Thursday, September 20, 2018

శ్రీకృష్ణ తత్త్వం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రుషిపీఠం పత్రిక (September, 2018) లో రాసిన వ్యాసం

కృష్ణం వందే జగద్గురుం


లౌకిక మాయలో చిక్కుకుని, విషయవాంఛలతో జీవిత లక్ష్యాన్ని విస్మరిస్తున్న మనిషిని ఉద్ధరించి, ముక్తి మార్గాన్ని ఉపదేశించటానికి స్వయంగా గురుస్థానంలో ఉండి బోధ చేసిన మ¬న్నత అవతారమూర్తి శ్రీకృష్ణపరమాత్మ. అర్జునుడికి మాత్రమే కష్టాలు రాలేదు. అతడు మాత్రమే భవబంధాలకు లోను కాలేదు. అర్జునుడనేది కేవలం మిష మాత్రమే. అర్జునుడి పేరుతో యావజ్జాతికి పరమాత్మ గీతామృతాన్ని పంచిపెట్టాడు. ఉత్తిష్ఠ కౌంతేయ! అంటూ అర్జునుడిని సంబోధించినా ఆ పిలుపునకు యావత్ప్రపంచం మేల్కొంది. అదీ జగద్గురువుకు ఉండాల్సిన లక్షణం. అప్పుడే జగద్గురువు అనే పదానికి సార్థకత. 

శ్రీమహావిష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తినా, ఏ ఒక్క అవతారంలోనూ కర్తవ్యబోధ చేయలేదు. కేవలం తన కర్తవ్యమేదో అది మాత్రమే చేశాడు. కానీ, కృష్ణావతార పరమార్థం వేరే ఉంది. అసలు పరమాత్మ జన్మించిన లగ్న లక్షణమే అది. శ్రీ కృష్ణుని జన్మలగ్నం వృశ్చిక లగ్నం. మర్మగర్భంగా ఉండటం ఈ రాశి లక్షణం. పరమాత్మ కూడా అంతే. ఆయన ఏం చేసినా, ఏం చెప్పినా అది బయటకు ఒక అర్థాన్ని, అంతరంగా మరొక అర్థాన్ని ప్రకటిస్తుంది. అంతరార్థాన్ని తెలుసుకుని, ఆచరించినవాడికి మాత్రమే పరమాత్మ తత్త్వం బోధపడుతుంది. అలాగే, విష్ణుమూర్తి అవతారాలన్నిటిలోనూ కృష్ణావతారాన్నే పరిపూర్ణావతారంగా పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. శ్రీమద్భాగవతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలా అంటుంది.

ఏతేచాంశ కలా: పుంస: కృష్ణస్తు భగవాన్‌ స్వయం | ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగేయుగే ||

ఇతర అవతారాలన్నీ పరమాత్ముని యొక్క అంశ కళలు మాత్రమే. కృష్ణావతారం మాత్రం పూర్తిగా భగవత్స్వరూపం. ధర్మవిరోధుల చేత లోకం వ్యాకులం చెందుతున్న సమయంలో పరమాత్మ ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాడు. కృష్ణుడు సాక్షాత్తు భగవత్స్వరూపుడు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కృష్ణావతారంలో కనిపిస్తాయి. అవేమిటంటే..

వ ధర్మాధర్మాలకు అతీతమైన భూమికలో జీవితాన్ని గడుపుతూ ధర్మసంస్థాపన చెయ్యటం.

  • సర్వం తెలిసినవాడైనప్పటికీ ఏమీ తెలియనివాడిలా లీలామానుషవిగ్రహుడిగా తన లీలలతో జగన్నాటాన్ని నడపటం
  • సాధారణ మానవుడిగా, గోపబాలకుడిగా లౌకికమైన అన్ని పనులు చేస్తున్నప్పటికీ, ఏ ఒక్క విషయానికీ కట్టుబడకపోవటం.
  • భౌతికస్థాయిలో, లౌకికజీవనంలో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ తనదైన అతీత దివ్యస్వరూపంతో నిత్యమూ అలౌకికస్థితిలో ఉండటం.
  • ఏ ఒక్క విషయాన్నీ తిరస్కరించకపోవటం. అలాగని, అన్నిటికీ లొంగకుండా ఉండటం.
  • బాలకృష్ణుడిగా చిలిపిచేష్టలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఆత్మీయుడిగా నిలిచిపోవటం.

ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో...మరెన్నో విశేషాలు. వీటన్నిటిలోనూ పరమాత్మ చూపించింది లీలలు మాత్రమే కాదు. లీలల రూపంలో అందించిన కర్తవ్యబోధ.

కేవలం భగవద్గీత వల్లనే శ్రీకృష్ణునికి జగద్గురుత్వం ఆపాదింపబడలేదు. బాల్యం నుంచి పరమాత్మ చూపించిన లీలలన్నీ ఆయన వైభవాన్ని ప్రకటిస్తూనే ఉన్నాయి. ప్రతి ఘట్టంలోనూ నల్లనయ్య తనవారికి కర్తవ్యబోధ చేస్తూనే  ఉన్నారు. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా విష్ణుమూర్తి అవతరించగానే దేవతలందరూ స్వామిని  పరబ్రహ్మమూర్తిగా భావన చేసి స్తోత్రం చేస్తారు. ఇక, జన్మించిన వెంటనే పరమాత్మ స్వయంగా తన తల్లిదండ్రులకు కర్తవ్యబోధన చేశాడు. ఈవిధంగా అవతార ప్రారంభంలోనే తల్లిదండ్రులకే బోధన చేసి, జగద్గురు భావనకు బీజం వేశారు పరమాత్మ. 

కృష్ణావతార కాలంలో పరమాత్మను అందరూ ముద్దుగా 'గోపాలకృష్ణా' అని పిలుచుకునేవారు. ఆ పేరులోనే ఎంతో ఔన్నత్యం కనబడుతుంది. లౌకికప్రేమతో నందవ్రజంలోని ప్రజలు గోవులను కాచేవాడు అనే అర్థంలో గోపాలకృష్ణుడని పిలిచారు. అయితే, ఆ పదంలోని అంతరార్థం గొప్ప అద్వైతభావాన్ని ప్రకటిస్తుంది. 'గో' అనే శబ్దానికి పంచభూతాలు, కిరణాలు, భూమి, జీవుడు అనే అర్థాలు కూడా నిఘంటువులు చెబుతున్నాయి. వీటిని పరిశీలిస్తే, సకల జీవులను కాచేవాడు, పంచభూతాత్మకమైన ప్రపంచానికి అధిపతి అనే అర్థాలు స్ఫురిస్తాయి. 

మన్ను తిన్నావని అడిగిన యశోదమ్మకు తన నోటిలో ప్నలుగు భువనాలను చూపిస్తూ నల్లనయ్య తల్లికి ఆత్మబోధ చేశాడు. అనంతమైన లోకాలకు నేనే అధిపతిని. నువ్వు కేవలం నిమిత్తమాత్రురాలివి. లౌకిక దృష్టి విడిచి చూస్తే నాలోనే సర్వప్రపంచం కనబడుతుంది. అప్పుడు నువ్వు, నేను అనే రెండు భావనలు ఉండవు. తల్లి, బిడ్డ అనే మమకారాలు ఉండవని యశోదమ్మకు బోధచేశాడు బాలకృష్ణుడు. 

గోవర్థన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తిపట్టుకునే ఘట్టం కూడా పరమాత్మబోధకు ప్రతిరూపమే. పోతనగారు గోవర్థనోద్ధరణ ఘట్టాన్ని ఎంతో హృద్యంగా, సుమనోహరంగా తీర్చిదిద్దారు. పసిబాలుడైన కృష్ణుడు చిటికినవేలుతో గోవర్థన పర్వతాన్ని అలవోకగా ఎత్తిపట్టుకుంటే, ఆ పర్వతఛాయలోకి వెళ్ళటానికి గో, గోప, గోపీజనం అంతా భయపడుతుంటారు. అప్పుడు నల్లనయ్య ఇలా అంటాడు.

బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా 
జాలండోయని దీనిక్రింద నిలువన్‌ శంకింపగా బోలదు ఈ 
శైలాంభోనిధి జంతుసంయుత ధరాచక్రంబు పైబడ్డన్నా
కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్‌ ప్రమోదంబునన్‌ ||

ఓ గోపాల మిత్రులారా! నన్ను బాలుడిగా భావించకండి. నేను ఈ పర్వతభారాన్ని మోయలేనని భావించకండి. సమస్త భూమండలం విరిగి మీదపడ్డా నా వేలు ఇసుమంతైనా కదలదు. ఓ బంధువులారా! మీకేమీ భయం లేదు. నిర్భయంగా, స్వేచ్ఛగా ఈ పర్వతఛాయలోకి రండి అని బాలకృష్ణుడు యాదవులను పిలుస్తాడు. పరమాత్మ పిలుపు అందుకున్న గోపకులమంతా గోవర్థన పర్వతఛాయలోకి చేరుకుంటుంది. నిజానికి, వారంతా చేరుకుంది ఆశ్రితవత్సలుడైన పరమాత్మ కరుణావలోకన ఛాయలోకి. అప్పుడిక వారికి అభయమే  తప్ప ఏ భయమూ ఉండదు. 'సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ...' అన్న భగవద్గీతా శ్లోకానికి పరమాత్మ ఎప్పుడో ఆచరణాత్మకంగా అర్థాన్ని ప్రకటించాడు. 

లోకకంటకుడిగా మారిన కంసుడిని మేనమామ అని కూడా చూడకుండా వధించి, లోక సంరక్షణ విషయంలో బంధుత్వాలు పనికిరావని బోధించాడు. శకటాసుర, తృణావర్త సంహారం, కాళీయమర్దనం, శిశుపాల దంతవక్త్రుల సంహారం.. ఇలా ప్రతి ఘట్టంలోనూ దుష్టశిక్షణ శిష్టరక్షణ చేశాడు పరమాత్మ. లోకక్షేమాన్ని అడ్డుకునేవారికి, సమాజ సంక్షేమానికి అవరోధంగా నిలిచేవారికి సమాజంలో స్థానం లేదని నిరూపించటమే ఈ ఘట్టాల్లోని అంతరార్థం. ఈవిధంగా తాను ఆచరించిన తర్వాతనే బోధన చేయటం పరమాత్మ ప్రత్యేకత. అందుకనే స్వామి జగద్గురువుగా చిరకీర్తి పొందారు.

ఎనిమిదిమంది భార్యలతో (పట్టపురాణులైన అష్టభార్యలు) ఉండటం ద్వారా పరమాత్మ బోధించిన 'బహుభార్యత్వా'న్ని కాదు. అష్టవిధాలైన శక్తులను సమీకరించుకోవటం అనే అర్థాన్ని ఇక్కడ మనం స్వీకరించాలి. గోపికాలోలుడని లోకం విపరీతార్థాలు తీసినా, ద్రౌపదీ మానసంరక్షణ ద్వారా మహిళలకు తాను రక్షకుడనని ప్రకటించాడు. కొండంత ధనం ఉన్నా కాసింత ప్రేమకే తాను బందీ అవుతానని సత్యభామ గర్వభంగ ఇతివృత్తాంతం ద్వారా తెలియజేశాడు. కౌరవుల బాధలన్నీ తట్టుకుని, క్షేమంగా, దిగ్విజయంగా అరణ్య, అజ్ఞాత వాసాలను పాండవులు పూర్తిచేయటానికి ప్రధాన భూమిక కృష్ణస్వామి అన్న విషయం జగద్విదితం. కండబలంతో పాటు బుద్ధిబలం కూడా కావాలనే సందేశాన్ని అరణ్యవాసం నుంచి కురుక్షేత్ర యుద్ధం ముగిసేవరకు ఎన్నో కృష్ణయ్య ఆచరణాత్మకంగా చూపించారు. వాస్తవానికి పరమాత్మ బుద్ధికుశలతే తోడు లేకపోతే పాండవులు కురుమహాసంగ్రామంలో విజయం సాధించగలరా? అంటే అనుమానమే. 

వీటన్నిటినీ మించిన ఘట్టం... గీతాబోధ. అప్పటిదాకా తనదైన అపార అస్త్రశస్త్రవిద్యా పాండిత్యం మీద చెదరని నమ్మకం ప్రకటించిన అర్జునుడు యుద్ధరంగంలోకి ప్రవేశించగానే డీలా పడిపోయాడు. యుద్ధం చేయనన్నాడు. ధనస్సును విడిచిపెట్టాడు. ఇదీ సరైన సమయం.

కర్తవ్యం నుంచి దూరంగా జరిగే మనిషి ఏ సమయంలో బోధ చేస్తే వింటాడో పరమాత్మకు తెలుసు. అందుకే యుద్ధరంగాన్ని ఎంచుకున్నాడు. చేసేది, చేయించేది అన్నీ తానే అన్నాడు. కర్తవ్యం విడిచిపెడితే జాతి క్షమించదన్నాడు. ధర్మం అంటే సూక్ష్మాలతో సహా బోధించాడు. అప్పటికీ ఇంకా జ్ఞానోదయం కాలేదు అర్జునుడికి. విశ్వరూపాన్ని ప్రదర్శనతో అర్జునుడి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించాడు. ఏది కర్మాచరణో అదే సన్యాసమని తెలిపాడు. ఇంకా మరెన్నో బోధనలతో అర్జునిడిని కర్తవ్యపరాయణుడిని చేశాడు. కురుపాండవ మహాసంగ్రామానికి అర్జునుడిని సిద్ధం చేశాడు. తన అవతార పరమార్థమైన దుష్టశిక్షణ, శిక్షరక్షణ చేసి, లోకంలో ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. యావజ్జాతికీ గీతాచార్యుడయ్యాడు. జగద్గురువుగా అవతరించాడు.

నిజానికి భగవద్గీత కేవలం అర్జునుడి కోసమే పుట్టిందా అంటే.. కానే కాదు. ఇక్కడ అర్జునుడు కేవలం నిమిత్త మాత్రుడు. చరాచర సృష్టిలోని జీవుల్లో నిద్రాణంగా ఉండే చైతన్యాన్ని మేల్కొలపటానికి అర్జునుడి పేరు మీద కురుక్షేత్రమనే యుద్ధరంగాన్ని వేదికగా చేసుకుని యావత్ప్రపంచానికి పరమాత్మ చేసిన బోధ భగవద్గీత. శాశ్వతమైన సత్యం, జ్ఞానం అందించటమే భగవద్గీతా సందేశం. 

సమస్యల వలయాలు మానవజీవితానికి సహజాలు. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలియక మనిషి సాధారణంగా కర్తవ్యం నుంచి దూరంగా జరగటానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా, అటువంటి సందర్భమే అర్జునుడికి ఎదురైంది. సమయాన్ని చూసుకుని పరమాత్మ జ్ఞానబోధ చేశాడు. భయం, క్రోధం విడిచిపెట్టాలని పరమాత్మ బోధన చేశాడు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం, దు:ఖం కలిగినప్పుడు కుంగిపోవటం తగదంటాడు పరమాత్మ. సుఖదు:ఖాలు రాత్రిపగలు వంటివి. ఒకదాని తర్వాత మరొకటి తప్పవు. స్థితప్రజ్ఞత సాధిస్తే సుఖదు:ఖాలు రెండిటినీ సమానంగా భావించే మనోనిశ్చలత కలుగుతుంది. అప్పుడిక మానవజన్మ సార్థక్యానికి బీజం ఏర్పడుతుంది. క్రమంగా సాధన చేస్తే, నిష్కామ కర్మకు ప్రాధాన్యతనిస్తే, అటువంటి సాధనే జీవుడిని పరమాత్మ సన్నిధికి చేరుస్తుంది. ఇదే గీతాసారాంశం. జగద్గురువుగా కృష్ణపరమాత్మను నిలిపిన మ¬న్నత జ్ఞానబోధ.

ఇంతటి సర్వోన్నతమైన జ్ఞానవిద్యను అందించిన శ్రీకృష్ణపరమాత్మ కేవలం భారతజాతికే కాదు యావత్ప్రపంచానికి జగద్గురు. కాదు..కాదు.. అనంత విశ్వానికే జగద్గురువు. అందుకే, కృష్ణం వందే జగద్గురుం.

నెమలి పింఛం... శ్రీకృష్ణ తత్త్వం


లోకసమ్మోహనాకారుడైన శ్రీకృష్ణపరమాత్మ దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే అందరికీ ఆకర్షించేది ఆయన శిరస్సు మీద ధరించిన నెమలిపింఛం. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు నెమలిపింఛాన్ని చూడగానే పులకిత మనస్కులవుతారు. అసలు శ్రీకృష్ణపరమాత్మ నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తారు? అందులోని అంతరార్థం ఏమిటి? అని పరిశీలిస్తే.. అనంతమైన వేదాంత తత్త్వం నెమలిపింఛ ధారణలో కనిపిస్తుంది. అదేమిటంటే...

నెమలి పింఛానికి ఏడు రంగులు ఉంటాయి. ప్రకతిలో కనబడే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు.. ఈ లోకమంతా ఆకాశం నిండి ఉంటుంది. ఈ ఆకాశం పగలు నీలవర్ణంలో, రాత్రివేళల్లో శ్యామవర్ణంలో కనిపిస్తుంది. సూర్యోదయానికి ఒక రంగు, సూర్యాస్తమయానికి ఒక రంగు కనిపిస్తుంది. ఇన్ని రంగుల సమహారమే ఆకాశం. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం కూడా. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగుల మయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలిపింఛంలో కనిపిస్తాయి. అంటే, పింఛాన్ని ధరించిన పరమాత్మ సాక్షాత్తు కాలస్వరూపుడు. భగవద్గీతలో పరమాత్మే స్వయంగా నేను కాలస్వరూపుడని చెప్పాడు. పింఛ ధారణలో పరమార్థం ఇదే. 

నెమలిని చూడగానే ప్రతి వ్యక్తికీ ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నెమలి కూడా అంతే. చిన్న నాటి నుంచి తనువు విడిచే వరకు తన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందాన్నిస్తుంది. అందరినీ ఆకర్షిస్తుంది. చివరకు,  జీవితం ముగిసిన తర్వాత కూడా ఆ నెమలి వదలిన పింఛం కూడా అందరినీ ఆకర్షిస్తుంది. ఇంకా చెప్పాలంటే, నెమలి కన్నా పింఛమే మరింత ఎక్కువగా ఆకర్షిస్తుంది. కొద్దికాలం జీవించిన నెమలి కన్నా, జీవం లేకుండా ఉన్నా నెమలి పింఛం మాత్రం ఆందరి ఆదరణ పొందటమే కాకుండా తరతరాలపాటు అందరి ఆత్మీయనేస్తంగా మిగులుతుంది. మానవ జీవనసత్యం ఇందులో దాగుంది.

బతికినన్నాళ్ళు అందరూ ఏదో ఒకరకంగా మనల్ని అంటిపెట్టుకుంటారు. అది మనలో గొప్పదనమైనా కావచ్చు లేదా మనతో ఇతరులకు ఉన్న అవసరమైనా కావచ్చు. కానీ, మనం భౌతికంగా లేని రోజున కూడా మన జ్ఞాపకాలను అట్టిపెట్టుకునేలా అందరి ఆప్యాయత మనం సంపాదించుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. కలకాలం జ్ఞాపకంగా మిగిలితేనే ఎన్నో వందల ఇతర జన్మల తర్వాత లభించిన మానవజన్మకు అర్థం సిద్ధిస్తుంది. నెమలిపింఛం చెబుతున్నది కూడా ఇదే.

నెమలిపింఛాన్ని ఒకసారి చేతితో గట్టిగా రుద్ది వదలితే, ప్రాణం ఉన్నదానిలా పింఛం మరింత విశాలంగా విచ్చుకుంటుంది. భౌతికశాస్త్రపరంగా చూస్తే, ఈ ప్రక్రియ స్థిరవిద్యుత్‌ (స్టాటిక్‌ ఎలక్ట్రిసిటీ) ప్రవాహానికి సంకేతం. మనిషి మనసు కూడా ఇదే తీరు. తనకు నచ్చిన, తాను మెచ్చిన విషయంతో ఎక్కువ సేపు రమిస్తే, మనసు విచ్చుకుంటుంది (అమితమైన ఆనందం పొందుతుంది). 

నెమలిపింఛం అందానికి ప్రతీక. ఆ పింఛాన్ని ధరించిన కృష్ణపరమాత్మ అందానికే అందాన్నిచ్చేవాడు. ఆయన సాక్షాత్తు మన్మథుడికి తండ్రి. 'పుంసాం మోహన రూపాయ' అని లోకప్రసిద్ధి పొందినవాడు. అందానికి గౌరవాన్ని ఇవ్వటానికే ఆయన పింఛాన్ని ధరించాడే తప్ప, అందంగా ఉండటం కోసం పరమాత్మ పింఛాన్ని ధరించలేదు. 

నెమలిపింఛంలోని రంగుల గురించి, వాటిలో వైవిధ్యం గురించి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి, ఆశ్చర్యకరమైన ఫలితాలను కనుగొన్నారు. మెలనిన్‌ రాడ్స్‌, కెరాటిన్‌ అనే పదార్థాలు పింఛంలో ఉన్నట్లు వారు కనుగొన్నారు. పింఛంలోని రంగుల విభిన్నతకు, వైవిధ్యానికి కారణం ద్విజ్యామితీయ స్ఫటిక అమరిక. ఈ అమరికలో వచ్చే తేడాల వల్ల రంగులు పరావర్తనం చెంది, మెరుపుల మాదిరిగా కనిపిస్తాయి. చూసిన ప్రతి కంటినీ, మనసునీ ఇట్టే ఆకట్టుకుంటాయి. చూడటానికి పింఛాలన్నీ ఒకే తీరులో కనిపించినా, సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ అందాల వన్నెల్లోనూ ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. 

సృష్టిలోని మనుషుల తత్త్వాన్ని పింఛం యొక్క ఈ లక్షణం విశదీకరిస్తుంది. రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళతో మనుషులందరూ చూడటానికి ఒకేతీరులో ఉంటారు. కానీ, వారి మనసులోని భావాలే వైవిధ్యతకు కారణాలవుతాయి. 'బుద్ధి: కర్మానుసారిణీ' అన్నట్లు వారివారి బుద్ధివిశేషం చేత మనుషులు కర్మలు ఆచరిస్తూ 

ఉంటారు. ఎవరి కర్మలు భగవంతునికి ప్రీతి కలిగిస్తాయో, అతడు నెమలిపింఛం మాదిరిగా అందరిచేతా సర్వోన్నతస్థితిలో చూడబడతాడు.

పింఛం ఎటుచూసినా ఒకేలా కనిపిస్తుంది. రంగుల కలయికైనా, మెరుపైనా అలాగే ఉంటుంది. మనసు లోపలా, బయటా ఒకేలా ఉండాలని మనిషికి పింఛం చేస్తున్న ఆచరణాత్మక బోధ ఇది. చీకటిలో ఉన్నా, వెలుగులో ఉన్నా పింఛం ఏవిధమైన మార్పునకు లోనుకాదు. బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని ఈవిధంగా పింఛం మనిషికి సందేశాన్నిస్తుంది.

తనదైన వ్యకిత్వాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టని పింఛాన్ని పరమాత్మ శిరస్సున ధరించాడు. ఈ ధర్మాన్ని పాటిస్తే మనిషిని కూడా మాధవుడు ఎంతో గౌరవిస్తాడు. మహనీయుల జీవితగాథలే ఇందుకు తార్కాణాలు. 

నిరాకారుడైన పరమాత్మకు అలంకారాలతో పనిలేదు. అవి ఆయనకు అందాన్ని ఇవ్వలేవు. తగ్గించలేవు. ఇదంతా మనకు జ్ఞానబోధ చేయటం కోసం పరమాత్మ చేస్తున్న లీలావిలాసం. ఈ పరమార్థం అందుకుంటే పరమాత్మ చరణాల సన్నిధికి చేరుకోవటానికి ఎంతో సమయం పట్టదు. 

=============================

రచన

డాక్టర్‌ కె.రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు,  ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, 

గాంధీనగర్‌, విజయవాడ-3. సెల్‌ : 90320 44115 / 88975 47548





No comments:

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the Ind...