Thursday, February 3, 2022

దాసశిఖామణి పురందరదాసు

దాస శిఖామణి పురందరదాసు
ఫిబ్రవరి 1, 2022 పురందరదాసు ఆరాధన సందర్భంగా ప్రత్యేక వ్యాసం



దాస శిఖామణి పురందరదాసు

          భక్తి ఉద్యమంలో దాస సాహిత్యాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్ళిన వాగ్గేయకార శిఖామణి పురందరదాసు. భావ, రాగ, లయల ఉత్తమ సమ్మేళనంగా స్వరావళి, జంటస్వరాలు, అలంకారాలు, లక్షణగీతాలు, ప్రబంధాలు, దాటువరుసలు మొదలైనవెన్నో రచించి మొత్తం కర్ణాటక సంగీత రంగంలోనే నూతన శకానికి ఊపిరిపోసాడు. సనాతన సంగీత సంప్రదాయ పునాదుల అధునాతన స్వర సౌధాలు నిర్మించి ‘కర్ణాటక సంగీత పితామహుడు’గా చిరకీర్తిని పొందాడు.

          పురందరుడి అసలు పేరు శ్రీనివాస నాయక్. మహారాష్ట్ర సమీపంలోని పురందరగడ్ అనే గ్రామంలో జన్మించాడు. పుట్టుకతోనే అత్యంత ధనవంతుడు. పరమ పిసినారి కూడా. విజయనగర సామాజ్ర పరిధిలో ఈ గ్రామం ఉండేది. పూర్వికుల నుంచి వచ్చిన వజ్రాలు, వడ్డీ వ్యాపారాల్లో ఆరితేరి నవకోటి నారాయణుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు. పురందరుడి భార్య సరస్వతీబాయి. పరమ భక్తురాలు.  గొప్ప దయాగుణం కలిగిన మనిషి అయినప్పటికీ భర్త కారణంగా ఏ దానం చెయ్యలేకపోయేది. ఇంతటి పరమలోభి సర్వసంగ పరిత్యాగి కావటం వెనుక పరమాత్మ సంకల్పం ఉండనే ఉంది.

          ఓ ముసలి బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం కోసం ధన సహాయం చెయ్యమంటూ శ్రీనివాసుడి దగ్గరకు వస్తాడు. ఇవాళ, రేపు అంటూ నెలల తరబడి తిప్పుతాడు కానీ అతడు చిల్లిగవ్వ కూడా ఇవ్వడు. విసిగిపోయిన ఆ బ్రాహ్మణుడు సరస్వతీ బాయిని కలిసి వివరాలు చెబుతాడు. ఆమె తన నిస్సహాయ స్థితిని అతడికి చెప్పి, తన ముక్కెర ఇచ్చి పంపిస్తుంది. బ్రాహ్మణుడు ఆ ముక్కెరను శ్రీనివాస నాయక్ దగ్గర తాకట్టు పెట్టడానికి వెళ్తాడు. అనుమానం వచ్చిన అతడు భార్యను నిలదీస్తాడు. విఠలుడి మాయతో ముక్కెర భార్య దగ్గరే ఉంటుంది. జరిగినదంతా తెలుసుకున్న శ్రీనివాసుడికి జ్ఞానోదయం అవుతుంది. తనలో మార్పు తీసుకురావటానికే విఠలుడు ముసలి బ్రాహ్మణుడి రూపంలో నాటకం ఆడాడని తెలుసుకుంటాడు.

          అప్పట్నుంచీ శ్రీహరికి పరమ భక్తుడయ్యాడు. నవకోటి నారాయణుడు నారాయణ భక్తుడయ్యాడు. బంగారువజ్రాల నగల అలంకరణతో మెరిసిపోయిన చేతులు తంబురాను పట్టుకున్నాయి. మేలిమి బంగారు హారాలతో నిండిపోయిన మెడలో ఇప్పుడు తులసి మాలలు దర్శనమిస్తున్నాయి. దేహీ అంటూ వచ్చిన యాచకులను తిప్పి పంపిన తాను ఇప్పుడు ఉదర పోషణార్థం భిక్షమెత్తుతున్నాడు. నలుగురితో పాటు జన్మించి నలుగురితో పాటు మట్టిలో కలిసిపోవాల్సిన శ్రీనివాస నాయక్ పురందరదాసు అయ్యాడు. పుట్టిన కొన్ని శతాబ్దాల తర్వాత కూడా తన కీర్తనల ద్వారా ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉన్నాడు. పరసవేది స్పర్శతో రాయి కూడా బంగారమైనట్లు పరమ లోభి కూడా ఆ భగవంతుని కృపతో హరిదాసులకు ఆది గురువయ్యాడు.

          శ్రీ కృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయల్ని ఆశ్రయించి పురందరదాసు అనే దీక్షానామంతో ప్రసిద్ధి పొందాడు శ్రీనివాసుడు. అప్పట్నించీ హరినామం తప్ప మరొక ధ్యాస, శ్వాస ఆయనకు లేవు. శ్రీహరి నామాలు పాడుకుంటూ సంచార జీవితం గడపసాగాడు. వేద, శాస్త్ర, పురాణ, కావ్య, ప్రబంధ విజ్ఞానం మొత్తాన్ని తన పదాల్లో నిక్షిప్తం చేసేవాడు. సామాన్యులే లక్ష్యంగా చేసుకుని వారికి అర్థమయ్యేలా తేలికైన పదాలతో రచనలు చేసాడు. దీంతో అతి స్వల్పకాలంలోనే పురందరుడి పేరు మార్మోగిపోయింది. ఎవరి నోట విన్నా పురందరుడి గీతమే వినిపించింది. ఈ పదాలన్నీ కలిసి ‘పురందరోపనిషత్’ గా మారాయి. గురువు వ్యాసరాయలు కూడా ‘దాసరందరే పురందరదాసరయ్య’ – దాసుడంటే పురందర దాసేనయ్యా... అంటూ శిష్యభక్తికి ఉప్పొంగిపోయాడు.

          పురందరుడి పదాల్లో నవవిధ భక్తులు, ఐదు పరమభావాలు ఉన్నాయి. రాధాకృష్ణుల భాగవతభక్తి ఇతడి పదాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. బాలకృష్ణుడు వెన్నను దొంగిలించటం, గోపికలు యశోదతో మొరపెట్టుకోవటం, కన్నయ్య గోపికలతో విహరించటం వంటి లీలల్ని పురందరుడు తన పదాల్లో చక్కగా వర్ణించాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లోనూ అతడి రచనలు సాగాయి.

          భక్తికి ఆడంబరాలు అవసరం లేదంటాడు పురందరుడు. స్నాన, జప, తపాలు దృఢమైన విశ్వాసం కలిగిన భక్తులకు అవసరం లేదంటాడు. అప్పట్లో ఆచారాల పేరుతో జరిగే అనాచారాల్ని నిర్మొహమాటంగా ఖండించాడు. వైరాగ్యానికి మార్గం చూపాడు. ఇవన్నీ అతడి రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి.

          పురందరుడు కర్ణాటక సంగీతంలో లెక్కలేనన్ని ప్రయోగాలు, పరిశోధనలు చేసాడు. మాయామాళవ గౌళ రాగాన్ని సృష్టించాడు. నూతన సంగీత అభ్యాసకులకు ఈ రాగం ఒక వరంగా మారింది. అన్నిరకాల గాత్రభేదాలు కలిగినవారూ తేలికగా పాడుకోగలిగిన రాగం ఇది. సాధారణంగా సంగీత గురువులు శిష్యులకు మొదటగా ఈ రాగమే నేర్పుతారు. దీంతో సాధకుడికి తానూ కీర్తన పాడగలనన్న ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ప్రారంభదశ అభ్యాసకులకు వీలుగా ఉండటానికి సరళి, జంట స్వరాల వరుసలూ, అలంకారాలు, విళ్ళారి గీతాలు, ఘనరాగ గీతాలు, ప్రబంధాలూ రచించాడు. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత కర్ణాటక సంగీతం అప్రహతిహతంగా వెలుగుతుండటానికి పురందరాసు మాత్రమే కారణం అని విమర్శకులు కూడా అంగీకరిస్తారు.

          పురందరుడు రాసిన కీర్తనల్ని ‘దాసరపదగళు’, ‘దేవరనామ’ అనీ వ్యవహరిస్తారు. మాంజి భైరవి, ద్విజావంతి, శ్యామకల్యాణి, మారవి, మధూ, మాధవి, వసంతభైరవి వంటి అపూర్వ రాగాల్లో ఈయన చేసిన రచనలు, చేసిన ప్రయోగాలు సంగీతరంగంలో సంచలనం సృష్టించాయి.

          హంపీ చేరి ఒక మండపం లో ఉంటూ చివరి జీవితాన్ని గడిపాడు. దీన్ని ఇప్పటికీ పురందర మండపంగా పిలుస్తారు. దాదాపు 4,75,000  కీర్తనలు రాసి సంగీత ప్రపంచంలో మరెవ్వరూ సాధించలేనంత ఎత్తుకు ఎదిగాడు.  మిగిలిన 25 వేల కీర్తనలూ రాసి తాను  అనుకొన్న 5 లక్షల కీర్తనలు పూర్తి చేయమని చిన్న  కొడుకు మధ్వపతిని  కోరాడు. తాను  ఈ జన్మలో అంతటి పని చేయలేనని మరోజన్మలో రాసి తండ్రి కోరిక తీరుస్తానని అన్నాడు  మధ్వపతి. అతడే తర్వాతికాలంలో కర్ణాటక, రాయపూర్ జిల్లా చీకలపర్వి లో ‘’విజయదాసు ‘’గా జన్మించి తండ్రికి చేసిన వాగ్దానం ప్రకారం 25 వేల  కీర్తనలు శ్రీ లక్ష్మీ నారాయణస్వామిపై రచించాడు. త్యాగరాజ స్వామి తన ‘ప్రహ్లాద భక్త విజయం గేయ నాటకం లో పురందర దాసును ప్రస్తుతించారు. జీవితం చివరిదశలో సన్యాసాశ్రమం స్వీకరించి రక్తాక్షి నామ సంవత్సరం (క్రీ.శ 1564, జనవరి 2) పుష్య అమావాస్య రోజున సిద్ధిపొందారు.

---------------------------------------------------------

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548








         

 


 

No comments:

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the Ind...