Tuesday, December 24, 2019

కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 21.12.19 తేదీన విజయవాడలో జరిగిన సత్కారం అందుకుంటున్న డాక్టర్ కప్పగంతు రామకృష్ణ



కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 
21.12.19 తేదీన 
విజయవాడలో జరిగిన సత్కారం అందుకుంటున్న 
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ 

Wednesday, December 11, 2019

My (Dr Kappagantu Ramakrishna) article on Bhavani Deeksha published in Sri Kankadurgaprabha magazine (December 2019 issue) భవానిదీక్ష విశేషాలతో శ్రీ కనకదుర్గప్రభ మాసపత్రిక డిసెంబర్ 2019 సంచికలో నేను (డాక్టర్ కప్పగంతు రామకృష్ణ) రాసిన వ్యాసం

My (Dr Kappagantu Ramakrishna) article on Bhavani Deeksha published in Sri Kankadurgaprabha magazine (December 2019 issue) భవానిదీక్ష విశేషాలతో శ్రీ కనకదుర్గప్రభ మాసపత్రిక డిసెంబర్ 2019 సంచికలో (డాక్టర్ కప్పగంతు రామకృష్ణ) రాసిన వ్యాసం






Thursday, November 14, 2019

అయోధ్యా నగర విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) రాసిన వ్యాసం



రామయ్య నడయాడిన నేల







అయోధ్య..

కేవలం నగరం మాత్రమే కాదు. తరగని ఆధ్యాత్మిక చింతనకు ఆయువుపట్టు. యుగయుగాల చరిత్రకు నిలువెత్తు దర్పణం. ఊహకందని ప్రాకృతిక సౌందర్యానికి ఆలవాలం. రాజనీతికి, ధర్మవర్తనకు, ప్రజారంజకమైన పాలనకు మారుపేరు. సనాతన భారతీయ సాంస్కృతిక హర్మ్యానికి హృదయ పీఠి.

 

ఇతర నగరాల మాదిరిగా అయోధ్య కేవలం భౌగోళిక ప్రాంతంగా మిగిలిపోలేదు. యుగాలు మారినా, తరాలు గడిచినా ఇప్పటికీ తనకుమాత్రమే సొంతమైన ప్రాభవంతో కోట్లాది హృదయాల్లో ప్రత్యేకస్థానంతో అలరారుతోంది. అయోధ్య అనే పేరు చెబితేనే వర్ణించటానికి మాటలు చాలని ఓ అనుభూతి మనసు తలుపులు తడుతుంది. మనందరి దైవం నదయాడింది ఈ నేల మీదే అనే భావన మనసుల్ని పులకింపజేస్తుంది. ఒక్కసారి ఈ మట్టిని ముట్టుకుంటే చాలు జీవితం ధన్యమవుతుందని కోట్లాది హృదయాలు ఆరాటపడతాయి. కేవలం ఈ నగరానికి మాత్రమే ఎందుకీ ప్రత్యేకత? ఈ మట్టి కోసమే ఇంత ఆరాటమా? అంటే యుగాలనాటి చరిత్రను తరచి చూడాల్సిందే.

 

ఆదికవి వాల్మీకి రామాయణానికి పునాది అయోధ్య. మహర్షి తపస్సు చేసి మరీ వెతికిన సుగుణాల రాశి రామయ్య పుట్టిన నేల అయోధ్య. అందుకే వాల్మీకికి అయోధ్య అంటే వల్లమాలిన ప్రేమ. తన రామాయణం బాలకాండలోని ఐదు, ఆరు సర్గల్ని పూర్తిగా అయోధ్యానగర వర్ణనకే కేటాయించాడు వాల్మీకి.

 

అయోధ్య నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా

మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితాస్వయమ్ (బాలకాండ, 5-6)

 

కోసలదేశంలో ఉన్న అయోధ్య నగరాన్ని మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మించాడు. అందువల్ల ఆ నగరం మరింతగా లోకప్రసిద్ధి పొందింది... అంటూ బాలకాండలో అయోధ్యా నగర వర్ణన ప్రారంభమవుతుంది.

 

అయోధ్య పొడవు 12 యోజనాలు. వెడల్పు మూడు యోజనాలు. ఇప్పటి లెక్కలో ఇది సుమారుగా 168 కి.మీ  పొడవు, 42 కి.మీ వెడల్పునకు సమానం. దీనిప్రకారం అయోధ్య నగరం వైశాల్యం 7.056 చ.కిమీ.

 

 అయోధ్య ఏదో అనుకోకుండా ఏర్పడిన నగరం కాదు. ఎంతో ప్రతిభ కలిగిన శిల్పులు, వాస్తు నిపుణులు ఈ నగరాన్ని శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. నగరం మధ్యభాగంలో అంగడులు ఉండేవి. అక్కడ వివిధ యంత్రాలు, ఆయుధాలు ఉండేవి. ఎత్తైన కోట బురుజులు, ధ్వజాలు, వందలకొద్దీ శతఘ్నులు ఉండేవి. కోటకు రక్షణగా వందల కొద్దీ మేలుజాతి గుర్రాలు, వేగంగా నడిచే ఏనుగులు, ఎద్దులు, ఒంటెలు లు ఉండేవి. మొత్తంగా శత్రుదుర్భేద్యంగా అయోధ్యను తీర్చిదిద్దారు నిపుణులు. అయోధ్యలోని ప్రాకారాలు, కోటను కాపాడటానికి వేలాదిమంది సుశిక్షితులైన యోధులు కోట బురుజుల మీద, కోట లోపల నిరంతరం కాపలాగా ఉండేవారు. వీరందరూ శస్త్రాస్త్రవిద్యల్లో నిపుణులు. ప్రత్యేకించి శబ్దభేది విద్య (కంటితో చూడకుండా కేవలం శబ్దం విని లక్ష్యాన్ని చేదిస్తూ బాణాలు వేసే విద్య)లో అరితేరినవారు.

 

చిత్రామ్ అష్టాపదాకారాం వరనారీగజైర్యుతామ్

సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్ (బాలకాండ, 5:16)

 

చదరంగంలో ఉండే పలకల వంటి నిర్మాణాలు కలిగిన భవనాలు ఇక్కడ ఉండేవని వాల్మీకి ఎంతో స్పష్టంగా చెప్పాడు. అందంతో పాటు శత్రువుల ఊహకు అందనివిధంగా ప్రజల్ని కాపాడేందుకు అప్పటి నగరశిల్పులు తీసుకున్న శ్రద్ధ ఇందులో కనిపిస్తుంది.

 

'యోద్ధుం ఆశక్యా ఇతి అయోధ్య' - జయించటానికి వీలుకానిది అయోధ్య అని అర్థం. కేవలం పేరులోనే కాదు... వాస్తవంలోనూ ఆచరణాత్మకమైన శత్రురక్షణ వ్యవస్థ కలిగిన నగరంగా అయోధ్య చరిత్రలో నిలిచిపోయింది ఎన్ని యుగాలు గడిచినా ఈ నగరం పరరాజుల వశం కాలేదు. ఆయోధ్య చరిత్రకు ఇదొక కీర్తిపతాకం.

 

రాజ్యానికి ఆయువుపట్లైన వాణిజ్యంలో అయోధ్యకు సాటిరాగల నగరం అప్పట్లో లేదు. క్రయవిక్రయాల కోసం వచ్చే వ్యక్తులతో ప్రధానవీధులన్నీ కిక్కిరిసి ఉండేవి. కప్పం చెల్లించటానికి వచ్చే సామంతరాజులు బారులు తీరేవారంటే అతిశయోక్తికాదు. సంగీత, సాహిత్య, నృత్య, నాటక, గీతాది కళారంగాల్లో ప్రముఖులకు అయోధ్యవేదికగా ఉండేవారు.

 

ఇటువంటి ఆయోధ్యను రాముడు పరిపాలించిన కాలంలో సంపన్నుడు కాని వ్యక్తి ఆ నగరంలో లేడు. గో, ధన. ధాన్య, వాహన సమృద్ధి లేని ఇల్లు ఉండేది కాదు. ఈ సందపనంతా యజమానులు కేవలం ధర్మబద్ధంగా సంపాదించి. ధర్మబద్ధంగానే ఖర్చు చేసేవారు. ఈ నగర ప్రజలంతా మహర్షులతో సమానమైన ఇంద్రియ నిగ్రహం, తేజస్సు కలిగిఉండేవారు. అయోధ్యలో ఆకలితో అలమటించే వ్యక్తి ఒక్కడూ లేడు. దానం కోసం అర్రులు చాచే వ్యక్తి లేడు. నుదుట తిలకం ధరించని మనిషి కనిపించడు. దీనుడు కాని, దానం చెయ్యనివాడు కాని, రోగపీడితుడు కాని, సౌందర్యవిహీనులు కానీ కనిపించేవారు కాదు.

 

కాంభోజ, బాహ్లిక, వనాయు, సింధు దేశాలకు చెందిన ఉత్తము గుర్రాలు ఇక్కడ ఉండేవి. వింధ్య పర్వతాల్లో సంచరించే మదపుటేనుగుల్ని ప్రత్యేకంగా ఈ నగరానికి తెప్పించారు.  ఇలాంటి ఉత్తమ జాతి పశుగణం అయోధ్యలో ఉండేది. అంతేకాదు... రెండు, మూడేసి జాతుల సాంకర్యంతో పశుగణాల్ని ఉత్పత్తిచేసే విధానం ఇక్కడ ఉండేది. భద్రమంద్ర, భద్రమృగ, మృగకు చెందిన ఏనుగులు ఇలా పుట్టినవే. (బాల, 6:25). మొత్తంగా బలిష్టమైన రాజ్యవ్యవస్థ అయోధ్యలో ఉండేది. అందుకే అయోధ్య అంటే అక్కడి ప్రజలకు మాత్రమే కాదు విదేశీయులకూ ఎంతో ప్రీతిగా ఉండేది.

 

 స్కాందపురాణం దేశంలోని ఏడు మోక్షపురాల్లో ఒకటిగా అయోధ్యను పేర్కొంది. ఈ నగరం చేప ఆకారంలో ఉంటుందని కూడా ఈ పురాణం చెబుతుంది. అగ్ని, బ్రహ్మపురాణాలు అయోధ్యను పాపాలను నాశనం చేసే నగరంగా కీర్తించాయి. యోగినీతంత్రంలో కూడా అయోధ్య ప్రస్తావన ఉంది. అధర్వణ వేదం అయోధ్యను దేవనిర్మిత నగరంగా ప్రకటించింది. తులసీదాసు కూడా తన రామచరితమానస్ లో అయోధ్య వైభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. భాగవతంలో కూడా శుకమహర్షి రఘవంశాన్ని ప్రస్తావించిన సందర్భంలో ప్రత్యేకంగా అయోధ్య గురించి వివరిస్తాడు.

 

కవయిత్రి మొల్ల కూడా తన రామాయణంలో అయోధ్య వైభవాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తుంది.

'భానుకులదీప రాజన్యపట్టభద్ర

భాసి నవరత్న ఖచిత సింహాసనమ్ము

నాగనుతికెక్కు మహిమ ననారతమ్ము

ధర్మ నిలయమ్ము, మహినయోధ్యాపురమ్ము'

 

అయోధ్య అంటే కేవలం రాజ్యం మాత్రమే కాదు. ధర్మానికి అది నిలయం అంటుంది మొల్లమాంబ.

 

భారతయుద్ధం తర్వాత అయోధ్యానగరం కనుమరుగవుతుంది.  విక్రమాదిత్యుడు ఓ యోగి సూచన మేరకు ఒక ఆవును, దూడను వదలిపెట్టి, అవి ధారగా పాలు విడుస్తున్న ప్రాంతాన్ని అయోధ్యగా గుర్తించి, ఆ నగరాన్ని పునరుద్ధరించాడని ఓ కథనం వ్యాప్తిలో ఉంది. ఇదే ఇప్పటి అయోధ్య అని భక్తుల విశ్వాసం. ఉజ్జయినీ పరిపాలకుడైన విక్రమాదిత్యుడు అయోధ్యలోని సుమారు 300 దేవాలయాల్ని పునర్నిర్మించిన చారిత్రకగాథ ఈ వాదనను బలపరుస్తోంది.

 

శ్రీరామచంద్రుడు, అతని తండ్రి దశరథుడికి పూర్వమే అయోధ్య పరిపాలించిన రాజులెందరో ఉన్నారు. ఇక్ష్వాకు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరధుడు, రఘు మహారాజు, అజ మహారాజు మొదలైన చక్రవర్తులెందరో ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని ధర్మబద్ధమైన పాలన చేసి చరిత్రలో చిరయశస్సు పొందారు. వీరందరి కీర్తికి కారణమైన అంశాల్లో అయోధ్య కూడా ఒకటి.

 

అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికా

పురీ ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా

 

దేశంలోని ఏడు ప్రధాన పుణ్యక్షేత్రాలను సప్తమోక్షపురాలుగా పురాణాలు పేర్కొంటున్నాయి. వీటిలో మొదటిది అయోధ్య. యోగశాస్త్ర ప్రకారం అయోధ్యను మానవశరీరంలో ఉండే సహస్రారచక్రంతో పోలుస్తారు. సహస్రార చక్రం శిరస్సు మధ్యభాగంలో ఉంటుంది. ఇది పరిపూర్ణమైన జ్ఞానానికి ప్రతీక. ఈ చక్రంలో విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా ప్రకాశిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమయోగులకు మాత్రమే సహస్రార చక్రం గురించిన అనుభూతి పూర్వక జ్ఞానం లభిస్తుంది. ఈ స్థానాన్ని తెలుసుకున్నవారికి పునర్జన్మ ఉండదని యోగశాస్త్రం చెబుతోంది. దీనిప్రకారం అయోధ్యను చేరుకోవటమంటే సహస్రారకమలాన్ని చేరుకోవటం, అంతిమంగా మోక్షాన్ని సాదించటమే అవుతుంది.

 

అందరూ అనుకుంటున్నట్లు అయోధ్య కేవలం నగరం మాత్రమే కాదని, మానవ జీవచైతన్యానికి ఇదొక ప్రతీక అని అధర్వణవేదం చెబుతోంది. 'అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాం హిరణ్మయః స్వర్గలోకో జ్యోతిషావృత్త:...' ఎనిమిది చక్రాలు, తొమ్మిది ద్వారాలు ఉండే మానవ శరీరం అయోధ్యకు ప్రతీక. జనన, మరణ చక్రంలో శరీరం తిరుగుతూ ఉంటుంది. వీటితో మోక్షం కోసం యుద్ధం చెయ్యటం సాధ్యం కాదు. ఫలితం ఉండదు. శరీరం అనే పట్టణంలోని జ్యోతిర్మయకోశానికి స్వర్గం అనే పేరుంది. అది జీవచైతన్యస్వరూపమైన తేజస్సుతో నిండి ఉంటుంది. ఈ పట్టణాన్ని ఏ వ్యక్తి బ్రహ్మసంబంధమైనదిగా తెలుసుకుంటాడో అతడికి బ్రహ్మదేవుడు ఆయువు, కీర్తి మొదలైన వాటిని అనుగ్రహిస్తాడని అధర్వణ వేదమంత్రాలు చెబుతున్నాయి.

 

వాక్యపరంగా అయోధ్య పదానికి ఉన్న అర్థాన్ని శరీరానికి అన్వయిస్తే జయించటానికి సాధ్యం కాని లక్షణం ఉన్న శరీరమే అయోధ్యకు లౌకిక ప్రతీకగా నిలుస్తుంది. మొత్తంగా మనలో ఉన్న ఆత్మచైతన్యాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకతను అయోధ్య నిరంతరం గుర్తుచేస్తుందని అర్ధం చేసుకోవాలి.

 







Wednesday, October 30, 2019

అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకోవాలి? దీక్ష పరమార్థం ఏమిటి? ఇరుముడి ఎందుకు కట్టాలి? తదితర విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం

అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకోవాలి? 
దీక్ష పరమార్థం ఏమిటి? 
ఇరుముడి ఎందుకు కట్టాలి?





అయ్యప్ప దీక్ష కేవలం 40 రోజుల పాటు గడిపే నియమబద్ధ జీవితం కాదు. అది అద్వైతానికి దిక్సూచి. ఆత్మ, పరమాత్మల సంయోగానికి వారిధి. వేదాంతసారమైన ఉపనిషద్వాక్యాల్ని జీవనసారంగా మలుచుకునేందుకు మనిషి తనకు తానుగా పాడుకునే ఆత్మ చైతన్యగీతిక. ఎన్నో అనుభవాలు. మరెన్నో అనుభూతులు. అన్నీ కలిస్తే... మహోన్నతమైన పరివర్తనకు అంకురార్పణే అయ్యప్ప దీక్షాధారణ.

కోట్లకు అధిపతి అయినా, కార్మికుడైనా... నాయకుడైనా, శ్రామికుడైనా... దీక్ష తీసుకున్న మరుక్షణం నుంచి మనిషి నియమధారి అవుతాడు. చన్నీటి స్నానం, నల్లనివస్త్రాలు, తులసి, స్ఫటికమాలలు, విభూది, గంధం ధరించడం, కటిక నేలపై శయనించడం, ఏకభుక్తం, పాదరక్షల్ని విడిచిపెట్టడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, త్రికాలాల్లోనూ స్వామి అర్చన, తోటివారందరినీ స్వామీ అని సంబోధించడం... ఇలా అన్ని రకాలుగా మనిషి దైవంగా మారే సాధన కనిపిస్తుంది.

40 రోజుల దీక్ష పూర్తిచేసుకుని శబరిమల స్వామి ఆలయాన్ని చేరుకుని, పదునెట్టాంబడి ఎక్కగానే ఆలయం ముందుభాగంలో 'తత్త్వమసి' అనే మహావాక్యం కనిపిస్తుంది. ఇది వేదసారం, ఉపనిషద్బోధ. తత్‌, త్వం, అసి అనే మూడు పదాల కలయిక తత్త్వమసి. 'అది నీవై ఉన్నావు' అనేది ఈ వాక్యానికి అర్థం. ఇన్ని రోజుల పాటు కఠోర నియమాలు ఆచరించి, ఏ స్వామి దర్శనానికి వచ్చావో ఆ స్వామి నీవేనంటూ దీక్షాధారుడికి ప్రబోధిస్తుంది ఈ వాక్యం.

దీక్ష ప్రారంభించిన రోజు నుంచి ఆ వ్యక్తిని అందరూ 'స్వామీ' అని సంబోధిస్తారు. ఇది నియమం. దీక్ష తీసుకున్న వ్యక్తి ఏ దైవాన్నయితే ఆరాధిస్తున్నాడో ఆ స్వామి పేరుతోనే ఇతరులనూ సంబోధించడం ఇక్కడ విశేషం. శివాభిషేక ప్రారంభంలో చదివే మహన్యాసం 'నా రుద్రో రుద్రమర్చయేత్‌' - తాను స్వయంగా రుద్రుడిగా మారి రుద్రుడిని అర్చించాలి. లేకపోతే శివారాధనకు అధికారం లేదని చెబుతుంది. అయ్యప్పదీక్ష కూడా వేదప్రతిపాదితమైన ఈ వాక్యాన్ని అనుసరిస్తుంది. దీక్షాధారుడు స్వయంగా 'స్వామి'గా మారి అయ్యప్పస్వామిని అర్చించటం ఇందులోని అంతరార్థం.

'దేహో దేవాలయః ప్రోక్తో జీవోదేవస్సనాతనః'... దేహమే దేవాలయం. జీవుడే పరమేశ్వరుడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. తనలో ఉన్న పరమేశ్వరతత్త్వాన్ని మనిషి గుర్తించే దీక్ష తీసుకుంటాడు కాబట్టే ఆ క్షణం నుంచి జీవుడు దేవుడుగా మారుతాడు. దేవాలయాన్ని ఎలాగైతే అత్యంత శుచిగా ఉంచుతారో దేహాన్ని కూడా అలాగే ఉంచుకుంటారు. భూశయనం ఆత్మ నిగ్రహాన్ని, శీతలస్నానం శారీరక శక్తిని ఇస్తాయి. కఠిన నియమాలు దీక్షాధారులు పాటించడం వెనుక ఉన్న ఆధ్మాత్మిక సందేశం ఇది.

 అయ్యప్ప దీక్షాధారులందరూ పూర్తిగా నల్లని వస్త్రాలు ధరించాలని నియమం. అన్ని వర్ణాల్నీ తనలో కలుపుకునే లక్షణం నలుపునకు మాత్రమే ఉంది. అంతిమంగా దీక్ష తీసుకున్న వ్యక్తి పరమాత్మలో లీనం కావడాన్ని నల్లని వస్త్రధారణ ప్రకటిస్తుంది. నలుపు తమోగుణానికి సంకేతం. దాన్ని ఆదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ప్రతి మనిషికీ ఉంది. ఈ కర్తవ్యాన్ని వస్త్రధారణ ప్రతిక్షణం గుర్తుచేస్తుంది.

స్వాములు కనుబొమల మధ్య గంధం, కుంకుమ ధరిస్తారు. యోగశాస్త్రం ప్రకారం కనుబొమల మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. ఇక్కడ పరమాత్మ జ్ఞానరూపంలో జ్యోతిలా ప్రకాశిస్తుంటాడు. ఈ ప్రదేశాన్ని గంధం, కుంకుమతో అలంకరించటం ద్వారా మనలోనే ఉన్న పరమాత్మను అర్చించే ఆధ్యాత్మిక భావనకు అయ్యప్పదీక్ష బీజం వేస్తుంది.

అయ్యప్పపూజలో ప్రధానాంశం 'శరణు ఘోష'. అనేక విధాలైన స్తోత్రాలు, నామాలతో అయ్యప్పను స్వాములు ఆరాధిస్తారు. మనిషిలో ఉండే యవ్వనం, అందం, అనుభవించే భోగభాగ్యాలు ఇవేవీ శాశ్వతం కావు. స్వామి పాదాలను శరణు వేడడమే ముక్తికి మార్గం. భవబంధాలను విడిచి స్వామి చరణాలను పట్టుకునేందుకు మనిషి మనస్సును సన్నద్ధం చేసే ఆధ్యాత్మిక సాధన శరణుఘోష ప్రధానాశయం.

ఇరుముడి అంటే రెండు ముడులు లేదా ముడుపులని అర్థం. శబరిమల యాత్రకు బయల్దేరే ముందు రెండు భాగాలుగా ఉన్న ఇరుముడిని స్వాములు ధరిస్తారు. ఈ రెండు ముడులూ భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు. ఇరుముడిని బంధించే తాడు ప్రణవానికి ప్రతీక. భక్తి, శ్రద్ధలను ప్రణవంతో బంధిస్తే (సాధన చేస్తే) పరమాత్మను చేరుకోవటం సాధ్యమవుతుందని చెప్పటమే ఇరుముడి అంతరార్థం. దీక్షితుడికి అవసరమైన పదార్థాలు ఉండే భాగంలో గురుస్వామి మూడు గుప్పెళ్లు బియ్యం వేస్తారు. ఈ మూడు గుప్పెళ్లు ఆధిదైవిక (మెరుపులు, వర్షాలు వగైరా), ఆధి భౌతిక (భూకంపాలు, అగ్నిప్రమాదాలు వగైరా), ఆధ్యాత్మిక (జడత్వం, అరిషడ్వర్గాలు వగైరా) విఘ్నాలు కలగకుండా ఉండటానికి దైవసంకల్పంతో ఇచ్చే ఆశీరక్షతలు.

శబరిమలకు చేరుకుని, స్వామిని దర్శించిన తర్వాత ఇరుముడిలోని కొబ్బరికాయను హోమగుండంలో సమర్పిస్తారు. యజ్ఞం అంటే సమర్పణ భావం. తనను తాను దైవానికి సమర్పించుకోవటం మనిషి చేసే సాధనలో తుది అంకం. ఆ తర్వాత వ్యక్తి పూర్ణత్వాన్ని సంతరించుకుంటాడు. శాస్త్రాలు కూడా 'యజ్ఞోహి శ్రేష్ఠతం కర్మా' - మనిషి ఆచరించే కర్మలన్నిటిలో యజ్ఞాలు ఉత్తమమైనవని చెబుతున్నాయి. ఉత్తమ క్రియల ద్వారా పూర్ణతాన్ని సాధించటమే కొబ్బరికాయను అగ్నికి సమర్పించటంలో భావం.

 'ఆర్య', 'పితా' అనే ఆర్షశబ్దాలకు దేశీయరూపాలైన పదాలు 'అయ్య', 'అప్ప'. ఈ రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది అయ్యప్ప అనే పదం. ఈ అయ్యప్ప పరమాత్మ స్వరూపం. శివుడు, విష్ణువు, లలిత అనే రూపాలన్నీ మన భావనలే కానీ పరమాత్మ స్వరూపం ఒక్కటేనని వేదాంతం చెబుతోంది. 'పుం రూపా విష్ణువిగ్రహా' అని లలితోపాఖ్యానం చెప్పినట్లు మోహినీరూపంలో ఉన్న విష్ణువు సాక్షాత్తు శక్తి (లలిత) స్వరూపం. శివ, విష్ణు తత్త్వాల సంయోగరూపమే అయ్యప్పస్వామి. అంటే అఖండ విశ్వమంతా నిండిఉన్న శక్తిస్వరూపం అయ్యప్ఫ ఒకే పరతత్త్వం సాధకుల సౌలభ్యం కోసం వివిధ రూపాల్లో ప్రకటితమవుతుందని మహర్షుల వచనం. శివ, కేశవ సంయోగరూపమైన అయ్యప్పస్వామి యోగ, జ్ఞానమయ మంగళమూర్తిగా శబరిగిరి మీద భక్తులకు దర్శనమిస్తున్నారు.

అయ్యప్పకు 'ధర్మశాస్త' అనే పేరుంది. శాస్త అంటే గురువు అని అర్థం. ఆదిశంకరులు కూడా 'శాస్తారం ప్రణమామ్యహం' అంటూ స్వామిని స్తుతించారు. ఇది ధర్మం, ఇది యోగం అని శాసించి ఆచరింపజేసేవాడు కనుకనే గురుస్వరూపుడైన అయ్యప్పను 'శాస్త' అన్నారు. అయ్యప్ప నిరంతరం చిన్ముద్ర ధరించి ఉంటారు. బొటనవేలు చూపుడు వేలు కలిపి ఉంచటాన్ని చిన్ముద్ర అంటారు. జ్ఞానానికి ప్రతీక అయిన దక్షిణామూర్తి చిన్ముద్ర ధరించి ఉంటారు. అయ్యప్పకూడా ఈ ముద్ర ధరించటమంటే ఈ స్వామి దక్షిణామూర్తి స్వరూపమని అర్థం చేసుకోవాలి. మండల కాలం (40 రోజులు) దీక్ష పవిత్రభావనతో చేసిన వారికే సన్నిధానంలో 18 మెట్లు ఎక్కే అవకాశం దక్కుతుంది. మండలం అనేది చాలా శాస్త్రీయమైన సంఖ్య. మానవ శరీరం మానసిక చైతన్యవ్యవస్థగా రూపుదిద్దుకోవటానికి 40 రోజుల సమయం పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయుర్వేదం కూడా ఒక మందును 40 రోజులు ఉపయోగిస్తేనే ఫలితం ఉంటుందని చెబుతుంది. ఈ కారణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మండలదీక్ష నిర్ణయించారు.

శబరిమల స్వామి దర్శనానికి ముందుగా స్వాములు 18 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. దీన్నే పదునెట్టాంబడి అంటారు. ఇది పరిపూర్ణత సాధించిన జ్ఞానానికి సంకేతం. ఈ మెట్లన్నీ మంత్రపూరితాలు. దీక్షాధారులు చేసిన మంత్రసాధన అనుసరించి ఇవి ఫలితాన్నిస్తాయి. వీటిని చాలా భక్తితో స్పర్శించాలి. ఈ మెట్లు ఎక్కి స్వామిని దర్శించడమంటే సాధనలో చివరి అంకాన్ని చేరుకున్నట్లువుతుంది. అయ్యప్పస్వామి ఆలయంలో ప్రతిష్ఠితుడైన సందర్భంగా మృదంగ, భేరీ, కాహళ, దుందుభి, తుంబుర, మద్దెల, వీణ, వేణువు, నూపుర, మట్టుక, డిండిమ, ఢక్క, ధవళ, శంఖ, పరుహ, జజ్జరి, జంత్ర అనే 18 వాద్యాలను మోగిస్తారు. 18 మెట్లకు ఇవి ప్రతీకలు. ఈ వాద్యాల్లో ప్రతిధ్వనించే లయ, నాదాలన్నీ స్వామిని ప్రణవ స్వరూపుడిగా ప్రకటిస్తాయి.

శబరిమల ఆలయ ధ్వజస్తంభం ముందు గుర్రం విగ్రహం ఉంటుంది. అది చంచల స్వభావానికి, కోరికలకు ప్రతీక. దుందుడుకుగా ఉండే గుర్రాన్ని ఎలాగైతే రౌతు అదుపులో ఉంచుతాడో కోరికలకు సాధకుడు భక్తి అనే కళ్లెం వేసి నియంత్రించాలనేది సందేశం. ఆలయంలో నిత్యం రాత్రివేళ వినిపించే 'హరివరాసనం'లో స్వామిని 'వాజివాహనం', 'తురగవాహనం' అని సంబోధించటంలో ఉన్న అంతరార్థం ఇదే.






అయ్యప్ప స్వామి తత్త్వం, దీక్షలో అంతరార్థం వివరిస్తూ ఈనాడు దినపత్రిక (31.10.2019)లో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ  (Dr Kappagantu Rama Krishna) రాసిన వ్యాసం

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the India...