![]() |
‘సంగీతరత్న’ పెమ్మరాజు సూర్యారావు గారు |
సంగీతరంగంతో
ఏమాత్రం సంబంధం లేనివాడిని అయినప్పటికీ ‘సంగీతరత్న’ పెమ్మరాజు సూర్యారావు గారితో నాకు
ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఏ సభలో కలిసినా నన్ను ప్రత్యేకంగా పలకరించేవారు.
ఒక్కోసారి పక్కకు తీసుకువెళ్ళి మరీ మాట్లాడేవారు. ఓ దినపత్రికలో నేను రాసే
సాంస్కృతిక వార్తలు బాగున్నాయంటూ మెచ్చకునేవారు. ఏమాత్రం సంగీత పరిజ్ఞానం
లేనివాడిని కావటంతో సంగీత కచేరీలకు సంబంధించిన వార్తలు రాసేటప్పుడు
సూర్యారావుగారిని అడిగి సలహా తీసుకునేవాడిని. ఆయన కేవలం సంగీత విద్వాంసుడు మాత్రమే
కాదు. చక్కటి రచయిత కూడా. హిందూ దినపత్రికలో ప్రతి శుక్రవారం వచ్చే ‘ఫ్రైడే
రివ్యూ’లో ఆయన రాసిన సమీక్షలు ఎంతో గొప్పగా ఉండేవి. నిజం చెప్పొద్దూ... హిందూ
పత్రిక చదివే అలవాటు నాకు లేకపోయినా విలేకరిగా చేరిన కొత్తల్లో సంగీతానికి
సంబంధించిన వార్తలు ఎలా రాయాలో తెలుసుకునేందుకు ఫ్రైడే రివ్యూ... అందులోనూ
సూర్యారావుగారి సమీక్షలు తప్పనిసరిగా చదివేవాడిని. నిజాన్ని నిర్భయంగా రాయటం ఆయన
సమీక్షలు చదివిన తర్వాతనే నాకు అలవాటైంది. ఆయన్నుంచి నేను నేర్చకున్న పాఠం అది.
వారి నుంచి నేను తెలుసుకున్న మరో అంశం అంకితభావం. చేస్తున్న పని పట్ల ఉండాల్సిన అంకితభావం... కమిట్ మెంట్ అంటామే... అది ఆయనకు ఎంతో ఉన్నతస్థాయిలో ఉండేది. విజయవాడలో సంగీత సన్మండలి నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆ *ఉత్సవాల్లో పూజించే సీతారాములు, ఆంజనేయస్వామి, త్యాగరాజస్వామి విగ్రహాలు కొత్తూరు తాడేపల్లిలోని మా సొంత దేవాలయం (శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి వారి దేవస్థానం)లో ఉండేవి. అక్కడే నిత్యపూజలు చేసేవాళ్ళం. ఆరాధనోత్సవాలకు ముందురోజున సూర్యారావుగారు గుడికి వచ్చేవారు. ఏదో విగ్రహాలు తీసుకువెళ్ళటానికి వచ్చినట్లు కాకుండా స్వామిని ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లుగా అక్కడి మంటపంలో కూర్చుని కొన్ని కృతులు పాడేవారు. అలా భక్తితో స్వామిని ఆహ్వానించి ఆ తర్వాతనే విగ్రహాలు కారులో పెట్టేవారు.* ఇక్కడ నేనెంతో అదృష్టవంతుడిగా భావిస్తాను. సభల్లో జరిగే కచేరీల్లో ఆయన పాండిత్యాన్ని అందరూ చూస్తారు. కానీ ఆయన గుండె లోతుల్లోంచి వచ్చిన భక్తితరంగాల్ని నేను చూడగలిగానని గర్వంగా చెప్పుకుంటాను. ఎన్నో ఏళ్ళు గడిచినా మా గుడిలో ఆయన పాడిన సన్నివేశం నాకు ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతుంది. కొంతకాలం తర్వాత ఆ విగ్రహాల్ని విజయవాడ రామకోటి దేవాలయ ప్రాంగణంలో ఉంచటంతో సూర్యారావు గారు మా గుడికి రావటం ఆగిపోయింది. అయినా కచేరీల్లో మేం కలుసుకోవటం, ఆత్మీయంగా మాట్లాడుకోవటం మాత్రం ఎప్పటిలాగానే కొనసాగేవి.
చేస్తున్న పని పట్ల అంకితభావం... అంతకుమించిన
భక్తి ఆయనకు ఉండేవి. ఇక ఆరాధనోత్సవాల్లో ఆయన పాటించే క్రమశిక్షణ జగమెరిగిన విషయం.
వారిని చూసి నా మనసులో పడిన ముద్ర ఏమో కానీ... ఇప్పటికీ ఏదైనా పని అనుకుంటే
అందులోని ప్రతి చిన్న అణువులో తప్పుజరగకూడదనుకోవటం, అందుకోసం కష్టపడటం అలవాటైంది.
కాలక్రమంలో వచ్చిన మార్పులకు ఆయనెంతో బాధపడేవారు. తరాలు మారుతున్నాయి. విలువలు పోతున్నాయంటూ నాతో అనేవారు. ప్రచారం కోసం ఆరాధనోత్సవాలు చెయ్యటం లేదు. సంగీత కళాకారులుగా అది మా బాధ్యత. కర్తవ్యం అనేవారు. పత్రికల పరంగా జరిగిన కొన్ని సంఘటనలు ఆయన్నెంతో బాధ పెట్టాయి. అయినా అణువంతైనా క్రమశిక్షణ, ఎంచుకున్న నియమాల్ని విడిచిపెట్టటానికి ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదు. పత్రికారంగంలో కొంతకాలం పనిచేసినవాడిగా ఈ సంఘటనల విషయంలో ఆయనకు, నాకు మాటలు జరుగుతుండేవి.
కేవలం
కళాపాండిత్యమే కాదు మంచి వ్యక్తిత్వం కలిగినవారుగా సూర్యారావు గారంటే నాకు ఎంతో
గౌరవం. ఆయన కూడా నన్ను తన శిష్యుల మాదిరిగా అభిమానించేవారు.
ఇంత చనువు, ఆత్మీయత ఉన్నా వారితో కలిసి ఓ ఫొటో తీయించుకోవాలన్న ఆలోచనే రాలేదెందుకో. బహుశా ఆ రూపం నా మనసులో శాశ్వతంగా ఉండిపోవాలన్న దైవసంకల్పమేమో.
(ఈ ఫొటో మాత్రం నేను
తీసినదే. పత్రిక కోసం వారితో జరిపిన ముఖాముఖి సందర్భంగా తీసాను)
No comments:
Post a Comment