Monday, October 1, 2018

విజయదశమి ... విజయాల దశమి - శ్రీశైలప్రభ పత్రిక అక్టోబర్ 2018 సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం

విజయాల దశమి


లోకాలనేలే చల్లనితల్లి జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే పండుగ దసరా. ప్రత్యేకించి, నవరాత్రి ఉత్సవాల చివరిరోజున నిర్వహించుకునే విజయదశమి పండుగ కేవలం విందు వినోదాలతోనో, పూజాపునస్కారాలతో మాత్రమే ముగిసే పండుగ మాత్రమే కాదు. విజయదశమి అనే పేరు తలచుకోగానే ఒక ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. ఇక విజయం మనదే అనే భావన కలుగుతుంది. మనలోని శక్తులన్నీ ఒక్కసారిగా చైతన్యవంతం అవుతాయి. అందుకే, విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా విజయమే కలుగుతుందంటారు మన పెద్దలు.

మానవుడిలో స్ఫూర్తిని రగిలించి, వారి హృదయాల్లో నిద్రించిన కర్తవ్యదీక్షను తట్టిలేపి, విజయతీరానికి నడిపించటమే విజయదశమి పండుగలోని పరమార్థం. సరస్వతి, లక్ష్మి, దుర్గ, కాళి, లలిత, మహిషాసురమర్దిని...ఇలా ఏ పేరుతో పిలిచినా జగన్మాత మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. మనిషిని మనీషిగా, పోరాటయోధుడిగా, కర్తవ్యదీక్షాపరుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో మనం సాధించలేని విజయమంటూ ఏదీ ఉండదు. అందుకే, విజయదశమి ఏ ఒక్క విజయానికో పరిమితమైన దశమి కాదు. అదొక అనంత విజయాల దశమి.  

తొలి విజయం 'శక్తిచైతన్యం'

సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్లో మనిషికి సర్వోన్నతమైన స్థానం ఉంది. తనలో ఉన్న శక్తిని గుర్తించి, తనకు ఏవిధంగా ఆ శక్తి ఉపయోగిస్తుందో విచక్షణ ద్వారా తెలుసుకుని, తన లక్ష్యాన్ని సాధించటానికి ఆ శక్తిని వినియోగించటం మనిషి తప్ప మరో ప్రాణి ఏదీ చెయ్యలేదు.  ఇంతటి సర్వోన్నతమైన శక్తి కేవలం ఆ జగన్మాత అనుగ్రహం ద్వారానే మనకి కలుగుతుంది.

ఇదంతా జరగటానికి మనిషిలో ఆత్మ స్వరూపంలో ఉండే శక్తిచైతన్యం ఉద్దీపితం కావాలి. జగన్మాత ఆరాధన మనలో నిద్రాణమైన చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలిత, దుర్గ, సరస్వతి.. ఇలా ఏ పేరుతో ఆరాధించినా, ఆ తల్లి శక్తిరూపంలోనే వ్యక్తమవుతుంది. శక్తి రూపంలోనే మనిషికి తన అనుగ్రహాన్ని అందిస్తుంది. 

ఏ పేరుతో పిలిచినా, ఆరాధించినా ఆయా రూపాల్లోని మూలశక్తి ఒకటే. అదే చిచ్ఛక్తి. ఈ సకల విశ్వమంతా చిచ్ఛక్తి విలాసంతో ఏర్పడిందే. అమ్మవారి అన్ని నామాల్లో అంతర్గతంగా ఉండేది శక్తి ఉపాసనే. అగ్నికి వేడి శక్తి, సూర్యునికి వెలుగునిచ్చే శక్తి, చంద్రునికి వెన్నెలనిచ్చే శక్తి... ఇలా ప్రతి ప్రాణిలో ఉండే శక్తి అంతా ఆ చిచ్ఛక్తి రూపాంతరాలే. అందుకే 'చిచ్ఛక్తిశ్చేతనా రూపా...' - అంటూ అమ్మవారిని శక్తిచైతన్య స్వరూపంగా ఆరాధించటం జరగుతోంది. అనంతవిశ్వంలోని అన్ని ప్రాణుల్లో నిక్షిప్తమై ఉండే శక్తి సందర్భానుగుణంగా ఒక్కో రీతిలో వ్యక్తమవుతుంటుంది. ప్రాణశక్తి, ఆత్మశక్తి, చైతన్యశక్తి, విద్యాశక్తి, జ్ఞానశక్తి... ఇలా విభిన్న రూపాల్లో శక్తి ఆయా ప్రాణుల్లో ఆవహించి ఉండి, సమయానుగుణంగా బహిర్గతమై కాలగతిని నడిపిస్తుంది. ఈ శక్తిని ప్రసన్నం చేసుకుని, జీవన పరమార్థాన్ని పొందటానికి చేసే ఉత్సవాలే దసరా లేక నవరాత్రి ఉత్సవాలు. జగన్మాత ఆరాధన ఫలితంగా మనలోని శక్తిచైతన్యం ఉద్దీపితం కావటమే దసరా ఉత్సవాల నుంచి మనకు అందే తొలి విజయం.

విద్యావిజయం

మనిషికి నీరు, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలతో పాటు మరొక ఆవశ్యకమైన అంశం 'విద్య'. విద్య మనిషిని మనీషిగా చేస్తుంది. మంచి, చెడుల విచక్షణా జ్ఞానాన్ని అందిస్తుంది. తన కర్తవ్యం ఏమిటో, అందుకు తాను అనుసరించాల్సిన మార్గం ఏమిటో విద్య ద్వారా మనిషికి అవగాహనకు వస్తుంది. ఈ విద్య మనిషికి అందాలంటే సరస్వతీ మాత అనుగ్రహం కావాలి. అన్ని విద్యలూ సరస్వతీ స్వరూపాలే. నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున జగన్మాతను సరస్వతీ రూపంలో ఆరాధించటం వెనుక ఉన్న అంతరార్థం ఇదే. పుట్టుకతో మాత్రమే మనిషిగా ఉన్న వ్యక్తికి విద్యద్వారా పునర్జన్మ ఇచ్చే తల్లి సరస్వతీదేవి. ఈమె విద్యాధిదేవత. వేదమాత. జ్ఞానదాత్రి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు ఈమె అనుగ్రహం ద్వారా లభిస్తాయి. అజ్ఞానం వల్ల ఏర్పడే చీకటిని, సత్యమైన జ్ఞాన ప్రకాశం వల్ల తొలగించేలాగా ఈ తల్లి వరమిస్తుంది. అందుకనే 'సత్యానంద రూపా...'; 'సత్యానంద స్వరూపిణీ...' అని నామావళిలో ఈ తల్లిని ఆరాధించటం జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాల ద్వారా మనకు కలిగే రెండో విజయం ఇది. 

శత్రువిజయం

శత్రువులంటే బాహ్యంగా మనకు కనిపించి, మనతో శత్రుభావాన్ని ప్రకటించే వ్యక్తులు కొందరైతే, మనలోనే ఉంటూ మనకి దుర్భిద్ధి కలిగించి, మన కర్తవ్యాన్ని దారి మళ్ళించే శత్రువులు కొందరు ఉంటారు. వీరినే అంతశ్శత్రువులు అంటారు. జగదంబ ఆరాధన బాహ్యశత్రువులతో పాటు అంతశ్శత్రువుల బాధను కూడా తొలగిస్తుంది. ఎలాగంటే... నవరాత్రుల్లో చేసే అర్చనాది విధానాల్లో శమీపూజ ఒకటి. ఇది విజయప్రదాయిని. శమీ వృక్షపూజ పాపాలనునశింపజేసి, విజయాలను కటాక్షిస్తుంది. అర్జునుని గాండీవాన్ని ధరించి అతనికి విజయుడు అనే నామాన్ని సుస్థిరం చేసింది. జానకితో జగదభిరాముడిని కలిపి లోకానికి మేలు కూర్చింది. అలాగే, అమ్మకు చేసే అర్చన, ఆరాధనల ఫలితంగా మనలోని దుర్గుణాలు నశిస్తాయి. 

జ్ఞాన విజయం

నవరాత్రి ఉత్సవాలు శరత్కాలంలో వస్తాయి. అందుకే ఇవి శరన్నవరాత్రులు అయ్యాయి. శరత్కాలానికి మన వాజ్ఞ్మయంలో విశేష ప్రాధాన్యం ఉంది. అమ్మకు శారద అనే నామం ఉంది. 'శరదిదిభవా శారదా'... శరత్కాలంలో ఉద్భవించిన తల్లి శారద అయ్యింది. ఈ శారద జ్ఞానప్రదాయిని. ప్రకృతిని పరిశీలిస్తే శరత్కాలం రాగానే నదుల్లోని మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. తద్వారా నదీజలాలు సేవించటానికి అనువుగా మారతాయి. అలాగే, శక్తి ఉపాసన ద్వారా మనసులోని మాలిన్యాలు తొలగి జ్ఞానోదయం కావటమే శరన్నవరాత్రుల పరమార్థం. మనకు కలిగే విజయం కూడా. 

ప్రాణ విజయం

నవరాత్రులనే పదానికి విశేషమైన అర్థాలు ఉన్నాయి. రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. అశ్వయుజ  శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. మరొక అర్థంలో రాత్రి శబ్దం ప్రాణవాచకం. నవరాత్రులంటే తొమ్మిది ప్రాణాలు. ఈ తొమ్మిది ప్రాణాల్లో ప్రతిష్ఠితమై ఉండి, వాటిని కాపాడే ప్రాణదేవతయే పదో ప్రాణం. ఆమే పరాదేవత. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అనేవి తొమ్మిది ప్రాణాలు. ముఖ్య ప్రాణదేవత పరాదేవి. మిగిలిన తొమ్మిది ప్రాణాలు ఈ ముఖ్య ప్రాణదేవత యొక్క అవతారాలు. నవరాత్రి వ్రతం ద్వారా ప్రాణశక్తి స్వరూపంగా అమ్మను ఉపాసన చేసినట్లయితే మనలో ఉన్న ప్రాణశక్తి చైతన్యవంతం అవుతుంది. నారద పాంచరాత్రం అనే గ్రంథం ప్రకారం రాత్రి అనే పదానికి జ్ఞానాన్నిచ్చే దైవం అనే అర్థం ఉంది. మరికొన్ని ప్రాచీన గ్రంథాల్లో రాత్రి అనే శబ్దానికి పరమేశ్వరి అనే అర్థం ఉంది. ఈ అర్థాలన్నిటినీ సమన్వయం చేస్తే, వ్యక్తిలోని ప్రాణశక్తిని చైతన్యవంతం చెయ్యటం నవరాత్రి ఉత్సవాల లక్ష్యంగా కనిపిస్తుంది. ఏ భక్తుడైతే ఈ లక్ష్యాన్ని చేరుకుంటాడో, అతడు ప్రాణశక్తిని విజయఫలితంగా అందుకున్నట్లవుతుంది. 

సిద్ధ విజయం

అమ్మను ఆరాధిస్తూ చేసే నవరాత్రి వ్రతం అనేక సిద్ధుల్ని కలిగిస్తుంది. సిద్ధులు అంటే మంత్ర, తంత్రాలనే భావన కాదు. మనోనిశ్చలత, లక్ష్యసాధన కూడా సిద్ధులే. కోరికలు తీరటమే సిద్ధత్వం. జగన్మాత ఆరాధన మనకు అన్ని కోరికలు తీరుస్తుంది. తనను నమ్ముకున్న భక్తుల సకల అభీష్టాలు నెరవేర్చటమే జగజ్జనని నిర్వహించే ప్రధాన క్రియ. దేవీభాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, స్కందమాత, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిద అనేవి నవదుర్గా రూపాలు. వీటిల్లో సిద్ధిద రూపంలో అమ్మను ఉపాసన చేస్తే అష్టసిద్ధులతో పాటు మోక్షసిద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సకల లౌకిక, అలౌకిక సిద్ధులకు ఈ తల్లి అధిష్టాన దేవత. నవరాత్రి వ్రతం ద్వారా అమ్మను సిద్ధిద రూపంలో అర్చించినట్లయితే సకల సిద్ధులూ వరంగా లభిస్తాయి. ఇదే సిద్ధ విజయం.

ఆరోగ్య విజయం

ప్రకృతి నియమాలను అనుసరించి శరత్కాలం సంధికాలం. ఈ కాలం ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి వారి ప్రాణాలను సంహరించే శక్తి కలిగి ఉంటుంది. ఈ బాధలకు లోను కాకుండా ఉండటానికి జగన్మాతను వేడుకుంటూ చేసే అర్చనా విధానమే నవరాత్రి వ్రతం. సర్వవ్యాధి ప్రశమనీ..., సర్వమృత్యు ప్రశమనీ.. అనే నామాలతో అమ్మను అర్చించటంలోని అంతరార్థం ఇదే. ఎప్పుడైతే శారీరక శక్తి విశేషంగా ఉంటుందో అప్పుడు మానసిక శక్తి జాగృతమవుతుంది. ఇలా జాగృతమైన మానసిక శక్తి అర్చనాది ఉపాసనల ద్వారా మరింత ఉన్నత స్థితిని పొంది, అధ్యాత్మికశక్తిగా మారుతుంది. అంతిమంగా సాధకుడు శక్తిమంతుడవుతాడు. 'ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు' ఉంటుందని స్వామి వివేకానంద చెప్పినట్లు శారీరక ఆరోగ్యం, దాని ఫలితంగా మానసిక ఆరోగ్యం జగన్మాత ఆరాధన వల్ల కలుగుతాయి. ఇవే ఆరోగ్యవిజయాలు.

ఇలా మరెన్నో విజయాలు అమ్మ ఆరాధన ద్వారా కలుగుతాయి. జగన్మాతను సేవించటానికి ఉత్తమమైన కాలం నవరాత్రి ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో చేసే ప్రతి అర్చన, ఆరాధనకు అంతులేని విజయాల్ని అందిస్తాయి. అందుకే నవరాత్రి ఉత్సవాలు విజయోత్సవాలుగా అందరినీ కర్తవ్య దీక్షాబద్ధుల్ని చేస్తున్నాయి. 

-------------------------------

రచన

డాక్టర్‌ కె.రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, 

గాంధీనగర్‌, విజయవాడ -3, సెల్‌: 90320 44115 / 8897 547 548 


No comments:

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the India...