Tuesday, April 20, 2021

రామయ్యా...ఇదిగోనయ్యా సీతమ్మ! (సీతారామ కల్యాణ వైభవం)

 



సీతారామ కల్యాణ వైభవం

రామయ్యా...ఇదిగోనయ్యా సీతమ్మ!

 బంధం కలిస్తే బంధుత్వం...పెనవేసుకున్న అనుబంధం అంతులేని సంతోషానికి కారణమవుతుంది.మనుషుల మధ్య ఈ అనురాగ ముడులను వేసే ఓ ప్రక్రియ పెళ్లి...వివాహం ఇద్దరు మనుషులనే కాదు, రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది. అంతుకుమునుపు పరిచయం లేని మనుషుల మధ్య ఆత్మీయతకు కారణమవుతుంది. ఎప్పుడో త్రేతా యుగంలో జరిగినట్లు  భావించే సీతారామకల్యాణమూ అంతే... భార్యభర్తల బాధ్యతలు, అత్తమామల దీవెనలు, వియ్యంకుల మర్యాదలు..అప్పగింతలు, పలకరింపులు...ఇలా ఎన్నో ఆత్మీయానురాగాలు అందులో అందంగా ప్రతిబింబిస్తాయి...అందుకే ఆ కల్యాణం లోకానికి  ఓ సంప్రదాయమైంది...మార్గదర్శనమైంది..వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టాలు  ఎప్పటికీ అపురూపాలే...

 ఆ శుభ తరుణంలో...

పెళ్లి తర్వాత ప్రేమ...

 నిజానికి శివధనుస్సును రామయ్య కావాలనో, సీతమ్మను వివాహం చేసుకోవాలనో ఎక్కుపెట్టలేదు. తన గురువైన విశ్వామిత్రుని ఆదేశం మేరకే శివధనుస్సుని ఎక్కుపెట్టాడు. ఆ తర్వాత కూడా నేరుగా సీతమ్మను స్వీకరించలేదు. తన తండ్రి దశరథుడు వచ్చి, జనకమహారాజుతో మాట్లాడి, ఇద్దరూ అంగీకరించిన తర్వాతనే సీతమ్మను వివాహం చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. అలాగని, బలవంతపు వివాహం కూడా కాదు. సీతారాములిద్దరికీ ఒకరంటే ఒకరికి వర్ణించలేనంత ప్రేమ.

 ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి ।

గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిః భూయోభివర్థత ।। (వాల్మీకి రామాయణం)

 

పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా అని రామయ్య సీతమ్మను మరింతగా ఇష్టపడ్డాడట. సీతమ్మ కూడా తన గుణగణాలతో రామయ్యకు తనపై ప్రేమ కలిగేలా చేసుకుందట. తన వెంట నడచివచ్చిన మహిళను ప్రేమగా చూసుకోవాల్సిన సందేశాన్ని రామయ్య, భర్తను అనురాగంతో, ప్రేమతో మాత్రమే తనవాడిని చేసుకోవాలనే సందేశాన్ని సీతమ్మ తమ వివాహం ద్వారా అందించారు. అందుకనే, సీతారాములు ఆదర్శ దంపతులయ్యారు. 

మరి కల్యాణం ఆ రోజెందుకు?

నిజానికి సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ మహతాం జన్మనక్షత్రే వివాహంఅంటుంది ఆగమ శాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో భక్తులు కల్యాణం చేయాలని శాస్త్ర నియమం. చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు శ్రీరాముడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా ఘనంగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఊరూవాడా సీతారాముల కల్యాణం జరుపుతారు. ఇలాగే మహాశివరాత్రి సందర్భంగా కూడా శివపార్వతులకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు.

 మిథిలా నగరం...

 ఎప్పుడూ ధీరగంభీరంగా ఉండే జనకమహారాజు భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది...

శివధనుస్సును శ్రీరాముడు విరిచేశాడంట.

మన జనక మహారాజు గారాల పట్టి సీతను ఆయనే చేపట్టబోతున్నాడు...

మా జానకేమో చందనపు తునక... మరి రాముడో...

ఆయనేమీ తక్కువ కాదు... నీలమేఘశ్యాముడంట, దశరథ మహారాజు చాలా గారాబంగా పెంచాడంట... అందంలో చంద్రుడితో పోటీ అంట...

అందుకే ఆయనను రామచంద్రుడని పిలుస్తారంట...

అంతఃపురమంతా ఇదే ముచ్చట... ఎప్పుడెప్పుడు కన్నులకు పండువ అవుతుందా అని ఎదురుచూపులు...

 మహాత్మా! నేను దశరథనందనుడి యశస్సు, వీరత్వాన్ని కళ్లారా తిలకించాను. నాకుమార్తె సీత, దశరథా¯త్మజుడైన శ్రీరాముణ్ణి వివాహమాడి మా జనక వంశానికి కీర్తి తెస్తుంది. మీరు అనుమతిస్తే నా మంత్రులు రథాలపై వాయువేగంతో అయోధ్యానగరానికి వెళతారు. ఇక్కడ జరిగింది దశరథ మహారాజుకు వివరించి, వారిని సకుటుంబ సపరివార సమేతంగా మిథిలకు తీసుకొస్తారు. అని విశ్వామిత్రుడికి విన్నవించాడు జనకుడు. విశ్వామిత్రుడు అనుమతించాడు.

 అయోధ్యలో విషయం తెలుసుకున్న కౌసల్య, సుమిత్ర, కైకేయిల సంతోషానికి పట్టపగ్గాలు లేవు. నిన్నటి దాకా మన చేతుల్లో ఆడుతున్నట్లే ఉన్నాడు ముద్దుల రాముడు... మన మురిపాల కొండ... అప్పుడే పెళ్లికొడుకవుతున్నాడు. దశరథుడు తన పరివారంతో పాటు వశిస్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు వంటి మహనీయులతో, చతురంగ బలాలలో విదేహ దేశం చేరుకున్నాడు.

 వియ్యాలవారిని అల్లంతదూరంలోనే చూసిన జనకుడు వారికి ఎదుర్కోలు పలికి, ఇతర స్వాగత సత్కారాలు చేశాడు. జరిగిన విషయమంతా చెప్పి, తన కుమార్తెను కోడలిగా స్వీకరించమని దశరథుడిని కోరతాడు.

 ప్రతిగృహో దాతృవశః శ్రుతం ఏతత్‌ మయా పురా।

యథా వక్ష్యసి ధర్మజఞ తత్‌ కరిష్యామహే వయం ।।

 అందుకు దశరథుడు అయ్యయ్యో! జనకా.. అలా అంటావేంటి. అసలు ఇచ్చేవాడంటూ ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. నీ కుమార్తెను నా కోడలిగా చేస్తానంటున్నావు. నువ్వు దాతవు. నేను పుచ్చుకునేవాడిని... అంటూ ఎంతో ఆప్యాయంగా జనకుడి ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు. తన బంధుత్వం మరింతగా దృఢపడాలంటూ వారు ఎంతో ఆప్యాయంగా పరస్పర సంభాషణ చేసుకుంటారు.

అదిగదిగో... ఆ రోజు రానేవచ్చింది...

వైశాఖ శుద్ధ దశమి ఉత్తర ఫల్గుణి నక్షత్ర శుభముహూర్తాన్ని సీతారాముల కల్యాణానికి వేదమూర్తులు నిర్ణయించారు.

 కల్యాణవేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు. నానావిధ పరిమళ పత్ర పుష్పాలతో కల్యాణమంటపం ముస్తాబైంది. మిథిలా నగరమంతా మహా సందడిగా మారింది. శ్రీరాముడికి సీతతో పాటు లక్ష్మణుడికి సీత సోదరి ఊర్మిళను, భరతుడికి జనకుడి సోదరుడైన కుశధ్వజుని పెద్దకూతురు మాండవి, శతృఘ్నుడికి కుశధ్వజుని మరోకుమార్తె శ్రుతికీర్తిని ఇచ్చి వివాహం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

అటు జనకమహారాజు కన్యాదానం చెయ్యటానికి, ఇటు దశరథుడు కన్యాదానం తీసుకోవటానికి అవసరమైన అన్ని వైదిక కార్యక్రమాలు సశాస్త్రీయంగా నిర్వహించారు. దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోవటానికి బయల్దేరి జనకుడి సభ బయట ఉండి, తన రాక గురించి మహారాజుకు కబురుచేస్తాడు. అందుకు ప్రతిగా జనకుడు దశరథుడితో మహారాజా! ఇకపై జనకుడి ఇంటికి, దశరథుడి ఇంటికి తేడా లేదు. మిమ్మల్ని అక్కడ ఎవరైనా ద్వారపాలకులు ఆపుతున్నారా? మీరు నేరుగా భవనంలోకి రండి. ఇది మీ ఇల్లే అంటూ ఆప్యాయంగా స్వాగతం పలుకుతాడు. ఎంతో ప్రేమ, ఆప్యాయత నిండిన మనస్సుతో జనకుడు చేసిన ఆహ్వానం, పలికిన పలుకులతో దశరథుడు మరింతగా పొంగిపోయాడు.

 ఆకాశమంత పందిరి కింద, భూదేవి అంత వేదిక సిద్ధంచేశారు. మంగళవాయిద్యాలు మారుమోగుతున్నాయి. వేదమంత్రాలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. సుగంధద్రవ్యాలు గుభాళిస్తున్నాయి. పన్నీటి చిలకరింపులు హాయిగొలుపుతున్నాయి.. మగపెళ్లివాళ్లంతా ఠీవీగా కూర్చున్నారు. వారికి జనక మహారాజు పరివారం వారికి నమ్రతగా, వినయ విధేయతలతో సపర్యలు చేస్తున్నారు. నలుగురు పెళ్లికుమారులు, నలుగురు పెళ్లికుమార్తెలు సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో, సీతారాములు శోభిల్లుతున్నారు.

 బంగారుమంటపంలో సీతారాములు వధూవరులుగా కూర్చున్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షుల ఆధ్వర్యంలో పురోహితులు పెళ్లిమంత్రాలు చదువుతున్నారు. ముహూర్త ఘడియలు సమీపించగానే జనకమహారాజు వేదికపైకి వచ్చి, సీతమ్మ చేతిని తన చేతితో పట్టుకుని....

 ఇయం సీతా మమసుతా సహ ధర్మచరీ తవ ।

ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణి గృహ్ణీష్వ పాణినా ।

పతివ్రతా మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా ।।

 రామయ్యా! ఇదిగో... నా కుమార్తె అయిన సీత. నీకు సహధర్మచారిణిగా స్వీకరించు. నీకు శుభాలు కలుగుతాయి. ఈమె పతివ్రతగా ఉండి, నిత్యం నిన్ను నీడలా అనుసరిస్తుంది అంటూ సీతమ్మ చేతిని రామయ్య చేతికి అందిస్తాడు. అత్తవారింట ఎలా నడుచుకోవాలో అన్ని బోధనలూ ఒక్క శ్లోకంలో చెప్పేశాడు జనకమహారాజు.

 పుట్టింటి నుంచి ఓ తండ్రి కుమార్తెగా అత్తింట అడుగుపెట్టే స్త్రీ, తన భర్తకు సహధర్మచారిణిగా ఉండాలి. అత్తింటివారికి అన్ని శుభాలు కలిగేలా ప్రవర్తించాలి. పతివ్రతగా ఉండాలి. భర్తను నీడలా అనుసరించాలి. ఇలాంటి మహోన్నతమైన జాగ్రత్తలు, సూచనలు చెబుతూ బిడ్డను అత్తవారింటికి సాగనంపాడు.

 ఆయన ఆకాశం... ఆమె పుడమి!

 రాముడు నీలమేఘశ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా భూమి నుంచి జన్మించింది. భూమి పంచభూతాల్లో ఒకటి. ఇలా, పంచభూతాల్లో మొదటిదైన భూమికి సీతమ్మ, చివరిదైన ఆకాశానికి రామయ్య సంకేతాలుగా నిలుస్తున్నారు. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది. సస్యాన్ని (పంటను) అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి, వారికి శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడైతే రామయ్య సీతమ్మకు చేరుకుంటాడో అప్పుడు లోకానికి శక్తి  వస్తుంది. ఈవిధంగా సీతారామకల్యాణం లోకకల్యాణానికి కారకంగా, ప్రకృతి పులకరింతకు ప్రతీకగా నిలుస్తుంది.

 ఇద్దరి పుట్టుక ఒకేలా...

 సీతారాములిద్దరి జన్మవృత్తాంతం విచిత్రమైందే. వీరిలో ఏ ఒక్కరూ నేరుగా తల్లి కడుపునుంచి జన్మించలేదు. సంతానం కోసం దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్ఠి ఫలితంగా లభించిన యజ్ఞపాయస ప్రసాద ఫలితంగా రాముడు కౌసల్య గర్భాన జన్మించాడు. యజ్ఞం చెయ్యటం కోసం భూమిని దున్నే ప్రయత్నంలో నాగలి చాలుకు తగిలి, భూమిని నుంచి తనకు తానుగా అయోనిజగా ఆవిర్భవించింది సీతమ్మ. ఇద్దరూ యజ్ఞప్రసాదాలే. అందుకే వారిద్దరి కల్యాణం కూడా లోక కల్యాణయజ్ఞానికి పునాదిగా నిలిచింది.

 పెళ్లి బాజాలు అలా మోగాయి...

 సీతారామకల్యాణ ఘట్టాన్ని జానపదులు రాములోరి పెళ్లిగా పిలుచుకుంటారు. కేవలం పిలుపే కాదు... వారితో చుట్టరికం కలుపుకుంటారు. సీతమ్మ మాయమ్మ.. .శ్రీరాముడు మా తండ్రివంటి గీతాలు ఇందుకు ఉదాహరణ. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు కూడా తన సంకీర్తనల్లో అనేకసార్లు సీతారామ కల్యాణఘట్టాన్ని మనసారా కీర్తించారు. రామం ఇందీవర శ్యామం పరాత్పర ధామం... సుర సార్వభౌమం భజే’; ‘అట్టె హరువిల్లు విరిచిన రాఘవా.. సిరులతో జనకుని ఇంటను జానకి జెలగి పెండ్లాడిన రాఘవా’; ‘రాముడు రాఘవుడు రవికులుడితడు... భూమిజకు పతియైన పురుష నిధానమువంటి కీర్తనలెన్నో అన్నమయ్య కలం నుంచి జాలువారి సీతారామకల్యాణ వైభోగాన్ని నేటికీ మనకు వీనులవిందుగా అందిస్తున్నాయి.

-------------------------------------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్: 9032044115


Sunday, April 4, 2021

దేవుడిని చూద్దాం... రండి (మొదటి భాగం)




ఆలయానికి ఎందుకు వెళ్ళాలి?
దేవుడిని ఎలా దర్శించుకోవాలి?
దైవ దర్శనం కోసం పాటించాల్సిన నియమాలేమిటి?

శ్రీ కనకదుర్గ ప్రభ మాస పత్రికలో
ఏప్రిల్ 2021 సంచిక నుంచి
ప్రారంభమైన ధారావాహిక
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 90320 44115 / 8897 547 548








 

Wednesday, March 3, 2021

మహాశివరాత్రి ప్రత్యేకం... పరమేశ్వర అవతార వైభవం

 

మహాశివరాత్రి ప్రత్యేక రచన
పరమేశ్వర అవతార వైభవం
పరమేశ్వరుడి రూపం అందించే సందేశం ఏమిటి? 
ఆయన ధరించిన ఆయుధాల పరమార్థం ఏమిటి?


అపురూపం... శివ రూపం

 ఆ నామమే కాదు ఆ రూపమూ అపురూపమే.

ఆ వేషంలో ఎంతో వైరుధ్యం. అంతలోనే వైవిధ్యం.

ఆయన ఆయుధాలు, ఆభరణాలన్నీ వేటికవే విభిన్నం.

ప్రతి అంశంలో ఓ సందేశం. మరెంతో పరమార్థం.

అందుకే ఆ రూపమే కాదు... ఆ భావమూ అపురూపమే.

సాకారుడైనా, నిరాకారుడైనా అంతా ఆ స్వామి చిద్విలాసమే.

     పరమేశ్వరుడు పరమ దయాళువు. ప్రకృతిలోనూ ప్రతి అణువూ ఆయన స్వరూపమే. ఆయనకు అధీనమే. కానీ ఆ స్వామి దేనికీ కట్టుబడలేదు. కనీసం కట్టుబట్టలు కూడా విలాసవంతమైనవి స్వీకరించడు. విభూది ధరిస్తాడు. గజచర్మం చుట్టుకుంటాడు. విష సర్పాలు ఆయనకు హారాలు. సగం మిగిలిన నెలవంక ఆయన తలపైన అలంకారం. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో దూకే గంగను నెత్తినపెట్టుకున్నాడు. వయసుడిగిన వృషభం వాహనం. మెడలో కపాలమాల. చేతిలో త్రిశూలం.

ఏమిటీ చిత్రవిచిత్రమైన ఆహార్యం. ఇంతకన్నా సొగసైన వస్తువులేవీ స్వామికి దొరకలేదా అంటే సమస్తమైన విశ్వమే ఆయన కనుసన్నల్లో నడుస్తుంది. ఇక ఆయనకు కానిదేది.

ఆ... ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతోంది. పైపైకి... మామూలు కళ్ళతో చూస్తే శివయ్య లీల ఓ పిచ్చి జంగమదేవర తీరు. అదే కళ్ళుమూసుకుని మనసు తెరచి చూస్తే అనంతమైన శివ వైభవం సాక్షాత్కరిస్తుంది. ఆ స్వామి ఆకారం, ఆహార్యం అన్నిటా అంతులేని ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి.

 జ్ఞానానికి స్థానం... త్రిశూలం

          శివయ్యను చూడగానే ఆయన చేతిలో త్రిశూలం తళుక్కుమని మెరుస్తూ మన కళ్ళకు కనిపిస్తుంది. ఎంతోమంది రాక్షసుల ప్రాణాలు తీసి భక్తుల ప్రాణాలు కాపాడిన మహాశక్తిమంతమైన ఆయుధం అది. శివయ్య చేతికది అలంకారం. 

          త్రిశూలం అంటే మూడు కొనలు కలిగినదని అర్థం. సాధారణ ఆయుధానికి ఉండే కొనలు కావవి. ఆ మూడు కొనలు సత్త్వ రజ స్తమో గుణాలకు ప్రతీకలు. ఆ మూడుకొనలు పిడి వద్ద కలుసుకుంటాయి. త్రిగుణాల ఏకత్వానికిది సంకేతం.

          యోగపరంగా చూస్తే త్రిశూలంలోని మూడు కోణాలు మానవశరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు సంకేతాలు. ఈ మూడు నాడులు శిరస్సులో ఉండే జ్ఞానకేంద్రం వద్ద కలుస్తాయి. ఇదే త్రివేణీ సంగమం. త్రిశూలం లోని మూడు కొనలు మూడు నాడులకు సంకేతాలైతే జ్ఞానకేంద్రం శూలహస్తాన్ని సూచిస్తుంది.  వాటి ఏకత్వాన్ని, త్రిగుణ సంగమాన్ని ప్రకటిస్తుంది.

          త్రిశూలంలోని మూడుకొనలు త్రిగుణాలకు ప్రతీకలైతే వాటి ఏకత్వాన్ని ప్రకటించే చోటును పట్టుకున్న పరమేశ్వరుడు నేనీ త్రిగుణాలకు అతీతుడను అనే సత్యాన్ని ప్రకటిస్తాడు. అంతేకాదు.. భూత భవిష్యత్ వర్తమానాలనే త్రికాలాలకు, జాగృత్ స్వప్న సుషుప్తులనే త్రిస్థితులకు తానే అధిదేవతను అనే సత్యాన్ని కూడా త్రిశూలం తెలియజేస్తుంది. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలను త్రిశూలం పోగొడుతుంది. మరొక అర్థంలో త్రిశూలంలోని మూడు కోణాలు కోరిక, చర్య , జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి. ఇవే ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు.

          త్రిశూలానికి సంబంధించి ఆసక్తికరమైన పురాణగాథలూ ఎన్నో ఉన్నాయి. ఒకానొక సందర్భంలో శివుడు కాశీ పట్టణాన్ని తన త్రిశూలంతో ఎత్తి పట్టుకుంటాడు. మొత్తం ప్రపంచం నాశనమైనా, ప్రళయం వచ్చినా కాశీకి ఎటువంటి ఆపదా కలగదని వరమిచ్చాడు.

          అంధకాసురుడిని సంహరించే సమయంలోనూ త్రిశూలానిదే ప్రధాన పాత్ర. శివుడు రాక్షసుడిని సంహరించకుండా త్రిశూలానికి గుచ్చి ఉంచాడు.  త్రిశూలానికి వేలాడుతున్న అంధకుడికి జ్ఞానోదయమైంది. శివయ్య అతడిని క్షమించి తన ప్రమథగణాల్లో చేర్చుకున్నాడు.

హస్తసాముద్రికంలోనూ త్రిశూలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అరచేతిలో త్రిశూలం గుర్తు ఉన్న వ్యక్తులు పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా పొందుతారు. శుక్రస్థానంలో త్రిశూలం గుర్తున్న వ్యక్తులు సానుకూల దృక్పథంతో ఉంటారు. అంగారక స్థానంలో ఉంటే వ్యక్తులు విజయాలు సాధిస్తారు. చంద్రస్థానంలో త్రిశూలం గుర్తున్న వ్యక్తులు శక్తివంతమైన ఊహలు, సృజనాత్మక ఆలోచనలు కలిగిఉంటారు. ఇలా మరెన్నో స్థానఫలితాలను హస్తసాముద్రిక శాస్త్రం చెబుతుంది.

 అక్షరాలకు ఊపిరిపోసిన డమరుకం

          శివయ్య చేతిలోని డమరుకం కేవలం వాద్యమే కాదు. తత్త్వచింతనకు అదొక వేదిక. అంతేకాదు... మనం రాసుకుంటున్న అక్షరాలకు శివయ్య చేతిలోని డమరుకమే ఉత్పత్తి స్థానం. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన ఘటన ఒకటుంది.

          ఒకప్పుడు పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో తాండవం చేస్తున్నాడు.

నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్‌ ఏతత్‌ విమర్శే శివసూత్ర జాలం

          తాను చేస్తున్న తాండవ నృత్యం చివరలో శివుడు తన డమరుకాన్ని మోగించాడు. ఆ సమయంలో 14 రకాలైన ధ్వనులు వెలువడ్డాయి.  సనకాది మహర్షులు వీటిని గ్రహించారు. ఈవిధంగానే భాషాశాస్త్రం ఆవిర్భవించిందని ఈ శ్లోకానికి భావం.

నర్తనం చివరిలో చేసిన డమరుకపు పధ్నాలుగు దరువుల సహాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకూ బీజం నాటాడు. ఆ పధ్నాలుగు సూత్రాలను పాణిని కంఠస్తం చేసికొని ‘అష్టాధ్యాయి’ అనే ప్రాథమిక వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఇందులో ఎనిమిది అధ్యాయాలు ఉండటం వల్ల ఈ గ్రంథం ‘అష్టాధ్యాయి’గా ప్రసిద్ధి పొందింది. ఈ 14 సూత్రాలనే మాహేశ్వర సూత్రాలు అంటారు. నటరాజు డమరుక దరువుల నుండి ఉద్భవించిన మహేశ్వరసూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికీ, వ్యాకరణానికీ సంబంధం ఇదే. అందుచేతనే శివాలయాలలో వ్యాకరణమంటపాలుంటాయి.

విఖ్యాత శైవకవి పాల్కురికి సోమనాథుడు రాసిన అక్షరాకం పద్యాల్లోనూ శివ డమరుక వైభవం ఎంతగానో ప్రకటితమవుతుంది. కొన్ని పద్యాలైతే పూర్తిగా డమరుక నాద విశేషాలతో నిండి ఉంటాయి.

 

డమరుగజాత డండడమృడండమృడండ మృడండ మృండమృం

డమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం

డమృణ మృడండడంకృతివిడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ

త్ర్పమథన తాండవాటన "డ"కారనుతా బసవేశ పాహిమాం !

 

ఓ బసవేశ్వరుడా ! నువ్వు తాండవ నృత్యము చేసే సమయంలో నీ డమరుకం నుండి డండడ మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడండమృం డమృం మొదలగు ధ్వనులు పుడుతున్నాయి. ఆ ధ్వనులతో పుట్టిన డమరుక కాంతులలో లోకాలు వెలుగుతున్నాయి. అటువంటి అద్భుతమైన డమరుక ధ్వనులు కలిగిన లోకాలను చిలుకు తాండవ నాట్యమునందు సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !నన్నురక్షించు అని ఈ పద్యానికి భావం.

డమరుకం వాయించటానికి ముందుగా డమరుకం మధ్యలో ఒక కొయ్యముక్క కడతారు. దానిని మణి అంటారు. డమరుకాన్ని కదలించినపుడు మణి డమరుకానికి అటు ఇటు తగలటం ద్వారా డమరుక శబ్దం ఉత్పత్తి అవుతుంది.  ఆ శబ్దం అంతులేని ఆనందాన్న కలిగిస్తుంది.

ఆకాశంలో శబ్ద గుణకాలు ప్రయాణిస్తాయి. మనం ఏదైనా మంత్రాన్ని జపం చేస్తున్నట్లయితే లేదా స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నా వాటి నుంచి ఏర్పడే శబ్ద ప్రకంపనలు తరంగాలు మారి ఆకాశానికి చేరుకుంటాయి. అనంతాకాశంలో సంచారం చేసే శివ డమరుక ధ్వనులతో అవి సంయోగం చెందుతాయి. ఆవిధంగా సాధకుడికి పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. 

కాలరేఖ చంద్రరేఖ

శివయ్య సిగ మీద నెలవంక వెన్నెల వెలుగులీనుతూ కనిపిస్తుంది. అలా అర్థచంద్రుడిని ధరించటమే శివయ్య ఔదార్యాన్ని ప్రకటిస్తుంది.  దక్షప్రజాపతి అల్లుడైన చంద్రుడు తన 27 మంది భార్యల్లోనూ రోహిణి అంటేనే ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇది సహించలేని ఇతర భార్యలు తండ్రి అయిన దక్షుడికి ఫిర్యాదు చేయటంతో ఆయన కోపంతో అల్లుడైన చంద్రుడిని శపిస్తాడు. ఆ శాపం పోగొట్టుకునే క్రమంలో శివుడి అనుగ్రహం పొందిన చంద్రుడు శివుడి సిగ మీద అలంకారంగా నిలిచాడు. అప్పటి నుంచి శివుడు చంద్రశేఖరుడయ్యాడు.

పరమేశ్వరుడి జటాజూటంలో చంద్రరేఖ ఉండటం శివుడు కాలస్వరూపుడనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. కాలాన్ని గణించే పద్ధతుల్లో చాంద్రమానానికి ప్రాశస్త్యం ఎక్కువ. అటువంటి కాలగణనకు ప్రధానమైన చంద్రుడు శివుడి అధీనంలో ఉన్నాడు. అంటే శివుడు కాలాధిష్ఠాన దైవం అని గ్రహించాలి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మన: కారకుడు. మనిషి సుఖ సంతోషాలన్నీ జాతకచక్రంలో చంద్రుడి సంచారం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి చంద్రుడు శివుడి అధీనంలో ఉన్నాడు. కాబట్టి శివారాధకులకు అయాచితంగా చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఫలితంగా చక్కని మనోస్థైర్యం కలుగుతుంది. చక్కటి మనస్సు ధర్మకార్యాల మీద నిమగ్నమవుతుంది. అంతిమంగా దైవపదం చేరుకునేందుకు ఇదే పునాదిగా నిలుస్తుంది. 

నాగేంద్ర హారాయ...

          శివయ్యను చూడగానే ఆయన మెడలో ఆభరణంగా వెలుగుతున్న పాము కనిపిస్తుంది. నిజానికది పాము కాదు. పాముల్లో శ్రేష్ఠమైన జాతికి చెందిన సర్పం.  వాసుకి అనే సర్పరాజు తపస్సు చేసి శివుడిని మెప్పించి ఆయనకు కంఠహారంగా మారతాడు.

          పరమేశ్వరుని మెడలో నాగాభరణమై వున్న మహాసర్పం వాసుకి. అన్ని వేళలా స్వామి సేవలో ఆ నాగరాజు తరిస్తాడు.కశ్యప ప్రజాపతికి గల 14 పత్నుల్లో   వినత, కద్రువలు ఇద్దరు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు ఇద్దరు కుమారులు. వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు వెయ్యిమంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాలసముద్రం సమీపంలోని ఉచ్చైశ్రవాన్ని(గుర్రం) దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా వుందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే వుంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా వుంటే అక్క తన దగ్గర వేయి సంవత్సరాలు పరిచారికగా వుండాలని ఒక వేళ తోక తెల్లగానే వుంటే తానే వినత దగ్గర వేయి సంవత్సరాలు బానిసగా వుంటానని కద్రువ పందెం కాస్తుంది.

ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్లిపోతారు. గుర్రం తోక తెల్లగానే వుంది ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో కద్రువ వుంటుంది. హఠాత్తుగా ఆమెకో ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా వున్న వారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వాదిస్తారు. వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని  శపిస్తుంది.

శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. అనంతరం ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు. తల్లి మాట అంగీకరించని ఆదిశేషువు శ్రీమహావిష్ణువు కోసం ఘోరతపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది. రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకికి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకికి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆ నాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడ యందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణడు అని కూడా పిలుస్తాము.

          శివయ్య సర్పాల్ని ధరించటం వెనుక ఎంతో సందేశం దాగి ఉంది. పాములు నిరంతర జాగరూకతకు ప్రతీకలు. శివారాధకులు కూడా అంత జాగరూకతతో ఉండాలనే సందేశం ఇందులో దాగుంది. అత్యంత భయంకరమైన సర్పాలు కూడా శివయ్య స్పర్శ తగలగానే సునమస్కులుగా మారిపోతాయి. భయంకరమైన విష సర్పాల వల్ల కలిగే భయం శివారాధన వల్ల తొలగిపోతుంది. సర్పాల్ని ధరించటం ద్వారా తన భక్తులకు సర్పభయం లేకుండా చేస్తానన్నది శివుడు ఇచ్చే అభయం.

          శివయ్య మెడలో మూడుచుట్టలు తిరిగి ఉండే సర్పం కాలచక్రానికి సంకేతం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలే ఈ మూడు చుట్టలు. ఈ మూడు కాలాలతోటే సమస్తమైన ప్రపంచ చర్య జరుగుతుంటుంది.  పాము ఆకారం కుండలిని శక్తిని పోలి ఉంటుంది. పాము గర్వానికి సూచిక. తన గర్వాన్ని ఎవరైతే గెలుస్తారో వారికి తాను ఆభరణంగా నిలుస్తానని చెప్పటం శివయ్య సర్పాభరణాలు ధరించటం వెనుక ఉండే సందేశాల్లో ఒకటిగా గుర్తించాలి.

 త్రిలోచనాయ...

          శివయ్యను చూడగానే అందరినీ ఆకర్షించేది ఆయన నుదిటిన ఉన్న నేత్రం.  నుదుటి భాగంలో నేత్రాన్ని ఉంచుకున్న కారణంగా శివయ్య త్రినేత్రుడయ్యాడు. సాధారణ భాషలో మూడో కన్ను అంటారు.

          ఈ త్రినేత్రం సాధారణ నేత్రం మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ఇతర కళ్ళ మాదిరిగా చూడటానికి ఉపయోగించే నేత్రం కాదు. ఇది జ్ఞాన నేత్రం.  సకల ద్వంద్వాలకు అతీతమైన స్థితిని ఈ నేత్రం ప్రకటిస్తుంది.  ఇది ఆజ్ఞాచక్రానికి స్థానం.

          శివుడు మూడోకన్ను తెరిస్తే అంతా భస్మమే అంటారు.  పార్వతీ కల్యాణం విషయంలో మన్మథుడు చేసిన పనికి కోపించిన శివుడు మూడోకన్ను తెరుస్తాడు. క్షణంలో బూడిద కుప్పగా మారిపోతాడు మన్మథుడు. ఇంతటి శక్తి మూడోనేత్రానికి ఉంది. ఇక్కడ కాలిపోయింది మన్మథుడనే వ్యక్తి కాదు తీవ్రమైన కామం అనే అరిషడ్వర్గంలోని ఓ శత్రువు. ఎప్పుడైతే మనలోని అజ్ఞానం దహనమవుతుందో అప్పుడు మిగిలేది జ్ఞానమే. అటువంటి జ్ఞాననేత్రాలకు మాత్రమే పరమేశ్వరుడి దర్శనం పొందే యోగ్యత కలుగుతుంది.

 నందివాహనం

          శివయ్య వాహనం నంది. కేవలం వాహనం మాత్రమే కాదు... భక్తులకు శివయ్యకు మధ్య వారిధి కూడా బసవయ్యే. ఆలయానికి వచ్చిన భక్తులు నంది కొమ్ముల ద్వారా శివలింగ దర్శనం చేసుకుంటారు.

          నంది ధర్మానికి ప్రతీక. శివుడు ఎక్కడ కొలువుంటాడే అక్కడ నంది ఉంటాడు. నంది లేని శివాలయం ఉండదు. అంటే శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం కొలువై ఉంటుందని అర్థం.

          నంది పశుజాతికి చెందింది. పశువు అంటే పాశంతో కట్టబడిందని అర్థం. మనమందరూ పశువులమే. వివిధ రకాలైన పాశాలతో కట్టబడి ఉంటాం. ఈ పాశాలన్నీ తొలగిపోతేనే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఇది జరగాలంటే నంది మాదిరిగా నిరంతరం శివసాన్నిధ్యంలో గడపాలి. అంటే తనువు, మనసు శివమయం కావాలి. నంది అందించే సందేశం ఇదే.

(శ్రీశైలప్రభ మాసపత్రిక మార్చి 2021 సంచికలో ప్రచురితమైన వ్యాసం)

--------------------------

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ నంబరు : 90320 44115 / 8897 547 548

--------------------------











Monday, February 15, 2021

వసంత పంచమి ప్రత్యేకం ...సరస్వతీ దేవి అందించే సందేశం ఇదే...

వసంత పంచమి ప్రత్యేకం
సరస్వతీ దేవి అందించే సందేశం ఇదే...




 

వీణాపాణి వేద వాణి!
మాఘ శుద్ధ పంచమి  వసంత పంచమి

 

ఆమె అక్షరం... ఆమె అక్షయం... ఆమె గీర్వాణి... ఆమె సకల శాస్త్రాలకూ రారాణి

ఆమె జ్ఞానం.. ఆమె సర్వవిద్యలకూ మూలం...

వాల్మీకి నోట ఆది కావ్యాన్ని పలికించిన తల్లి ఆమె.

వ్యాసభగవానుడి చేత ఆపార సాహిత్యాన్ని రాయించిందీ ఆ తల్లే.

యాజ్ఞవల్క్యుడు, ఆదిశంకరులు, ఆదిశేషువు, బృహస్పతి అందరూ ఆమె అనుగ్రహంతోనే అనంతమైన జ్ఞానాన్ని వరప్రసాదంగా అందుకున్నారు.

ఆ తల్లి సరస్వతి... మనలోని విజ్ఞానానికి మాతృమూర్తి. ఆమె ఆవిర్భవించిన రోజు వసంతపంచమి.

 

మాఘమాసం ప్రకృతి వికాసానికి, సరస్వతి మనోవికాసానికి సంకేతం. ఈ రెండింటి కలయిక పరిపూర్ణ వికాసానికి నిదర్శనం. దీనికి ప్రతీకగా వసంత పంచమి వ్యాప్తిలోకి వచ్చింది. మనిషిలో ఉండే అవిద్య లేదా అజ్ఞానం తొలగిపోయి ఎప్పుడు జ్ఞానం అనే వెలుగురేఖ ప్రసారమవుతుందో ఆ రోజు మనిషి వికాసానికి ప్రారంభసూచిక అవుతుంది. అజ్ఞానం అనే మంచుతో గడ్డకట్టిన మనిషి హృదయాన్ని చదువు అనే వేడితో కరిగించి జ్ఞానం అనే వెలుగును ప్రసరింపజేయటమే వసంత పంచమి అంత‌రార్థం. మాఘమాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమిని వసంత పంచమిగా చేసుకుంటాం. ఈ రోజుకే శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి.

 * చైత్ర, వైశాఖమాసాల్లో వచ్చే వసంత రుతువుకు స్వాగతోపచారాలు మాఘమాసంలోనే మొదలవుతాయి. కాలగమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మకర సంక్రమణం (సంక్రాంతి) తర్వాత వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మాఘమాసం ప్రారంభం కావడంతోనే చెట్లు చిగురించడం, పూలు పూయడం మొదలవుతుంది. చలి, ఎండల మిశ్రమ వాతావరణం ప్రజలకు ఎంతో హాయి కలిగిస్తుంది. పంటలు నిండుగా చేతికి వచ్చి ఉంటాయి. పాడి పశువులకు పుష్కలంగా గ్రాసం లభిస్తుంది. దీంతో అవి సమృద్ధిగా పాలనిస్తాయి. గ్రహగమనాలన్నీ శుభస్థానాల్లో జరుగుతాయి. వివాహాది శుభకార్యాల సందడి మొదలవుతుంది. మొత్తంగా మానవజీవితానికి అత్యంత ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే కాలం ప్రారంభమవుతుంది. ఇదంతా రాబోయే వసంతమాసానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉండి వసంత సందడి ముందుగానే వచ్చిన అనుభూతి కలిగిస్తుంది.

 * పురాణ, ఇతిహాసపరంగా కూడా వసంత పంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బ్రహ్మవైవర్త పురాణం, కృత్యసార సముచ్చయం, హేమాద్రి గ్రంథాల్లో ఇందుకు సంబంధించిన అనేక విషయాలు వివరణాత్మకంగా ఉన్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రాచీన రోమన్లు వసంతపంచమి ఉత్సవాన్ని జరిపేవారని తెలుస్తోంది. గ్రీకులు జ్ఞానదేవతగా భావించి ఈ రోజున సరస్వతీదేవికి పూజలు చేసేవారు.

 * ఈ రోజును రతికామ దమనోత్సవంగా జరుపుకునే ఆచారం కొన్నిచోట్ల ఉంది. పంచమినాడు రతీదేవి కామదేవ పూజచేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. రుతువుల రాజు అయిన వసంతుడికి, కామదేవుడికి మధ్య ఎంతో సఖ్యత ఉంది. వసంతుడు సస్యదేవత. కాముడు ప్రేమదేవత. రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురి కలయిక... అంటే, ప్రకృతి ద్వారా లభించే అమితమైన జీవనోపాధి మనుషుల మధ్య ప్రేమానురాగాల్ని కలిగిస్తుంది. ఏ ప్రాంతమైతే పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుందో అక్కడి మనుషులు ప్రేమానురాగాలతో సుఖంగా ఉంటారనేది ఇందులో అంతరార్థం.

 * ఈరోజును బెంగాల్‌లో శ్రీపంచమిగా మూడురోజుల పాటు ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్తరభారతంలో ఈ రోజున ఉదయం నుంచే సరస్వతీదేవిని పూజించి, సాయంకాలం ఆ ప్రతిమకు ఊరేగింపు జరిపి, నిమజ్జనం చేసే ఆచారం కొనసాగుతోంది. వసంతరుతువుకు స్వాగతం పలికే రోజు వసంత పంచమి అని, ఇది రుతువులకు సంబంధించిన పండుగ అని శాస్త్రాలు చెబుతున్నాయి. పంజాబ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో ఈ రోజున పతంగుల పండుగ చేసుకుంటారు. వేదవ్యాస మహర్షి గోదావరీ నదీతీరంలో ఇసుకతో సరస్వతీదేవిని ప్రతిష్ఠించి, అర్చన చేశాడు. వ్యాసుడి కారణంగా ఏర్పడిన ఆ క్షేత్రమే వ్యాసరలేదా వ్యాసపురికాలక్రమంలో బాసరగా ప్రసిద్ధి పొందింది.

  శ్వేతరూపం... జ్ఞానదీపం

 * సరః అంటే కాంతి. కాంతి అంటే జ్ఞానం. మన జీవితాన్ని జ్ఞానంతో నింపే మాతృశక్తి సరస్వతి. శుద్ధ జ్ఞానానికి ఆమె ప్రతీక. వికాసం, విజ్ఞానాలకు ఆమె ఆకృతి. అక్షర అక్షయ సంపదలకు మూలమైన ప్రణవ స్వరూపిణి ఆమె. వేదజ్ఞానానికి మాతృకగా, గాయత్రిగా, సావిత్రిగా, లౌకిక, అలౌకిక విద్యల ప్రదాతగా ఆమె పూజలందుకుంటోంది.

* సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం అంటే నిరంతరం సాగిపోయే చైతన్యం. సాధారణంగా జలం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. జలం జీవశక్తికి సంకేతం. దాన్నుంచే అన్ని జీవులకూ  శక్తి అందుతోంది. తద్వారా ప్రకృతిలో ఉత్పాదకత జరుగుతోంది. ఈ ఉత్పాదకతకు ప్రతిఫలమే సరస్వతి (జ్ఞానం). సృష్టి కార్యాన్ని నిర్వహించే  బ్రహ్మదేవుడికి కూడా అందుకు తగిన జ్ఞానాన్ని సరస్వతి అందిస్తుంది.

 * సరస్వతీ అవతారం అహింసకు కూడా తార్కాణంగా కనిపిస్తుంది. తెల్లటి వస్త్రాలు, తెల్లటి పువ్వులు, తెల్లటి ముత్యాల సరం, గంధపు పూత ఇవన్నీ గీర్వాణికి ఇష్టమైనవి. ఇవన్నీ శాంతికి, స్వచ్ఛతకు చిహ్నాలు. ఏవిధమైన ఆయుధాలూ ఆమె చేతిలో ఉండవు. మనలో ఉన్న అజ్ఞానమనే రాక్షసుడిని సంహరించే విజ్ఞానమనే ఆయుధాన్ని అందించే పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట హింసకుఅశాంతికి తావుండదు కదా. ఇంకో ఉపమానంలో తెలుపు శుభ్రతకు, నిర్మలత్వానికి, స్వచ్ఛతకు ప్రతీక. ఈ ప్రకారం సరస్వతి స్వచ్ఛతకు ఆలంబనగా నిలుస్తుంది. అన్నిరకాలైన విద్యలు సరస్వతీదేవి అనుగ్రహంతో లభిస్తాయి. అంటే, విద్య ద్వారా మనిషి స్వచ్ఛంగా తయారై, నిర్మలహృదయంతో ప్రకాశిస్తాడని అర్థం చేసుకోవచ్చు.

 * నదుల పరంగా చూస్తే గంగ, యమునలతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది.  ఈ కోణంలో చూస్తే జ్ఞానం మనిషిలో అంతర్లీనంగా ప్రవహించాలే కానీ బాహ్యప్రదర్శనల కోసం విజ్ఞానాన్ని ప్రకటించకూడదనే సందేశాన్ని సరస్వతీ నది ద్వారా మనకు అందుతుంది.

 బౌద్ధమతం వ్యాప్తిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో సరస్వతీదేవిని మంజుశ్రీ, మహాసరస్వతి, వజ్రసరస్వతి, ఆర్య వజ్రసరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్రశారద వంటి పేర్లతో ఆరాధిస్తారు. జైనులు కూడా శృతదేవత, షోడశవిద్యాదేవతగా పూజలు చేస్తారు. 

 రుగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త, పద్మపురాణాల్లో సరస్వతీదేవి వర్ణన విస్తారంగా ఉంది. వీటిప్రకారం సరస్వతీదేవి తెల్లటి వస్త్రాలు ధరించి, హంసవాహనాన్ని అధిరోహించి ఉంటుంది. చేతుల్లో వీణ, రుద్రాక్షమాల, పుస్తకం ధరించి ఉంటుంది.

 * సరస్వతీదేవి చేతిలో ఉన్న పుస్తకం జ్ఞానానికి సంకేతం. పుస్తకం ద్వారా జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం మనిషిలో తీర్చిదిద్దిన సంపూర్ణ వ్యక్తిత్వానికి, హృదయ నిర్మలత్వానికి ప్రతీక. సంహరించాల్సింది వ్యక్తిని కాదు... అతడిలోని రాక్షస గుణాన్ని మాత్రమే అనే సంకేతాన్ని సరస్వతి చేతిలోని పుస్తకం ద్వారా అందుతుంది.

 * అమ్మ చేతిలో వీణ సంగీతానికి ప్రతిరూపం. ఈ వీణ పేరు కచ్ఛపి’. చదువంటే కేవలం పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు.  కళలన్నీ చదువులో భాగమే. కళాకారుడు అత్యుత్తమ సంస్కారం, ఆత్మీయత కలిగి ఉంటాడు. మనుషులందరూ ఇలాంటివారు కావాలని సరస్వతి చేతిలోని వీణ చెబుతుంది. అందులో ఏడుతంత్రులు ఉంటాయి. వీటిద్వారా నాదం ఉత్పత్తి అవుతుంది. మనం చూసే ప్రపంచమంతా నాదమయం. పరమేశ్వరుడు నాదస్వరూపుడు. కాబట్టి, పరమేశ్వరుడిని చేరుకోవాలంటే నాదోపాసన చెయ్యాలన్న సందేశం కూడా సరస్వతీదేవి చేతిలోని వీణ చెబుతుంది.

 * ఆమె వాహనం హంస. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే స్వీకరించే గుణం హంసకు ఉంది. సమాజంలో మంచి, చెడూ పాలూనీళ్లలా కలిసే ఉంటాయి. ఉత్తమ జ్ఞానం కలిగిన వ్యక్తి హంసలాగా చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలని చెప్పటం హంసవాహనం ఇచ్చే సందేశం.

 * కమలం వికాసానికి, పవిత్రతకూ చిహ్నం. కమలం పుట్టుక బురదలోనే. కానీ, బురద వాసన, అపవిత్రత దానికి సోకవు. అందుకే అమ్మకు కమలం ఆసనమైంది. అలాగే మనిషి కూడా అనేక అపవిత్రాలు  ఉండే సమాజంలో ఉంటూనే తన పవిత్రతను కాపాడుకోవాలి. మనోవికాసాన్ని సాధించాలనే సందేశాన్ని కమలం అందిస్తుంది. మన శరీరంలో ఉండే కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు అందుకు ప్రతీకగా కూడా కమలాన్ని యోగసాధకులు చెబుతారు.

 * సరస్వతీదేవి ధరించే ధవళవస్త్రాలు స్వచ్ఛతకు చిహ్నం. మనిషి కూడా స్వచ్ఛంగా ఉండాలని ఇవి సూచిస్తాయి. తెలుపు వస్త్రం ఏ చిన్న రంగు పడినా అది సహజత్వాన్ని కోల్పోతుంది. చూడటానికి ఇంపుగా ఉండదు. మనిషి కూడా అంతే. ఏ చిన్న అపవాదు వచ్చినా, తప్పు చేసినా ఆ ఫలితం అతడి జీవితాంతం వెన్నంటి ఉంటుంది. అందుకే, ఏ తప్పూ చెయ్యకుండా స్వచ్ఛంగా, తెల్లటి వస్త్రంలా ఉండాలని ధవళ వస్త్రాలు సూచిస్తాయి.

 * ఆమె చేతిలోని రుద్రాక్షమాల ఆత్మచైతన్యాన్ని సూచిస్తుంది. కేవలం భౌతికం, లౌకికమైన విద్య మాత్రమే మనిషిని భగవంతుడి వద్దకు చేర్చలేదు. అతడు ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం. ఆత్మసాక్షాత్కారం పొందటానికి రుద్రాక్ష మార్గం చూపుతుంది. రుద్రాక్షను రుషులు భూమికి, స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు.

 

రచన - డా. కప్పగంతు రామకృష్ణ, సెల్ : 90320 44115 / 8897 547 548

 

 


పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...