీకి రామాయణంలో లేని ఈ మొల్ల వర్ణన తరువాత ఎందరో తెలుగు కవుల భావనల్లో ప్రతిధ్వనించింది.

అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న సీతారామ లక్ష్మణులను అక్కడి చెంచు స్త్రీలు చూసారు. రతీ మన్మథులను మించిన అందంతో ప్రకాశిస్తున్న సీతారాముల్ని చూస్తూ, తమలో తాము...

చ. ఇతనికిఁ బాదచారితన మేటికి వచ్చెనో? పట్టభద్రుఁ డీ
సతి నవ రూప రేఖలను జక్కని దయ్యును నిట్టి దుర్దశల్‌
ప్రతివసియించు టెట్లో? రతిరాజ సమానుల వీరి నేల యీ
గతిఁ బడఁద్రోచె బ్రహ్మ?” యని కాంతురు చెంచెత లమ్మహాత్ములన్‌. 

ఇంతటి అందగాళ్ళను బ్రహ్మ ఈ అడవుల్లో ఎలా పడేయగలిగాడో అంటూ బ్రహ్మను కూడా నిందించారు. రామయ్య సౌందర్యం అంత గొప్పది. అది కేవలం భౌతిక అందం కాదు. మాటలకందని పారమార్థిక భావనాత్మక సౌందర్యం.


లంకను నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడు రాముడిని చూస్తూనే...

“కంటిన్ జానకి బూర్ణచంద్ర వదనన్ గల్యాణి నా లంకలో
గంటిన్ మీ పదపంకజంబులను నే గౌతూహలం బొప్పగా
గంటిన్ మీ కరుణావలోకనము విఖ్యాతంబుగా గీర్తులం
గంటిన్ మా కపి వీర బృందములలో గాంభీర్యవారాన్నిధీ”

- చూసితి సీతను అంటూ రాముడి మనసుకు గొప్ప సాంత్వన కలిగిస్తాడు. అంతేకాదు, సీతలో రామయ్య ఎలా కనిపిస్తున్నాడో కూడా చెబుతాడు. సీత, రాముడు – ఇద్దరు కాదు ఒక్కరే అనే భావాన్ని మొల్ల ఎంతో రమ్యంగా చెప్పింది.

రామకథను ప్రబంధంగా తీర్చిదిద్దిన కవి అయ్యలరాజు రామభద్రుడు. శివధనస్సును రాముడు ఎక్కుపెట్టగానే అది ఫెళ్ళుమని పెద్దశబ్దం చేస్తూ విరిగిపోతుంది.

‘ఆ రమణీయ ధనుష్ఠం / కారము సీతాకుమారికా కల్యాణ / ప్రారంభవాద్య నిరవ / ద్వారమై యొసగె సకల హర్ష ప్రదమై’’  - సీతారాముల కల్యాణ వేడుక కోసం మొదటిగా మోగిన మంగళవాద్యం శివధనుర్భంగం సందర్భంగా వచ్చిన శబ్దమే అంటూ కవి చమత్కరించాడు. అంతేకాదు...

ఆ కరియాన వేనలి అనంత విలాసము మాధవోదయం
బా కమలాయతాక్షి మధురాధర సీమ, హరి ప్రకారమా
కోకిల వాణి మధ్యమున కూడిన దింతియ కాదు, తాను రా
మాకృతి దాల్చె ఈ చెలువమంతయు ఆ యమయందు జొప్పుడున్

సీత పూర్తిగా రాముడిగా మారిపోయిందంటాడు కవి. సీతమ్మను చూస్తే రామయ్యే కనిపిస్తున్నాడట. అంటే, సీతారాములకు అభేదం. శివపార్వతులే కాదు సీతారాములూ అర్ధనారీశ్వరులే. దాంపత్యానికి అర్థం, పరమార్థం ఇదే అంటూ గొప్పగా ప్రకటించింది రామాభ్యుదయ ప్రబంధం.

వానర సేనతో సహా సముద్రాన్ని దాటిన రాముడు, యుద్ధ ప్రారంభానికి ముందు అక్కడి సువేల పర్వతాన్ని ఎక్కి లంకను తేరిపార చూస్తాడు.

తనదు ప్రాణేశ్వరి, మహీతనయ కేడ
యావహిల్లునొ దురవస్థ యనుచు గాక
చుఱుకు జూపుల రఘుపతి జూచినపుడ
లంక యాహుతి గొనదె నిశ్శంక మహిమ

లంకలో ఉన్న తన ప్రాణేశ్వరికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అని ఊరకున్నాడు కానీ, మూడోకన్ను తెరచిన శివుడి  మాదిరిగా తన చూపులతోనే లంకను రాముడు కాల్చివేసేవాడట. రాముడు సాక్షాత్తు శివ స్వరూపమే అని చెప్పటంతో పాటు, శివ కేశవ అభేదం కూడా ఈ పద్యంలో ప్రకటించాడు రామభద్ర కవి.

యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయిన సందర్బంలో రాముడికి వచ్చిన కోపం ఎంతటి ఉత్కృష్టమైనదో వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు.

అభ్రంకష రధ కపి చి / త్ర భ్రమణంబుల వెలింగె ప్రళయాంతక ఫా / ల భ్రాజిష్టు భ్రుకుటీ / విభ్రమ ధౌరేయమైన విల్లుందానున్ - మూర్ఛపోయిన తమ్ముడి వంక మాటిమాటికీ చూస్తూ, రాముడు తన కోదండాన్ని పట్టుకున్న విధానాన్ని చూస్తేనే, ఇక రావణుడికి మృత్యుఘడియ దగ్గరపడిందనే సందేశం ఆ సన్నివేశం చూస్తున్నవారికి అందిందట.


అసలు రాయడం అంటూ జరిగితే రామాయణమే రాయాలి. తనలోని జీవుడి వేదన తీరాలన్నా, తన తండ్రి ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలన్నా రామాయణమే రాయాలి. ఇంకే కథ రాసినా అది కట్టుకథే అవుతుందంటూ నిర్మొహమాటంగా చెప్పిన ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ. తన రామాయణ కల్పవృక్షంలో రాముడి వైభవాన్ని ప్రపంచం పట్టలేనంతగా విస్తరించి రాసారు. 


జనకుడి సభలో రాముడు ఎక్కుపెట్టిన శివధనుస్సు విరిగిన శబ్దం 

నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహా ఘోరబం
హిష్ఠ స్ఫూర్జధుషండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘ్రిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్.

ఉరుముల గుంపు నుండి వచ్చే ధ్వనిలాగా శివధనుస్సు విరిచినప్పుడు శబ్దం వచ్చిందట. అక్కడితో ఆగలేదు విశ్వనాథ కవితావేశం. భూమి నుంచి వరుసగా ఐదు ఊర్ధ్వ లోకాల్లో ఆ శబ్దం ఎలా వినబడిందో వివరిస్తూ వరుసగా ఐదు పద్యాలు రాసారు. అదీ రామయ్య బాహు విక్రమం. 

ఇరువదినాలు గేండ్లుగ నిదెప్పు డిదెప్పు డటంచుఁ గన్నులం
దెఱచి ప్రతీక్ష చేయుదుగదే, జగదేకధనుష్కలానిధీ !
విఱచిన వెండికొండదొర వింటిని వింటినిగాని చూడలే
దఱుత వహింప ధాత్రిఁ గనులారగఁ జూతునురా కుమారకా !


శివధనుస్సును విరిచి, సీతమ్మను వివాహం చేసుకున్న సందర్భంలో కౌసల్య మనోభావం ఇది. ఇరవై నాలుగేళ్ళుగా ఈ కల్యాణ ఘడియ కోసమే నిరీక్షిస్తున్నాను కుమారా... అంటూ ఆ తల్లి రాల్చిన ఆనందాశ్రువులు సీతారాముల కల్యాణానికి అక్షతలుగా మారాయి.

అశోకవనంలో రాక్షస స్త్రీల సమూహం మధ్య కూర్చున్న తేజోవతి అయిన ఓ స్త్రీని హనుమంతుడు చూసాడు. ఆమె ఎవరో తెలియదు. కానీ, ఆమెను చూస్తుంటే...

*ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చా*
*పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే*
*హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ*
*ర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై* *

అప్పటివరకూ తాను చూసిన రామచంద్రమూర్తి విరహమంతా మనిషి రూపం ధరిస్తే ఎలా ఉంటుందో ఆ స్త్రీ మూర్తి అలా కనిపించింది. రాముడి కోదండాన్ని ఆమె కనుబొమల్లో స్పష్టంగా చూడవచ్చు. ఆమె కళ్ళల్లో రాముడి దయాగుణం, కేశాల్లో రాముని మేనిఛాయ, ఆమె శరీరంలోని అణువణులో రఘువంశ ధర్మం బొమ్మకట్టినట్లు కనిపిస్తోంది. అంతేకాదు... తన ధర్మపత్నిని అపహరించిన వాడిని సంహరిస్తానని రాముడు చేసిన ప్రతిజ్ఞ ఆకారం ధరించిందా అన్నట్లు ఆమె కూర్చున్నదట. 

విశ్వనాథ కల్పవృక్షంలోనూ సీతారాములు ఇద్దరు మనుషులు కారు. రెండు భౌతిక రూపాల్లో ప్రకటితమయ్యే  ఒకే ఆత్మ.

ఇంకా... రఘునాథ రాయలు (రఘునాథ రామాయణం), ఘనగిరి రామకవి (యథావాల్మీకి రామాయణం), చెన్న కృష్ణయ్య (సాంఖ్య రామాయణం), గంగయ్య (తారకబ్రహ్మ రామాయణం).... ఇలా తెలుగులో సుమారు 130 వరకు రామాయణాలు వచ్చాయి. 
 
అన్నిటా ఒకటే సందేశం... రాముడు భారతజాతి ఆత్మ.
--------------------------------------------------------------
భక్తి పత్రిక ఏప్రిల్, 2024 సంచికలో ప్రచురితమైన వ్యాసం
----------------------------------------------------------------
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, కెబిఎన్ కళాశాల (అటానమస్), విజయవాడ-1
 


 

Thursday, November 14, 2019

అయోధ్యా నగర విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) రాసిన వ్యాసం



రామయ్య నడయాడిన నేల







అయోధ్య..

కేవలం నగరం మాత్రమే కాదు. తరగని ఆధ్యాత్మిక చింతనకు ఆయువుపట్టు. యుగయుగాల చరిత్రకు నిలువెత్తు దర్పణం. ఊహకందని ప్రాకృతిక సౌందర్యానికి ఆలవాలం. రాజనీతికి, ధర్మవర్తనకు, ప్రజారంజకమైన పాలనకు మారుపేరు. సనాతన భారతీయ సాంస్కృతిక హర్మ్యానికి హృదయ పీఠి.

 

ఇతర నగరాల మాదిరిగా అయోధ్య కేవలం భౌగోళిక ప్రాంతంగా మిగిలిపోలేదు. యుగాలు మారినా, తరాలు గడిచినా ఇప్పటికీ తనకుమాత్రమే సొంతమైన ప్రాభవంతో కోట్లాది హృదయాల్లో ప్రత్యేకస్థానంతో అలరారుతోంది. అయోధ్య అనే పేరు చెబితేనే వర్ణించటానికి మాటలు చాలని ఓ అనుభూతి మనసు తలుపులు తడుతుంది. మనందరి దైవం నదయాడింది ఈ నేల మీదే అనే భావన మనసుల్ని పులకింపజేస్తుంది. ఒక్కసారి ఈ మట్టిని ముట్టుకుంటే చాలు జీవితం ధన్యమవుతుందని కోట్లాది హృదయాలు ఆరాటపడతాయి. కేవలం ఈ నగరానికి మాత్రమే ఎందుకీ ప్రత్యేకత? ఈ మట్టి కోసమే ఇంత ఆరాటమా? అంటే యుగాలనాటి చరిత్రను తరచి చూడాల్సిందే.

 

ఆదికవి వాల్మీకి రామాయణానికి పునాది అయోధ్య. మహర్షి తపస్సు చేసి మరీ వెతికిన సుగుణాల రాశి రామయ్య పుట్టిన నేల అయోధ్య. అందుకే వాల్మీకికి అయోధ్య అంటే వల్లమాలిన ప్రేమ. తన రామాయణం బాలకాండలోని ఐదు, ఆరు సర్గల్ని పూర్తిగా అయోధ్యానగర వర్ణనకే కేటాయించాడు వాల్మీకి.

 

అయోధ్య నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా

మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితాస్వయమ్ (బాలకాండ, 5-6)

 

కోసలదేశంలో ఉన్న అయోధ్య నగరాన్ని మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మించాడు. అందువల్ల ఆ నగరం మరింతగా లోకప్రసిద్ధి పొందింది... అంటూ బాలకాండలో అయోధ్యా నగర వర్ణన ప్రారంభమవుతుంది.

 

అయోధ్య పొడవు 12 యోజనాలు. వెడల్పు మూడు యోజనాలు. ఇప్పటి లెక్కలో ఇది సుమారుగా 168 కి.మీ  పొడవు, 42 కి.మీ వెడల్పునకు సమానం. దీనిప్రకారం అయోధ్య నగరం వైశాల్యం 7.056 చ.కిమీ.

 

 అయోధ్య ఏదో అనుకోకుండా ఏర్పడిన నగరం కాదు. ఎంతో ప్రతిభ కలిగిన శిల్పులు, వాస్తు నిపుణులు ఈ నగరాన్ని శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. నగరం మధ్యభాగంలో అంగడులు ఉండేవి. అక్కడ వివిధ యంత్రాలు, ఆయుధాలు ఉండేవి. ఎత్తైన కోట బురుజులు, ధ్వజాలు, వందలకొద్దీ శతఘ్నులు ఉండేవి. కోటకు రక్షణగా వందల కొద్దీ మేలుజాతి గుర్రాలు, వేగంగా నడిచే ఏనుగులు, ఎద్దులు, ఒంటెలు లు ఉండేవి. మొత్తంగా శత్రుదుర్భేద్యంగా అయోధ్యను తీర్చిదిద్దారు నిపుణులు. అయోధ్యలోని ప్రాకారాలు, కోటను కాపాడటానికి వేలాదిమంది సుశిక్షితులైన యోధులు కోట బురుజుల మీద, కోట లోపల నిరంతరం కాపలాగా ఉండేవారు. వీరందరూ శస్త్రాస్త్రవిద్యల్లో నిపుణులు. ప్రత్యేకించి శబ్దభేది విద్య (కంటితో చూడకుండా కేవలం శబ్దం విని లక్ష్యాన్ని చేదిస్తూ బాణాలు వేసే విద్య)లో అరితేరినవారు.

 

చిత్రామ్ అష్టాపదాకారాం వరనారీగజైర్యుతామ్

సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్ (బాలకాండ, 5:16)

 

చదరంగంలో ఉండే పలకల వంటి నిర్మాణాలు కలిగిన భవనాలు ఇక్కడ ఉండేవని వాల్మీకి ఎంతో స్పష్టంగా చెప్పాడు. అందంతో పాటు శత్రువుల ఊహకు అందనివిధంగా ప్రజల్ని కాపాడేందుకు అప్పటి నగరశిల్పులు తీసుకున్న శ్రద్ధ ఇందులో కనిపిస్తుంది.

 

'యోద్ధుం ఆశక్యా ఇతి అయోధ్య' - జయించటానికి వీలుకానిది అయోధ్య అని అర్థం. కేవలం పేరులోనే కాదు... వాస్తవంలోనూ ఆచరణాత్మకమైన శత్రురక్షణ వ్యవస్థ కలిగిన నగరంగా అయోధ్య చరిత్రలో నిలిచిపోయింది ఎన్ని యుగాలు గడిచినా ఈ నగరం పరరాజుల వశం కాలేదు. ఆయోధ్య చరిత్రకు ఇదొక కీర్తిపతాకం.

 

రాజ్యానికి ఆయువుపట్లైన వాణిజ్యంలో అయోధ్యకు సాటిరాగల నగరం అప్పట్లో లేదు. క్రయవిక్రయాల కోసం వచ్చే వ్యక్తులతో ప్రధానవీధులన్నీ కిక్కిరిసి ఉండేవి. కప్పం చెల్లించటానికి వచ్చే సామంతరాజులు బారులు తీరేవారంటే అతిశయోక్తికాదు. సంగీత, సాహిత్య, నృత్య, నాటక, గీతాది కళారంగాల్లో ప్రముఖులకు అయోధ్యవేదికగా ఉండేవారు.

 

ఇటువంటి ఆయోధ్యను రాముడు పరిపాలించిన కాలంలో సంపన్నుడు కాని వ్యక్తి ఆ నగరంలో లేడు. గో, ధన. ధాన్య, వాహన సమృద్ధి లేని ఇల్లు ఉండేది కాదు. ఈ సందపనంతా యజమానులు కేవలం ధర్మబద్ధంగా సంపాదించి. ధర్మబద్ధంగానే ఖర్చు చేసేవారు. ఈ నగర ప్రజలంతా మహర్షులతో సమానమైన ఇంద్రియ నిగ్రహం, తేజస్సు కలిగిఉండేవారు. అయోధ్యలో ఆకలితో అలమటించే వ్యక్తి ఒక్కడూ లేడు. దానం కోసం అర్రులు చాచే వ్యక్తి లేడు. నుదుట తిలకం ధరించని మనిషి కనిపించడు. దీనుడు కాని, దానం చెయ్యనివాడు కాని, రోగపీడితుడు కాని, సౌందర్యవిహీనులు కానీ కనిపించేవారు కాదు.

 

కాంభోజ, బాహ్లిక, వనాయు, సింధు దేశాలకు చెందిన ఉత్తము గుర్రాలు ఇక్కడ ఉండేవి. వింధ్య పర్వతాల్లో సంచరించే మదపుటేనుగుల్ని ప్రత్యేకంగా ఈ నగరానికి తెప్పించారు.  ఇలాంటి ఉత్తమ జాతి పశుగణం అయోధ్యలో ఉండేది. అంతేకాదు... రెండు, మూడేసి జాతుల సాంకర్యంతో పశుగణాల్ని ఉత్పత్తిచేసే విధానం ఇక్కడ ఉండేది. భద్రమంద్ర, భద్రమృగ, మృగకు చెందిన ఏనుగులు ఇలా పుట్టినవే. (బాల, 6:25). మొత్తంగా బలిష్టమైన రాజ్యవ్యవస్థ అయోధ్యలో ఉండేది. అందుకే అయోధ్య అంటే అక్కడి ప్రజలకు మాత్రమే కాదు విదేశీయులకూ ఎంతో ప్రీతిగా ఉండేది.

 

 స్కాందపురాణం దేశంలోని ఏడు మోక్షపురాల్లో ఒకటిగా అయోధ్యను పేర్కొంది. ఈ నగరం చేప ఆకారంలో ఉంటుందని కూడా ఈ పురాణం చెబుతుంది. అగ్ని, బ్రహ్మపురాణాలు అయోధ్యను పాపాలను నాశనం చేసే నగరంగా కీర్తించాయి. యోగినీతంత్రంలో కూడా అయోధ్య ప్రస్తావన ఉంది. అధర్వణ వేదం అయోధ్యను దేవనిర్మిత నగరంగా ప్రకటించింది. తులసీదాసు కూడా తన రామచరితమానస్ లో అయోధ్య వైభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. భాగవతంలో కూడా శుకమహర్షి రఘవంశాన్ని ప్రస్తావించిన సందర్భంలో ప్రత్యేకంగా అయోధ్య గురించి వివరిస్తాడు.

 

కవయిత్రి మొల్ల కూడా తన రామాయణంలో అయోధ్య వైభవాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తుంది.

'భానుకులదీప రాజన్యపట్టభద్ర

భాసి నవరత్న ఖచిత సింహాసనమ్ము

నాగనుతికెక్కు మహిమ ననారతమ్ము

ధర్మ నిలయమ్ము, మహినయోధ్యాపురమ్ము'

 

అయోధ్య అంటే కేవలం రాజ్యం మాత్రమే కాదు. ధర్మానికి అది నిలయం అంటుంది మొల్లమాంబ.

 

భారతయుద్ధం తర్వాత అయోధ్యానగరం కనుమరుగవుతుంది.  విక్రమాదిత్యుడు ఓ యోగి సూచన మేరకు ఒక ఆవును, దూడను వదలిపెట్టి, అవి ధారగా పాలు విడుస్తున్న ప్రాంతాన్ని అయోధ్యగా గుర్తించి, ఆ నగరాన్ని పునరుద్ధరించాడని ఓ కథనం వ్యాప్తిలో ఉంది. ఇదే ఇప్పటి అయోధ్య అని భక్తుల విశ్వాసం. ఉజ్జయినీ పరిపాలకుడైన విక్రమాదిత్యుడు అయోధ్యలోని సుమారు 300 దేవాలయాల్ని పునర్నిర్మించిన చారిత్రకగాథ ఈ వాదనను బలపరుస్తోంది.

 

శ్రీరామచంద్రుడు, అతని తండ్రి దశరథుడికి పూర్వమే అయోధ్య పరిపాలించిన రాజులెందరో ఉన్నారు. ఇక్ష్వాకు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరధుడు, రఘు మహారాజు, అజ మహారాజు మొదలైన చక్రవర్తులెందరో ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని ధర్మబద్ధమైన పాలన చేసి చరిత్రలో చిరయశస్సు పొందారు. వీరందరి కీర్తికి కారణమైన అంశాల్లో అయోధ్య కూడా ఒకటి.

 

అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికా

పురీ ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా

 

దేశంలోని ఏడు ప్రధాన పుణ్యక్షేత్రాలను సప్తమోక్షపురాలుగా పురాణాలు పేర్కొంటున్నాయి. వీటిలో మొదటిది అయోధ్య. యోగశాస్త్ర ప్రకారం అయోధ్యను మానవశరీరంలో ఉండే సహస్రారచక్రంతో పోలుస్తారు. సహస్రార చక్రం శిరస్సు మధ్యభాగంలో ఉంటుంది. ఇది పరిపూర్ణమైన జ్ఞానానికి ప్రతీక. ఈ చక్రంలో విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా ప్రకాశిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమయోగులకు మాత్రమే సహస్రార చక్రం గురించిన అనుభూతి పూర్వక జ్ఞానం లభిస్తుంది. ఈ స్థానాన్ని తెలుసుకున్నవారికి పునర్జన్మ ఉండదని యోగశాస్త్రం చెబుతోంది. దీనిప్రకారం అయోధ్యను చేరుకోవటమంటే సహస్రారకమలాన్ని చేరుకోవటం, అంతిమంగా మోక్షాన్ని సాదించటమే అవుతుంది.

 

అందరూ అనుకుంటున్నట్లు అయోధ్య కేవలం నగరం మాత్రమే కాదని, మానవ జీవచైతన్యానికి ఇదొక ప్రతీక అని అధర్వణవేదం చెబుతోంది. 'అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాం హిరణ్మయః స్వర్గలోకో జ్యోతిషావృత్త:...' ఎనిమిది చక్రాలు, తొమ్మిది ద్వారాలు ఉండే మానవ శరీరం అయోధ్యకు ప్రతీక. జనన, మరణ చక్రంలో శరీరం తిరుగుతూ ఉంటుంది. వీటితో మోక్షం కోసం యుద్ధం చెయ్యటం సాధ్యం కాదు. ఫలితం ఉండదు. శరీరం అనే పట్టణంలోని జ్యోతిర్మయకోశానికి స్వర్గం అనే పేరుంది. అది జీవచైతన్యస్వరూపమైన తేజస్సుతో నిండి ఉంటుంది. ఈ పట్టణాన్ని ఏ వ్యక్తి బ్రహ్మసంబంధమైనదిగా తెలుసుకుంటాడో అతడికి బ్రహ్మదేవుడు ఆయువు, కీర్తి మొదలైన వాటిని అనుగ్రహిస్తాడని అధర్వణ వేదమంత్రాలు చెబుతున్నాయి.

 

వాక్యపరంగా అయోధ్య పదానికి ఉన్న అర్థాన్ని శరీరానికి అన్వయిస్తే జయించటానికి సాధ్యం కాని లక్షణం ఉన్న శరీరమే అయోధ్యకు లౌకిక ప్రతీకగా నిలుస్తుంది. మొత్తంగా మనలో ఉన్న ఆత్మచైతన్యాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకతను అయోధ్య నిరంతరం గుర్తుచేస్తుందని అర్ధం చేసుకోవాలి.

 







Tuesday, July 2, 2019

అందాల రాముడు

అందాల రాముడు అందువలన దేవుడు
అందాల రాముడు అందువలన దేవుడు
రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది?
మాయలు మంత్రాలు చూపించలేదు.
విశ్వరూపం ప్రకటించలేదు.
జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు...
చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు...
పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు...
తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు...
కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు...
అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస       వధ చేశాడు...
అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు.
లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు.
అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?
కారణం..
ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.
- కప్పగంతు రామకృష్ణ
శాస్త్రధర్మం  
తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.
స్నేహధర్మం
  మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పుతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.
యుద్ధధర్మం
వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.
రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన.
దయాధర్మం
సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా.. అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు. 
మనుష్యధర్మం  
రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు. ‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’ అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.
సోదరధర్మం
రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరôగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ.. పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...