Wednesday, August 5, 2026

శ్రీ రుద్రవైభవమ్ పేరుతో శ్రీ కనకదుర్గప్రభ మాసపత్రిక ఆగష్టు 2026 సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం

 

 శ్రీ రుద్రవైభవమ్ 

(వేదోపనిషత్తుల వెలుగులో రుద్రతత్త్వ దర్శనం)

 

నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే నమస్తే నమస్తే చిదానంద మూర్తే ।

 నమస్తే నమస్తే తపోయోగగమ్య  నమస్తే నమస్తే శ్రుతి జ్ఞానగమ్య ॥

 

శివుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, మహాదేవుడు, శంకరుడు, హరుడు, ఈశానుడు... ఇలా అనంతమైన నామాలతో మనం పిలుచుకుని ఆరాధించే దేవుడెవరు? ఈ పేర్లన్నీ ఒకే తత్త్వాన్ని సూచిస్తున్నాయా, లేక వేర్వేరు దేవతలు ఉన్నారా? ఒకవేళ ఒకే దేవుడికి ఇన్ని పేర్లు ఉంటే, అవి ఎందుకు, ఎలా ఏర్పడ్డాయి? ఇలాంటి ప్రశ్నలు యుగయుగాలుగా భక్తుల హృదయాలను తొలచివేస్తూనే ఉన్నాయి. వీటికి సమాధానం వెతికితే... లింగ, శివ పురాణాలతో పాటు, స్వయంగా వేదాలు, వాటి సారమైన ఉపనిషత్తులు మనకు లోతైన వివరణలను అందిస్తాయి. రుద్రుడు కేవలం పురాణ కల్పితమైన దేవతామూర్తి కాదని, వేదకాలం నాటికే విశ్వచైతన్యంగా, పరబ్రహ్మ స్వరూపంగా అందరిచేతా పూజలు అందుకున్నాడని శ్రుతివాక్యాలు నిరూపిస్తాయి.

కృష్ణ యజుర్వేదంలో రుద్రుడు

కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహిత చతుర్థకాండంలోని పంచమ, సప్తమ ప్రపాఠకాలను వరుసగా ‘నమకము’, ‘చమకము’ అంటారు. నమకంలో విశ్వంలోని ప్రతి అణువూ, ప్రతి రూపమూ రుద్రుడే అనే భావనతో, ఆయా రూపాల్లో వ్యక్తమయ్యే రుద్రునికి నమస్కరించటం ప్రధానాంశం. కొండలలో, అడవులలో, నదులలో, ఆయుధాలలో, వైద్యులలో, దొంగలలో, దొరలలో- సమస్త సృష్టిలోనూ రుద్రుడు వ్యాపించి ఉన్నాడని నమకం చాటుతుంది. ఇది ఏకేశ్వర భావననే కాక, సర్వాంతర్యామిత్వాన్ని కూడా చాటే అపూర్వమైన దర్శనం. చమకంలో ఇందుకు భిన్నంగా, భక్తుడు తన కోరికల చిట్టాను - అన్నం, ఆయువు, సంతానం, పశుసంపద మొదలైనవి భగవంతుని ముందు సమర్పించి, ‘శివా! వీటన్నిటినీ నాకు అనుగ్రహించు’ అని ప్రార్థిస్తాడు. ఈ నమక చమకాలు కలిపి ‘శ్రీరుద్రం’గా ప్రసిద్ధి చెంది, నేటికీ అభిషేకాలలో పారాయణ చేయబడుతున్నాయి.

 

ఋగ్వేదంలో రుద్రుని రూపం

ఋగ్వేదంలో రుద్రుడు భయంకరుడైన, అదే సమయంలో కరుణామయుడైన దేవతగా కనిపిస్తాడు. ధనుర్బాణాలు ధరించిన వాడు, జడలు కలవాడు, నీలకంఠుడు అయిన రుద్రుడు రోగాలను కలిగించే శక్తిగానూ, వాటిని నయం చేసే ‘భిషక్తముడు’ (శ్రేష్ఠ వైద్యుడు) గానూ స్తుతింపబడ్డాడు. గృత్సమదుడు మొదలైన ఋషులు రుద్రుని శాంతింపజేస్తూ సూక్తాలను రచించారు. ఋగ్వేదంలోని ప్రసిద్ధ మృత్యుంజయ మంత్రం — ‘త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ । ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ ॥’ ఈ మంత్రం మొదట ఋగ్వేదంలో కనిపించి, తరువాత యజుర్వేద తైత్తిరీయ సంహితలోనూ, శ్రీరుద్రంలోనూ చేర్చబడింది. ‘త్రినేత్రుడైన రుద్రుని ఆరాధిస్తున్నాము, ఆయన సుగంధభరితుడు, పుష్టిని ప్రసాదించువాడు. దోసపండు తీగ నుండి విడివడినట్లుగా, మమ్మల్ని మృత్యుబంధం నుండి విడిపించి అమృతత్వం వైపు నడిపించు’ అనే భావం ఇందులో ఇమిడి ఉంది. మృత్యువును జయించి, అమృతత్వాన్ని ప్రసాదించే శక్తిగా రుద్రుడు ఇక్కడ కీర్తింపబడటం గమనార్హం.

రుద్ర శబ్దార్థాలు

రుద్ర శబ్దానికి ప్రాచీనులు అనేక నిర్వచనాలను ఇచ్చారు. అవి...

·       ‘రుతం సంసార దుఃఖం ద్రావయతీతి రుద్రః’ — సంసార దుఃఖమును నాశనము చేయువాడు.

·       ‘రోదయతి సర్వమంతకాల ఇతి రుద్రః’ — ప్రళయకాలమున అందరినీ దుఃఖింపజేయువాడు.

·       ‘రుతౌ నాదాంతే ద్రవతి ద్రావయతీతి రుద్రః’ — నాదం యొక్క చివర ద్రవింపజేయువాడు.

·       ‘రుత్యా వేదరూపయా ధర్మాదీనవలోకయతి ప్రాపయతీతి రుద్రః’ — వేదరూపంలో ధర్మాన్ని పొందింపజేయువాడు.

·       ‘రుత్యా వాగ్రూపయా వాక్యం ప్రాపయతీతి రుద్రః’ — వాగ్రూపముచే అర్థప్రతీతిని పొందించువాడు.

·       ‘రుత్యా ప్రణవరూపయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్రః’ — ప్రణవరూపమున తనను పొందింపజేయువాడు.

·       ‘రుద్రో రౌతీతి సత్యే రోరూపమాణో ద్రవతి ప్రవిశతి మర్త్యానితి రుద్రః’ — సత్యరూపమున మనుష్యులను ప్రవేశించువాడు.

·       ‘రుతిం శబ్దం వేదాత్మానం బ్రహ్మణే దదాతి కల్పాదావితి రుద్రః’ — కల్పాది యందు బ్రహ్మకు వేదములనిచ్చినవాడు.

ఈ నిర్వచనాలన్నీ నాశనం చేయువాడు, ఏడిపించువాడు, జ్ఞానం ప్రసాదించువాడు అనే భిన్న అర్థాలతో పాటు రుద్రుడు సంహారకుడు మాత్రమే కాక, జ్ఞానప్రదాత, వేదప్రదాత, సృష్టిస్థితిలయకారకుడు అని స్పష్టం చేస్తున్నాయి.

బృహదారణ్యకోపనిషత్తు — ఏకాదశ రుద్రుల నిర్వచనం

బృహదారణ్యకోపనిషత్తులో (3.9.4) యాజ్ఞవల్క్య మహర్షి రుద్రుల సంఖ్యను, స్వరూపాన్ని అత్యంత తాత్త్వికంగా వివరిస్తాడు. పురుషునిలో ఉండే ప్రాణాలు, మనస్సు, జీవాత్మ — ఇవన్నీ కలిసి ఒకటి; పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు కలిపి పది — మొత్తం ఈ పదకొండూ రుద్రులు. ఈ శరీరాన్ని విడిచి పెట్టేటప్పుడు, ‘ఇది శరీరాన్ని విడిచింది’ అని మనిషిని దుఃఖపెట్టేవి కాబట్టే — ‘రోదయంతి ఇతి రుద్రాః’ అని వీటికి సార్థక నామం ఏర్పడింది. ఇక్కడ రుద్రతత్త్వం బాహ్యదేవతగా మాత్రమే కాక, మన లోపలి ప్రాణశక్తులుగా, ఇంద్రియశక్తులుగా అన్వయించబడటం విశేషం. ఈ ఏకాదశ రుద్రుల పేర్లు— రుద్రుడు, త్ర్యంబకుడు, మహేశ్వరుడు, అహిర్బుధ్న్యుడు, హరుడు, ఏకపాదుడు, అజుడు, పినాకి (త్రిభువనుడు అని కొన్నిచోట్ల), శంభుడు, అపరాజితుడు, ఈశానుడు.

శ్వేతాశ్వతరోపనిషత్తు — రుద్రుడే పరబ్రహ్మము

ఉపనిషత్తులలో రుద్రతత్త్వాన్ని అత్యంత విస్పష్టంగా, పరబ్రహ్మ స్థాయిలో ప్రతిపాదించినది శ్వేతాశ్వతరోపనిషత్తు. ఇది రుద్రుడిని సాంఖ్య, యోగ దర్శనాలతో సమన్వయం చేస్తూ, జగత్కారణంగా, ఏకైక సత్యంగా చాటుతుంది. ఈ ఉపనిషత్తులోని ప్రసిద్ధ వాక్యం — ‘ఏకో హి రుద్రో న ద్వితీయాయ తస్థుః’. రుద్రుడు ఒక్కడే, ఆయనకు రెండవవాడు లేడు అని ఈ వాక్యం నిర్ద్వంద్వంగా ప్రకటిస్తుంది. అనగా అనేక దేవతల వెనుక ఉన్న ఏకైక చైతన్యతత్త్వమే రుద్రుడు. అదే ఉపనిషత్తులో మరొకచోట, ఆయనను తెలుసుకున్నవాడు మృత్యువును దాటిపోతాడని, అంతకుమించిన మార్గం మరొకటి లేదని చెప్పబడింది. ‘సర్వవ్యాపి సః భగవాన్ తస్మాత్ సర్వగతః శివః’ - ఆ భగవానుడు సర్వవ్యాపి కావున ఆయననే శివుడు (సర్వగతుడు) అంటారని ఈ ఉపనిషత్తు వివరిస్తుంది. ఇక్కడ ‘శివ’ శబ్దానికి తాత్త్విక భూమిక ఏర్పడటం గమనించదగినది. శివుడు కేవలం ఒక దేవత పేరు కాదు, సర్వాంతర్యామిత్వానికి పర్యాయపదం.

కఠ, ముండక, శ్వేతాశ్వతర ఉపనిషత్తులలో...

కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తులలో దాదాపు ఒకే మాదిరి కనిపించే ఒక అపూర్వ శ్లోకం ఉంది. ‘న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోఽయమగ్నిః । తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి ॥’ - అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రతారకలు కూడా ప్రకాశించవు, మెరుపులు గానీ, అగ్ని గానీ ప్రకాశించలేవు. ఆ పరతత్త్వం ప్రకాశిస్తేనే మిగతావన్నీ ప్రకాశిస్తాయి; ఆయన కాంతి వలననే ఈ జగత్తు అంతా విభాసిల్లుతోంది. శ్వేతాశ్వతరోపనిషత్తులో ఈ శ్లోకం నేరుగా ‘దేవుడు’ (రుద్రుడు) గురించి చెప్పబడటం విశేషం. అంటే సూర్యచంద్రాగ్నులు కూడా ఎవని కాంతిచే ప్రకాశిస్తున్నాయో, ఆ మూలచైతన్యమే రుద్రుడు అని ఈ మూడు ఉపనిషత్తులు ఏకకంఠంతో ప్రకటిస్తున్నాయి.

మాండూక్యోపనిషత్తులో...

మాండూక్యోపనిషత్తు జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలను దాటిన నాలుగవ స్థితిని ‘తురీయం’ అని పేర్కొంటుంది. ఈ తురీయ స్థితిని గౌడపాదాచార్యుల కారికలు ‘శాంతం శివమద్వైతం’ అని అభివర్ణిస్తాయి. శాంతమైనది, శివమైనది (మంగళకరమైనది), అద్వైతమైనది. ఇక్కడ ‘శివ’ అనే పదం ఒక దేవత నామంగా కాక, పరమ శాంతస్థితికి, పరబ్రహ్మతత్త్వానికి విశేషణంగా ప్రయోగించబడటం గమనార్హం. అంటే యోగసాధనలో అంతిమంగా చేరవలసిన తురీయావస్థే శివతత్త్వం అని ఈ ఉపనిషత్తు పరోక్షంగా బోధిస్తోంది.

కైవల్యోపనిషత్తు — శతరుద్రీయ మహిమ

కైవల్యోపనిషత్తు రుద్రుని హృదయకమలంలో ధ్యానించే విధానాన్ని, ఆయననే ఆత్మగా, బ్రహ్మగా గుర్తించే విధానాన్ని బోధిస్తుంది. జాబాలోపనిషత్తులో బ్రహ్మచారులు ‘కిం జప్యేన అమృతత్వమశ్నుతే?’ - దేనిని జపించుటచే అమృతత్వము కలుగుతుంది అని ప్రశ్నించగా, యాజ్ఞవల్క్య మహర్షి ‘శతరుద్రీయేన’ - శతరుద్రీయము జపించుటచే అమృతత్వము కలుగుతుందని సమాధానమిస్తాడు. ‘ఏతైర్హ వా అమృతో భవతి’ - శతరుద్రీయ మంత్రాలతో ఉపాసన చేసినవాడు అమృతుడగునని చెబుతాడు. కైవల్యోపనిషత్తులోనే ‘యః శతరుద్రీయమధీతే, సోఽగ్నిపూతో భవతి’ - శతరుద్రీయాన్ని అధ్యయనం చేసినవాడు అగ్నిపూతుడగునని ఉంది.

రుద్రాధ్యాయాన్ని శతరుద్రీయం అని ఎందుకు పిలుస్తారో ప్రాచీన ఆధ్యాత్మికవేత్తలు అనేక వివరణలు ఇచ్చారు. ‘శతం రుద్రో దేవతా అస్య ఇతి శతరుద్రీయం’ - వందమంది, అంటే అనంత రుద్రులు దేవతలగుట చేత ఈ పేరు ఏర్పడింది అని కొంతమంది పండితులు నిర్వచించారు. ‘ఏకశతం యజుశ్శాఖాస్తాసు రుద్రోపనిషదామ్నాయతి’ - నూరు యజుర్వేద శాఖలలో రుద్రోపనిషత్తు పఠింపబడుతుంది కనుక ఈ నామం ఏర్పడిందని కొంతమంది చెప్పారు. ‘శతమనంతాని రుద్రనామధేయాని యస్మిన్ తత్ శతరుద్రీయం’ -శతము అంటే అనంతమైన రుద్రనామధేయాల ప్రశంస ఇందులో ఉన్నందున ఈ పేరు వచ్చిందని కొంతమంది పండితులు చెప్పారు.. ‘సహస్రాణి సహస్రశో యే రుద్రా అధిభూమ్యామ్’ - వేలాది రుద్రులు భూమి యందు అన్ని దిక్కులనూ ఆశ్రయించుకొని ఉన్నారని, అట్టి శతరుద్రుల ప్రశంస కలది కావున రుద్రాధ్యాయము శతరుద్రీయమని అనబడుతోందని మరికొంతమంది వివరణ ఇచ్చారు. నిర్వచనం, వివరణలో భేదాలు ఉన్నప్పటికీ ఈ నిర్వచనాలన్నీ రుద్రుడి అనంతవ్యాపకత్వాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి.

రుద్రాధ్యాయ పారాయణ ఫలితాలు

శ్రుతిస్మృతిపురాణేతిహాసాలలో రుద్రాధ్యాయం అత్యంత ఉత్తమమైనదిగా కీర్తింపబడింది. ‘సర్వోపనిషదాం సారో రుద్రాధ్యాయః’ - అన్ని ఉపనిషత్తుల సారమే రుద్రాధ్యాయమని పేర్కొనబడింది. ఉపనిషత్తులే మోక్షసాధనములని నిశ్చయింపబడగా, వాటిలో శతరుద్రీయమే సర్వోత్తమమని నిర్ణయించబడింది. పంచమవేదమైన శ్రీమహాభారతంలోని ద్రోణ, అనుశాసనిక పర్వాలలో కూడా శతరుద్రీయ ఉత్తమత్వం ప్రశంసింపబడింది. నీటిలో నిలిచి నమకచమక, పురుషసూక్తాలను జపించినవాడు సర్వపాపవిముక్తుడగునని, ప్రాతఃకాలమున సూర్యునికెదురుగా ప్రాంజలి చేసి శతరుద్రీయం జపించువానికి దుర్లభమైనది ఏదీ లేదని శాస్త్రవచనం. శ్రీకృష్ణుడు ఒక సంవత్సరకాలం పాశుపతదీక్ష చేసి, విభూతిని ఒంటినిండా అలదుకొని రుద్రాధ్యాయాన్ని పారాయణ చేశాడని కూర్మపురాణం చెబుతోంది. ‘సతతం రుద్రజాప్యోఽసౌ పరాం ముక్తిమవాప్స్యతి’ అని స్మృతివచనం; ‘భోగార్థినో ముముక్షో వా ప్రాయశ్చిత్తార్థినోఽపి వా, రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యో న విద్యతే’ అని శివపురాణం ప్రకటిస్తోంది — ఐహిక భోగాలు, మోక్షం, పాపప్రాయశ్చిత్తం కోరుకునేవారికి రుద్రోపనిషత్తు కంటే వేరే శరణ్యం లేదు.

అష్టమూర్తి తత్త్వం

ఈశ్వరుడు అష్టవిధమూర్తి. కాళిదాస మహాకవి ఈశ్వరుని అష్టమూర్తి తత్త్వాన్ని ఇలా స్తుతించాడు - ‘యా సృష్టిః స్రష్టురాద్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రీ యే ద్వే కాలం విధత్తః శ్రుతివిషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వమ్ । యామాహుః సర్వభూతప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః ॥’ పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, సూర్యచంద్రులు, ‘నేను’ అనబడే యజమాని - ఈ ఎనిమిది రూపాలతో ఈశ్వరుడు విరాజిల్లుతున్నాడు. ఇంతటి విశ్వరూపుడు, మహత్తరశక్తి కలిగిన పరమాత్మయైన రుద్రుడిని ఏకాదశ రుద్రాభిషేకములతో ప్రసన్నుని చేయటం వలన ప్రకృతి మొత్తం ప్రశాంతత పొందుతుంది.

అభిషేకప్రియుడు

సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే పంచముఖాలతో నాలుగు దిక్కులను, ఊర్ధ్వదిశను చూస్తూ జగత్తును రక్షిస్తున్న సాంబసదాశివునికి, లింగస్వరూపుడైన పరబ్రహ్మకు ఆత్మార్పణం చేస్తున్నామనే భావంతో రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయాలి. ‘అభిషేకప్రియో హ్యీశ్వరః’ — ఈశ్వరుడు అభిషేకప్రియుడు. ఈశ్వరుడు విశ్వరూపుడు కాబట్టి, ఈశ్వరుని అభిషేకిస్తే విశ్వం చల్లబడుతుంది. పంచామృతాలతో, గంగాజలంతో రుద్రుని అభిషేకించి, తుమ్మిపూలతో, మారేడు దళాలతో పూజించి, గోక్షీరాన్ని, కదళీఫలాన్ని నివేదించాలి. చతుష్షష్టి ఉపచారాలతో అర్చించలేని పక్షంలో షోడశోపచారాలతోనైనా, అదీ కుదరకపోతే కనీసం పంచోపచారాలతోనైనా  ఆ పరమేశ్వరునికి కృతజ్ఞత తెలుపుతూ పూజించాలి. ఏకాదశ రుద్రాభిషేక ఫలాన్ని వర్ణించటం ఎవరికీ సాధ్యం కాదు. వేదాలు, ఉపనిషత్తులు ఏకకంఠంతో చాటుతున్నట్లు, రుద్రుడు అనేకనామాలలో వ్యక్తమయ్యే ఏకైక చైతన్యతత్త్వం, సర్వవ్యాపి పరబ్రహ్మం. ముందు భౌతికపూజ, తరువాత మానసికపూజ! చివరకు సర్వం శివమయమని గుర్తించి, మనం కూడా శివస్వరూపులం కావటమే ఈ ఉపాసన పరమార్థం.

---------------------------

శ్రీ కనకదుర్గప్రభ మాసపత్రిక ఆగష్టు 2026 సంచికలో 

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం


 






రచన:

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),

విజయవాడ రూరల్ మండలం, 

ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్

సెల్: 9032044115 / 8897547548 

Sunday, June 21, 2026

కూర్మజయంతి సందర్భంగా కూర్మావతార విశేషాలు వివరిస్తూ నమస్తే తెలంగాణ దినపత్రిక 22.06.2026 సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) రాసిన వ్యాసం


కూర్మజయంతి సందర్భంగా
కూర్మావతార విశేషాలు వివరిస్తూ
నమస్తే తెలంగాణ దినపత్రిక 22.06.2026 సంచికలో
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం




రచన:

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ,
కొత్తూరు తాడేపల్లి గ్రామం,
విజయవాడ రూరల్ మండలం, ఎన్టీఆర్ జిల్లా.
ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ : 520012
సెల్: 9032044115 /8897547548


 

Sunday, June 14, 2026

భజన, నామసంకీర్తనల ఔన్నత్యం గురించి వివరిస్తూ నమస్తే తెలంగాణ పత్రిక (15.06.2026) సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం

నామ స్మరణ



 భజన, నామసంకీర్తనల ఔన్నత్యం గురించి వివరిస్తూ 

నమస్తే తెలంగాణ పత్రిక (15.06.2026) సంచికలో

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం


భజన అనేది     కేవలం సంగీత గానం మాత్రమే కాదు; అది మనస్సు, వాక్కు, హృదయం భగవంతునితో ఐక్యమయ్యే ఆధ్యాత్మిక ప్రక్రియ. భగవంతుని నామాన్ని, గుణాలను, లీలలను గానం చేస్తూ ఆయనలో లీనమవడం భజన యొక్క అసలైన లక్ష్యం.

వేదకాలం నుంచే దైవస్తుతికి విశేష స్థానం ఉంది. ఋగ్వేదంలోని అనేక సూక్తాలు దేవతల మహిమను గానం చేయడానికి రచించబడ్డాయి. సామవేదం మొత్తం సంగీత రూపంలో భగవదారాధనకు సంబంధించిన మంత్రాలతో నిండి ఉంది. అందుకే సామవేదాన్ని "సంగీత వేదం" అని పిలుస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు "సతతం కీర్తయంతో మాం" అని చెప్పి నిరంతరం తనను కీర్తించే భక్తులను అత్యంత ప్రియులుగా పేర్కొన్నాడు. ఈ కీర్తన, భజనలే భక్తిని పరిపక్వం చేసే ప్రధాన సాధనాలు.

భజన మనస్సును ఏకాగ్రం చేసే అద్భుతమైన సాధనం. సాధారణంగా మనస్సు అనేక విషయాలపై సంచరిస్తూ ఉంటుంది. భజన సమయంలో భక్తుడు భగవన్నామాన్ని పునఃపునః ఉచ్చరిస్తూ ఉండటం వల్ల మనస్సు దైవస్మరణలో స్థిరపడుతుంది. ప్రహ్లాదుడు బాల్యంలోనే "ఓం నమో నారాయణాయ" అనే నామస్మరణలో నిరంతరం లీనమై ఉండేవాడు. అతని ఏకాగ్ర భక్తి కారణంగానే హిరణ్యకశిపుని హింసలన్నింటినీ అధిగమించి చివరకు నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందాడు. ఈ సంఘటన భజన, నామస్మరణల ద్వారా కలిగే మనోబలానికి గొప్ప ఉదాహరణ.

భజన భక్తిని పెంపొందించే మహోన్నత మార్గం. శ్రీమద్భాగవతంలో నవవిధ భక్తులలో "కీర్తనం" రెండవ స్థానంలో పేర్కొనబడింది. మహర్షి నారదుడు నిరంతరం "నారాయణ, నారాయణ" అంటూ భగవన్నామ సంకీర్తన చేస్తూ లోకాలకు భక్తి సందేశాన్ని వ్యాప్తి చేశాడు. ఆయన జీవితమే భజన శక్తికి ప్రత్యక్ష సాక్ష్యం. భగవంతుని నామాన్ని గానం చేయడం ద్వారా భక్తునిలో ప్రేమ, శరణాగతి, విశ్వాసం మరింత బలపడతాయి.

కలియుగంలో భజనకు మరింత విశేష ప్రాధాన్యత ఉంది. శ్రీమద్భాగవతంలో "కలౌ తద్దరి కీర్తనాత్" అని పేర్కొనబడింది. అంటే కలియుగంలో భగవంతుని కీర్తన ద్వారానే ముక్తిని పొందవచ్చని భావం. ఇతర యుగాలలో కఠినమైన తపస్సులు, యజ్ఞాలు, దీర్ఘకాల ధ్యానాలు అవసరమైనప్పటికీ, కలియుగంలో భగవన్నామ సంకీర్తనే సులభమైన మరియు శ్రేష్ఠమైన మార్గమని పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువు హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు.

భజన అంతఃకరణ శుద్ధికి కూడా కారణమవుతుంది. అజామిళుని కథ దీనికి ప్రసిద్ధ ఉదాహరణ. జీవితాంతం పాపకార్యాలలో గడిపిన అజామిళుడు మరణ సమయంలో తన కుమారుని పేరైన "నారాయణ" అని పిలిచాడు. అయితే భగవన్నామ మహిమ వల్ల విష్ణుదూతలు వచ్చి అతనికి మోక్షమార్గాన్ని ప్రసాదించారు. ఈ కథ ద్వారా నామస్మరణ, భజనలలో ఉన్న అపారమైన పవిత్రతను భాగవతం బోధిస్తుంది.

భజన సామూహికంగా నిర్వహించినప్పుడు మరింత ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తుంది. పురాణాలలో మహర్షులు, దేవతలు కలిసి భగవంతుని స్తుతించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దేవతలు క్షీరసాగర మథన సమయంలో మహావిష్ణువును స్తుతించడం, గోపికలు శ్రీకృష్ణుని కీర్తించడం వంటి సంఘటనలు సామూహిక భక్తి శక్తిని తెలియజేస్తాయి. నేటికీ భజన మండళ్లు, సత్సంగాలు, నామసంకీర్తన కార్యక్రమాలు భక్తులలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయి.

భజన మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. భగవన్నామాన్ని గానం చేసే సమయంలో మనస్సులోని ఆందోళనలు, భయాలు, నిరాశలు క్రమంగా తొలగిపోతాయి. మీరాబాయి, త్యాగరాజస్వామి, భద్రాచల రామదాసు, అన్నమాచార్యులు వంటి మహాభక్తులు తమ జీవితాల్లో అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ భజన ద్వారానే దైవానందాన్ని అనుభవించారు. వారి కీర్తనలు నేటికీ కోట్లాది మందికి ఆధ్యాత్మిక ప్రేరణను అందిస్తున్నాయి.

త్యాగరాజస్వామి తన కీర్తనల ద్వారా "నామస్మరణ కంటే గొప్ప సంపద లేదు" అని బోధించాడు. భద్రాచల రామదాసు కారాగారంలో ఉన్నప్పటికీ శ్రీరాముని భజిస్తూ పరమానందాన్ని పొందాడు. అన్నమయ్య వేలాది సంకీర్తనల ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామి మహిమను ప్రపంచానికి తెలియజేశాడు. ఈ మహనీయుల జీవితాలు భజన అనేది కేవలం ఆరాధన మాత్రమే కాకుండా ఆత్మానుభూతికి మార్గమని నిరూపిస్తున్నాయి.

అంతిమంగా, భజన అనేది భక్తి, జ్ఞానం, వైరాగ్యాలను పెంపొందించే సులభమైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన. వేదాలు, పురాణాలు, మహనీయుల జీవితాలు అన్నీ భగవన్నామ సంకీర్తన యొక్క గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయి. భజన ద్వారా మనస్సు పవిత్రమవుతుంది, హృదయం భక్తితో నిండిపోతుంది, జీవితం ప్రశాంతంగా మారుతుంది. అందుకే భారతీయ ఋషులు "నామస్మరణే మోక్షసాధనం" అని ఉపదేశించారు. నిత్యం భక్తితో చేసే భజన మనిషిని దైవానికి దగ్గర చేసి పరమానందాన్ని ప్రసాదిస్తుంది.

మధ్యయుగ భక్తి ఉద్యమం భజన సంప్రదాయాన్ని ప్రజల్లో మరింత విస్తరించింది. అన్నమాచార్యుడు తన సంకీర్తనల ద్వారా శ్రీ వేంకటేశ్వర భక్తిని ప్రజల్లో వ్యాప్తి చేశాడు. సద్గురు త్యాగరాజ స్వామి తన కీర్తనలలో రామనామ మహిమను గానరూపంలో ప్రతిపాదించాడు. పురందర దాసు, కబీర్, తులసీదాసు వంటి మహానుభావులు భజనను ప్రజలకు సులభమైన ఆధ్యాత్మిక సాధనగా అందించారు.

ఆధ్యాత్మిక దృష్టిలో భజన అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. భజన సమయంలో మనస్సు దైవచింతనలో నిలబడటం వల్ల చంచలత్వం తగ్గుతుంది. హృదయంలో భక్తి, వినయం, ప్రేమ, కరుణ వంటి సద్గుణాలు వికసిస్తాయి. సమూహ భజనలో పాల్గొనడం ద్వారా సత్సంగం లభిస్తుంది. సత్సంగం మనలోని దుర్వాసనలను తొలగించి సద్భావాలను పెంపొందిస్తుంది. భజనలో సంగీతం, లయ, నామస్మరణ, ధ్యానం అన్నీ కలగలసి ఉండటంతో మనస్సు సహజంగా ఏకాగ్రతను పొందుతుంది.

భజన యొక్క పరమలక్ష్యం భగవంతునితో అనుబంధాన్ని బలపరచడం. భజన ద్వారా భక్తుడు తన అహంకారాన్ని కరిగించి, దైవసన్నిధిని అనుభవిస్తాడు. నామం మరియు నామి (భగవంతుడు) వేరు కాదనే భావన భక్తి సంప్రదాయానికి మూలం. అందువల్ల భగవన్నామాన్ని గానం చేయడం అంటే భగవంతుని సన్నిధిలో ఉండటమే అవుతుంది.

An article by Dr. Kappagantu Ramakrishna

explaining the significance of ''Bhajana'' and ''Nama-sankirtana'',

published in the ''Namasthe Telangana'' newspaper (15.06.2026).


Wednesday, June 3, 2026

గాయత్రీ మాత వైభవం గురించి ‘శ్రీ కనకదుర్గ ప్రభ’ మాస పత్రిక 2026, జూన్ సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం


 గాయత్రీ మాత వైభవం గురించి 

‘శ్రీ కనకదుర్గ ప్రభ’ మాసపత్రిక 2026, జూన్ సంచికలో

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం

 

This may contain: the hindu god sitting on top of a lotus flower with two other deities behind him 



 
 
 
 

 

 

 

Thursday, May 28, 2026

అదే... తపస్సు (ఋషిపీఠం మాసపత్రిక 2026, మే సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం)

  అదే... తపస్సు


(ఋషిపీఠం మాసపత్రిక 2026, మే సంచికలో

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం)


తపస్సంటే ఏంటి? తపస్సు చేసేందుకు ఇల్లు, బంధాలు విడిచిపెట్టాలా? కాషాయ వస్త్రాలు, దండ కమండలాలు ధరించాలా? అడవుల్లోకి వెళ్ళి, కందమూలాలు తింటూ, ఏదో చెట్టుకింద కూర్చుని ధ్యానం చేసుకుంటేనే తపస్సు అవుతుందా? కచ్చితంగా ఇలా చేస్తేనే భగవదనుగ్రహం కలుగుతుందా? ఇంకా ఎన్నో సందేహాలు...

నిజానికి తపస్సు అనేది ఒక జీవన విధానం. అదొక క్రమశిక్షణ. మనిషి నియమబద్ధంగా జీవితాన్ని గడపటానికి పెద్దలు సూచించిన సర్వోన్నతమైన సాధన మార్గం అది.

సాధారణ అర్థంలో మనం అనుకునే తపస్సు కూడా తపస్సే. కానీ, అదొక్కటే కాదు. దైనందిన జీవితంలో ఉంటూ, తన ధర్మాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా, నూరుశాతం ఆచారాన్ని పాటించడమే తపస్సు అని శాస్త్రాలు చెబుతున్నాయి.  అన్నీ విడిచి ఎక్కడికో వెళ్లాలనుకోవడం పలాయన వాదమే కానీ, ఆధ్యాత్మికమార్గం కాదు. బాధ్యతల్ని విస్మరించిన వారికి ముక్తిద్వారాలు తెరుచుకోవు. కాబట్టి, స్వధర్మ కర్మాచరణే అసలైన తపస్సవుతుంది.

సాధారణంగా తపస్సు అంటే శరీరం, మనస్సు, ఇంద్రియాలను నియంత్రించి, పరమ సత్యాన్ని తెలుసుకునేందుకు చేసే కఠోర సాధన అని చెప్పవచ్చు. ఇది కేవలం అడవుల్లో కూర్చుని కష్టపడడం, ముక్కు మూసుకుని తపస్సు చేయటం మాత్రమే కాదు... జీవితం మొత్తం ఆత్మశుద్ధి కోసం చేసే నియమబద్ధమైన సాధన కూడా తపస్సే అవుతుంది.

 సృష్టికి మూలం తపస్సే

          వేదాలు తపస్సుకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాయి. రుగ్వేదం, యజుర్వేదం తపస్సును సృష్టికి మూలమైన శక్తిగా పేర్కొంటాయి.  తైత్తిరీయోపనిషత్తులోని భృగువల్లి ‘‘తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ’’ – తపస్సు ద్వారా బ్రహ్మమును తెలుసుకో అంటుంది. అంటే... బ్రహ్మాన్ని తెలుసుకోవటానికి ఉత్తమమైన మార్గం తపస్సు అని అర్థం. తపస్సుకు ఉన్న శక్తి అంతటి గొప్పది.  అలాగే, సృష్టి ప్రారంభంలో బ్రహ్మ తపస్సు చేసి జగత్తును సృష్టించాడని వేదాలు పేర్కొంటాయి. అందువల్ల తపస్సు కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాదు; అది సృష్టి శక్తికి మూలాధారం అని గ్రహించాలి.

అలాగే ఛాందోగ్యోపనిషత్తులో తపస్సును జ్ఞానం, ధ్యానం, నియమం, సత్యాచరణతో కూడిన సాధనగా వివరించారు. ఉపనిషత్తుల దృష్టిలో తపస్సు అనేది అంతరంగాన్ని పరిశుభ్రం చేసి ఆత్మసాక్షాత్కారానికి దారి తీసే మార్గం.

మహాభారతం అరణ్యపర్వంలో ‘యక్ష ప్రశ్నలు’గా ప్రసిద్ధి పొందిన ఘట్టంలో ధర్మరాజును యక్షుడు అడిగిన 72 ప్రశ్నల్లో ‘తపస్సు అంటే ఏమిటి?’ అనే ప్రశ్న కూడా ఉంది. ఇందుకు ధర్మరాజు - ‘తన వృత్తి, కుల ధర్మాన్ని ఆచరించటమే తపస్సు’ అని చెబుతాడు.

పురాణాలలో తపస్సు చేసిన మహర్షులు, దేవతలు గురించి అనేక కథలు ఉన్నాయి. విశ్వామిత్ర మహర్షి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షి స్థాయిని పొందాడు. ధ్రువుడు కఠిన తపస్సు చేసి మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాడు. రావణాసురుడు కూడా  గొప్పతపస్సు చేసి అపారమైన శక్తిని సంపాదించాడు. ఇంకా ఎన్నో ఉదాహరణలు పురాణ, ఇతిహాసాల్లో ఉన్నాయి. వీటన్నిటి సారాంశం ఒక్కటే... తపస్సు ధర్మబద్ధంగా ఉండాలి. స్వార్థం కోసం చేసిన తపస్సు చివరకు వినాశనానికే దారి తీస్తుంది.

 మనసు లగ్నం అయితే తపస్సే

తపస్సు అంటే తపించడం. ఒక పని సాధించటం కోసం మనం పడే ఆరాటం, ఆ పని తప్ప లోకంలో మరొకటి లేదన్నంతగా లక్ష్యాన్ని సాధించడం కోసం చేసే శ్రమ. భగీరథుడు సరిగ్గా ఇదే చేశాడు. దేవలోకంలో ఉండే గంగానదిని భూమి మీదకు తీసుకురావాలని ఎన్నో యుగాల నాడు  ఆయన చేసిన ప్రయత్నరూప తపస్సు అందించిన పుణ్య ఫలితాన్ని ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం కదా. ఒక్కమాటలో చెప్పాలంటే... మనిషి బాహ్యశుద్ధి, అంతశ్శుద్ధి కలిగి ఉండి, నమ్మిన లక్ష్యం మీద మనస్సు నిలిపి ధ్యానం చేయడమే తపస్సు అవుతుంది.

ఇదే విషయాన్ని సనత్కుమారుడు వ్యాసుడికి చెప్పాడు. సనత్కుమారుడు చెప్పిన తపో మార్గాల్లో సామాజిక శ్రేయస్సుకు పనికి వచ్చే అనేక విషయాలున్నాయి. చెరువులను తవ్వించడం, బావులను నిర్మించడం వంటి పనులను లోక కల్యాణం కోసం సద్బుద్ధితో, నిస్వార్ధభావనతో చేసే వ్యక్తి కూడా ఉత్తమ తపస్సు చేస్తున్న వాడికిందే లెక్క. ధ్యానం చేసుకుంటూ భగవంతుడిని గురించి తపస్సు చేసే వ్యక్తి పొందే ఫలితాలను సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తులు కూడా పొందగలరని సనత్కుమారుడు వ్యాసుడికి వివరించాడు. కేవలం తనకోసం కాక పదిమంది మేలు కోసం చేసే ఏ పనైనా ఉత్తమమైన తపస్సు అవుతుందని శివ పురాణం విస్పష్టంగా చెప్పింది.

ఆదిశంకరాచార్యులు కూడా ఈవిషయాన్నే చెబుతూ. ‘యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్‌’ అంటారు. చిత్తశుద్ధితో చేసే ప్రతి పనీ పరమేశ్వర ఆరాధనే అవుతుందన్నారు శంకరులు. మనస్సు, వాక్కు, ఆచరణ - ఈ మూడింటిలో ఏకత్వభావన (త్రికరణశుద్ధి) సాధించాలి. అదే తపస్సు అవుతుంది. నిజానికి, శ్రద్ధతో చేసే ప్రతి పనీ తపస్సే. దేన్నైనా సరే అంతఃకరణ శుద్ధితో, దీక్షతో చేస్తున్నప్పుడు నాణ్యమైన  ఫలితాలు వస్తాయి. అలా చేసే ప్రతి పనీ తపస్సే. అందుకే తపస్సు ఇచ్చే ముఖ్యమైన ఫలితాల్లో నాణ్యతను ముఖ్యమైందిగా చెప్పొచ్చు.

 సమాజమే తపోభూమి

తపస్సు చేసుకోవటానికి ఇల్లు విడిచి, అరణ్యాలు పట్టాల్సిన అవసరం లేదు. ఇంటినే తపోభూమిగా మార్చుకోవాలి. ఇందుకోసం మొదటగా మనిషి తాను మారాలి. తన కర్తవ్యం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. మానవ జన్మను సార్థకం చేసుకునే పనులు చెయ్యాలి. స్వామి వివేకానంద ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తారు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస శిష్యరికం చేశాడే కానీ అడవులకు వెళ్లి, ముక్కుమూసుకుని, తపస్సు చెయ్యలేదు. జాతి సముద్ధరణే జీవిత సర్వస్వం అనుకున్నారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా తన పేరు చెబితేనే ధైర్యం కలిగేంతగా జాతిని చైతన్యపరిచారు. యుగాల పాటు తపస్సు చేస్తే వచ్చే ఫలితాన్ని ప్రజాజీవితంలో ఉంటూనే పొందారు. ఇంకా ఎందరెందరో... వీరి మార్గం అనుసరణీయం.

భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగయోగంలో శ్రీకృష్ణపరమాత్మ తపస్సు మూడురకాలుగా ఉంటుందని చెప్పాడు. అవి...

శారీరక తపస్సు: దేవతలను, గురువులను, జ్ఞానులను, మహాత్ములను పూజించటం, త్రికరణశుద్ధిగా ఉండడం, ఇతర ప్రాణులను హింసించకుండా ఉండడం. 

వాచక తపస్సు: ఉద్వేగపూరితంగా మాట్లాడకుండా ఉండడం, సత్యం మాట్లాడడం, ఇతరులకు ప్రియం కలిగించేలా మాట్లాడడం, తన ధర్మాన్ని అనుసరిస్తూ స్తోత్రాలు, మంత్రాలు పఠించడం.

మానసిక తపస్సు: మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, ప్రసన్నమైన వదనం, ఆత్మనిగ్రహం, పరిశుద్ధమైన భావాలు కలిగిఉండడం.

 నీ పని మానొద్దు!

స్వధర్మాన్ని పాటించడం, చిత్తశుద్ధితో ఆచరించడం తపస్సు అవుతుంది. మహాభారతంలోని ‘ధర్మవ్యాధుడి’ వృత్తాంతం ఇందుకు ఉదాహరణ. మార్కండేయ మహర్షి ధర్మరాజుకు ఈ కథ చెబుతాడు.

కౌశికుడనే బ్రహ్మచారి అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేస్తుంటాడు. ఒక రోజున చెట్టు మీద ఉన్న పిట్ట వేసిన రెట్ట అతడి మీద పడుతుంది. ఆగ్రహంతో తలెత్తి పైకి చూస్తాడు కౌశికుడు. తపశ్శక్తితో కూడిన అతడి నేత్రదృష్టికి ఆ పక్షి ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత, భిక్షాటన చేస్తూ ఓ గృహిణి ఇంటి ముందు ఆగి ‘భవతీ భిక్షాందేహి’ అంటూ భిక్ష అడుగుతాడు. భర్తకు పరిచర్యలు చేస్తున్న కారణంగా భిక్ష వెయ్యటానికి ఆలస్యంగా వచ్చిన ఆ ఇల్లాలిని కౌశికుడు కోపంగా చూస్తాడు. ‘నీ కోపానికి మాడిపోవటానికి నేను పిట్టను కాదు’ అంటుందామె. అడవిలో జరిగిన సంఘటన ఆమెకు ఎలా తెలిసిందని, సాధారణ ఇల్లాలికి అంత శక్తి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతాడు. అందుకామె ‘ఇల్లాలిగా నా ధర్మ నిర్వహణ తప్ప నాకు మరొకటి తెలియదు. మిథిలానగరంలో ధర్మవ్యాధుడనే వ్యక్తి దగ్గరకు వెళ్లు. అతడు నీకు బోధ చేస్తా’డని చెబుతుంది. మిథిలకు వెళ్లిన కౌశికుడు మాంసం విక్రయిస్తూ జీవించే ధర్మవ్యాధుడిని చూసి ‘నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది? ఏ తపస్సు చేశావని’ ప్రశ్నించాడు.

‘నాయనా! నాకు ఏ తపస్సూ తెలియదు. నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను. నా తల్లిదండ్రులను ఏమాత్రం కష్టపెట్టను. వారికి సేవ చేస్తాను. ఎవరినీ బాధ పెట్టను. పెద్దలను, జ్ఞానులను, గురువులను గౌరవిస్తాను. అసత్యం పలకను. భార్యను తప్ప పరస్త్రీల వైపు కన్నెత్తి చూడను. ఆశ, అసూయలను మనసులోకి రానివ్వను. నిందలను, పొగడ్తలను సమంగా స్వీకరిస్తాను. ఇదే నేను చేసే తపస్సు’ అని చెబుతాడు కౌశికుడు. మహాసాధ్వి అయిన ఇల్లాలు పంపించిన కారణంగా నీతో మాట్లాడాను తప్ప, నాతో మాట్లాడే అర్హత కూడా నీకు లేదంటాడు.

‘ఒకే ఒక్క బిడ్డవు కదా! తల్లిదండ్రుల్ని వదిలేసి, అడవులకు వెళ్లి ముక్కుమూసుకోవటం వల్ల మోక్షం రాదయ్యా. నీ తల్లిదండ్రులకు సేవ చెయ్యాల్సిన కర్తవ్యం విడిచిపెట్టావు. ఇలాగైతే, నీ తపస్సు ఫలించదు. కన్నవారిని సేవించుకో. నీ ధర్మాన్ని పాటించు. అదే తపస్సు చేసిన ఫలితాన్నిస్తుంద’ని బోధ చేస్తాడు.

 తపస్సు... అర్థం, పరమార్థం

          తపస్సు పరమార్థం ఆత్మశుద్ధి, పరమాత్మసాక్షాత్కారం. తపస్సు ద్వారా మనిషి తనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించగలడు. తపస్సు ద్వారా ఇంద్రియాలను నియంత్రించడం సాధ్యమవుతుంది. తద్వారా ధ్యానం, జ్ఞానం, సేవ, భక్తి వంటి మార్గాల ద్వారా జీవితం ఉన్నత స్థాయికి చేరుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. తపస్సు వల్ల వ్యక్తిలో ఆత్మబలం పెరుగుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది, దివ్యజ్ఞానం వికసిస్తుంది.

అందువల్ల, తపస్సు అనేది కేవలం శరీరాన్ని కష్టపెట్టడం కాదు... ఆత్మను శుద్ధి చేసి పరమసత్యాన్ని తెలుసుకునే సమగ్ర సాధన తపస్సు అవుతుంది. నియమబద్ధమైన జీవనం, ధ్యానం, భక్తి, సత్యాచరణ, సేవాభావం కలిసినప్పుడు అది నిజమైన తపస్సుగా మారుతుంది. భారతీయ సంస్కృతిలో మహర్షులు చూపిన తపోమార్గం మనిషిని దైవత్వానికి దగ్గర చేసే పవిత్ర సాధనగా ఎప్పటికీ నిలిచిపోతుంది.

-----xxxxx-----





రచన:

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

వైస్ ప్రిన్సిపాల్, కె.బి.ఎన్. కాలేజీ, కొత్తపేట, విజయవాడ-1.

ఎన్టీఆర్ జిల్లా. సెల్: 90320 44 115 / 8897 547 548


(Article by Dr. Kappaganthu Ramakrishna
in the May 2026 issue of *Rishipeetham*
monthly magazine)





గణపతికి పద్యనైవేద్యం (రుషిపీఠం మాసపత్రికలో ప్రచురితం) పేరుతో వివిధ కావ్యాల్లో గణపతి స్తుతులు, ప్రస్తావనలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం

     గణపతికి పద్యనైవేద్యం  (రుషిపీఠం మాసపత్రికలో ప్రచురితం)  పేరుతో వివిధ కావ్యాల్లో గణపతి స్తుతులు, ప్రస్తావనలతో  డాక్టర్ కప్పగంతు రామకృష్ణ...