Wednesday, September 26, 2018

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలు


దసరా అలంకారాలు

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో 

అమ్మవారికి చేసే అలంకారాలు ... వాటి విశేషాలు


 



1.గాయత్రీదేవి అలంకారం

ముక్తావిద్రుమ హేమనీల ధవఉరళచ్ఛాయై: ముఖైస్త్రీక్షణై:

యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం

గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం

శంఖం చక్రమధారవింద యుగళం హసైర్వహంతీం భజే ||

                        'నగాయత్య్రా: పరం మత్రం మాతు: పరదైవతమ్‌' - గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. 'యా గాయంతం త్రాయతే సా గాయత్రీ' - గానం చేసిన వారిని కాపాడుతుంది కనుక మంత్రానికి గాయత్రి అని పేరు. తల్లి వేదమాత. అన్ని మంత్రాలకు మూలశక్తి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే ఐదు ముఖాలతో; శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి ఉంటుంది. గాయత్రీ ఉపాసన ద్వారా బుద్ధి వికసిస్తుంది. ప్రాతస్సంధ్యలో గాయత్రిగా, మధ్యాహ్న సంధ్యలో సావిత్రి, సాయం సంధ్యలో సరస్వతిగా ఉపాసకులు ఈమెను ధ్యానిస్తారు తల్లి ఉపాసన ద్వారా అనంతమైన మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలూ తొలగుతాయి. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రీమంత్ర పారాయణ వేదపారాయణ చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చిన గాయత్రీ మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించి, అమ్మకు అల్లపు గారె నివేదన చేయాలి. గాయత్రీమాత స్వరూపంగా వేదపండితులను అర్చించాలి. బ్రాహ్మణ పూజ చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పఠించాలి.


---------------------------------------------------------------------------------------------

2.అన్నపూర్ణాదేవి అలంకారం

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ

నారీ నీల సమాన కుతంలధరీ నిత్యాన్న దానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ ||

            'అన్నం పరబ్రహ్మేతి వ్యజానాత్‌' - అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఒక చేతిలో మధురసాలతో కూడి ఉన్న మాణిక్యపాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల గరిటె ధరించిన రూపంలో అమ్మ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. అవతారంలో అమ్మ ఎర్రని శరీరం, మెడలో తారహారాలు ధరించి, నిండు చంద్రుని వలే అందమైన ముఖంతో, విశాలమైన త్రినేత్రాలతో భాసిల్లుతుంది. షడ్రుచులతో కూడిన భక్ష్యభోజ్యాదులు తల్లి అనుగ్రహం ద్వారా మానవాళికి అందుతాయి.

            ఆహారం లేకుండా సృష్టిలో ప్రాణీ జీవించలేదు. అలాగే, తన బిడ్డ ఆకలి తీర్చటానికి ఆలోచించని తల్లీ సృష్టిలో ఉండదు. అందుకనే, అన్నపూర్ణాదేవి రూపంలో దుర్గాదేవి సకల ప్రాణికోటికీ అన్నాన్ని అందించి, జగన్మాతగా పూజలు అందుకుంటుంది. సకల జీవుల్లోని జీవాన్ని తల్లి ఉద్దీపింపజేస్తుంది. అందుకనే ఆదిశంకరులు కూడా 'భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ'! అంటూ జగదంబను అన్నపూర్ణేశ్వరిగా ధ్యానం చేసారు. తల్లిని ఉపాసన చేసినవారు పుత్రపౌత్రాభివృద్ధి, బ్రహ్మతేజస్సు పొందుతారు. బృహదారణ్యకోపనిషత్‌, యజుర్వేద తైత్తిరీయ సంహిత, ప్రశ్నోపనిషత్ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. ఈమెను ధ్యానించిన వారికి బ్రహ్మతేజస్సు, వాక్సిద్ధి, తుష్టి, పుష్టి కలుగుతాయి. అంతేకాదు... తనను కొలిచినవారి సకల కార్యభారాన్నీ తల్లే వహిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భుక్తి, ముక్తి ఆకాంక్షించేవారు - విధేహి దేవి కల్యాణం విధేహి పరమాం శ్రియంరూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో జహి || అనే శ్లోకాన్ని శక్తికొద్దీ పారాయణ చేసి, తల్లికి దధ్యన్నం, కట్టెపొంగలి నివేదన చేయాలి. లేత ఎర్రని లేదా తెల్లని పూలతో అమ్మను పూజించాలి. శక్తిసాధన కోరుకునే వారు - సృష్టి స్థితి వినాశానం శక్తి భూతే సనాతని / గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే || అనే శ్లోకాన్ని పారాయణ చేయాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవత్యన్నపూర్ణేశ్వరి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. భోజనశాలలో అన్నపూర్ణాదేవి చిత్రపటం ఉంచి, పూజలు చేయాలి. అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పారాయణ చేయాలి. శక్తికొద్దీ అన్నదానం చేయాలి.

---------------------------------------------------------------------------------------

3.మహాలక్ష్మీదేవి అలంకారం

సరసిజ నయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే

భగవతి హరి వల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్‌ ||

            సిరిసంపదలు, సంతానం, సౌభాగ్యం, ధైర్యసాహసాలు, విజయాలకు తల్లి అధిష్టాన దేవత శ్రీమన్మహాలక్ష్మి. సకల లోకాలకు ఈమె ఐశ్వర్య ప్రదాత. ఇరువైపులా గజరాజు సేవిస్తుండగా, రెండు చేతులతో కమలాలు ధరించి, అభయ, వరద ముద్రలతో, క్షీరాబ్ధి పుత్రికయైన తల్లి భక్తులకు దర్శనమిస్తుంది. డోలాసురుడు అనే రాక్షసుడిని ఈమె సంహారం చేసి, లోకాలకు శాంతి చేకూర్చింది. త్రిపురాత్రయంలో ఈమె మధ్యశక్తి. 'యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా' - సకల లోకాల్లో ఉండే సకల జీవుల్లో తల్లి లక్ష్మీరూపంలో తల్లి నివాసం ఉంటుందని చండీ సప్తశతి చెబుతోంది. ఋగ్వేదం పదో మండలంలోని శ్రీసూక్తం తల్లి వైభవాన్ని ఎంతగానో ప్రకటిస్తుంది. అగ్ని, మత్స్యపురాణాలు ఈమె ఆకృతి, శిల్ప నిర్మాణ నియమాలను వివరంగా చెబుతున్నాయి.

అష్టలక్ష్ములకు ఈమె అధిష్ఠాన దేవత. తల్లి ఉపాసన ద్వారా లౌకిక సంపాదనతో పాటు అలౌకికమైన మోక్షసంపద కూడా లభిస్తుంది. ఈమె శీఘ్రఫలదాయిని. శ్రీసూక్తవిధానంగా తల్లిని ఎర్రని పుష్పాలతో, లక్ష్మీ అష్టోత్తర నామాలతోఅర్చించి, పూర్ణాలు నివేదన చేయాలి. అమ్మకు ప్రీతిగా సువాసినీ పూజ చేయాలి. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై స్వాహా' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. పూజామందిరంలో లక్ష్మీదేవి రూపును ఉంచి, పూజలు చేయాలి.

-------------------------------------------------------------------------------------------

4.మహాసరస్వతీ దేవి అలంకారం

ఘంటాశూల హలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకం

హస్తాబ్జైర్దధతి ఘనాంశ విలసచ్ఛీతాంశు తుల్యప్రభాం

గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా

పూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైతార్దినీమ్‌ ||

                        దుర్గాదేవి అలంకారాలన్నిటిలో మూలానక్షత్రం నాటి సరస్వతీదేవి అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. నరుణ్ణి నరోత్తముడిగా చేసి, నారాయణ తత్త్వాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులు ఈమెను ఆరాధన చేస్తారు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు... అన్నిటికీ ఈమే అధిష్ఠాన దేవత. ఋగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సర్వసతీదేవి గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. కచ్ఛపి అనే వీణ; పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి, నెమలిని అధిరోహించిన రూపంలో తల్లి దర్శనమిస్తుంది. 'సరాంసి జలాని సంతి ఆస్వా: సా సరస్వతి' - అని మేదినీకోశం చెబుతోంది. అనంత స్వరూపిణి, సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకదాత్రిగా శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. సరస్వతీ ఉపాసనతో లౌకిక విద్యలతో పాటు అలౌకికమైన మోక్షవిద్య కూడా అవగతమవుతుంది. సకల చరాచరకోటిలో వాగ్రూపంలో ఉంటూ, వారిని చైతన్యవంతులుగా చేసే శక్తి ఈమెది. 

                        'వాజేభిర్వాజినీవతీ...' అని మంత్రం. - సరస్వతీదేవి మమ్ములను పవిత్రులుగా చేసి, మాకు అన్నపూర్ణగా అన్నం పెడుతుంది. జ్ఞానాన్ని అందించి, భవసాగరాన్ని దాటిస్తుంది. సకల బుద్ధులను ప్రకాశింపజేస్తుంది అని ఋగ్వేదం సరస్వతీదేవిని స్తోత్రం చేస్తోంది. '' నుంచి 'క్ష' వరకు ఉన్న అన్ని అక్షరాలతో ఏర్పడే సకల వాజ్ఞ్మయము, సంగీతాది సకల కళలూ తల్లి వరప్రసాదమే. అందుకనే సరస్వతీ ఉపాసన ద్వారా సకల విద్యలూ కరతలామలకం అవుతాయని పెద్దలు చెబుతారు. వ్యాసుడు, వాల్మీకి, యాజ్ఞవల్క్యుడు మొదలైన ఋషులందరికీ తల్లి అనుగ్రహం ద్వారానే లోకోత్తరచరితులయ్యారు. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలతో అమ్మను పూజించాలి. దద్ధోజనం, చక్కెర పొంగలి నివేదన చేయాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం మహా సరస్వత్యై నమ:' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. సరస్వతీదేవి ప్రీతిగా రోజున పుస్తకదానం చేయాలి. సరస్వతీ ద్వాదశ నామాలు, స్తోత్రాలు పారాయణ చేయాలి.

===========================================================


5.లలితా త్రిపురసుందరీ దేవి అలంకారం

ప్రాత: స్మరామి లలితా వదనారవిందం

బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం

ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశం ||

            త్రిపురాత్రయంలో ఈమె రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో, సకల లోకాతీత కోమలత్వంతో ప్రకాశిస్తుంది. తల్లి మణిద్వీప నివాసిని. సకల సృష్టి, స్థితి, సంహార కారిణి. శ్రీవిద్యా స్వరూపిణి. ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత. 'చిదగ్నికుండ సంభూతా' అని లలితా సహస్రనామం చెబుతోంది. 'చిత్‌' అంటే చైతన్యం. చైతన్యం అనే అగ్నికుండం నుంచి అమ్మ ఆవిర్భవించింది. సకల విశ్వచైతన్య శక్తిస్వరూపం శ్రీచక్రం. శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత లలితా త్రిపురసుందరి. నిర్వాణతంత్రం ప్రకారం లలితాదేవి సత్యలోకంలో బీజకోశంలో చింతామణి గృహంలో రత్నసింహాసనంపై ఆశీనురాలై ఉంటుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపం. కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతిస్వరూపంతో, చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించి ఉంటుంది. ఈమెకు లక్ష్మీసరస్వతులు ఇరువైపులా వింజామరలతో వీస్తూ, సేవలు చేస్తుంటారు. దేవేంద్రాది దేవతలు తల్లికి మంచపుకోళ్ళుగా ఉంటారు. నిత్యం తన భక్తులను అనుగ్రహిస్తూ, సర్వ వ్యాపకమైన తోజోమూర్తిగా లలితామాత విరాజిల్లుతుంది. ఈమెను ఉపాసించటం ద్వారా సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. దారిద్య్ర దు:ఖం నశిస్తుంది.

నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ:

నమ: ప్రకృత్యై భద్రాయై నియతా: ప్రణతాస్మతాం ||

అనే శ్లోకాన్ని పునశ్చరణ చేయాలి. మోక్షసాధన కోరుకునేవారు 

త్వం వైష్ణవీ శక్తిరనంతవీర్యా విశ్వస్యబీజం పరమాసి మాయా

సమ్మోహితం దేవి సమస్తమేతత్త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతు || 

అనే శ్లోకాన్ని పునశ్చరణ చేసి, అమ్మకు పాయసం నివేదన చేయాలి.

=================================================

6.దుర్గాదేవి అలంకారం 

విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం

కన్యాభి: కరవాలఖేట విలసద్దస్తాభిరాసేవితాం

హస్తైశ్చక్ర గదాసిఖేట విసిఖాంశ్చాపం గుణం తర్జనీం

బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ||

దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలిగే దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీదేవతా శక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం తల్లి స్వరూపంగా ఉంటుంది. ఈమె సకల శత్రు సంహారిణి. సర్వ దు:ఖాలను నశింపజేస్తుంది. ఉగ్రరూపంతో దుష్టులను ఏవిధంగా సంహరిస్తుందో, అదే సమయంలో పరమశాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. పంచ ప్రకృతి స్వరూపాల్లో తొలి మూర్తి ఈమే. 

    దేవి, మార్కండేయ పురాణాలు, ఉపనిషత్తులు, ఋగ్వేదాల్లో దుర్గాదేవిని ఉపాసన చేయటానికి వీలైన ఎన్నో విధానాలు ఉన్నాయి. మరెన్నో అవతార విశేషాలు కూడా గ్రంథాల్లో ఉన్నాయి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి, మణులు పొదిగిన కిరీటం ధరించి, సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఇది సర్వశత్రు సంహారక రూపం తల్లిని ధ్యానించినట్లయితే సర్వరోగాలు నశిస్తాయి. చామంతి, పొగడ, సంపెంగ, మల్లెపూలు, దానిమ్మపండు, ఎర్రని అక్షతలు, పొంగలి, పులి¬, పులగము తల్లికి ఇష్టమైన ద్రవ్యాలు. సర్వ రోగాల నుంచి ఉపశమనం పొందటానికి

రోగానశేషానపహంసి తుష్టా / రుష్టాతు కామాన్సకలానభీష్టాన్

త్వామాశ్రితానాం విపన్నరాణాం / త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి

అనే శ్లోకాన్ని పఠిస్తే రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజున వేదపండితులను సత్కరిస్తే అమ్మకు ఎంతో ప్రీతి కలుగుతుంది. ఓం దుం దుర్గాయై నమ: అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. దుర్గాసూక్తం, లలితా అష్టోత్తరం, దుర్గాస్తోత్రాలు పారాయణ చేయాలి.

=====================================================

7. మహిషాసుర మర్దినీ దేవి అలంకారం

మహిష మస్తక నృత్త వినోదినీ స్ఫుటరణ్మణినూపుర మేఖలా

జనన రక్షణ మోక్ష విధాయినీ జయతి శుంభనిశుంభ నిషూదినీ ||

లోకకంటకుడైన మషిషాసురిడిని సంహారం చేసిన ¬గ్రరూపం ఇది. సకల దేవీదేవతల శక్తులన్నీ ఈమెలో మూర్తీభవించి ఉంటాయి. మానవనేత్రంతో చూడటానికి సాధ్యంకాని దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలతో, సింహవాహినియై తల్లికి దర్శనభాగ్యం కలిగిస్తుంది. ఈమె అనుగ్రహ భాగ్యం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజునే 'మహర్నవమి'గా జరుపుకోవటం ఆచారంగా వస్తోంది. రోజున చండీ సప్తశతీ ¬మం చేసిన వారికి శత్రుభయం ఉండదు. అన్నిటా విజయం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా అనే మంత్రాన్ని జపించాలి. పానకం, వడపప్పు, గారెలు, పులి¬, పాయసాన్నం నివేదన చేయాలి. అమ్మవారి స్వరూపంగా సువానినులకు పూజ చేసి, మంగళద్రవ్యాలు, పసుపు కుంకుమలు, శక్తికొద్దీ నూతన వస్త్రాలు ఇవ్వాలి.

======================================================

8.శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం

కల్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం

పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదినీం

సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం

శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం ||

స్వప్రకాశ జ్యోతి స్వరూపంతో, పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుని, సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్యదేవతగా పూజలందుకునే అమ్మ అవతారం శ్రీరాజరాజేశ్వరీదేవి. మహాత్రిపురసుందరిగా ఈమె శ్రీచక్ర నివాసినియై ఉంటుంది. నిశ్చల చిత్తంతో తనను ఆరాధించిన వారికి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను వరంగా అనుగ్రహిస్తుంది. మాయా మోహితమైన మానవ మనోచైతన్యం తల్లి ఉపాసన ద్వారా ఉద్దీపితమవుతుందిఅపరాజితాదేవిగా కూడా తల్లి పూజలందుకుంటుంది. ఈమె యోగమూర్తి. పసుపుపచ్చని వస్త్రాలు ధరించి, 'ఓం ఐం ఈల హ్రీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం' అనే మంత్రాన్ని జపించాలి. పసుపు పచ్చని పూలతో అమ్మను పూజించాలి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి. శ్రీచక్రార్చన, కుంకుమార్చన, సప్తశతీ పారాయణ, చండీ¬మం చేసిన వారికి ఇష్టకామ్యాలను అనుగ్రహిస్తుంది. సువాసినీ పూజ చేసి, భక్ష్య, భోజ్యాలతో మహానివేదన, ప్రత్యేకంగా లడ్డూలు నివేదన చేయాలి.

================================================

9.స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి

నమస్తే శరణ్యే శివేసానుకమ్పే / నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే

నమస్తే జగద్వంద్య పాదారవిందే / నమస్తే జగత్తారిణి త్రాహిదుర్గే

నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణకవచంతో అలంకరిస్తారు. ఇంద్రకీలాద్రిపై అమ్మ స్వర్ణకవచంతో అవతరించటం వల్ల, దసరా ఉత్సవాల తొలిరోజున అమ్మను స్వర్ణకవచంతో అలంకరించటం ఆచారంగా వస్తోంది. రూపంలో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కంటే అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి, పసిడి ఛాయ కలిగిన మోముతో దర్శనమిస్తుంది. సింహవాహనాన్ని అధిష్ఠించిన ఈమె శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది. సకల శత్రుబాధలు నివారిస్తుంది. ఆకర్షణశక్తి, ఆరోగ్య ప్రదాన లక్షణం కలిగిన స్వర్ణ కవచాన్ని ధరించిన అమ్మను ఆరాధిస్తే సకల విజయాలు లభిస్తాయి. స్వర్ణకవచం మంత్ర బీజాక్షర సమన్వితంగా ఉంటుంది. కారణం వల్ల స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని ఆరాధిస్తే మంత్రశక్తి లభిస్తుంది. రోజున అమ్మవారిని పసుపు అక్షతలు, పసుపు పూలతో పూజించాలి. దుర్గా అష్టోత్తరం, దుర్గాకవచం పారాయణ చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం దుర దుర్గాయైనమ: అనే మంత్రాన్ని ఉపాసించాలి. అమ్మవారికి పులి¬ నివేదన చేయాలి.

======================================================

10. బాలాత్రిపుర సుందరీ దేవి అవతారం

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ:క్లీం కళాంబిభ్రతీం

సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం

వందే పుస్తక పాశమంకుశ ధరాం సగ్భ్రూషితముజ్జ్వలాం

త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం ||

  త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని రెండోరోజున బాలాత్రిపురసుందరీ దేవిగా అలంకరణ చేస్తారు. మనస్సు, బుద్ధి, అహంకారం తల్లి అధీనంలో ఉంటాయి. తల్లి అభయహస్తం, వరదముద్ర ప్రదర్శిస్తూ అక్షమాల ధరించి ఉంటుంది. ఈమెను ఆరాధించటం వల్ల నిత్య సంతోషం కలుగుతుంది. శ్రీచక్ర సంప్రదాయంలో షోడశీవిద్యకు ఈమె అధిదేవత. రెండు నుంచి పదేళ్ళ వయసులోపు బాలికలను బాలాత్రిపురసుందరీ దేవి స్వరూపంగా అర్చించి, సకల సుమంగళ ద్రవ్యాలు,నూతన వస్త్రాలు ఇవ్వాలి. ఇందువల్ల తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఈమె అనుగ్రహం వల్ల సత్సంతానం కలుగుతుంది. 'ఓం ఐం హ్రీం శ్రీం బాలాత్రిపురసుందర్యై నమ:' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. పాయసం నివేదన చేయాలి. లలితా త్రిశతీ స్తోత్రం పారాయణ చేయాలి.

=========================================

రచన

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

కాకరపర్తి భావనారాయణ కళాశాల (కె.బి.ఎన్.కాలేజీ)

కొత్తపేట, విజయవాడ-1  సెల్‌ : 90320 44115 / 88975 47548








Sunday, September 23, 2018

విజయవాడలో దసరా ఉత్సవాల ప్రత్యేకతలు

'విజయ' ఉత్సవాలు

లోకాలనేలే చల్లని తల్లి కనకదుర్గమ్మను కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా కొలుచుకునే పర్వదినం దసరా. ఆంధ్రరాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన పండుగే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే పండుగ కూడా దసరా కావటం విశేషం. ఈ విశేషాలకు తోడు మరెన్నో పురాణ, ఇతిహాస విశేషాలు; స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతుండటం బెజవాడ కనకదుర్గమ్మ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. 

కీలుడనే యక్షుడు చేసిన తపస్సుకు మెచ్చిన జగన్మాత అతడికి వరం ఇవ్వటం, ఆ వరప్రభావం కీలుడు ఇంద్రకీలాద్రి పర్వతంగా మారటం, కీలాద్రిపై అమ్మ దుర్గమ్మగా అవతరించటం, బ్రహ్మదేవుడు మల్లికాపుష్పాలతో అర్చించిన కారణంగా ఇక్కడి పరమేశ్వరుడికి మల్లికార్జునస్వామిగా పేరు రావటం, ఇంద్రకీలాద్రిపై మహాభారత కాలంలో అర్జునుడు తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించటం, మ¬గ్రరూపిణిగా ఉన్న అమ్మను శాంతింప జేయటానికి ఆదిశంకరాచార్యులు ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించటం, ధర్మం తప్పని మహారాజు మాధవ వర్మ ఇచ్చిన వరాల ఫలితంగా కనకవర్షం కురవటంతో దుర్గాదేవి కనకదుర్గాదేవిగా మారటం,  నవరాత్రి ఉత్సవాల్లో చిట్టచివరి రోజైన విజయదశమి రోజున చేసే శమీపూజకు ఇక్కడి స్థలపురాణం సంబంధించటం... ఇలా ఎన్నో ఎన్నెన్నో విశేషాలు, చారిత్రక గాథలు విజయవాడతో ముడిపడి ఉన్నాయి. 

కనకదుర్గాదేవిగా ప్రసిద్ధి

పూర్వకాలంలో విజయవాడను మాధవ వర్మ అనే రాజు పాలించేవాడు. అత్యంత ధర్మమార్గ వర్తనుడిగా, ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసే పాలకుడిగా మాధవ వర్మ పేరుపొందాడు. ఒకరోజున అతని కుమారుడు తన రథం మీద నగరంలో పర్యటిస్తున్న సందర్భంలో, అకస్మాత్తుగా ఒక బాలుడు ఆ రథచక్రాల కింద పడి మరణిస్తాడు. ఆ బాలుడి తల్లి రాజకుమారుడి కారణంగానే తన బిడ్డ మరణించాడని రాజుకు ఫిర్యాదు చేస్తుంది. కలలో కూడా ధర్మం తప్పని మాధవ వర్మ తన రాజ్యానికి వారసుడు, తన వంశాంకురమైన యువరాజుకు మరణశిక్ష విధించి, అమలు చేస్తాడు. మాధవుడి ధర్మనిష్టకు మెచ్చిన దుర్గాదేవి, అతడి రాజ్యంలో కనకవర్షం కురిపిస్తుంది. అప్పటినుంచి ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గాదేవి కనకదుర్గాదేవిగా ప్రసిద్ధిపొందింది. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహంతో బిడ్డలిద్దరూ పునర్జీవితులు అవుతారు. 

జమ్మిదొడ్డి చారిత్రక గాథ

దుర్గామల్లేశ్వరుల భక్తుడైన పండితయ్య అనే భక్తుడు బెజవాడలో ఉండేవాడు. అతడు క్రమం తప్పకుండా ఆచార విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. నిత్యాగ్ని¬త్రం, ఇతర అనుష్ఠానాలు చేసేవాడు. దేవ, ఋషి, పితృ తర్పణ కార్యక్రమాలు చేస్తూ, 'శివుడు' తప్ప మరో లోకం లేదన్నంతగా భక్తిప్రపత్తులు కలిగిఉండేవాడు. ఇంతటి సదాచారా సంపన్నుడైన పండితయ్యను చూసి, గిట్టని వాళ్ళు అతనికి ఆ ఊళ్ళో నిప్పు పుట్టకుండా చేశారు. 

దీంతో పండితయ్య ఎంతో ఆవేదన చెందాడు. ఇష్టదైవమైన పరమేశ్వరుడిని ప్రార్థించి, అగ్నిని తన 

ఉత్తరీయంలో మూటకట్టుకుని, గ్రామం చివర చేరుకుని, అక్కడ ఉన్న ఒక జమ్మి చెట్టుకు, తన ఉత్తరీయాన్ని వేలాడదీశాడు. తన అనుష్ఠాన బలాన్ని ఉపయోగించి ఊరిలో ఎక్కడా నిప్పు పుట్టకూడదని శపించాడు. తాను మాత్రం నిత్యాగ్ని¬త్రం చేసుకుంటూ ఉండేవాడు. ఊళ్ళో ఎక్కడా నిప్పు పుట్టకపోయేసరికి గ్రామస్తులంతా అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఎందుకు ఇలా జరుగుతోందని తరచి, తరచి చూస్తే, తమ తప్పు తెలిసివచ్చింది. 

ప్రజలందరూ అప్పటి విజయవాడ పాలకుడైన వేంగిరాజు అనంతపాలుడుని వెంటపెట్టుకుని, పండితయ్య దగ్గరకు వస్తారు. స్వయంగా మహారాజు కదలివచ్చి, నచ్చజెప్పటంతో పండితయ్య తన కోపాన్ని విడిచిపెట్టి, తిరిగి పరమేశ్వరుడిని ప్రార్థించి, తన శాపాన్ని ఉపసంహరించుకుంటాడు. దీంతో గ్రామంలో తిరిగి నిప్పు యథావిథిగా వెలిగింది. సంతోషించిన గ్రామస్తులు తమ తప్పుల్ని మన్నించవలసిందిగా పండితయ్యను ప్రార్థిస్తారు. సన్మార్గవర్తనుడైన పండితయ్య కూడా ఎంతో సంతోషించి, గ్రామస్తులతో కలసి, తన పూర్వ నివాసానికి చేరుకుంటాడు.

ఆవిధంగా పండితయ్య నిప్పును తన ఉత్తరీయంలో బంధించి శమీవృక్షానికి కట్టిన ప్రాంతం, ఆ వృక్షం చారిత్రక ప్రసిద్ధి పొందాయి. శమీవృక్షం ఉన్న ఆ ప్రాంతం కూడా కాలకమ్రంలో జమ్మిదొడ్డిగా వ్యవహారంలోకి వచ్చింది. శమీవృక్షానికి జమ్మిచెట్టు అనే పేరు ఉండటం, కొంతమేర ఉండే స్థలాన్ని 'దొడ్డి'గా వ్యవహరించే ప్రాచీన పద్ధతి కారణంగా ఈ ప్రాంతానికి జమ్మిదొడ్డి అనే పేరు వచ్చిఉంటుందని పరిశోధకులు అంచనావేస్తున్నారు. ఇప్పటికీ జమ్మిదొడ్డి ఉన్న ప్రాంతాన్ని స్థానికులు పవిత్రప్రాంతంగా ఆరాధనాభావంతో చూస్తారు. దసరా ఉత్సవాల్లో ఇక్కడ కూడా పూజాకార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా ఉత్సవాల చివరి రోజున చేసే శమీపూజను ఇక్కడ దేవస్థానం అధికారికంగా నిర్వహిస్తుంది. సంప్రదాయ పద్ధతిలో శమీవృక్షానికి పూజలు జరుగుతాయి. 

విజయవాడకు ప్రత్యేకం....పోలీసు ఆచారం

విజయవాడలో జరిగే దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన ఆచారాల్లో పోలీసుల ఆచారం ఒకటి. విజయవాడలో ఇంద్రకీలాద్రి ఉన్న పాతబస్తీ అధికారికంగా ఒకటవ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. ఈ పోలీస్‌ స్టేషన్‌కు ఇంద్రకీలాద్రికి వందల సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతోంది. ఇక్కడి పోలీసులు దుర్గమ్మను తమ ఆడపడచుగా, స్టేపన్‌ ప్రాంతంలో ఉన్న రావిచెట్టు, అక్కడి ప్రాంతాన్ని అమ్మ పుట్టినిల్లుగా భావిస్తారు. అంతేకాదు... రావిచెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి, ఆ చెట్టుకు పోలీసులే స్వయంగా నిత్యపూజ చేస్తారు. 

ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో ఈ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు అమ్మకు పుట్టింటివారి పాత్ర పోషిస్తారు. కొండమీద దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందురోజే పోలీస్‌ స్టేషన్‌లో ఉత్సవాలు మొదలవుతాయి. ఇక్కడి రావిచెట్టు ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా అలంకరించి, అమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారి మూర్తిని కొండ మీదకు తీసుకువెళ్తారు. తమ ఆడపడచుకు పసుపు కుంకుమలు, పట్టుచీర, సారె తీసుకువస్తారు. వీరు తీసుకువచ్చిన పట్టుచీర అలంకరించిన తర్వాతనే కొండపై ఉత్సవాలు మొదలవుతాయి. 

ఉత్సవాల్లో అమ్మకు కట్టే తొలి పట్టుచీర పోలీసులు ఇచ్చిందే కావటం విశేషం. ఎంతటి గొప్పవారు ఇచ్చిన చీరనైనా, పోలీసులు ఇచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన తర్వాతనే అలంకరిస్తారు. ఉత్సవాల్లో జరిగే రథోత్సవంలో కూడా పోలీసుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి రథాన్ని స్థానిక పోలీఉసు అధికారులే స్వయంగా లాగుతారు. ఉత్సవమూర్తులను కూడా కొండ మీద నుంచి పోలీసు వారే కిందకు తీసుకువస్తారు. తరతరాలుగా ఇందులో ఎటువంటి మార్పూ లేదు. 

దసరా చివరి రోజున కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవంలో పోలీసు అధికారులే ముఖ్యపాత్ర పోషిస్తారు. ఊరేగింపు అనంతరం ఉత్సవమూర్తులను రావిచెట్టు ప్రాంతానికి తీసుకువస్తారు. అక్కడ అమ్మవారు కొంత సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత, తిరిగి కొండమీదకు తీసుకువెళ్తారు. ఇలా, పోలీసు అధికారులే పుట్టింటి పాత్ర పోషించి, అమ్మవారి ఉత్సవాలు నిర్వహించంటం మరెక్కడా కనిపించదు. 

ఈ ఆచారం రావటానికి వెనుక చారిత్రక గాథ ఒకటి ఉంది. కొండవీటి రెడ్డి రాజుల కాలం నుంచి ఈ ఆచారం వచ్చినట్టు పరిశోధకులు అంచనావేస్తున్నారు. రెడ్డి రాజుల కాలంలో విజయవాడ ప్రాంతంలో పనిచేస్తున్న మంగయ్య అనే సిపాయికి అమ్మవారు స్వప్నంలో కనిపించి, తాను దుర్గమ్మనని, తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెబుతుంది. స్వప్నంలో కనిపించిన ప్రకారం తవ్వకాలు జరిపిన మంగయ్యకు అమ్మవారి విగ్రహం లభిస్తుంంది. ఈ విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్తాడు మంగయ్య. అక్కడ మంగయ్య కుమార్తెకు అమ్మవారి ఒంటి మీదకు వస్తుంది. ఆ కుమార్తె అమ్మలో ఐక్యం చెందుతుంది. అమ్మ మహిమ తెలుసుకున్న మంగయ్య అమ్మ చెప్పిన రీతిలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. ఇలా, మంగయ్య నుంచి అమ్మ ఆరాధన ఆచారంగా వస్తోంది.

కాలక్రమంలో సిపాయిలు రక్షకభటులుగా (పోలీసులుగా) మారినా, ఈ ఆచారం మాత్రం మారలేదు. పుట్టింటివారిగా సారె ఇవ్వటం నుంచి రథోత్సవం వరకు పోలీసులే ప్రధానపాత్ర పోషిస్తారు. కులమతాలతో సంబంధం లేకుండా ఈ స్టేషన్‌లో పనిచేసే అధికారి ఎవరైనా సరే అమ్మకు స్వయంగా సారె సమర్పిస్తారు. ఈ ఆచారాన్ని పోలీసుల నుంచి తప్పించాలని కొందరు ప్రయత్నిస్తే, వారికి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని కూడా ఇక్కడి వారు చెబుతారు.

కానిస్టేబుల్‌ నుంచి కమీషనర్‌ వరకు స్థాయీభేదాలు మరచి దసరా ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొనటం దేశంలో మరెక్కడా కనిపించని అరుదైన ఆచారం. ఇలా, ఎన్నో మరెన్నో ప్రత్యేకతలతో విజయవాడ దసరా  ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతూ, భక్తకోటిని అలరిస్తున్నాయి. 

======================================

రచన

డాక్టర్‌ కె.రామకృష్ణ

సెల్ : 90320 44115 / 88975 47548

Thursday, September 20, 2018

శ్రీకృష్ణ తత్త్వం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రుషిపీఠం పత్రిక (September, 2018) లో రాసిన వ్యాసం

కృష్ణం వందే జగద్గురుం


లౌకిక మాయలో చిక్కుకుని, విషయవాంఛలతో జీవిత లక్ష్యాన్ని విస్మరిస్తున్న మనిషిని ఉద్ధరించి, ముక్తి మార్గాన్ని ఉపదేశించటానికి స్వయంగా గురుస్థానంలో ఉండి బోధ చేసిన మ¬న్నత అవతారమూర్తి శ్రీకృష్ణపరమాత్మ. అర్జునుడికి మాత్రమే కష్టాలు రాలేదు. అతడు మాత్రమే భవబంధాలకు లోను కాలేదు. అర్జునుడనేది కేవలం మిష మాత్రమే. అర్జునుడి పేరుతో యావజ్జాతికి పరమాత్మ గీతామృతాన్ని పంచిపెట్టాడు. ఉత్తిష్ఠ కౌంతేయ! అంటూ అర్జునుడిని సంబోధించినా ఆ పిలుపునకు యావత్ప్రపంచం మేల్కొంది. అదీ జగద్గురువుకు ఉండాల్సిన లక్షణం. అప్పుడే జగద్గురువు అనే పదానికి సార్థకత. 

శ్రీమహావిష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తినా, ఏ ఒక్క అవతారంలోనూ కర్తవ్యబోధ చేయలేదు. కేవలం తన కర్తవ్యమేదో అది మాత్రమే చేశాడు. కానీ, కృష్ణావతార పరమార్థం వేరే ఉంది. అసలు పరమాత్మ జన్మించిన లగ్న లక్షణమే అది. శ్రీ కృష్ణుని జన్మలగ్నం వృశ్చిక లగ్నం. మర్మగర్భంగా ఉండటం ఈ రాశి లక్షణం. పరమాత్మ కూడా అంతే. ఆయన ఏం చేసినా, ఏం చెప్పినా అది బయటకు ఒక అర్థాన్ని, అంతరంగా మరొక అర్థాన్ని ప్రకటిస్తుంది. అంతరార్థాన్ని తెలుసుకుని, ఆచరించినవాడికి మాత్రమే పరమాత్మ తత్త్వం బోధపడుతుంది. అలాగే, విష్ణుమూర్తి అవతారాలన్నిటిలోనూ కృష్ణావతారాన్నే పరిపూర్ణావతారంగా పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. శ్రీమద్భాగవతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలా అంటుంది.

ఏతేచాంశ కలా: పుంస: కృష్ణస్తు భగవాన్‌ స్వయం | ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగేయుగే ||

ఇతర అవతారాలన్నీ పరమాత్ముని యొక్క అంశ కళలు మాత్రమే. కృష్ణావతారం మాత్రం పూర్తిగా భగవత్స్వరూపం. ధర్మవిరోధుల చేత లోకం వ్యాకులం చెందుతున్న సమయంలో పరమాత్మ ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాడు. కృష్ణుడు సాక్షాత్తు భగవత్స్వరూపుడు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కృష్ణావతారంలో కనిపిస్తాయి. అవేమిటంటే..

వ ధర్మాధర్మాలకు అతీతమైన భూమికలో జీవితాన్ని గడుపుతూ ధర్మసంస్థాపన చెయ్యటం.

  • సర్వం తెలిసినవాడైనప్పటికీ ఏమీ తెలియనివాడిలా లీలామానుషవిగ్రహుడిగా తన లీలలతో జగన్నాటాన్ని నడపటం
  • సాధారణ మానవుడిగా, గోపబాలకుడిగా లౌకికమైన అన్ని పనులు చేస్తున్నప్పటికీ, ఏ ఒక్క విషయానికీ కట్టుబడకపోవటం.
  • భౌతికస్థాయిలో, లౌకికజీవనంలో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ తనదైన అతీత దివ్యస్వరూపంతో నిత్యమూ అలౌకికస్థితిలో ఉండటం.
  • ఏ ఒక్క విషయాన్నీ తిరస్కరించకపోవటం. అలాగని, అన్నిటికీ లొంగకుండా ఉండటం.
  • బాలకృష్ణుడిగా చిలిపిచేష్టలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఆత్మీయుడిగా నిలిచిపోవటం.

ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో...మరెన్నో విశేషాలు. వీటన్నిటిలోనూ పరమాత్మ చూపించింది లీలలు మాత్రమే కాదు. లీలల రూపంలో అందించిన కర్తవ్యబోధ.

కేవలం భగవద్గీత వల్లనే శ్రీకృష్ణునికి జగద్గురుత్వం ఆపాదింపబడలేదు. బాల్యం నుంచి పరమాత్మ చూపించిన లీలలన్నీ ఆయన వైభవాన్ని ప్రకటిస్తూనే ఉన్నాయి. ప్రతి ఘట్టంలోనూ నల్లనయ్య తనవారికి కర్తవ్యబోధ చేస్తూనే  ఉన్నారు. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా విష్ణుమూర్తి అవతరించగానే దేవతలందరూ స్వామిని  పరబ్రహ్మమూర్తిగా భావన చేసి స్తోత్రం చేస్తారు. ఇక, జన్మించిన వెంటనే పరమాత్మ స్వయంగా తన తల్లిదండ్రులకు కర్తవ్యబోధన చేశాడు. ఈవిధంగా అవతార ప్రారంభంలోనే తల్లిదండ్రులకే బోధన చేసి, జగద్గురు భావనకు బీజం వేశారు పరమాత్మ. 

కృష్ణావతార కాలంలో పరమాత్మను అందరూ ముద్దుగా 'గోపాలకృష్ణా' అని పిలుచుకునేవారు. ఆ పేరులోనే ఎంతో ఔన్నత్యం కనబడుతుంది. లౌకికప్రేమతో నందవ్రజంలోని ప్రజలు గోవులను కాచేవాడు అనే అర్థంలో గోపాలకృష్ణుడని పిలిచారు. అయితే, ఆ పదంలోని అంతరార్థం గొప్ప అద్వైతభావాన్ని ప్రకటిస్తుంది. 'గో' అనే శబ్దానికి పంచభూతాలు, కిరణాలు, భూమి, జీవుడు అనే అర్థాలు కూడా నిఘంటువులు చెబుతున్నాయి. వీటిని పరిశీలిస్తే, సకల జీవులను కాచేవాడు, పంచభూతాత్మకమైన ప్రపంచానికి అధిపతి అనే అర్థాలు స్ఫురిస్తాయి. 

మన్ను తిన్నావని అడిగిన యశోదమ్మకు తన నోటిలో ప్నలుగు భువనాలను చూపిస్తూ నల్లనయ్య తల్లికి ఆత్మబోధ చేశాడు. అనంతమైన లోకాలకు నేనే అధిపతిని. నువ్వు కేవలం నిమిత్తమాత్రురాలివి. లౌకిక దృష్టి విడిచి చూస్తే నాలోనే సర్వప్రపంచం కనబడుతుంది. అప్పుడు నువ్వు, నేను అనే రెండు భావనలు ఉండవు. తల్లి, బిడ్డ అనే మమకారాలు ఉండవని యశోదమ్మకు బోధచేశాడు బాలకృష్ణుడు. 

గోవర్థన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తిపట్టుకునే ఘట్టం కూడా పరమాత్మబోధకు ప్రతిరూపమే. పోతనగారు గోవర్థనోద్ధరణ ఘట్టాన్ని ఎంతో హృద్యంగా, సుమనోహరంగా తీర్చిదిద్దారు. పసిబాలుడైన కృష్ణుడు చిటికినవేలుతో గోవర్థన పర్వతాన్ని అలవోకగా ఎత్తిపట్టుకుంటే, ఆ పర్వతఛాయలోకి వెళ్ళటానికి గో, గోప, గోపీజనం అంతా భయపడుతుంటారు. అప్పుడు నల్లనయ్య ఇలా అంటాడు.

బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా 
జాలండోయని దీనిక్రింద నిలువన్‌ శంకింపగా బోలదు ఈ 
శైలాంభోనిధి జంతుసంయుత ధరాచక్రంబు పైబడ్డన్నా
కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్‌ ప్రమోదంబునన్‌ ||

ఓ గోపాల మిత్రులారా! నన్ను బాలుడిగా భావించకండి. నేను ఈ పర్వతభారాన్ని మోయలేనని భావించకండి. సమస్త భూమండలం విరిగి మీదపడ్డా నా వేలు ఇసుమంతైనా కదలదు. ఓ బంధువులారా! మీకేమీ భయం లేదు. నిర్భయంగా, స్వేచ్ఛగా ఈ పర్వతఛాయలోకి రండి అని బాలకృష్ణుడు యాదవులను పిలుస్తాడు. పరమాత్మ పిలుపు అందుకున్న గోపకులమంతా గోవర్థన పర్వతఛాయలోకి చేరుకుంటుంది. నిజానికి, వారంతా చేరుకుంది ఆశ్రితవత్సలుడైన పరమాత్మ కరుణావలోకన ఛాయలోకి. అప్పుడిక వారికి అభయమే  తప్ప ఏ భయమూ ఉండదు. 'సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ...' అన్న భగవద్గీతా శ్లోకానికి పరమాత్మ ఎప్పుడో ఆచరణాత్మకంగా అర్థాన్ని ప్రకటించాడు. 

లోకకంటకుడిగా మారిన కంసుడిని మేనమామ అని కూడా చూడకుండా వధించి, లోక సంరక్షణ విషయంలో బంధుత్వాలు పనికిరావని బోధించాడు. శకటాసుర, తృణావర్త సంహారం, కాళీయమర్దనం, శిశుపాల దంతవక్త్రుల సంహారం.. ఇలా ప్రతి ఘట్టంలోనూ దుష్టశిక్షణ శిష్టరక్షణ చేశాడు పరమాత్మ. లోకక్షేమాన్ని అడ్డుకునేవారికి, సమాజ సంక్షేమానికి అవరోధంగా నిలిచేవారికి సమాజంలో స్థానం లేదని నిరూపించటమే ఈ ఘట్టాల్లోని అంతరార్థం. ఈవిధంగా తాను ఆచరించిన తర్వాతనే బోధన చేయటం పరమాత్మ ప్రత్యేకత. అందుకనే స్వామి జగద్గురువుగా చిరకీర్తి పొందారు.

ఎనిమిదిమంది భార్యలతో (పట్టపురాణులైన అష్టభార్యలు) ఉండటం ద్వారా పరమాత్మ బోధించిన 'బహుభార్యత్వా'న్ని కాదు. అష్టవిధాలైన శక్తులను సమీకరించుకోవటం అనే అర్థాన్ని ఇక్కడ మనం స్వీకరించాలి. గోపికాలోలుడని లోకం విపరీతార్థాలు తీసినా, ద్రౌపదీ మానసంరక్షణ ద్వారా మహిళలకు తాను రక్షకుడనని ప్రకటించాడు. కొండంత ధనం ఉన్నా కాసింత ప్రేమకే తాను బందీ అవుతానని సత్యభామ గర్వభంగ ఇతివృత్తాంతం ద్వారా తెలియజేశాడు. కౌరవుల బాధలన్నీ తట్టుకుని, క్షేమంగా, దిగ్విజయంగా అరణ్య, అజ్ఞాత వాసాలను పాండవులు పూర్తిచేయటానికి ప్రధాన భూమిక కృష్ణస్వామి అన్న విషయం జగద్విదితం. కండబలంతో పాటు బుద్ధిబలం కూడా కావాలనే సందేశాన్ని అరణ్యవాసం నుంచి కురుక్షేత్ర యుద్ధం ముగిసేవరకు ఎన్నో కృష్ణయ్య ఆచరణాత్మకంగా చూపించారు. వాస్తవానికి పరమాత్మ బుద్ధికుశలతే తోడు లేకపోతే పాండవులు కురుమహాసంగ్రామంలో విజయం సాధించగలరా? అంటే అనుమానమే. 

వీటన్నిటినీ మించిన ఘట్టం... గీతాబోధ. అప్పటిదాకా తనదైన అపార అస్త్రశస్త్రవిద్యా పాండిత్యం మీద చెదరని నమ్మకం ప్రకటించిన అర్జునుడు యుద్ధరంగంలోకి ప్రవేశించగానే డీలా పడిపోయాడు. యుద్ధం చేయనన్నాడు. ధనస్సును విడిచిపెట్టాడు. ఇదీ సరైన సమయం.

కర్తవ్యం నుంచి దూరంగా జరిగే మనిషి ఏ సమయంలో బోధ చేస్తే వింటాడో పరమాత్మకు తెలుసు. అందుకే యుద్ధరంగాన్ని ఎంచుకున్నాడు. చేసేది, చేయించేది అన్నీ తానే అన్నాడు. కర్తవ్యం విడిచిపెడితే జాతి క్షమించదన్నాడు. ధర్మం అంటే సూక్ష్మాలతో సహా బోధించాడు. అప్పటికీ ఇంకా జ్ఞానోదయం కాలేదు అర్జునుడికి. విశ్వరూపాన్ని ప్రదర్శనతో అర్జునుడి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించాడు. ఏది కర్మాచరణో అదే సన్యాసమని తెలిపాడు. ఇంకా మరెన్నో బోధనలతో అర్జునిడిని కర్తవ్యపరాయణుడిని చేశాడు. కురుపాండవ మహాసంగ్రామానికి అర్జునుడిని సిద్ధం చేశాడు. తన అవతార పరమార్థమైన దుష్టశిక్షణ, శిక్షరక్షణ చేసి, లోకంలో ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. యావజ్జాతికీ గీతాచార్యుడయ్యాడు. జగద్గురువుగా అవతరించాడు.

నిజానికి భగవద్గీత కేవలం అర్జునుడి కోసమే పుట్టిందా అంటే.. కానే కాదు. ఇక్కడ అర్జునుడు కేవలం నిమిత్త మాత్రుడు. చరాచర సృష్టిలోని జీవుల్లో నిద్రాణంగా ఉండే చైతన్యాన్ని మేల్కొలపటానికి అర్జునుడి పేరు మీద కురుక్షేత్రమనే యుద్ధరంగాన్ని వేదికగా చేసుకుని యావత్ప్రపంచానికి పరమాత్మ చేసిన బోధ భగవద్గీత. శాశ్వతమైన సత్యం, జ్ఞానం అందించటమే భగవద్గీతా సందేశం. 

సమస్యల వలయాలు మానవజీవితానికి సహజాలు. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలియక మనిషి సాధారణంగా కర్తవ్యం నుంచి దూరంగా జరగటానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా, అటువంటి సందర్భమే అర్జునుడికి ఎదురైంది. సమయాన్ని చూసుకుని పరమాత్మ జ్ఞానబోధ చేశాడు. భయం, క్రోధం విడిచిపెట్టాలని పరమాత్మ బోధన చేశాడు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం, దు:ఖం కలిగినప్పుడు కుంగిపోవటం తగదంటాడు పరమాత్మ. సుఖదు:ఖాలు రాత్రిపగలు వంటివి. ఒకదాని తర్వాత మరొకటి తప్పవు. స్థితప్రజ్ఞత సాధిస్తే సుఖదు:ఖాలు రెండిటినీ సమానంగా భావించే మనోనిశ్చలత కలుగుతుంది. అప్పుడిక మానవజన్మ సార్థక్యానికి బీజం ఏర్పడుతుంది. క్రమంగా సాధన చేస్తే, నిష్కామ కర్మకు ప్రాధాన్యతనిస్తే, అటువంటి సాధనే జీవుడిని పరమాత్మ సన్నిధికి చేరుస్తుంది. ఇదే గీతాసారాంశం. జగద్గురువుగా కృష్ణపరమాత్మను నిలిపిన మ¬న్నత జ్ఞానబోధ.

ఇంతటి సర్వోన్నతమైన జ్ఞానవిద్యను అందించిన శ్రీకృష్ణపరమాత్మ కేవలం భారతజాతికే కాదు యావత్ప్రపంచానికి జగద్గురు. కాదు..కాదు.. అనంత విశ్వానికే జగద్గురువు. అందుకే, కృష్ణం వందే జగద్గురుం.

నెమలి పింఛం... శ్రీకృష్ణ తత్త్వం


లోకసమ్మోహనాకారుడైన శ్రీకృష్ణపరమాత్మ దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే అందరికీ ఆకర్షించేది ఆయన శిరస్సు మీద ధరించిన నెమలిపింఛం. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు నెమలిపింఛాన్ని చూడగానే పులకిత మనస్కులవుతారు. అసలు శ్రీకృష్ణపరమాత్మ నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తారు? అందులోని అంతరార్థం ఏమిటి? అని పరిశీలిస్తే.. అనంతమైన వేదాంత తత్త్వం నెమలిపింఛ ధారణలో కనిపిస్తుంది. అదేమిటంటే...

నెమలి పింఛానికి ఏడు రంగులు ఉంటాయి. ప్రకతిలో కనబడే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు.. ఈ లోకమంతా ఆకాశం నిండి ఉంటుంది. ఈ ఆకాశం పగలు నీలవర్ణంలో, రాత్రివేళల్లో శ్యామవర్ణంలో కనిపిస్తుంది. సూర్యోదయానికి ఒక రంగు, సూర్యాస్తమయానికి ఒక రంగు కనిపిస్తుంది. ఇన్ని రంగుల సమహారమే ఆకాశం. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం కూడా. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగుల మయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలిపింఛంలో కనిపిస్తాయి. అంటే, పింఛాన్ని ధరించిన పరమాత్మ సాక్షాత్తు కాలస్వరూపుడు. భగవద్గీతలో పరమాత్మే స్వయంగా నేను కాలస్వరూపుడని చెప్పాడు. పింఛ ధారణలో పరమార్థం ఇదే. 

నెమలిని చూడగానే ప్రతి వ్యక్తికీ ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నెమలి కూడా అంతే. చిన్న నాటి నుంచి తనువు విడిచే వరకు తన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందాన్నిస్తుంది. అందరినీ ఆకర్షిస్తుంది. చివరకు,  జీవితం ముగిసిన తర్వాత కూడా ఆ నెమలి వదలిన పింఛం కూడా అందరినీ ఆకర్షిస్తుంది. ఇంకా చెప్పాలంటే, నెమలి కన్నా పింఛమే మరింత ఎక్కువగా ఆకర్షిస్తుంది. కొద్దికాలం జీవించిన నెమలి కన్నా, జీవం లేకుండా ఉన్నా నెమలి పింఛం మాత్రం ఆందరి ఆదరణ పొందటమే కాకుండా తరతరాలపాటు అందరి ఆత్మీయనేస్తంగా మిగులుతుంది. మానవ జీవనసత్యం ఇందులో దాగుంది.

బతికినన్నాళ్ళు అందరూ ఏదో ఒకరకంగా మనల్ని అంటిపెట్టుకుంటారు. అది మనలో గొప్పదనమైనా కావచ్చు లేదా మనతో ఇతరులకు ఉన్న అవసరమైనా కావచ్చు. కానీ, మనం భౌతికంగా లేని రోజున కూడా మన జ్ఞాపకాలను అట్టిపెట్టుకునేలా అందరి ఆప్యాయత మనం సంపాదించుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. కలకాలం జ్ఞాపకంగా మిగిలితేనే ఎన్నో వందల ఇతర జన్మల తర్వాత లభించిన మానవజన్మకు అర్థం సిద్ధిస్తుంది. నెమలిపింఛం చెబుతున్నది కూడా ఇదే.

నెమలిపింఛాన్ని ఒకసారి చేతితో గట్టిగా రుద్ది వదలితే, ప్రాణం ఉన్నదానిలా పింఛం మరింత విశాలంగా విచ్చుకుంటుంది. భౌతికశాస్త్రపరంగా చూస్తే, ఈ ప్రక్రియ స్థిరవిద్యుత్‌ (స్టాటిక్‌ ఎలక్ట్రిసిటీ) ప్రవాహానికి సంకేతం. మనిషి మనసు కూడా ఇదే తీరు. తనకు నచ్చిన, తాను మెచ్చిన విషయంతో ఎక్కువ సేపు రమిస్తే, మనసు విచ్చుకుంటుంది (అమితమైన ఆనందం పొందుతుంది). 

నెమలిపింఛం అందానికి ప్రతీక. ఆ పింఛాన్ని ధరించిన కృష్ణపరమాత్మ అందానికే అందాన్నిచ్చేవాడు. ఆయన సాక్షాత్తు మన్మథుడికి తండ్రి. 'పుంసాం మోహన రూపాయ' అని లోకప్రసిద్ధి పొందినవాడు. అందానికి గౌరవాన్ని ఇవ్వటానికే ఆయన పింఛాన్ని ధరించాడే తప్ప, అందంగా ఉండటం కోసం పరమాత్మ పింఛాన్ని ధరించలేదు. 

నెమలిపింఛంలోని రంగుల గురించి, వాటిలో వైవిధ్యం గురించి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి, ఆశ్చర్యకరమైన ఫలితాలను కనుగొన్నారు. మెలనిన్‌ రాడ్స్‌, కెరాటిన్‌ అనే పదార్థాలు పింఛంలో ఉన్నట్లు వారు కనుగొన్నారు. పింఛంలోని రంగుల విభిన్నతకు, వైవిధ్యానికి కారణం ద్విజ్యామితీయ స్ఫటిక అమరిక. ఈ అమరికలో వచ్చే తేడాల వల్ల రంగులు పరావర్తనం చెంది, మెరుపుల మాదిరిగా కనిపిస్తాయి. చూసిన ప్రతి కంటినీ, మనసునీ ఇట్టే ఆకట్టుకుంటాయి. చూడటానికి పింఛాలన్నీ ఒకే తీరులో కనిపించినా, సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ అందాల వన్నెల్లోనూ ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. 

సృష్టిలోని మనుషుల తత్త్వాన్ని పింఛం యొక్క ఈ లక్షణం విశదీకరిస్తుంది. రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళతో మనుషులందరూ చూడటానికి ఒకేతీరులో ఉంటారు. కానీ, వారి మనసులోని భావాలే వైవిధ్యతకు కారణాలవుతాయి. 'బుద్ధి: కర్మానుసారిణీ' అన్నట్లు వారివారి బుద్ధివిశేషం చేత మనుషులు కర్మలు ఆచరిస్తూ 

ఉంటారు. ఎవరి కర్మలు భగవంతునికి ప్రీతి కలిగిస్తాయో, అతడు నెమలిపింఛం మాదిరిగా అందరిచేతా సర్వోన్నతస్థితిలో చూడబడతాడు.

పింఛం ఎటుచూసినా ఒకేలా కనిపిస్తుంది. రంగుల కలయికైనా, మెరుపైనా అలాగే ఉంటుంది. మనసు లోపలా, బయటా ఒకేలా ఉండాలని మనిషికి పింఛం చేస్తున్న ఆచరణాత్మక బోధ ఇది. చీకటిలో ఉన్నా, వెలుగులో ఉన్నా పింఛం ఏవిధమైన మార్పునకు లోనుకాదు. బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని ఈవిధంగా పింఛం మనిషికి సందేశాన్నిస్తుంది.

తనదైన వ్యకిత్వాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టని పింఛాన్ని పరమాత్మ శిరస్సున ధరించాడు. ఈ ధర్మాన్ని పాటిస్తే మనిషిని కూడా మాధవుడు ఎంతో గౌరవిస్తాడు. మహనీయుల జీవితగాథలే ఇందుకు తార్కాణాలు. 

నిరాకారుడైన పరమాత్మకు అలంకారాలతో పనిలేదు. అవి ఆయనకు అందాన్ని ఇవ్వలేవు. తగ్గించలేవు. ఇదంతా మనకు జ్ఞానబోధ చేయటం కోసం పరమాత్మ చేస్తున్న లీలావిలాసం. ఈ పరమార్థం అందుకుంటే పరమాత్మ చరణాల సన్నిధికి చేరుకోవటానికి ఎంతో సమయం పట్టదు. 

=============================

రచన

డాక్టర్‌ కె.రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు,  ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, 

గాంధీనగర్‌, విజయవాడ-3. సెల్‌ : 90320 44115 / 88975 47548





పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...