Wednesday, March 3, 2021

మహాశివరాత్రి ప్రత్యేకం... పరమేశ్వర అవతార వైభవం

 

మహాశివరాత్రి ప్రత్యేక రచన
పరమేశ్వర అవతార వైభవం
పరమేశ్వరుడి రూపం అందించే సందేశం ఏమిటి? 
ఆయన ధరించిన ఆయుధాల పరమార్థం ఏమిటి?


అపురూపం... శివ రూపం

 ఆ నామమే కాదు ఆ రూపమూ అపురూపమే.

ఆ వేషంలో ఎంతో వైరుధ్యం. అంతలోనే వైవిధ్యం.

ఆయన ఆయుధాలు, ఆభరణాలన్నీ వేటికవే విభిన్నం.

ప్రతి అంశంలో ఓ సందేశం. మరెంతో పరమార్థం.

అందుకే ఆ రూపమే కాదు... ఆ భావమూ అపురూపమే.

సాకారుడైనా, నిరాకారుడైనా అంతా ఆ స్వామి చిద్విలాసమే.

     పరమేశ్వరుడు పరమ దయాళువు. ప్రకృతిలోనూ ప్రతి అణువూ ఆయన స్వరూపమే. ఆయనకు అధీనమే. కానీ ఆ స్వామి దేనికీ కట్టుబడలేదు. కనీసం కట్టుబట్టలు కూడా విలాసవంతమైనవి స్వీకరించడు. విభూది ధరిస్తాడు. గజచర్మం చుట్టుకుంటాడు. విష సర్పాలు ఆయనకు హారాలు. సగం మిగిలిన నెలవంక ఆయన తలపైన అలంకారం. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో దూకే గంగను నెత్తినపెట్టుకున్నాడు. వయసుడిగిన వృషభం వాహనం. మెడలో కపాలమాల. చేతిలో త్రిశూలం.

ఏమిటీ చిత్రవిచిత్రమైన ఆహార్యం. ఇంతకన్నా సొగసైన వస్తువులేవీ స్వామికి దొరకలేదా అంటే సమస్తమైన విశ్వమే ఆయన కనుసన్నల్లో నడుస్తుంది. ఇక ఆయనకు కానిదేది.

ఆ... ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతోంది. పైపైకి... మామూలు కళ్ళతో చూస్తే శివయ్య లీల ఓ పిచ్చి జంగమదేవర తీరు. అదే కళ్ళుమూసుకుని మనసు తెరచి చూస్తే అనంతమైన శివ వైభవం సాక్షాత్కరిస్తుంది. ఆ స్వామి ఆకారం, ఆహార్యం అన్నిటా అంతులేని ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి.

 జ్ఞానానికి స్థానం... త్రిశూలం

          శివయ్యను చూడగానే ఆయన చేతిలో త్రిశూలం తళుక్కుమని మెరుస్తూ మన కళ్ళకు కనిపిస్తుంది. ఎంతోమంది రాక్షసుల ప్రాణాలు తీసి భక్తుల ప్రాణాలు కాపాడిన మహాశక్తిమంతమైన ఆయుధం అది. శివయ్య చేతికది అలంకారం. 

          త్రిశూలం అంటే మూడు కొనలు కలిగినదని అర్థం. సాధారణ ఆయుధానికి ఉండే కొనలు కావవి. ఆ మూడు కొనలు సత్త్వ రజ స్తమో గుణాలకు ప్రతీకలు. ఆ మూడుకొనలు పిడి వద్ద కలుసుకుంటాయి. త్రిగుణాల ఏకత్వానికిది సంకేతం.

          యోగపరంగా చూస్తే త్రిశూలంలోని మూడు కోణాలు మానవశరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు సంకేతాలు. ఈ మూడు నాడులు శిరస్సులో ఉండే జ్ఞానకేంద్రం వద్ద కలుస్తాయి. ఇదే త్రివేణీ సంగమం. త్రిశూలం లోని మూడు కొనలు మూడు నాడులకు సంకేతాలైతే జ్ఞానకేంద్రం శూలహస్తాన్ని సూచిస్తుంది.  వాటి ఏకత్వాన్ని, త్రిగుణ సంగమాన్ని ప్రకటిస్తుంది.

          త్రిశూలంలోని మూడుకొనలు త్రిగుణాలకు ప్రతీకలైతే వాటి ఏకత్వాన్ని ప్రకటించే చోటును పట్టుకున్న పరమేశ్వరుడు నేనీ త్రిగుణాలకు అతీతుడను అనే సత్యాన్ని ప్రకటిస్తాడు. అంతేకాదు.. భూత భవిష్యత్ వర్తమానాలనే త్రికాలాలకు, జాగృత్ స్వప్న సుషుప్తులనే త్రిస్థితులకు తానే అధిదేవతను అనే సత్యాన్ని కూడా త్రిశూలం తెలియజేస్తుంది. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలను త్రిశూలం పోగొడుతుంది. మరొక అర్థంలో త్రిశూలంలోని మూడు కోణాలు కోరిక, చర్య , జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి. ఇవే ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు.

          త్రిశూలానికి సంబంధించి ఆసక్తికరమైన పురాణగాథలూ ఎన్నో ఉన్నాయి. ఒకానొక సందర్భంలో శివుడు కాశీ పట్టణాన్ని తన త్రిశూలంతో ఎత్తి పట్టుకుంటాడు. మొత్తం ప్రపంచం నాశనమైనా, ప్రళయం వచ్చినా కాశీకి ఎటువంటి ఆపదా కలగదని వరమిచ్చాడు.

          అంధకాసురుడిని సంహరించే సమయంలోనూ త్రిశూలానిదే ప్రధాన పాత్ర. శివుడు రాక్షసుడిని సంహరించకుండా త్రిశూలానికి గుచ్చి ఉంచాడు.  త్రిశూలానికి వేలాడుతున్న అంధకుడికి జ్ఞానోదయమైంది. శివయ్య అతడిని క్షమించి తన ప్రమథగణాల్లో చేర్చుకున్నాడు.

హస్తసాముద్రికంలోనూ త్రిశూలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అరచేతిలో త్రిశూలం గుర్తు ఉన్న వ్యక్తులు పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా పొందుతారు. శుక్రస్థానంలో త్రిశూలం గుర్తున్న వ్యక్తులు సానుకూల దృక్పథంతో ఉంటారు. అంగారక స్థానంలో ఉంటే వ్యక్తులు విజయాలు సాధిస్తారు. చంద్రస్థానంలో త్రిశూలం గుర్తున్న వ్యక్తులు శక్తివంతమైన ఊహలు, సృజనాత్మక ఆలోచనలు కలిగిఉంటారు. ఇలా మరెన్నో స్థానఫలితాలను హస్తసాముద్రిక శాస్త్రం చెబుతుంది.

 అక్షరాలకు ఊపిరిపోసిన డమరుకం

          శివయ్య చేతిలోని డమరుకం కేవలం వాద్యమే కాదు. తత్త్వచింతనకు అదొక వేదిక. అంతేకాదు... మనం రాసుకుంటున్న అక్షరాలకు శివయ్య చేతిలోని డమరుకమే ఉత్పత్తి స్థానం. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన ఘటన ఒకటుంది.

          ఒకప్పుడు పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో తాండవం చేస్తున్నాడు.

నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్‌ ఏతత్‌ విమర్శే శివసూత్ర జాలం

          తాను చేస్తున్న తాండవ నృత్యం చివరలో శివుడు తన డమరుకాన్ని మోగించాడు. ఆ సమయంలో 14 రకాలైన ధ్వనులు వెలువడ్డాయి.  సనకాది మహర్షులు వీటిని గ్రహించారు. ఈవిధంగానే భాషాశాస్త్రం ఆవిర్భవించిందని ఈ శ్లోకానికి భావం.

నర్తనం చివరిలో చేసిన డమరుకపు పధ్నాలుగు దరువుల సహాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకూ బీజం నాటాడు. ఆ పధ్నాలుగు సూత్రాలను పాణిని కంఠస్తం చేసికొని ‘అష్టాధ్యాయి’ అనే ప్రాథమిక వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఇందులో ఎనిమిది అధ్యాయాలు ఉండటం వల్ల ఈ గ్రంథం ‘అష్టాధ్యాయి’గా ప్రసిద్ధి పొందింది. ఈ 14 సూత్రాలనే మాహేశ్వర సూత్రాలు అంటారు. నటరాజు డమరుక దరువుల నుండి ఉద్భవించిన మహేశ్వరసూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికీ, వ్యాకరణానికీ సంబంధం ఇదే. అందుచేతనే శివాలయాలలో వ్యాకరణమంటపాలుంటాయి.

విఖ్యాత శైవకవి పాల్కురికి సోమనాథుడు రాసిన అక్షరాకం పద్యాల్లోనూ శివ డమరుక వైభవం ఎంతగానో ప్రకటితమవుతుంది. కొన్ని పద్యాలైతే పూర్తిగా డమరుక నాద విశేషాలతో నిండి ఉంటాయి.

 

డమరుగజాత డండడమృడండమృడండ మృడండ మృండమృం

డమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం

డమృణ మృడండడంకృతివిడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ

త్ర్పమథన తాండవాటన "డ"కారనుతా బసవేశ పాహిమాం !

 

ఓ బసవేశ్వరుడా ! నువ్వు తాండవ నృత్యము చేసే సమయంలో నీ డమరుకం నుండి డండడ మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడండమృం డమృం మొదలగు ధ్వనులు పుడుతున్నాయి. ఆ ధ్వనులతో పుట్టిన డమరుక కాంతులలో లోకాలు వెలుగుతున్నాయి. అటువంటి అద్భుతమైన డమరుక ధ్వనులు కలిగిన లోకాలను చిలుకు తాండవ నాట్యమునందు సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !నన్నురక్షించు అని ఈ పద్యానికి భావం.

డమరుకం వాయించటానికి ముందుగా డమరుకం మధ్యలో ఒక కొయ్యముక్క కడతారు. దానిని మణి అంటారు. డమరుకాన్ని కదలించినపుడు మణి డమరుకానికి అటు ఇటు తగలటం ద్వారా డమరుక శబ్దం ఉత్పత్తి అవుతుంది.  ఆ శబ్దం అంతులేని ఆనందాన్న కలిగిస్తుంది.

ఆకాశంలో శబ్ద గుణకాలు ప్రయాణిస్తాయి. మనం ఏదైనా మంత్రాన్ని జపం చేస్తున్నట్లయితే లేదా స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నా వాటి నుంచి ఏర్పడే శబ్ద ప్రకంపనలు తరంగాలు మారి ఆకాశానికి చేరుకుంటాయి. అనంతాకాశంలో సంచారం చేసే శివ డమరుక ధ్వనులతో అవి సంయోగం చెందుతాయి. ఆవిధంగా సాధకుడికి పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. 

కాలరేఖ చంద్రరేఖ

శివయ్య సిగ మీద నెలవంక వెన్నెల వెలుగులీనుతూ కనిపిస్తుంది. అలా అర్థచంద్రుడిని ధరించటమే శివయ్య ఔదార్యాన్ని ప్రకటిస్తుంది.  దక్షప్రజాపతి అల్లుడైన చంద్రుడు తన 27 మంది భార్యల్లోనూ రోహిణి అంటేనే ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇది సహించలేని ఇతర భార్యలు తండ్రి అయిన దక్షుడికి ఫిర్యాదు చేయటంతో ఆయన కోపంతో అల్లుడైన చంద్రుడిని శపిస్తాడు. ఆ శాపం పోగొట్టుకునే క్రమంలో శివుడి అనుగ్రహం పొందిన చంద్రుడు శివుడి సిగ మీద అలంకారంగా నిలిచాడు. అప్పటి నుంచి శివుడు చంద్రశేఖరుడయ్యాడు.

పరమేశ్వరుడి జటాజూటంలో చంద్రరేఖ ఉండటం శివుడు కాలస్వరూపుడనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. కాలాన్ని గణించే పద్ధతుల్లో చాంద్రమానానికి ప్రాశస్త్యం ఎక్కువ. అటువంటి కాలగణనకు ప్రధానమైన చంద్రుడు శివుడి అధీనంలో ఉన్నాడు. అంటే శివుడు కాలాధిష్ఠాన దైవం అని గ్రహించాలి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మన: కారకుడు. మనిషి సుఖ సంతోషాలన్నీ జాతకచక్రంలో చంద్రుడి సంచారం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి చంద్రుడు శివుడి అధీనంలో ఉన్నాడు. కాబట్టి శివారాధకులకు అయాచితంగా చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఫలితంగా చక్కని మనోస్థైర్యం కలుగుతుంది. చక్కటి మనస్సు ధర్మకార్యాల మీద నిమగ్నమవుతుంది. అంతిమంగా దైవపదం చేరుకునేందుకు ఇదే పునాదిగా నిలుస్తుంది. 

నాగేంద్ర హారాయ...

          శివయ్యను చూడగానే ఆయన మెడలో ఆభరణంగా వెలుగుతున్న పాము కనిపిస్తుంది. నిజానికది పాము కాదు. పాముల్లో శ్రేష్ఠమైన జాతికి చెందిన సర్పం.  వాసుకి అనే సర్పరాజు తపస్సు చేసి శివుడిని మెప్పించి ఆయనకు కంఠహారంగా మారతాడు.

          పరమేశ్వరుని మెడలో నాగాభరణమై వున్న మహాసర్పం వాసుకి. అన్ని వేళలా స్వామి సేవలో ఆ నాగరాజు తరిస్తాడు.కశ్యప ప్రజాపతికి గల 14 పత్నుల్లో   వినత, కద్రువలు ఇద్దరు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు ఇద్దరు కుమారులు. వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు వెయ్యిమంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాలసముద్రం సమీపంలోని ఉచ్చైశ్రవాన్ని(గుర్రం) దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా వుందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే వుంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా వుంటే అక్క తన దగ్గర వేయి సంవత్సరాలు పరిచారికగా వుండాలని ఒక వేళ తోక తెల్లగానే వుంటే తానే వినత దగ్గర వేయి సంవత్సరాలు బానిసగా వుంటానని కద్రువ పందెం కాస్తుంది.

ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్లిపోతారు. గుర్రం తోక తెల్లగానే వుంది ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో కద్రువ వుంటుంది. హఠాత్తుగా ఆమెకో ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా వున్న వారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వాదిస్తారు. వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని  శపిస్తుంది.

శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. అనంతరం ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు. తల్లి మాట అంగీకరించని ఆదిశేషువు శ్రీమహావిష్ణువు కోసం ఘోరతపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది. రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకికి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకికి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆ నాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడ యందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణడు అని కూడా పిలుస్తాము.

          శివయ్య సర్పాల్ని ధరించటం వెనుక ఎంతో సందేశం దాగి ఉంది. పాములు నిరంతర జాగరూకతకు ప్రతీకలు. శివారాధకులు కూడా అంత జాగరూకతతో ఉండాలనే సందేశం ఇందులో దాగుంది. అత్యంత భయంకరమైన సర్పాలు కూడా శివయ్య స్పర్శ తగలగానే సునమస్కులుగా మారిపోతాయి. భయంకరమైన విష సర్పాల వల్ల కలిగే భయం శివారాధన వల్ల తొలగిపోతుంది. సర్పాల్ని ధరించటం ద్వారా తన భక్తులకు సర్పభయం లేకుండా చేస్తానన్నది శివుడు ఇచ్చే అభయం.

          శివయ్య మెడలో మూడుచుట్టలు తిరిగి ఉండే సర్పం కాలచక్రానికి సంకేతం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలే ఈ మూడు చుట్టలు. ఈ మూడు కాలాలతోటే సమస్తమైన ప్రపంచ చర్య జరుగుతుంటుంది.  పాము ఆకారం కుండలిని శక్తిని పోలి ఉంటుంది. పాము గర్వానికి సూచిక. తన గర్వాన్ని ఎవరైతే గెలుస్తారో వారికి తాను ఆభరణంగా నిలుస్తానని చెప్పటం శివయ్య సర్పాభరణాలు ధరించటం వెనుక ఉండే సందేశాల్లో ఒకటిగా గుర్తించాలి.

 త్రిలోచనాయ...

          శివయ్యను చూడగానే అందరినీ ఆకర్షించేది ఆయన నుదిటిన ఉన్న నేత్రం.  నుదుటి భాగంలో నేత్రాన్ని ఉంచుకున్న కారణంగా శివయ్య త్రినేత్రుడయ్యాడు. సాధారణ భాషలో మూడో కన్ను అంటారు.

          ఈ త్రినేత్రం సాధారణ నేత్రం మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ఇతర కళ్ళ మాదిరిగా చూడటానికి ఉపయోగించే నేత్రం కాదు. ఇది జ్ఞాన నేత్రం.  సకల ద్వంద్వాలకు అతీతమైన స్థితిని ఈ నేత్రం ప్రకటిస్తుంది.  ఇది ఆజ్ఞాచక్రానికి స్థానం.

          శివుడు మూడోకన్ను తెరిస్తే అంతా భస్మమే అంటారు.  పార్వతీ కల్యాణం విషయంలో మన్మథుడు చేసిన పనికి కోపించిన శివుడు మూడోకన్ను తెరుస్తాడు. క్షణంలో బూడిద కుప్పగా మారిపోతాడు మన్మథుడు. ఇంతటి శక్తి మూడోనేత్రానికి ఉంది. ఇక్కడ కాలిపోయింది మన్మథుడనే వ్యక్తి కాదు తీవ్రమైన కామం అనే అరిషడ్వర్గంలోని ఓ శత్రువు. ఎప్పుడైతే మనలోని అజ్ఞానం దహనమవుతుందో అప్పుడు మిగిలేది జ్ఞానమే. అటువంటి జ్ఞాననేత్రాలకు మాత్రమే పరమేశ్వరుడి దర్శనం పొందే యోగ్యత కలుగుతుంది.

 నందివాహనం

          శివయ్య వాహనం నంది. కేవలం వాహనం మాత్రమే కాదు... భక్తులకు శివయ్యకు మధ్య వారిధి కూడా బసవయ్యే. ఆలయానికి వచ్చిన భక్తులు నంది కొమ్ముల ద్వారా శివలింగ దర్శనం చేసుకుంటారు.

          నంది ధర్మానికి ప్రతీక. శివుడు ఎక్కడ కొలువుంటాడే అక్కడ నంది ఉంటాడు. నంది లేని శివాలయం ఉండదు. అంటే శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం కొలువై ఉంటుందని అర్థం.

          నంది పశుజాతికి చెందింది. పశువు అంటే పాశంతో కట్టబడిందని అర్థం. మనమందరూ పశువులమే. వివిధ రకాలైన పాశాలతో కట్టబడి ఉంటాం. ఈ పాశాలన్నీ తొలగిపోతేనే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఇది జరగాలంటే నంది మాదిరిగా నిరంతరం శివసాన్నిధ్యంలో గడపాలి. అంటే తనువు, మనసు శివమయం కావాలి. నంది అందించే సందేశం ఇదే.

(శ్రీశైలప్రభ మాసపత్రిక మార్చి 2021 సంచికలో ప్రచురితమైన వ్యాసం)

--------------------------

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ నంబరు : 90320 44115 / 8897 547 548

--------------------------











ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...