Thursday, December 17, 2020

స్కంద షష్ఠి సందర్భంగా కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం


స్కంద షష్ఠి సందర్భంగా 

కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం



జ్ఞానస్వరూపుడు... స్కందుడు


నమస్తే నమస్తే మహాశక్తి పాణే నమస్తే నమస్తే లసద్వజ్రపాణే |

నమస్తే నమస్తే కటిన్యస్త పాణే నమస్తే నమస్తే సదాభీష్టపాణే ||

స్కందుడు రాశీభూతమైన జ్ఞానస్వరూపుడు. ఆయన చేతిలోని 'శక్తి' ఆయుధం సునిశితమైన మేథస్సుకు ప్రతీక. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులనే మూడు శక్తుల సంయోగ స్వరూపంగా నిలిచి, అజ్ఞానం అనే తారకాసురుడిని సంహరించి, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి ఆయన. బౌద్ధికజ్ఞానంతో పాటు అపారమైన భుజశక్తికి కూడా స్కందుడు ప్రతీకగా నిలుస్తాడు. రాక్షస సంహార విషయంలో దేవతలకే సేనా నాయకుడిగా నిలిచి, వారిని ఆదుకున్న ధీశాలి సుబ్రహ్మణ్యడు. 

స్కందుడన్న పేరు సుబ్రహ్మణ్యస్వామికి ప్రసిద్ధమైంది. స్కన్నమైన (జారిన) వాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతి నుండి ఆవిర్భవించిన ఆరుజ్యోతుల స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. ఆయనే స్కందుడు. శరవణభవుడు, కార్తికేయుడు. కుమారస్వామి.... ఇలా సుబ్రహ్మణ్యస్వామికి ఎన్నో పేర్లు వ్యాప్తిలో ఉన్నాయి. శివపార్వతుల తనయుడిగా స్కందుడు ఆవిర్భవించిన తిథి 'షష్ఠి'. శక్తి కారకుడిగా పేరున్న ఆ స్వామి తారకాసుర సంహార సందర్భంలో దేవతలకు సేనాధిపత్యం వహించి, రాక్షస సంహారం చేసిన రోజు మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ కారణాల వల్ల మార్గశిర శుద్ధ షష్ఠి 'స్కంద షష్ఠి'గా వ్యాప్తిలోకి వచ్చింది. 

సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం

సుబ్రహ్మణ్యస్వామి జన్మవృత్తాంతానికి సంబంధించి అనేక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. అనేక పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాల్లో సుబ్రహ్మణ్యుడి జనన వృత్తాంతానికి సంబంధించిన కథనాలు వర్ణితమై ఉన్నాయి. ఈ కథల్లో కొద్దిపాటి భేదాలు ఉన్నప్పటికీ స్థూలంగా కుమారస్వామి శివపార్వతుల తనయుడనే విషయంలో ఎటువంటి అభిప్రాయభేదం వీటిల్లో లేదు. 

పూర్వం తారకుడు అనే రాక్షసుడు మదగర్వంతో ముల్లోకాలపై దండెత్తి దేవ, మానవ, రాక్షసులను ముప్పుతిప్పలు పెట్టసాగాడు. అతడి ఆగడాలు భరించలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించి, ఎలాగైనా తారకాసురుడి బారినుంచి ముల్లోకాలను రక్షించమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు దివ్యదష్టితో పరీక్షించి, తారకాసురుడు శివుడి అంశతో పుట్టిన శక్తిమంతుడైన వీరుడికి తప్ప మరెవరికీ లొంగడని దేవతలతో చెప్పాడు. అప్పటికే శివుడు తన అర్ధాంగి అయిన సతీదేవిని దక్షయజ్ఞ సమయంలో కోల్పోయి బాధతో హిమాలయాల్లో తపస్సు చేసుకొంటున్నాడు.

పరమశివుడు మరొక కన్యను వివాహం చేసుకుంటే తప్ప శివాంశతో వీరుడు పుట్టడం అసంభవం. అప్పుడు ఇంద్రుడు దేవతలతో సమావేశమై కర్తవ్యాన్ని గురించి ఆలోచించాడు. ఇంతలో ఇంద్రుడికి మన్మథుడి రూపంలో సమస్యకు పరిష్కారం కనిపించింది. వెంటనే మన్మథుణ్ని తన సభకు రప్పించి, ముల్లోకాలను రక్షించటం కోసం శివుడి మనసులో వివాహేచ్ఛకు మూలమైన ప్రేమను అంకురింపజేయమని కోరాడు. మన్మథుడు లోకరక్షణార్థం ఆ పని చేయడానికి అంగీకరించి, తన బాణాలకు పదునుపెట్టాడు. నిత్యం శివుణ్ని ఆరాధించడానికి హిమవంతుడి కుమార్తె పార్వతి హిమాలయాలకు రావడం గమనించాడు. 

ఒకనాడు పార్వతి శివుడిని అర్చిస్తుండగా, శివుడి మనసులో కోరికలు రేపే విధంగా తన పూలబాణాలను ప్రయోగించబోయాడు. తపోధ్యానంలో ఉన్న శివుడి మనసులో వికారం కలిగింది. జితేంద్రియుడైన శివుడు వెంటనే అది గ్రహించి, కోపంతో తన నొసటిపైనున్న అగ్నినేత్రాన్ని తెరిచి, మన్మథుణ్ని చూశాడు. శివుడి ఆగ్రహం ప్రళయాగ్నిగా మారి క్షణంలో మన్మథుడిని భస్మం చేసింది. ఆ సంఘటనతో కలత చెందిన పార్వతి తన ఇంటికి వెళ్ళిపోయింది. శివుడూ తన తపస్సుకు భంగం కలిగించిన ఆ చోటును వదిలి మరోచోటుకు వెళ్ళిపోయాడు. ఇంద్రాది దేవతల ఆశ నెరవేరలేదు. ఆ తరవాత సప్తర్షులు పూనుకొని పరమేశ్వరుణ్ని ఆశ్రయించి, హిమవంతుణ్ని ప్రేరేపించి పార్వతీపరమేశ్వరుల వివాహం జరిపించారు. 

వివాహానంతరం నవదంపతులు ఏకాంతంలో అన్యోన్యానురాగంతో ఉండగా, అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి వస్తాడు. అది చూసిన శివుడు తన తేజస్సును అగ్నికి ఇస్తాడు. అగ్ని దాన్ని భరించలేక గంగానదిలో జారవిడుస్తాడు. అదే సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృత్తికాదేవతల గర్భంలోకి శివతేజస్సు చేరుతుంది. వారూ ఆ తేజస్సును భరించలేక తీరంలో ఉన్న రెల్లు పొదల్లో వదిలేస్తారు. కొంతకాలానికి ఆ పొదల్లోనే ఆరు ముఖాలతో బాలుడు జన్మిస్తాడు. అతడే షణ్ముఖుడైన కుమారస్వామి. 

రాక్షస సంహారం కోసమే ఆవిర్భవించిన కుమారస్వామి దేవకార్యాన్ని నెరవేర్చటానికి సన్నద్ధమయ్యాడు. తల్లి ఇచ్చిన 'శక్తి' ఆయుధాన్ని ధరించాడు. దేవతల సర్వసైన్యానికి నాయకుడిగా బాధ్యతలు స్వీకరించి, అమేయమైన పరాక్రమంతో తారకాసురుడితో పాటు అతడి సోదరులను కూడా సంహరించాడు. 

కావడి మొక్కులంటే ఇష్టం

పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి క తజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద 'బ్రహ్మదండం' అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.

సుబ్రహ్మణ్య వైభవం

సుబ్రహ్మణ్యుడు రూపంలో అందగాడు. శౌర్యంలో సాటిలేని వాడు. అందుకే దేవసేనాధిపతి అయ్యాడు. ఈయన వాహనం నెమలి. ఆయుధం శూలం. దీనిని విజయ శూలమనీ, జ్ఞాన శూలమనీ అంటారు. సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు అన్న పేరుంది. అంటే ఆరు ముఖాలు కలవాడని అర్థం. ఈ ఆరుముఖాలు జ్ఞానం, వైరాగ్యం, శక్తి, యశస్సు, ఐశ్వర్యం, దైవత్వానికి ప్రతిరూపాలు. వల్లీ, దేవసేన స్వామివారి ఉభయ దేవేరులు. 

కార్తికేయుడు మేధోమూర్తి. వేదాలు ఇతణ్ని యజ్ఞాగ్నిగా అభివర్ణించాయి. ఉపనిషత్తులు సనత్కుమారుడిగా కీర్తించాయి. శివుడికి ప్రణవనాదమైన 'ఓం'కార అర్థాన్ని వివరించిన చెప్పిన ఘనత కూడా సుబ్రహ్మణ్యుడికే దక్కుతుంది. ఈవిధంగా ఆదిదేవుడికే గురుదేవుడు అయ్యాడు కుమారస్వామి. శ్రీకష్ణుడు భగవద్గీతలో 'సేనాధిపతులలో స్కందుడిని నేను' అని ప్రకటించటం స్కందుడి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది.

వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇదీ సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలనువెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి. ఈవిధంగా అనంతం, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులకు సుబ్రహ్మణ్య ఉపాస కేంద్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఉపాసన ద్వారా మోక్షాన్ని అందుకున్న మహనీయులు ఎందరో ఉన్నారు. 

యోగస్వరూపుడు

'సార్ధ త్రి వలయకారిణీ సుప్త భుజంగాకార రూపా...' - మానవదేహంలో మూలాధార స్థానంలో కుండలినీ శక్తి మూడు చుట్లు చుట్టుకుని నిద్రిస్తున్న పాములా ఉంటుందని చెబుతారు. సాధకుడిలో ఆ శక్తి జాగృతమై సహస్రారం వరకు ప్రయాణిస్తుందని యోగశాస్త్రం చెబుతోంది. సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు. యోగ స్వరూపుడు. సాధనలో మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఆరుస్థానాలు క్రమంగా వికాసం పొందితే ఆ పైన ఉన్న సహస్రారంలో పరమచైతన్యం అనుభవానికి వస్తుంది. పరమాత్మ సుబ్రహ్మణ్యరూపంలో అవతరించే క్రమంలో ఆరుముఖాలతో దర్శనమిస్తాడు. ఇవి ఆరుచక్రాలకు సంకేతం. కుండలినీ శక్తి సర్పాకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఈ యోగానికి అధిపతి కుమారస్వామి. ఈ విషయాన్ని సంకేతరూపంలో చెప్పటమే సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో ఉంటాడని వర్ణించటానికి కారణం. 

షణ్ముఖుడు జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానమిచ్చేవాడు. జ్ఞానాన్ని సంస్కతంలో సుబ్రహ్మ అంటారు. అందువలన ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడని ప్రసిద్ధి చెందాడు. ఈయన జన్మరాశి వశ్చికం నుండి జన్మలగ్నమైన మేషం వరకు ఆరు రాశులు ఉన్నాయి. ఈ ఆరురాశులు మనశరీరంలోని షట్‌ చక్రాలు. వశ్చికరాశిని తోకగా పరిగణిస్తే మేషరాశి పాము శిరస్సు అవుతుంది. ఈ పద్ధతిలో స్వామి కుండలినీ ప్రభువు అయ్యాడు. ఇవన్నీ జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించిన విషయాలు. సర్పం వీటికి సంబంధించినది. అందువల్లనే సర్పాలను సదాశివుడు ధరించి పన్నగభూషణుడని ప్రసిద్ధి చెందాడు. ఈ పన్నాగాలు సుషుమ్నా నాడీరూపంలో ఉన్న షణ్ముఖుని విభూతి రూపాలు. ఆ కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరుని సర్పరూపంలో పూజిస్తారు.

ఆరక్షరాల దైవం

షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందు (నడుముభాగం) హస్తాన్ని ఉంచి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి సుబ్రహ్మణ్యుడు. పరిపూర్ణమైన జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణన్నవారిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజం పథ్వి, అగ్ని, జలం, షట్‌ కత్తికల శక్తిని (నక్షత్రశక్తి) ధరించి, చివరకు బ్రహ్మతపోనిర్మితమైన అలౌకిక మహాగ్ని శరవణంలో (అగ్నితో కూడిన రెల్లుతుప్పు)  బాలుడిగా రూపుదిద్దుకుంది. అందుకే స్వామి శరణభవుడు. శరవణభవ అనే పదంలో ఒక్కో అక్షరానికి ఒక్కో ప్రత్యేకమైన అర్థం ఉంది. శ - శమింపజేయువాడు, ర - రతిపుష్టిని ఇచ్చువాడు, వ - వంధ్యత్వం రూపుమాపువాడు, ణ - రణమున జయాన్నిచ్చేవాడు, భ - భవసాగరాన్ని దాటించేవాడు, వ - వందనీయుడు అని ఈ పదాలకు అర్థం. 

బీజాక్షర పరంగా చూస్తే, శ - లక్ష్మీబీజం. దీనికి అధిదేవత శంకరుడు. ర - అగ్నిబీజం. దీనికి అధిదేవత అగ్ని. వ - అమతబీజం. దీనికి అధిదేవత బలభద్రుడు. ణ - యక్షబీజం. దీనికి అధిదేవత బలభ్రద్రుడు. భ - అరుణ బీజం. దీనికి అధిదేవత భద్రకాళీదేవి. వ - అమతబీజం. దీనికి అధిదేవత చంద్రుడు. 

-----------------------------------------------------------------------

కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం

-----------------------------------------------------------------------














Saturday, December 5, 2020

ముక్కోటి ఏకాదశి విశేషాలు, నియమాలు, ఆచరించాల్సిన విధానాలు వివరిస్తూ ఆరాధన మాసపత్రిక డిసెంబరు 2020 సంచికలో రాసిన వ్యాసం

ముక్కోటి ఏకాదశి విశేషాలు, నియమాలు, ఆచరించాల్సిన విధానాలు వివరిస్తూ ఆరాధన మాసపత్రిక డిసెంబరు 2020 సంచికలో రాసిన వ్యాసం











ముక్తిదాయకం... ముక్కోటి ఏకాదశి
ప్రతి తిథీ ప్రత్యేకమే అయినప్పటికీ ఏకాదశికి మరింత ఎక్కువ ప్రత్యేకత కనిపిస్తుంది. ఏకాదశి అనే పేరు తలచుకోగానే ఓ పుణ్యభావన మన మనస్సుల్ని ఆవహిస్తుంది. ఏకాదశి రోజున పని ప్రారంభిస్తే విజయం తథ్యమనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆ రోజున చేసే అర్చనలకు శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందుతారని పురాణాలు, ఆచారాలు కూడా విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా ఏకాదశి రోజున సాధ్యమైనంత మేరలో విష్ణుమూర్తిని అర్చించి తరించాలని ప్రతి ఒక్కరూ తపిస్తుంటారు. ఇలా సంవత్సరానికి వచ్చే అన్ని ఏకాదశుల్లో మార్గశిర, పుష్యమాసాల్లో వచ్చే ముక్కోటి ఏకాదశి మరింత పుణ్యప్రదమైనదిగా ప్రసిద్ధి పొందింది.
ప్రతి నెలలో రెండు ఏకాదశులు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం ఉంటే మరో రెండు ఏకాదశులు అదనం. ప్రతి ఏకాదశికి నిర్దుష్టమైన నామధేయాలున్నాయి. ఆర్ష సంప్రదాయంలో ఏకాదశి తిథి పరమపవిత్రమైంది. శ్రావణ, కార్తిక, మార్గశిర మాసాల్లోని ఏకాదశులకు మరిన్ని ప్రత్యేకతలు  ఉన్నాయి. వీటిలో ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి విశేషమైనది. దీన్నే ముక్కోటి ఏకాదశి పర్వదినంగా జరుపుకోవటం ఆనవాయితీగా ఏర్పడింది. 

ఏకాదశి...విశేషాల రాశి

విష్ణువు 'మురుడు' అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి, సింహవతి అనే గుహలో సేదతీరుతున్నాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తిక శుక్ల ఏకాదశి వరకు ఆ గుహలోనే యోగనిద్రలో ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన మూరాసురుడు మాయోపాయంతో విష్ణువుపైకి దాడికి సిద్ధమయ్యాడు. అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయ శక్తి రూపంలో వెలువడింది. ఆ మహాశక్తి మురాసురుడ్ని సంహరించింది. విష్ణుమాయా విలాసం నుంచి ఉత్పన్నమైన ఆ శక్తి స్వరూపానికి శ్రీహరి వరాన్ని అనుగ్రహించాడు. విష్ణువుకు ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట ఆ శక్తి రూపం పూజలందుకుంటుందని పేర్కొన్నాడు. ఆనాటి నుంచి ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తున్నారని ఏకాదశి తిథి ఆవిర్భావ వత్తాంతాన్ని భవిష్యోత్తర పురాణం వివరించింది.

    సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, విష్ణువు అనుగ్రహం వల్ల సంతాన సిద్ధి పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యవంశ రాజైన రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక, తన రాజ్యంలో అందరిచేత నిర్వహింపజేసి, శ్రీహరికి ప్రియ భక్తుడయ్యాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వైఖానసుడు అనే రాజు పితృదేవతలకు ఉత్తమగతుల్ని అందించడానికి ముక్కోటి ఏకాదశి వ్రతం చేసినట్లు విష్ణుపురాణం వివరిస్తుంది.

ఓ సందర్భంలో బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలన్నీ కలిసి అసురశక్తులపై విజయాన్ని సాధించటానికి శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. వైకుంఠ ఉత్తరద్వారం నుంచి వైకుంఠంలోకి ముక్కోటి దేవతాసమూహం ప్రవేశించారు. శ్రీహరి దర్శనాన్ని పొంది విష్ణు కరుణకు పాత్రులయ్యారు. సమస్త దేవతలు వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ముక్కోటి ఏకాదశి. 

ఏకాదశి తిథికి 'హరివాసరం' అని పేరు. వైకుంఠ ఏకాదశిని హరి ఏకాదశి, మోక్ష ఏకాదశి, సౌఖ్య ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమన్నారాయణునికి సూర్యుడు కుడికన్ను కాగా చంద్రుడు ఎడమకన్నుగా ప్రకాశిస్తారు. నేత్రాలు వేరైనా దృష్టి ఒక్కటే. సూర్యచంద్రులు వేర్వేరుగా గోచరమవుతున్నా సమగ్రంలో కాంతి శక్తి ఒక్కటే. విరాట్‌ స్వరూపుడైన విష్ణువు ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతున్నా భగవత్‌ చైతన్యం, ఈశ్వర తత్త్వం ఒక్కటే. అసురశక్తుల బారిన పడకుండా ప్రతికూల శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కొని, సానుకూల శక్తుల్ని పెంపొందింప జేసుకోవడానికే ముక్కోటి దేవతలు విష్ణువును ఆశ్రయించారు. విష్ణుకృపను సాధించి మనోభీష్టాల్ని నెరవేర్చుకున్నారు. అందుకే ఈ ఏకాదశిని భగవదవలోక దినోత్సవం అని, మోక్షోత్సవమని కూడా పేర్కొంటారు. 

సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన తర్వాత మకరసంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి (జనవరి 14 నుండి జూలై 16 వరకు) ముందు ముక్కోటి దేవతలతో సమ్మిళితమై ఉన్న విష్ణువును ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా ఆలయాల్లో దర్శిస్తే సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం.

ఏకాదశి నియమావళి

ముక్కోటి ఏకాదశి పర్వదినం వైష్ణవ ఆగమ శాస్త్రప్రకారం ఎంతో విశేషమైనది. తిరుమల శ్రీవారి సన్నిధితో పాటు ప్రముఖ వైష్ణవక్షేత్రాలైన శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం, గురువాయురు, భద్రాచల దివ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనం కోసం ఉత్సవమూర్తుల్ని సర్వాలంకార యుక్తంగా ఉత్తరద్వారంలో కొలువుదీరుస్తారు. ముక్కోటి పర్వదిన సందర్భంగా ప్రతి వైష్ణవ సన్నిధానం వైకుంఠమై విలసిల్లుతుంది. వేద, వేదాంగ, పద, క్రమ, ఉపనిషత్తుల్ని గానం చేస్తారు. షోడశోపచారాలతో స్వామికి కైంకర్యాలు కొనసాగుతాయి. అలంకార ప్రియుడైన విష్ణుభగవానుడి అవతార స్వరూపాలైన శ్రీరామ, శ్రీకష్ణ, శ్రీవేంకటేశ్వర నసింహ ఆలయాలన్నీ నేత్రానందకరంగా భాసిల్లుతాయి. దశమి నాడు ఏక భుక్తం, ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు అన్నదానం అనేది సంప్రదాయరీత్యా పాటించాల్సిన నియమాలు. 

బ్రహ్మాది దేవతలు స్తుతులు చేస్తుండగా, మంగళధ్వనులు మారుమ్రోగుతుండగా, వేద పండితులు సస్వరంగా మంత్రాలు పఠిస్తుండగా పాలకడలిలో శేషతల్పంపై పవళించిన శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మి సేవ చేస్తూ ఉంటుంది. విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన పద్మంలో బ్రహ్మ కొలువై ఉండగా స్వామి అనంత పద్మనాభుడిగా తేజరిల్లుతాడు. ఈ వైకుంఠ దివ్య దర్శనాన్ని ప్రతి భక్తుడు సదా తమ హృదయ పీఠంపై నిలుపుకోవాలి, విష్ణుకృపకు పాత్రులు కావాలి. చీకటి నుంచి వెలుగువైపునకు నిత్య చైతన్యంతో పయనించాలి. 

వైష్ణవక్షేత్రాల్లో సందడి

ముక్కోటి రోజున వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఆ రోజున ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజామునుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తరద్వార దర్శనం వేచి ఉంటారు. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందు వల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూట విషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఈ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగుసార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది. ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లు ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరిరోజున, వైకుంఠ ఏకాదశి మరునాటి తిథి ద్వాదశి ఉన్న రోజు, రథసప్తమి రోజు స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈ రోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.

మనసే విష్ణు నివాసం

విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించాలి. అంటే, ఉపవాసం ద్వారా ఏకాదశ ఇంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్ళు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్ళు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు. ముక్కోటి ఏకాదశి అందించే సందేశం ఇది.

--------------------
రచనః డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ -3, సెల్‌: 90320 44115 / 8897 547 548


Wednesday, November 18, 2020

రుద్రాభిషేకం గురించిన విశేషాలతో డాక్టర్ ‌కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) రాసిన వ్యాసం

 



రుద్రాభిషేకం గురించిన విశేషాలతో 

డాక్టర్ ‌కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) 

రాసిన వ్యాసం 

రుద్రాభిషేక వైభవం

      శివునికి అభిషేకం చేయటానికి సర్వసాధారణంగా వినియోగించే మంత్రాలు నమక, చమకాలు. శ్రీకృష్ణ యజుర్వేదంలో అంతర్భాగంగా ఉండే నమక, చమకాలను కలిపి సాధారణ పరిభాషలో 'రుద్రాధ్యాయం' అనీ, 'రుద్రం' అనీ వ్యవహరిస్తుంటారు. ఈ మంత్రాలతో శివునికి చేసే అభిషేకం అనంతమైన పుణ్యఫలితాన్ని అందిస్తుంది.

 యం యం కామయతే మర్త్యో లింగార్చన పరాయణః |

తం తమాప్నోతి విప్రేంద్ర మత్ప్రసాదాన్నసంశయః ||

   లింగార్చన చేసే భక్తుడు తన మనసులో ఏయే కోరికలు తీరాలని భావిస్తున్నాడో, అవన్నీ నా అనుగ్రహం వల్ల తప్పక నెరవేరుతాయని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినట్లు శైవాగమాలు ప్రకటిస్తున్నాయి.

    లింగార్చన లేదా రుద్రాభిషేకం వల్ల కలిగే ఫలితం అనంతం అనీ, ఎప్పటికీ నశించదనీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. యజ్ఞ, యాగ, దాన, తపస్సుల వల్ల కలిగే ఫలితం కేవలం రుద్రాభిషేకం వల్ల కలుగుతుంది. అయితే, కోరికను అనుసరించి, కొన్ని ఆచారవిధానాలను శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. వీటితోపాటు రుద్రాభిషేకం ఏయే సమయాల్లో చేయాలి? ఎలా చేయాలి? ఎటువంటి లింగాన్ని అర్చించాలి? ఇందుకు అనుసరించాల్సిన విధానాలేమిటి? మొదలైన విషయాలను కూడా ఆగమాలు విస్పష్టంగా పేర్కొంటున్నాయి.

 శివాభిషేక నియమాలు

      రుద్రాభిషేకాన్ని తప్పనిసరిగా శైవాగమాన్ని అనుసరించే చేయాలని సాక్షాత్తు ఆదిశంకరులు చెప్పారు. 'సిద్ధాంత సారావళి' కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తుంది.

 అష్టాదశాసు విద్యాసు మీమాంసాపి గరీయసి

తతోపి తర్కశాస్త్రాణి పురాణం తేభ్య ఏవ చ

తతోపి ధర్మశాస్త్రాణి తేభ్యో గుర్వీశ్రుతిర్ద్విజా

తతోప్యుషనిషచ్ఛ్రేష్ఠస్తత శ్శైవాగమోధికః ||

           అష్టాదశ విద్యల్లో మీమాంస, మీమాంస కంటే తర్కం, తర్కం కంటే పురాణాలు, పురాణాల కంటే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రాల కంటే వేదాలు, వేదాల కంటే ఉపనిషత్తులూ, ఉపనిషత్తుల కంటే శైవాగమాలు గొప్పవి. వీటినే వేదాగమాలని కూడా అంటారు. ఈశ్వరప్రోక్తం కావటం వల్ల కారణాగమం, కామికాగమం వంటి శైవాగమాలు చాలా గొప్పవి. కాబట్టి, శైవాగమాలు చెప్పిన పద్ధతుల్లో రుద్రాభిషేకం చేయాలి.

     ·   తడివస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. భుజం మీద కూడా తడివ్రస్తం ధరించకూడదు.

· అభిషేక సమయంలో పూర్తిగా మౌనాన్ని పాటించి, చిత్తాన్ని పరమేశ్వరుని మీదనే లగ్నం చేయాలి.

·   కాళ్ళు చాపుకుని కూర్చొనటం, ఇతరులతో సంభాషించటం, స్త్రీలతో సరస సంభాషణ, తర్కించటం, అసత్య సంభాషణ పనికిరాదు.

·      పరనింద, పరస్తుతి చేయకూడదు.

·     గట్టిగా మాట్లాడకూడదు. విచారవదనంతో ఉండకూడదు.

· అభిషేక సమయంలో యజమాని దీర్ఘరోగుల్ని, కుక్కల వంటి జంతువులను చూడకూడదు. స్పృశించకూడదు. ప్రమాదవశాత్తు చూసినట్లయితే 108 సార్లు ఓంకారాన్ని జపించి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.

·   భస్మధారణ చేయకుండా అభిషేకం చేయకూడదు.

·  అభిషేకానికి ముహూర్త నిర్ణయం అవసరం లేదు. వర్జ్యదోషాలు ఉండవు.

· శివలింగ పీఠం మీద పూజాద్రవ్యాలు, గంధపాత్రలు, బెల్లం ముక్క, కొబ్బరిచెక్క మొదలైన పదార్థాలు ఉంచకూడదు.

· అభిషేక సమయంలో తుమ్మటం, దగ్గటం, ఉమ్మివేయటం, అసత్యం పలకటం చేయకూడదు. నియమభంగం జరిగితే  యజయాని ఆచమనం చేసి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.

·   సంకల్పం చేయటానికి ముందు, అభిషేక సమయంలో, ఆ ధూప, దీప, నీరాజన సమయాల్లో తప్పనిసరిగా గంట మోగించాలి. ఘంటానాదం చేయకుండా చేసే అభిషేకరం ఫలితాన్ని ఇవ్వదు.

 రుద్రాభిషేక విధి

          రుద్రాభిషేకం చేయటానికి మొత్తం ఎనిమిది విధానాలు, వాటివల్ల కలిగే ఫలితాలు 'రుద్రకల్పం'లోని విష్ణ్వీశ్వర సంవాద విభాగంలో వర్ణితమై ఉన్నాయి. అవేమిటంటే... 

1. వారం : నమకంలో మొత్తం 11 అనువాకాలు ఉంటాయి. ఒకసారి నమకంలోని 11 అనువాకాలు చెప్పి, చమకంలో ఒక అనువాకం (చమకంలో కూడా 11 అనువాకాలు ఉంటాయి) చొప్పున వరుసగా చెప్పాలి. ఈవిధంగా 11 సార్లు నమకం చెబితే, చమకంలోని 11 అనువాకాలు చెప్పటం పూర్తవుతుంది. ఇలా చేసిన అభిషేకానికి 'వారం' అని పేరు.

 2. ఆవృత్తి : నమకం 121 సార్లు, చమకం 11 సార్లు. పృథివీ రూపధారి అయిన రుద్రప్రీతి కలుగుతుంది. సర్వపాపాలు తొలగుతాయి. జలరూపధారి అయిన శివప్రీతి కలుగుతుంది. ఫలితంగా సకల సుఖాలు లభిస్తాయి.

 3. రుద్రం : నమకం 1,331 సార్లు, చమకం 121 సార్లు. తేజోరూపధారి అయిన శంకరుని ప్రీతి కలుగుతుంది. ఫలితంగా సర్వ సంపదలు కలుగుతాయి. 

4. ఏకాదశ రుద్రం : నమకం 14,641 సార్లు, చమకం 1,331 సార్లు. వాయురూపధారి అయిన పరమేశ్వరునికి ప్రీతి కలిగి, తద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది.

 5. శతరుద్రం : నమకం 1,61,051 సార్లు, చమకం 14,641 సార్లు. ఆకాశరూపధారి అయిన మహేశ్వరునికి ప్రీతి కలుగుతుంది. ఫలితంగా పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. 

6. లఘురుద్రం : నమకం 17,71,561 సార్లు, చమకం 1,61,051 సార్లు. సూర్యరూపధారి అయిన ఈశ్వరప్రీతి కలుగుతుంది. పునర్జన్మ నివృత్తి అవుతుంది. 

7. మహారుద్రం : నమకం 194,87,171 సార్లు, చమకం 17,71,561 సార్లు. చంద్రరూపధారి అయిన రుద్రునికి ప్రీతి కలుగుతుంది. జ్ఞానవృద్ధి కలుగుతుంది.

 8. అతిరుద్రం : నమకం 21,43,58,881 సార్లు, చమకం 194,87,171 సార్లు. సర్వరూపి అయిన పరమేశ్వరునికి ప్రీతి కలుగుతుంది. ఫలితంగా చెప్పటానికి అలవికాని మహాఫలితాన్ని యజమాని పరమేశ్వర వరప్రసాదంగా అందుకుంటాడు.

  శ్రావణ, కార్తిక మాసాల్లో, విశేషంగా మాఘమాసంలో ఏదైనా పవిత్ర పుణ్యక్షేత్రంలో, నదీతీరంలోగాని, పర్వత ఉపరిభాగంలో కానీ, పశ్చిమాభిముఖ ద్వారం ఉన్న శివాలయంలోని గానీ యజమాని 11 మంది బ్రాహ్మణులను ఏర్పాటుచేసుకుని రుద్రాభిషేకం చేస్తే తప్పకుండా ముక్తి కలుగుతుంది.  యజమాని తన అభీష్టాన్ని, శక్తిని అనుసరించి వీటిల్లో ఏదో ఒక విధానాన్ని ఎంచుకుని, రుద్రాభిషేకం చేయాలి.

 శివాభిషేక ఫలితాలు

      ·  భస్మాన్ని ధరించి, భస్మశయ్యపై పడుకుని, నిశ్చలబుద్ధితో రుద్రాన్ని పారాయణ చేస్తే పంచమహాపాతకాలు కూడా పటాపంచలు అవుతాయని పరాశరస్మృతి చెబుతోంది.

· సురాపానం, బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా రుద్రాభిషేకం వల్ల తొలగటంతో పాటు సంసారబంధాల నుంచి విముక్తి కలుగుతుంది.

· రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయటం వల్ల రహస్యంగా చేసిన పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

· ఎటువంటి మమకారం లేకుండా, ఫలాపేక్ష రహితంగా రుద్రాధ్యాయాన్ని పారాయణ చేస్తే సశరీరంగా కైలాసగమన సిద్ధి కలుగుతుందని వాయుపురాణం చెబుతోంది.

·   దుస్స్వప్నం వల్ల కలిగే దోషం, గ్రహదోషాల నివారణకు రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయాలని లింగపురాణంలో ఉంది.

·   రుద్రాభిషేకంతో పాటు రుద్రపారాయణ చేయటం వల్ల సంతానహీనులకు సత్సంతానం కలుగుతుందని ఆపస్తంబ సూత్రం చెబుతోంది.

· శ్రేష్ఠమైన మృత్తిక (మట్టి), కస్తూరి రెండిటి మిశ్రమంతో నిర్మించిన లింగాన్ని అభిషేకించి, పూజించినట్లయితే సంపదలు కలుగుతాయి.

·  మృత్తికతో శ్రీగంధం కలిపి తయారుచేసిన లింగాన్ని సశాస్త్రీయంగా 20 రోజులు పూజించి, అభిషేకం చేస్తే తాపజ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది.

· కస్తూరీ మిశ్రమంతో తయారుచేసిన మృణ్మయలింగాన్ని పదిరోజుల పాటు భక్తియుక్తంగా పూజించి, అభిషేకాదులు నిర్వహిస్తే ఆత్మదోష జనితమైన సర్వరోగాలు నశిస్తాయి.

·   చక్కెర కలిపి తయారుచేసిన మృణ్మయ లింగాన్ని మూడు నెలలపాటు సశాస్త్రీయంగా పూజిస్తే, సభల్లో నేర్పుగా మాట్లాడే శక్తి, కవిత్వసిద్ధి కలుగుతాయి.

·  మృత్తికలో బియ్యపుపిండి కలిపి తయారుచేసిన లింగాన్ని మూడు నెలల పాటు శాస్త్రవిధిగా అర్చించి, అభిషేకం చేస్తే పుత్రసంతానం కలుగుతుంది.

·   మృత్తికలో పసుపు కలిగి, 108 రోజుల పాటు శాస్త్రవిధిగా అభిషేకం చేస్తే సర్వజనాకర్షకమైన రూపం, ఐశ్వర్యం కలుగుతాయి.

·  మృత్తికలో ఆవునెయ్యి కలిపి, లింగాన్ని తయారుచేసి, 50 రోజుల పాటు అభిషేకం చేస్తే పైత్యరోగం నివారణ అవుతుంది.

· ఎర్రని గంధం కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి 32 రోజులు అభిషేకం చేస్తే దగ్గు, దమ్ము రోగాలు నివారణ అవుతాయి.

· ఇనుపచూర్ణం, మృత్తిక కలిపి లింగాన్ని తయారుచేసి, 22 రాత్రులు శాస్త్రవిధిగా అభిషేకార్చన చేస్తే, శత్రునాశనం కలుగుతుంది.

· నువ్వులు కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి ఏడురోజుల పాటు నిర్మలభక్తితో అభిషేకం చేస్తే యమబాధలు నశిస్తాయి.

·  నిత్యం రుద్రాభిషేకం చేయటం వల్ల భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షస బాధలు నశిస్తాయి.

గృహేత్వేక గుణం ప్రోక్తం నదీతీరే సహస్రకం |

దేవతాయతనేలక్షం శతలక్షం హరేర్గృహే |

శివాలయే కోటి గుణం శివే స్వాయంభువే పునః |

అనంతం పూజనం శంభోః ఋతం వచ్మిద్విజోత్తమ ||

          రుద్రాభిషేకం చేసే స్థలాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఇంట్లో చేసే లింగార్చన వల్ల ఒకభాగం ఫలితం కలుగుతుంది. నదీతీరంలో చేస్తే అందుకు వేయి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. దేవతానివాసాల్లో చేసే అభిషేకానికి లక్ష రెట్లు ఎక్కువ ఫలితం, విష్ణ్వాలయంలో చేసే అభిషేకానికి నూరు లక్షల రెట్లు ఎక్కువ ఫలితం, శివాలయాల్లో చేసే అభిషేకానికి కోటిరెట్లు, పర్వతగుహల్లో చేసే అభిషేకానికి పదికోట్ల రెట్లు, ఆ గుహ ఋష్యాశ్రమం కూడా అయితే కోటికోట్ల రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. బ్రహ్మక్షేత్రంలో (కాశీక్షేత్రం) శివాభిషేకం చేస్తే అమితమైన ఫలితం లభిస్తుందని ఆగమాలు ప్రకటిస్తున్నాయి.

 -----------------------------

రచన

డాక్టర్ ‌కప్పగంతు రామకృష్ణ, 

ఆంధ్రోపన్యాసకులు,  

ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ-3 

సెల్‌ : 90320 44115 / 88975 47548

 


Sunday, November 15, 2020

శివుడికి ఏ పూలతో పూజలు చెయ్యాలి? శివుడికి ఏ పూలు ఇష్టం?



శివుడికి ఏయే పూలతో పూజలు చెయ్యాలి? 

శివుడికి ఇష్టమైన పువ్వులేవి?

 శివపూజకు చిగురించిన...

శివా! అని ఆర్తిగా పిలిస్తే చాలు... కైలాసం దిగి వచ్చే కారుణ్యమూర్తి, హరోం హర! అంటూ కడివెడు గంగమ్మను శిరస్సున అభిషేకం చేస్తే చాలు... కోరిన వరాలనిచ్చే అభయప్రదాత, ఎంగిలి మాంసాన్ని నివేదన చేసినా పరమప్రీతితో స్వీకరించి తిన్నడికి కైవల్యాన్నిచ్చిన బోళాశంకరుడు... పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే...

శివుని శిరమున కాసిన్ని నీళ్ళుజల్లి

పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు

కామధేను వతడింట గాడిపసర

మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు

అంటూ ఎంతోమంది కవులు కాలకంఠుని వేనోళ్ళా కొనియాడారు. నిర్హేతుకమైన కృపను వర్షించటంలో పరమేశ్వరుడికి సాటి రాగల దైవం పురాణేతిహాసాల్లో మరెవ్వరూ కనిపించరు. ఇంతటి దయామయుడైన శివునికి అభిషేకంతో పాటు ఎలాంటి పుష్పాలతో పూజచేయాలి? ఏయే పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనే ప్రశ్నలకు శాస్త్రగ్రంథాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి. శివధర్మ సంగ్రహం, లింగపురాణం, కార్తికమాహాత్మ్యం, శివరహస్య ఖండం తదితర గ్రంథాలు కూడా అనేక పుష్పార్చన ఫలితాలు, పుష్పార్చన చెయ్యటానికి పాటించవలసిన నియమాలు చెబుతున్నాయి. ఆ విశేషాలేమిటంటే...

శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు,  ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచ్చగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. 

వాడిపోయిన పూలు, కీటకాల వల్ల పాడైన పూలు, ఇతరుల తోట నుంచి దొంగతనంగా తీసుకువచ్చిన పూలు శివార్చనకు అనర్హమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ రకం పుష్పాలతో అర్చించినప్పటికీ, శివునికి చేసే పుష్పార్చన వల్ల అశ్వమేథ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. కనీసం ఎనిమిది రకాలు పుష్పాలతో శివార్చన చేసిన భక్తుడికి కైలాసవాసం ప్రాప్తిస్తుంది.

ఏయే మాసాల్లో... ఏయే పుష్పాలు

👉👉 చైత్రమాసంలో నృత్యగీతాలతో సేవిస్తూ, దర్భపూలతో పూజిస్తే సువర్ణలాభం కలుగుతుంది.

👉👉 వైశాఖమాసంలో నేతితో అభిషేకిస్తూ, తెల్లమందార పూలతో పూజ చేస్తే, అశ్వమేథయాగం చేసిన ఫలితం కలుగుతుంది.

👉👉 జ్యేష్ఠమాసంలో పెరుగుతో అభిషేకం చేసి, తామరపూలతో పూజచేస్తే పరమపదసోపానాన్ని చేరుకుంటారు.

👉👉 ఆషాఢ కృష్ణ చతుర్దశి రోజున గుగ్గిలంతో ధూపం వేసి, తొడిమలు కలిగిన పూలతో అర్చన చేస్తే బ్రహ్మలోక నివాస యోగ్యత కలుగుతుంది.

👉👉 శ్రావణమాసంలో ఒంటిపూట భోజనం చేసి, గన్నేరు పూలతో నియమాల ప్రకారం అర్చన చేసినవారికి వెయ్యి గోదానాలు చేసిన ఫలితం లభిస్తుంది.

👉👉 భాద్రపదమాసంలో ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు.

👉👉 ఆశ్వయుజమాసంలో జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుకుంటారు.

👉👉 కార్తికమాసంలో ఆవుపాలతో అభిషేకించి, జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు.

👉👉 మార్గశిరమాసంలో పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలిగిన సామర్థ్యాన్ని పొందుతారు. 

👉👉 పుష్యమాసంలో ఉమ్మెత్తపూలతో పూజించినవారు పరమపదాన్ని పొందగలరు. 

👉👉 మాఘమాసంలో బిల్వదళాలతో అర్చించినవారు సూర్యచంద్రులున్న విమానంలో పరమపదాన్ని చేరుకునే యోగ్యత పొందుతారు.

👉👉 ఫాల్గుణమాసంలో సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.

ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితం

శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు. శివపూజకు సంబంధించినంత వరకు 

👉👉 వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.

👉👉  వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.

👉👉 వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.

👉👉 వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.

👉👉 వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మెత్తుపువ్వు ఉత్తమం.

👉👉 వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.

👉👉 వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.

👉👉 వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.

👉👉 వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.

👉👉 వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.

👉👉 వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం. 

శివునికి 1000 కలువలతో కట్టిన మాలను సమర్పించినవారు కొన్ని వందల సంవత్సరాల పాటు కైలాసంలో నివసించే అపూర్వమైన వరాన్ని పొందుతారు. ఇతర పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.

పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి కలుగుతుంది. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది. పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయినవైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్ర మాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.

శివునికి బిల్వ (మారేడు) పత్రాలంటే మహాఇష్టం.ఇది అందరికీ తెలిసిన విషయమే. వీటితో పాటు మరికొన్ని పత్రాలు కూడా పరమేశ్వర పూజకు తగినవి. ఆయనకు ఎంతో ప్రీతికరమైనవి. అవేమిటంటే... జమ్మి, గుంట గలగర, అశోక, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచి, నల్ల ఉమ్మెత్త, తామర, నీతికలువ, మెట్టకలువ, సంపెంగ, తుమ్మి, ఉత్తరేణి పత్రాలు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.

ఏ కోరికకు ఏయే పూలు

మన కోరికలను అనుసరించి పరమేశ్వరుని సంకల్పం చెప్పుకుని పూజ చేస్తే, ఆ కోరికలు వెంటనే సిద్ధిస్తాయని శాస్త్ర ప్రమాణం. అయితే, సద్గురువును ఆశ్రయించి, విధివిధానంగా, సమంత్రకంగా మాత్రమే ఈ విధానంలో అర్చనలు చేయాలి. 

ధన లాభం కోసం - గన్నేరు పూలు

మోక్ష ప్రాప్తికి - ఉమ్మెత్త పూలు

సుఖశాంతుల కోసం - నల్ల కలువ పూలు

చక్రవర్తిత్వం కోసం - తెల్ల తామర పూలు

రాజ్యప్రాప్తి కోసం - ఎర్ర తామర పూలు, నాగకేసర పుష్పాలు

మంత్రసిద్ధి కోసం - గన్నేరు, అశోక, తెల్లజిల్లేడు పూలు

కోరుకున్న కన్యతో వివాహం  - సన్నజాజి పూలు

సంతానప్రాప్తి కోసం - మొల్ల పూలు

ఆరోగ్యం కోసం - దర్భ పూలు

వశీకరణం కోసం - తుమ్మి పూలు

శత్రువిజయం కోసం - కడిమి పూలు

దారిద్య్ర వినాశనం కోసం - బిల్వ దళాలు

సుఖం కోసం - మరువక పత్రాలు

గోసంపద వృద్ధి కోసం - లొద్దుగ పూలు

ఆయుష్సు కోసం - మోదుగ, బూరుగ పూలు

పరమాద్భుతం... శివలింగపుష్పం

పరమేశ్వరుడి లీలావిలాసమైన అనంత సృష్టిలో మరొక విచిత్రం... పూర్తిగా శివలింగాన్ని పోలి ఉండే పుష్పం. దీన్నే నాగలింగ పుష్పం అని కూడా అంటారు. కొన్నిచోట్ల నాగమల్లి పుష్పాలని, మల్లికార్జున పుష్పాలని కూడా పిలుస్తారు. శివుని జటాజూట ఆకృతిలో, వెంట్రుకలు విప్పారి ఉన్నట్లు  ఈ వృక్షం ఉంటుంది. శివలింగ పుష్పాలు ఇతర పుష్పాలకు భిన్నంగా కొమ్మలకు పూయకుండా వెంట్రుకలాంటి జడలకు పూస్తాయి. పుష్పం పైభాగంలో నాగుపాము పడగవిప్పి ఆచ్ఛాదనగా ఉన్నట్లు చక్కటి ఆకృతి ఉంటుంది. ఆ పడగ లోపల పుష్పం ఉంటుంది. ఈ పూలతో శివునికి పూజచేస్తే జన్మరాహిత్యం కలుగుతుంది. శివునితో పాటు ఇతర దేవతలకు కూడా ఈ పుష్పాలను అర్పించవచ్చు. అయితే శిరసు నుంచి భుజాల వరకు మాత్రమే పడేట్లు (ఉండేట్లు) ఈ పుష్పాలతో అర్చన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోను పాదాల మీద శివలింగ పుష్పాలను ఉంచకూడదు. పార్వతీదేవికి మంగళసూత్రంలో ఈ పుష్పాన్ని అలంకరించాలి. 

అష్టపుష్ప మానస పూజ

శివపురాణంలోని వాయవ్యఖండంలో అష్టపుష్ప మానసపూజ గురించి చక్కగా వర్ణితమై ఉంది. 

అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహః

సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః

శాంతి పుష్పం తపః పుష్పం ధ్యానపుష్పం తథైవచ

సత్యమష్టవిధం పుష్పం శివప్రీతికరం భవేత్‌ ||

అహింస, ఇంద్రియనిగ్రహం పాటించటం, అన్ని ప్రాణుల యందు దయ కలిగిఉండటం, క్షమాగుణాన్ని కలిగిఉండటం, శాంతి కాముకులై ఉండటం, తపస్సు చేయటం, నిరంతరం ధ్యానం చేయటం, సత్య వాక్పాలన గుణాన్ని కలిగిఉండటం - ఈ ఎనిమిది మనస్సుకు సంబంధించిన పుష్పాలు. ఇతర పుష్పాల మాదిరిగా ఇవి కంటికి కనిపించవు. ఇవి మనోపుష్పాలు. అంటే, ఈ ఎనిమిది గుణాలను కలిగి ఉండి (లేదా నిత్యం వీటిని ఆచరిస్తూ, కలలో కూడా వీటి నిర్వహణను మరచిపోకుండా ఉండాలి) పరమేశ్వరుని అర్చించినట్లయితే కలిగే ఫలితాన్ని మాటల్లో వర్ణించటం ఎవరికీ సాధ్యం కాదని మహర్షులు చెప్పారు.

ఇంతటి మహోన్నతమైన ఫలితాలను కలిగించే పరమేశ్వరారాధనతో మన జీవితాలను సార్థకం చేసుకుందాం. ఇందుకు పరమేశ్వరుడు అందరినీ అనుగ్రహించుగాక. 

------------🔔🔔🔔🔔🔔🔔---------

రచన

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు,  

ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ-3

సెల్‌ : 90320 44115 / 88975 47548

Friday, November 13, 2020

భగినీ హస్తభోజనం గురించి శ్రీ కనకదుర్గప్రభ పత్రికలో రాసిన వ్యాసం

అనుబంధాలకు శ్రీకారం

    కార్తికమాసం అనగానే చన్నీటి స్నానాలు, శివాలయాల్లో అభిషేకాలు, ఉపవాసాలు కనిపిస్తాయి. ఏ నోట విన్నా, ఏ గుండె సవ్వడి విన్నా పంచాక్షరీ మంత్రమే వినిపిస్తుంది. భక్తుల హృదయాల్లో కార్తికమాసం అంతగా పెనవేసుకుపోయింది. అందుకే కార్తికమాసాన్ని మించిన మాసం మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. 


ఇంతగా ఆధ్యాత్మికత నిండిన కార్తికమాసంలో అనుబంధాలను కూడా పరిపుష్టం చేసేందుకు మన శాస్త్రాలు కొన్ని నియమాలను విధించాయి. ఒకే కడుపున పుట్టిన బిడ్డల మధ్య ఉండే సహజ జన్మబంధాన్ని జన్మజన్మల బంధంగా తీర్చిదిద్దేందుకు పునాదిగా అవసరమైన హృదయబంధాల్ని కూడా ఈ మాసం బలపరుస్తుంది. ఈ క్రమంలో ఏర్పడిన ఆచారమే 'భగినీ హస్త భోజనం'. 


కార్తిక మాసం శుక్ల విదియ రోజున భగినీ హస్త భోజనం చెయ్యాలని నియమం. భగిని' అంటే చెల్లెలైనా కావచ్చు. అక్క అయినా కావచ్చు. 'హస్తభోజనం' అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే... సోదరి చేతివంట సోదరుడు తినడం అన్నమాట. సాధారణంగా వివాహమైన చెల్లెలు లేదా అక్క ఇంటిలో తల్లిదండ్రులుగానీ, అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి అంతగా ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్ల ఋణం ఉంచుకోవడం పుట్టింటివారికి ఇష్టం ఉండదు. శుభసందర్భాలలో, శుభకార్యాలలో భాగంగా ఆడపిల్ల ఇంటికి వచ్చి భుజించినా తప్పులేదు కానీ., ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మనవాళ్ళు భావిస్తారు. కానీ, కార్తిక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఓ పురాణగాథ వ్యాప్తిలో ఉంది. 


సూర్యభగవానుడికి సంధ్యాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. 'యమునకు' అన్నయ్య 'యముడు' అంటే ఎంతో ఇష్టం. యముడికి కూడా అంతే. యముడు తన చెల్లెల్ని ప్రేమగా 'యమీ' అని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్ళింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునకు మాట ఇచ్చాడు. అ రోజు అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు పనివత్తిడి వల్ల రాలేకపోతున్నానని, 'కార్తిక శుద్ధ విదియ' నాడు తప్పకుండా విందుకు వస్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు. కొద్దిగా బాధ అనిపించినప్పటికీ అన్నయ్య తనను గుర్తుపెట్టుకున్నందుకు సంతోషించింది యమున. 


కార్తిక శుద్ధ విదియ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది.అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తాను వండిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలు అనురాగానికి ముగ్థుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో' అని అడిగాడు. 'ఏటా ఇదే రోజు... అంటే కార్తిక శుద్ధ విదియ నాడు తన ఇంటికి విందుకు రావాలనీ, అలాగే ప్రతి సోదరుడు ఈ రోజున తన సోదరి చేతి వంటతో భోజనం చెయ్యాలనీ' వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని  అనుగ్రహించాడు. దీంతోపాటుగా ఎవరైతే కార్తిక శుద్ధ విదియ రోజున సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వారికి నరలోక ప్రాప్తి కాని, అపమత్యు భయం కానీ ఉండదని కూడా వరం ప్రసాదించాడు. నాటి నుంచి కార్తిక శుద్ధ విదియ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్ర ంనియమం విధించింది. క్రమంగా ఇదే 'భగినీ హస్త భోజనం' పేరుతో ఆచారంగా స్థిరపడింది.


ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలతో పాటు ఈ ఆచారం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఈ పండుగను 'భయ్యా-దుజ్‌' అని పిలుస్తారు. నేపాల్‌ ప్రాంతంలో ఈ పండుగను 'భాయి-టికా' అని పిలుస్తారు. పంజాబ్‌ ప్రాతంలో ఈ పండుగను 'టిక్కా' అని పిలుస్తారు. 
భగినీ హస్త భోజనం తర్వాతి రోజున... అంటే కార్తిక శుద్ధ తదియ రోజున అన్న తన ఇంటికి చెల్లెలిని భోజనానికి పిలవాలి. దీనిని 'సోదరి తృతీయ' అంటారు. ఈ రోజున త్రిలోచన గౌరీవ్రతం ఆచరించాలి. చెల్లెలి కుటుంబ సభ్యులకు చక్కని భోజనం పెట్టి, సోదరికి నూతన వస్త్రద్వయం, పసుపు కుంకుమలు, సుమంగళ ద్రవ్యాలు పెట్టాలి. అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. వైష్ణవ కృచ్ఛ / విష్ణుగౌరీ వ్రతం చేయాలని మరికొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. వీటన్నిటికన్నా విశేషం... ఈ రోజున సోదరుడు సోదరిని ఆదరిస్తాడు. అంటే విదియ రోజున సోదరి ఇంటికి వెళ్ళిన సోదరుడు ఆమెను తన ఇంటికి కుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానించాలి. తదియ రోజు సోదరి సోదరుని ఇంటికి సకుటుంబంగా వెళ్తుంది. ఆమెకు భోజనం పెట్టి, సుమంగళ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు ఇచ్చి సోదరుడు సత్కరిస్తాడు. 


ఇదీ భారతీయ ఆచారాల సమున్నత సామాజిక కోణానికి నిదర్శనం. భారతీయ ఆచారాలు మూఢ నమ్మకాలు కావు... అత్యున్నత వైజ్ఞానిక, సామాజిక దార్శనికతతో నేటి వైజ్ఞానికులకు కాలం కొలత తెలియని నాడే ద్రష్టలైన మన భారతీయ ఋషులు సమాజ నడవడిక ఉన్నతంగా ఉండేందుకు ఏర్పరచిన ఉత్తమ విధానాలని ఈ రెండు రోజుల ఆచారం నిరూపిస్తుంది. కార్తిక విదియ, తదియ రెండు రోజుల్లో పైన చెప్పుకున్న విధానాలు పాటిస్తే కుటుంబసభ్యుల మధ్య కలహాలు రూపుమాసిపోతాయి. అనురాగం, ఆప్యాయత పరిఢవిల్లుతాయి. ఇప్పటికీ ఉత్తరాదిన ఈ ఆచారం కొద్దిగా వ్యాప్తిలో ఉండగా దక్షిణాదిలో దాదాపుగా క్షీణదశకు చేరుకుంది. పెద్దలు ఈ రెండు రోజుల ఆచారాన్ని పునరుద్ధరిస్తే అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డలు ఆజన్మాంతం కలసి ఉండాలనే ముచ్చట కూడా తీరుతుంది. అనుబంధాల పునాదుల మీద  సమాజమనే కుటుంబం కలకాలం ఆనందోత్సాహాలతో జీవిస్తుంది.

----------------------

భగినీ హస్త భోజనం గురించి శ్రీ కనకదుర్గ ప్రభ పత్రికలో 
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ 

(Dr Kappagantu Rama Krishna) 

రాసిన వ్యాసం






ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...