Wednesday, September 12, 2018

వినాయక స్వామి అందించే వ్యక్తిత్వ వికాస పాఠాల గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం

వినాయకుడు - వ్యక్తిత్వ వికాసం (గణపయ్య చెప్పే పాఠాలెన్నో)

వినాయక చవితి పండగంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. పాలవెల్లి, 21 పత్రాలు, మట్టిబొమ్మ, కుడుములు, ఉండ్రాళ్ళు, పానకం, వడపప్పు... అబ్బో ఎన్నో నైవేద్యాలు... ఎంత హడావిడి. ఏ ఇంట్లో చూసినా గణపయ్య పండుగకి ఎంతో సందడి కనిపిస్తుంది. పాలవెల్లి ఇలా కట్టాలంటూ పెద్దలు చేసే సూచనలు, పక్కింటి వాళ్ళకన్నా మన ఇంట్లో వినాయకుడిని బాగా అలంకరించాలనే పోటీలు... ఒకటా, రెండా? చవితి పండగంటే చేతులు చాలనంత పని ఉంటుంది. ఇంటిల్లిపాదినీ ఇంతగా సందట్లో ముంచెత్తే వినాయ చవితి పండుగలో కేవలం ఆధ్యాత్మికత విషయాలతో ఎన్నో సామాజిక, వ్యక్తిత్వ వికాస విషయాలు కూడా ఉన్నాయి. 

పెద్దతల.. విశాల దృక్పథం

వినాయకుడి పెద్దతల విశాలదృక్పథాన్ని సూచిస్తుంది. ఆటంకాలు, సమస్యలు ఎదురైనప్పుడు సంకుచితంగా ఆలోచించకుండా, సమస్యకు కారణమైన అన్ని అంశాలను సమీక్షించి, ఆలోచించి, విశ్లేషించాలనే సందేశాన్ని ఏనుగుతల అందిస్తుంది. సమస్యను కేవలం మన దృష్టితో, మనవైపు నుంచే చూడకూడదు. మనస్థానంలో ఆవతలి వ్యక్తి లేదా అవతలి వ్యక్తి స్థానంలో మనం ఉంటే ఎలా ఆలోచిస్తామనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, తర్కించుకుని, ఆలోచించాలి. అప్పుడే ఒక నిర్ణయానికి రావాలి. సామాజిక, సంస్థాగత, కుటుంబ, వ్యక్తిగత సమస్యలన్నిటికీ ఈ తరహా ఆలోచన తప్పనిసరి. విశాలదృక్పథమే విజయాలకు నాంది అనే సందేశాన్ని వినాయకుడి ఏనుగు తల (పెద్ద తల) మనకు అందిస్తుంది.

చాటంత చెవులు... సహనం, శ్రవణశక్తి

వినాయకుడి చెవులు సాధారణ చెవుల కన్నా పదింతలు పెద్దవిగా ఉంటాయి. ఎక్కువగా వినే అలవాటు చేసుకోవాలనటానికి పెద్ద చెవులు ఉదాహరణగా నిలుస్తాయి. మనకు నచ్చిన మాటలే వినటమనే లక్షణం సాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అలాకాకుండా, మనకు నచ్చినా, నచ్చకపోయినా అవతలి వ్యక్తి చెప్పే విషయాన్ని శాంతంగా, సహనంగా, సానుకూల ధోరణితో వినాలనే సందేశాన్ని పెద్ద చెవులు అందిస్తాయి. అవతలి వ్యక్తి చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినటం మానవసంబంధాల బలోపేతానికి తొలిమెట్టుగా పనిచేస్తుంది. ప్రధానంగా, ఆటంకాలు ఎదురైన సందర్భంలో కనిపించిన ప్రతి వ్యక్తీ ఏవేవో సలహాలు చెబుతారు. వీటన్నిటిని సహనంతో వినాలి. అంతిమంగా, మన వివేచనతో ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి. 'వినదగునెవ్వరు చెప్పిన / వినినంతనె వేగ పడక వివరింప దగున్‌' అంటూ సుమతీ శతకం చెప్పిన నీతి కూడా ఇదే.

పొడవైన నాసిక... దూరదృష్టి

భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు, ఇతర ఆపదల్ని ముందుగానే పసిగట్టి, దానికి పరిష్కార మార్గాలను ఆలోచించుకోవటం, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధపడటం వివేకవంతుల లక్షణం. వ్యక్తిగతంగానే కాదు.. సంస్థాగతంగానూ ఈ లక్షణం చాలా అవసరం. ఆపద వచ్చాక ఆలోచించటం వల్ల ప్రయోజనం సిద్ధించదు. మనం ఇప్పటికే సమస్యల్లో ఉన్నప్పటికీ, ఈ సమస్య నివారణ కోసం మనం తీసుకోబోయే చర్యల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులేమైనా ఉన్నాయేమో కూడా పరిశీలించుకోవాలి. వినాయకుడి పొడవైన నాసిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. 

నాలుగు చేతులు... ఎక్కువ పని

వినాయకుడికి ఉండే నాలుగు చేతులు... మనం చేసే పనికన్నా రెట్టింపు పని చెయ్యాలనే సందేశాన్నిస్తాయి. చెయ్యాల్సిన పని నుంచి తప్పించుకోవటం సాధారణంగా మనుషుల్లో కనిపించే ప్రవర్తన. కానీ, ఇది ఆహ్వానించదగింది కాదు. అలాగే, ఏదైనా ఇబ్బంది కలిగితే, ఆ ఇబ్బందిని కూడా సాకుగా చూపించి, పని ఎగ్గొట్టే వ్యక్తులు ఉంటారు. వీరందరికి వినాయకుడి నాలుగు చేతులు గొప్ప స్ఫూర్తిని అందిస్తాయి. ఆటంకాల్ని అధిగమించటానికి ఇప్పుడు చేసే పనికన్నా రెట్టింపు పని చెయ్యాలి. అసలు, ఇప్పుడే రెట్టింపు పనిచేస్తే భవిష్యత్తులో ఆటంకాలు వచ్చే అవకాశం చాలావరకు తగ్గుతుంది. నిరంతర పరిశ్రమ మనిషికి కర్తవ్యం వైపు నడిపిస్తుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. ఇటువంటి దుస్థితి మనిషికి రాకూడదనే, వినాయకుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. 

చిన్నకళ్ళు... సునిశిత దృష్టి

ఏనుగు చాలా చిన్న కళ్ళు ఉంటాయి. అంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు అంత చిన్న కళ్ళతోనే తన పనులన్నీ చేస్తుంది. తనను తాను ఏ ఆపదా రాకుండా కాపాడుకుంటుంది. తనకు వచ్చే ఆపదల్ని ముందుగానే పసిగడుతుంది. కళ్ళు ఎంత పరిమాణంలో ఉన్నాయనేది ముఖ్యం కాదు ఎంత నేర్పుగా, నిశితంగా పనిచేస్తున్నాయనేది ముఖ్యం అనే విషయాన్ని వినాయకుడి చిన్ని కళ్ళు తెలియజేస్తాయి. అనవసరమైన విషయాల మీద దృష్టి నిల్పి, తమ కర్తవ్యాన్ని విస్మరించేవారికి వినాయకుడి చిన్ని కళ్ళు 'కళ్ళు' తెరిపిస్తాయి. అలాగే, సమస్యల్లో ఉన్నప్పుడు మనల్ని అనేక విషయాలు ఆకర్షించి, మన దృష్టిని సమస్య నుంచి మళ్ళిస్తాయి. దీంతో, మనం పక్కదోవ పడతాం. ఇది సరైన పద్ధతి కాదని, మన దృష్టి ఎప్పుడూ లక్ష్యం మీదే నిలవాలని సూచిస్తాయి వినాయకుడి చిన్నికళ్ళు. వ్యక్తి నుంచి వ్యవస్థ వరకు ప్రతి ఒక్కరూ సమస్యలోని కీలకాంశాలపైన మాత్రమే దృష్టి నిలపాలని ఇవి ప్రకటిస్తాయి.

కనిపించని నోరు...చేతలకే ప్రాధాన్యం

వినాయకుడి ఆకారాన్ని పరిశీలిస్తే నోరు కనిపించదు. పొడవైన తొండం మాత్రమే కనిపిస్తుంది. అంటే, ఆశయ సాధనకు చేతలే తప్ప మాటలు అవసరం లేదనే సందేశాన్ని వినాయకుడు తన కనిపించని నోరు ద్వారా సందేశం ఇస్తున్నాడని గ్రహించాలి. ముఖ్యంగా ఆటంకాలు ఎదురైన సందర్భంలో, అయోమయానికి గురై చేయాల్సిన పని మర్చిపోయి, మాటలతో కాలం గడిపేస్తూ, తనతో పాటు తోటివారిని, కుటుంబసభ్యులను కూడా మరింత ప్రమాదంలోకి పడేస్తారు కొంతమంది వ్యక్తులు. వీరందరికీ వినాయకుడు గుణపాఠం చెబుతాడు. ఎక్కువగా మాట్లాడటం మానవుడిలోని బలహీన స్వభావానికి ప్రతీక. ఈ బలహీనతను మన శత్రువులు పూర్తిగా వినియోగించుకుని, మనల్ని మరింతగా సమస్యల్లో పడేస్తారు. ఇలాంటి సందర్భాల్లో వినాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలి. తొండం వెనుక నోరు ఉంటుంది వినాయకుడికి. అంటే, మాటల వల్ల ప్రయోజనం లేదు... చేతల వల్ల మాత్రమే నీ సమస్య పరిష్కారం అవుతుందనే సందేశం వినాయకుడి స్వరూపం నుంచి మనకు అందుతుంది.

ఏకదంతం... ఆత్మవిశ్వాసం

ఇతర జంతువులకు కొమ్ములు ఎలాగో, ఏనుగుకు దంతాలు అటువంటివి. ఏనుగు తనను తాను రక్షించుకోవటానికి మాత్రమే కాదు.. దాని అందాన్ని పెంచటానికి కూడా కొమ్ములే ఉపయోగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏనుగు తన దంతాలతోనే పెద్దపెద్ద బరువులు మోస్తుంది. ఈ కొమ్ములు మనిషికి ఉండాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తాయి. ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి కష్టానైన్నా ఎదుర్కోవచ్చనే సందేశాన్ని ఏనుగు కొమ్ములు అందిస్తాయి. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఏనుగుకు ఏ కొమ్ములైతే అందాన్నిస్తాయో, ఏ కొమ్ములైతే బరువులు మొయ్యటంలో సహాయపడతాయో, అవే కొమ్ములు ఒక్కోసారి అడ్డంగా మారి, పని చెయ్యనివ్వవు. అంటే, ఆత్మవిశ్వాసం ఎక్కువైతే పని చెయ్యలేం సరికదా... ఆ ఆత్మవిశ్వాసమే అహంకారంగా మారి, మన అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. అందుకే వినాయకుడు ఒక కొమ్ము తగ్గించుకున్నాడు. అంటే, అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచన ప్రాయంగా చెప్పాడు. మనిషి కూడా ఈ ఆదర్శాన్ని పాటించాలి. ఆత్మవిశ్వాసం ఆయుధంగా ఉండాలే కానీ, అహంకారంగా మారకూడదనే విషయాన్ని ప్రతి మనిషీ ప్రతి క్షణం గుర్తుచేసుకుంటూ ఉండాలి. 

లంబోదరం.. సానుకూల దృక్పథం

వినాయకుడికి పెద్ద పొట్ట ఉంటుంది. ఎదురయ్యే ప్రతి పరిణామాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించాలనే సందేశం ఇందులో ఉంది. తిన్న వస్తువును జీర్ణం చేసుకోవాలంటే, ముందుగా దాన్ని కడుపులోకి పంపించాలి. అక్కడ జీర్ణవ్యవస్థకు తగిన ప్రక్రియ జరుగుతుంది. పెద్దపొట్ట అపారమైన జీర్ణశక్తికి సంకేంతం. ఆయశ సాధనలోఎదరయ్యే ప్రతి కష్టాన్నీ జీర్ణించుకోవాలని వినాయకుడి లంబోదరం సంకేతాన్నిస్తుంది. జీర్ణం చేసుకోవటం అంటే ప్రతి విషయానికి ప్రతిస్పందించకుండా ఉండటం అని అర్థం కాదు. సంఘటనను అర్థం చేసుకుని, దాని ద్వారా అనుభవసారాన్ని గ్రహించి, భవిష్యత్తుకు పాఠంగా మార్చుకోవాలనే సూచన ఇందులో ఉంది. వ్యక్తిగతంగా మెరుగైన జీవితం పొందటానికి కూడా ఈ లక్షణం ఎంతో అవసరం. 

ప్రకృతి పాఠాలెన్నో....

వినాయకుడంటే ప్రకతి. మహాగణాధిపతి మట్టితో పుట్టిన వాడు. భూమిని, ప్రకతి సంపదను కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనేది వినాయక చవితి సందేశం. గణపతిని 21 రకాల పత్రితో పూజించాలంటారు. ఎందుకంటే పంచేద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిస్తే మొత్తం పది. వీటికి ప్రవత్తి, నివత్తి కలిపితే 21 అవుతాయి. ఇవే 21 రకాల పత్రి. అవన్నీ సిద్ధి, బుద్ధి చేకూర్చాలని కోరుకోవడమే పత్రి పూజ అంతరార్థం. అంతేకాదు, పూజించే ప్రతి పత్రిలోనూ ఔషధ గుణాలుంటాయి. అవి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి, ఆనందానికి దోహదం చేస్తాయి.

వినాయక చవితి నాడు వివిధ రకాల పండ్ల వాడకం ఎంతో ప్రతీతి. పాలవెల్లికి కట్టడానికి, భక్తితో గణపతికి నివేదన చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. వాటిల్లో చాలామటుకు మహిళల ఆరోగ్యానికి దోహదం చేసేవే. మొక్కజొన్న పొత్తుల్లో పీచు అధికం. దీనివల్ల అనవసరపు కొవ్వు చేరుకోదు. వాటిల్లోని ఫొలేట్‌ కణాలు గర్భధారణ సమయంలో కొత్త కణాల ఉత్పత్తికి సహకరిస్తాయి. సీతాఫలంలో క్యాన్సర్‌ రాకుండా చూసే యాంటీ ఆక్సిడెంట్లు అధికం. బత్తాయిలు, నారింజల్లో విటమిన్‌ 'సి' ఉంటుంది. గర్భిణులకు అవసరమైన ఫోలికామ్లం, పీచు, పొటాషియం పెద్దమొత్తంలో వీటి నుంచి అందుతాయి. చింతకాయలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

సామాజిక జీవన ప్రతిబింబం

సామాజిక జీవనానికి వినాయక చవితి ప్రతీక. పత్రి సేకరణలో, పాలవెల్లి అలంకరణలో, పూజా ద్రవ్యాలను సమకూర్చడంలో, పుస్తకాలు పక్కన ఉంచి పూజ చేయడంలో పిల్లల భాగస్వామ్యం అధికం. తెలుగునాట, పల్లెపట్టుల్లో చూస్తే.. ఈ పర్వదినానికి ముందురోజు తరగతులు త్వరగా ముగించి, విద్యార్థులను పత్రి సేకరణ చేయమనేవారు. కొందరు పూజకు పుష్పాలు తెస్తే, శారీరక దార్యం ఉన్నవారు చెట్లెక్కి వెలగపండ్లు కోసి తెచ్చేవారు. భయం లేని చిన్నారులు పొదల్లోకి వెల్లి ఉమ్మెత్త వంటివి పట్టుకొచ్చేవారు. ఇలా వారి వ్యక్తిత్వాలు వెల్లడయ్యేవి. సేకరించిన వాటిని అందరూ పంచుకునే వారు. ఈ ప్రక్రియ వల్ల అరిటాకుల్ని పిలకల వద్ద కోస్తే మళ్లీ పెరుగుతాయనే వ్యవసాయ జ్ఞానం వారికి అబ్బేది.

మట్టికి కుమ్మరి, పాలవెల్లికి వడ్రంగి, ఫల పుష్పాదులకు వ్యవసాయదారుడు, వెదురు బుట్టలకు మేదరి.. గ్రామీణ వత్తుల ప్రాధాన్యం తెలపడం ఈ పండగ ప్రత్యేకం. కాలం మారినా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి వత్తి మీదా గౌరవం చూపాలనేదే సంకేతం. అలాగే వినాయకుడి ప్రతిమ మట్టితో తయారు చేయడమే సంప్రదాయం. బంకమట్టి తెచ్చి పిల్లలు వినాయకుడిని తయారు చేస్తారు. ఒకరు ఒక రకంగా, ఇంకొకరు మరోరకంగా.. చూస్తుండగానే అవతలి వారిది బాగా రూపుదిద్దుకొంటుంది.. బాగా రానివారికి వేరొకరు సాయం చేస్తారు. మనసుల్లో పోటీ, వచ్చే ఏడు మరింత బాగా చేయాలన్న తపన.. ఈ కళాత్మక జిజ్ఞాస వికాసానికి ఉపయోగపడుతుంది.
సూక్ష్మదృష్టితో కార్యసాధనకు ఉపక్రమించాలని, తల్లిదండ్రుల్ని మించిన పుణ్యతీర్థాలు లేవని వినాయక వ త్తాంతం తెలుపుతుంది. పాలవెల్లి సృష్టికి, పాల సముద్రానికి ప్రతీక. ఆరంభంలో హాలాహలం ఎదురైనా ఓపిక, పట్టుదలతో ముందంజ వేస్తే ఆనందాలు, అన్ని సంపదలూ సమకూరుతాయన్న అంతరార్థం దానిలో ఉంది. ఈ పర్వదినాన వినాయకుణ్ని భక్తితో పూజిస్తే జయం కలుగుతుంది. విద్య లభిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ అందుతుంది. సర్వార్థ సిద్ధి ఒనగూరుతుంది.
విగ్రహం ఎంపికలోనూ ఓ చక్కటి భావాన్ని విడమరిచి చెప్పిన వ్కెనం స్కాందపురాణం, మంత్రశాస్త్రంలో గోచరిస్తుంది. గణేశుని తొండం లోపలికి ఉంటే యోగ సాధన. బయటికి ఉంటే ఇహలోక కోరికలు. ఎడమ పక్కకు తిరిగి ఉంటే పదిమందికీ ఉపయోగపడే తత్వం. కుడిపక్కకు తిరిగి ఉంటే నేను, నా కుటుంబం, బంధుమిత్రుల సంక్షేమం అని అర్థం. అయితే ఈ భాద్రపద చవితినాడు, ఏ రూపంలో ఉన్న గణపతికి పూజ చేసినా సకల శుభాలు కలగడం తథ్యం.
=========================================================

రచన

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు,  ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ-3.  కృష్ణాజిల్లా. సెల్‌ : 90320 44 115 / 8897 547 548






గణపతి తత్త్వం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం - భక్తి పత్రిక. 2018 సెప్టెంబర్ సంచికలో ప్రచురితం

గణపతి తత్త్వం


వినాయకుడు అనే పేరు పలకగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది. అంతులేని ఆనందం కలుగుతుంది. పసి బిడ్డల నుంచి పండు ముసలి వారి వరకు గణపతి లేదా వినాయకుడు అనగానే ఓ చైతన్యం తమని ఆవహించినట్లుగా భావిస్తారు. గణపతి తనకు మాత్రమే చెందిన దేవుడు. తన గోడు వింటాడు. తనకు ఏ కష్టం రానివ్వడని ప్రతి భక్తుడూ భావిస్తాడు. భక్తుల మనసుల్లో ఇంతగా సుప్రతిష్ఠమైన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి.
ముద్గలపురాణంలో వినాయకచవితి పూజా నియమాల గురించి విస్తారంగా వర్ణితమై ఉంది. కణ్వమహర్షి భరతుడికి గణపతి తత్త్వాన్ని, భాద్రపద శుక్ల చవితి వ్రత మహిమ గురించి వివరించినట్లు అందులో ఉంది. ప్రధానంగా మట్టిగణపతి ఎందుకు పూజించాలనే విషయాన్ని ముద్గలపురాణం స్పష్టంగా చెబుతుంది.

మట్టి గణపతే ఎందుకు?


ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడపదార్థం. నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల - అంటే జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది. తద్వారా ఆహారపదార్థాలు, ఓషధులను మనకు అందిస్తుంది. ఈవిధంగా ప్రాణాధార, జడశక్తుల కలయికతో సృష్టిసాగుతోందనటానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి పూజించేవిధానం ఏర్పడింది.

మట్టిగణపతిని పూజించటంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి. మానవశరీరంలో ఉండే షట్చక్రాల్లో మొదటిది మూలాధార చక్రం. ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి గణపతి అధిష్ఠాన దేవత. మూలాధారం పృధ్వీతత్త్వం కలిగిఉంటుంది. పృధివి అంటే భూమి. కాబట్టి, భూమికి సంకేతంగా మట్టితో గణపతిని చేసి, మూలాధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి. దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది.

పంచభూతాలకు ప్రతీక


భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల్లోని ప్రతి భూతంలోనూ, దాని తత్త్వం 1/2 వంతు, మిగిలిన నాలుగు భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్త్వం 1/2 భాగం అయితే, 1/8 భాగం జలం, 1/8 భాగం అగ్ని, 1/8 భాగం వాయువు, 1/8 భాగం ఆకాశం ఉంటాయి. దీన్నే 'పంచీకరణం' అంటారు.
ఒక్కో తత్త్వానికి ఒక్కో అధిష్ఠానదేవత ఉంటారు. భూతత్త్వానికి అధిష్ఠాన దేవత గణపతి, ఆకాశతత్త్వానికి ఈశ్వరుడు (శివుడు), జలతత్త్వానికి నారాయణుడు, అగ్నితత్త్వానికి అంబిక, వాయుతత్త్వానికి ప్రజాపతి (బ్రహ్మ) అధిదేవతలు. మనం పూజించే మట్టి విగ్రహంలో గణపతి తత్త్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన దేవతల తత్త్వాలు 1/2 భాగం ఉంటాయి. 'ఆకాశాత్‌ పతతితం తోయం యథా గచ్ఛతి సాగరం / సర్వదేవ నమస్కార : శ్రీకేశవం ప్రతిగచ్ఛతి' అన్నట్లు ఎన్నో రూపాల్లో, ఎన్నో విధాలుగా కనిపించినా పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠానదేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్ధాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలగదు.  ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సష్టి ధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్త్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి.

మంత్ర, యోగ గణపతి


యోగశాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధారచక్ర అధిష్ఠాన దేవతగా భావించటం జరుగుతుంది. మూలాధారంలో సుషుమ్న నాడి మూడుచుట్టలు చుట్టుకొని, పైన పడగ కప్పుకొని ఉన్న పాములాగ ఉంటుంది. సాధకుడు యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేల్కొలపాలి. దీంతో మిగిలిన ఐదు చక్రాలు కూడా ఉత్తేజితం అవుతాయి. చివరగా, హంస రూపంలో మనిషి శరీరంలో సంచారం చేసే ప్రాణవాయువు సహస్రార కమలాన్ని చేరుకుంటుంది. కపాలమోక్షం ద్వారా అక్కడి నుంచి ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇంతటి యోగప్రక్రియ జరగటానికి మూలాధారం - 'మూలాధారానికి ఆధిష్ఠాన దేవతగా ఉన్న గణపతి'.
సుషుమ్న నాడిని అనుసరించి ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి. వీటిలో 'ఇడ' జ్ఞానానికి (బుద్ధి) సంకేతం కాగా, 'పింగళ' సిద్ధికి సంకేతం. సుషుమ్మ ఎల్లప్పుడూ ఇడ, పింగళతో కలిసే ఉంటుంది. అంటే, మూలాధార స్వరూపమైన గణపతి - సిద్ధి, బుద్ధిలతో కలిసి ఉంటాడని భావం. గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలు అనటంలో అంతరార్థం కూడా ఇదే.
మనలో ఉన్న పాపాలు తొలగితే మంచి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మంచి బుద్ధి కలుగుతుందో అప్పుడు లౌకికమైన విషయాల నుంచి మనసు దూరమై, శాశ్వతమైన ముక్తిస్థానాన్ని కోరుకుంటుంది. గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి కలిగి, మోక్షం వైపు మనిషి సాధన జరుగుతుంది. ఇలా, జరిగే సాధనకు గణపతి అనుగ్రహం తోడైతే, విషయవాసనల మీద వైరాగ్యం కలుగుతుంది. అంతిమంగా మోక్షం సిద్ధిస్తుంది. ఇదే, గణపతి ఉపాసనలోని అంతరార్థం. గణపతి తత్త్వం.

ఓంకార స్వరూపుడు గణపతి


బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం- ఈ నాలుగింటి పరిపూర్ణ, దివ్యతత్వమే గణపతి స్వరూపం. 'బలవంతుల్లో అధికుడు, బలానికి అధిదేవత హేరంబుడు' అని పార్వతికి శివుడు బోధించినట్లు హేరంబోపనిషత్తు వర్ణిస్తోంది. బలానికి ఏనుగు ప్రతీక అని చెప్పడం శాస్త్రాల్లో సర్వ సాధారణం. నాగాయుత బలుడు (పదివేల ఏనుగుల బలం కలవాడు), మహా బలశాలి అని వర్ణించడం పురాణాల్లో కనిపిస్తుంది. భీముడికి ఈ బిరుదు  ఉంది. గజవదనుడ్కెన గణపతి బలానికి సంకేతంగా స్వరూపం ధరించాడు.
ఇంకొక కోణంలో, గజం ఐశ్వర్యానికి సూచన. గజలక్ష్మి రూపానికి ఇరువ్కెపులా ఏనుగులు ఉన్నట్లు ఆగమాలు వర్ణిస్తున్నాయి. గణపతిని సంపదలకు దేవతగా, ప్రదాతగా సంభావిస్తారు. లక్ష్మీ గణపతి అనే ఉపాసనలో ఈ తత్వాన్నే చెబుతారు. శివపార్వతుల తనయుడిగానే కాకుండా, శివశక్తుల ఏకరూపమైన పరబ్రహ్మగా గణపతిని ఆరాధించే ఉపాసనా సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి.
తెలివికి దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు. 'కోరిన విద్యలకెల్ల ఒజ్జ (గురువు)యై' అని స్వామిని కొలుచుకోవడం పరిపాటి. అందుకే విద్యార్థులతో గణపతిని ఆరాధింపజేసే సత్సంప్రదాయం మనకు ఉంది. ఓంకారమే గజవదనంగా, 'అ'కారం నుంచి 'క్ష'కారం వరకు ఉన్న అక్షరాలను కంఠం మొదలు చరణందాకా వివిధ అంగాలుగా భావించి మహర్షులు 'అక్షర గణపతి'ని ఆవిష్కరించారు.
గణం అంటే గుంపు. సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి. నాయకత్వ లక్షణాలకూ ఆయనే అధినాథుడు. శిక్షణనిచ్చి బుద్ధిని దిద్దే ప్రభువు 'వినాయకుడు'. కోరినవి సిద్ధింపజేయడం వల్ల 'వరసిద్ధి వినాయకుడు' అనే పేరు పొందాడు.  దుఃఖం, అజ్ఞానం, దారిద్య్రం వంటి బాధలు ప్రగతికి, పరమార్థానికి అడ్డంకులు. వాటినే 'విఘ్నాలు' అంటారు. అలాంటి విఘ్నాలను పోగొట్టి విజయానందాలను ప్రసాదించే దైవం- విఘ్నేశ్వరుడు.
అ, ఉ, మ- అనే మూడు అక్షరాలతో త్రిగుణాలు సష్టి, స్థితి, లయ అనే క్రియలను జాగత, స్వప్న, సుషుప్తి అనే అవస్థలను తెలియజేస్తున్నాయి. ఈ మూడింటికీ పైన ఉండే అత్యంత సూక్ష్మతత్త్వం పరబ్రహ్మ! జగమంతటా వ్యాపించిన ఆయన జగత్తుకు అతీతుడు. ఈ తత్త్వమే గణపతి వదనంలో గోచరిస్తుంది. అదే సంపూర్ణ 'ఓం'కార భావం.
ప్రపంచంలో అనుభవించే జాగత, స్వప్న, సుషుప్తి అవస్థలు- మూడు. నిర్గుణమైన సమాధి స్థితి నాలుగోది. దాన్ని 'తురీయం' అని ఉపనిషత్తు చెబుతోంది. మొదటి మూడూ- సగుణ ప్రపంచం. ఇదే గణేశుని కంఠం నుంచి పాదం వరకు ఉన్న స్వరూపం. గజవదనం తురీయ తత్త్వం. 'జగన్మయం' శరీరం, 'చిన్మయం' గజవదనం. జగన్మయ చిన్మయాలు రెండూ పరమాత్మే అన్న భావమే గజాననుడి స్వరూపం బోధిస్తున్న తత్వం. జగతిలోని మూడు గుణాలు, జగతికి అతీతమైన తురీయం- ఈ 'నాలుగు' చతుర్థీ తిథిలోని భావం. ప్రపంచాన్ని పరమాత్మమయంగా చూస్తూ లోకానికి, లోకేశునికి ఉన్న ఐక్య తత్త్వాన్ని అతీతత్త్వాన్ని గ్రహించే ప్రయత్నమే గొప్ప ఆధ్యాత్మిక సాధన. 'ఓం'కార స్వరూపుడైన గణపతి ఆరాధనలోని అంతరార్థం ఇది.

======================================

రచన:

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు,  ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ-3. కృష్ణాజిల్లా.

సెల్‌ : 90320 44 115 / 8897 547 548





పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...