Tuesday, October 23, 2018

వాల్మీకి మహర్షి గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం

వాల్మీకి హృదయం




రామకథ... ఏనాటి యుగాల నాటి కథ. ఇప్పటిదా? అవును... ఇప్పటిదే. నాటికీ, నేటికీ, మరి ఏనాటికీ రామకథ నిత్యనూతనంగానే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా లిపి ఉన్న ప్రతి భాషలో రామాయణం అక్షరాకృతి పొందింది. కేవలం వాగ్రూపంలో ఉన్న భాషల్లో కూడా రామకథ జానపద సాహిత్యంగా ప్రకాశిస్తోంది. గత వెయ్యి సంవత్సరాల కాలంలో మనదేశంలో కొన్ని వందల రామాయణాలు వచ్చాయి. రామాయణం వెలువడని భారతీయ భాష లేదు. 

ఉత్తర భారతంలో తులసీ రామాయణం, తమిళదేశంలో కంబ రామాయణం నిత్యపారాయణ గ్రంథాలు. తెలుగులో వచ్చిన రామాయణాలకు లెక్కలేదు. రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, గోపీనాథ రామాయణం... ఈ వరుసకి అంతులేదు. ఆధునిక కాలంలో కూడా శ్రీనివాస శిరోమణి, యామిజాల పద్మనాభస్వామి, ఉషశ్రీ, జనమంచి శేషాద్రిశర్మ మొదలైన వారెందరో రామకథ రాసి మురిసిపోయారు. ఇక, 'కవిసమాట్ర్‌' విశ్వనాథ సత్యనారాయణ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కవితా రూప తపస్సు' చేసి మరీ రామాయణ కల్పవృక్షం రాసానని చెప్పుకున్నారాయన. అన్నమయ్య, త్యాగయ్య, కంచర్ల గోపన్న మొదలైన వాగ్గేయకారులూ తనివితీరా రామభక్తి సామ్రాజ్యంలో మునిగితేలారు. 

జానపదులైతే రాములోరు, సీతమ్మ తల్లి, లక్ష్మణదేవర అంటూ తమలో ఒకరిగా రామయ్య కుటుంబంతో చుట్టరికాలు కలిపేసుకున్నారు. ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు వంటి ఎన్నో ప్రసిద్ధ జానపద గేయాలతో రామకథ జానపదుల గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. 

రామకథకు ఎల్లలు లేవు. భాష, ప్రాంతీయ, కుల, మత, వర్గ, లింగ, స్థాయీ భేదాలు లేవు. ఏమిటీ రామకథ మహత్తు? అసలు రామాయణానికి ఎందుకింత ప్రాచుర్యం వచ్చింది? రామాయణ కథ రాసిన కవి అంత గొప్పవాడా? ఆయన ప్రత్యేకత ఏమిటి? యజ్ఞయాగాదులు చేసాడా? పురాణాలు ఔపోసన పట్టాడా? అసలు ఈ కథ రాయాలని ఆయనకు ఆలోచన ఎందుకు వచ్చింది? 

ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. సమాజంలో అడుగంటిపోతున్న సనాతన ధర్మాన్ని సముద్ధరించటానికి ఓ జీవుడు పడిన ఆవేదనకు అక్షర రూపంగా, ధర్మం పునాదిగా రామకథ రూపుదిద్దుకుంది. ఎవరా జీవుడు? అతడే వాల్మీకి. ఈయన ఎక్కడివాడు? జీవిత చరిత్ర ఏమిటి? పూర్వ జన్మ ఏమిటి? ఇటువంటి విషయాల మీద అనేక చర్చలు సమాజంలో ఉన్నాయి. ఇప్పటికీ ఈ విషయాల గురించి పరిశోధకుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఈ చర్చ వదిలేద్దాం. 

ఎక్కడి వాడైనా, ఏ చరిత్ర కలవాడైనా, యావత్ప్రపంచ చరిత్రలో నూతన శకాన్ని సృష్టించిన ప్రతిభా సంపన్నుడు వాల్మీకి. మూగదైన పక్షి పడిన ఆవేదన తనదిగా భావించాడు. ధర్మమార్గం విడిచిన యావజ్జాతి ఆవేదనగా భావించాడు. అందుకే తిరిగి ధర్మాన్ని ఈ సమాజంలో సముద్ధరించాలని సంకల్పించాడు. 

'విగ్రహవాన్‌ ధర్మ:' అని ప్రశసంలు అందుకున్న 'రామ' పాత్రని సృష్టించాడు. జాగ్రత్స్వప్న సుషుప్తుల్లో కూడా అణుమాత్రమైనా విడిచిపెట్టకుండా ధర్మాన్ని ఆచరించిన వ్యక్తి ఎవరంటే, ప్రపంచమంతా ముక్తకంఠంతో 'రాముడు' అని సమాధానం చెప్పేలా రామ పాత్రని తీర్చిదిద్దాడు. 

రామాయణ ప్రారంభంలోనే తన రాముడు ఎలాంటి వాడో వాల్మీకి చెప్పాడు.

కోన్వస్మిన్‌ సాంప్రతం లోకో గుణవాన్‌ కశ్చ వీర్యవాన్‌
ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యవాక్యో ధృఢవ్రత:
చారిత్రేణ చ కో యుక్త: సర్వభూతేషు కో హిత:
విద్వాన్‌ క:, క: సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన:
ఆత్మవాన్‌ జితక్రోధో ద్యుతిమాన్‌ కోనసూయక:
కస్య బిభ్యతి దేశాశ్చ జాత రోషస్య సంయుగే

గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మవర్తనుడు, కృతజ్ఞత కలిగిన వాడు, సత్యవాక్సంపన్నుడు, నిశ్చల బుద్ధి కలవాడు, సత్ప్రవర్తన కలిగినవాడు, అన్ని ప్రాణుల యందు దయ కలిగినవాడు, విద్వత్తు కలిగినవాడు, సకల కార్య నిర్వహణ సమర్థుడు, చూపులతోనే సంతోషాన్ని కలిగించేవాడు, ఆత్మవంతుడు, క్రోధం లేనివాడు, ప్రకాశవంతమైన వర్చస్సు కలిగినవాడు, అసూయలేనివాడు, దేవతలకు కూడా గౌరవప్రదమైనవాడు, పౌరుష పరాక్రమాలు కలిగినవాడు - ఇన్ని సుగుణాల రాశి కనుకనే రామయ్య లోకారాధ్యుడయ్యాడు. 
తన కథానాయకుడిని మేలిమి గుణాల కలయికగా తీర్చిదిద్దాడు వాల్మీకి. ఇక్కడే వాల్మీకి హృదయ ఔన్నత్యం స్పష్టమవుతుంది. 
'స హితస్య భావం సాహిత్యం' - సమాజానికి మేలు చేకూర్చేదే సాహిత్యం అని ఆర్యోక్తి. ఊహాజగత్తులో విహారం చేయకుండా, సమాజ సముద్ధరణకు ఎలాంటి సాహిత్యం కావాలో, అచ్చంగా అలాంటి సాహిత్యాన్ని, ఉత్తమమైన కథనాయకుడి పాత్ర ద్వారా సృష్టించాడు వాల్మీకి. అందుకే వాల్మీకిది సామాజిక హృదయం.  మాటలతో కాకుండా చేతలతో తన కథానాయకుడిగా ధర్మాచరణ చేయించాడు వాల్మీకి. 

''సర్వే జ్ఞానోప సంపన్నా: సర్వే సముదితా గుణై:
తేషా మపి మహారాజా రామ: సత్యపరాక్రమ:''
''ధనుర్వేదేచ నిరత: పితు: శుశ్రూషణే రత:''


తన కథానాయకుడు సత్య పరాక్రమం కలిగిన వాడు కావాలని వాల్మీకి కోరుకున్నాడు. ప్రపంచంలోని మరే ఇతర కవి ఈ భావాన్ని ప్రకటించలేదు. మనిషికి ఎంతటి పరాక్రమం ఉన్నా, అతడు సత్య, ధర్మాలకు అనుగుణంగానే తన పరాక్రమాన్ని ప్రదర్శించాలి. ఎంతటి యోధుడైనా, తల్లిదండ్రుల సేవ విడిచిపెట్టకూడదు - ఇదీ వాల్మీకి సత్య హృదయం.

జయించటానికి దేవతలకు సైతం వీలుపడని గొప్ప రాజ్యం 'అయోధ్య'కు రాజైనా, సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపం అని తోటివారు, ప్రజలంతా తనను కొలుస్తున్నా, ధర్మసంరక్షణలో కేవలం సాధారణ మానవుడిగా రాముడు ప్రవర్తించాడు. 'ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం' - నేను సామాన్య మానవుడిని. దశరథ మహారాజు కుమారుడిని మాత్రమే అని దేవతలకే రాముడు విస్పష్టంగా చెప్పాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్త్వం వాల్మీకిది. తన రాముడిని అలాగే తీర్చిదిద్దాడాయన. సమాజ సభ్యుడిగా సాటి మానవులతో ఎలా మెలగాలో ఆచరించి చూపించాడు. అందుకే వాల్మీకిది మానవ హృదయం.

ప్రియాతి ప్రియమైన భార్యా వియోగ దు:ఖంలో ఉన్నా శరణు వేడిన సుగ్రీవుడికి అభయం ఇచ్చాడు. యుద్ధ ప్రణాళికా రచనలో తలమునకలై ఉన్నా, ఆశ్రయం కోరి వచ్చిన విభీషణుడికి శరణాగతి ప్రసాదించాడు. వారు, వీరనే భేదం లేదు... 'అభయం సర్వ భూతేభ్యో దదామి, ఏతత్‌ వ్రతం మమ' స్వయంగా రావణుడే వచ్చి శరణు కోరితే, అతడికి సైతం అభయ ప్రదానం చేస్తాను. ఇది నా నియమం అని విస్పష్టంగా ప్రకటిస్తాడు రాముడు. వాల్మీకి హృదయం భూతదయకు నిలయం. లేకపోతే క్రౌంచపక్షుల దు:ఖాన్ని తానెందుకు అనుభవిస్తాడు? ఇదే తీరు రాముని పాత్రలో ప్రతిఫలించింది.

వనవాసానికి బయలుదేరిన కుమారుడికి కౌసల్య చేసిన హితబోధ - 'స వై రాఘవ శార్దూల ధర్మస్త్వామభి రక్షంతు' - రామా! ధర్మాన్ని కాపాడమని చెప్పిందే కానీ అరణ్యంలో తన బిడ్డ ఎన్ని కష్టాలు పడతాడో అని కౌసల్య బాధ పడలేదు. ఎందుకంటే తన బిడ్డని శార్దూల అని సంబోధిస్తూనే అతడి పరాక్రమం ఏమిటో గుర్తుచేసింది. ఎంతటి కష్టమైనా ధర్మమార్గం విడిచిపెట్టకూడదు. 

జనస్థానంలో జరిగిన విధ్వంసానికి రావణుడు అగ్ర¬దగ్రుడై, సీతాపహరణ విషయంలో తనకు తోడు రమ్మని మారీచుడిని అడుగుతాడు. రాముడి శక్తి, సామర్థ్యాలు ఎంతటివో రుచి చూసినవాడు మారీచుడు. అందుకే 'రామో విగ్రహవాన్‌ ధర్మ:, సాధు: సత్య పరాక్రమ:, రాజా సర్వలోకస్య దేవానామివ వాసవ:' - రావణా! రాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. సత్య పరాక్రమం కలిగినవాడని మారీచుడు హితోపదేశం చేస్తాడు. సత్య,ధర్మాలు కలిసిన పరాక్రమానికి శక్తి అపరిమితం. అజేయమనే విషయాన్ని మారీచుడి పాత్ర ద్వారా వాల్మీకి చెప్పించాడు. 

మాయా యుద్ధంతో లక్ష్మణుడిని ఇంద్రజిత్తు ముప్పతిప్పలు పెడుతున్నాడు. చివరగా లక్ష్మణుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. 'ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది, పౌరుషేచాప్రతిద్వంద్వ: శరైరం జహి రావణం' - నా అన్నగారైన శ్రీరామచంద్రమూర్తి సత్య, ధర్మాలకు నిలయమైన వాడైతే, ఈ అస్త్రం ఇంద్రజిత్తును సంహరించుగాక అంటూ బాణ ప్రయోగం చేసాడు. మరుక్షణంలో ఇంద్రజిత్తు నేలకూలాడు. సత్య, ధర్మాలు కలిస్తేనే అస్త్రాలకైనా శక్తి వస్తుందనే విషయం ఈ సందర్భంలో సుస్పష్టంగా ప్రకటితమవుతుంది. 

ఒకటా, రెండా..? మొత్తం రామాయణంలో పదుల సంఖ్యలో వాల్మీకి రాముడి సత్య, ధర్మ పరాక్రమాల గురించి ప్రస్తావిస్తాడు. కారణం - వాల్మీకి హృదయం సత్య, ధర్మాలకు నిలయం. 

రామ రావణ యుద్ధం ముగిసింది. విభీషణుడు లంకాధిపతి అయ్యాడు. తనకు ఇంతటి ఘనత తెచ్చిన రామచంద్రమూర్తికి సాగిలపడి, కొన్నాళ్ళు లంకలో ఉండి, తన ఆతిథ్యం తీసుకొమ్మని ప్రాథేయపడ్డాడు. 

''అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ'' 


ఒళ్ళు పులకరించే మాట చెప్పాడు రామచంద్రమూర్తి. లక్ష్మణా! లంక మొత్తం స్వర్ణమయం కావచ్చు. అనేక సుఖభోగాలు ఇక్కడ దొరకవచ్చు. కానీ, నా మనసు అయోధ్యను చూడాలని ఆరాటపడుతోంది. మాతృమూర్తి, మాతృభూమి స్వర్గం కన్నా ఉన్నతమైనవి కదా - అంటాడు రామయ్య. 

ఎన్నో యుగాల నాడు వాల్మీకి రాసిన మాట ''జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ'' - ఇప్పటికీ మనకు మార్గదర్శనం చేస్తోంది. దేశభక్తి గురించి ఎవరు ఉపన్యాసం చెప్పినా ఈ వాక్యం ఉటంకించాల్సిందే. ఒక తారకమంత్రంగా యావజ్జాతినీ ఈ వాక్యం దేశభక్తి దిశగా ప్రేరేపిస్తోంది. ఒక్క మాటకే ఇంతటి ఘనత తెచ్చాడంటే వాల్మీకి హృదయం దేశభక్తికి నిలయం కాకపోతే సాధ్యమవుతుందా? 

మొత్తంగా వాల్మీకి హృదయం రామాయణంలోని అనేక సందర్భాల్లో, అనేక కోణాల్లో ప్రకటితమవుతుంది. కాగడా పెట్టి వెతికినా మచ్చుకైనా కనిపించకుండా ధర్మం అంతరించిపోతున్న నేటి తరుణంలో, మనం చూడాల్సింది ధర్మ సంస్థాపనకు మార్గమే తప్ప వాల్మీకి కులం కాదు. మా కులం వాడని, మా జాతి వాడని, మా మతం వాడని వాల్మీకిని కులమతాల కుమ్ములాటలోకి దింపటం మన అమానుష ఆలోచనాధోరణికి నిదర్శనం. విశాలమైన భావాలతో, సత్య, ధర్మాలకు ప్రతీకగా రామాయణాన్ని అందించిన మహానుభావుడి పట్ల మనం చేస్తున్న అపచారం ఇది. ఇకనైనా, ఈ ధోరణి విడిచిపెట్టి, వాల్మీకి హృదయాన్ని అర్థం చేసుకుందాం. రామరాజ్యాన్ని స్థాపించుకుందాం. 
=============================

రచన

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ -3, సెల్‌: 90320 44115





3 comments:

Sudhakar V.Rao MD said...

వ్యాసం అద్భుతం!!

డా జె వి చలపతిరావు, ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ said...

ఆ.వె.
రామకృష్ణ రచన రసరమ్యమైయుండు
కప్పగంతువారి కవనదీప్తి
వేదవిద్యలందు విజ్ఞాన మందిన
విబుధ వరుడితండు విజ్ఞులందు

Sudhakar V.Rao MD said...

రామకృష్ణ పలుకు రమ్యమైన పలుకు!!

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the Ind...