Sunday, April 4, 2021
దేవుడిని చూద్దాం... రండి (మొదటి భాగం)
Wednesday, March 3, 2021
మహాశివరాత్రి ప్రత్యేకం... పరమేశ్వర అవతార వైభవం
అపురూపం... శివ రూపం
ఆ వేషంలో ఎంతో వైరుధ్యం. అంతలోనే వైవిధ్యం.
ఆయన ఆయుధాలు, ఆభరణాలన్నీ వేటికవే విభిన్నం.
ప్రతి అంశంలో ఓ సందేశం. మరెంతో పరమార్థం.
అందుకే ఆ రూపమే కాదు... ఆ భావమూ అపురూపమే.
సాకారుడైనా, నిరాకారుడైనా అంతా ఆ స్వామి చిద్విలాసమే.
ఏమిటీ చిత్రవిచిత్రమైన ఆహార్యం. ఇంతకన్నా సొగసైన
వస్తువులేవీ స్వామికి దొరకలేదా అంటే సమస్తమైన విశ్వమే ఆయన కనుసన్నల్లో నడుస్తుంది.
ఇక ఆయనకు కానిదేది.
ఆ... ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతోంది. పైపైకి... మామూలు
కళ్ళతో చూస్తే శివయ్య లీల ఓ పిచ్చి జంగమదేవర తీరు. అదే కళ్ళుమూసుకుని మనసు తెరచి
చూస్తే అనంతమైన శివ వైభవం సాక్షాత్కరిస్తుంది. ఆ స్వామి ఆకారం, ఆహార్యం అన్నిటా
అంతులేని ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి.
శివయ్యను
చూడగానే ఆయన చేతిలో త్రిశూలం తళుక్కుమని మెరుస్తూ మన కళ్ళకు కనిపిస్తుంది.
ఎంతోమంది రాక్షసుల ప్రాణాలు తీసి భక్తుల ప్రాణాలు కాపాడిన మహాశక్తిమంతమైన ఆయుధం
అది. శివయ్య చేతికది అలంకారం.
త్రిశూలం
అంటే మూడు కొనలు కలిగినదని అర్థం. సాధారణ ఆయుధానికి ఉండే కొనలు కావవి. ఆ మూడు
కొనలు సత్త్వ రజ స్తమో గుణాలకు ప్రతీకలు. ఆ మూడుకొనలు పిడి వద్ద కలుసుకుంటాయి.
త్రిగుణాల ఏకత్వానికిది సంకేతం.
యోగపరంగా
చూస్తే త్రిశూలంలోని మూడు కోణాలు మానవశరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు
సంకేతాలు. ఈ మూడు నాడులు శిరస్సులో ఉండే జ్ఞానకేంద్రం వద్ద కలుస్తాయి. ఇదే
త్రివేణీ సంగమం. త్రిశూలం లోని మూడు కొనలు మూడు నాడులకు సంకేతాలైతే జ్ఞానకేంద్రం
శూలహస్తాన్ని సూచిస్తుంది. వాటి
ఏకత్వాన్ని, త్రిగుణ సంగమాన్ని ప్రకటిస్తుంది.
త్రిశూలంలోని
మూడుకొనలు త్రిగుణాలకు ప్రతీకలైతే వాటి ఏకత్వాన్ని ప్రకటించే చోటును పట్టుకున్న
పరమేశ్వరుడు నేనీ త్రిగుణాలకు అతీతుడను అనే సత్యాన్ని ప్రకటిస్తాడు. అంతేకాదు..
భూత భవిష్యత్ వర్తమానాలనే త్రికాలాలకు, జాగృత్ స్వప్న సుషుప్తులనే త్రిస్థితులకు
తానే అధిదేవతను అనే సత్యాన్ని కూడా త్రిశూలం తెలియజేస్తుంది. ఆది దైవిక, ఆది
భౌతిక, ఆధ్యాత్మిక తాపాలను త్రిశూలం పోగొడుతుంది. మరొక అర్థంలో త్రిశూలంలోని మూడు
కోణాలు కోరిక, చర్య , జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి. ఇవే
ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు.
త్రిశూలానికి
సంబంధించి ఆసక్తికరమైన పురాణగాథలూ ఎన్నో ఉన్నాయి. ఒకానొక సందర్భంలో శివుడు కాశీ
పట్టణాన్ని తన త్రిశూలంతో ఎత్తి పట్టుకుంటాడు. మొత్తం ప్రపంచం నాశనమైనా, ప్రళయం
వచ్చినా కాశీకి ఎటువంటి ఆపదా కలగదని వరమిచ్చాడు.
అంధకాసురుడిని
సంహరించే సమయంలోనూ త్రిశూలానిదే ప్రధాన పాత్ర. శివుడు రాక్షసుడిని సంహరించకుండా
త్రిశూలానికి గుచ్చి ఉంచాడు. త్రిశూలానికి
వేలాడుతున్న అంధకుడికి జ్ఞానోదయమైంది. శివయ్య అతడిని క్షమించి తన ప్రమథగణాల్లో
చేర్చుకున్నాడు.
హస్తసాముద్రికంలోనూ త్రిశూలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
అరచేతిలో త్రిశూలం గుర్తు ఉన్న వ్యక్తులు పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా
పొందుతారు. శుక్రస్థానంలో త్రిశూలం గుర్తున్న వ్యక్తులు సానుకూల దృక్పథంతో ఉంటారు.
అంగారక స్థానంలో ఉంటే వ్యక్తులు విజయాలు సాధిస్తారు. చంద్రస్థానంలో త్రిశూలం
గుర్తున్న వ్యక్తులు శక్తివంతమైన ఊహలు, సృజనాత్మక ఆలోచనలు కలిగిఉంటారు. ఇలా
మరెన్నో స్థానఫలితాలను హస్తసాముద్రిక శాస్త్రం చెబుతుంది.
శివయ్య
చేతిలోని డమరుకం కేవలం వాద్యమే కాదు. తత్త్వచింతనకు అదొక వేదిక. అంతేకాదు... మనం
రాసుకుంటున్న అక్షరాలకు శివయ్య చేతిలోని డమరుకమే ఉత్పత్తి స్థానం. ఇందుకు
సంబంధించిన ఆసక్తికరమైన ఘటన ఒకటుంది.
ఒకప్పుడు
పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో తాండవం చేస్తున్నాడు.
నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతత్ విమర్శే
శివసూత్ర జాలం
తాను
చేస్తున్న తాండవ నృత్యం చివరలో శివుడు తన డమరుకాన్ని మోగించాడు. ఆ సమయంలో 14
రకాలైన ధ్వనులు వెలువడ్డాయి. సనకాది
మహర్షులు వీటిని గ్రహించారు. ఈవిధంగానే భాషాశాస్త్రం ఆవిర్భవించిందని ఈ శ్లోకానికి
భావం.
నర్తనం చివరిలో చేసిన డమరుకపు పధ్నాలుగు దరువుల
సహాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకూ బీజం నాటాడు. ఆ పధ్నాలుగు సూత్రాలను పాణిని
కంఠస్తం చేసికొని ‘అష్టాధ్యాయి’ అనే ప్రాథమిక వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఇందులో
ఎనిమిది అధ్యాయాలు ఉండటం వల్ల ఈ గ్రంథం ‘అష్టాధ్యాయి’గా ప్రసిద్ధి పొందింది. ఈ 14
సూత్రాలనే మాహేశ్వర సూత్రాలు అంటారు. నటరాజు డమరుక దరువుల నుండి ఉద్భవించిన
మహేశ్వరసూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికీ, వ్యాకరణానికీ
సంబంధం ఇదే. అందుచేతనే శివాలయాలలో వ్యాకరణమంటపాలుంటాయి.
విఖ్యాత శైవకవి పాల్కురికి సోమనాథుడు రాసిన
అక్షరాకం పద్యాల్లోనూ శివ డమరుక వైభవం ఎంతగానో ప్రకటితమవుతుంది. కొన్ని పద్యాలైతే
పూర్తిగా డమరుక నాద విశేషాలతో నిండి ఉంటాయి.
డమరుగజాత డండడమృడండమృడండ మృడండ మృండమృం
డమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం
డమృణ మృడండడంకృతివిడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ
త్ర్పమథన తాండవాటన "డ"కారనుతా బసవేశ పాహిమాం
!
ఓ బసవేశ్వరుడా ! నువ్వు తాండవ నృత్యము చేసే
సమయంలో నీ డమరుకం నుండి డండడ మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ
మృడండమృం డమృం మొదలగు ధ్వనులు పుడుతున్నాయి. ఆ ధ్వనులతో పుట్టిన డమరుక కాంతులలో
లోకాలు వెలుగుతున్నాయి. అటువంటి అద్భుతమైన డమరుక ధ్వనులు కలిగిన లోకాలను చిలుకు
తాండవ నాట్యమునందు సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !డ అను అక్షరముతో
పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !నన్నురక్షించు అని ఈ పద్యానికి భావం.
డమరుకం వాయించటానికి ముందుగా డమరుకం మధ్యలో ఒక
కొయ్యముక్క కడతారు. దానిని మణి అంటారు. డమరుకాన్ని కదలించినపుడు మణి డమరుకానికి
అటు ఇటు తగలటం ద్వారా డమరుక శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఆ శబ్దం అంతులేని ఆనందాన్న కలిగిస్తుంది.
ఆకాశంలో శబ్ద గుణకాలు ప్రయాణిస్తాయి. మనం ఏదైనా
మంత్రాన్ని జపం చేస్తున్నట్లయితే లేదా స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నా వాటి నుంచి
ఏర్పడే శబ్ద ప్రకంపనలు తరంగాలు మారి ఆకాశానికి చేరుకుంటాయి. అనంతాకాశంలో సంచారం
చేసే శివ డమరుక ధ్వనులతో అవి సంయోగం చెందుతాయి. ఆవిధంగా సాధకుడికి
పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది.
కాలరేఖ… చంద్రరేఖ
శివయ్య సిగ మీద నెలవంక వెన్నెల వెలుగులీనుతూ
కనిపిస్తుంది. అలా అర్థచంద్రుడిని ధరించటమే శివయ్య ఔదార్యాన్ని
ప్రకటిస్తుంది. దక్షప్రజాపతి అల్లుడైన
చంద్రుడు తన 27 మంది భార్యల్లోనూ రోహిణి అంటేనే ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇది
సహించలేని ఇతర భార్యలు తండ్రి అయిన దక్షుడికి ఫిర్యాదు చేయటంతో ఆయన కోపంతో
అల్లుడైన చంద్రుడిని శపిస్తాడు. ఆ శాపం పోగొట్టుకునే క్రమంలో శివుడి అనుగ్రహం
పొందిన చంద్రుడు శివుడి సిగ మీద అలంకారంగా నిలిచాడు. అప్పటి నుంచి శివుడు
చంద్రశేఖరుడయ్యాడు.
పరమేశ్వరుడి జటాజూటంలో చంద్రరేఖ ఉండటం శివుడు
కాలస్వరూపుడనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. కాలాన్ని గణించే పద్ధతుల్లో
చాంద్రమానానికి ప్రాశస్త్యం ఎక్కువ. అటువంటి కాలగణనకు ప్రధానమైన చంద్రుడు శివుడి
అధీనంలో ఉన్నాడు. అంటే శివుడు కాలాధిష్ఠాన దైవం అని గ్రహించాలి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మన: కారకుడు. మనిషి సుఖ సంతోషాలన్నీ జాతకచక్రంలో చంద్రుడి సంచారం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి చంద్రుడు శివుడి అధీనంలో ఉన్నాడు. కాబట్టి శివారాధకులకు అయాచితంగా చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఫలితంగా చక్కని మనోస్థైర్యం కలుగుతుంది. చక్కటి మనస్సు ధర్మకార్యాల మీద నిమగ్నమవుతుంది. అంతిమంగా దైవపదం చేరుకునేందుకు ఇదే పునాదిగా నిలుస్తుంది.
నాగేంద్ర హారాయ...
శివయ్యను
చూడగానే ఆయన మెడలో ఆభరణంగా వెలుగుతున్న పాము కనిపిస్తుంది. నిజానికది పాము కాదు.
పాముల్లో శ్రేష్ఠమైన జాతికి చెందిన సర్పం. వాసుకి అనే సర్పరాజు తపస్సు చేసి శివుడిని
మెప్పించి ఆయనకు కంఠహారంగా మారతాడు.
పరమేశ్వరుని
మెడలో నాగాభరణమై వున్న మహాసర్పం వాసుకి. అన్ని వేళలా స్వామి సేవలో ఆ నాగరాజు తరిస్తాడు.కశ్యప ప్రజాపతికి గల 14
పత్నుల్లో వినత, కద్రువలు ఇద్దరు. వినతకు
గరుత్మంతుడు, అనూరుడు ఇద్దరు
కుమారులు.
వీరిలో అనూరుడు
సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు
వెయ్యిమంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాలసముద్రం సమీపంలోని ఉచ్చైశ్రవాన్ని(గుర్రం) దూరం నుంచి చూసిన
కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా వుందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే
వుంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా వుంటే అక్క తన దగ్గర వేయి సంవత్సరాలు పరిచారికగా వుండాలని ఒక వేళ తోక
తెల్లగానే వుంటే తానే వినత దగ్గర వేయి సంవత్సరాలు బానిసగా వుంటానని కద్రువ పందెం కాస్తుంది.
ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి
పరీక్షిస్తామని వెళ్లిపోతారు. గుర్రం తోక తెల్లగానే వుంది ఈ
పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో కద్రువ వుంటుంది. హఠాత్తుగా ఆమెకో ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా వున్న వారు వెళ్లి
గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు
అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వాదిస్తారు. వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి
భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని శపిస్తుంది.
శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట
ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్న మాట ప్రకారం
కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. అనంతరం ఆమెకు ఆమె రెండో
కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు. తల్లి మాట అంగీకరించని
ఆదిశేషువు శ్రీమహావిష్ణువు కోసం ఘోరతపస్సు చేస్తాడు. స్వామి
ప్రత్యక్షమై ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో
ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది.
రెండో వాడైన
వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు
ప్రత్యక్షమై వాసుకికి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా
చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకికి
కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆ నాటి నుంచి
వాసుకి మహాశివుని మెడలో
దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడ యందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే
ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణడు అని కూడా పిలుస్తాము.
శివయ్య
సర్పాల్ని ధరించటం వెనుక ఎంతో సందేశం దాగి ఉంది. పాములు నిరంతర జాగరూకతకు
ప్రతీకలు. శివారాధకులు కూడా అంత జాగరూకతతో ఉండాలనే సందేశం ఇందులో దాగుంది. అత్యంత
భయంకరమైన సర్పాలు కూడా శివయ్య స్పర్శ తగలగానే సునమస్కులుగా మారిపోతాయి. భయంకరమైన
విష సర్పాల వల్ల కలిగే భయం శివారాధన వల్ల తొలగిపోతుంది. సర్పాల్ని ధరించటం ద్వారా
తన భక్తులకు సర్పభయం లేకుండా చేస్తానన్నది శివుడు ఇచ్చే అభయం.
శివయ్య
మెడలో మూడుచుట్టలు తిరిగి ఉండే సర్పం కాలచక్రానికి సంకేతం. భూత, భవిష్యత్, వర్తమాన
కాలాలే ఈ మూడు చుట్టలు. ఈ మూడు కాలాలతోటే సమస్తమైన ప్రపంచ చర్య
జరుగుతుంటుంది. పాము ఆకారం కుండలిని
శక్తిని పోలి ఉంటుంది. పాము గర్వానికి సూచిక. తన గర్వాన్ని ఎవరైతే గెలుస్తారో
వారికి తాను ఆభరణంగా నిలుస్తానని చెప్పటం శివయ్య సర్పాభరణాలు ధరించటం వెనుక ఉండే
సందేశాల్లో ఒకటిగా గుర్తించాలి.
శివయ్యను
చూడగానే అందరినీ ఆకర్షించేది ఆయన నుదిటిన ఉన్న నేత్రం. నుదుటి భాగంలో నేత్రాన్ని ఉంచుకున్న కారణంగా
శివయ్య త్రినేత్రుడయ్యాడు. సాధారణ భాషలో మూడో కన్ను అంటారు.
ఈ
త్రినేత్రం సాధారణ నేత్రం మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ఇతర కళ్ళ మాదిరిగా
చూడటానికి ఉపయోగించే నేత్రం కాదు. ఇది జ్ఞాన నేత్రం. సకల ద్వంద్వాలకు అతీతమైన స్థితిని ఈ నేత్రం
ప్రకటిస్తుంది. ఇది ఆజ్ఞాచక్రానికి
స్థానం.
శివుడు
మూడోకన్ను తెరిస్తే అంతా భస్మమే అంటారు.
పార్వతీ కల్యాణం విషయంలో మన్మథుడు చేసిన పనికి కోపించిన శివుడు మూడోకన్ను
తెరుస్తాడు. క్షణంలో బూడిద కుప్పగా మారిపోతాడు మన్మథుడు. ఇంతటి శక్తి
మూడోనేత్రానికి ఉంది. ఇక్కడ కాలిపోయింది మన్మథుడనే వ్యక్తి కాదు తీవ్రమైన కామం అనే
అరిషడ్వర్గంలోని ఓ శత్రువు. ఎప్పుడైతే మనలోని అజ్ఞానం దహనమవుతుందో అప్పుడు
మిగిలేది జ్ఞానమే. అటువంటి జ్ఞాననేత్రాలకు మాత్రమే పరమేశ్వరుడి దర్శనం పొందే
యోగ్యత కలుగుతుంది.
శివయ్య
వాహనం నంది. కేవలం వాహనం మాత్రమే కాదు... భక్తులకు శివయ్యకు మధ్య వారిధి కూడా
బసవయ్యే. ఆలయానికి వచ్చిన భక్తులు నంది కొమ్ముల ద్వారా శివలింగ దర్శనం
చేసుకుంటారు.
నంది
ధర్మానికి ప్రతీక. శివుడు ఎక్కడ కొలువుంటాడే అక్కడ నంది ఉంటాడు. నంది లేని శివాలయం
ఉండదు. అంటే శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం కొలువై ఉంటుందని అర్థం.
నంది
పశుజాతికి చెందింది. పశువు అంటే పాశంతో కట్టబడిందని అర్థం. మనమందరూ పశువులమే.
వివిధ రకాలైన పాశాలతో కట్టబడి ఉంటాం. ఈ పాశాలన్నీ తొలగిపోతేనే పరమేశ్వర
సాక్షాత్కారం కలుగుతుంది. ఇది జరగాలంటే నంది మాదిరిగా నిరంతరం శివసాన్నిధ్యంలో
గడపాలి. అంటే తనువు, మనసు శివమయం కావాలి. నంది అందించే సందేశం ఇదే.
(శ్రీశైలప్రభ మాసపత్రిక మార్చి 2021 సంచికలో ప్రచురితమైన వ్యాసం)
--------------------------
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ నంబరు : 90320 44115 / 8897 547 548
Monday, February 15, 2021
వసంత పంచమి ప్రత్యేకం ...సరస్వతీ దేవి అందించే సందేశం ఇదే...
వసంత పంచమి ప్రత్యేకం
సరస్వతీ దేవి అందించే సందేశం ఇదే...
వీణాపాణి వేద వాణి!
మాఘ శుద్ధ పంచమి వసంత పంచమి
ఆమె అక్షరం... ఆమె అక్షయం... ఆమె గీర్వాణి... ఆమె సకల శాస్త్రాలకూ రారాణి
ఆమె జ్ఞానం.. ఆమె సర్వవిద్యలకూ మూలం...
వాల్మీకి నోట ఆది కావ్యాన్ని పలికించిన తల్లి ఆమె.
వ్యాసభగవానుడి చేత ఆపార సాహిత్యాన్ని రాయించిందీ ఆ తల్లే.
యాజ్ఞవల్క్యుడు, ఆదిశంకరులు, ఆదిశేషువు, బృహస్పతి అందరూ ఆమె అనుగ్రహంతోనే అనంతమైన జ్ఞానాన్ని వరప్రసాదంగా అందుకున్నారు.
ఆ తల్లి సరస్వతి... మనలోని విజ్ఞానానికి మాతృమూర్తి. ఆమె ఆవిర్భవించిన రోజు వసంతపంచమి.
మాఘమాసం ప్రకృతి వికాసానికి, సరస్వతి మనోవికాసానికి సంకేతం. ఈ రెండింటి కలయిక పరిపూర్ణ వికాసానికి నిదర్శనం. దీనికి ప్రతీకగా వసంత పంచమి వ్యాప్తిలోకి వచ్చింది. మనిషిలో ఉండే అవిద్య లేదా అజ్ఞానం తొలగిపోయి ఎప్పుడు జ్ఞానం అనే వెలుగురేఖ ప్రసారమవుతుందో ఆ రోజు మనిషి వికాసానికి ప్రారంభసూచిక అవుతుంది. అజ్ఞానం అనే మంచుతో గడ్డకట్టిన మనిషి హృదయాన్ని చదువు అనే వేడితో కరిగించి జ్ఞానం అనే వెలుగును ప్రసరింపజేయటమే వసంత పంచమి అంతరార్థం. మాఘమాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమిని వసంత పంచమిగా చేసుకుంటాం. ఈ రోజుకే శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి.
* సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం అంటే నిరంతరం సాగిపోయే చైతన్యం. సాధారణంగా జలం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. జలం జీవశక్తికి సంకేతం. దాన్నుంచే అన్ని జీవులకూ శక్తి అందుతోంది. తద్వారా ప్రకృతిలో ఉత్పాదకత జరుగుతోంది. ఈ ఉత్పాదకతకు ప్రతిఫలమే సరస్వతి (జ్ఞానం). సృష్టి కార్యాన్ని నిర్వహించే బ్రహ్మదేవుడికి కూడా అందుకు తగిన జ్ఞానాన్ని సరస్వతి అందిస్తుంది.
రచన - డా. కప్పగంతు రామకృష్ణ, సెల్ : 90320 44115 / 8897 547 548
Friday, February 12, 2021
సూర్యుడిని ఎలా ఉపాసించాలి? వేదాల్లో సూర్యుడి గురించి ఏం చెప్పారు? సూర్యోపాసనకు పాటించాల్సిన నియమాలేమిటి?
సూర్యుడిని ఎలా ఉపాసించాలి?
వేదాల్లో సూర్యుడి గురించి ఏం చెప్పారు?
సూర్యోపాసనకు పాటించాల్సిన నియమాలేమిటి?
శ్రీ సూర్యనారాయణ వైభవం
సకల చరాచర జగత్తుకు వెలుగును, తేజస్సును ప్రసాదించేవాడు సూర్యభగవానుడు. ఈయన భూమి మీద తొలిగా తన వెలుగును ప్రసాదించిన రోజు సప్తమి. అందుకనే మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిగా, రథ సప్తమిగా లోకప్రసిద్ధి పొందింది.
మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వీరందరిలో మన చర్మచక్షువులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు. అందుకనే ఆయన కర్మసాక్షి అయ్యాడు. సకల వేద, పురాణ, ఇతిహాస, కావ్య వాజ్ఞ్మయమంతా సూర్యోపాసన వైశిష్ట్యాన్ని ప్రకటిస్తుంది.
కంటికి కనిపించే సకల ప్రపంచాన్ని తన తేజస్సు ద్వారా నడిపించే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు. అదిత్యుడని, భానుడని, మిత్రుడని... ఎన్నో పేర్లతో పూజలందుకుంటూ, మనలోని అజ్ఞాన తిమిరాల్ని తన కిరణాల ద్వారా దహింపజేస్తూ, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసే దైవం సూర్యనారాయణమూర్తి. తరు, పశు, పక్ష్యాదులతో సహా ఏ జీవి చైతన్యంగా ఉండాలన్నా అందుకు ఆదిత్యుని అనుగ్రహం తప్పనిసరి.
సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు. అనంతమైన శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నిటికీ వెలుగును, తేజస్సును ప్రసాదించే జ్యోతి స్వరూపుడు. అన్ని ఐశ్వర్యాలకన్నా పరమోన్నతమైన ఆరోగ్యభాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించే కరుణామూర్తి. అందుకనే, ఆదిత్యోపాసన సర్వోన్నతమైందిగా, సకల పాపాలను పోగొట్టే తారకమంత్రంగా శాస్త్ర, పురాణ, ఇతిహాస గ్రంథాలు చెబుతున్నాయి.
సూర్యోపాసన చేసి, సూర్యశతకాన్ని రచించిన పుణ్యం చేత మయూరుడనే కవి కుష్ఠువ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. అగస్త్య మహర్షి చేత ఆదిత్యహృదయాన్ని ఉపదేశం పొంది, దాన్ని పారాయణ చేసిన ఫలితంగా శ్రీరామచంద్రమూర్తి రావణాసురిడిని సంహరించాడు. ఇంకా మరెందరో పుణ్యమూర్తులు సూర్యోపాసన చేసి, రథసప్తమీ వ్రతాన్ని ఆచరించిన పుణ్యప్రభావం చేత ఎందరో భక్తులు ఎన్నో బాధల నుంచి విముక్తులైన గాథలు ఉన్నాయి. మొత్తంగా సూర్యోపాసన అనంతమైన ఫలితాలను ఇస్తుంది.
సూర్యగ్రహ గమనాన్ని బట్టే ఋతువులు, ఉత్తర, దక్షిణాయనాలు ఏర్పడతాయి. ఈవిధంగా సూర్యగమనంలో మార్పుల వల్ల ఏర్పడ్డ ఉత్తరాయణమే మకర సంక్రమణంగా, సంక్రాంతి పండుగగా లోకంలో వ్యాప్తి చెందింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా సూర్యుడి నుంచి వచ్చే వేడి వల్ల సముద్రాలు, నదుల్లోని నీరు ఆవిరవుతుందని, ఆ ఆవిరి మేఘాలుగా మారి, వర్షించటం వల్ల సకల ప్రాణికోటి తాగటానికి మంచి నీరు, పంటలు పండటానికి తగిన నీరు లభిస్తోందని చెబుతోంది. ఈవిధంగా చూసినా అఖండ భూమండలం మీద సకల ప్రాణులకు జీవనాధారుడు సూర్యుడే అని స్పష్టమవుతోంది.
సూర్యారాధన వల్ల విజ్ఞానం, ఉత్తమ గుణాలు, వర్చస్సు, ఆయుష్షు, ధనం, సంతానభాగ్యం కలుగుతాయి. వాత, పిత్త, క్షయ, కుష్ఠు వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మొత్తంగా ఆరోగ్య సంపద ఆదిత్యుని ఉపాసన ద్వారా వరంగా లభిస్తుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం శారీరక రోగాలు ఉన్నవారు సూర్యారాధన చేస్తే, మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి నేత్రదోషాలు, చర్మవ్యాధుల నుంచి సూర్యోపాసన ద్వారా వేగంగా ఉపశమనం లభిస్తుంది. మొత్తంగా సూర్యోపాసన సకల వ్యాధులను దూరం చేసేదిగా, సకల పాపాలను పోగొట్టే ఉత్తమ వ్రతంగా లోకవ్యాప్తిలో ఉందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
మానవ జీవితం ప్రకృతి అధీనమని, ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదనే జాగృతిని సూర్యోపాసన తెలియజేస్తుంది. భారతీయ ఆచార సంప్రదాయాలు, పండుగలు మూఢనమ్మకాలు కావని, అనంతమైన వైజ్ఞానికత వాటిలో దాగిఉందని సూర్యోపాసన చాటుతుంది.
ఇతిహాసాల్లో
సూర్యవైభవం
ప్రస్కణ్వుడనే మహర్షి సూర్యమంత్రాలను ఉపాసన చేయటం ద్వారా తన చర్మరోగం నుంచి విముక్తి పొందాడు. భద్రేశ్వరుడనే రాజు కూడా ఆదిత్యోపాసన ద్వారా శ్వేత కుష్ఠురోగం నుంచి ఉపశమనం పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యగాయత్రి, అరుణం, మహాసౌరం, ఆదిత్యహృదయం, మయూర శతకం మొదలైన వాటిని పారాయణ చేయటం ద్వారా అనేక శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తిపొందిన భక్తుల కథలు ఎన్నో ఉన్నాయి.
ప్రత్యేకించి, రథసప్తమి రోజున చేసే స్నానం, సూర్యారాధన అనేక విశేష ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున జిల్లేడు ఆకులను శిరసు, భుజాల మీద ఉంచుకుని స్నానం చేయాలి. గోధుమనూకతో చేసిన పొంగలిని సూర్యునికి నివేదన చేయాలి. ఇందువల్ల ఏడుజన్మల్లో చేసిన పాపం నశిస్తుందని నారద పురాణం చెబుతోంది.
సూర్యగమనం ఆధారంగానే ఋతువులు, అయనాలు (ఉత్తరాయణం, దక్షిణాయనం) ఏర్పడతాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సందర్భం మకర సంక్రమణం. ఆ తర్వాత మాఘ శుద్ధ సప్తమి నుంచి సూర్యగమనం దక్షిణదిశకు మారుతుంది. ఈవిధంగా, రథసప్తమి ఖగోళ విజ్ఞానానికి సంకేతంగా నిలుస్తుంది.
సూర్యోపాసన నియమాలు
సూర్యోపాసన చేసేవారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించి తీరాలి. అవేమిటంటే..
- మద్యపానం, స్త్రీ సంపర్కం, తైల సంస్కారం విడిచిపెట్టాలి. అసత్యం పలుకకూడదు. కోపం పనికిరాదు. హారాలు ధరించకూడదు. మంచం మీద శయనించకూడదు. బ్రాహ్మణ, గో, మనుష్య, దేవతానింద చెయ్యకూడదు. పరుల ఇంటికి వెళ్ళకూడదు.
- సూర్యోపాసన చేసే రోజున, ప్రత్యేకించి ఆదివారం నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, ప్రవాహములు, చెరువులు లేదా కోనేరుల్లో స్నానం చెయ్యాలి. అనంతరం పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, తిలకం ధరించాలి. సదాచారం పాటించాలి. పూజ, జపం, అర్ఘ్యం, ప్రదక్షిణ, నమస్కారం, స్తోత్రపారాయణ - ఈ ఆరు విధాలుగా సూర్యదేవుని అర్చించాలి.
- పూజ మధ్యలో లేచి వెళ్ళకూడదు. పూజ ప్రారంభం నుంచి చివరి వరకు ఇతరులతో మాట్లాడకూడదు. అన్యమనస్కులై ఉండకూడదు. పూజ మధ్యలో ఆవులింత, తుమ్ము, అపానవాయువు వస్తే, ఆచమనం చేసి, మూడుసార్లు గోవింద నామస్మరణ చెయ్యాలి.
సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. జీవుల పుట్టుక, పెరుగుదల, క్షయం అన్నీ సూర్యతేజస్సు వల్లే జరుగుతున్నాయి. ఈవిధంగా సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడయ్యాడు.
బ్రహ్మముహూర్తంలో సూర్యదండకాన్ని స్మరిస్తూ నిద్రలేచి, కాలోచిత కృత్యాలు పూర్తిచేసుకోవాలి. స్నానం, సంధ్యావందనం, నిత్యార్చన పూర్తిచేసుకున్న తర్వాత సూర్యమంత్రాన్ని ఉపాసన చెయ్యాలి. సూర్యతర్పణం అనంతరం తులసికోటలో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి.
మాధ్యాహ్నిక అర్చన తర్వాత సూర్యనారాయణస్వామి రూపును లేదా సూర్య సాలగ్రామాన్ని పూజించాలి. మహానివేదన సమర్పించి, ఆదిత్యహృదయం పారాయణ చెయ్యాలి. తీర్థప్రసాదాలు స్వీకరించాలి.
సౌరార్చన విశేషాలు
- ఆదివారం నాడు తెల్లజిల్లేడు సమిధలు ఉపయోగించి మహాసౌమంత్రంతో ¬మం చేసినవారికి అభీష్టసిద్ధి కలుగుతుంది.
- ఆదివారం రోజున తెలుపు, ఎరుపు, పసుపుపచ్చని మృత్తికలను ఒంటికి పూసుకుని, మృత్తాకాస్నానం చేసిన వారికి కోరికలు సిద్ధిస్తాయి.
- వివిధ రంగుల పూలతో ప్రతి ఆదివారం విడువకుండా ఆదిత్యుని పూజించి, ఆ రోజు ఉపవాసం ఉన్నట్లయితే కోరికలు అతిశీఘ్రంగా నెరవేరుతాయి.
- ప్రతి ఆదివారం ఆవునెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసి, ఆ దీపాన్ని సూర్యస్వరూపంగా భావించి పూజించినట్లయితే నేత్రవ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
- రాగిపాత్రలో నువ్వులనూనెతో దీపారాధన చేసి, ఆ దీపాన్ని బ్రాహ్మణుని దానం చేసినవారికి జ్ఞానప్రాప్తి కలిగి, అంతిమంగా ముక్తి లభిస్తుంది.
- చతుష్పథం (నాలుగు రోడ్లు కలిసే కూడలి)లో ప్రయత్నపూర్వకంగా ద్వాదశాదిత్యులను ఉద్దేశించి 12 దీపాలు దానం చేసిన వారు భాగ్యవంతులు అవుతారు. మరుసటి జన్మలో రూపవంతులు, భాగ్యవంతులు అవుతారు.
- పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, రక్తచందనం, ఎర్రని పుష్పాలు, అక్షతలు, తిలలు, గరిక ఇగుళ్ళు కలిపిన జలంతో నిత్యం ద్వాదశాదిత్యులకు 12 అర్ఘ్యాలు ఇచ్చి, ఆ ద్రవ్యాలతో ఆదిత్యుని అర్చించి, ఒక సంవత్సరం పాటు అష్టాక్షరీ మహామంత్రాన్ని దీక్షగా జపించిన వారికి సంవత్సరాంతంలో ఇష్టసిద్ధి తప్పకుండా కలుగుతుంది.
- సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యునుకి అభిముఖంగా నిలబడి, సౌరమంత్రం జపించినా, సూర్యస్తోత్రాలు పారాయణ చేసినా జన్మ ప్రారంభం నుంచి అప్పటివరకు చేసిన పాపాలు నశిస్తాయి.
- గుగ్గులు కర్ర, మారేడు చెక్క లేదా దేవదారు చెక్కతో నలుపలుకలుగా ఉండే ఆసనం తయారుచేసి, దాని మీద ప్రభాకరుని ఆవాహన చేసి, కర్పూరం, అగరు మొదలైన ద్రవ్యాలతో అర్చించిన వారికి స్వర్గలోక ప్రాప్తి స్థిరంగా కలుగుతుంది.
- 'విషువ' అనే పుణ్యకాలంలో సూర్యార్చన చేసిన వారికి సమస్త పాపాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- పులగం, పాయసం, అప్పాలు, పండ్లు, దుంపలు, నెయ్యి తదితర ద్రవ్యాలతో సూర్యబలి ఇచ్చిన వారికి కోరికలన్నీ తీరుతాయి.
- మూలమంత్రాన్ని పారాయణ చేస్తూ, ఆవు నేతితో తప్పరణ చేసిన వారికి సర్వసిద్ధులు కలుగుతాయి. ఆవుపాలతో తర్పణ చేస్తే మనస్తాపాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆవుపెరుగుతో తర్పణ చేస్తే కార్యసిద్ధి లుగుతుంది.
- పవిత్ర తీర్థజలాలతో అరుణ, మహాసౌర మంత్రాలతో సూర్యునికి అభిషేకం చేస్తే పరమపదం లభిస్తుంది.
- భక్తిశ్రద్ధలతో ఆదిత్యుడిని ఒక్కరోజు పూజించిన ఫలితం వంద యాగాలు చేసిన ఫలితాన్నిస్తాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.
వేదాల్లో సూర్యవైభవం
కృష్ణయజుర్వేదంలో సూర్యవైభవం ఎన్నో చోట్ల కనిపిస్తుంది. 'తరణిర్విశ్వదర్‌శతో జ్యోతిష్కృదశి సూర్య...' (కృష్ణ యజుర్వేదం, సంహిత, 1 - 4)లో అనే మంత్రం చీకటితో నిండి ఉన్న సకల జగత్తు అంతా సూర్యుని కాంతి వల్లనే దృగ్గోచరమవుతుందని చెబుతోంది.
నారాయణోపనిషత్తులో 'ఆదిత్యోవా ఏష ఏతన్మండలం తపతి తత్రతా ఋచ:...' అని ఉంటుంది. అంటే సూర్యుని ఆవరించి ఉండే తేజస్సు ఋగ్వేద స్వరూపం. ఆయన నుంచి లోకాలకు అందే వెలుగు సామవేదం. సాక్షాత్తు సూర్యభగవానుడే యజుర్వేద స్వరూపం అని అర్థం.
'సూర్యస్యచక్షూ రజసైత్యావృతం తస్మినార్పిత భువనాని విశ్వా...' (ఋగ్వేదం, 1-164-14) సూర్యుని పైనే సమస్త ప్రాణికోటి ఆధారపడి ఉంది. సూర్యుడు పరమాత్మ స్వరూపుడు.
శ్రౌత కర్మల్లో నిర్వహించే యజ్ఞయాగాది క్రతువుల్లో సూర్యునికే అగ్రస్థానం. చంద్రుని వెన్నెల కూడా సూర్యుని వెలుగు ద్వారా ఏర్పడిందే. ఓషధుల్లో ఉండే ఔషధ గుణం సూర్యుని వెలుగు ద్వారా ఏర్పడిందే. ఇంకా మరెన్నో సూర్యవైభవాలను ప్రకటించే విశేషాలను వేదాలు విస్తారంగా చెబుతున్నాయి.
-----------------------
శ్రీశైల ప్రభ పత్రికలో రాసిన వ్యాసం
-------------------------
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 90320 44115 / 8897 547 548
పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)
పున్నమి కాంతుల కల్యాణం లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...

-
శరత్ చంద్రికలు మనసే మందిరం చందమామ వెన్నెలనే కాదు శుభాలనూ వర్షిస్తాడు కలువలనే కాదు మనసునూ వికసింపజేస్తాడు చీకటి రాత్రులనే కాదు తమస...
-
శ్రీరామ రుద్రాభిషేక వైభవం ఈశ్వరా! అని భక్తితో గొంతెత్తి పిలిచినంతలోనే భక్తులను కటాక్షించే పరమ కారుణ్యమూర్తి పరమేశ్వరుడు....
-
సూర్యుడిని ఎలా ఉపాసించాలి? వేదాల్లో సూర్యుడి గురించి ఏం చెప్పారు? సూర్యోపాసనకు పాటించాల్సిన నియమాలేమిటి? శ్రీ సూర్యనారాయణ వైభవం ...