Tuesday, July 2, 2019

జగద్గురు ఆదిశంకరాచార్య వైభవం

గోవింద గోవింద అని కొలువరే!
జగద్గురు ఆదిశంకరాచార్య వైభవం
తాను కన్నవాళ్లు, తనను కన్నవాళ్లు కళ్లముందే రాలిపోతున్నా తాను మాత్రం శాశ్వతం అనుకోవడం ఓ భ్రాంతి...తాను కట్టుకున్న కలల కోటలకు ఏదో ఒకరోజు వీడ్కోలు  చెప్పాల్సి ఉంటుందన్నది సత్యం... కానీ సంసార యాత్ర  ఆ విషయం తెలుసుకోనివ్వదు. వ్యామోహాలు సత్యంవైపు చూడనివ్వవు.
మరి మనిషికి తరుణోపాయం లేదా...
ఉంది...
అది భగవదనుగ్రహం...
దాన్ని పొందేదెలా...
అది చాలా తేలికైన పని...
తెలుసుకో...
ఏది పాపం... ఏది పావనం?
ఏది నిత్యం... ఏది అనిత్యం?
ఏది శాశ్వతం... ఏది తాత్కాలికం?
స్మరించు...
నిత్యమైన నామాన్ని... పరమ సత్యాన్ని...
పరమోన్నత గమ్యాన్ని...
అదే తారకమంత్రం...
అదే పరమానందానికి దిక్సూచి...
భజగోవిందం సూత్రీకరణ ఇదే...
జగద్గురు శంకరభగవత్పాదులు ప్రవచించింది శుష్క వేదాంతాన్ని కాదు... సిసలైన జ్ఞానాన్ని. సకలవేద సారాన్ని...
బ్రహ్మవర్చస్సుతో వెలుగుతున్న ఓ యువ సన్యాసి గంగానదిలో స్నానం ముగించుకుని, కాశీలోని ఓ వీధిలో నడిచి వెళుతున్నాడు. ఓ ఇంటి ముందుకు వచ్చేసరికి ఆ అరుగుమీద కూర్చున్న వృద్ధుడైన ఓ పండితుడు ‘డృ ఞ్‌ కరణే’ అంటూ వ్యాకరణ సూత్రాన్ని పదే పదే వల్లెవేస్తున్న దృశ్యం కనిపించింది. వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్న ఆ సన్యాసి ఓ క్షణం అక్కడే ఆగాడు. ఆ పండితుడిని చూశాడు. వయసు మీద పడుతున్నఛాయ స్పష్టంగా కనిపిస్తోంది. సన్యాసి వచ్చి తన ఇంటి ముందు ఆగిన విషయం కూడా అతడు గమనించలేదు. తనకు ప్రపంచమే పట్టనట్లు ఇంకా వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేస్తూనే ఉన్నాడు. చిరునవ్వు ఆ సన్యాసి పెదవులపై తొణికిసలాడింది. క్షణం కాలం కళ్లుమూసుకున్నాడు. బహుశా తన దైవాన్ని తలచుకున్నాడేమో? పండితుడి దగ్గరకు వచ్చి
భజగోవిందం భజగోవిందం
గోవింద భజ మూఢమతే ।
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డృ ఞ్‌ కరణే ।।
‘ఓ మూఢమతీ! వ్యాకరణ సూత్రాలను పక్కకు పెట్టు. జీవితపు చివరిదశకు చేరుకున్నావు. గోవిందుడి నామస్మరణ ప్రారంభించు. మరణకాలంలో నిన్ను ఆదుకుని, ఉత్తమలోకాలు కల్పించే తారకమంత్రం అదే’... అంటూ జీవితానికి అసలైన అర్థాన్ని, పరమార్థాన్ని బోధించాడా సన్యాసి. అలా ఆశువుగా శ్లోకాలు చెబుతూ, ఆ శ్లోకాల్లోనే మొత్తం జీవన సారాంశాన్ని నిక్షిప్తం చేసి, మానవాళికి మహోన్నత దశ, దిశ నిర్దేశించాడు. అద్వైతమార్గ ప్రతిష్ఠాపకుడిగా, జగద్గురువుగా అవతరించిన ఆది శంకరాచార్యులే ఆ సన్యాసి. లౌకిక జీవితమంతా నాటకమే... చేయాల్సింది నారాయణ స్మరణ మాత్రమే యావత్ప్రపంచానికి కర్తవ్యబోధ చేసిన ఆ స్తోత్రమే ‘భజగోవింద స్తోత్రం’.
సకల చదువుల సారం...
ఆది శంకరులు మూఢమతీ! అని సంబోధించింది కేవలం ఓ పండితుడిని మాత్రమే కాదు. అతడు మొత్తం సమాజానికి ప్రతీక. పుస్తక జ్ఞానం మాత్రమే చదువు అని భావించి దానికి మాత్రమే పరిమితమవుతున్న మనిషికి చేసిన జ్ఞానబోధ అది. విజ్ఞానం అంటే కేవలం అక్షరజ్ఞానం మాత్రమే కాదు. కొన్ని గ్రంథాల్ని ఆమూలాగ్రం చదవటం అంతకన్నా కాదు. కేవలం అక్షరాల్ని చదివితే సరిపోదు... వాటి మాటున దాగున్న అనంతమైన దైవత్వాన్ని దర్శించటమే చదువులోని అంతరార్థం అనే సందేశాన్ని భజగోవింద స్తోత్ర ఆవిర్భావ ఘట్టం మనకిస్తుంది.
పుట్టడం, పెరగడం, వివాహం, సంపాదన, నిద్ర, శారీరక సుఖాలు.... ఇదేనా జీవితం. సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్లో మనిషికి మాత్రమే మనస్సు ఉంది. కానీ, ఆ మనస్సు మోహం అనే వలలో చిక్కుకుపోతుంది. దీంతో సిసలైన జ్ఞానం దరిచేరడం లేదు. వివేకంతో ఆలోచించాలి. సత్యమైన, నిత్యమైన దానికోసం అన్వేషించాలి. దీనికి పరమేశ్వర ధ్యానం ఉపకరిస్తుంది. తన అస్తిత్వం ఏమిటో మనిషి తెలియజెప్పటమే భజగోవిందస్తోత్రం అంతరార్థం.
భజగోవింద స్తోత్రం వయసు మీద పడిన వృద్ధులు చదవాల్సిన స్తోత్రం కాదు.
క్షణికమైన విషయాల మోహంలో నిజమైన సత్యాన్ని గుర్తించకుండా ప్రవర్తించేవారికి శంకరులు చేసిన హెచ్చరికలే ఈ స్తోత్రంలోని శ్లోకాలు.
జీవిత సత్యాలు... జీవన సూత్రాలు...
ఆదిశంకరులు రాసిన ఇతర రచనలకు భిన్నంగా భజగోవింద స్తోత్రం సాగుతుంది. మిగిలినవాటిలో శంకరులు ఏదో ఒక దేవతను స్తుతి చేస్తారు. ఇందుకు భిన్నమైన ధోరణి ఇందులో కనిపిస్తుంది.
గురుచరణాంబు నిర్భర భక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః ।
సేంద్రియ మానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ।।
ఈ స్తోత్రంలో మానవుడే మాధవుడు. తన హృదయంలో దాగున్న నారాయణుడిని దర్శించటమే మనిషి కర్తవ్యం కావాలి. అందుకోసమే మనిషి తనను తాను జాగృత పరచుకోవాలనే స్వీయ జాగృతీ చైతన్య మహోద్యమానికి ఆదిశంకరులు భజగోవింద స్తోత్రం ద్వారా శ్రీకారం చుట్టారు. అమ్మ లాలన కాకుండా నాన్న పాలన ధోరణి శంకరులు ఈ స్తోత్రంలో అవలంబించారు. సుతి మెత్తని హెచ్చరికల ద్వారా సమాజాన్ని జాగృత పరచే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు.
యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే ।।
ధనం ఉన్నంత వరకే బంధుమిత్రులు మన దగ్గరకు చేరతారు. ధనం లేని రోజున వాళ్లంతా దూరంగా జరుగుతారు. అంటే, మనం సంపాదించాల్సింది లౌకికమైన ధనం కాదు. మనల్ని మనల్నిగా ప్రేమించి, ఆదరించే మనుషుల్ని, మనసుల్ని సంపాదించాలి.
మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః స్సర్వం ।
మాయామయమిదం అఖిలంఖిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ।।
శారీరక సౌందర్యం క్షణికమైంది.  కావలసింది అంతస్సౌందర్యం.ధనం, పరివారం, యవ్వనం... వీటన్నిటినీ చూసి గర్వించటం తప్పు. ఇవన్నీ మాయా కల్పితాలు. ఇవన్నీ ఏనాటికైనా నశించేవే. శాశ్వతమైన సౌందర్యం పరమాత్మది మాత్రమేనని గుర్తించాలి.
బాలస్తావత్‌ క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరే బ్రహ్మణి కోపినసక్తః ।।
బాల్యదశ ఆటపాటల మీద ఆసక్తితో గడిచిపోతుంది. యవ్వనమంతా స్త్రీ వ్యామోహంతో... వార్ధక్యం సంసారం మీద ఆలోచనతో గడిచిపోతుంది. మనిషి తామరాకు మీద ఉన్న నీటిబొట్టు తీరులో సంసారంలో ఉన్నా బంధాల్లో చిక్కుకోకుండా, పరబ్రహ్మాన్ని ఉపాసించాలి.
కురుతే గంగా సాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానం
జ్ఞానవిహీనః సర్వమత్యేన
ముక్తిం న భజతి జన్మశతేన ।।
గంగ వంటి ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినా, ఎన్నెన్నో నోములు, పూజలు చేసినా ఆత్మజ్ఞానం లేకపోతే అవన్నీ వృథా అవుతాయి. కేవలం గంగా స్నానమే ముక్తిని ఇచ్చేట్లయితే అందులో మునిగే జంతుజాలానికీ మోక్షం రావాలి. కానీ, అది సాధ్యం కాదు. ఎందుకంటే..  మనిషికి కావల్సింది జ్ఞానం, విచక్షణ.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ।।
జ్ఞానులు, మహానుభావుల సాంగత్యం ఎప్పుడూ కోరుకోవాలి. ఇందువల్ల మనసులో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయి. ఫలితంగా బుద్ధి నిశ్చలస్థితికి చేరుకుంటుంది...పరమేశ్వరుడి మీద కేంద్రీకృతమవుతుంది. అంతిమంగా జీవన్ముక్తి కలుగుతుంది.
వాస్తవానికి భజగోవింద స్తోత్రంలో శంకరాచార్యులు ఆశువుగా చెప్పింది కేవలం 12 శ్లోకాలే. వాటితో ఉత్తేజం పొందిన శిష్యగణం గురువుగారి బాణీని అనుసరిస్తూ మరో 14 శ్లోకాలు చెప్పారు. శిష్యుల ప్రతిభకు, వారిలోని ఆర్ద్రతకు ముచ్చటపడిన శంకరులు మరో ఐదు శ్లోకాలు ఆశీఃపూర్వకంగా చెప్పారు. దీంతో మొత్తం 31 శ్లోకాలు అయ్యాయి. ఇదే భజగోవిందంగా విశ్వవిఖ్యాతి పొందింది.శంకరులు చెప్పిన 12 శ్లోకాలను ‘ద్వాదశ మôజరీక స్తోత్రం’ అంటారు. శిష్యులు చెప్పిన 14 శ్లోకాలను ‘చతుర్దశ మంజరీక స్తోత్రం’ అంటారు.
భక్తుడు భగవంతుడిని చేరుకునేందుకు ప్రహ్లాదుడు నవవిధ భక్తిమార్గాలను చెప్పాడు. వీటిలో శ్రవణం మొదటిది కాగా ఆత్మనివేదనం చివరిది. ఇతర పద్ధతుల్లో ఈ మార్గాల్లో ఏదో ఒక విధానాన్ని అనుసరించటానికి మాత్రమే వీలుంటుంది. కానీ, భజగోవిందస్తోత్రంద ద్వారా శ్రవణం, కీర్తనం, స్మరణం అనే మూడు మార్గాలను ఒకే సమయంలో సాధన చేసే అవకాశం ఉంది. ఆది శంకరుల వైదుష్యానికి ఇదొక మచ్చుతునక.
భజగోవింద స్తోత్రం వయసు మీద పడిన వృద్ధులు చదవాల్సిన స్తోత్రం కాదు.  క్షణికమైన విషయాల మోహంలో నిజమైన సత్యాన్ని గుర్తించకుండా ప్రవర్తించేవారికి శంకరులు చేసిన హెచ్చరికలే ఈ స్తోత్రంలోని శ్లోకాలు.
- కప్పగంతు రామకృష్ణ

No comments:

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the Ind...