Tuesday, July 2, 2019

శ్రీకృష్ణుడి వేణుగానం, ఆ స్వామి ధరించే నెమలిపింఛం విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

నెమలి నుంచి భావాలు వెదురు నుంచి రాగాలు
ఇది పరమాత్మతత్త్వం 
నెమలి నుంచి భావాలు వెదురు నుంచి రాగాలు 
సెప్టెంబరు 2 శ్రీకృష్ణ జన్మాష్టమి
గోకులంలో నందకిశోరుడుగా... నవనీత చోరుడుగా ఉన్నా... కురుక్షేత్రంలో అర్జున రథసారథిగా మారి... కర్తవ్యాన్ని బోధించి మహాభారతాన్ని నడిపినా పరమాత్మది భిన్నమైన శైలి... ఆయన అడుగుజాడలే కాదు ఆహార్యం కూడా అద్భుతమే... ఆయన రూపవిలాసంలో ప్రస్ఫుటంగా కనిపించేవి... అందంగా ఇమిడిపోయినవి  నెమలి పింఛం... పిల్లన గ్రోవి... ఓ పక్షి శరీరంపై ఉన్న ఈకలు భగవానుడి అలంకారమయ్యాయన్నా, వనంలోని వెదురు ఆయన చేతిలో రాగాలు పలికించిందన్నా వాటికి ఉన్న ప్రత్యేకమైన లక్షణాలే కారణం...
నల్లనయ్య సిగలో నిగనిగలాడుతూ, ఠీవిగా నిలబడే నెమలిపింఛాన్ని చూడగానే మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. కృష్ణుడు అనగానే నెమలిపింఛం గుర్తుకు వస్తుంది. కన్నయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన అలంకారం కూడా పింఛమే. నెమలి ఎంత పుణ్యం చేసుకుందో కదా అనిపిస్తుంది.
నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు... లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లనివర్ణంతో ప్రకాశిస్తుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్ల పక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి.
నెమలి తన జీవితకాలమంతా అందరినీ ఆకర్షిస్తుంది. అందరూ నెమలిని చూసి ఎంతో ఆనందిస్తారు. జీవితం ముగిసిన తర్వాత కూడా నెమలి వదిలిన పింఛం కూడా నెమలి తీరులోనే అందరినీ ఆకర్షిస్తుంది.కొద్దికాలం జీవించిన నెమలి కన్నా జీవం లేకపోయినా నెమలి పింఛం మాత్రం తరతరాలపాటు అందరి మనసుల్నీ మురిపిస్తూనే ఉంటుంది. మానవ జీవన సత్యం ఇందులో దాగి ఉంది. బతికినన్నాళ్లూ అందరూ ఏదో ఒకరకంగా మనల్ని అంటిపెట్టుకుని ఉంటారు.  కానీ, మనం భౌతికంగా లేని రోజున కూడా ఆ జ్ఞాపకాలను అట్టిపెట్టుకునే ఆప్యాయత మనం సంపాదించుకోవాలి.
నెమలి పింఛాన్ని ఒకసారి చేతితో గట్టిగా రుద్దితే ప్రాణం ఉన్నదానిలా మరింత విశాలంగా విచ్చుకుంటుంది. భౌతికశాస్త్రపరంగా చూస్తే, ఈ ప్రక్రియ స్థిరవిద్యుత్‌ ప్రవాహానికి సంకేతం. మనిషి మనసుది కూడా ఇదే తీరు. తనకు నచ్చిన, తాను మెచ్చిన అంశంతో ఎక్కువసేపు రమిస్తే అతడి మనస్సు  అమితమైన ఆనందం పొందుతుంది.
నెమలిపింఛంలోని రంగులు, వాటిలోని వైవిధ్యం గురించి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడించారు. ద్విజ్యామితీయ స్ఫటిక అమరిక వల్ల పింఛంలో విభిన్నమైన రంగులు ఏర్పడుతున్నాయని కనుగొన్నారు. ఈ అమరికలో వచ్చే తేడాల వల్ల రంగులు పరావర్తనం చెంది, మెరుపుల మాదిరిగా కనిపిస్తాయి.చూడటానికి పింఛాలన్నీ ఒకేతీరులో కనిపించినా, సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ అందాల వన్నెల్లో ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. ఇవన్నీ సృష్టిలోని మనుషుల లక్షణాలకు సంకేతంగా నిలుస్తాయి.  ఎవరి కర్మలు భగవంతుడికి ప్రీతి కలిగిస్తాయో, అతడు నెమలిపింఛం మాదిరిగా పరమాత్మ ఆదరణకు పాత్రుడవుతాడు.
పింఛం ఎటుచూసినా ఒకేలా కనిపిస్తుంది.  మనిషి మనసు కూడా లోపల, బయటా ఒకేవిధంగా ఉండాలని పింఛం అందిస్తున్న సందేశం ఇది. చీకటిలో ఉన్నా, వెలుగులో ఉన్నా పింఛం ఏవిధమైన మార్పునకు లోనుకాదు. బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదనే సత్యాన్ని పింఛం మనిషికి బోధిస్తుంది.
కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపొందారు. కన్నయ్య తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. ఉండబట్టలేక, నేరుగా వేణువు దగ్గరకే వెళ్లి అడిగారు. ఏమమ్మా! ఏమిటీ నువ్వు చేసుకున్న పుణ్యం. గోపయ్యను కట్టేసుకున్నావు. ఏం మాయ చేశావు? నీకు ఇంతటి శక్తి ఎలా వచ్చిందని నేరుగా అడిగేశారు. వేణువు అందికదా... ‘నేను చేసింది ఏమీ లేదమ్మా! నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అంది. తత్త్వం బోధపడింది గోపికలకు. నిజమే! వేణువు అంతా శూన్యం. అంటే, పరిపూర్ణతకు చిహ్నం. తనకంటూ ఏమీ లేదు మనసులో ఏ మాలిన్యమూ, ఏ భావమూ, వికారమూ లేదు. తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు... వేణుమాధవుడు మాత్రమే. మానవుడు అందుకోవాల్సిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది. నేను, నాది అనే వికారాలకు మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు.
ఇతర వాద్యాలకు భిన్నమైన సంగీత వాద్యం వేణువు. ప్రకృతిలో అత్యంత సహజంగా లభించే వెదురు పదార్థం నుంచి తయారైంది. ఏవిధమైన ఆడంబరాలు, అలంకారాలు, బిగింపులు లేవు. మనిషి కూడా వేణువు కావాలి. అత్యంత సహజమైన భక్తి భావంతో ఉండాలి. వేణువు అందిస్తున్న సందేశం ఇదే.
వేణువులో ఉండే రంధ్రాలు మానవశరీరంలో ఉండే షట్చక్రాలకు సంకేతం. వేణువులోని ప్రధానరంధ్రం ద్వారా గాలి ఊదుతూ, ఇతర రంధ్రాల మీద వేళ్లు ఉంచి, ఆ వాయువును నియంత్రిస్తే, కమ్మనైన నాదం ఆవిర్భవిస్తుంది. ఆ నాదం పరమాత్మకు పూజా పుష్పంగా మారుతుంది.  యోగశాస్త్రం ప్రకారం మానవశరీరంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది. దీన్నే యోగపరిభాషలో ‘హంస’ అంటారు. షట్చక్రాల్లో సాగే వాయుసంచారాన్ని నియంత్రించటమే యోగసాధన. ఎప్పుడైతే ప్రాణవాయువు మీద నియంత్రణ సాధ్యమవుతుందో, ఆ సాధకుడు యోగిగా మారుతాడు.  వేణునాదం మన జీవన నాదానికి ప్రతిరూపం.
- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, విజయవాడ

భగవాన్ సత్యసాయి బాబా బోధనల విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

బంగారూ! ఇదే పంచశీల 
సత్యం... శివం... సుందరం
23న సత్యసాయి జయంతి
బంగారూ! ఇదే పంచశీల 
ఆయన వద్ద మంత్రాలన్నీ మామూలు మాటలయ్యాయి. ఆయన మాటలు మంత్రాలుగా మారి సమ్మోహితులను చేశాయి. అలతి అలతి పదాలతో వేదోపనిషత్తుల సారాన్ని ప్రజలకు పంచిన  ఆయన మానవాళికి ప్రేమ, సేవలను తారక మంత్రాలుగా అందించారు. అందుకే ఆయన నడిచే దేవుడయ్యారు... కదిలే బ్రహ్మమయ్యారు. ఆదర్శ పురుషులుగా ప్రపంచ ప్రఖ్యాతిపొందారు...
నేేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు తెలియదు. మీ హృదయాల్లో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయటానికే వచ్చాను. నేను ఏదో ఒక మతం తరఫున గానీ, ఒక సంఘం తరఫునగానీ ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను పోగుచెయ్యటానికి రాలేదు. నా మార్గంలో కాని, మరో మార్గంలో కాని శిష్యులను, భక్తులను ఆకర్షించం నా అభిమతం కాదు. విశ్వవ్యాప్తమైన ఒకే ఒక ఆధ్యాత్మికసూత్రం ‘ప్రేమ’ అనే మార్గం, ధర్మం అనే బాధ్యత. ఈ రెండు జ్యోతుల్ని మీకు అందించటానికే వచ్చాను... అంటూ తన మార్గాన్ని విస్పష్టంగా ప్రకటించి, తన ఆశయాల్ని ఆచరణలోకి తీసుకువచ్చిన ప్రేమమూర్తి సత్యసాయిబాబా.
 
1. మానవుడే మాధవుడు
దేవుడు గుళ్లల్లో, రాళ్లల్లో ఉండడు. మనుషుల్లో ఉంటాడు. తనలో దాగిఉన్న మాధవుడిని గుర్తించటమే జీవితలక్ష్యం కావాలంటారు సాయి. ఇందుకోసం ఆయన ప్రవచించిన మార్గం ‘సేవ’. కనబడే మనిషిని ప్రేమించలేకపోతే కనిపించని దైవాన్ని ఎలా ప్రేమించగలవు? ఎలా గుర్తించగలవు? అంటూ సూటిగా ప్రశ్నించేవారు. ఈ భావాన్ని ప్రతి వ్యక్తిలో ఉద్దీపింపజేయాలన్నదే ఆయన ఆశయం. అందుకనే తన ప్రతి ఉపన్యాసాన్ని దివ్యాత్మస్వరూపులారా! అంటూ ప్రారంభించేవారు. అందరినీ ప్రేమించు... ఎవరినీ ద్వేషించకు. తోటివారి బాధ నీదిగా భావించు. మానవసేవే మాధవ సేవ అంటూ ఎంతో స్పష్టంగా మానవధర్మాన్ని మానవీయకోణంలో సాయి ఉద్బోధించారు. సత్యసాయి సంస్థలన్నిటిలో ఆచరణాత్మకంగా కనిపించేది ఈ భావమే. ఆర్తులు,  అనారోగ్యపీడితులు... అందరినీ సాయి అక్కున చేర్చుకున్నారు.  వారికి సేవ చెయ్యటాన్నే దైవారాధనగా భావించేవారు.
సాయి మాటల్లో...
హృదయం : హృదయం లేని మాటకన్నా, మాటలేని హృదయం మిన్న
విద్య : గుణార్జనే కానీ ధనార్జన కోసం కాకూడదు
త్యాగం : దేహాభిమానాన్ని వదిలేయడం
సుఖం : రెండు దుఃఖాల మధ్య విరామం
దాసులు : హరికి కావాలి కానీ సిరికి కాదు
జీవనం : ఆశయాల కోసం... ఆశల కోసం కాదు
బలం : గుణాన్ని మించిన బలం లేదు
2. ప్రేమే మార్గం
తన గుండెల్లో భగవదైశ్వర్యాన్ని నింపుకోమనీ, నీచమైన అహంకారాన్ని విడిచిపెట్టమని ప్రతి మతం బోధిస్తుంది. వైరాగ్యాన్ని, విజ్ఞతనూ పెంచుకుని మోక్షాన్ని సాధించుకోవటాన్ని నేర్పుతుంది. అన్ని హృదయాల్లో వెలిగేది ఒకే ఒక దేవుడు. అన్ని మతాలూ ఆ భగవంతుడినే కీర్తిస్తున్నాయి. అన్ని భాషలూ ఆ పేరే చెబుతున్నాయి. ప్రేమే భగవంతుడిని ఆరాధించటానికి అత్యుత్తమమైన మార్గం. ఈ ప్రేమే నేను మీకిచ్చే సందేశం. ఈ ఐక్యభావాన్ని అవగతం చేసుకోండి అంటారు సాయి. ఆకాశం నుంచి వచ్చే వాన ఎక్కడ కురిసినా చివరకు సముద్రాన్నే చేరుతుంది. అలాగే, ఏ దేవుడిని ఆరాధించినా అది చివరకు చేరేది ఒకే పరమాత్మ దగ్గరకి అంటాయి ఉపనిషత్తులు. సాయి ఆచరించి చూపించిన మార్గం కూడా ఇదే.
3. నువ్వే... నువ్వే
మనిషి పొందే ఆనందానికి, దుఃఖానికి అతడే కారణం. ఇతరుల వల్ల నువ్వు దుఃఖపడేదీ లేదు. ఆనందం పొందేదీ లేదు. నువ్వు సంతోషంగా ఉంటే ఎవరూ పలకరించరు. అదే, బాధలో ఉంటే ఎందుకు విచారంగా ఉన్నావంటూ పలకరిస్తారు. ఆనందానికి, దుఃఖానికి ఇదే తేడా. ఆనందం మనకు సహజంగా వస్తుంది. దుఃఖం మనం తెచ్చిపెట్టుకున్నది. నువ్వు అనుభవించే బాధలకు నువ్వే కారణం. దాన్ని ఇతరుల మీద నెట్టే గుణాన్ని వదులుకోమంటూ సాయి యువతకు దిశా నిర్దేశం చేశారు. నీలో ఉన్న శక్తిని గుర్తించు. అంతులేని విజయాన్ని సాధిస్తావు అనేవారు.
4. ఉత్తిష్ఠ... జాగృతః
మీరంతా నాస్తికులుగా మారినా నాకు ఇష్టమే. కానీ, మూఢవిశ్వాసాలకు బలికాకండి. మీలో ఉన్న ప్రజ్ఞను మసిబారనివ్వకండి. మనిషికి మూఢవిశ్వాసం ప్రబల శత్రువు. దాన్ని ఆశ్రయించటాన్ని మించిన మూర్ఖత్వం ఉండదు. మీలో ఉన్న విచక్షణా జ్ఞానానికి పదును పెట్టండి. జ్యోతిష్యం, జాతకాల భ్రమలో జీవితాన్ని బలిచేసుకోకండి... అంటూ స్పష్టంగా యువతకు నిర్దేశం చేశారు సాయి.  ముక్కుమూసుకుని ‘సోహం.. సోహం’ అంటూ జపించటం, అలాచేసేవారిని ప్రోత్సహించటం సాయి సిద్ధాంతం కాదు. ‘సాధకుడా! లే ! నడుంకట్టు! సమాజ సేవలో ప్రవేశించు!’ అని ప్రోత్సహించటమే సాయి సిద్ధాంతం.
4. పరిపూర్ణంగా ఉండు
సాయిబోధనల్లో కర్మ, భక్తి మార్గాలు కనిపించినా అదంతా అద్వైతానికే దారి తీస్తుంది. సనాతన ధర్మాన్ని, విశ్వమానవ ప్రేమను ప్రబోధించిన సాయి, సమాజంలో నానాటికీ క్షీణిస్తున్న దైవవిశ్వాసాన్ని, ధర్మజిజ్ఞాసను పునరుద్ధరించారు. ఆదిశంకరాచార్యుల మార్గం కూడా ఇదే.ఆయనా పరిపూర్ణత్వాన్నే ఆకాంక్షించారు. ‘నహి నహి రక్షతి డృజ్ఞ్‌ కరణే’  ఆత్మజ్ఞానం లేని చదువు వ్యర్థమని ప్రకటించి, భజగోవింద స్తోత్రాన్ని రాశారు శంకరులు. సాయి మార్గమూ ఇదే.
-డా.కప్పగంతు రామకృష్ణ

చదువుకు వేళాయే.... (డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రచన)

చదువుకు వేళాయే...

మీ పిల్లలకు చెప్పండి!
 
  


    చదువు అంటే కేవలం అక్షరాల జ్ఞానం మాత్రమే కాదని... అదో అంతులేని విజ్ఞానసాగర మథనమని... దానికోసం  కష్టాలు పడాలి.. కన్నీళ్లకు ఎదురీదాలి... పరీక్షలకు నిగ్గుతేలాలి... అవాంతరాలను అధిగమించాలి... అయినా ఇష్టంతో సాధన చేస్తే సిసలైన సంపద మీ సొంతమవుతుందని... మీ పిల్లలకు చెప్పండి... జ్ఞానార్జన కోసం తపించిన ఈ విద్యార్థుల గురించి వివరించండి!

శివుడూ చదువుకున్నాడు!

ఎవరైనా, ఎంతటివారైనా నేర్చుకునే సమయంలో  విద్యార్థిగా ఉండాల్సిందే. ఈ విషయంలో అభ్యంతరాలు పనికిరావు.
కైలాస పర్వతంపై తన శిలాపీఠం మీద పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా కొలువై ఉన్నాడు. అంతా తానై, అన్నీ తానే అయిన శివుడికి సైతం ఆ రోజు పెద్ద సందేహం వచ్చింది. ప్రణవం అంటే ఏమిటి? ప్రణవతత్త్వం ఏమిటి? ఎంతగా ఆలోచించినా తనకు బోధపడటం లేదు. బ్రహ్మ, విష్ణువులను అడిగినా తమకు సాధ్యం కాదన్నారు. నీ బిడ్డ షణ్ముఖుడే ఇందుకు సమర్థుడని చెప్పారు. దాంతో శివుడు నేరుగా కుమారస్వామినే తన సందేహం తీర్చమని అడిగాడు. ‘చెప్పేది నేను. వినేది నువ్వు. నీ సందేహం తీర్చే నాది గురుస్థానం. వినే నీది శిష్యస్థానం. కాబట్టి, నువ్వు కింద కూర్చుంటే నేను పీఠం మీద కూర్చుని బోధ చేస్తానన్నాడు కుమారుడు. సరేనన్నాడు శివుడు. బిడ్డే స్వయంగా తండ్రికి ప్రణవ తత్త్వాన్ని ఉపదేశించాడు. పరమేశ్వరుడు విద్యార్థిగా మారి మానవ జాతికి మహోపకారం చేశాడు. ప్రణవ తత్త్వం లోకానికి అందింది. ఇక్కడ  స్కందుడు గొప్ప గురువు. పరమేశ్వరుడు ఉత్తమ విద్యార్థి.

తలకెక్కితే తిప్పలే!

ఎంత నేర్చుకున్నా విద్యార్థికి గర్వం ఉండకూడదు ఈ ఒక్క దుర్లక్షణం వల్ల నేర్చుకున్నదంతా నిరుపయోగమైపోతుంది.
యాజ్ఞవల్క్యుడు బాష్కలమహర్షి దగ్గర రుగ్వేదం, జైమిని వద్ద సామవేదం, అరుణి మహర్షి వద్ద అధర్వణవేదం అధ్యయనం చేశాడు. ఆ తర్వాత వైశంపాయనుడి వద్దకు యజుర్వేదం నేర్చుకోడానికి వెళ్లాడు. ఆ రుషి వద్ద వేదంతో పాటు మరెన్నో విషయాలు నేర్చుకున్నాడు. తనను మించిన విద్యావంతుడు లేడనే అహంకారం అతడిలో ఏర్పడింది. ఓసారి వైశంపాయనుడికి బ్రాహ్మణుని కాలితో తన్నిన దోషం తగిలింది. అతడి పాపాన్ని పోగొట్టే శక్తి తనవద్ద మాత్రమే ఉందంటూ గురువుతో గర్వంగా పలికాడు యాజ్ఞవల్క్యుడు. దీంతో ఆగ్రహించిన గురువు తాను నేర్పిన విద్యను పూర్తిగా వదలి వెళ్లిపొమ్మని అతడిని శపించాడు. దీంతో నేర్చుకున్న విద్యను రక్తపు ముద్దల రూపంలో అక్కడే వదలివెళ్లాడు. వాటిని స్వీకరించిన తిత్తిరి పక్షులు వేదాల్ని పలికాయి. అవే కృష్ణ యజుర్వేదంగా ఆవిర్భవించాయి. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడు సూర్యుడిని ఉపాసన చేసి, ఆయన ద్వారా శుక్ల యజుర్వేదం నేర్చుకోవాల్సి వచ్చింది.

దేవతలే దిగిరారా!

ఆటంకాలకు లొంగితే జ్ఞానశూన్యుడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. కష్టాన్ని తట్టుకుంటేనే విజ్ఞానపు లోకానికి దారి తెలుస్తుంది. జాబాలికి తండ్రి ఎవరో తెలియదు. తల్లి జాబాల అతడికి ఉపనయన సంస్కారం చేసి, గురువు హరిద్రుమతుడి వద్దకు విద్యాభ్యాసానికి పంపింది. తండ్రి ఎవరో తెలియకపోవడంతో అవమానాల పాలయ్యాడు. విద్య నేర్చుకునే సమయం వచ్చే వరకు గోవుల్ని మేపుతూ అడవిలోనే ఉండమని ఆదేశించాడు గురువు. మరోమాట మాట్లాడకుండా అడవికి చేరుకున్నాడు జాబాలి. కానీ, మనస్సు మాత్రం నిత్యం జ్ఞానాన్వేషణ కోసం పరితపిస్తూనే ఉంది. అతడి సత్యనిష్ఠకు మెచ్చుకున్న దేవతలే స్వయంగా అతడు మేపుతున్న గోవుల్లో చేరి, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఆశ్రమానికి చేరుకున్న జాబాలి ముఖంలోని దివ్యతేజస్సు చూసి గురువు ఆశ్చర్యపోతాడు. అప్పటినుంచి సత్యకామ జాబాలిగా జాబాలి లోక ప్రసిద్ధి పొందాడు. విద్యార్థికి నేర్చుకోవాలన్న తపన, స్థిరచిత్తం ఉంటే దైవమే దిగి వస్తుందనటానికి ఇతని కథ చక్కటి ఉదాహరణ.

ప్రలోభాలకు లొంగకుండా...

తాను నేర్చుకోదలచిన విషయం మీద విద్యార్థికి పట్టుసడలని శ్రద్ధ ఉండాలి. ఎన్ని ఆకర్షణలు వచ్చినా వాటికి బందీ కాకూడదు. తండ్రి వాజశ్రవుడు కోపంతో ‘నిన్ను యముడికి దానం చేస్తా’నని అనటంతో అతని మాట నిలబెట్టడం కోసం నచికేతుడు నేరుగా యమలోకానికి వెళ్లాడు. యమదర్శనం కోసం ద్వారం వద్ద మూడురోజులు నిరీక్షించాల్సి వచ్చింది. దివ్యతేజస్సుతో ఉన్న బాలుడు తన కోసం నిరీక్షించిన విషయం తెలుసుక్ను యమధర్మరాజు దర్శనమిచ్చి, ముచ్చటపడి వరాలు కోరుకోమన్నాడు అప్పుడు నచికేతుడు వరాలుగా తన ప్రశ్నలకు సమాధానం ఇమ్మని అడిగాడు. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు? జనన మరణ చక్రాల సంచారం ఎందుకు?... అనేవి ఆ ప్రశ్నలు. అప్పుడు యముడు ఇదంతా బ్రహ్మజ్ఞానం. నీ వయస్సు చిన్నది. నీకు అర్థం కాదు. నీకు మణులు, బంగారం, ఇంకా చాలా ఇస్తానని ప్రలోభపెట్డాడు. నాకివేమీ వద్దు. ఆత్మజ్ఞానమే ముద్దు అంటూ పట్టుబట్టాడు నచికేతుడు. బాలుడి శ్రద్ధకు అబ్బురపడిన యముడు అతడికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇదే కఠోపనిషత్‌గా అవతరించింది.

హనుమ కథ వినుమా!


చదువు సుఖంగా అందదు. ఇందుకోసం తపించాలి. వేగం, పట్టుదల, ధారణ, కష్టానికి తట్టుకునే శక్తి విద్యార్థికి చాలా అవసరం. ఇవన్నీ ఉంటేనే నేర్చుకోవటం సాధ్యమవుతుంది. తల్లి ఆదేశంతో సూర్యభగవానుడి వద్ద విద్య నేర్చుకునేందుకు వెళ్లాడు హనుమ. నేను ప్రతిక్షణం సంచరిస్తూ ఉంటాను. నా దగ్గర చదువుకోవటం సాధ్యం కాదన్నాడు  సూర్యుడు. అయినా పట్టువదలకుండా తూర్పు, పశ్చిమ పర్వతాల మీద చెరో కాలు ఉంచి, సూర్యగమనానికి అనుగుణంగా ముఖం వరకు తన శరీరాన్ని తిప్పుతూ విద్యాభ్యాసం చేశాడు ఆంజనేయుడు. ఇంతటి సాధన చేశాడు కాబట్టే నవ వ్యాకరణ పండితుడయ్యాడు. ఎవరెన్ని విధాలుగా నిరుత్సాహపరిచినా, చివరకు ఎంచుకున్న గురువే వద్దని వారించినా నిరుత్సాహ పడకూడదు. విద్య నేర్చుకునే విషయంలో ఏర్పడే విఘ్నాలే ఇవన్నీ అనే స్పృహ కలిగి ఉండాలి. వాటిని తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని హనుమ నిరూపించాడు.

- కప్పగంతు రామకృష్ణ

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...