Showing posts with label శంబల. Show all posts
Showing posts with label శంబల. Show all posts

Friday, June 12, 2020

అద్భుత ఆధ్యాత్మిక నగరం శంబల



అద్భుత ఆధ్యాత్మిక నగరం శంబల గురించి

ఈనాడు దినపత్రిక మకరందం పేజీ (11.06.2020)లో రాసిన వ్యాసం

    అదొక యోగ భూమి. వేలాది సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధనతో మునిగితేలిన మహోన్నత యోగులు మాత్రమే చేరుకోగలిగిన పుణ్యభూమి. అనంతమైన పుణ్యం చేసుకుంటే కానీ ఆ ఛాయలకు సైతం చేరుకోలేని దివ్యభూమి. అక్కడ దుఃఖానికి తావు లేదు. కష్టనష్టాలు, కన్నీళ్ల ఆనవాలు ఏమాత్రం కనిపించదు. అంతా బ్రహ్మానందం. హిమాలయ సానువుల్లో వేలాది మైళ్ళ దూరంలో భూలోక స్వర్గంగా పేరు పొందిన ఆ నగరం...శంబల.

    శంబల... ఈ పేరు తలుచుకుంటేనే ఓ పులకింత కలుగుతుంది. బాహ్యప్రపంచానికి కచ్చితంగా ఇలా ఉంటుందని తెలియని నగరం ఇది. ఎందుకంటే ఇది అన్ని ఇతర ప్రాంతాల తీరులో సాధారణమైన నగరం కాదు. ఇక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. దేవతలు సంచారం చేసే దైవభూమి ఇది. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే శారీరక, మానసిక ధైర్యం పాటు యోగం కూడా ఉండాలని హిందూ, బౌద్ధ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. సత్యం, అహింస, ధర్మం పాటించే పుణ్యమూర్తులకు మాత్రమే ఇందులోకి ప్రవేశం ఉంటుంది. యోగ సాధన ద్వారా సుషుమ్న నాడిని వశపరుచుకున్న సాధకులకు మాత్రమే ఇందులోకి ప్రవేశం ఉంటుంది. ఈ గ్రంథాలు చెప్పినట్లుగానే ఇప్పటికీ ఈ నగర రూపురేఖలు ఆధునిక మానవుల ఊహలకు సైతం చిక్కలేదు. ఇంతవరకూ ఈ నగరాన్ని స్పష్టంగా చూసిన వారు లేరు. చూడటానికి ప్రయాణం ప్రారంభించి తిరిగి వెనక్కి వచ్చినవారు కూడా లేరు. మొత్తంగా ఇది బాహ్య ప్రపంచానికి తెలియని లోకం. 

పురాణాల ప్రకారం శంబల ప్రాంతమంతా అద్భుతమైన ప్రాకృతిక సంపద పరుచుకుని ఉంటుంది. ఇక్కడి వృక్షాలు నిరంతరం సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఇక్కడి ప్రజల ఆయువు సాధారణ ప్రజల ఆయువు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ నగరం వయస్సు 60 లక్షల సంవత్సరాలు. ఇక్కడి ప్రజల పొడవు నగటున 12 అడుగులు. యోగ సాధన ద్వారా శంబలలో ఉండే ప్రజలు లోకంలో ఎక్కడ ఉండే వారితో అయినా సంభాషించే సామర్థ్యం కలిగి ఉంటారు. ప్రపచంలో ఎక్కడ జరిగే అభివృద్ధి అయినా, విధ్వంసమైనా ఇక్కడి వారికి క్షణాల్లో తెలిసిపోతుంది. లోకంలో అధర్మం పెచ్చుమీరి, కలి ప్రభావం కట్టడిచెయ్యలేనంతగా పెరిగినప్పుడు శంబలలో ఉండే పుణ్యపురుషులు, యోగులు లోక పరిపాలన తమ చేతుల్లోకి తీసుకుంటారని కొన్ని గ్రంథంలో ఉంది

కల్కి అవతారం ఇక్కడే

వేదమార్గాన్ని విడిచిన ప్రజలు ధర్మానికి దూరమవుతున్న తరుణంలో కలియుగం అంతరించే దశకు చేరుకుంటుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు శంబల నగరంలో విష్ణు శయనుడు పండితుడి ఇంట కల్కి రూపంలో అవతరిస్తాడని విష్ణు పురాణం (4-24) చెబుతోంది. తెల్లటి గుర్రాన్ని ఎక్కి, ఖడ్గాన్ని ధరించి తన పరాక్రమంతో దుష్టుల్ని సంహరించి లోకంలో తిరిగి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడని, అప్పటి నుంచి సత్యయుగం ప్రారంభమవుతుందని ఇందులో ఉంది. అగ్ని పురాణం, పద్మపురాణాలతో పాటు భాగవతంలో కూడా కల్కి అవతార ప్రస్తావన ఉంది. వీటన్నిటి ప్రకారం కల్కి అవతరించే ప్రాంతమే శంబల. బౌద్ధ కాలచక్ర గాథా సంప్రదాయంలో 'శంబల' రాజ్యాన్ని పాలించినట్లు చెప్పే 25 మంది పురాణపురుషులకు కల్కి కులిక, కల్కి రాజు వంటి సంబోధనలు ఉన్నాయి.

అంతుచిక్కని అద్భుత నిర్మాణం

శంబల నిర్మాణం అత్యద్భుతంగా ఉంటుంది. బౌద్ధ, హిందూ పురాణాల్లో ఈ నగర నిర్మాణానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. వీటి ప్రకారం శంబల నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలం ఆకారంలో పర్వతాలు గొలుసుకట్టుగా ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్ర ఆకృతిలో ఉన్న భవనం మధ్యలో భూగ్రహాన్ని పోలిన నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులకి వెళ్ళేందుకు సొరంగాలు ఉంటాయి. కోటి సూర్యుల కాంతితో వెలిగే చింతామణి అనే దివ్యమైన మణి అక్కడ ఉంటుంది. పాదరసం గడ్డకట్టినట్లు పసనకాయంత పరిమాణంలో ఇది ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణికి అర్ధచంద్రాకారంలో ముఖం ఉంటుంది. పెదవులు తెరచినట్లుండే ఒక ద్వారం ఉంటుంది. సిద్ధులైన యోగులు నిత్యం ఈ మణికి పూజలు చేస్తుంటారు. ఈ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. కల్కి అవతారంలో వచ్చినప్పుడు విష్ణుమూర్తి ఈ మణిని ధరిస్తాడని చెబుతారు. సృష్టి ఆరంభం నుంచి మహర్షులు రాసిన గ్రంథాలన్నీ ఇక్కడ ఉంటాయి. మొత్తం 18 సంపుటాలుగా వీటిని విభజించి ఉంచారు. బౌద్ధ సన్యాసులు కూడా ఈ నగరాన్ని గురించి చెబుతారు. వారి సంప్రదాయం ప్రకారం చింతామణి మంత్రాన్ని ఉపాసన చేస్తారు. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా భేదించలేకపోయారు. ఈ నగర నిర్మాణం గురించిన రహస్యాన్ని ఇప్పటికీ శంబల ప్రాంతంలో ఉండే కాల ప్రమాణాలు సాధారణ కాల ప్రమాణానికి భిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో 12 గంటలు గడిపితే బయటి ప్రపంచంలో రెండు వారాలు గడిపితే పెరిగినంత ప్రమాణంలో గోళ్ళు, వెంట్రుకలు పెరిగాయి. ఈ నగరం కోసం ప్రయత్నించిన ఓ బృందం మరీ విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ బృంద సభ్యులకు ఆకస్మాత్తుగా వయస్సు పెరగటం ప్రారంభమైంది.కొన్ని దశాబ్దాల వయస్సు పెరగటంతో పాటు వెనక్కి వచ్చిన తర్వాత కూడా 100 సంవత్సరాల వృద్ధులకు వచ్చే వ్యాధులకు గురై వారంతా మరణించారు.

పాశ్చాత్యులు శంబలని 'ఫర్ బిడెన్ ల్యాండ్', 'హిడెన్ సిటీ', 'ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్' తదితర పేర్లతో పిలుస్తారు. అలెగ్జాండ్రా డేవిడ్ నీల్, హెన్రిచ్ హిమ్లర్ వంటి ఎంతోమంది పాశ్చాత్యులు ఈ నగరాన్ని చేరుకోవాలని, ఇక్కడి విశేషాలు తెలుసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు కానీ సాధ్యపడలేదు.

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ. సెల్ : 9032044115 / 8897547548





ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...