Friday, February 7, 2025

మాఘ పూర్ణిమ విశేషాలు.... సముద్ర స్నానం ఎందుకు చెయ్యాలి?

 


వేయి పుణ్యాల పూర్ణిమ

                వెండి వెలుగుల పందిరి మాఘపౌర్ణమి. చిమ్మ చీకటికి చంద్రుడు వెన్నెల వెలుతురుల తోరణాలు కడతాడు. అందుకే పౌర్ణమి నాటి రేయి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మన మనసులను ఆనందపరవశులను చేస్తుంది. మాఘమాసంలో వచ్చే పున్నమినాడు చంద్రుడు పదహారు కళలతో వెలుగులీనుతాడు. మాఘమాసంలో వచ్చే పౌర్ణమినే మహామాఘం అనే పేరుతో పండుగలా పాటిస్తారు.

                చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. మఘంఅంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది.

 

పవిత్రం... మాఘస్నానం

 

                న సమం భవితా కించిత్తేజః సౌరేణ తేజసా ।

                తద్వత్‌ స్నానేన మాఘస్య నా సమాః క్రతుజాః క్రియాః ॥

 

                సూర్యుని తేజస్సుకు సాటి వచ్చే కాంతి మరొకటి లేనట్టే, మాఘ స్నానానికి సాటి వచ్చే క్రతువు గాని, క్రియ గాని మరొకటి లేదు.

                పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మఘంఅంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.మాఘమాసంలో ప్రత్యూషకాలంలో చేసే స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మాండ, నారదాది పురాణాలు మాఘస్నాన విశేషాలను వివరిస్తున్నాయి. మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుర్దాయంతో పాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మపురాణంలో ఉంది. మృకండు, మనస్విల మాఘస్నాన ఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువుని తొలగించిందని పురాణ కథనం.

                ఏదైనా కారణం వల్ల మాఘస్నానం చేయలేకపోతే కనీసం స్నానం చేసిన వారిని దర్శించి, వారిని దక్షిణతాంబూలాదులు ఇచ్చి సత్కరించి, నమస్కరించినా పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సమత్రకంగా, సంకల్పం చెప్పుకుని చేసేదే మాఘస్నానం. నిత్యవిధిగా చేసే స్నానం మాఘస్నానం కాదు. సంకల్పం చెప్పుకుని శాస్త్రవిధానం పాటిస్తూ చేసే స్నానమే మాఘస్నానం అవుతుంది.

                మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం సంకల్ప ప్రకారం చేసే నదీ స్నానం అనంతకోటి ఫలితాన్నిస్తుంది. కనీసం గృహస్నానం చేసినా ఆరు సంవత్సరాలు అఘమర్షణస్నానం చేసిన ఫలితం వస్తుంది. బావినీటి స్నానం 12 సంవత్సరాల ఫలాన్ని, తటాకస్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్రగుణం, త్రివేణీ సంగమస్నానం నదీశతగుణ ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

                దు:ఖ దారిద్య్ర నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ

                ప్రాత: స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం

                మకరస్థే రవౌ మాఘ గోవిందాచ్యుత మాధవ

                స్నాననేనానే నమోదేవ యధోక్త ఫలదోభవ ॥ 

                అనే శ్లోకం పఠిస్తూ, ప్రయాగను స్మరించుకుంటూ మాఘస్నానం చేయాలి. అనంతరం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఏదైనా ఆలయానికి వెళ్ళి, దీపారాధన చేయాలి. ఈమాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపారాధన చేస్తే ఎంతో మంచిది.

                నీటికి ఉన్న శక్తి అమేయమైంది. స్నాన, ఆచమన మార్గాల్లో జలశక్తి మానవునికి అందుతుందని వేదవాక్కు. స్నానం దేహాన్ని శుద్ధి చేయడంతో పాటు మనలోని ప్రకోపాలను తగ్గించి, స్థిరత్వాన్ని కలిగిస్తుంది. అందుకే స్నానాన్ని నిత్యవిధిగా పెద్దలు ప్రకటించారు. స్నానం ` ‘నిత్య స్నానం, నైమిత్తిక స్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంజనస్నానం, క్రియాస్నానంఅని ఆరువిధాలు. వీటిల్లో వైశాఖ, కార్తిక, మాఘ మాసాల్లో చేసే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలు కామ్యస్నానాలు.

                సూర్యుడు చరించే రాశిని బట్టి ప్రత్యూషకాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే లోహిత, అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక వైజ్ఞానికులు కూడా జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి  పూర్వం చేసే స్నానం శ్రేష్ఠమైనదని, ఎంతో ఆరోగ్యకరమైందని చెబుతున్నారు. ఈ కోణంలో చూసినా మాఘస్నానం ఎంతో ఆరోగ్యకారకం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు.

సముద్రస్నానం ఎందుకు చేయాలి?

                ‘‘నదీనాం సాగరో గతి:’’ - సకల నదీ నదాలు తమ ప్రవాహం పూర్తి చేసుకుని చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక, సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్ర పరిమాణం తగ్గదు. అలాగే, ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. అలాగే, ఎన్ని ఆటుపోటులు ఎదురైనప్పటికీ మనిషి స్థిరత్వాన్ని కోల్పోకూడదు. సాగర స్నానం అందించే సందేశం ఇదే.

                సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా ‘‘ఆషాఢ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ’’లలో చేయాలని, ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి, కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి.

                నీటిలో విద్యుచ్ఛక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ, ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ / సాగర స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు. సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్ఛక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔషధీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుతశక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు.

                మరి ‘‘నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి’’ అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర, నదీజలాలలో నిక్షిప్తమైన సౌరశక్తి, సోమశక్తులు, ఈ నాబి óనుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా, ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో ‘‘మాఘ పూర్ణిమ’’ స్నానం ముఖ్యమైనది.

                మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. సముద్రం, నదులు అందుబాటులో లేని పరిస్థితిలో బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ ‘‘గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి’’ నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి, కర్రలా తేలినా ఫలితం శూన్యం.

                మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానం చేసినా ఆరు సంవత్సరాల పాటు అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని శాస్త్ర వచనం. బావినీటి స్నానం పన్నెండేళ్ళ పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయి. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుంది.

                స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. వైష్ణవ, శివాలయానికి గానీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. దీని వల్ల జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశిస్తాయి.

                మహామాఘి పర్వం సందర్భంగా శ్రీకాకుళంజిల్లా నుంచి నెల్లూరుజిల్లా వరకు ఉన్న సముద్రతీరాలన్నింటా మాఘస్నానాలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నదీస్నానాలు అనేక పుణ్యక్షేత్రాలలో జరుగుతాయి. మీదు మిక్కిలి దేవాలయాలు, తీర్థాలుగా పేర్గాంచిన సముద్రతీరాలలో మరింత వైభవంగా ఉంటుంది. విశాఖ, గుంటూరు జిల్లా బాపట్ల, సూర్యలంక, నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం బీచ్‌లలో పెద్దసంఖ్యలో ప్రజలు మాఘస్నానాలు ఆచరిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గోదావరినదీపాయ సముద్రంలో సంగమించే స్థలం. కృష్ణాజిల్లా హంసలదీవి వద్ద కృష్ణానదీ సాగర సంగమస్థలి. ఇటువంటి నదీసాగర సంగమ స్థలిలో చేసే మాఘస్నానాలను సింధూస్నానాలని కూడా అంటారు. తెలంగాణ పవిత్ర నదీ తీర ఆలయాలలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో, గోదావరీ నదీతీర బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో మాఘస్నానాలు విశేషంగా జరుగుతాయి.

-----------------------------------------------


రచన: డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ,అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కె.బి.ఎన్‌ కళాశాల,కొత్తపేట, విజయవాడ-1

 

 


Saturday, January 11, 2025

కోనసీమలో సంక్రాంతి సంబరాలు

 

 

 

సంక్రాంతి జిలుగులు... ప్రభల తీర్థాలు

 

తెలుగువారికి అతి పెద్ద పండుగ, అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. మూడురోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతి రోజుకూ ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు రోజుల పండుగను ఎంతో వైవిధ్యంగా జరుపుకుంటారు. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు కలగలిసిన ఈ వేడుకలు చూడముచ్చటగా ఉంటాయి. అంతేకాదు... తరతరాల తెలుగు వారి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతంలో జరిగే సంక్రాంతి పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రభల తీర్థం ఒకటి. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న కోనసీమకు సంక్రాంతి తెచ్చే సందడే వేరు. సంక్రాంతికి కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది. ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచులా కురుస్తుంది. అదొక అక్షరానికందని వర్ణనాతీత అనుభూతి.

కోనసీమలో సంక్రాంతి నాడు కొన్ని చోట్ల, కనుమ నాడు మరికొన్ని చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు.అత్యంత ప్రాచీనమైనది. కోనసీమ చుట్టుపక్కనున్న గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. జగ్గన్నతోటలో గుడి గానీ, గోపురం గానీ ఉండదు. దేవునికి సంబంధించిన చిహ్నాలూ కనిపించవు. కేవలం దుక్కి దున్నిన కొబ్బరితోట. రైతులు నమ్మే భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం. నాటి స్థానిక సంస్థానదీశులైన రాజావత్సవాయి జగన్నాధ మహారాజుకు చెందిన ఈ తోట, కాలక్రమంలో ‘జగ్గన్న తోట’ అనే పేరుతో స్థిరపడింది.

లోక కల్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కల్యాణం కోసం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్థం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం.

ప్రభల తయారీ

తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి, వెదురు బొంగుల్ని ఒక క్రమపద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సంప్రదాయం.

అనంతరం మేళతాళాలు, మంగళ వాద్యాలు, వేదమంత్రాల మధ్య వూరేగింపుగా బయలుదేరతారు. ప్రభలను మామూలు రహదారుల వెంటగాని, వాహనాల మీదగాని తీసుకు వెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ, పంట చేలు, కాలువల మధ్య నుంచి ఊరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల ఆరడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు.

ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి ‘వీరభద్ర ప్రభలు’గా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి, ఇందులో పాలుపంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తి భావాన్ని చాటుకుంటూ, ఆనందాన్ని మూటకట్టుకుని తిరిగి వెళతారు. కనుమ రోజున ప్రభల తీర్థంతో ఆధ్మాత్మిక క్షేత్రంగా భాసిల్లే జగ్గన్నతోట ప్రాంతం మిగిలిన రోజుల్లో నిర్మానుష్యంగా ఉంటుంది.

జగ్గన్నతోటకి వచ్చే ప్రభలు

    గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వర స్వామి

    గంగలకుర్రు – చెన్నమల్లేశ్వర స్వామి

    వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వర స్వామి

    ఇరుసుమండ - ఆనంద రామేశ్వరస్వామి

    వక్కలంక – కాశీ విశ్వేశ్వరస్వామి

    పెదపూడి – మేనకేశ్వరస్వామి

    ముక్కామల – రాఘవేశ్వర స్వామి

    మొసలపల్లి – మధుమానంత భోగేశ్వరస్వామి

    నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి

    పాలగుమ్మి – చెన్నమల్లేశ్వరస్వామి

    పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి

ప్రభల తీర్థం

ప్రభల తీర్థానికి వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే ఏక సంథాగ్రాహి ఉండేవాడు. అతడు కౌశికీ నది ఒడ్డున ఉన్న మర్రిచెట్టుకిందే ఎప్పుడూ ఉండేవాడు. ఆ చెట్టుకింద గ్రామదేవత నెలకొని ఉండేది. విఠల జగ్గన్నపై ఈర్ష్యకలిగినవారు కొందరు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో నిజాం నవాబుని కలిసినప్పుడు జగ్గన్న ప్రతిభ బయటపడింది. అతని పాండిత్యాన్ని చూసి మెచ్చుకున్న నవాబు, ఆ మర్రిచెట్టుతో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చాడు. ఫిర్యాదు చేసిన ప్రజల ఆనందం కోసం జగ్గన్న మొదటిసారి ప్రభల తీర్థం జరిపాడు. దేవుడికి గుళ్లు గోపురాలు అవసరం లేదని, దైవానికి మైల అంటదని చెప్పేందుకే ప్రభల తీర్థం ప్రారంభమైంది.

ఈ ప్రభలు భక్తులు వచ్చే దారంట రావు. కౌశిక నది దాటుకుంటూ, పొలాల మధ్య నుండి ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి.ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తేకా క్రిందకి దింపకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా తీసుకోస్తారు.ఈ ప్రభలను మోయడానికి ఇరవై మంది వ్యక్తులు ఉంటారు. కౌశిక నది దాటించడానికి మాత్రం యాభై మంది పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు. కౌశిక నది దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి తీసుకోస్తారు. తీర్థ పూర్తి అయిన తరువాత వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలను చూడటానికి వేలాది మంది తరలి వస్తారు.

ఈ ప్రభలని మోయడానికి కుల మత  విచక్షణ లేదు. వైభవోపేతంగా మేళతాళాలతో, అద్భుతమనే రీతిగా అలంకరించిన ప్రభలని భోగేశ్వర స్వామి ఆహ్వానం అందుకున్న గ్రామాల నుండీ ప్రజలు మోసుకువస్తారు. దారంతా ప్రభలని మోస్తూ నడుచుకొంటూ సభక్తికంగా వారు తీసుకొచ్చే ప్రభల రూపంలోకి ఆ భక్తి శ్రద్ధలకి లోబడి పరమేశ్వరుడు ఆవహించి వస్తారని నమ్మకం. నిజంగానే అటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతారు.

ఆలస్యంగా వచ్చే వీరేశ్వరుడు

ఈ ఉత్సవం జరిగేది మొసలపల్లిలో ఉన్న తోటలో కాబట్టి ఆ ఊరి రుద్రుడైన భోగేశ్వరుడు మిగతా ఉళ్ళ నుంచి వచ్చే రుద్రులకు ఆతిథ్యం ఇస్తాడు. ఈ సమావేశానికి వ్యాఘ్రేశ్వరుడు అధ్యక్షత వహిస్తాడు, అంచేత వ్యాఘ్రేశ్వరుడి ప్రభ తోటలోకి ప్రవేశించగానే మిగతా రుద్రులందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడతారట, అందుకని భక్తులు ప్రభలన్నిటినీ "హర హర" "శరభ శరభ" అంటూ ఒకేసారి పైకిలేపుతారు.

అందరికంటే ఆలస్యంగా గంగలకుర్రు అగ్రహారపు వీరేశ్వరుడు సమావేశానికి వస్తాడు. ఈయన ప్రభ వచ్చే దారిలో కౌశికీ నదిని దాటుతూ రావాల్సి ఉంటుంది, ఆ నదిని దాటించే దృశ్యం నయనానందకరంగా ఉంటుందని చెప్తారు. ఈ వీరేశ్వర రుద్రుడు వచ్చే సరికి సాయంత్రం అవుతుంది, ఈ రుద్రుడి ప్రభ తోటకు చేరిన కొద్దిసేపటి ఉత్సవం ముగుస్తుంది.

ఉత్సవం ముగిశాక, రుద్రలందరూ తిరిగి తమ ప్రభల మీద తమతమ గ్రామాలకు చేరుకుంటారు. ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు, దీన్ని చూడటానికి వేలల్లో జనం దేశ విదేశాల నుండీ  ప్రతి ఏటా ఈ ప్రాంతానికి వస్తారు. మన ప్రధాని నరేంద్రమోదీ 2020లో ఈ ఉత్సవానికి గానూ శుభాకాకంక్షలు తెలపడంతో దేశవిదేశాల్లో సైతం ఈ జాతర మరింత ప్రాచుర్యాన్ని పొందింది. ఒక గ్రామీణ ఉత్సవం ఇంత గొప్ప ప్రాధాన్యతని పొందడం చాలా గొప్ప విషయం.

------------------------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, కెబిఎన్ కళాశాల, విజయవాడ-1

 

 

 

 

Wednesday, August 14, 2024

వరాలనిచ్చే వరలక్ష్మి


 

వరాలనిచ్చే వరలక్ష్మి


    ప్రతి వ్యక్తికీ అనేక కోరికలు ఉంటాయి. ఇవన్నీ తీరాలన్నా లేదా కనీసం ఒక్క కోరిక తీరాలన్నా భగవంతుడి అనుగ్రహం తప్పనిసరి. అయితే కోరిక ఏదైనప్పటికీ, ఇచ్చే దైవం ఎవరైనప్పటికీ అంతిమంగా ఆ కోరికల్లో ఉండేది లేదా ఆ కోరికల ద్వారా అందుకునేది ఆనందం, తృప్తి మాత్రమే. ఈవిధమైన సంతృప్తి పొందిన వ్యక్తి మాత్రమే నిజమైన భాగ్యవంతుడు. అటువంటి భాగ్యాన్ని (లక్ష్మిని) అందించేది వరలక్ష్మీదేవి మాత్రమే.

     వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత ‘వరలక్ష్మీదేవి’. ‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్ఠమైనది’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈదేవిని సమంత్రకంగా, భక్తిభావనతో కొలిచే వ్రతమే ‘వరలక్ష్మీవ్రతం’.

    స్కాంద పురాణంలో వరలక్ష్మీవ్రతం గురించిన వివరణ ఉంది. స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెబుతాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా పరమేశ్వరుడు పార్వతికి వివరిస్తాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్మ్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వరలక్ష్మీ వ్రతప్రసాదంగా అందుకుంటుంది.

వరలక్ష్మీ వైభవం


    అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి, ఈ వ్రతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో చేస్తారు. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది. శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం. పూర్ణిమ రోజున అమ్మవారు షోడశకళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. ఈవిధంగా చూస్తే లక్ష్మీశ్రీనివాసుల వైభవం అనంతంగా ప్రకాశించే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీశ్రీనివాసుల అనుగ్రహానికి తొలిసోపానంగా చెప్పుకోవచ్చు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా తాము జీవితకాలం ఉండాలని కోరుకుంటా దేశవ్యాప్తంగా మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. దేశ, కాల, ప్రాంత, ఆచారభేదాలు ఉన్నప్పటికీ అందరి అంతరంగంలో కొలువై ఉన్న మాత ఒక్కరే. ఆమె అందరినీ అనుగ్రహించే తీరు ఒక్కటే.

    వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించటం జరుగుతుంది. కలశం అమ్మవారికి ప్రతిరూపం. కలశపాత్రగా మట్టిపాత్రనుగాని, చేసుకునే యజమాని శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహపాత్రలను గాని వినియోగిస్తారు. లోహమైనా, మట్టి అయినా అది ప ృథ్వీతత్త్వానికి సంకేతం. అందులో పోసే నీరు జలతత్త్వానికి సంకేతం. అందులో కలశాన్ని పూర్తిగా నీరుతో నింపం కనుక శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం. ఇలా పంచభూతాలను ఒకచోటికి చేర్చి పూజిస్తాం. ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాప్తించి ఉండే పరతత్త్వం, శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.

వ్రతాచరణకు నియమాలు


    కలశం కోసం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడిగి, పసుపు, కుంకుమలతో అలంకరించాలి. వ్రతానికి ఎంపిక చేసుకున్న స్థలాన్ని శుభ్రం చేసుకుని, పీటవేసి, దానిమీద నూతన వ్రస్తం వేసి, దానిపై బియ్యంపోసి వేదికను సిద్ధం చేయాలి. వేదికను పూలు, చందనం, పరిమళ ద్రవ్యాలు చల్లి శోభాయమానంగా చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని దానిపై అమర్చాలి. దానికి తాంబూలం సమర్పించి ఆరాధించాలి. కలశంలో నీరుపోసి మామిడాకులు లేదా తమలపాకులు కాని అందులో వేయాలి. ఆకులు ఏవైనా అవి నిటారుగా నిలిచేటట్టు చూసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ నుంచి దానికి రవికెల గుడ్డను వస్త్రంగా చుట్టాలి. కొబ్బరికి ముఖస్వరూపం వచ్చేలా కళ్ళు ముక్కు, పెదవులు, కనుబొమలు అమరేలా దిద్దవచ్చు లేదా అమ్మవారి రూపును దానికి తగిలించి ఆకారం ఏర్పరచవచ్చు. దానికి తమకు తోచిన నగలు వగైరాలు అలంకరించవచ్చు.

    వ్రత తోరాన్ని ఐదు పొరలుగా తీసుకుని దానికి పసుపురాయాలి. దానికి మధ్యలో మామిడి ఆకునుకాని, తమలపాకును కాని పెట్టి ముడివేయాలి. దీన్ని అమ్మవారి సమక్షంలో ఉంచి పూజించాక చేతికి మణికట్టు దగ్గర ధరించాలి. దీన్ని మొదటి శుక్రవారం కట్టుకుంటే నెలంతా ఉంచుకుని అమ్మవారి పూజ నెలరోజులూ జరుపుకోవాలి లేదా వరలక్ష్మి వ్రతం నాడు కట్టుకుని కలశానికి ఉద్వాసన పలికిన తర్వాత తీసేయొచ్చు. ఇంటి ఆచారాలను బట్టి పూజావిధానంలో మార్పులు ఉండొచ్చు.

    అమ్మవారికి పూజలో ప్రసాదంగా చక్కరపొంగలి కానీ పాయసం కాని నివేదన చెయ్యాలి. పాయసం దేనితో తయారుచేసినా దోషం కాదు. పూజలో వినియోగించిన బియ్యాన్ని మర్నాడు అన్నం వండి దేవతా మందిరంలో ఇలవేలుపుకు ప్రసాదంగా సమర్పించి స్వీకరించాలి. కలశంలో ఉంచిన కొబ్బరికాయను మరుసటి రోజున మనం రోజూ పూజించే దేవుడికి నివేదన చేసి కొట్టి ప్రసాదంగా చేసుకుని అందరూ తీసుకోవాలి. కలశంలో ఉన్న జలాన్ని కుటుంబసభ్యులందరూ తీర్థంగా తీసుకోవాలి. శిరస్సు మీద చల్లుకోవచ్చు. ఏదైనా అవాంతరం వల్ల శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేసుకోవటం సాధ్యపడకపోతే తర్వాతి వారం చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

విశ్వమంతా లక్ష్మీ స్వరూపమే


    ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే స్త్రీలను లక్ష్మీస్వరూపంగా ఆరాధించటం, అర్చించటం మన సంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతరులతో పనులు చేయిస్తుంది. తాను ్వయంగా చేస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. అందుకే స్త్రీరూపంలోని లక్ష్మికి మన సంస్కృతి సమున్నతస్థానాన్ని ఇచ్చింది.

    అనంతవిశ్వాన్ని ‘లక్షించేది’ లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. ‘లక్షించటం’ అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చల్లనిచూపులతో ‘కనిపెట్టుకుని’, గమనించి, పాలించే శక్తిని లక్ష్మిని చెప్పుకోవచ్చు. సర్వసాక్షిjైున ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, ‘లక్ష్యం’గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ‘లక్ష్మి’. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి.

వరలక్ష్మీ సందేశం

 

   సంప్రదాయకంగా తరతరాల నుంచి వస్తున్న ఈ వ్రతం పైకి మామూలు పురాణ కథలానే కనిపించినా ఇందులో ఒక సామాజిక చైతన్య సూత్రం ఇమిడి ఉంది. చారుమతికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి తనను పూజించమని, సకల ఐశ్వర్యాలనూ ఇస్తానని చెప్పింది. చారుమతి ఆ వ్రతాన్ని స్వార్థబుద్ధితో తానొక్కతే చెయ్యలేదు. తనతోపాటు తనవారు, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబాల స్త్రీలంతా వరలక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు కావాలని అందరినీ కలుపుకొని వ్రతం చేసింది. స్త్రీలు ఇలా అందరినీ కలుపుకొని సామరస్య ధోరణిలో, నిస్వార్థ బుద్ధితో మెలగాలనే ఓ సామాజిక సందేశం ఈ వ్రత కథ వెనుక ఉంది.

సుప్రభాతం అంటే ఏమిటో వివరిస్తూ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ నమస్తే తెలంగాణ పత్రికలో రాసిన వ్యాసం

  సుప్రభాతం అంటే ఏమిటో వివరిస్తూ  డాక్టర్ కప్పగంతు రామకృష్ణ నమస్తే తెలంగాణ పత్రికలో రాసిన వ్యాసం