Tuesday, July 2, 2019

హనుమజ్జయంతి సందర్భంగా డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

వినయ విధేయ హనుమ!
ఈ నెల 29న హనుమజ్జయంతి
రాముడిది ఒకటే మాట, ఒకటే బాణం... రామబంటు హనుమదీ ఇదే బాట. ఆయనకు రాముడొకడే దైవం... రామనామం ఒకటే మంత్రం... రామకార్యాలపై తరగని భక్తే అతని శక్తి... ఆ భక్తితోనే అంత సముద్రాన్ని అవలీలగా దాటాడు. ఆ శక్తితోనే అంత మంది రాక్షసుల్ని ఒంటిచేత్తో తుదముట్టించాడు. మహాకార్యాలన్నీ చిత్తంలో భక్తితోనే సాధ్యమవుతాయని నిరూపించిన  హనుమ జ్ఞానగుణ సాగరుడు...
హనుమ ఒక రోజున సీతమ్మ తల్లిని మసటన సిందూరం ధరించటానికి కారణం అడుగుతాడు. సిందూరం ధరించటం వల్ల తన భర్తకు సౌభాగ్యం కలుగుతుందని చెబుతుందామె. మరుక్షణం ఇప్పుడే వస్తానంటూ వెళ్లి, ఒళ్లంతా సిందూరం పూసుకుని వస్తాడు హనుమ. ఏమిటీ చోద్యం అంటుంది సీతమ్మ. పాపిట్లో కాస్తంత సిందూరం ధరిస్తేనే స్వామికి సౌభాగ్యం కలుగుతుందన్నావు కదమ్మా... నా స్వామికి అనుక్షణం, జీవితాంతం సౌభాగ్యం కలగాలి. అందుకే ఒళ్లంతా సిందూరం పూసుకున్నానంటాడు. హనుమ స్వామిభక్తి ముందు జానకీదేవి పతిభక్తి చిన్నబోయింది.
అణువణువూ ఆయనే...
హనుమకు ఏం తక్కువ?
సాక్షాత్తు రుద్రాంశసంభూతుడు, అనంత బలశాలి, అపార విజ్ఞానఖని, సుగ్రీవుడికి సచివుడు... కానీ తాను రామబంటునంటూ ప్రకటించుకున్నాడు.
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్‌ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యుద్ధేప్రతిబలం భవేత్‌
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అంటూ కోసల దేశపు ప్రభువైన రాముడికి నేను దాసుడిని అని ఎలుగెత్తి చాటాడు. అంతేకాదు... నా గుండెల నిండా రామభక్తి ఉంది. నా అణువణువులో రామనామం నింపిన శక్తి ఉంది. ఇవి చాలు... వెయ్యిమంది రావణులు ఒక్కసారిగా వచ్చినా అందరినీ మట్టి కరిపిస్తానంటాడు హనుమ. రామభక్తి ఇచ్చిన ఆత్మబలం అది. ఎంచుకున్న దైవంపై శిలలాంటి దృఢమైన విశ్వాసం హనుమలో ఉంది. ఆ విశ్వాసమే, ఆ విధేయతే హనుమను చిరకీర్తిమంతుణ్ణి చేసింది. రాముడంటే హనుమ, హనుమ అంటే రాముడు అన్నంతగా తనకు, రాముడికి అభేదాన్ని సాధించిన భక్తశిఖామణి ఆంజనేయుడు. తన శరీరంలోని ప్రతి అణువులో రామ నామాన్ని నింపుకోవటమే కాదు... ప్రకృతిలోని ప్రతి అణువులోనూ తన స్వామిని దర్శించిన పుణ్యమూర్తి ఆయన. అందుకే వాల్మీకి మహర్షి హనుమను ‘రామాయణ మహామాలా రత్నం’ అని సంబోధించాడు. ఎప్పుడైతే రామచంద్రమూర్తిని తొలిగా దర్శించి, ఆయనతో మాట్లాడి, రామదాసుడిగా మారాడో ఆ క్షణం నుంచే హనుమకు రాముడితోడిదే లోకంగా మారింది. సీతాన్వేషణ కోసం బయల్దేరుతూ రాముడు విడిచిపెట్టిన బాణంలా లంకవైపునకు దూసుకుపోతాను అన్నాడు ఆంజనేయుడు. వాయుపుత్రుడు, అమేయ బలసంపన్నుడై ఉండి కూడా సీతమ్మను వెతికేందుకు వెళ్లే శక్తి నాది కాదు. రాముడిది అన్న మాటలు రాముడిపై, రామనామంపై హనుమకు ఉన్న చెక్కుచెదరని లక్ష్యశుద్ధిని ప్రకటిస్తాయి.
శిరసా నమామి...
నీవు తప్ప వేరొకరు లేరంటూ రాముడికి మనసా, వాచా, కర్మణా దాసోహమన్నాడు హనుమంతుడు. ఆ భక్తికి, శరణాగతికి భగవంతుడు ఎప్పుడూ బందీనే. తన వీరత్వంతో కాకుండా, తన వినయంతో రామబాణాన్నే శక్తిహీనం చేశాడు హనుమ. ఓ సందర్భంలో హనుమ ధ్యానంలో ఉండగా విశ్వామిత్రుడు వచ్చాడు. అక్కడున్న వారంతా మహర్షికి నమస్కారం చేశారు. కానీ ధ్యానంలో ఉండటం వల్ల హనుమ మహర్షిని గమనించలేదు. హనుమ తనపై తృణీకారభావం వహించాడంటూ విశ్వామిత్రుడు ఆగ్రహించి, తన శిష్యుడైన రాముడికి ఫిర్యాదుచేశాడు. అప్పటికీ అవేశం చల్లారక ఏకంగా హనుమకు మరణదండన విధించాలని ఆదేశించాడు. గురువు ఆజ్ఞను శిరసావహించిన రామచంద్రమూర్తి అయిష్టంగానే బాణప్రయోగం చేశాడు. తన విద్యనంతా ప్రయోగించి బాణవర్షం కురిపించాడు. ఆశ్చర్యం... ఒక్క బాణమూ హనుమను తాకలేదు. అన్ని వేల బాణాలూ మధ్యలోనే కిందపడిపోయాయి. ఈలోగా నారదుడితో పాటు చాలామంది అక్కడకు చేరుకున్నారు. ఇంతలో హనుమ ధ్యానం నుంచి లేచి, జరిగిన విషయం తెలుసుకుని, రాముడి కాళ్ల మీద పడి వేడుకున్నాడు. మహర్షి విషయంలో తాను కావాలని అపచారం  చెయ్యలేదని వివరించాడు. విశ్వామిత్రుడు కూడా చల్లబడి హనుమలోని రామభక్తికి ముగ్ధుడయ్యాడు. రాముడి మీద తనకున్నది అధికారం. అదే హనుమకు ఉన్నది మమకారమని తెలుసుకున్నాడు. హనుమ విధేయత రాముడినే నిలువరించే మహత్తరమైన శక్తి కలిగిందని గ్రహించాడు.అందుకనే రామభక్తికి హనుమంతుడు కీర్తిపతాకంగా నిలుస్తాడు.
- కప్పగంతు రామకృష్ణ

No comments:

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the Ind...